2, మే 2025, శుక్రవారం
అయాం ఎ బిగ్ జీరో ( 155 ) – భండారు శ్రీనివాసరావు
1, మే 2025, గురువారం
అయాం ఎ బిగ్ జీరో (154) – భండారు శ్రీనివాసరావు
మా
ఆవిడతో మాట్లాడాలని వుంది
జీవితం
అంతా ఒకటే హడావిడి. ఒక్క నిమిషం టైం లేదన్నట్టు రోజులు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఆఖరికి భార్యతో ఒక మాటా లేదు,
ముచ్చటి లేదు.
జర్నలిస్టుల
జీవితాలే అంతా. లేక నా బతుకే అంతా.
కరోనా
అంటే ఏమిటో తెలియకుండా తను దాటి పోయింది. ఒక రకంగా అదృష్టవంతురాలు అన్నారు. అందరు
చుట్టపక్కాలు, బంధు
మిత్రుల నడుమ ఆమె అంత్యక్రియలు జరిగాయి. అదే కరోనా కాలం అయివుంటే.
ఊహించడానికే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
కరోనా బారిన పడి, మరీ ముఖ్యంగా రెండో వేవ్ లో మా చుట్టపక్కాల్లో చాలా దగ్గరి వాళ్ళు
చనిపోయారు. తదనంతర దృశ్యాలు తలచుకోవడానికి కూడా భయం వేస్తుంది. మా కుటుంబం మొత్తాన్నీ కలచివేసిన ఆకస్మిక మరణం
మా చిన్న మేనల్లుడిది.
కలం పేరు కొలనరావు. రాతకారుడు, గీత
కారుడు కూడా. అసలు పేరు కొలిపాక లక్శ్మీ
నరసింహారావు. డిగ్రీ ఫలితాలు రాకముందే బ్యాంకు మేనేజర్ ఉద్యోగం వచ్చింది. అతి
చిన్న వయసులోనే ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ స్థాయికి ఎదిగాడు. ఇంట్లో
బయటా అందరికీ తలలో నాలుకలా వుండేవాడు.
పిల్లలు ఎదిగివచ్చి తండ్రిని మించిన వాళ్ళు అయ్యారు. అన్యోన్యమైన దాంపత్యం.
ఏ లోటు లేని సంసారం. అలా జీవితం హాయిగా సాగిపోతున్న సమయంలో కరోనా కాటు వేసింది. 2021 ఏప్రిల్ 29 న
కన్నుమూశాడు. అప్పటికి నా వయసు 75. తిరగేస్తే వాడి వయసు 57.
చిన్న
వయస్సులోనే వాడికి నూరేళ్లు నిండిపోతాయని ఏనాడూ అనుకోలేదు. కళ్ళముందు
చిన్నవాళ్లు రాలిపోవడమే పెద్దవాళ్లు చేసుకున్న పాపం అని మా బామ్మ చెప్పేది.
ఇలాగే యావత్ ప్రజలను దిగ్భ్రాంతికి
గురిచేసిన సందర్భం మరోటి.
2021 మే
చివరివారంలో ఒక రోజు.
ఓ మిత్రుడు ఫోన్ చేసి ఎస్వీ ప్రసాద్
గారు కరోనాతో ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి బాగాలేదు అంటున్నారు అని చెప్పాడు.
పోలేని పరిస్థితి. నా దగ్గర వున్న ఫోన్ నెంబరుకు ఓ మెసేజ్ పెట్టాను, గెట్ వెల్ సూన్ అని. చూసి వుండరు. మూడో రోజు ఉదయం కన్ను మూశారు అని వార్త.
ఎప్పుడూ చెదరని నవ్వు మొహంతో వుండే ఎస్వీ ప్రసాద్ గారు ఇక లేరు అని
తలచుకుంటే చాలా బాధ వేస్తుంది.
అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర
పనిచేశారు. ఒక్క మాట కూడా పడకుండా నెట్టుకు రావడం అంటే ఆషామాషీ కాదు. విజయభాస్కర
రెడ్డి, ఎన్టీఆర్,
నేదురుమల్లి జనార్ధన రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇలా అందరి చేతా
సెహబాష్ అనిపించుకున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి
రిటైర్ అయిన తర్వాత విజిలెన్స్ కమిషనర్ గా చాలా కాలం పనిచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రిగా వున్న కాలంలో శ్రీ ఎస్వీ ప్రసాద్ ఏకబిగిన దాదాపు తొమ్మిదేళ్లకు పైగా ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పనిచేశారు.
ఆ తర్వాత జరిగిన అంటే 2004 ఎన్నికల తర్వాత వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం
ఏర్పడింది. వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులు ముఖ్యంగా ముఖ్యమంత్రి పేషీలో పనిచేసిన అధికారులకి స్థానచలనం జరగడం
ఆనవాయితీ.
ఎస్వీ ప్రసాద్ నిబద్దత, నిజాయితీల మీద వై.ఎస్.ఆర్. కి ఉన్న నమ్మకం చేత, ఆయన్ని పిలిచి ఆయన కోరుకున్న పోస్టు ఇవ్వాలని సంకల్పించారు. కానీ
ప్రసాద్ గారు మాత్రం ముఖ్యమైన, కీలకమైన పోస్టులు కోరుకోలేదు. చాలా
ఏళ్ళుగా విశ్రాంతి ఎరగకుండా పనిచేయడం వల్ల కావచ్చు, పనిభారం కొంత తేలికగా వుండే అప్రధాన పోస్టుని ఏరికోరి
వేయించుకున్నారు. అదేమిటంటే – Environment Protection Training and Research Institute (EPTRI). అది హైదరాబాదులోనే వుంది కాని అలాంటి సంస్థ ఒకటి వుందని చాలా మందికి
తెలియదు. అక్కడ డైరెక్టర్ గా ఆరు నెలలు కూడా పనిచేశారో లేదో తెలియదు, వై.ఎస్. ఆయన్ని అతి కీలకమైన పోస్టుకి ఎంపిక చేశారు. ఎస్వీ ప్రసాద్ గారిని
రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
ఇదేమిటి అని సొంత పార్టీ వాళ్ళు అడిగితే
అది అంతే అని వై.ఎస్. జవాబు. తనకు
అడ్మినిస్ట్రేషన్
కొత్త అయినా, రాజకీయాల్లో సుదీర్ఘ కాలం వుండడం చేత ఐ.ఏ.ఎస్. అధికారుల పనితీరు తనకు
కరతలామలకం అని చెప్పేవారు. ఎవరో ఒకరిద్దరు తప్ప సాధారణంగా చాలా మంది ఐ.ఏ.ఎస్.
ఆఫీసర్లు Loyal to
their duty అనేది ఆయన అభిప్రాయం. దీన్నే కొందరు Loyal to CM అని అన్వయించి చెబుతారు.
ఆయన సీఎం పేషీలో వుండడం వల్ల ఐ.ఏ.ఎస్. అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయంతో
చక్కటి సమన్వయం ఉండేదని,
ప్రభుత్వ నిర్ణయాలు సత్వరంగా అమలు జరగాలంటే ఇలాంటి సమన్వయాన్ని అధికారులు కోరుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన శ్రీ
ఐ.వై.ఆర్. కృష్ణారావు అభిప్రాయ పడ్డారు.
అనేకమంది, అదీ పరస్పర విరుద్ధమైన పార్టీల ముఖ్యమంత్రుల వద్ద సన్నిహితంగా
పనిచేసే అవకాశం ఎస్వీ ప్రసాద్ గారికి లభించింది. కత్తి మీది సాము లాంటి
వ్యవహారాలను ముఖ్యమంత్రికి మాట రాకుండా, తను మాట పడకుండా చక్కబెట్టే చాణక్యం ఉంటేనే కాని ఇది సాధ్యపడదు.
