ఈరోజు జూన్ రెండో తేదీ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో ప్రచురితం.
(నాలుగేళ్ల పరిపాలనకు మాత్రమే ఈ వ్యాసం
పరిధి పరిమితం, రాజకీయ అంశాలను, అందుకు సంబంధించి చంద్రబాబు సాఫల్య, వైఫల్యాలను
ఇందులో చేర్చడం లేదు, దానికి ఈ సందర్భం
తగినది కాదని రచయిత అభిప్రాయం)
ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్ళ
పైచిలుకు చంద్రబాబు సాగించిన పరిపాలనతో సరిపోల్చకుండా ప్రస్తుత నాలుగేళ్ల బాబు
పాలన గురించి చేసే ఏ సమీక్ష అయినా అది అసమగ్రమే అవుతుంది.
ఇది జరిగి పదిహేడు సంవత్సరాలు.
అప్పట్లో స్టేట్ బ్యాంక్ చెన్నై చీఫ్
జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న మా అన్నగారు రామచంద్రరావు ఓ రోజు ఉదయం బెంగుళూరు
నుంచి విమానంలో చెన్నై
వస్తున్నారు. డెక్కన్ హెరాల్డ్ ఆంగ్ల
దినపత్రికలో మొదటి పేజీలో పతాక శీర్షికలో ప్రచురించిన ఒక వార్త ఆయన దృష్టిని
ఆకర్షించింది.
“నేను చంద్రబాబును మాట్లాడుతున్నాను,
మీ నాన్నగారిని ఫోను దగ్గరికి పిలుస్తావా!”
ఆ వార్తాకధనం ఇలా సాగుతుంది.
“విపరీతంగా కురిసిన భారీ వర్షాల
కారణంగా కర్నూలు జిల్లాలో ఒక చెరువుకు గండి పడింది. మరునాడు ఉదయం అయిదు గంటలకు
సంబంధిత ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ ఇంట్లో ఫోను మోగింది. ఆ సమయంలో ఆ అధికారి గాఢ నిద్రలోవున్నారు. పరీక్షలకు సిద్ధం
అవుతున్న ఆయన కుమారుడు ఫోను తీసాడు. ఆ అధికారిని నిద్రలేపి ‘వెంటనే సిబ్బందిని
తీసుకుని ఆ గ్రామానికి వెళ్లి గండి పూడ్చే చర్యలు తీసుకోవాల్సింద’ని ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ వార్తలో ప్రధాన విషయం ఏమిటంటే చెరువుకు గండి పడిన విషయం హైదరాబాదునుంచి ముఖ్యమంత్రి ఫోను చేసి
చెప్పేదాకా జిల్లాలో వున్నఆ అధికారికే తెలవదు.
అదే విమానంలో మా అన్నయ్యతో కలిసి
ప్రయాణిస్తున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన ప్రయాణీకుడు కూడా అప్పటికే ఆ వార్తను చదివాడు.
ఆయనిలా అన్నారుట. ‘ఈసారి చంద్రబాబు నాయుడు మా రాష్ట్రం నుంచి పోటీ చేస్తే బాగుండు’
అని.
ఆ రోజుల్లో చంద్రబాబు ప్రభ అలా
వెలుగుతుండేది, రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాలలో, ఆఖరికి విదేశాల్లో కూడా.
ఈ నేపధ్యంలో గత నాలుగేళ్ళుగా చంద్రబాబు
సాగిస్తున్న పరిపాలనను ఓసారి సింహావలోకనం చేసుకుందాం.
రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖ
నగరాన్ని అతలాకుతలం చేసిన హుద్ హుద్
తుపాను తదనంతర పరిణామాలు, అత్యంత వేగంగా సహాయక చర్యలను పూర్తిచేసి బీభత్సంగా దెబ్బతిన్న నగరాన్ని
పునర్నిర్మించడలో చంద్రబాబు ప్రదర్శించిన పాలనా సామర్ధ్యం ఈ నాలుగేళ్లలో ఆయన
సాధించిన విజయాల్లో ప్రధానమైనది. తుపాను
తాకిడికి చిగురుటాకులా దెబ్బతిన్న వైజాగు నగరంలో నాలుగైదు రోజులపాటు బస్సులోనే
మకాం వేసి, సహాయ కార్యక్రమాలను స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అతితక్కువ
వ్యవధిలో నగరాన్ని, పౌరజీవనాన్ని ఒక గాడిన పెట్టడానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయం.
