17, మే 2024, శుక్రవారం

గతం గుర్తులు



నాలుగు దశాబ్దాల కిందటి ముచ్చట.
ముఖ్యమంత్రి అంజయ్య గారిని మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వెంటనే అంజయ్య గారు తన పదవికి  రాజీనామా చేసారు. మర్నాడు – కొత్త నాయకుడి ఎన్నిక. అప్పటికి  ఇంకా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రే. నేనూ జ్వాలా కలసి ఆయన వెస్పా స్కూటర్ మీద చిక్కడ పల్లి నుంచి ముఖ్యమంత్రి అధికార నివాసం ‘జయప్రజాభవన్’ ( గ్రీన్ లాండ్స్) కు వెళ్లేసరికి బాగా పొద్దు   పోయింది. అంతా బోసిపోయి వుంది. నాయక జనం జాడ లేదు.  మేడ మీద అంజయ్య గారు తన షరా మామూలు వస్త్ర ధారణతో అంటే - గళ్ళ లుంగీ, ముతక బనీనుతో కనిపించారు. ఏమి మాట్లాడాలో తోచలేదు. కాసేపువుండి వచ్చేస్తుంటే వెనక్కి పిలిచారు. ఒక పిల్లవాడిని చూపించి ‘చూడు శ్రీనివాస్ – ఇతడికి దూరదర్శన్ లో ఏదో కాజువల్ ఉద్యోగం కావాలట. ఎవరికయినా చెప్పి చేయిస్తావా ?’ అని అడుగుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను పని చేసేది రేడియోలో అని ఆయనకు బాగా తెలుసు. అయినా తనని నమ్ముకుని వచ్చిన ఆ పిల్లవాడిని చిన్నబుచ్చడం ఇష్టం లేక నన్ను అడిగి వుంటారు.
అందుకే ఆయన చనిపోయినప్పుడు ఒక పత్రిక పెట్టిన పతాక శీర్షికను నా జర్నలిస్టు మిత్రుడు పాశం యాదగిరి ఎప్పుడూ గుర్తు చేస్తుంటాడు.
“గరీబోళ్ళ బిడ్డ – నిను మరవదు ఈ గడ్డ”.
(ఇప్పుడు సాక్షి పత్రిక ఎడిటర్ వి.మురళి ఆ హెడ్డింగు పెట్టారు. అప్పట్లో ఆయన ఆ పత్రికలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు)

16, మే 2024, గురువారం

ఏకాక్షర పద్యం

వెతుకులాటలో దొరికిన ఆణిముత్యం, ఏకాక్షర పద్యం - భండారు శ్రీనివాసరావు 

  సీతారామాంజనేయ సంవాదం 
నిజానికిది రామాయణంలోని కాదు. 
ఆధ్యాత్మిక రామాయణంలోని సంవాదానికి ఆనంద స్వరూపంగా తానిది రాసానని గ్రంధకర్త పరశురామ పంతుల లింగమూర్తి అను గురుమూర్తిగారే పేర్కొన్నారు. దీనికి రచయిత, వ్యాఖ్యాత, ఆనంద బంధువు ''లింగమూర్తి'' గురుమూర్తిగారే.  తదనంతరం కాలంలో వజ్ఘల నారాయణ శాస్త్రులుగారు, శ్రీ పరశురామ పంతులుగారి ఆనందానికి, బ్రహ్మానందంగా తమ వ్యాఖ్యానం జతచేసి భక్తులకు అందించారు.
రచయిత ఈ గ్రంధంలో కొన్ని సాహిత్యపరమైన చమక్కులు చేసారు. ద్వితీయాశ్వాసము 350 వ పుటలో ఒక కంద పద్యం వుంది. సంవాదంలో భాగంగా సీతమ్మ వారు ఆంజనేయునితో ఇలా అంటారు. ఈ కందం ఏకాక్షర పద్యం. కేవలం ‘న’ అనే అక్షరంతో ఈ పద్యం నడక సాగుతుంది.