కరోనా కారణంగా, అంత మంచి అధికారికి నూరేళ్లు నిండడం విషాదం.
ఈ
విషయంలో మా ఆవిడ అదృష్టవంతురాలే అనుకోవాలి. కాకపోతే, అసలు దురదృష్టవంతుడిని నేను. కాలికి బలపం
కట్టుకుని తిరిగిన నేను, కరోనా కాలంలో రెండేళ్లపాటు గడపదాటకుండా ఇంటిపట్టునే పడివున్నాను. ఆమె ఎప్పుడూ కోరుకుని,
పైకి చెప్పని
కోరిక అది.
ఒకప్పుడు
అది అసాధ్యం. ఎప్పుడూ ఎవరో ఒకరు. ఏదో ఒక ఫోను. పగలు లేదు, రాత్రి లేదు. ఎక్కడో ఒక చోట గంటలు
గంటలు వుండిపోవడం. ఇంటికి వస్తే వెంట నలుగురు. కాఫీలు, టీలు, భోజనాలు. నాకు తీరిక లేదు. అంచేత ఆమెకు
తీరిక వుండేది కాదు.
అంతా
అయిన తర్వాత, అందర్నీ
పంపించిన తర్వాత ఏమిటి ఈరోజు విశేషాలు అని అడిగేది. చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి, రాజకీయాలు ... ఈ సంగతుల మీద ఆమెకు
ఏమి ఆసక్తి.
రిటైర్
అయిన తర్వాత కూడా ఇదే తీరు. ఉదయం ఆరింటికి లేస్తే ఏదో ఒక టీవీ. తను నాకంటే ముందే
లేచి కాఫీ పెట్టి ఇస్తే తాగి బయట పడితే మళ్ళీ ఎప్పుడో.
‘అత్తయ్య!
చూస్తున్నావా మామయ్య టీవీలో మాట్లాడుతున్నాడు’
ఫోన్లో
నా మేనకోడళ్ళు ఎవరో అడిగేవాళ్ళు.
‘ఏఛానల్లో’
అనేది తను నిరాసక్తంగా.
నేను ఏ
ఛానల్ కు వెడుతున్నానో తనకి తెలియదు. తెలిసినా చూసేది కాదు.
‘ఏమిటండీ
ఆ పోట్లాటలు. అంతోటి వాటిని పనికట్టుకుని చూడాలా’ అనేది.
కరోనా కాలంలో తను ఉన్నట్టయితే ఎంత బాగుండేదో.
హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వుండేవాళ్ళం.
అది
కూడా నేను బయటకు పోయే ఛాన్స్ లేదు కాబట్టి.
‘ఇప్పుడు
రా! ఎంచక్కా కబుర్లు చెప్పుకుందాం’
అనాలనిపిస్తుంది.
మాస్క్
తో మా ఆవిడ
కింది
చిత్రంలో మాస్క్ తో వున్నది మా ఆవిడ నిర్మల. ఆమె చనిపోయిన ఆరేడు నెలల తర్వాత కానీ
కరోనా మన దేశంలో అడుగుపెట్టలేదు. అప్పటికి ఇలా మాస్కులు పెట్టుకుని తిరగడం అలవాటు
లేదు.
అంతకు
ముందు సంవత్సరం అంటే 2018లో
అనుకుంటా, మా
అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్రబోస్, హైదరాబాదులోని మా కుటుంబాలను తీసుకుని మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని
పుణ్యక్షేత్రాలు, పర్యాటక
ప్రదేశాలు చూపించాడు. ఆ క్రమంలో మా అందర్నీ ఇనుప చువ్వలు, కడ్డీలు తయారు చేసే ఓ కర్మాగారానికి
తీసుకువెళ్లాడు. అక్కడి నిబంధనల ప్రకారం మాస్కులు ధరించాలి. కాకపొతే, అవి వాళ్ళే ఇచ్చారు.
(ఇంకా వుంది)
కింది
ఫోటో :