నిన్నటి నా పోస్టుపై స్పందిస్తూ మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు, ఎనభయ్, తొంభయ్ ఏళ్ళ చరిత్ర కలిగిన మా ఇంటిలో దాదాపు నూరు పురుళ్లు జరిగాయని, ఆ ఇంటితో, ఆ వూరితో, ఆ గాలితో మరచిపోలేని బంధం వున్నదని రాసారు. ఒక్క ఇంట్లో ఇన్నిన్ని పురుళ్లు ఏమిటని కొందరు ఫోన్లు చేసి అడిగారు.
ఆ ఇంటి పందిరి
గుంజను ముట్టుకుంటే చాలు పిల్లలు పుడతారు అని మా ఇంటిని గురించి చెప్పుకునే వాళ్ళు.
ఈ ఇంట్లో ఎన్ని పురుళ్లు అయ్యాయో
లెక్కలేదు. మా అమ్మా, మా పెద్దక్కయ్య రాధ ఇద్దరూ ఒకేసారి కడుపుతో
ఉన్నారు. కొద్ది రోజుల తేడాతో పక్క పక్క గదుల్లో ప్రసవించారు. మా అమ్మ కడుపున మా
రెండో అన్నయ్య రామచంద్ర రావు గారు, మా అక్కయ్య
కడుపున 108 అంబులెన్స్ పధకం సృష్టికర్త డాక్టర్ ఏపీ రంగారావు గారు జన్మించారు. అమ్ముమ్మ గారి ఊరిలో
తన పుట్టుక గురించి, తన చిన్నతనం
రోజుల గురించి ఆయన ఇలా రాసుకున్నారు.
“నేను మా తలిదండ్రులకు రెండో
సంతానాన్ని. నేను అమ్ముమ్మ గారి ఇంటిలో పుట్టినప్పుడు నా బొడ్డు కోసిన మంత్రసాని
పుట్టుగుడ్డిది. విచిత్రమేమిటంటే మా అమ్మ పుట్టినప్పుడు కూడా ఈ మంత్రసానే
పురుడుపోసిందట. మా కుటుంబంలో చాలామంది ఈ మంత్రసాని ఆధ్వర్యంలోనే సుఖంగా
ప్రసవించి క్షేమంగా వున్నారు. ఆమె పురుడు పోసిన పిల్లలెవ్వరూ ప్రసవ సమయంలో చనిపోలేదు. అది ఆవిడ
చేతిచలవ అని
చెప్పుకునేవారు. ఆ రోజుల్లో ప్రసవాలన్నీ ఇళ్ళల్లోనే జరిగిపోయేవి. మొట్టమొదటిసారి
ఆసుపత్రిలో పురుడు పోసుకున్నది మా అమ్ముమ్మ గారు, అదీ మా మా పెద్ద మేనమామ
(పర్వతాలరావు) పుట్టినప్పుడు. అయిదుగురు ఆడపిల్లల తరవాత కానుపు కావడంతో మా అమ్ముమ్మను అప్పుడు
ఖమ్మంలోని క్రిస్టియన్ మిషన్ ఆసుపత్రిలో చేర్పించి పురుడు పోయించారు.
“నేను
పుట్టిన తరవాత నాకు కానీ, మా
అమ్మకు కానీ ప్రసవానంతర జాగ్రత్తలు ఏమీ తీసుకోలేదు. మా ఇద్దరికీ ధనుర్వాతం
(టెటనస్) రాకుండా ఏ విధమయిన ఇంజెక్షన్లు ఇవ్వలేదు. అలాటివి వున్నట్టు ఆ రోజుల్లో
ఎవరికీ తెలిసివుండదు. పురుడు
రావడానికి
కొన్ని నెలలముందు మా
అమ్మ పుట్టింటికి వెళ్ళింది. కేవలం
పుట్టింటివారి ఆప్యాయతా, పూర్తి
విశ్రాంతి మినహా ఆమె తీసుకున్న మందులు ఏమీ లేవు. నేను పుట్టగానే మంత్రసాని కొడవలితో బొడ్డు కోసి నన్ను ఒక తట్టలో
పడుకోబెట్టింది. కోసిన బొడ్డు ముక్కను గోతిలో పాతిపెట్టారు. నాకు స్నానం చేయించి
తల్లి పాలు పట్టించారు. మైల బట్టలు మంత్రసాని పట్టుకెళ్ళింది. అవి ఆమెకే
చెందుతాయి. పురుడు పోసినందుకుగాను కొంత ధాన్యం కొలిచి ఇచ్చేవాళ్ళు.