 “నన్నన్నను నిన్నన్నను నిన్నేనని నేనన, నిను నేనెన్నను, నిన్నెన్నను, నిన్నే నన్నెన్నను, నిన్నే నన్నెన్నన్నా  నన్నేనను, నిను  నేనననన్నా " 

గతంలో ఆంధ్రసారస్వత పరిషత్ (ఇప్పుడు తెలంగాణా సారస్వత పరిషత్) వారు   ఈ గొప్ప రచయిత లింగమూర్తి అను గురుమూర్తి  జీవితమూ – సాహిత్యము పై ఒక గ్రంధాన్ని ప్రచురించారు. ఆచార్య దివాకర్ల వెంకటావధాని, శ్రీ కేశవపంతుల నరసింహ శాస్త్రి ఈ పుస్తకాన్ని రచించారు. వీరేశలింగ గ్రంధాలయంలో ఈ పుస్తకం దొరికే అవకాశం వుంది. ఆన్ లైన్ లో కూడా లభ్యం అని కొందరు చెప్పగా విన్నాను. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకారులు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు తమ నవ జీవన వేదంలో కూడా ఈ రచయిత ప్రస్తావన చేసారు.
ఇంతకీ ఈ ఏకాక్షర పద్యం భావం యేమిటంటారా?
గరికపాటి గారి వంటి ఉద్దండ పండితులే చెప్పాలి.

విలేకరిగా జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు



1975 నవంబర్ లో నేను హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా చేరిన నాటి నుంచి కొన్ని దశాబ్దాలపాటు ఒకటే దినచర్య. నేను వుంటున్న చిక్కడపల్లి నుంచి బయలుదేరి రెండు బస్సులు మారి రేడియో స్టేషన్ కు రెండు స్టాపుల ముందే, సరోవర్ హోటల్ దగ్గర దిగిపోయేవాడిని. నేను పనిచేసేది రేడియో స్టేషన్ అయినా, నా కార్యస్థానం మాత్రం సచివాలయమే. ఆరోజుల్లో సెక్రెటేరియట్ ప్రధాన ద్వారం, రాజసం ఒలకబోసే నీలం రంగు ఇనుపకమ్మీలతో ప్రస్తుతం ఫ్లై ఓవర్ మొదలయ్యే ప్రధాన రహదారిలో వుండేది. దాని ఎదురుగా ఆంధ్ర జ్యోతి సిటీ బ్యూరో ఆఫీసు. ఆదిరాజు వేంకటేశ్వర రావు గారు దానికి విలేకరి. ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం బెజవాడలో అచ్చయ్యేది. ఆయన ఇక్కడనుంచే టెలిప్రింటర్ లో వార్తలు పంపేవాడు. నేను రేడియోలో చేరకముందు ఒకసారి ఆయనతో కలిసి సచివాలయానికి వెళ్లాను. అంతకుముందు ఎప్పుడూ అందులో అడుగు పెట్టిన అనుభవం లేదు. పేరులోనే కాకుండా వేషభాషల్లో కూడా ఆయన ఆదిరాజే. ఫుల్ సూటు. నెక్ టై. చేతిలో బ్రీఫ్ కేసు. ఢిల్లీలో ఎక్కువకాలం విలేకరిగా వుండడం వల్ల అలవడ్డ అలవాట్లు కాబోలు. సచివాలయం గేటు దగ్గర కాపలా మనిషి ఆదిరాజుని చూడగానే రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. అయన వెంట వస్తున్న నన్ను చూసి కనీసం ఎవరని కూడా అడగలేదు. వెలుగుతున్న సిగరెట్ చేయిని విలాసంగా వూపుతూ ఆదిరాజు లోపలకు వెళ్లాడు. ఆయనతో పాటే నేనూ.
 ఆ తరువాత రేడియో విలేకరిగా నాకు సచివాలయం మొదటి కార్యస్థానంగా మారిపోయింది. ప్రతి రోజూ ముందు హాజరు అక్కడే. ఆ తరువాతే రేడియో. ఎందుకంటే రేడియో వార్తలకి అవసరం అయ్యే అధికారిక సమాచారం యావత్తూ అక్కడే దొరికేది. కాలక్రమంలో గేటు మనిషి నుంచి ముఖ్యమంత్రివరకు అందరితో ముఖపరిచయాలు. ఎక్కడికయినా గేటు (తలుపు) తోసుకుని వెళ్ళగల చనువూ, వెసులుబాటు, వీటికి తోడు రేడియో విలేకరి అన్న ట్యాగు లైను ఒకటి.

