18, జనవరి 2018, గురువారం

రాజకీయాల రంగూ రుచీ మార్చిన యన్టీయార్ - భండారు శ్రీనివాసరావు



(జనవరి 18  యన్టీయార్ వర్ధంతి)

యన్టీయార్ అని అభిమానులు ముచ్చటగా పిలుచుకునే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో కొందరు తెలుగు దేశం నాయకులు ఆయన్ని కలిసి, 'పలానా జిల్లా ఎస్పీ ని బదిలీ చేయాల'ని  కోరారు. వారిని యన్టీయార్ రెండే రెండు ప్రశ్నలు అడిగారు.
"ఆ పోలీసు అధికారి అవినీతి పరుడా? చేతకానివాడా?"
కాదన్నారు వాళ్లు.
"మరేమిటి?" సీ.ఎం. ఆరా.
"మన పార్టీకి పనికి రాడు" పార్టీ నేతల జవాబు.
"పార్టీకి పనికి రాకపోతే మీకేమిటి నష్టం? పార్టీ పని మీరు చేయండి. ప్రభుత్వం చేయాల్సింది అధికారులు చేస్తారు" సంభాషణ ముగించారు యన్టీయార్.
ఆ ఎస్.పీ. ఎవరో కాదు ఉద్యోగపర్వంలో అత్యంత సమర్ధుడనీ, నిజాయితీపరుడనీ పేరు తెచ్చుకుని తదనంతర కాలంలో పోలీసు డైరెక్టర్ జనరల్ గా పదవీ విరమణ చేసిన ఐ.పీ.ఎస్. అధికారి శ్రీ  ఏ.కే. మహంతి. ఒక టీవీ ఛానల్ చర్చలో ఆయనే స్వయంగా ఈ ఉదంతం వెల్లడించారు.
రాష్ట్ర రాజకీయ చరిత్రలో యన్టీయార్ ది ఒక ఉత్కృష్ట అధ్యాయం. రాజకీయాల దశను దిశను ఆయన ఒక మలుపు తిప్పారు. నిజం చెప్పాలంటే రాజకీయాల రంగూ, రుచీ మార్చారు. సమాజంలో కొన్నివర్గాలకే పరిమితమైవున్న రాజకీయ అవకాశాలను  బడుగు బలహీన వర్గాలకు సైతం అందుబాటులోకి తెచ్చారు. ఒక ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు, ఒక సామాన్య గృహిణి, ఒక లాయరు, ఒక చిన్న వ్యాపారి ఇలా అనేకమంది ఆయన హయాములో  ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు కాగలిగారు. (ఉమ్మడి) రాష్ట్రం మొత్తం రాజకీయ రంగం రూపురేఖలు మారిపోయింది కూడా యన్టీయార్ తెలుగుదేశం పేరుతొ ఒక ప్రాంతీయ పార్టీని పెట్టిన తరువాతనే.    
 తెలుగుదేశం పార్టీ తొలిసారి ఎన్నికల కురుక్షేత్రంలో అడుగుపెట్టి, తొలి అడుగులోనే విజయభేరి మోగించి 1983 లో అధికారంలోకి వచ్చింది. ఈ అపూర్వ విజయానికి ఎన్టీ రామారావు వ్యక్తిగత ఆకర్షణ, గత కాంగ్రెస్ పాలనపై ప్రజలకు కలిగిన ఏష్టత ప్రధానంగా దోహదం చేసాయి. రాష్ట్రావతరణం నుంచి ఏకఛత్రాధిపత్యంగా సాగుతూ వచ్చిన కాంగ్రెస్ పాలనకు గండి పడింది. అంతవరకూ ప్రాంతీయ పార్టీల పొడ ఎరుగని తెలుగు ఓటర్లు, 'తెలుగుజాతి ఆత్మ గౌరవం' నినాదంతో ముందుకు వచ్చిన  తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం కట్టబెట్టారు. రాజకీయాల్లో తొమ్మిది మాసాల పసికూన అయిన తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో 203  స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. పాలకపక్షం అయిన కాంగ్రెస్ 60  సీట్లకే పరిమితమయింది. ఈ అసాధారణ విజయంతో ఎన్టీయార్ ప్రతిభ దేశం నలుమూలకు పాకింది.
అంతవరకూ తెలుగు సినీ పరిశ్రమను ఏలిన శ్రీ రామారావుకు, రాజకీయరంగంలో సయితం లభించిన ఈ అపూర్వ విజయం ఆత్మ స్తైర్యాన్ని మరింత పెంచింది.  ఈ ఆత్మవిశ్వాసంతో ఆయన మరింత దూకుడు ప్రదర్శించి జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ వ్యతిరేకులను కూడగట్టి ఆ పార్టీకి రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుచేయాలనే ఉద్దేశ్యంతో పావులు కదిపారు. సహజంగానే ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బతీసింది. 'కేంద్రం ఒక మిధ్య' అని అభివర్ణిస్తూ, 'కేంద్ర పెత్తనాన్ని ఇక సహించేది లేదు' అనే రీతిలో తెలుగుదేశం అధినేత  ప్రదర్శించిన ధిక్కార ధోరణి యన్టీయార్ కు జనబాహుళ్యంలో మరింత ఆదరణను, రాజకీయాల్లో మరిన్ని నిరసనలను సంపాదించి పెట్టింది. పైకి అహంభావంగా కానవచ్చే ఎన్టీయార్ మనస్తత్వం, స్వపక్షంలోనే విపక్షం పురుడుపోసుకోవడానికి ఉపకరించింది. ఏడాది తిరక్కుండానే ఆయన మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి శ్రీ నాదెండ్ల  భాస్కరరావు నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు ఆగస్టు సంక్షోభం రూపంలో శ్రీ రామారావు పదవికే ముప్పుతెచ్చింది. దరిమిలా జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నిద్రాణంగా వున్న తెలుగుప్రజల రాజకీయ చైతన్యాన్ని మళ్ళీ కొత్త చిగుళ్ళు తొడిగించింది. రాష్ట్ర రాజకీయాన్ని ఓ మలుపు తిప్పి సరికొత్త రాజకీయాలకు తెర తీసింది. ఎన్నికలలో ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న శాసన  సభ్యులకు ఎరవేసి  తమ వైపు తిప్పుకుని, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలను అడ్డదోవలో కూలదోసే దుష్ట సంస్కృతి అప్పటినుంచే తెలుగు రాజకీయాల్లో వేళ్ళూనుకుంది. ఈనాడు యధేచ్చగా సాగిపోతున్న పార్టీ మార్పిళ్ళ రాజకీయాలకు ఆనాడే బీజం పడింది. తెలుగుదేశం పార్టీ అవిర్భావంవల్ల రాజకీయాలు ఎంతగా చైతన్యవంతం అయ్యాయో, ఎంతగా బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం పెరిగిపోయిందో, అంతే స్థాయిలో రాజకీయాలు కాలుష్య కాసారాలు  కావడం, నైతిక విలువలు దారుణంగా  క్షీణించడం ఇటువంటి అవలక్షణాలు అన్నీ అలాగే పెరిగిపోయాయి అనడం  సత్యదూరం కానేరదు. ఈ మంచి చెడులకు  రామారావు గారిని బాధ్యుడిని చేయడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే అయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల పట్ల ఆయనకు ఒక నిర్దుష్టమైన అవగాహన వుండేది. ఆయన్ని బాగా ఎరిగినవారికీ, సన్నిహితంగా మెలిగిన  అధికారులకు, కొందరు విలేకరులకు  ఈ విషయం ఎరుకే. దానికి మహంతి వంటి సీనియర్ పోలీసు అధికారులే ప్రత్యక్ష సాక్షులు.  ఆ  ఉదంతంతో ఈ వ్యాసాన్ని మొదలు పెట్టిన కారణం కూడా అదే.