నాటి పరిస్తితిని నేటితో పోల్చుకుని వైజాగ్ నగర పౌరులు ఇప్పటికీ ఘనంగా చెప్పుకుంటూ
వుండడం ఇందుకు ఉదాహరణ.
అనేక వివాదాలు ఉన్న మాట నిజమే అయినా,
నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం సుమారు ముప్పయి మూడువేల ఎకరాల భూమిని రైతుల
నుంచి సేకరించగలగడం చంద్రబాబు ఈ నాలుగేళ్లలో సాధించిన మరో ఘనత. భూములు తీసుకుని
నాలుగేళ్ల కాలం గడుస్తున్నా వాటిని స్వచ్చందంగా ఇచ్చిన రైతుల నుంచి చెప్పుకోదగిన
స్థాయిలో ప్రతిఘటన కానీ నిరసనలు కానీ వ్యక్తం కాకపోవడం గమనిస్తే ఆయన దక్షత పట్ల
రైతులు పెట్టుకున్న నమ్మకం ఎలాటిదో అర్ధం అవుతుంది.
గత నాలుగేళ్ల కాలంలో విభజిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించారు. వీధి దీపాలకు ఎల్.ఈ.డీ. విద్యుత్ బల్బులు, వృద్ధాప్యపు
పించన్లు నెలనెలా ఠ౦చనుగా అందేలా తీసుకున్న చర్యలు ఈ జాబితాలో వున్నాయి. చాలా ఏళ్ళ నుంచి కాంగ్రెస్ గ్రామంగా, ప్రస్తుతం ప్రతిపక్ష
వైసీపీ గ్రామంగా ఉంటూ వస్తున్న మా స్వగ్రామం కంభంపాడులో కూడా ఎలక్ట్రిక్
క్రిమటోరియం నిర్మాణానికి నిధులు, అనుమతులు మంజూరు కావడం ఒక విశేషం.
కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేకం కొత్త
రాష్ట్రంలో ఊపిరి పోసుకున్నాయి. మూడు విమానాశ్రయాలను ఆధునికంగా తీర్చిదిద్దారు.
ఇందుకు అవసరం అయ్యే భూములను సేకరించి పెట్టడంలో,
కేంద్రంనుంచి రావాల్సిన అనుమతులు
సాధించడంలో ముఖ్యమంత్రి చూపిన వ్యక్తిగత చొరవ ఉపయోగపడిందని చాలామందికి తెలియక
పోవచ్చు.
అమరావతి నిర్మాణం విషయంలో
చంద్రబాబు దూరదృష్టిని శంకించాల్సిన
అవసరంలేదు. 2022 లో, 2029లో ఆఖరికి 2050లో ఆంధ్రప్రదేశ్ స్వరూపం ఎలా ఉండాలో అన్నదానిపై ఆయన కంటున్న కలలను కూడా
ఆక్షేపించాల్సిన పని లేదు. ‘పెద్ద కలలను కనండి, వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం
చేయండి’ అనే కలాం సూక్తిని ఇక్కడ గుర్తు
చేసుకోవాలి.
హైదరాబాదు నుంచి పరిపాలనా కేంద్రాన్ని
అమరావతికి తరలించిన సందర్భంలో ప్రతిపక్షాల నుంచి ఎదురయిన విమర్శలు, ఆరోపణలు ఎలా
ఉన్నప్పటికీ, అతి తక్కువ వ్యవధిలో సిబ్బందిని మార్చడంలో చంద్రబాబు చేసిన కృషి మెచ్చదగింది.
ఇలాగే మరెన్నో. రియల్ టైం గవర్నెన్స్, సీఎం డాష్
బోర్డు, చౌక ధరలకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ మొదలయినవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఒక
అంతర్జాతీయ సదస్సుకు హాజరయిన బిల్ గేట్స్, చంద్రబాబునాయుడు ఇచ్చిన పవర్ పాయింట్
ప్రెజెంటేషన్ కు ముగ్ధుడై లేచి నిలబడి కరతాళధ్వనులతో తన హర్షాన్ని తెలపడం బాబుకు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపుకు ఒక మచ్చుతునక.