ఈ చిన్న పోస్టుకు కూడా ఒక చిన్ని తోక టపా వుంది. 
అదేమిటంటే.... 
సచివాలయంలో వార్తా సేకరణ పనులు ముగించుకుని మధ్యాన్నం  సరోవర్ హోటల్ బస్ స్టాప్ వద్ద సిటీ బస్సు ఎక్కి రేడియో స్టేషన్ స్టాపులో దిగిపోవడం నా రోజువారీ కార్యక్రమం. ఒకరోజు అలా బస్సు ఎక్కడానికి వెయిట్  చేస్తున్న సమయంలో నా పక్కన ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. తలపై రూమీ టోపీ (నవాబీ టోపీ) బంద్ గాలా కోటు ధరించిన ఆ ముస్లిం పెద్దమనిషిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఎవరా అని పరికించి చూసేటప్పటికి ఆయన ఎక్కాల్సిన బస్సు వచ్చింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత గుర్తుకు వచ్చింది. ఆయన గతంలో రాష్ట్ర హోం మంత్రిగా పనిచేసారు. పేరు సరిగా గుర్తు లేదు. మీర్ అహ్మద్  ఆలీ ఖాన్ అయి వుండాలి. అంతటి పెద్ద పదవులు నిర్వహించి కూడా అధికారం నుంచి తప్పుకున్న తర్వాత అలా సామాన్యుడిలా సిటీ బస్సులో వెళ్ళడం చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు కలలో కూడా ఊహించలేము.

13, మే 2024, సోమవారం

నిమేషకాలంలో పూర్తయిన పౌరధర్మం పాటింపు - భండారు శ్రీనివాసరావు

 


ఈరోజు ఉదయం పోలింగు ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి టీవీలు ఓటర్ల ఉత్సాహం గురించి కధనాలు ప్రారంభించాయి. పోలింగు కేంద్రాల ముందు  బారులు తీరిన ఓటర్లు, కిలోమీటర్ల మేర క్యూలు అంటూ  బుల్లి తెరలపై స్క్రోలింగులు బారులు తీరడం మొదలెట్టాయి. తయారై వెళ్ళబోయేవాడిని కాస్తా వాటిని చూసి  ఆగిపోయాను. మధ్యాన్నం వరకు సేం టు సేం స్క్రోలింగులు. మార్పు లేకుండా, అక్షరం పొల్లుపోకుండా. బయలుదేరడం, మళ్ళీ ఆగిపోవడం. ఇలా చాలా సార్లు జరిగిన తర్వాత,  ఓ వాటర్ బాటిల్ చేత  పట్టుకుని నడకకు ఎక్కువా, ఆటోకి తక్కువా అయిన పోలింగు కేంద్రానికి మధ్యాన్నం మూడు గంటలకి  మా కోడలు, నేనూ  వెళ్ళాము. దారిలో ఇరుపక్కల  దుకాణాలు అన్నీ మూసి వున్నాయి.  పెద్ద క్యూలు ఉంటాయని అనుకుని పొతే, పోలింగు కేంద్రం ఉన్న ప్రాంతం అంతా నిర్మానుష్యంగా వుంది. ఒక పోలీసు, ఇద్దరు మహిళా సిబ్బంది కనబడ్డారు. మొబైల్ ఉందా అని అడిగి నా జవాబు కోసం ఎదురు చూడకుండా ఆ బాటిల్ అక్కడ పెట్టి అల్లా వెళ్ళండి, అన్నారు.  నన్ను చూసిన పోలింగు సిబ్బంది అమ్మయ్య ఎట్టకేలకు ఒకడు వచ్చాడు అని గుసగుసలాడుకున్నట్టు అనిపించింది. తలకిందుల సంతకం ఒకటి చేయించుకుని, ఎడమ చేతి చూపుడు వేలు మీద సిరా మరక అంటించి, పోయి ఓటు వేయండి అన్నారు. పోలింగు ఛాంబరులో పొడవాటి ఈవీఎం లు రెండు కనిపించాయి. ఇంతమంది పోటీలో వుంటే,  ఇదేమిటి ఇక్కడ  పరిస్థితి ఇలా వుంది అనుకున్నా. భారత పౌరుడిగా నా ప్రధమ కర్తవ్యాన్ని పూర్తిచేసుకుని బయట పడ్డాను. మొత్తం ప్రక్రియ అంతా నిమిషం కంటే తక్కువ వ్యవధిలో పూర్తయింది. ప్రత్యేక విమానంలో ప్రయాణించినట్టు,  నా ఒక్కడి కోసమే ఈ కేంద్రం ఏర్పాటు చేశారేమో అనే భావన కలిగింది. పక్కనే కొంచెం దూరంలో ఉన్న మరో కేంద్రంలో ఓటువేసి వచ్చిన మా కోడలు అప్పటికే కారు దగ్గర  నాకోసం ఎదురు చూస్తోంది. అంటే అక్కడ పరిస్థితి కూడా డిటో అన్నమాట.   ఇంటికి వచ్చి టీవీ పెడితే మళ్ళీ ఉదయం ఎనిమిది గంటల సమయంలో వేసిన  అవే స్క్రోలింగులు, అక్షరం పొల్లుపోకుండా,  బారులు తీరిన ఓటర్లు. మండుటెండను కూడా లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని తాపత్రయపడుతున్న ఓటర్లు అంటూ టీవీలు ఊదరకొడుతున్నాయి. ఎందుకిలా ఓటర్లని నిరుత్సాహపరుస్తున్నారో తెలియదు.  

