బెన్ హర్ మహేష్ ఎక్కా. ఐ.ఏ.ఎస్.
ఆయన్ని చూసి కాస్త అటూ ఇటూగా పాతికేళ్ళు. నేను గుర్తు పట్టనే లేదు. రాత్రి అన్నంలో వేసుకుంది ఏ కూర అంటే చప్పున చెప్పలేని గొప్ప జ్ఞాపక శక్తి నాది.
ఆ విషయంలో జ్వాలాని మెచ్చుకుని తీరాలి. స్నేహితులు, సన్నిహితులవే కాక అప్పుడప్పుడు పరిచయం అయిన వ్యక్తుల పేర్లు, ఫోను నెంబర్లు అన్నీ ఆయనకి కరతలామలకం. నిజానికి ఆయన ఫోను చేసి చెప్పబట్టే బెన్ హర్ ఎక్కాని కలవడం జరిగింది. ‘నీకు ఆయన తెలుసు, ఐఏఎస్ ప్రోబెషనర్లగా వున్నప్పుడు ఆయన బ్యాచ్ కి నువ్వే తెలుగు పాఠాలు చెప్పావు, మరచిపోయావా’ అని కూడా అన్నాడు. నాకయితే ఈ బెన్హర్ మహాశయుల రూపం కూడా గుర్తుకు రాలేదు.
గిరిజనుల ఆరోగ్యాలకు సంబంధించిన అంశంపై క్రియ సీయీఓ డాక్టర్ బాలాజీ ఆయనకి వివరిస్తున్నారు. మధ్య మధ్యలో బెన్ హర్ ఎక్కా నా వైపు చూస్తున్నారు. నేను కూడా తేరిపార చూసాను కానీ నా దగ్గర తెలుగు నేర్చుకున్న అధికారులు ఎవ్వరూ స్పురణకు రాలేదు. లేచి వస్తున్నప్పుడు బెన్ హర్ నాతో అన్నారు.
‘నేను, సంజయ్, వెంకటేశం ఇంకా కొంతమందిమి మీ ఇంటికి వచ్చే వాళ్ళం. ఆ రోజుల్లో మీకు కాలు ఫ్రాక్చర్ అయి ఇంట్లో వున్నారు’
నాకు లైట్ వెలిగింది.
మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థకు శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్ డైరెక్టర్ జనరల్. జ్వాలా అక్కడ చేసిన ఉద్యోగం ఏమిటో చెప్పలేను కానీ ఆ సంష్తలో అన్నీ ఆయనే అని చెప్పగలను. ఆ రోజుల్లో నాకు కాలు ఫ్రాక్చర్ అయింది. ఆఫీసుకు పోకుండా, తీరిక సమయాల్లో ఇంటి నుంచే రేడియో రిపోర్టింగ్ పని చూస్తూ, నా విరిగిన కాలుతో ‘కాలుక్షేపం’ చేస్తుండేవాడిని. మరికొంత కాలక్షేపంగా ఉంటుందని జ్వాలా పూనికపై, ప్రసాద్ గారు తెలుగు మాతృభాష కాని ప్రొబేషనరీ ఐ.ఏ.ఎస్. అధికారులకు తెలుగు నేర్పే పని ఒప్పచెప్పారు. వాళ్ళు అప్పుడు గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ లో వుంటుండేవాళ్ళు. మేము వుండే దుర్గానగర్ కు దగ్గర. అంచేత ఉదయమో, సాయంత్రమో వీలు చేసుకుని ఆ యువ అధికారులు అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. చాలా కలివిడిగా వుండేవాళ్ళు. నా దగ్గర నేర్చుకున్న తెలుగు వారికి యెంత ఉపయోగపడిందో తెలియదు కాని పోటీ పరీక్షలు రాసి జీవితంలో అనుకున్నది సాధించిన కొందరు యువకులతో సన్నిహితంగా వుండే అవకాశం మాత్రం నాకు కలిగింది.
తెలుగు సంగతి అలా పెడితే, మా ఆవిడ మాత్రం వారికి అచ్చ తెలుగు వంటకాలను బాగానే పరిచయం చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి