29, అక్టోబర్ 2024, మంగళవారం
ఆరు ఆటంబాంబులతో కాపురం
28, అక్టోబర్ 2024, సోమవారం
నడిచి వచ్చిన దారి – భండారు శ్రీనివాసరావు
ఇక్కడి నా మిత్రులలో అన్ని వయసులవాళ్ళు ఉన్నప్పటికీ చాలామంది కొంచెం అటూఇటూగా నా ఈడువాళ్ళే. నా తరం వాళ్ళే. కాబట్టి మా పెంపకాల్లో, జీవన విధానాల్లో కొంచెం పోలికలు కనిపిస్తాయి. మొదటి మెట్టు మీద కాలు మోపిన దగ్గరినుంచి పడిన కష్టాలు, ఇబ్బందులు ఇప్పుడు పై మెట్టు మీద నిలబడి చూసుకుంటూ వుంటే చాలా వింతగా వుంటుంది. నడిచి వచ్చినదారి ఇలాంటిదా అని ఆశ్చర్యం వేస్తుంది.
తెలంగాణా సీ ఎం కేసీఆ ర్ వద్ద సీ పీ ఆర్వో గా పనిచేసిన వనం జ్వాలా నరసింహారావు, మా అన్నయ్య భండారు రామచంద్ర రావు గారు (స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్, రిటైర్డ్) నేను కొద్ది సంవత్సరాల తేడాతో హైదరాబాదులో కాపురాలు పెట్టాము. ఈ విషయంలో జ్వాలా సీనియర్. ఆయన భార్య అయిన మా మేనకోడలు విజయలక్ష్మి, మా వదిన గారు విమల, మా ఆవిడ నిర్మల కలిసి చిక్కడపల్లిని కాలినడకన చుట్టబెట్టేవారు. మా అన్నయ్య అప్పటికే స్టేట్ బ్యాంకులో రీజినల్ మేనేజర్. . ఉద్యోగ రీత్యా ఎన్నో వ్యాపార సంస్థలకు రుణాలు ఇచ్చి వుంటారు. కానీ ఆయన అశోక్ నగర్ లో తన ఇంటికి దగ్గరలో వున్న కిరాణా దుకాణంలో రెండు వందలు ఖాతా పెట్టాల్సి వస్తే, తెలిసిన వాళ్ళు ఎవరైనా చెబితే ఇస్తాను అన్నాడు ఆ దుకాణదారు. చివరికి అదే ఏరియాలో ఉంటున్న మా పెద్ద మేనకోడలు కూతురు చిన్నపాప సిఫార్స్ మీద ఆ రెండు వందలు అప్పు పుట్టిందట.
మా మేనకోడలు , మా వదిన గారు అశోక్ నగర్ నుంచి నడుచుకుంటూ త్యాగరాయ గానసభ దగ్గర వున్న మా ఇంటి (అమ్మవొడి)కి వచ్చి మా ఆవిడను తీసుకుని సరుకులు కొనడానికి చిక్కడపల్లి మెయిన్ రోడ్డుకు వెళ్ళేవాళ్ళు.
ఎండ బాగా వుంటే ముగ్గురూ కలిసి ఒక రిక్షా మాట్లాడుకుని మధ్యలో మా ఆవిడను దింపేసి వాళ్ళిద్దరూ అశోక్ నగర్ వెళ్ళేవాళ్ళు.
లక్ష్మీ షో రూములో వాయిదాల మీద చీరెలు కొనుక్కునే వాళ్ళు.
ఆ రోజుల్లో లోటస్ స్టీల్ షాపులో నెలకు పది రూపాయలు చొప్పున పది నెలలు కడితే నెలకోసారి లాటరీ తీసి వంద రూపాయల స్టీలు వస్తువు ఇచ్చేవాడు. ప్రతినెలా ఆ షాపు దగ్గరికి పోవడం, బోర్డు మీద చాక్ పీసుతో రాసిన విజేతల జాబితాలో తమ నెంబరు లేకపోవడం, ఉసూరుమంటూ తిరిగివస్తూ సుధా హోటల్లో టు బై త్రీ కాఫీ తాగడం నెలనెలా ఓ తంతుగా మారింది.
ఇంట్లో అందరి పేరు మీద కట్టినా, లాటరీ ఎప్పుడూ తగలకపోవడంతో, మా వదిన గారు ఓ నెల, మా రెండో పిల్లవాడు సంతోష్ పేరు మీద కడితే మూడో నెలలోనే లాటరీ తగిలిందట. వంద రూపాయల వస్తువు తీసుకుంటూ, మా వాడికి కూడా, పాలు పట్టడానికి ఓ స్టీలు గ్లాసు కొనిచ్చింది.