తర్వాత గుర్తుకు వచ్చిన విషయం ఏమిటంటే, మన ఓటువున్నది సికిందరాబాదు. హైదరాబాదు నగరంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ. ఓటు హక్కు గురించి ఇతరులకి చెప్పేవాళ్ళ శాతం మరీ  ఎక్కువ.  కానీ, ఓటు వేసే వాళ్ళ శాతం మాత్రం  అతి తక్కువ. ఇంకా  నయం. ఈరోజు పగటిపూట ఐ పి ఎల్ మ్యాచ్ లేదు. అందుకే ఈ మాత్రం అయినా.

ఇంకో విషయం ఏమిటంటే హైదరాబాదులో  ప్రధాన కార్యాలయాలు వుండే ప్రధాన టీవీ చానళ్ళ లోనే ఈ హడావిడి అంతా. ఇదంతా ఏపీ ఎన్నికలు గురించి అనుకోవాలేమో!

ఇతి వార్తాః !

(13-05-2024)           

11, మే 2024, శనివారం

విద్య వైద్యం ఉచితంగా ఇవ్వండి



 
 పేదవాడికి  విద్యాగంధం అంటేలా చూడండి. చదువుతోపాటు అతడిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈ ప్రపంచంలో నెగ్గుకు రాగలననే ఆత్మవిశ్వాసం అతగాడిలో ఇనుమడిస్తుంది. సమాజంలో తనకూ ఒక గౌరవప్రదమైన స్థానం లభించిందనే తృప్తినిస్తుంది.  సామాజిక పరమైన ఆత్మన్యూనతను అతడిలో  పోగొడుతుంది. ఇంతమందిలో తానూ ఒకడిననే న్యూనతా భావం సన్నగిల్లి, తనూ అందరివంటివాడిననే  ఆత్మాభిమానం పొటమరిస్తుంది. విద్యవల్ల వినయం ఒకటే కాదు ఆత్మబలం కూడా మనిషిలో పెరుగుతుంది. ఇందుకోసం ఖర్చుపెట్టే ప్రతి పైసా, ముందు ముందు మంచి సమాజ నిర్మాణానికి చక్కటి, దృఢమైన పునాది వేస్తుంది. ఇది చరిత్ర చెప్పే సత్యం.  
అలాగే వైద్యం. రాను రాను ఇది  సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతోంది. ప్రభుత్వంలో ఈ అంశాన్ని పర్యవేక్షించే విభాగాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అంటారు. ప్రజారోగ్యం దెబ్బతింటే వైద్యం అందించే బాధ్యత ఈ విభాగానిది. ఆరోగ్యం బాగా వుంటే వైద్యంతో అవసరమే వుండదు. నిదానం కంటే నివారణ మేలు. తాగే నీటి ద్వారా అనేక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ముందు అందరికీ పరిశుభ్రమైన మంచి నీరు లభించేలా చూడండి. సగం రోగాలు తగ్గిపోతాయి. అలాగే, సుగరూ, రక్తపు పోటు. పల్లెల్లో నివసించే పేదవారికి ఈ రోగాలు వున్నట్టు కూడా తెలవదు. సుగరు ఒంట్లో వుంటే అది వెయ్యి రోగాల పెట్టు. దాన్ని అదుపులో ఉంచడానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. హెచ్చు తగ్గుల్ని బట్టి మందులు మారుస్తూ వుండాలి. అదే విధంగా బ్లడ్ ప్రెషర్. అదుపులో వుంటే సరి. విషమిస్తే పక్షవాతం వంటి ప్రమాదకర రోగాలకు కారణమవుతుంది. దీనికీ క్రమం తప్పని పరీక్షలు అవసరం. తీవ్రతను బట్టి మందులు మారుస్తూ వాడడం మరింత అవసరం. పెద్ద రోగాల  బారిన పడకుండా ఈ చిన్న రోగాలను అదుపులో ఉంచాలి. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోకూడదు. లేని వాళ్ళకే కాదు, ఉన్నవాళ్ళకి కూడా సుగరు, రక్తపు పోటు పెద్ద సమస్యలే. పరీక్షలు చేయించుకోవడంలో అశ్రద్ధ కొంత, అవకాశాలు లేక కొంత, వెరసి జనాల్లో ఈ వ్యాధులు ఇలవేల్పుల మాదిరిగా తయారయ్యాయి. ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటే ఈ రెండింటినీ అదుపు చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
రోగం రొష్టూ లేకపోతె రాళ్ళు తిని హరాయించుకోవచ్చు. రాళ్ళు కొట్టుకుంటూ అయినా బతుకుతెరువు సంపాదించుకోవచ్చు. ఆరోగ్యవంతమయిన శరీరానికి విద్యతో శోభించే మెదడు కూడా వుంటే ఇక ఆ మనిషికి అడ్డే వుండదు.     
అంచేత ఎన్నిక కాబోయే ప్రభువులూ! ఈ రెంటి మీదా కాస్త దృష్టి మళ్ళించండి.
ధర్మో రక్షిత రక్షితః ! ధర్మాన్ని మీరు కాపాడితే  ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. 
అలాగే నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు ప్రభుత్వాలు ఇస్తే, మంచి ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన సమాజాన్ని ప్రజలే నిర్మించి ఇస్తారు.
ఇది సత్యం.

8, మే 2024, బుధవారం

అర్ధరాత్రి జ్ఞానోదయం - భండారు శ్రీనివాసరావు

 ఏదైనా సాపేక్షమే, కష్టమైనా, సుఖమైనా!

1971 ఇండో పాక్ యుద్ధ సమయంలో బ్లాకౌట్ అనే మాట వినపడేది. శత్రుదేశపు యుద్ధవిమానాలు ఆకాశవీధి నుంచి, కింద భూతలంపై తమ  లక్ష్యాలను గుర్తించకుండా ఆ రోజుల్లో అధికారులు, రాత్రివేళల్లో అనేక నగరాల్లో  బ్లాకౌట్ ప్రకటించి ప్రజలచేత స్వచ్చందంగా కరెంటు దీపాలు వాడకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. వీధి దీపాలు వెలగకుండా చూసేవారు. ఆ యుద్ధసమయంలో ప్రజలనుంచి కూడా స్వచ్చంద సహకారం లభించేది. అత్యవసరంగా దీపాలు వాడాల్సిన పరిస్థితి వస్తే, ఆ వెలుగు బయటకి ప్రసరించకుండా ఇంటి తలుపులు, కిటికీలు మూసివేసేవారు. అప్పుడు నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో పని చేస్తుండేవాడిని. దేశం కోసం కాబట్టి ప్రజలు ఆ ఇబ్బందులని కష్టంగా భావించేవారు. సర్దుకుపోయేవారు.

