11, జనవరి 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో ( 66) – భండారు శ్రీనివాసరావు

కౌలాలంపూర్ ఎయిర్ పోర్టు నుంచి నగరంలోకి  చాలా సేపు  ప్రయాణం. ఇప్పుడు అంటే అలాంటి రోడ్లు అందరికి అనుభవంలోకి వచ్చాయి కానీ,  ఆ రోజుల్లో విశాలమైన రోడ్లు, ఎత్తైన భవనాలు, రకరకాల కార్లు, ప్రతిదీ అపురూపమే. అంబాసిడర్, ఫియట్ తప్ప మరో బ్రాండ్ కారు ఎలా వుంటుందో చూడాలి అంటే సినిమాల్లోనే.  భాష రాని వాళ్ళు కూడా ఇంగ్లీష్, హిందీ సినిమాలకు వెళ్ళడానికి ఒక కారణం ఇటువంటివి చూసి ఆనందించడానికే అని చెప్పుకునే వారు.

ఒక గంట ప్రయాణం తర్వాత కారు హోటల్ జయ ఇంటర్నేషనల్ ముందు ఆగింది. రిసెప్షన్ లో కనుక్కుంటే నా పేరు ముఖ్యమంత్రి వెంట వచ్చే అధికారుల బృందంలో వుంది. ఈ బృందం మొత్తానికి ఒకే ఫ్లోర్ లో గదులు. పైగా విడిగా నా కోసం ఒక వాహనం, డ్రైవర్. పదిహేను డాలర్లతో దిగిన నాకు ఈ వైభోగం పడుతుందని నేను ఊహించలేదు. ప్రభాకర రెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు చెప్పి నా గదికి వెళ్లి రిఫ్రెష్ అయ్యాను. బాత్ టబ్ లో స్నానం చేయడం అదే మొదటిసారి. ఈ లోగా నా కోసం ఎయిర్ పోర్టుకు వెళ్ళిన కారు డ్రైవర్ తిరిగి వచ్చాడు. అతడికి ఇంగ్లీష్ అర్ధం అవుతుంది. ‘పలానా చోటుకి అనిలేదు. ఓ గంట సేపు అలా ఊరు చూసి వద్దాము, ఎక్కడా ఆగాల్సిన పని లేదు’ అని ముందే చెప్పాను, షాపింగ్ అనుకుని తీసుకువెడతాడేమో, వున్నవి కొద్ది డాలర్లే అనే సందేహంతో.    అతడు మలేసియాలో స్థిరపడ్డ తమిళుడు. కొంచెం తెలుగు తెలుసు. పేరు రామచంద్రన్. కారు డ్రైవర్లకు ప్రయాణీకుల మనస్తత్వం, ఆలోచనలు  అర్ధం చేసుకునే శక్తి ఉంటుందేమో. అతడు సరాసరి ఒక దుకాణం దగ్గర ఆపాడు. మీ దగ్గర ఇండియన్ రుపీస్ వుంటే ఇక్కడ మార్చుకోండి. బ్యాంకు రేటు కంటే ఎక్కువే ఇస్తారు అన్నాడు. ‘ఉన్నాయి కానీ ఇప్పుడు తేలేదు. కాసేపు తిరిగి వెనక్కి వెడదాం’ అన్నాను. ‘పరవాలేదు, పెద్ద పెద్ద హోటళ్ళలో తప్ప అన్నిచోట్ల ఇండియన్ రుపీస్ తీసుకుంటారు’ అని మొదటి పాఠం చెప్పాడు.

హోటల్ కు వెళ్లేసరికి అక్కడ నానా హడావిడిగా వుంది. రిసెప్షన్ హాలు లోకి వెళ్ళే అద్దాల ద్వారం దగ్గర జనం గుమికూడి వున్నారు. అందరూ తెలుగు సభల కోసం వచ్చిన వారే అని వారి మొహాలు చూస్తేనే తెలుస్తోంది. ఆ తలుపు దగ్గర నిలబడితే తెరుచుకుంటాయి. లోపల అడుగు పెట్టగానే మూసుకుంటాయి. ఇలాంటివి మనదగ్గర చిన్న చిన్నమాల్స్ లో కూడా ఇప్పుడు ఉంటున్నాయి. చెప్పాకదా. అప్పట్లో ప్రతిదీ కొత్తే. హడావిడికి కారణం ఏమిటంటే భయం. తెరుచుకున్న తలుపు వెంటనే మూసుకుంటుందేమో అని భయపడి, తలుపు తెరుచుకోగానే, క్షణం ఆలస్యం చేయకుండా అందరూ బయట నుంచి ఒక్క గెంతు గెంతి  లోపలకు దూకుతున్నారు. ఇదంతా చూసిన తర్వాత,  హోటల్ వాళ్ళు ఆ అద్దాల తలుపులు తెరిచే ఉంచారు. మొదటి రోజు భోజనాలు అద్భుతంగా వున్నాయి. దేశం కాని దేశం వచ్చాము అనే భావన లేకుండా చక్కటి తెలుగు వంటకాలతో భోజనాలు పెట్టారు. సాయంత్రం అయ్యేసరికి అతిధుల సంఖ్య వాళ్ళు ఊహించిన దానికి కొన్ని రెట్లు పెరిగింది. దాంతో ఒక కూర, పచ్చడి, సాంబారు పెరుగుతో సరిపుచ్చారు. హోటల్ లోని మసాజ్ సెంటర్ మాత్రం మంచి బిజినెస్ చేసింది. తెలుగు సభల ప్రతినిధులతో   కిటకిటలాడింది. ఎందుకంటే అక్కడ మసాజ్ చేసేవారందరు ఆడవాళ్ళు.

ఈలోగా, బొంబాయి మీదుగా ప్రయాణం చేసి కౌలాలంపూర్  వచ్చిన  ముఖ్యమంత్రి బృందం  హోటల్ కు చేరింది. అక్కడ ఏర్పాటు చేసిన గదుల్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ ఫ్లోర్ లో చిట్టచివరి విశాలమైన గది ముఖ్యమంత్రికి, పక్క గది సెక్యూరిటీ అధికారి, ఐపిఎస్ ఆఫీసర్ వామనరావు గారికి, ఆ పక్క గది నాకు, మిగిలినవి ఇతర సిబ్బందికి కేటాయించారు.  

అంజయ్య గారు శాకాహారి. ఆ విషయం తెలియని అక్కడి ఆహ్వాన సంఘం వారు రకరకాల నాన్ వెజ్ వంటకాలతో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆయన మాత్రం  రెండు రొట్టెలు, బంగాళా దుంపల కూరతో సరిపెట్టుకున్నారు.

ప్రపంచ తెలుగు సభల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మలేసియా ఉప ప్రధాన మంత్రి డాక్టర్ మహాతీర్ మహమ్మద్ కూడా హాజరయ్యారు. తెలుగు భాష గొప్పతనం గురించి యథావిధిగా ప్రసంగాలు సాగాయి. ప్రవాసాంధ్రుల కోర్కెలు తీర్చడానికి తమ  ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.  

కారణాలు ఏమైతేనేం కాంగ్రెస్ అధిస్థానం అంజయ్యపై కినుకతో వున్నరోజులవి. ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరవాత అంజయ్య గారు హోటల్ రూముకి తిరిగొచ్చేసారు. వెంట షరా మామూలుగా నేను. కాస్త నలతగా కనిపించారు. అంత పెద్ద గదిలో ఆయనా నేను ఇద్దరమే. సాయంత్రం అవుతోంది. ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ పెద్ద కిటికీ అద్దంలోనుంచి బయటకు చూస్తున్నారు. విశాలమయిన రోడ్డు. వచ్చే కార్లు. పోయే కార్లు. పక్కనే ఏదో ఫ్యాక్టరీ లాగావుంది.

ఆయన వున్నట్టుండి “చూసావా!” అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు.

పొద్దున్న బయలుదేరేటప్పుడు చూసాను. అందులో (ఆ ఫ్యాక్టరీ లో) పనిచేసేవాళ్లందరూ గంట కొట్టినట్టు టైము తప్పకుండా వచ్చారు. అయిదు నిమిషాల్లో లోపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ అంతే. షిఫ్ట్ పూర్తికాగానే ఠంచనుగా ఇళ్లకు పోతున్నారు. పనిచేసేవాళ్లకు వాళ్లకు కావాల్సింది ఇవ్వాలి. కావాల్సిన విధంగా పని చేయించుకోవాలి. ఇలా మన దగ్గర కూడా చేస్తే కావాల్సింది ఏముంటుంది!” అన్నారాయన యధాలాపంగా.

