1, జనవరి 2020, బుధవారం

అధికారాంతం - భండారు శ్రీనివాసరావు


ప్రతి దానికీ ముగింపు వున్నట్టే అధికారానికి కూడా ఏదో ఒకనాడు తెర పడుతుంది. కానీ అధికారం చలాయించేవారు ఈ చేదు నిజాన్ని నమ్మరు, అది అనుభవంలోకి వచ్చేదాకా.
ఒక డైరెక్టర్ గారి కధ చెప్పుకుందాం. ప్రతి రోజూ వారి ఆఫీసులో ఒక దృశ్యం కనబడేది. దాన్ని ఫ్రీజ్ చేస్తే ఇలా వుంటుంది.
పోర్టికో. బయలు దేరడానికి సిద్ధంగా వున్న కారు. డ్రైవర్ తలుపు తెరిచి  ఒక కాలు లోపలే వుంచి, అధికారి వచ్చి కూర్చుని,  కదలమని ఆర్డర్ వేయగానే బయలుదేరదీయడానికి తయారుగా కారు పక్కనే నిలబడి ఉంటాడు. మరో నాలుగో తరగతి ఉద్యోగి కారు వెనుక తలుపు తెరిచి పట్టుకుని, డైరెక్టర్ రాకకోసం ఎదురు చూస్తుంటాడు. మరో ప్యూను  బ్రీఫ్ కేసు పట్టుకుని వెంట నడవగా ఆ ఆఫీసరు, తన కార్యాలయం నుంచి నాలుగు అడుగులు నడిచి  కారు వద్దకు వస్తాడు. అక్కడ అటూ ఇటూ తిరిగే అక్కడి సిబ్బంది ఆ కారు కదిలేవరకు కాసేపు శిలావిగ్రహాల్లా ఎక్కడి వాళ్ళక్కడ  నిలబడి వుంటారు. ఈ దృశ్యం అలా ప్రతి రోజూ సాయంత్రం ఆ అధికారి పదవీవిరమణ చేసేవరకు కనబడుతూనే వచ్చింది.
ఇంకో అధికారి కధ చెప్పుకుందాం. అంతకు చాలా ఏళ్ళ క్రితం అదే హోదాలో మరో అధికారి అదే ఆఫీసులో  పనిచేశారు. ఆయన ఆఫీసు టైముకల్లా ఇంట్లో బయలుదేరి, ఏదో సిటీ బస్సు పట్టుకుని ఆఫీసుకు వచ్చేవారు. ఆయన వచ్చిందీ, పోయిందీ ఎవరికీ తెలిసేది కాదు.
తమిళనాట ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సంస్థాపకుడు అన్నాదొరై మహాశయులు చాలా నాటకాలు రాశారు. అనేక సినిమాలకు రచనలు చేశారు. ఆయన రాసిన నాటకంలో ఒక అంకం ఇలా మొదలవుతుంది.
హాల్లో ఓ మోతుబరి కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని విలాసంగా కాలక్షేపం చేస్తుంటాడు. దగ్గరలో ఆ ఇంటి నౌకరు ఏదో పనిచేసుకుంటుంటాడు. అలా కూర్చుని కూర్చుని  ఆ మోతుబరి దొరవారికి విసుగనిపిస్తుంది. నౌకరు పిలిచి చెబుతాడు. ‘ఇదిగో ఇలా వచ్చి నా కాలు తీసి కిందపెట్టు.’
ఆకాశవాణి మాజీ సంచాలకులు డాక్టర్ పి.ఎస్. గోపాలకృష్ణ ఈ నాటకం  సంగతి నాకు మాటల మధ్యలో చెబితే నాకు ఆ ఇద్దరు డైరెక్టర్ల ఉదంతం జ్ఞాపకం వచ్చింది.
అన్నట్టు గోపాలకృష్ణ ఇప్పుడు మాజీ డైరెక్టర్ కాదు, అయన చెబితేనే  తెలిసింది. కొన్నేళ్ళ క్రితమే, అంటే రిటైర్ అయిన తర్వాత,  ఆయనకు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా ప్రమోట్ చేస్తూ సర్కారు వారు ఓ కాగితపు ఉత్తర్వు పంపారట. ఆయన ఓ పదం వాడితే అందులో ఏదో అర్ధం వుండితీరాలి. నిజంగా అది కాగితపు ఉత్తర్వే. కానీ  ఉత్తుత్తి ఆర్డరు కాదు. ఇదేమి మతలబు అంటారా. అక్కడే వుంది.  ప్రమోషన్ అయితే  ఇచ్చారు కానీ ఆర్ధికపరమైన ప్రయోజనాలు ఏవీ దానివల్ల ఒనగూరవు. ‘పలానా అధికారి పలానా హోదాలో కాకుండా పలానా పై హోదాలో రిటైర్ అయినారు కావున తెలియ పరచడమైనది’ అంటూ ఇచ్చిన ఆర్డరు. అలా అందరికీ చెప్పుకున్నా, ఎక్కడైనా  రాసుకున్నా  ఏలినవారికి ఏమీ అభ్యంతరం వుండదు.
“ఈ మాత్రం దానికి డీడీజీ అనే ఎందుకు? ఏకంగా  డీజీ అనే ప్రమోషన్ ఇవ్వొచ్చు కదా!” అనేది  నా ముక్తాయింపు. ఎప్పటిమాదిరిగానే ఓ చిరునవ్వే ఆయన సమాధానం.
ఆయన ఇంకో సంగతి కూడా చెప్పారు. ఎప్పుడో నూట యాభయ్ ఏళ్ళ క్రితం సీపీ బ్రౌన్ అనే ఇంగ్లీష్ దొరవారు ఒక మాట అన్నారట.
“ప్రభుత్వ ఉద్యోగం చేసేటప్పుడు పై అధికారి అనేవాడు, జీఓడీ-  ‘GOD’. రిటైర్ అయిన తర్వాత డీఓజీ - ‘DOG’.”          

1 కామెంట్‌:

సూర్య చెప్పారు...

Basically both are humans!