అందరికీ సుపరిచితం అయిన దివి సీమ తుపానుకు ముందు, నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో   ఒక తుపాను వచ్చింది. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ తుపాను సృష్టించిన భీభత్సం కారణంగా వందలాది గ్రామాల్లో రోజుల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోయింది. అప్పటికి వార్తా ప్రచార సాధన సంపత్తి  ఇంతగా లేకపోవడం వల్ల ఆ తుపాను సంగతి చాలామందికి తెలియలేదు.

అప్పుడు వేసవి సెలవులకు మా వూరు వెళ్ళాము. మామూలుగా సెలవులు ఇవ్వగానే ఖమ్మం నుంచి, రెబ్బారం నుంచి పక్కనే ఉన్న పెనుగంచిపోలు నుంచి మా అక్కయ్యల పిల్లలు అందరూ కంభంపాడు చేరడం ఆనవాయితీ. ఆసారి మరో ప్రత్యేకత ఏమిటంటే మా ఇంటి చిన్న అల్లుళ్ళు ఇద్దరూ కుటుంబాలతో వచ్చారు. ఇల్లంతా పిల్లల ఆటపాటలతో, పెద్దవాళ్ళ చతుర్ముఖ పారాయణాలతో, అమ్మలక్కల పచ్చీసు ఆటలతో  హడావిడిగా వుంటే, వంటింట్లో మా అమ్మ కట్టెల పొయ్యి ముందు కూర్చుని ఇంతమందికీ వండి వారుస్తుండేది.

ఒకరోజు ఉన్నట్టుండి మబ్బులు కమ్మి వర్షం మొదలైంది. వేసవి వాన కావడం కారణంగా అందరం సంతోషపడ్డాము. సాయంత్రం అయినా తగ్గలేదు. కరెంటు పోయింది. ఎప్పుడు వస్తుందో తెలవదు. మా అక్కయ్యలు ఇంట్లో ఓ  మూలన పడేసిన లాంతర్లు, బుడ్లు బయటకు తీసి శుభ్రం చేసి దీపాలు వెలిగించారు. ఆ వెలుగులోనే అన్నాలు. ఆ రాత్రి గడిచింది. కానీ వాన తెరిపివ్వలేదు. వంటింట్లో నుంచి యధాప్రకారం కాఫీలు, టిఫిన్లు. సాయంత్రమయింది. పొద్దుగూకింది. అయినా వర్షం ఆగలేదు. ఆడవాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. విచారిస్తే తెలిసింది ఏమిటంటే వంటింట్లో పొయ్యి పైకి వున్నాయి. పొయ్యిలో పెట్టడానికే కట్టెలు తడిసిపోయాయి. ఎల్లా! కొంత కిరసనాయిలు వాడి పొయ్యి వెలిగించారు. ఆ పూట ఎలాగో గడిచింది. మర్నాడు కూడా ముసురు తగ్గలేదు. పెరట్లో కూరగాయలు అయిపోయాయి. మూడు పాడి బర్రెల్లో ఒకటి ఇవ్వలేదు, మేత సరిగాలేక కావచ్చు.

తుపాను కష్టాలు మెల్లిమెల్లిగా అర్ధం అవుతున్నాయి. ఇంట్లో సరుకులు నిండుకుంటున్నాయి. పంచదార పరవాలేదు కానీ, కాఫీ పొడుముకు కటకట. అల్లుళ్ళు ఇద్దరికీ సరిపోతే చాలు మిగిలినవాళ్ళు, వాళ్ళే సర్దుకుంటారు అని తీర్మానించారు.

అలా పగలూ రాత్రీ తెలవకుండా వర్షం ధారాపాతంగా కురుస్తూనే వుంది. ఐదో రోజున కాస్త తెరిపి ఇచ్చింది.