అంటే ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తోంది ఇదన్నమాట.

కౌలాలంపూర్ తెలుగు మహాసభల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదనీ, ఇందిరాగాంధీ ఈ విషయంలో ముఖ్యమంత్రి పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనీ, హైదరాబాదులో ఒక ప్రముఖ దినపత్రిక పత్రిక రాసిన విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అంజయ్య గారికి “రాజకీయ జ్వరం” పట్టుకున్నట్టు అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. అందుకే ఆయన సభా ప్రాంగణంలోనే వుండిపోకుండా వొంట్లో బాగోలేదనే నెపంతో హోటల్ రూముకి తిరిగొచ్చేసారని వదంతులు హైదరాబాదు దాకా పాకాయి. ఈయనగారేమో ఇక్కడ తాపీగా కూర్చుని కార్మికులు గురించి ఆలోచిస్తున్నారు. అలావుండేది అంజయ్య వ్యవహారం.

కింది ఫోటోలు:


కౌలాలంపూర్ లో తెలుగు మహా సభల కార్యక్రమంలో నాటి ముఖ్యమంత్రి శ్రీ టి. అంజయ్య, ప్రభ్రుతులు









 

(ఇంకా వుంది)

ఫస్ట్ లుక్ – భండారు శ్రీనివాసరావు

 గట్టి బందోబస్తుతో (మధ్యలో జోరున వాన పడ్డా ఒక్క పేజీ కూడా తడవకుండా, లేదా కన్నుకుట్టిన పోస్ట్ మన్ కన్ను ఈ పుస్తకంపై పడకుండా ప్లాస్టిక్ రేపర్లు చుట్టిన అట్టపెట్టెలో పదిలంగా పెట్టి ) చాలా అట్టహాసంతో,   రెంటాల జయదేవ్  గారి ఫస్ట్ రీల్ పుస్తకం (గ్రంధం అనాలేమో! అంత పెద్దగా వుంది) ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితం మా గృహ ప్రవేశం చేసింది. సినిమాలకి సెన్సార్ కత్తెర లాగా, ఈ గ్రంధాన్ని కళ్ళారా చూడడానికి నిజంగానే కత్తులు, కత్తెరలు వాడాల్సి వచ్చింది. అంత పదిలంగా పంపారు రెంటాల జయదేవ్ గారు. అంత పదిలంగాను చేర్చారు స్పీడ్ పోస్టు వారు. మరి పదిలంగా దాచుకోవాల్సిన పుస్తకం కదా!

ఎంత లావు పుస్తకం అయినా చదివే కంటికి లోకువే కదా! ఆత్రంగా తిరగేశాను.

ఫస్ట్ లుక్ లో నా ఫస్ట్ ఒపీనియన్ ఒకటే.

ఇది మామూలు పుస్తకం కాదు, భారతీయ సినిమా చరిత్ర తెలిపే పరిశోధనా గ్రంధం. నాకే కనుక డాక్టరేట్ ఇచ్చే అధికారం వుంటే మరో మాట లేకుండా, మరో క్షణం ఆలోచించకుండా ఈ పుస్తకం రాసిన రెంటాల జయదేవ్ గారికి    డాక్టరేట్ ఇచ్చేస్తాను. ఆ అధికారం లేదు కనుక:

ధన్యవాదాలు డాక్టర్ రెంటాల జయదేవ్ గారు.

మంచి పుస్తకాలు వేయడంలో ఇప్పటికే మంచి పేరున్న ఎమెస్కోవారికి కూడా ధన్యవాదాలు.

అలాగే భద్రంగా పుస్తకాన్ని చేర్చిన స్పీడ్ పోస్టు వారికి కూడా థాంక్స్.

చదివిన తర్వాత మరికొన్ని ముచ్చట్లు.



మన సినిమా ఫస్ట్ రీల్, రచన: రెంటాల జయదేవ్, ప్రచురణ: ఎమెస్కో, పేజీలు : బోలెడు, వెల : రు. 750/-    

అయాం ఎ బిగ్ జీరో ( 65) – భండారు శ్రీనివాసరావు

 

నాకది మొదటి విమాన ప్రయాణం కాకపోయినా, మొట్టమొదటి విదేశీ విమాన ప్రయాణం. మద్రాసు నుంచి సిలోన్ కు ప్రయాణ సమయం గంట లోపే. అయినా, ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో పాటు హాట్ డ్రింక్స్ సర్వ్ చేయడం ఆశ్చర్యం అనిపించింది. చూసినంత మేరా కొబ్బరి తోటలు తప్ప వేరే కనిపించని శ్రీలంక భూభాగంలో కొంత దూరం ప్రయాణించిన విమానం, కనెక్టింగ్ ఫ్లయిట్ తప్పిపోకుండా కొలంబో విమానాశ్రయంలో దిగింది. మద్రాసు లాగే సముద్రతీర ప్రాంతం కావడం వల్ల వంటికి జిగటగా చెమట పట్టే ఉష్ణ వాతావరణం.
కాసేపటి తర్వాత విమానం ఎక్కి కౌలాలంపూరు బయలుదేరాము. మొదటి విదేశీ ప్రయాణం కనుక ముచ్చట పడి విండో సీటులో కూర్చున్నాను. నా తాపత్రయమే కానీ, విండో నుంచి తెల్లగా దూది పరుపుల్లా పరచుకున్న మబ్బులే కానవచ్చాయి. ఈ సారి కూడా మర్యాదలు బాగున్నాయి. అడిగినవారికి అడిగినంత పోస్తున్నారు, తినే వారికి తిన్నంత తినిపిస్తున్నారు. ప్రయాణం పొడుగునా ఈ సంతర్పణ సాగుతూనే వుంది.
మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో విమానం దిగాను. అంతవరకూ ఢిల్లీ, బేగంపేట, మద్రాసు ఎయిర్ పోర్టులు మాత్రమే చూసిన నా కళ్ళకి కౌలాలంపూర్ విమానాశ్రయం చాలా పెద్దదిగా, గొప్పదిగా అనిపించింది.
ఆ దేశంలో మంచి సూటుకేసులు దొరుకుతాయి, కాబట్టి ఇక్కడ నుంచి చెత్త సూటుకేసు తీసుకువెళ్లి అక్కడ పారేసి కొత్తది కొనుక్కో అనే ఓ మిత్రుడి సలహా పాటించి, ఓ పాతిక రూపాయలతో కోటీ మాల్ సూటు కేసు కొని, రెండు జతల బట్టలు పెట్టుకుని బయలు దేరిన నాకు, ఈ చెత్త సూటు కేసు ఎప్పుడు హఠాత్తుగా తెరుచుకుని నా పరువు తీస్తుందో అనే భయం పట్టుకుంది. దాంతో దాన్ని జాగ్రత్తగా చేతులో పట్టుకుని రెస్ట్ రూముకు వెడుతూ, దానికి దగ్గరలో కూర్చొన్న ఓ ఇండియన్ లాగా కనబడుతున్న వ్యక్తిని, లోపలకు పోయి వస్తాను, దీన్ని కాస్త కనిపెట్టి చూస్తారా అని మనకు అలవాటయిన పద్దతిలో అడిగాను. అతడు నవ్వుతూ ఏడాది తర్వాత వచ్చి చూడండి, మీ సూటు కేసు ఇక్కడే వుంటుందని అంటూ లేచిపోయాడు.
అప్పటికి నా జేబులో మద్రాసు ఎయిర్ పోర్టులో రూపాయలతో మార్చుకున్న పదిహేను డాలర్లు, స్టేట్ బ్యాంకులో చేసిన చేబదులు మూడు వేల రూపాయలు వున్నాయి. బషీర్ బాగ్ స్టేట్ బ్యాంకు బ్రాంచీలో సావిత్రి గారని ఒక మహానుభావురాలు మేనేజర్. నాకూ, డి. వెంకట్రామయ్య గారికి అవసరానికి, అనవసరానికి ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తుండేవారు. కూర్చోబెట్టి, కాఫీ ఇప్పించి, డబ్బులు అక్కడికే తెప్పించి చేతిలో పెట్టి సాగనంపేవారు. అలా చేసిన చేబదులు డబ్బులన్న మాట.
ఎయిర్ పోర్ట్ అధికారి నా దగ్గర వున్న డాలర్లు చూసి మీరిక్కడ ఎలా సర్వైవ్ అవుతారు అని అడిగాడు. ఏం జవాబు చెప్పాలో ఆలోచిస్తుండగా, ‘భేష్ వచ్చేశారా, నా ఫ్లయిట్ కొద్దిగా లేటయింది, మీరూ అదే హోటల్ కు కదా, పదండి పోదాం’ అని భుజం తట్టారు వెనక నుంచి హోం మంత్రి ప్రభాకర రెడ్డి గారు. బతుకు జీవుడా అని ఆయన కారెక్కాను.
కింది ఫోటో:
మలేషియా తెలుగు సభల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య. నాటి మంత్రి, మండలి వెంకట కృష్ణారావు గారు



(ఇంకా వుంది)

10, జనవరి 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో ( 64) – భండారు శ్రీనివాసరావు

 

ముఖ్యమంత్రి అంజయ్య అధికార నివాసంలో ఒక రోజు  కౌలాలంపూర్ లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల ప్రయాణపు  ఏర్పాట్ల గురించి అధికారులతో  ముచ్చటిస్తున్నారు.