“ప్రసవం
అయిన తరవాత ఆ గదిలోకి పన్నెండు రోజులపాటు ఎవ్వరూ రావడానికి వీలులేదు. ఎవరూ
తాకడానికి వీలులేదు. పుట్టిన తిధి నక్షత్రాలనుబట్టి జాతకం రాయించారు. ‘రాధమ్మ
సుఖంగా ప్రసవించింది. తల్లీ పిల్లవాడు కులాసా’ అని చుట్టపక్కాలందరికీ ఇంటి
పురోహితుడితో కబురు పంపించారు.
“మూడోరోజున
బాలింతరాలయిన మా అమ్మకు వావిలాకులు కలిపిన వేడినీటితో స్నానం చేయించారు. మరో
తొమ్మిది రోజులు ఇలాగే గడిచిన తరవాత, పన్నెండో రోజున ఆమెకు పురిటి స్నానం చేయించారు. పసుపు, పెసరపిండి, శనగపిండి కలిపి వొంటికి నలుగుపెట్టి
చేయించే స్నానం ఇది. ఇల్లంతా
పసుపు నీళ్ళు చల్లి పుణ్యావచనం, పూజ
అయిన తరవాత, బియ్యం,
బెల్లంతో
తయారుచేసిన పులగం మా అమ్మకు తినడానికి పెట్టారు. అప్పటినుంచి పురిటి మైల
వొదిలిపోయినట్టే. ఇల్లంతా స్వేచ్చగా అందరితో కలసి తిరగొచ్చు. పసిపిల్లాడినయిన నాకు
కూడా ప్రతి రోజూ పెద్దవాళ్లో,
పనిమనుషులో
కాళ్ళమీద పడుకోబెట్టుకుని స్నానం చేయించేవారు. ఒక గుడ్డ పరచి నిద్రపుచ్చేవారు. దాన్ని పాడుచేసినా
ఆ గుడ్డనే, ఉతికి
ఆరవేసి మళ్ళీ వాడేవారు. పన్నెండో రోజున నామకరణం చేసి ఉయ్యాలలో వేసారు.
నాకు తొమ్మిది నెలల వయస్సు రాగానే ఒక మంచి రోజు చూసి యిరవై కిలోమీటర్ల దూరంలో వున్న తిరుమలగిరి
గుట్టమీది వెంకటేశ్వర స్వామి గుడిలో అన్నప్రాసన చేసారు. బెల్లం కలిపి వొండిన అన్నం పాయసం. ( అంటే అది నేను తిన్న మొట్టమొదటి ఘన
పదార్ధం అన్నమాట.) అలాగే నా మొట్టమొదటి కేశఖండన (తల వెంట్రుకలు) కూడా ఏడాది
నిండినప్పుడు జరిగింది. చిన్నతనంలో మా పినతల్లులు (మా అమ్మ చెల్లెళ్ళు ) ముగ్గురు
నా ఆలనా పాలనా చూసేవారు. అప్పటికి వారికింకా పెళ్ళిళ్ళు కాలేదు. దూలానికి
వేలాడదీసిన గుడ్డ ఉయ్యాలలో నన్ను పడుకోబెట్టి నిద్రపుచ్చేవారు. మా తరంలో నేనే
తొలిచూరు పిల్లవాడినని చాలా గారాబంగా చూసేవారు. యిరవై నాలుగ్గంటలూ ఎవరో ఒకరు
కంటికి రెప్పలా కనిపెట్టుకుని వుండేవారు.
బోర్లపడితే
బూరెలు వండాలి, పారాడితే
పాలకాయలు పంచాలి అని ఏదో పేరుతొ
ప్రతినెలా నేను పుట్టిన తరువాత పండగలు, పేరంటాలు చేసేవారు.
మా అమ్మ నన్ను ప్రసవించిన తొమ్మిదో రోజున మా అమ్ముమ్మగారు, మా అమ్మ అమ్మగారు వెంకట్రావమ్మగారు
కూడా అదే ఇంట్లో మరో గదిలో మగపిల్లవాడిని (భండారు రామచంద్రరావు) కన్నది. నాకు
బొడ్డుకోసిన మంత్రసానే మా అమ్ముమ్మకు కూడా పురుడు పోసింది. ఒకే ఇంట్లో రోజుల
తేడాతో పుట్టిన మేమిద్దరం ఆడుతూ పాడుతూ పెరిగాం.
“చిన్నప్పటి
ఓ జ్ఞాపకం నా మనసు తెరపై ముద్రపడిపోయింది.