వాన వెలిసిన తర్వాత దాని బీభత్సం కొద్దికొద్దిగా తెలుస్తూ వచ్చింది. మధిర రైల్వే వంతెన వరదల్లో కొట్టుకు పోయింది. హైదరాబాదు బెజవాడ మధ్య రైళ్ళ రాకపోకలు నిలిచి పోయాయి. బెజవాడ దగ్గరలో ఒక పాసింజరు రైలు పట్టాలమీద నిలిచిపోయింది. అప్పటికి ఇప్పటిలా జంట రైలు మార్గాలు లేవు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి.  రైలు ప్రయాణీకులకు ఆహార పానీయాలు లేవు. రైలు ఎప్పుడు కదులుతుందో తెలవదు. వాళ్ళంతా బిక్కచచ్చి రైల్లోనే వుండిపోయారు. పక్క వూరి గ్రామస్తులు ఆ కష్టకాలంలో వాళ్ళని ఆదుకున్నారు. తుపాను హడావిడి తగ్గిన  తర్వాత కేంద్ర రైల్వే శాఖవారు ఒక స్టేషనుకు ఆ ఊరి పేరు పెట్టారు.

మా ఒక్క కుటుంబమే కాదు, మా ఒక్క ఊరే కాదు, అనేక గ్రామాల వాళ్ళు మేము పడ్డ కష్టాలే పడ్డారు. ఏం చేస్తాం మన ఖర్మ అనుకున్నారు.

తిట్టడానికి గవర్నమెంటు ఒకటుందని అప్పుడు  తెలవదు.

నిన్న మళ్ళీ హైదరాబాదులో మేము ఉంటున్న ఎల్లారెడ్డిగూడా ప్రాంతంలో రాత్రి ఏడుగంటల సమయంలో కరెంటు పోయింది, భీకరంగా కురిసిన వర్షం కారణంగా. కరెంటు పోయినా ఊరు చల్లపడింది అదే పది వేలు అనుకున్నాం. ఇంట్లో ఇన్వర్టర్ కారణంగా చాలాసేపటి వరకు కరెంటు లేదన్న సంగతి తెలియలేదు. పుష్కర కాలంగా దాన్ని పట్టించుకోకుండా ఉన్నామన్న కసితో అది పగ తీర్చుకుని ఉండేదే. ఎందుకో ఏమో తెలియదు, రెండు రోజుల కిందటే మా కోడలు నిషా, ఎర్రటి ఎండలో బయట బాల్కనీలో వున్న ఇన్వర్టర్ లో  కొని తెచ్చిన డిస్టిల్ద్ వాటర్ నింపిన కారణంగా కలిగిన అల్ప సంతోషంతో అది పనిచేసిన ఫలితంగా మేము కొన్ని గంటలు సుఖపడిన మాట వాస్తవం. ఈ లోపున తెలివి తెరిపిన పడి, ఇన్వర్టర్ స్థాయి, స్థోమత గుర్తుకు వచ్చి,  ఉన్న మూడు గదుల్లో ఫ్యాన్లు, లైట్లు ఆపేసి అందరం ముందు హాల్లో చేరి ఒక లైటు, ఒక ఫ్యానుతో కాలక్షేపం చేయడం మొదలు పెట్టాము. ముందు వాకిలి తెరిస్తే చల్లటి గాలి వచ్చింది. దాంతో చంటి పిల్ల మా మనుమరాలు జీవిక భయపడకుండా లైటు ఒక్కటి వుంచి ఫ్యాను ఆపేసాము. రైస్ కుక్కర్  కరెంటుది కావడంతో అటక ఎక్కించిన ప్రేస్తీజ్ కుక్కరే దిక్కయింది. సరే ఏదో విధంగా భోజనాలు అయ్యాయి అనిపించాము. రాత్రి పది గంటల ప్రాంతంలో ఒక్కసారి  వరండాలో లైట్లు వెలిగి ఆరిపోయాయి. ఇలా జరిగితే కరెంటు త్వరగా వస్తుందని సూతుడు శౌనకాది మునులతో చెప్పినట్టు చిన్నప్పుడు మా వూళ్ళో కరెంటు డిపార్ట్ మెంట్ హెల్పర్ చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి, ఎవరి గదుల్లో వాళ్ళం ఇన్వర్టర్ తో నడిచే ఫ్యాన్లు వేసుకుని ధీమాగా పడుకున్నాము. ఓ రెండు గంటలు ఇన్వర్టర్ ముక్కుతూ మూలుగుతూ పనిచేసి సెలవు తీసుకుంది. అప్పటికి కరెంటు లేని జీవితం కొంత అలవాటయి అలాగే పడుకున్నాము. తెల్లవారుఝామున మూడుగంటల సమయంలో హఠాత్తుగా  కరెంటోదయం అయింది. అదే సమయంలో జ్ఞానోదయం కూడా అయింది.