ముఖ్యమంత్రి భద్రాచలంలో రాములవారి కళ్యాణ తలంబ్రాలు ఇవ్వాల్సిన కారణంగా ఆయన ముందు హెలికాప్టర్ లో వెళ్లి, ఒకరోజు ఆలస్యంగా బొంబాయి నుంచి కౌలాలంపూర్  వెళ్ళాలని నిర్ణయించారు. ఆ టైములో అంజయ్యగారు నా వైపు చూసి నీ సంగతి ఏమిటి నువ్వు ఎలా వస్తున్నావు అన్నారు. నాకు పాసుపోర్టే లేదు, ఎలా సాధ్యం అవుతుంది అని జవాబు చెప్పాను. సీ ఎం కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి  రాఘవేంద్రరావు గారెతో, శ్రీనివాస్ కు పాస్ పోర్టు లేదట ఆ విషయం ఏదో చూడండి అన్నారు. దానితో నేను ఖంగు తిన్నాను. రాఘవేంద్రరావు గారు నన్ను పక్కకు తీసుకువెళ్లి ‘రేపు మొయిన్ (సీ ఎం వ్యక్తిగత కార్యదర్శి, మొయినుద్దీన్) అన్నీ చూసుకుంటాడు’ అని చెప్పారు.

మర్నాడు మొయిన్ మా ఇంటికి వచ్చి అప్లికేషన్ ఫారం పూర్తి చేయించాడు. స్వయంగా నన్ను వెంటబెట్టుకు వెళ్లి పాస్ పోర్ట్ ఇప్పించారు. అప్పుడు పాస్ పోర్ట్ ఆఫీసు బర్కత్ పురాలో వుండేది. అయితే అది ఆరు మాసాలకు మాత్రమే పనికి వచ్చే తాత్కాలిక పాస్ పోర్టు. ఆ విధంగా నా మొదటి విదేశీ ప్రయాణం 1981 లో జరిగింది. పాస్ పోర్టు వచ్చింది. కౌలాలంపూర్ వెళ్ళడానికి విమానం టిక్కెట్లు ప్రతినిధులకు ఇచ్చే వ్యవహారం మంత్రి, మండలి వెంకట కృష్ణారావు గారు చూస్తున్నారు. నేను మద్రాసు వెళ్లి తిరిగి రావడానికి విమానం టిక్కెట్టు అప్పటి హోం మంత్రి కె. ప్రభాకరరెడ్డి గారు ఏర్పాటు చేశారు.  మద్రాసులో పరిస్థితి చూస్తే నాకేమీ పాలు ప్లేదు.  మంత్రి ఏమ్వీ కృష్ణారావు గారు, కౌలాలంపూర్ వెళ్లి తీరాలని పట్టుబడుతున్న  కాంగ్రెస్ కార్యకర్తలను సముదాయించే పనిలో మునగానాం తేలానాం అన్నట్టు వున్నారు. నన్ను చూడగానే ఆయన, తన జేబులో వున్న ఒక టికెట్టు తీసి ఇచ్చి, ‘ఎక్కువ టైం లేదు, శ్రీలంక మీదుగా కౌలాలంపూర్ వెళ్ళే విమానం. వెంటనే ఎయిర్ పోర్టుకు వెళ్ళండి అంటూ తొందరపెట్టారు. అంత పని ఒత్తిడిలో కూడా, కారిచ్చి ఎయిర్ పోర్టుకు పంపారు. అంత కష్టపడి తెలుగు సభలకోసం రాత్రింబవళ్ళు  కృషిచేసిన మండలి వెంకట కృష్ణారావు గారు, చివరికి  తాను కౌలాలంపూర్ రాలేకపోయారు. ఇది నన్ను చాలా బాధించింది.

మండలి వెంకట కృష్ణారావు గారికి ప్రపంచ తెలుగు సభల నిర్వహణ  కొత్తకాదు, జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన మంత్రివర్గంలో సభ్యులు అయిన కృష్ణారావు గారి సారధ్యంలోనే 1975లో హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహా సభలు నేత్ర పర్వంగా ఘనంగా, జయప్రదంగా జరిగాయి. ఎంతో ముందు చూపుతో, బాగా కసరత్తు చేసి నిర్వహించిన సభలు ఇవి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట రాసిన శంకరంబాడి సుందరాచారి గారు, తన కోకిల స్వరంతో ఆ పాటకు జీవం పోసి, విదేశంలో స్థిరపడిన  గాయని టంగుటూరి సూర్యకుమారి గారు, సుందరాకాండ రాసి, గానం చేసిన సుప్రసిద్ధ గాయకుడు ఎం.ఎస్. రామారావు గారు ఈ సభల్లో పాల్గొనడం గొప్ప విశేషంగా ఆ రోజుల్లో చెప్పుకున్నారు. ఈ కీర్తి ప్రతిష్టలకు ప్రధాన భూమిక వహించింది నిస్సందేహంగా మండలి వెంకట  కృష్ణారావు గారే. అలాంటి వ్యక్తి తాను తలపెట్టి, ప్రణాళికా రచన చేసి, నిర్వహించిన కౌలాలంపూర్ తెలుగు సభలకు రాలేని పరిస్థితి ఏర్పడడం విచారకరం.    

   

మద్రాసులో నేనెక్కిన  శ్రీలంక ఎయిర్ లైన్స్ విమానం ఏప్రిల్ పద్నాలుగు ఉదయం ఆరున్నరకు శ్రీలంక (సిలోన్) మీదుగా కౌలాలంపూర్ బయలుదేరింది. 

కింది ఫోటో: మండలి వెంకట కృష్ణారావు గారు 



(ఇంకా వుంది)

అయాం ఎ బిగ్ జీరో (63) - భండారు శ్రీనివాసరావు

 

      

ఎనభయ్యవ దశకం మొదట్లో ముఖ్యమంత్రి అయిన శ్రీ టంగుటూరి అంజయ్య, తన  అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కార్లో డ్రైవర్ పక్కన ముందు సీట్లో ఆసీనులయ్యేవారు.  ‘అమ్మ’   (శ్రీమతి ఇందిరాగాంధి)  కూడా ఫ్రంటు సీటే సుమా!’ అని అమాయకంగా అనేవారు.  ఆవిడ కూడా ప్రధాని హోదాలో అంబాసిడర్ కార్లో ముందు సీట్లోనే కూర్చునేది. అంజయ్య గారు  ముందు సీటు ఎంపిక చేసుకోవడానికి నాకు మరో కోణం కనిపించేది.  ప్రజల మనిషి అయిన అంజయ్య గారికి జనం తాకిడి ఎక్కువ.  ‘లైఫ్ బాయ్ ఎక్కడవుంటే  ఆరోగ్యం అక్కడ వుంటుంది’  అనే వాణిజ్య ప్రకటన తరహాలో అంజయ్య గారు ఎక్కడ వుంటే అక్కడ జనమే జనం.  బాత్రూంబెడ్ రూముల్లో  కూడా ఆయనకు ఈ తాకిడి తప్పేది కాదని చెప్పుకునేవారు. సెక్యూరిటీని కూడా తోసుకువచ్చి కారెక్కాలని చూసే అనుయాయుల వల్ల కలిగే తొడతొక్కిడిని తప్పించుకోవడానికి ఆయన హాయిగా ముందు సీటుకు మారిపోయారని అప్పట్లో ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా పనిచేసిన బాలాజీ చెబుతుండేవారు.