ఆ రోజుల్లో ఇలా ఇబ్బందులు అందరికీ ఉండేవి కానీ, అవి ఇబ్బందులుగా అనిపించక పోవడానికి కారణం అందరూ ఒకే బోటులో ప్రయాణీకులు కావడమేమో మరి!
న్యూ ఇయర్ గిఫ్ట్ ల కింద జర్బలిష్టులకు యెంత ఖరీదయిన డైరీలు వచ్చినా వాటిల్లో చాలామంది (వారి భార్యలు) రాసుకునేవి కిరాణా పద్దులే. ఎందుకంటే రాసేదంతా ఆఫీసులోనే రాసి వస్తారు కాబట్టి ఇక సొంత గోల రాసుకోవడానికి ఓపికా వుండదు. రాయడానికి విషయాలు వుండవు.
అలా 1973 లో మార్చి నెల 31 వ తేదీన మా ఆవిడ డైరీలో రాసిన ఒక రోజు ఖర్చు చిట్టా ఇది. (అంటే యాభయ్ ఏళ్ళ కిందటి మాట అన్నమాట)
నూనె : Rs.3-25
నెయ్యి: Rs. 2-75
పెరుగు: Rs.0-20
టమాటాలు: Rs. 0.55
అగ్గిపెట్టె: Rs. 0.10
సబ్బు: Rs.1-00
రిక్షా: Rs. 0-50
వక్కపొడి పొట్లం: Rs. 0-10
(NOTE: నూనె, నెయ్యి కూడా రోజువారీగా కొని సంసారం నడిపిందేమో తెలవదు. ఎందుకంటే జర్నలిష్టులకు ఇల్లు పట్టదు. అంతా ఐ నో సీ ఎం - ఐ నో పీఎం బాపతు)
24, అక్టోబర్ 2024, గురువారం
కన్నకూతురు కాదు, కానీ కన్న బిడ్డే
23, అక్టోబర్ 2024, బుధవారం
అత్యాశ కాదంటారా
14, అక్టోబర్ 2024, సోమవారం
అతి వర్జయేత్!
డ్రైవర్ పక్క ఫ్రంటు సీటు
12, అక్టోబర్ 2024, శనివారం
అటు నేనే ఇటు నేనే
11, అక్టోబర్ 2024, శుక్రవారం
గుడ్డుగారికో రోజు
9, అక్టోబర్ 2024, బుధవారం
డ్రైవర్ లేని కారు
కొత్త ఏదైనా కొంత కాలం వింతే! - భండారు శ్రీనివాసరావు
మొన్న అమెరికా వెళ్ళినప్పుడు మా మూడో
అన్నయ్య కనిష్ట కుమారుడు సత్యసాయి ఇంట్లో కొన్నాళ్ళు వున్నాను. వాడి కొడుకు శైలేష్ అక్కడ వున్నన్ని రోజులు
నన్ను వాళ్ళ కారులో తిప్పాడు.
ఆ కారుకు డ్రైవర్ అవసరం వుండదు. అన్నీ
కంప్యూటరే చూసుకుంటుంది. కారెక్కి ఎక్కడికి వెళ్ళాలో సంకేతాలు ఇస్తే చాలు, అదే
నిర్దేశిత ప్రదేశానికి తీసుకువెడుతుంది. ప్రపంచం మొత్తంలో అత్యధిక సంపన్నుడు ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా తయారు చేసిన కారు
ఇది. స్టీరింగ్ పట్టుకుని, క్లచ్ లు మారుస్తూ, బ్రేకులు వేస్తూ నడపాల్సిన అవసరం వుండదు. అవన్నీ కారులో అమర్చిన కంప్యూటర్ బాధ్యతలు. కారుకు అన్ని వైపులా అమర్చిన సెన్సార్లు, కెమెరాలు అన్ని జాగ్రత్తలు
తీసుకుంటాయి. ముందు వెళ్ళే కారు ఎంత వేగంలో వెడుతున్నది, వెనక వచ్చే కారు ఎంత దూరంలో, ఎంత వేగంతో
వస్తున్నది, ఇరుపక్కల నుంచి ఏయే వాహనాలు ఎంత వేగంగా దూసుకు వస్తున్నది అదే
గమనించి, తదనుగుణంగా తన గమనాన్ని, వేగాన్ని సర్దుబాటు చేసుకుంటుంది. సాధారణంగా మనకు ముందు
వెళ్ళే కారు మాత్రమే కనిపిస్తుంది. అయితే ఈ కారుకు వున్న కెమెరా కళ్ళు, ముందు
కారునే కాకుండా దాని ముందున్న వాహనాల వేగాన్ని, రోడ్డు పరిస్థితులను ఒక కంట కనిపెడుతుంటాయి. స్పీడ్ పరిమితులకు తగ్గట్టుగా కారే తనకు తానుగా వేగాన్ని పెంచుకుంటుంది.
