19, మార్చి 2014, బుధవారం

చదువుకున్న వోటర్లకు ఓ విజ్ఞప్తి


సగటు భారతీయ వోటరు అంటే నాకు తగని గౌరవం. దీనికి కారణం వుంది.
అనేక దశాబ్దాల నుంచి ఎన్నికలు చూస్తూ వస్తున్నాను. కాడిజోడెడ్లు (కాంగ్రెస్) కంకీ కొడవలి (కమ్యూనిస్ట్) ప్రమిదె (జనసంఘం) ఇలా పోలింగు కేంద్రంలో గుర్తులు అతికించిన బ్యాలెట్ డబ్బాలు (నిజంగానే డబ్బాలు, ఖాళీ కిరసనాయిలు డబ్బాలు అనుకుంటాను) పెట్టేవాళ్ళు. ఏపార్టీకి వచ్చిన వోట్లు విడిగా లెక్కబెట్టి ఫలితాలు ప్రకటించేవాళ్ళు. తరువాత కాలంలో కాంగ్రెస్ గుర్తు ఆవూ దూడా, ఆ పిదప హస్తం ఇలా మారిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీలు రెండుగా విడిపోయాయి. జనసంఘం భారతీయ జనతా పార్తీగా పేరుతో బాటు, గుర్తును కమలంగా మార్చుకుంది. అభ్యర్ధుల పేర్లు లేకుండా గుర్తులతో బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. ఎలక్ట్రానిక్ వోటింగి యంత్రాలు రంగ ప్రవేశం చేసాయి. చదువుకున్న పోలింగు సిబ్బంది కొంత గందరగోళపడ్డారు కాని నిరక్షరాస్యుడయిన సగటు వోటరు మార్పుకు తేలిగ్గా అలవాటుపడ్డాడు. మనతోబాటే స్వతంత్రం తెచ్చుకున్న ఇరుగుపొరుగు దేశాలు ఎప్పుడో ఒకప్పుడు సైనిక పాలనలోకి జారిపోయాయి కాని మనదగ్గర మాత్రం ప్రభుత్వాలు కేవలం వోటుతోనే మారుతూ వచ్చాయి.


(దయచేసి ఇలా సగటు వోటర్ని అవమానించవద్దు. ఈ వొట్టినీతులు కట్టిపెట్టి,  చేతనయితే పోలింగు రోజు టీవీలకు, కంప్యూటర్లకు అతుక్కుపోకుండా వెళ్ళి వోటు వేసి అందరికీ ఆదర్శంగా నిలవండి.)

అలాటి చరిత్ర కలిగిన సగటు వోటర్ని డబ్బుకు మద్యానికి అమ్ముడుపోవద్దని నీతులు చెబుతున్నప్పుడు చాలా బాధ వేస్తుంది. నిజానికి వాళ్ళే ప్రతిఎన్నికలో చురుగ్గా పాల్గొని వోటు హక్కు వినియోగించుకునే వాళ్లు. ఎండయినా వానయినా పోలింగు కేంద్రాల వద్ద క్యూలల్లో వేచి  నిలబడి వోటు వేసేవాళ్ళు. చదువుకున్నవాళ్ళలో ఇలాటి చొరవ కనబడదు. పైపెచ్చు వాళ్లు డబ్బుకు గడ్డి తిని వోటేస్తున్నారని ఎద్దేవా చేస్తుంటారు. ఇది వాళ్లని అవమానించడమే. నిజానికి అధికారానికి భయపడి  వోటేస్తే ఎమర్జెన్సీ తరువాత ఇందిరాగాంధి వోడిపోయేదా ? డబ్బుకు కక్కుర్తి పడి  వోటేస్తే   డబ్బున్నఖామందులందరూ గెలుస్తూ వుండేవారు కదా!
రాజకీయ పార్టీలు డబ్బున్నవాళ్లకు టిక్కెట్లు ఇస్తే వాళ్లు ప్రచారానికి ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేస్తారు. నామినేషన్ వేయడానికి వాళ్లు చేసే హడావిడి చూసి ఎవ్వరు మాట్లాడరు. ప్రత్యేక విమానాల్లో, హెలికాఫ్టర్లలో నాయకులు తిరుగుతుంటే ఆ డబ్బెక్కడిది అని అడిగేవాళ్ళు వుండరు. వోటరు దగ్గరకు వచ్చేసరికి అందరూ నీతులు చెప్పేవాళ్ళే!
ఎన్నికల్లో అభ్యర్ధులు ముట్టచెప్పే డబ్బు తీసుకుంటున్నారేమో కాని ఖచ్చితంగా వోటు మాత్రం వాళ్లు అమ్ముకోవడం లేదు. ఇది నిష్టూరంగా ధ్వనించే సత్యం. 

2 కామెంట్‌లు:

hari.S.babu చెప్పారు...

నిజమే నండీ.నేనొకటి అబ్సర్వ్ చేశాను.కులం కార్దు తో రాజ్కీయాల్లో ప్రయోజనం పొందతం యెన్నికల్లో గెలవతం గురించి కూడా నిరక్షరాస్యుల్ని బాధ్యుల్ని చేసి అవహేలన చెయ్యడం జరుగుతున్నది. కానీ అందులో నిజమేంత ఒక చదువు లేని మామూలు వ్యక్తి తన కెవరయినా సాయం చెస్తే మనస్పూర్తిగా చేతులు జోడించి దణ్నం పెడతాడు. తనకి నిజంగా మేలు చెసే నాయకుణ్ణి దేముడి లాగా చూస్తాడు - ఆ నాయకుడి కులంతో సంబంధం లేకుండా.

కులంతో అవసరం, దాన్ని ఉపయోగించుకోవటం అనేది చదువుకున్న వాళ్ళే చెస్తున్నారు.పోటీ యెక్కువయిన చోట లంచంతో బాటు శ్రీ శ్రీ చెప్పిన రిఫరీని బుట్టలో వేసి గెలవడానికే కులాన్నీ మతాన్నీ చదువుకున్నవాళ్ళే ఉపయోగించుకుంటున్నారు, కాదంటారా?

కాకపోతే నికరమయిన లెక్కలు ఇప్పటికి లేవుగానీ ఒక కులపు వ్యక్తి ఒక నియోజకవర్గంలో అర్హతలు లేకపోయినా గెలుస్తుంటే ఆ నియోజకవర్గంలో ఆ కులంలో చదుకున్న వాళ్ళు యెంతమంది అనే సమాచారాన్ని యెవరయినా సేకరిస్తే తెలుస్తుంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@HariBabu Suraneni - THANKS