 

ఒకప్పుడు కారులో వెనుక సీటులో కూర్చునేవారే ఆ  కారుకు  యజమాని అని జనం భావించేవారు. ఇప్పుడా అభిప్రాయం  పూర్తిగా మారిపోయింది. మంత్రులుముఖ్యమంత్రులుశాసన సభ్యులు ఒకరేమిటి అంతా ఫ్రంటు సీటుకు అతుక్కుపోతున్నారు. టీవీ కెమెరా  యాంగిళ్లకి కూడా ఈ సీటే అనువుగా వుండడం ఒక కారణం అయితే దారివెంట ప్రజలకు అభివాదం చెయ్యడానికీరెండు వేళ్ళు విజయసూచిక మాదిరిగా ప్రదర్శించడానికీ ఫ్రంటు సీటే బెటరన్న నమ్మకం కుదరడం  మరో కారణం.

నేను రేడియోలో పనిచేసినప్పుడు వున్న పాత  సచివాలయ భవనాలు నాకు తెలిసే రెండు మార్లు తమ రూపురేఖలు మార్చుకున్నాయి. సరే, తెలంగాణా ఏర్పడ్డ తరవాత కేసీఆర్ హయాములో ఒక విశాలమైన ఆధునిక హంగులతో కూడిన రాజభవనాన్ని తలపించే రీతిలో సరికొత్త సచివాలయాన్ని నిర్మించారు.

పాత కాలం జర్నలిస్టులు తమ వృత్తి ధర్మం కోసం నడయాడిన నిజాం కాలం నాటి భవనాలలో కొన్ని అప్పటికే శిథిలావస్థకు చేరుకున్నాయి. విలేకరులకు కేటాయించిన భవనం వెనుకనే ఓ పాత భవనం మొదటి అంతస్తులో సీఎం  పేషీ వుండేది.  ఆ భవనాన్ని నిజాం బకింగ్ హాం ప్యాలెస్ నమూనాలో నిర్మించారని చెబుతారు. మొదటి అంతస్తు చేరుకోవడానికి వున్న చెక్క మెట్ల వరుస కూడా రాజమందిరాన్ని గుర్తుకు తెచ్చే విధంగా వుండేది. దాని రెయిలింగుకు వాడిన కలప ఎంతో ఖరీదయినది. 'మహోగని' అనే అరుదయిన వృక్షజాతికి చెందిన ఆ కలప బంగారం కంటే విలువయినదని చెబుతారు. ఫలక్ నామా ప్రాసాదంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, అతి పొడవైన భోజనాల బల్ల కూడా ఆ కలపతో తయారైనదే. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆయనకూ సచివాలయ ఉద్యోగులకూ నడుమ ఏదో పేచీ వచ్చి అందరూ ఆయన కార్యాలయంపై విరుచుకు పడ్డారు. ఆ సందర్భంలో మెట్లకు అమర్చిన రెయిలింగు దెబ్బతిన్నది. సచివాలయంలో పనిచేసే ఓ పాతకాలపు వడ్రంగి అది చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయ్యో అది బంగారం కంటే ఖరీదు, వీళ్ళెవ్వరికీ తెలిసినట్టు లేదు' అని వాపోయాడు.
సరే విషయానికి వస్తే,
నాలుగు దశాబ్దాలకు పూర్వం ఇప్పుడు ఉన్న  సచివాలయం ఫ్లై ఓవర్ లేదు. ప్రధాన ద్వారం కూడా హుస్సేన్ సాగర్ వైపున కాకుండా మెయిన్ రోడ్డు మీద వుండేది. ఇనుప చువ్వలతో కూడిన పెద్ద గేటు. ఆ గేటు దగ్గర ఇప్పట్లోలా మందీ మార్బలం వుండేది కాదు. ఒకళ్ళో ఇద్దరో సచివాలయం సిబ్బంది కాపలాగా వుండేవాళ్ళు. సచివాలయం బీట్  చూసే విలేకరులం అందరం ప్రతి రోజూ అక్కడ కలిసేవాళ్ళం.  ఎంట్రీ పాసు వున్నా కూడా లోపలకు వెళ్ళడానికి మొదట్లో బెరుగ్గా వుండేది. ఆదిరాజు వెంకటేశ్వర రావు గారు సీనియర్ జర్నలిస్టు. ఆయన పనిచేసే ఆంధ్రజ్యోతి ఆఫీసు సచివాలయం ఎదురుగానే వుండేది. ఆయన ఫుల్ సూటు ధరించి ఒక చేతిలో బ్రీఫ్ కేసు, మరో చేతి వేళ్ళనడుమ వెలుగుతున్న సిగరెట్టుతో దర్జాగా వస్తుంటే అల్లంత దూరం నుంచే కాపలాదారు గుర్తుపట్టి, సెల్యూట్ చేసి గేటు తెరిచేవాడు. విలేకరి జీవితం అలవాటు అయిన పిదప ఈ వైభోగం నాకూ పట్టింది అనుకోండి. విజిటింగ్ కార్డు అవసరం లేని విలేకరిగా అందరూ గుర్తుపట్టే పరిస్తితి వచ్చింది. చిత్రం ఏమిటంటే రేడియో స్టేషన్ దగ్గర కాపలా వాళ్ళు మాత్రం ప్రతిసారీ మీరు ఎవరి కోసం వచ్చారు అని అడిగేవారు. ఎందుకంటే నేను అక్కడ  గడిపేది కాసేపే.
సచివాలయంలో రోజువారీ విలేకరుల సమావేశాలు ముగిసిన తర్వాత  నడుచుకుంటూ రేడియోకి వెళ్ళేవాడిని. ఓ రోజు అలా వెడుతూ గోపీ హోటల్ (ఆ రోజుల్లో చాలా ఫేమస్. కామత్ హోటల్ ఎదురుగా ఓ పాత భవనంలో వుండేది) దాకా వచ్చాను. ఇంతలో సైరన్ మోగించుకుంటూ ఓ పోలీసు వాహనం వెళ్ళింది. కాసేపటికి మరో వాహనం నా పక్కగానే వెళ్లి  కొంత ముందుకు పోయి ఆగింది. అందులో నుంచి ముఖ్యమంత్రి భద్రతాధికారి బాలాజీ దిగి నా వైపుగా వచ్చాడు. సిఎం గారు కారులో వున్నారు అని చెప్పి ఎక్కించాడు. అది సరాసరి రేడియో స్టేషన్ ఆవరణలోకి వెళ్ళింది. ఈలోగా  ముందు వెళ్ళిపోయిన  పైలట్ కారు  వెనక్కి వచ్చింది. నన్ను దింపేసిన తర్వాత సీఎం కాన్వాయ్ తిరిగి వెళ్ళిపోయింది. చెప్పాపెట్టకుండా ముఖ్యమంత్రి రేడియో స్టేషన్ కి రావడం చూసి అందరూ నివ్వెర పోయారు.
నడిచి వెడుతున్న నాకు ఆఫీసుదాకా అడగకుండా లిఫ్ట్ ఇచ్చిన ఆ ముఖ్యమంత్రి ఎవరంటే ఆరణాల కూలీగా ప్రసిద్ధి చెందిన టి. అంజయ్య గారు.
ఆయన భోళాతనం, అమాయకత్వం రాజకీయ నాయకులకు వేళాకోళంగా అనిపించేవేమో కానీ సామాన్య జనం మాత్రం బాగా ఇష్టపడేవారు. మనసులో ఏదీ దాచుకునేవారు కాదు. మాటల్లో, చేతల్లో తానొక ముఖ్యమంత్రిని అనే అతిశయం, ఆర్భాటం కానవచ్చేది కాదు.
ఒకరోజు మెదక్ జిల్లా పర్యటనకోసం సచివాలయం నుంచి ముఖ్యమంత్రి బయలుదేరారు. నేనూ ఆయన కారులోనే వున్నాను. అప్పటికి ఖైరతాబాదు ఫ్లై ఓవర్ లేదు. కాన్వాయ్ రాజభవన్ రోడ్డులోకి ప్రవేశిస్తుండగా అంజయ్య గారు ఇక్కడెక్కడో మదన్ ఇల్లు ఉండాలే అన్నారు. మదన్ అంటే మదన్ మోహన్. అంజయ్య మంత్రివర్గంలో ముఖ్యుడు. ఆయన ఇంటికి పోదాం అని చెప్పడంతో కారును అటు తిప్పారు. ముఖ్యమంత్రి హఠాత్తుగా చెప్పాపెట్టకుండా రావడంతో అక్కడ సిబ్బంది కంగారుపడి మంత్రికి చెప్పారు. మదన్ మోహన్ గారు లోపల నుంచి హడావిడిగా బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి తాపీగా ‘మదన్! బాత్ర్రూం ఎక్కడ?’ అని అడిగి కాలకృత్యం తీర్చుకుని వచ్చారు. తర్వాత మదన్ మోహన్ గారి శ్రీమతి తయారు చేసిచ్చిన చాయ్ తాగి మళ్ళీ బయలుదేరారు. అలా వుండేది అంజయ్య గారి వ్యవహార శైలి. ఎలాంటి భేషజాలు లేని మనిషి.