అవసరం అయితే తగ్గించుకుంటుంది. వేగ పరిమితులను మించి వాహనం నడుపుతున్నారని
పోలీసులు చలానాలు విధించే ఆస్కారం ఉండదు.
ఇంజిన్ వుండదు కాబట్టి ముందూ వెనకా రెండు డిక్కీలు. పెట్రోలు అవసరం లేదు.
పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. ఇంధనం పొదుపు కాబట్టి కారు ఖరీదులో ప్రభుత్వ రాయితీ కూడా లభిస్తుంది.
అయితే నేను విన్నదాన్ని బట్టి, అమెరికాలో చాలామంది ఈ కారును వాడుతున్నప్పటికీ ఈ
కారు ఇంకా ప్రయోగాత్మక దశలోనే వుంది.
లైసెన్స్ వున్న వ్యక్తి కారులో వుండడం తప్పనిసరి.
ఈ కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్
సామాన్యుడు కాదు. ప్రపంచ కుబేరుడు. అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ప్రెసిడెంట్
పదవికి మరోసారి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన ఇటీవల
పాల్గొన్న ఎన్నికల సభలో వేదిక మీద నృత్యం చేసిన ఘనుడు.
ఈ టెస్లా కారు విషయంలో ఆయనకు ఎన్నో
విప్లవాత్మక ఆలోచనలు వున్నట్టు చెబుతారు.
అవన్నీ సాకారం అయితే ప్రస్తుత మోటారు
కార్ల పరిశ్రమ స్థితిగతులు సంపూర్ణంగా మారిపోతాయి. ఎవరికీ డ్రైవర్ అవసరం వుండదు.
అసలు కారు అవసరమే వుండక పోవచ్చు. ఉబెర్ ఓలా వంటి సంస్థలకు స్వర్ణ యుగం రావచ్చు.
ఫోను చేయగానే రమ్మన్న చోటుకు కారు దానంతట అదే చెప్పిన సమయానికి వస్తుంది. పోవాలని అనుకున్న చోటుకు అదే తీసుకు
వెడుతుంది. పార్కింగ్ ఇబ్బందులు ఉండవు. ఎక్కడ పార్కింగ్ ఖాలీ వుందో అక్కడికి
వెళ్లి పక్క వాహనాలను తాకకుండా అదే పార్క్ చేసుకుంటుంది. మందు బాబులను
పట్టుకోవడానికి నోట్లో గొట్టాలు పెట్టి
ఊదాల్సిన శ్రమ ట్రాఫిక్ పోలీసులకు తప్పుతుంది. రోడ్డు ప్రమాదాలు చాలావరకు తగ్గిపోతాయి. ఇంధనం
కొరత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇన్ని లాభాలు, ప్రయోజనాలు వున్నాయి కనుకే, అందరి కళ్ళు ఈ
కార్ల మీదే వుంది. అయితే పోటాపోటీ కాటా కుస్తీలకి దిగే మోటారు కార్ల తయారీ రంగం
పెద్దల లాబీ చేతులు కట్టుకు కూర్చ్గుంటుందా ! ఈ రంగంలోని పెత్తందారులు అందరూ, సంపదలో ఎలాన్ మస్క్ తో పోటీ పడలేకపోయినా, అంతో
ఇంతో కుబేరులే. ప్రభుత్వాలను తమ ప్రయోజనాలకు అనుగుణంగా శాసించగల ధీరులే!
ప్రపంచ కుబేరుడు కనుక మస్క్ మాటే చెల్లుబాటు అవుతుందేమో!
కార్పొరేట్ ప్రపంచంలో రాజకీయాలు, అసలు రాజకీయరంగంలోని రాజకీయాల కన్నా దారుణమైనవి, తమ ఎత్తులతో ప్రత్యర్థి కుత్తుకలను కత్తిరించే నిర్దాక్షిణ్యం ఆ రంగంలో సర్వసాధారణం. అమెరికాలో అయితే మరీ.
Below photo:
Tesla Driverless Car, Courtesy Image Owner
08-10-2024