ఏ కాంగ్రెస్ పార్టీని యన్టీయార్ సకల పాపాలకు కూపంగా అభివర్ణిస్తూ వచ్చారో, చివరికి ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీలో  సయితం అవే అవలక్షణాలు చోటు చేసుకోవడాన్ని ఆయన కళ్ళారా గమనించారు. కానీ, ప్రస్తుత రాజకీయాల్లో చేయగలిగింది ఏమీ లేదని అందరూ నాయకుల్లాగానే అయన కూడా సమాధానపడ్డారేమో తెలియదు. కానీ తను నమ్మిన విషయాల్లో యన్టీయార్ కు వున్న చిత్తశుద్ధిని ఆయన వ్యతిరేకులు కూడా సందేహించలేరనేది మాత్రం వాస్తవం.
గతం తవ్వడం వల్ల ప్రయోజనం వుండదు. అయితే సినిమాల్లో, రాజకీయాల్లో తనదయిన శైలితో ప్రకాశించిన శ్రీ రామారావు గారి జీవితం 'ముగింపు' మాత్రం చాలా బాధాకరం. ఆయన అభిమానులు, వ్యతిరేకులు సైతం ఖేధపడే రీతిలో ఆయన మరణించడం  విధి వైపరీత్యం. చనిపోయిన తరువాత నేల ఈనినట్టు రాష్ట్రం నలుమూలలనుంచి తరలివచ్చిన అశేష జనవాహినిని చూసిన ప్రతి ఒక్కరూ,   జనం గుండెల్లో ఆయన ఎంతగా గూడుకట్టుకుని వున్నారో అర్ధం చేసుకుని వుంటారు.
బతికివున్నప్పుడు కూడా అదేవిధమైన గౌరవ,ప్రతిపత్తులు, మర్యాద మన్ననలు సంపాదించుకున్నవాళ్ళు మరింత అదృష్టవంతులు. ఆ కోవకు చెందిన వ్యక్తుల్లో మొట్టమొదట స్మరించుకోదగినవారు యన్.టీ. రామారావు గారు.

ఆయన చనిపోయి ఈనాటికి (జనవరి, 18) ఇరవై రెండేళ్ళు గడిచిపోయాయి.  ఒకరకంగా అప్పటికీ ఇప్పటికి  ఒక తరం మారిపోయింది. అయినా తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్మృతి పదిలంగానే వుంది. (18-01-2018)

16, జనవరి 2018, మంగళవారం

ఎనర్జీ టూర్

వూరు మారిపోయింది – భండారు శ్రీనివాసరావు
తెలతెలవారవస్తోంది. పక్కన శివాలయం మైకులోంచి బాలసుబ్రమణ్యం శివస్తుతి బిగ్గరగా వినవస్తోంది. ఇల్లు   ఇల్లంతా నిద్ర పోతున్నవారితో నిండిపోయివుంది. ఊరేలా మారిందో కళ్ళారా చూడాలనే కోరిక చలిని జయించింది. నిద్ర మంచం మీద నుంచి లేచి వీధిలో కాలుపెట్టాను. వూళ్ళో వున్నవే మూడు వీధులు. అవన్నీ ముగ్గుల దుప్పట్లు కప్పుకుని కానవచ్చాయి.
సంక్రాంతికి సొంతూరుకు వెళ్ళాలనే అభిలాషతో హైదరాబాదు నుండి నాలుగు కార్లలో ఆదివారం ఉదయమే బయలుదేరి మా వూరు కంభంపాడుకు బయలుదేరాము. టోల్ గేట్ల వద్ద కూడా ఎక్కువ ఆలస్యం కాకుండానే బయటపడ్డాము. ఖమ్మం, రెబ్బారం, పెనుగంచిప్రోలు నుంచి కూడా చిన్నా పెద్దా  యాభయ్, అరవై  మందిమి మా వూరికి సంక్రాంతి అతిధులం.