కింది ఫోటో:




శ్రీ టి. అంజయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్న నాటి గవర్నర్ శ్రీ కేసీ. అబ్రహాం. వెనుక డిజీపీ ఎం. నారాయణ రావు గారు, తదనంతర కాలంలో డీజీపీగా, తమిళనాడు  గవర్నర్ గా పనిచేసిన శ్రీ పి.ఎస్. రామమోహన రావు గారు. వారి నడుమ చుబుకం మీద చేయి ఆనించుకుని నిలబడ్డది నేనే.

(ఇంకా వుంది)

9, జనవరి 2025, గురువారం

ఇదే నా తిరుపతి

 పూర్వం పిల్లలకు తల వెంట్రుకలు తీయించడానికి ఏడాదికో, రెండేళ్లకో తిరుపతి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరీక్షలకు ముందు, తరువాత, రిజల్ట్స్ రాకముందు వచ్చిన తరువాత - అన్ని కుటుంబాల వాళ్లు పోలో మంటూ తిరుపతి యాత్రలే. మరి రద్దీ పెరిగిందంటే పెరగదా!

ప్రోటోకాల్, వీవీఐపి దర్శనాలు  మూడు నెలలకు, లేదా ఆరు నెలలకు  ఒకసారి మాత్రమే అని నిబంధన విధించి, టెక్నాలజీ సాయంతో  అమలుచేస్తే రద్దీ సమస్య కొంత తగ్గుతుందేమో ఆలోచించాలి.

 అందుకే బాలాజీ దర్శనం చేసుకోవాలని అనిపించినప్పుడు హైదరాబాదులో మా అన్నయ్య కుమారుడు లాల్ బహదూర్ ఇంట్లో కొలువై వున్న ఈ వెంకన్నను  చూసివస్తాను. ఇదే నా తిరుపతి.




అయాం ఎ బిగ్ జీరో (62) - భండారు శ్రీనివాసరావు

 ఇంతకు  ముందే రాసినట్టు చాలామంది రాజకీయ నాయకులు వృత్తి రీత్యా నన్ను గుర్తు పెట్టుకునేవారు. అయితే వీరిలో టి. అంజయ్య తరహా వేరు. కేంద్రంలో సహాయ మంత్రిగా వున్న అంజయ్యను కాంగ్రెస్ అధిష్టానం చెన్నారెడ్డి స్థానంలో ముఖ్యమంత్రిగా నామినేట్ చేసింది. ఇందిరాగాంధి హయాములో ముఖ్యమంత్రులను శాసన సభ్యులు ఎన్నుకునే విధానానికి స్వస్తి వాక్యం పలికారు. ఢిల్లీలో నిర్ణయం అవుతుంది. తూతూ మంత్రంగా శాసన సభాపక్ష సమావేశం జరుగుతుంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులు శాసన సభ్యులతో కలివిడిగావిడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు సేకరిస్తారు. చివరకు శాసన సభాపక్షం సమావేశమై ముఖ్యమంత్రిని ఖరారు చేసే బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేస్తుంది. అది పట్టుకుని ఢిల్లీ వెళ్ళిన ప్రతినిధులు మళ్ళీ ఒక సీల్డ్ కవర్ పట్టుకుని హైదరాబాదు వస్తారు. ఆ కవరులో వున్న పేరును ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారు. అందరూ చప్పట్లు కొట్టి ఆమోదిస్తారు. చిత్రం ఏమిటంటే అప్పటివరకు ఆ పదవికోసం  తీవ్రంగా ప్రయత్నాలు చేసిన నాయకుడి చేతనే సీల్డ్ కవర్ అభ్యర్ధి పేరు ప్రతిపాదింపచేస్తారు.  ఇదొక తంతు. తప్పనిసరి తంతు అని అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తూ వచ్చిన ఈ సీల్డ్ కవర్ విధానాన్ని తప్పు పడుతూ వచ్చిన ప్రతిపక్షాలు కూడా తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే విధానాన్ని అనుసరిస్తూ రావడం మన ప్రజాస్వామ్యంలోని చమత్కారం. టీడీపీ అధినాయకుడు ఎన్టీఆర్ ఈ సీల్డ్ కవర్ విధానాన్నిజిల్లాపరిషద్ చైర్మన్ఎన్నికలకు కూడా వర్తింపచేశారు.  రాజకీయాల్లో ఒకటే రూలు. అధికారంలోకి రావడానికి కొన్ని మాటలు చెప్పాలి. అలా దక్కిన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కొన్ని కాని పనులు చేయాలి. ఇది అన్నిపార్టీలకు వర్తించే సార్వత్రిక సూత్రం.

సరే! తరువాత ముఖ్యమంత్రి అంజయ్య అని అందరికి తెలిసిపోయింది. కొందరు సీనియర్లు తమకు అవకాశం తప్పిపోయినందుకు బాధ పడ్డారు. మరికొందరు అంజయ్య లాంటి వాడు  అయితేనే మంచిది, తమ చెప్పుచేతల్లో వుంటాడని భ్రమ పడ్డారు.

అంజయ్యగారు కేంద్ర మంత్రిగా వున్న కాలంలో అనేక సార్లు హైదరాబాదు వచ్చారు కానీ నేను వెళ్లి కలుసుకుంది లేదు. ముఖ్యమంత్రిగా నామినేట్ అయిన తరువాత కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి అంబాసిడర్ కారులో అసెంబ్లీకి వచ్చారు మెట్లు ఎక్కుతుంటే నేను కనపడ్డాను. ఏం శ్రీనివాస్! బాగున్నావా! అని ఆప్యాయంగా పలకరించారు. అన్నేళ్ల విరామం తర్వాత నేను ఆయనకి పేరుతొ సహా గుర్తున్నందుకు  సంతోషపడాలో, ఆయన మంచితనాన్నిపొగడాలో తెలియని అయోమయంలో పడిపోయాను.

కాంగ్రెస్ సంస్కృతి ప్రకారం జరగాల్సిన తంతు అంతా జరిగిపోయింది. కాకపోతే ఒక చిన్న మినహాయింపు. సీల్డ్ కవర్ గొడవ లేకుండా, పరిశీలకులు ఢిల్లీలో ఇందిరాగాంధీతో ఫోన్లో మాట్లాడి, సీ ఎల్ పీ నాయకుడుగా అంజయ్య ఎన్నిక అయినట్టు ప్రకటించారు. మళ్ళీ ఇలా జరగడం నాకు తెలిసి, 2004 లో ముఖ్యమంత్రిగా  వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఎన్నిక ఇలానే పెద్ద తంతు లేకుండా ముగిసింది.

ఓ రోజు ముఖ్యమంత్రి అంజయ్య గారు సచివాలయంలో నలుగురితో మాటా మంతీ సాగిస్తున్న సమయంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. ఆయన తత్తరపడుతూ లేచి వున్నపాటున బరకత్ పురాలో వున్న తన ఇంటికి బయలుదేరారు. అప్పటికి అంజయ్య గారు అధికార నివాసం గ్రీన్ లాండ్స్ (ముద్దుగా ఆయన పెట్టుకున్న పేరు ‘జయ ప్రజా భవన్) కి మకాం మార్చలేదు. బరకత్ పురాలో హౌసింగ్ బోర్డ్ వారి టూ ఆర్ టీ ఇంట్లోనే వుంటున్నారు. ఇప్పటి రోజులతో పోలిస్తే అది ఒక విడ్డూరమే. ఆ చిన్న ఇంటిపైనే గది మీద గది నిర్మించుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఇరుకుగా వుంటుంది. మెట్లు కూడా సౌకర్యంగా వుండవు.