“1948 నాటి మాట. మా అమ్మ తండ్రి రాఘవయ్య గారిని
కంభంపాడు తాతయ్య అనే వాళ్ళం. ఎవరూ లేవకముందే తెల్లారగట్టనే లేచి కాఫీ
తయారుచేసుకుని తాగడం ఆయన అలవాటు. బెజవాడనుంచి పచ్చి కాఫీ గింజలు కొనుక్కొని
వచ్చి వాటినివేయించి కాఫీ చేసుకుని తాగేవాడు. కాఫీ గింజలను పొడి చేసే ఒక చిన్న
మిషను ఒకటి అయన పట్నం (మద్రాసు) పోయినప్పుడు కొనుక్కువచ్చాడు. నన్ను నిద్రలేపి,
వొళ్ళో
వేసుకుని పొయ్యి రాజేసేవాడు. నీళ్ళు పడేసి అవి కాగుతుండగానే, బొడ్లోనుంచి బీడీ కట్ట తీసి ఒకటి
వెలిగించేవాడు.
“వేయించిన
గింజల కమ్మటి వాసన, కాఫీ
పొడి మిషన్ చేసే అదో రకం చప్పుడు, సుళ్ళు
తిరిగే బీడీపొగ, ఎదురుగా
పొయ్యిలో కణకణమని కట్టెల మంటలు, ఇవన్నీకళ్ళకు
కట్టినట్టు గుర్తుండిపోయాయి.
“ఇన్నేళ్ళ
తరవాత ఇప్పటికీ ఇలాటి చిన్న చిన్న సంగతులు కొన్ని బాగా జ్ఞాపకం వున్నాయి.
“అలాటిదే
మరో జ్ఞాపకం, గుడ్డ
ఉయ్యాలలు గురించి. ఈ కాలం వారికి ఏమాత్రం తెలియని ఉయ్యాలలు ఇవి. ఒక పాతచీరెను
దూలానికి
వేలాడగట్టి ఉయ్యాల మాదిరిగా తయారుచేసేవారు. అందులో పిల్లలని పడుకోబెట్టి ఎవరో ఒకరు
ఊపుతూ నిద్రపుచ్చేవారు. బయటనుంచి చూసేవారికి లోపల పిల్లాడికి గాలి ఆడుతుందా అని
అనుమానం కలిగించేలా వుండేవి ఈ గుడ్డ ఉయ్యాలలు.
“మరో
చేదు జ్ఞాపకం నెలనెలా పిల్లలకు వంటాముదం పట్టించడం. పిల్లల్ని కాళ్ల మీదవేసుకుని,
బలవంతంగా నోరు
తెరిచి ఉగ్గిన్నెతో ఆముదం తాగించేవాళ్ళు. ఇలా చేస్తే మలబద్దకం రాదని నమ్మకం”
ఇవీ నా
మేనల్లుడు ( పేరుకు మేనమామను అయినా వయసులో
ఆయనే పెద్ద) డాక్టర్ రంగారావు తన ముద్రిత
గ్రంథంలో రాసుకున్న జ్ఞాపకాలు.
అమ్ముమ్మ
గారి ఇంట్లో పుట్టడం, అమ్ముమ్మ
గారి ఊర్లో పెరగడం అనేవి కొత్తేమీ కాదు. పెళ్ళయిన తర్వాత మా పెద్ద అక్కయ్యలు ఇద్దరూ చాలా
కాలం పుట్టింట్లో వుండి పోవడానికి ఒక బలమైన, ఉత్కృష్టమైన కారణం వుంది. భారత
స్వాతంత్ర ఉద్యమం బలంగా సాగుతున్న రోజులు. దేశ దాస్య విమోచనం కోసం సత్యాగ్రహాలు చేస్తున్న మా బావగార్లు అయితరాజు
రాం రావు,
కొలిపాక రామచంద్ర రావు గార్లను నాటి బ్రిటిష్ ప్రభుత్వం పద్నాలుగు నెలలు జైల్లో
పెట్టింది. అప్పటికే గర్భిణి అయిన మా పెద్దక్క రాధను, రెండో అక్క శారదను మా నాన్న తన
దగ్గర ఉంచుకోవడానికి మా ఊరు తీసుకు వచ్చారు. అప్పటి సంగతులు శారదక్కయ్య చెప్పేది.
ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే:
“పట్టుమని పన్నెండేళ్ళు అయినా
నిండకుండానే నా పెళ్లి అయింది. మా పెద్దమ్మాయి శాంత పుట్టిన ఏడాదికే మా వారు
(కొలిపాక రామచంద్రరావు గారు) జైలుకు వెళ్ళారు. మా పెద్ద బావ అయితరాజు రాం రావు
గారు మావారితో పాటే జైలుకు వెళ్ళడంతో, నన్నూ మా
పెద్దక్క రాధనూ మా నాన్న మా వూరు కంభంపాడు తీసుకు వెళ్ళారు. మా బావగారు, మా వారు జైల్లో వున్న పద్నాలుగు నెలలు మేమిద్దరం మా పుట్టింట్లోనే
ఉండిపోయాము. ఆ రోజుల్లో ఇలా గ్యాసు పొయ్యిలు లేవుకదా! మా అమ్మ శనగకట్టె మంట పెట్టి
మా అందరికీ వండి పెట్టేది.