Image may contain: 1 person, smiling, outdoor and nature


చిన్నప్పుడు తిరిగిన వీధుల్లో నడుచుకుంటూ చెరువు గట్టుకు చేరాను. మంచినీళ్ళ బావికి వున్న ఇనుప గిలకలు పూర్వపు ఔన్నత్యానికి గుర్తుగా మిగిలివున్నాయి. మోటారు పెట్టి నీళ్ళు తోడి ట్యాంకును నింపుతూ వుండడం వల్ల వాటి ఉపయోగం లేకుండా పోయింది. గట్టు మీద జేసీబీలు, ట్రాక్టర్లు ఇంకా భారీ యంత్రాలు కానవచ్చాయి. గట్టును వెడల్పు చేసి గట్టి పరచడం కోసం ఒక వైపున ఇరవై అడుగుల రిటైనింగ్ వాల్ నిర్మాణంలో వుంది. లింగాల నుంచి కంభంపాడు వరకు నిర్మాణం పూర్తయిన అరవై అడుగుల వెడల్పు రహదారిలో ఇదొక భాగం. ఈ రోడ్డు టీడీపీ నాయకుడు లింగాల వాసి, టీ.డీ. జనార్ధన్ గారి పూనికపై సాధ్యపడిందని స్థానికులు చెప్పారు. ఎప్పుడో నా చిన్నతనంలో నాటి కేంద్ర మంత్రి కే.ఎల్. రావుగారి పుణ్యమా అని వత్సవాయి- చెవిటికల్లు గ్రామీణ రోడ్డు సాకారమయింది. రోడ్లకు పేర్లు పెట్టే సాంప్రదాయం ఆనాడు లేకపోయినా,  నలభయ్ గ్రామాలను కలుపుతూ నిర్మించిన ఆ రహదారిని ఆ గ్రామాల ప్రజలు మాత్రం యాభయ్ ఏళ్ళు గడిచినా ఇప్పటికీ కే.ఎల్.రావు రోడ్డు అనే పిలుచుకుంటున్న సంగతి స్పురణకు వచ్చి ఈ రోడ్డుకు జనార్ధన్ రోడ్డు అని నామకరణం చేస్తే బాగుండు అనే ఆలోచన కలిగింది.
అలా ఆలోచిస్తూ గట్టు చివరివరకు పోయి తిరిగి వస్తుంటే చలి కోటు కప్పుకున్న ఒక మనిషి ఎదురు పడ్డాడు. తెల్లటి తొలివెలుగులో నల్లటి రూపం కనిపించింది.  తాగుతున్న బీడీ విసిరివేసి నా మొహంలోకి తేరిపారచూసాడు. ‘మీరు కరణంగారి తమ్ముడు కదూ’ అన్నాడు. ఇన్నేళ్ళ తరవాత కూడా వూళ్ళో నన్ను గుర్తు పట్టేవాళ్ళు వున్నారని సంతోషించాను. ‘నాకు తెలిసిపోయింది, మీరు భండారు శ్రీనివాసరావు గారు’ అనేశాడు ఇంటిపేరులో ఉన్న ‘భ’ ని ఒత్తిపలుకుతూ.
‘మిమ్మల్ని సాక్షి టీవీలో చూస్తుంటాను’ అన్నాడు మరే టీవీలో కనబడనట్టు. ‘మీకు గుర్తుందో లేదో నేను, యేసు రత్నాన్ని.  మీ అన్నయ్య గారితో కలిసి చదువుకున్నాను, మీ ఇంటికి వచ్చేవాడిని, అయినా మీరు వూళ్ళో ఎప్పుడు వున్నారు కనుక’ అని కూడా ముక్తాయించాడు.
‘నేనిక్కడ వాచ్ మన్ని. ఇవిగో వీటన్నిటినీ నేను కనిబెడుతుండాలి’ చెప్పాడు గట్టు మీది యంత్రాలను గర్వంగా  చూపెడుతూ.