సరే! అంజయ్య గారు హడావిడి పడుతూ ఇంటికి వెళ్ళి ఆయాసపడుతూ మెట్లెక్కినప్పుడు కనబడ్డ దృశ్యం ఈనాటి ఛానళ్ళకు దొరికివుంటే పండగే పండగ. రాజీవ్ గాంధీ అక్కడి చిన్న గదిలో అంతకంటే చిన్న కుర్చీలో కూర్చుని తనను పీక్కుతింటున్న దోమల్ని తోలుకునే పనిలో నిండా మునిగి తేలుతున్నాడు. అసలే పండంటి మనిషి. లేత శరీరం. ఆయన మొహం మీద దోమ కాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అసలు జరిగిన విషయం ఏమిటంటే, ప్రధాని ఇందిరా గాంధి తనయుడు ఇండియన్ ఎయిర్ లైన్స్ లో   పైలట్ గా పనిచేస్తున్నారు. రాజీవ్ గాంధీ పైలట్ గా హైదరాబాదు వచ్చిన విమానంతిరిగి వెళ్ళడానికి బాగా వ్యవధానం వున్నట్టుంది. యెందుకు అనిపించిందో తెలియదు కానిఆయన బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఎవర్నో అడిగి ఓ కారు తీసుకుని నేరుగా బరకత్ పురాలోని అంజయ్య గారి నివాసానికి వెళ్ళిపోయారు. ఈ కబురు అందిముఖ్యమంత్రిగారు ఆఘమేఘాలమీద ఇంటికి వచ్చేసరికి ఇదీ సీను.

'అమ్మ ఇచ్చిన ఉద్యోగంఇది అని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిగా  అంజయ్య గారు ఏనాడు నామోషీ పడలేదు. పైగా కూసింత గర్వంగా చెప్పుకునేవారు. రాజీవ్ గాంధీ ఆయన ఇంటిని చూసి వాళ్ల అమ్మ సెలెక్షన్ మంచిదే అనుకుని కూడా వుంటారు. కాకపొతే పేరడీ ఏమిటంటే అంజయ్య గారి ముఖ్యమంత్రి పదవి వూడడానికి కూడా తదనంతర కాలంలో రాజీవ్ గాంధీయే కారణం అయ్యారు.

పోతే! పైకి చెప్పకపోయినా ఇది చదివే వారికి ఓ  సందేహం తొలుస్తుండవచ్చు. ఇదంతా మీకెలా తెలుసనీ.

ఆ రోజుల్లో నేను  రేడియో రిపోర్టర్ గా వుండేవాడిని. కారణం చెప్పలేను కాని అంజయ్యగారికి  నేనంటే అవ్యాజానురాగం. నేను కాసేపు దగ్గర్లో కనబడకపోతే చాలు  ఆయనగారికి క్షణం తోచేది కాదు. ‘శ్రీనివాస్ ఏడీ’ అని సొంత సిబ్బందిని ఆరా తీయడం ఆయనకు అలవాటు. అంచేత ఆరోజు నేను కూడా అంజయ్య గారి వెంటే వున్నాను. అదన్న మాట.

 

 

కింది ఫోటో:





(ఏదో సినిమాలో రాళ్ళపల్లి చెప్పినట్టు టేప్ రికార్డర్ పట్టుకుని ఈ పక్కన నేను, ఆ పక్కన అంజయ్య గారు. మా మధ్యలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ చైర్మన్  శ్రీ వై.ఎస్.ఎన్. మూర్తి)

(ఇంకా వుంది)        

అయాం ఎ బిగ్ జీరో (61) - భండారు శ్రీనివాసరావు

 

1975 లో పుట్టి 1985 లో చనిపోయాను.

అంటే వెలుగు జిలుగుల ప్రభలు విరజిమ్మిన రేడియో  విలేకరిగా నా వృత్తి  జీవితం అంతలో ముగిసిందన్నది నా కవి హృదయం. విలేకరిగా ఒక వెలుగు వెలిగింది నిజానికి ఆ పదేళ్లే!

మళ్ళీ ఈ పదేళ్ళలో  స్వర్ణ యుగం, అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్న పద్దెనిమిది నెలల కాలం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలో వున్నది ఏడాది మీద 136 రోజులు. ఆయనకు ముందు దాదాపు రెండున్నర సంవత్సరాలు దుర్నిరీక్షంగా పరిపాలన సాగించిన మర్రి చెన్నారెడ్డి గారి స్థానంలో కాంగ్రెస్ అధిష్టానం, ఆరణాల కూలీగా ప్రసిద్ధి చెందిన టంగుటూరి అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. రాష్ట్రానికి చెందిన అతిరథమహారధులైన కాంగ్రెస్ నాయకులను పక్కనబెట్టి అంజయ్యను ఎంపిక చేయడం అందర్నీ ఆశ్చర్యపరచింది.

రేడియో విలేకరిగా చాలామంది రాజకీయ నాయకులు పరిచయం అవుతూ వుంటారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అందులో కొంతమంది మాత్రమే మనల్ని  గుర్తు పెట్టుకుంటారు. మనకి  గుర్తుంటారు. వారిలో ప్రథముడు శ్రీ అంజయ్య. నాకే కాదు, హైదరాబాదులో విలేకరులు అందరికి ఆయన ఆప్తుడు. పేరు పెట్టి విలేకరులను పలకరించే భేషజాలు తెలియని రాజకీయ నాయకుడు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి తెలుసు. వెంగళరావు మంత్రివర్గంలో పనిచేసిన మండలి వెంకట కృష్ణారావు గారు, భాట్టం శ్రీరామ మూర్తి గారు, కేవీ కేశవులు గారు, హయగ్రీవాచారి గారు  ఇదే కోవలోకి వస్తారు. వార్తలు లేని రోజుల్లో వీరిలో ఎవరి దగ్గరకు వెళ్ళినా ఏదో వార్త చెప్పకుండా పంపరు. తినడానికి ఏదో పెట్టకుండా వదలరు. వీరిలో భాట్టం గారు, హయగ్రీవాచారి గారు ఇంటి నుంచి చిట్టి గారెలు, పులిహోర  వంటివి వండించి సచివాలయంలో విలేకరులను పిలిచి సంతర్పణ చేసేవారు. వీరిని గురించి కొంత చెప్పుకోవాలి.

తానమ్మిన సత్యాన్నే బోధించిన ధీశాలి, బోధించిన సత్యాన్నే పాటించిన వ్రతశీలి' అనే దానికి నిలువెత్తు నిర్వచనం శ్రీ భాట్టం శ్రీరామమూర్తి. నిండు జీవితం గడిపి, గడిపిన జీవితానికి చరితార్ధత కల్పించిన ధన్యజీవి. జయప్రకాష్ నారాయణ్, రాంమనోహర్ లోహియా వంటి అగ్రనేతలకు సన్నిహితుడిగా మెలిగిన ఈ పాత తరం   వృద్ధ రాజకీయవేత్త, మారిన రాజకీయాన్ని, మారిన విలువలను  కళ్ళారా చూసి, తాను మాత్రం మారకుండా   తన ఎనభయ్ తొమ్మిదో ఏట విశాఖపట్నంలో  కన్ను మూశారు. 1926 లో ధర్మవరం గ్రామంలో, ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో, నన్నయ పంతులు, తరుణమ్మల సంతానంగా   జన్మించిన భాట్టం శ్రీరామమూర్తి,  స్వయం కృషితో ఎదిగి  ఇరవై ఏళ్లకు పైగా శాసన సభ్యుడిగా పనిచేశారు. 1957లో జరిగిన విజయనగరం అసెంబ్లీ  ఉపఎన్నికలో శ్రీ భాట్టం శ్రీరామమూర్తి, సోషలిష్టు పార్టీ అభ్యర్ధిగా ఏకగ్రీవంగా ఎన్నికయి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టారు. అంతకుముందు ఎమ్మెల్యేగా వున్న శ్రీ పీవీజీ రాజు లోకసభకు ఎన్నిక కావడంతో ఈ ఉప ఎన్నిక అవసరం అయింది. ఆ తరువాత 1962 లో జరిగిన ఎన్నికల్లో కూడా భాట్టం అదే నియోజక వర్గంనుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి  అసెంబ్లీకి రెండో పర్యాయం ఎన్నికయ్యారు. తరువాత విశాఖ జిల్లా పరవాడ నియోజకవర్గం నుంచి వరసగా రెండు సార్లు (1972, 1978)కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు.  ఎనిమిదేళ్ళు మంత్రిగా, ఒక పర్యాయం లోకసభ సభ్యుడిగా వున్నారు. శ్రీ పీవీ నరసింహారావు, శ్రీ జలగం వెంగళరావు, శ్రీ మర్రి చెన్నారెడ్డి, శ్రీ అంజయ్య మంత్రివర్గాల్లో శ్రీరామమూర్తి కీలకమైన వివిధ శాఖలు నిర్వహించారు. రెండు ప్రపంచ తెలుగు మహాసభలు ఆయన సారధ్యంలోనే జరిగాయి. కౌలాలంపూర్ లో నిర్వహించిన ప్రపంచ సభలకు నాటి విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు కారణాంతరాలవల్ల వెళ్ళలేక పోవడంతో సాంస్కృతిక శాఖ మంత్రిగా వున్న శ్రీ భాట్టం ఆ సభల్లో కీలక ప్రసంగాలు చేసి సభికులను తన అసాధారణ వక్తృత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారు. పీవీ మంత్రివర్గంలో వున్న ఈ ఇద్దరు మంత్రుల్ని 'జంట కవులు' అని పిలిచేవాళ్ళు. తరువాత వెంగళరావు ముఖ్యమంత్రి అయినప్పుడు వీరి శాఖల్ని మార్చి ఒకరిది మరొకరికి కట్టబెట్టారు. 'జలగం గారు  మాకు కుండ మార్పిడి చేశారు' అనేవారు శ్రీరామ మూర్తిగారు హాస్యోక్తిగా.    