కాకపొతే, చంద్రుడిలో వెలుగు నీడలు ఉన్నట్టే చంద్రబాబు పరిపాలనలో కూడా ఆ ఛాయలు వున్నాయి.
పాత దేవదాసు సినిమాలో జమీందారు పాత్ర
వేసిన సీఎస్ఆర్, తనకు రెండో భార్యగా కాపురానికి వచ్చిన పార్వతి పాత్ర ధరించిన
సావిత్రితో ఇలా అంటాడు. “ ఒక్కోసారి దేవుడు కూడా పొరబాట్లు చేస్తుంటాడు, లేకపోతే,
చంద్రబింబం లాంటి నీ మొహంపై ఈ మచ్చ ఏమిటి చెప్పు?”
సమర్ధుడు, పరిపాలనాదక్షుడు అని
సర్వత్రా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు కొన్ని లోపాలకు అతీతుడేమీ కాదు. ఆయన ప్రస్తుత
వ్యవహారశైలి కూడా దీనికి అద్దం పడుతోంది.
కొద్ది రోజుల క్రితం ఫేస్ బుక్ లో ఒక పోస్టు చదివాను.
‘నేను చంద్రబాబు నాయుడిని నరనరాన ద్వేషిస్తాను. అమరావతి
రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలో నిర్మించదలపెట్టిన నిర్మాణాలు, అసెంబ్లీ, హై
కోర్టు, సచివాలయం, ఈ మూడింటిలో ఏ ఒక్కదాన్ని పూర్తిచేసినా సరే, 2019లో నా ఓటు మాత్రం చంద్రబాబుకే’
సాంఘిక మాధ్యమాల్లో కానవచ్చే శ్లేషతో
కూడిన ఇటువంటి వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టిపారేయడానికి వీలులేదు. భవనాల డిజైన్లు
ఖరారు చేయడంలో, నిర్మాణాల పని మొదలు పెట్టడంలో
జరుగుతున్న విపరీతమైన జాప్యాన్ని చూస్తూ చంద్రబాబు అభిమానుల్లో అనేకమంది అసంతృప్తితో వున్నారనేది కూడా వాస్తవం.
అభిమానులే కాదు, ఏ పార్టీకి చెందని తటస్తులది కూడా ఇదే అభిప్రాయం. ఈ పనికి
నాలుగేళ్ళు తీసుకోవడం అవసరమా అనేది వారి మనసులోని మాట.
చంద్రబాబునాయుడు వద్దా, రాజశేఖర రెడ్డి దగ్గరా వారు ముఖ్యమంత్రులుగా
వున్నప్పుడు వారితో కలిసి పనిచేసిన ఒక రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి ఇలా చెప్పారు.
‘చంద్రబాబు చాలా కష్టపడి పనిచేస్తారు,
సందేహం లేదు. విషయాల పట్ల ఆయనకు
పూర్తి అవగాహన వుంటుంది. సమీక్షా సమావేశాల్లో చంద్రబాబు చాలా లోతుకు వెళ్లి
చర్చిస్తారు. ఎంత సీనియర్ అధికారి కూడా చంద్రబాబును తేలిగ్గా తీసుకుని వ్యవహరించే
అవకాశం వుండదు. అయితే ఆయనకున్న బలహీనత ఒక్కటే. అన్నీ తానై స్వయంగా పర్యవేక్షించాలని
అనుకుంటారు. తాను తీసుకున్న నిర్ణయాల
అమలును అధికారులకి బదలాయించి పై నుంచి పర్యవేక్షిస్తే సరిపోతుంది. కానీ ఆయన అలా చేయరు. ప్రతిదీ తన కనుసన్నల్లో జరగాలని
కోరుకుంటారు. ఈ బలహీనతని ఆయన అధిగమించగలిగితే
మరింత సమర్దుడయిన పాలకుడు కాగలుగుతాడు.’
ఈ అధికారి చెప్పిన మాటల్లో నిజం లేకపోలేదు.
చంద్రబాబు అభిమానులకి కూడా రుచించని విషయం మరోటుంది.
అది స్వోత్కర్ష. అది బహిరంగ సభ కావచ్చు, సమీక్షా సమావేశం కావచ్చు ఏదైనా సరే ఆయన
ప్రసంగంలో ఈ స్వోత్కర్ష మితిమించి వ్యక్తం అవుతుంటుంది.