“మానాన్న ఊళ్ళోని దుకాణదారుతో చెప్పాడు
‘మా పిల్లలు ఏదీ లేక ఇక్కడికి రాలేదు.
అల్లుళ్ళు దేశం కోసం జైలుకు వెళ్ళారు. వాళ్లకి అవసరమైనవి ఏవి అడిగినా కాదనకుండా
ఇవ్వు”
“మా అమ్మకు పుట్టింటి వాళ్ళు ఒక గేదెను
అరణంగా ఇచ్చారట. దాన్ని గురించిన కబుర్లు గమ్మత్తుగా చెప్పేది. తాను కోడలిగా ఏనాడు
గడప దాటి వెళ్లకపోయినా, తన పేరు మాత్రం ఆ గేదె పుణ్యమా అని
నలుగురికీ తెలిసిందట. అది వూళ్ళో అందరిండ్లలో జొరబడి నానా బీభత్సం చేసేదట.
‘వెంకట్రావమ్మ గారి గేదె ఇలా చేసింది, అలా చేసింది’అని
వూళ్ళో జనం చెప్పుకునే వారట.
“ఆ రోజుల్లో ఏ కబుర్లు వెంటనే తెలిసేవి
కాదు. మా వాళ్ళు జైలు నుంచి విడుదల అయినట్టు ముందు ఎవరు కబురు తెస్తే వాళ్ళ
కాళ్ళకు దణ్ణం పెట్టుకోవాలని నేనూ మా పెద్దక్కా అనుకునేవాళ్ళం.
చివరికి శంభాయి ఆ శుభవార్త
మోసుకువచ్చాడు.
“మేమిద్దరం ముందు అనుకున్నట్టే,
మా ఇంట్లో పనివాడు అయిన శంభాయికి పాదాభివందనం
చేశాము”
పెద్ద చదువులు లేకపోయినా చిన్నప్పటి
సంగతులను అంత గుర్తుకు తెచ్చుకున్న మా శారదక్కయ్యకు అన్ని డిగ్రీలు వున్నట్టే
లెక్క.
నిన్ననే ఆమె జయంతి.
ఆమె గురించిన జ్ఞాపకమే మరోటి.
డెబ్బయ్ ఏళ్ళ కిందటి మాటే.
స్టెయిన్ లెస్ స్టీల్ కంచాలు, గ్లాసులు అప్పుడప్పుడే మార్కెట్లోకి వస్తున్న రోజులు అనుకుంటాను. మా
ఇంట్లో అప్పటికి అవి గృహ ప్రవేశం చేయలేదు. పెద్దవాళ్లకు వెండి పళ్ళేలు, చిన్న
వాళ్లకు రాతెండి కంచాలు, ఇత్తడి
గ్లాసులు. మా రెండో అక్కయ్య శారదక్కయ్య ఓసారి పండక్కి వస్తూ రెండు స్టీలు భోజనం
పళ్ళేలు తెచ్చి నాకు ఒకటీ, మూడో అన్నయ్య వెంకటేశ్వరరావుకూ ఒకటీ
ఇచ్చింది. అప్పట్లో వాటి ఖరీదు రెండూ కలిపి పదిహేను రూపాయలు. అంటే కరణీకం
చేస్తున్నప్పుడు మా నాన్నగారి మూడు నెలల జీతం అన్నమాట. ఇహ అప్పుడు చూడాలి మా
మోహంలో సంతోషం. ఏనుగు ఎలా వుంటుందో తెలవదు కానీ అదెక్కినంత ఆనందం.
మా అక్కయ్య ఇచ్చిన ఆ కంచం మీద నాకు
మోహం ఎంతగా పెరిగిపోయిందంటే అది నాకే సొంతం అనుకునేవాడిని. ఆ తర్వాత ముప్పయ్
ఏళ్ళకు పైగా అది నాతోనే వుంది. 1987లో మాస్కో వెళ్ళేటప్పుడు ఆ కంచంతో నా
రుణానుబంధం తెగిపోయింది.
తిరిగొచ్చిన తర్వాత లోకమే మారిపోయింది.
డిన్నర్ ప్లేట్లు, డిన్నర్ సెట్లు వచ్చిపడిన తర్వాత,
చాలా కొద్ది మంది ఇళ్ళల్లో తప్ప, ఇప్పుడు ఈ విడికంచాల గోల లేదు.
కింది
ఫోటోలు:
మా ఊరి
ఇంట్లోని పక్క పక్క గదుల్లో రోజుల తేడాతో జన్మించిన డాక్టర్ ఏపీ రంగారావు (108, 104 పధకాల
రూపశిల్పి, మా రెండో
అన్నయ్య భండారు రామచంద్రరావు ( స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్)
ఇంకా వుంది