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. శ్రీ భాట్టం శ్రీరామమూర్తి వ్యక్తిత్వం నచ్చిన నాటి టీడీపీ అధ్యక్షుడు శ్రీ ఎన్టీ రామారావు, ఆయన్ని తమ పార్టీలోకి ఆహ్వానించారు. 1984లో టీడీపీ టిక్కెట్టు మీద శ్రీ శ్రీరామమూర్తి, విశాఖ నియోజకవర్గం నుంచి  తొలిసారి లోకసభకు ఎన్నికయి పార్లమెంటులో తన స్వరం వినిపించారు.  

 

 

రాజకీయ జీవితంలో డబ్బుకు దూరంగా, ప్రజలకు దగ్గరగా గడిపిన చరిత్ర శ్రీ శ్రీరామమూర్తిది. రాజకీయ శత్రువులు సయితం ఆయన నిజాయితీని శంకించలేని స్తితి.  హోదాలు కోరుకోలేదు. ఆస్తులు కూడబెట్టలేదు. విశాఖపట్నంలో ఏ చిన్న ఇంట్లో వున్నారో, జీవిత చరమాంకం వరకు అదే ఇంట్లో గడిపారు.    మంత్రిగా వున్నప్పుడు అత్యంత నిరాడంబరంగా కుమారుడు విద్యాసాగర్  పెళ్లి చేశారు. ఆ పెళ్ళికి శుభలేఖలు కూడా అచ్చు వేయించలేదు. తన కుటుంబసభ్యులను తీసుకుని ఒక ప్రైవేటు వాహనంలో పెళ్ళికి వెళ్ళి వచ్చారు. డాబూ దర్పాలూ లేవు, వందిమాగధులూ లేరు. అదీ భాట్టం శ్రీరామమూర్తి గారు  పాటించిన జీవన విధానం.

తాను నమ్మింది ఆచరించి చూపడం అన్నది శ్రీరామ మూర్తి గారు తన పెళ్ళిలో కూడా ప్రదర్శించి చూపారు. ఆయనది కులాంతర వివాహం. మద్దూరి అన్నపూర్ణయ్య గారి పౌరోహిత్యంలో శ్రీమతి సత్యవతితో జరిగిన ఆ పెండ్లితంతుకయిన ఖర్చు కేవలం పదిహేను రూపాయలు.          

 ఒక పర్యాయం లోకసభ సభ్యుడిగా పనిచేసిన తరువాత మరో సారి శ్రీ రామారావు విశాఖ నుంచి రెండో మారు పోటీ చేయాలని  శ్రీ శ్రీరామ మూర్తిని  కోరారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్న శ్రీ భాట్టం, రామారావుగారి కోరికను సున్నితంగా తిరస్కరించారు. అప్పటినుంచీ ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా, ఆధ్యాత్మిక వ్యవహారాలకు దగ్గరగా  వుంటూ వచ్చారు. ఏళ్ళు మీద పడి, కాళ్ళూ చేతులూ సరిగా ఆడని వాళ్లు కూడా పదవులకోసం వెంపర్లాడుతున్న ఈ రోజుల్లో భాట్టం వంటి వారిని ఊహించుకోవడం కూడా కష్టం. అంతేకాదు, అయన తన కుటుంబ సభ్యులనెవ్వరినీ రాజకీయాల్లో ప్రోత్సహించలేదు. తన టిక్కెట్టు తన భార్యకు ఇమ్మని కూడా దేబిరించలేదు. ఆ పుణ్యాత్మురాలు సత్యవతి గారు కూడా భర్తకు తగ్గ భార్య. ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా, ఆశయాలకు తగినట్టుగా ఆయన వెంట నడిచారు.

భాట్టం శ్రీరామ మూర్తి గారు  మిత్రుల కోరికపై తన ఆత్మ కధ రాశారు. దానికి అయన పెట్టుకున్న పేరు 'స్వేచ్చాభారతం'.  సాధారణంగా రాజకీయ నాయకులు రాసే ఆత్మ కధల్లో 'ఆత్మ స్తుతి పరనింద' తొణికిసలాడతాయి. కానీ భాట్టం తరహానే వేరు. ఆయన అన్ని విషయాలు చాలా నిక్కచ్చిగా రాసుకున్నారు.

చివర్లో తనకు తానే 'తుది పలుకులు' కూడా  రాసుకున్నారు.

'కోహం (నేనెవర్ని) అంటూ పుట్టావు. సోహం (నేనే నువ్వు అంటే భగవంతుడు)  అంటూ ఆ ఎరుకతో మరణించు. పుట్టిన చోటు చేరడానికి  ఏడుపెందుకు?'      

శ్రీ భాట్టం శ్రీరామ మూర్తికి ఒకనాటి రాజకీయ సహచరుడు, ముఖ్యమైన స్నేహితుడు కీర్తిశేషులు మండలి వెంకట కృష్ణారావు. అయన కుమారుడు  శ్రీ మండలి బుద్ధ ప్రసాద్  ఈ గ్రంధానికి 'ముందు మాట' రాశారు. మహాకవి,  సంస్కృత పండితుడు భవభూతి సూక్తిని శ్రీ బుద్ధ ప్రసాద్ అందులో ఉటంకించారు.

'కాలో హ్యయం నిరవధి:, విపులాచ పృధ్వీ'. విశాలమైన విశ్వంలో, అనంతమైన కాలంలో అసంఖ్యాక ప్రజానీకం పుడుతూ వుంటుంది. గిడుతూ వుంటుంది. వాళ్ళంతా ఎవరికి తెలుసు ? కొద్ది మంది పేర్లే మనం తలచుకుంటూ వుంటాం.'

ఆ కొద్దిమందిలో ఒకరు శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి. 

కింది ఫోటో:



(నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విశాఖ వచ్చిన సందర్భంలో ఆ నాటి ముఖ్యమంత్రి  కాసు బ్రహ్మానందరెడ్డితో భాట్టం శ్రీరామ మూర్తి)

 

(ఇంకావుంది)  

8, జనవరి 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (60) - భండారు శ్రీనివాసరావు

 


 

పురుషులలో ఉత్తమ పురుషుల మాదిరిగా జర్నలిష్టులలో హిందూ విలేకరులను అలా పరిగణించే రోజులు నాకు తెలుసు.
అలాంటి ఒకానొక రోజుల్లో హిందూ కరస్పాండెంట్ (ముందు ముందు విలేకరి అంటాను, టైప్ చేయడం ఇబ్బందిగా వుంది) గా పనిచేస్తున్న దాసు కేశవరావు అనే చిన్నగా కనబడే ఈ పెద్దమనిషికి, కొన్ని రోజులపాటు నా చిలిపితనాన్ని భరించాల్సిన పరిస్తితి ఏర్పడింది. దీనికి కారణం ఆ నాటి రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి.

సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి అయిన తర్వాత తొలిసారిగా అనంతపురం వచ్చారు. ఆ పట్టణానికి దగ్గరలోనే వారి స్వగ్రామం ఇల్లూరు వుంది. అనంతపురంలో ఉన్న వారి సొంత ఇల్లు తాత్కాలికంగా రాష్ట్రపతి నిలయం అయింది. అంతటి పెద్దాయన మొదటిసారి సొంతూరు వస్తుంటే పత్రికలు ఊరుకుంటాయా! హైదరాబాదు నుంచి విలేకరులను పంపించాయి. ఇక ఆకాశవాణి సంగతి చెప్పేదేముంది. నేనూ వాలిపోయాను.

అనంతపురంలో మెయిన్ రోడ్డుపైనే ఉన్న హోటల్లో మా బస. చెప్పానుకదా నాకు చిలిపితనం ఓ పాలెక్కువ అని. దాసు కేశవరావు గంగిగోవు లాంటి జర్నలిష్టు. మేమిద్దరం చాలా ఏళ్ళుగా స్నేహితులం. అంచేత నా గోల ఆయన మౌనంగా భరించేవాడు.
ఇద్దరమూ బయటకు పోయేవాళ్ళం. కాసేపు అటూ ఇటూ తిరిగేవాళ్ళం. మధ్యలో ఓ పబ్లిక్ కాల్ ఆఫీసు నుంచి నేను హోటల్ రిసెప్షన్ కు ఫోను చేసేవాడిని.
రాష్ట్రపతి క్యాంప్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాము. మీ హోటల్లో, కేశవరావు, శ్రీనివాసరావు, హైదరాబాదు జర్నలిష్టులు వుంటే ఒకసారి కనెక్ట్ చేస్తారా! అర్జంటుగా మాట్లాడాలి’ అనే వాడిని.
హోటల్లో అడుగుపెడుతూ ఉండగానే మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ‘మీకోసం ప్రెసిడెంటు గారి ఆఫీసు వాళ్ళు ఫోన్ చేసారు’ అని చెప్పేవాళ్ళు ఆదుర్దాగా.
వాళ్ళు అలానే చేస్తారు. అవసరం వుంటే మళ్ళీ వాళ్ళే చేస్తారు, ఏం పర్వాలేదు’ అనేవాడిని నిర్లక్యంగా.
ఈ ట్రిక్కు బాగా పనిచేసింది. ఆ రోజు నుంచీ హోటల్లో మాకు మర్యాదలు పెరిగాయి. ఉదయం సాయంత్రం కనుక్కునేవారు. రూమ్ సర్వీసు బాగు పడింది.
ఇది అవసరమా’ అనేది కేశవరావుగారిలోని గంగిగోవు. ‘అవసరమే’ అనేది నాలోని పోట్లగిత్త.

ఒక రోజు ఇల్లూరు ప్రయాణం కట్టాము. ఎందుకంటే సంజీవరెడ్డి గారు అక్కడికి బయలుదేరారు.

సందర్భం కనుక, ఇల్లూరు చేరేలోగా  నీలం సంజీవరెడ్డి గారి గురించి క్లుప్తంగా నాలుగు ముక్కలు.

1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత నీలం సంజీవరెడ్డి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. బస్సుల జాతీయకరణ అంశంలో నాయస్థానం తప్పుపట్టిన చిన్న కారణంతో మనస్తాపం చెందిన సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడాన్ని రాజకీయాల్లో నైతిక విలువల ప్రస్తావన వచ్చినప్పుడల్లా రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తుంటారు. నిజాయితీ విషయంలో ఆయన్ని ప్రత్యర్థులు కూడా తప్పుపట్టలేరు. లోక సభ స్పీకర్ గా ఎన్నికయినప్పుడు వెంటనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిష్పక్షపాతంగా సభని నిర్వహించేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు.

దేశ రాజకీయాలను మలుపు తిప్పిన ఒక పరిణామంలో సంజీవరెడ్డి గారు ఒక భాగస్వామి. 1969 లో  రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణం తర్వాత రాష్ట్రపతి అభ్యర్ధిగా సంజీవరెడ్డిని నాటి పాలకపక్షం అయిన కాంగ్రెస్ అధిష్టానం నామినేట్ చేసింది. అయితే పార్టీలో తన ఆధిపత్యాన్ని రుజువు చేసుకునేందుకు నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఇండిపెండెంట్ అభ్యర్ధి వీవీ గిరికి మద్దతు పలకడంతో ఆయన గెలవడం, పార్టీ అధికార అభ్యర్ధి సంజీవరెడ్డి పరాజయం పాలవడం జరిగింది. దానితో ఖిన్నుడైన సంజీవరెడ్డి గారు, రాజకీయాలను వదిలిపెట్టి అనంతపూర్ కు వచ్చి వ్యవసాయంలో నిమగ్నం అయ్యారు. 1977 లో జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ఏర్పడ్డ జనతా పార్టీలో చేరి నంద్యాల నుంచి పోటీ చేసి లోకసభకి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికయిన మొత్తం  42 మంది అభ్యర్ధులలో ఈయన ఒక్కరే కాంగ్రెసేతర  అభ్యర్ధి. అయితే ఆ  ఎన్నికల్లో కేంద్రంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు ఆయన్ని లోక సభ స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తరువాత జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్ధిగా ఏకగ్రీవంగా గెలిచి 1977 జులై 25 న రాష్ట్రపతిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పోటీ లేకుండా రాష్ట్రపతి పదవికి ఎన్నికయిన ఘనత కూడా ఆయన ఖాతాలో చేరింది. 64 ఏళ్ల అతితక్కువ  పిన్న వయస్సులో అత్యంత ఉన్నత పదవికి ఎన్నికయిన కీర్తి కూడా సంపాదించుకున్నారు. రాష్ట్రపతిగా తన పదవీ కాలంలో ఆయన ముగ్గురు ప్రధానులు, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ లతోనే కాకుండా, ఒకనాడు రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటమికి కారకురాలైన  ఇందిరా గాంధీతో కూడా  కలిసి పనిచేయడం విశేషం.

ఇల్లూరులో నీలం వారిల్లు పెళ్లివారిల్లులా హడావిడిగా వుంది. తన ఈడువారిని ఆయన ఆప్యాయంగా ‘ఏమప్పా’ అంటూ పేరుపెట్టి పలకరిస్తున్నారు. చిన్నవారితో ఎప్పటి సంగతులో ముచ్చటిస్తున్నారు. వూరు ఊరంతా అక్కడే వుంది.
సాయంత్రం ఆరవుతోంది. నేను వారింటి నుంచే హైదరాబాదు ఫోన్ చేసి వార్త చెప్పాను. రాష్ట్రపతి మకాం చేస్తున్న సందర్భం కాబట్టి వెంటనే లైను కలిపారు. అది మొదటి వార్తగా వస్తుందని నాకు తెలుసు. వెంటనే సంజీవరెడ్డి గారిని ( రాష్ట్రపతి కార్యదర్శి పేరు కూడా సంజీవరెడ్డే. పీ.ఎల్. సంజీవ రెడ్డి గారు. ఐ.ఏ.ఎస్. అధికారి)ని ఒక రేడియో తెప్పించమన్నాను. ఆయన నావైపు అదోలా చూస్తూ రేడియో తెప్పించారు. దాన్ని అక్కడ ఉన్న మైక్ సెట్టుకు కలిపారు.
వార్తలు మొదలయ్యాయి. అంతా నిశ్శబ్దం. రాష్ట్రపతి స్వగ్రామం వచ్చిన వార్తా విశేషాలతో బులెటిన్ మొదలయింది.
ఈ మారుమూల గ్రామంలో వార్త ,అంత త్వరగా రేడియోలో ఎలా వచ్చిందని జనం ఆశ్చర్యంగా గుసగుసలాడుకున్నారు.
నేను ఇప్పటికీ గర్వపడే మరో విషయం ఏమిటంటే, ఆ నాటి శ్రోతల్లో నీలం సంజీవ రెడ్డి గారు కూడా ఒకరు.
ముందు కొంచెం రుసరుసలాడినట్టు కనిపించిన పీ.ఎల్. సంజీవరెడ్డి గారు కూడా ఖుషీ.
భుజం తట్టారు, మెచ్చుకోలుగా.

దేశ, రాష్ట్ర  రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి 1996 లో తన 83 వ ఏట బెంగుళూరులో కన్నుమూశారు.

 

కింది ఫోటో :



నాటి రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి

 

(ఇంకా వుంది)