నిజమే, దేశం మొత్తంలో ఆయన ఒక సీనియర్ నాయకుడు కావచ్చు,
ముఖ్యమంత్రిగా అనేక ఘన కార్యాలు చేసి ఉండొచ్చు. కానీ అదేపనిగా వాటిని చంద్రబాబే
స్వయంగా వల్లెవేస్తూ పోతుంటే వినేవారికి ఒకసారి కాకపోయినా మరోసారి అయినా కంపరం
కలుగుతుంది. ‘నేనే చేసాను’ అనడానికి‘, మా ప్రభుత్వం చేసింది’ అని చెప్పుకోవడానికి
నడుమ చాలా తేడా వుంటుంది. ఈ విషయంలో సోషల్
మీడియాలో అనేక వ్యంగ్య వ్యాఖ్యానాలు అనునిత్యం వెలువడుతున్నాయి. ఎక్కడ చీమ
చిటుక్కుమన్నా డాష్ బోర్డు ద్వారా తనకు ఇట్టే తెలిసిపోతుందని చెప్పుకునే చంద్రబాబు దృష్టికి
ఇవి రాకపోవడం వింత విషయమే. ఈ సంగతిని ఎంత
త్వరగా గమనంలోకి తీసుకుంటే అంత మంచిది.
గతంలో రాష్ట్రం మొత్తంలో ఎక్కడినుంచి ఏ విమర్శ
వెలువడినా ఆ విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వచ్చేది. వెనువెంటనే చక్కదిద్దడానికి చర్యలు మొదలయ్యేవి.
ఇప్పుడా పరిస్తితి లేకపోగా విమర్శలను అరాయించుకోగల సంయమనం ప్రభుత్వంలో
లోపించింది. వీటి వెనుక ప్రతిపక్షం హస్తం
ఉందని మంత్రులు, ముఖ్యమంత్రి కూడా
సందేహించడం వల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా ప్రభుత్వానికి అప్రతిష్ట కలిగించే
అంశంగా మారుతోంది. చంద్రబాబు మునుపటి
మాదిరిగా సమర్ధంగా వ్యవహరించడం లేదేమో అనే అనుమానం ప్రజల్లో ప్రబలుతోంది.
వెనుకటి మాదిరిగా చంద్రబాబు దృఢంగా వ్యవహరించడం లేదనేది
కూడా వాస్తవం. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇందుకు ఉదాహరణ.
చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా
వున్నప్పుడు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లోని పాలక, ప్రతిపక్ష సభ్యులందరూ
కలిసి, మునిసిపల్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్
ని తక్షణం బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. కానీ, చంద్రబాబు దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు.
సొంత పార్టీ మనుషుల పిర్యాదులను కూడా పెడచెవిన పెట్టి ఆ ఐఏఎస్ అధికారి
పట్లనే మొగ్గు చూపారు.
ఇటువంటిదే మరో దృష్టాంతం.
సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న మరో ఐ.ఎ.ఎస్.
అధికారి శ్రీమతి లక్ష్మీ పార్వతిని హెచ్.ఎం.డీ.ఏ. మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి తప్పించాలని స్థానిక
టీడీపీ అగ్ర నాయకులే కాకుండా కొందరు
మంత్రులు సయితం ఎంత ఒత్తిడి తెచ్చినా చంద్రబాబు ఏమాత్రం లక్ష్య పెట్టలేదు.
మరిప్పుడో! అలాంటి సందర్భం ఒక్కటి ప్రస్తావించుకోగలమా!
ఇప్పటి పాలక పక్షం ఎమ్మెల్యేలు తమ ఇష్టారాజ్యంగా ఎలా వ్యవహరిస్తున్నారన్నది అందరికీ
తెలిసిందే.
చంద్రబాబును గురించి వారి పార్టీలోని వారే చెప్పుకునే
విషయం ఒకటుంది. అధికారులకి ఆయన దర్శనం లభించినంత సులువుగా పార్టీ నాయకులకు
దొరకదని. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నకాలంలో కార్యకర్తలతో
ఆయన పెంచుకున్న సాన్నిహిత్యమే పార్టీలో ఆయన స్థానం సుస్థిర పడడానికి దోహదం
చేసింది. అలాటి లక్షణం ఇప్పుడు కానరావడం లేదని ద్వితీయ శ్రేణి నాయకులు
మధనపడుతున్నారు.