ఇన్ని ఏళ్ళ తరువాత గుర్తు పట్టిన ఆ పెద్దమనిషిని గుర్తు పెట్టుకునే ఫోటో తీసుకోవాలని అనిపించింది. తీసే వాడు ఎవరా అని ఆలోచిస్తుంటే ఒక ట్రాక్టరు కింద నుంచి ఒక మనిషి బయటకు వచ్చాడు.
‘రాం సింగ్. వీళ్ళది జార్ఖండ్. జేసీబీ పనిచేస్తాడు.’ అని పరిచయం చేసాడు యేసు రత్నం. ఆ జార్ఖండ్ కుర్రాడు మా ఇద్దర్నీ ఫోటోలు తీశాడు. వాళ్లకి థాంక్స్, సంక్రాంతి శుభాకాంక్షలు జమిలిగా చెప్పేసే మళ్ళీ ఊళ్ళోకి వచ్చాను. దగ్గరలోనే మునసబు మల్లయ్య గారిల్లు. ఇప్పుడు లేరు. ఆయన కొడుకు ప్రతాప్ ఆ ఇంట్లో ఉంటున్నాడు. చాలా ఏళ్ళ క్రితమే, వూళ్ళో ఉన్న ఇతర ఖామందుల ఇళ్ళకు భిన్నంగా  రెండతస్తుల భవంతి కట్టించాడు. ఇప్పుడు జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ లో కనబడే పెద్ద పెద్ద అధునాతన భవనాలవంటివి నా గ్రామ సందర్శనలో రెండు మూడు కనిపించాయి.
వాసిరెడ్డి జమీందారు కట్టించిన గుడికి మా వంశస్తులు ధర్మకర్తలు. భక్తి ఉన్న చోట సంపద వర్ధిల్లుతుందో, ధనధాన్యాలు సమృద్ధిగా వుంటే భక్తిప్రపత్తులు పెరుగుతాయో తెలియదు కానీ చాలాకాలం నిత్య ధూపం కూడా గగనం అనుకున్న ఆ గుడి పరిస్తితి ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది. దానికి దాపుల్లోనే మరో దేవాలయం రూపుదిద్దుకుంది. మరో రెండు నెలల్లో విగ్రహ ప్రతిష్ట అంటున్నారు. ముందు ముందు మా గ్రామానికి ఒక చక్కటి ఆకర్షణ కాగల ఈ రామాలయాన్ని చావా నరసింహారావనే పెద్దమనిషి నిర్మిస్తున్నారు. ఇప్పటిదాకా యాభయ్ లక్షలు అయ్యాయట.
ఇక మా ఇంట్లో సందడే సందడి. నగరాల్లో పుట్టి పెరిగిన కోడలు పిల్లలు కొంగులు దోపుకుని అర్దరాత్రివరకు మేలుకుని ఇంటి ముందు రంగవల్లులు తీర్చి దిద్దారు. మర్నాడు అందరం కలిసి వెళ్లి ఎస్సీ కాలనీలోని  మా రెండో అన్నయ్య ధర్మకర్తగా ఉన్న  పూర్వీకుల శివాలయాన్ని, మా తోటలో మామూడో అన్నయ్య వెంకటేశ్వరరావుగారు నిర్మించిన మా ‘అమ్మా నాన్నల గుడి’ని దర్శించాము. ఆ పక్కనే మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు, మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు గార్ల స్మారక స్తూపాలు వున్నాయి. చుట్టూ పచ్చటి చేలు. పిల్లల హడావిడి చెప్పతరం కాదు. పెద్దవాళ్ళు కూడా వయసు మరిచి పోయి మొక్కజొన్న చేలో కలయతిరుగుతూ ఫోటోలు దిగారు. రేగుపళ్ళు ఏరుకుని తిన్నారు.
వూళ్ళో ఉన్న రెండు రోజులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని, కొత్త జ్ఞాపకాలను మూటగట్టుకుని మళ్ళీ అందరం కార్లెక్కి హైదరాబాదు రోడ్డెక్కాము.
మొత్తానికి పెద్దలకూ, పిల్లలకూ మంచి ఎనర్జీ టూర్!