తన పరిపాలన గురించి ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి
బేరీజు వేసుకోవడం చంద్రబాబుకు అలవాటు. ముఖ్యమంత్రిగా తన పరిపాలన పట్ల ప్రజలు
సంతృప్తిగా వున్నారని ఆయన పదేపదే చెప్పుకుంటూ వుంటారు. ఇది నిజమే కావచ్చు. కొందరు
ఎమ్మెల్యేల తీరును ప్రజలు ఇష్టపడడం లేదన్నసంగతి ఆయనకు తెలియకుండా వుండే అవకాశం లేదు. అయితే మరోసారి
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం కూడా అవసరం.
చంద్రబాబు పట్ల వున్న అభిమానం ఒక్కటే ఆ పార్టీని ఒడ్డున పడేయలేదు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సులభసాధ్యం అనుకున్న ఆయన
అభిమానులు కూడా ఇప్పుడు డోలాయమానంలో వున్నారు. రుచించని సంగతే అయినా ఇది నిజం.
రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఈ నాలుగేళ్ళుగా చంద్రబాబును
రాజకీయంగా వ్యతిరేకిస్తూ ఒక్క స్వరం
మాత్రమే వినిపించేది. ఇప్పుడో. ఆయన ఒక్కడూ ఒకవైపు, ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు
అందరూ ఒక్కటి కాకపోయినా మరోవైపున ఒకే మాదిరి విమర్శనాస్త్రాలు ఆయనపై ఎక్కుబెడుతున్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్తితిని గురించి ఒక్క
మాటలో చెప్పాలంటే – “చంద్రబాబు వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్”.
చంద్రబాబు తన గురించి తాను ఎప్పుడూ ఒక
మాట చెప్పుకుంటూ వుంటారు, ‘సమస్యలు ఎదురయినా వాటిని అవకాశాలుగా మార్చుకుంటాన’ని.
అయితే ఆయనకు ఎదురయిన ప్రతి ఇబ్బందీ ఒక అవకాశంగా మారుతోందని అనేవాళ్ళు కూడా
లేకపోలేదు. తాజాగా కర్నాటక పరిణామాల
అనంతరం చూస్తే, ఆ కోణంలో చంద్రబాబునాయుడు అదృష్టవంతుడయిన రాజకీయ నాయకుల కోవలోని
వాడే అని చెప్పాలి.
కొత్తతరం తీరాలు దాటుకుని రంగప్రవేశం చేస్తోంది. రాజకీయాల్లో
సుదీర్ఘకాలం మనగలగడం అతి కష్టం. అలాంటిది నలభయ్ ఏళ్ళకు పైగా రాజకీయాల్లో
రాణించడం అనేది బహు కష్టం. దాన్ని సాధ్యం చేసి చూపించిన రాజకీయ నాయకుడు
చంద్రబాబునాయుడు. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన నడిచివచ్చిన దారిలో ఎత్తులు
ఎక్కువ, పల్లాలు తక్కువ కావడం ఆయన అదృష్టం. అలా అని ఈ ప్రస్తానం అంతా పూలు పరిచిన
రహదారి కూడా కాదు.
చంద్రబాబు మరో అదృష్టం ఏమిటంటే ఆయన
ఏమిచేసినా పెద్దమనసుతో స్వీకరించి అభిమానించే వాళ్ళు కోకొల్లలుగా వున్నారు. అదే
సమయంలో చంద్రబాబును, ఆయన రాజకీయాలను వ్యతిరేకించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు.
2014 ఎన్నికల సమయంలో ఆయన విజయానికి తోడ్పడిన
అనేక సానుకూల అంశాలు ఈసారి కరువైన నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో మరోసారి ప్రజాతీర్పును కోరబోతున్నారు. అయినా ఆయనకు కలిసి వచ్చే అంశాలు
రెండున్నాయి.
ఒకటి కష్టపడే తత్వం. ఆయన చేతుల్లోనే
వుంది.
రెండోది అదృష్టం. అది దైవాధీనం. ఆయన
చేతుల్లో లేదు.
రచయిత ఈ మెయిల్:bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595
LINK:
http://www.andhrajyothy.com/artical?SID=586936