ఇంట్లో కరెంటు పోయినా మనం మన ఇంట్లోనే ఉన్నాము. కానీ ఆ కరెంటు వాళ్ళు ఇల్లు, సంసారాన్ని వదిలి, ఆ నిశీధిలో, వర్షంలో బద్దకించకుండా పనిచేయబట్టే కదా మనకు మూడు గంటలకో , నాలుగు గంటలకో కరెంటు వచ్చింది. ఈ స్పృహ కలగగానే అంతవరకూ వాళ్ళమీద పెంచుకున్న అసహనంతో పాటు, పడ్డ ఇబ్బందులు కూడా వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి.

ముందే చెప్పినట్టు సుఖదుఖాలు సాపేక్షాలు.



(08- 05-2024)     

18, ఏప్రిల్ 2024, గురువారం

విన్ విజన్ – భండారు శ్రీనివాసరావు

 “ ఆల్ ఓకే! ఇక రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూడండి” అంటున్నారు డాక్టర్ శ్రీ లక్ష్మి.

డాక్టర్ శ్రీ లక్ష్మి గారి ప్రత్యేకత ఏమిటంటే, సర్జరీ చేస్తున్నంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు, కబుర్లు చెబుతున్నారో సర్జరీ చేస్తున్నారో తెలవనంతగా. అంతమాటకారి.

అయిదేళ్ళ క్రితం ఒక కన్ను. ఇప్పుడు మళ్ళీ రెండో కన్ను. నా  రెండు కళ్ళకు కేటరాక్ట్ ఆపరేషన్ చేసింది ఆవిడే.  మొదటిసారి చేసినప్పుడు అనుమానం వచ్చింది, అసలు సర్జరీ చేసినట్టే లేదు. అదే అడిగాను. ఈసారి మరీ ముదరబెట్టుకుని వచ్చారు, అంచేత అలా అనిపించివుంటుంది అన్నది డాక్టరు గారి జవాబు.

ఈ కేటరాక్ట్ ఆపరేషన్ తో ఉన్న సులువు ఏమిటంటే పదిహేను, ఇరవై నిమిషాల్లో పూర్ర్తవుతుంది. చేసిన చోట ఎలాంటి నొప్పి వుండదు, కంటి వరకు ఎనస్తీషియా ఇస్తారు కాబట్టి. దాని ప్రభావం తగ్గిన తర్వాత కూడా ఎలాంటి నొప్పి అనిపించలేదు. అసలు చిక్కల్లా మూడు రకాల కంటి చుక్కల్ని రోజుకు ఆరుసార్లు, నాలుగు సార్లు, మూడు సార్లు చొప్పున నెల రోజులు టైం టేబుల్ ప్రకారం వేసుకోవాలి. ఇదొక చికాకైన, తప్పనిసరి  వ్యవహారం. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మళ్ళీ పరీక్ష చేసి కంటి పవర్ కు తగిన కంటి అద్దాలను సిఫారసు చేస్తారు. ఆ కళ్ళజోడు తగిలించుకుని డాక్టరుగారు చెప్పినట్టు రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూడాలి అన్నమాట.

ఆసుపత్రిలోకి ప్రవేశించగానే నిలువెత్తు వినాయకుడి విగ్రహం సాక్షాత్కరిస్తుంది. డాక్టర్ శ్రీలక్ష్మి కూడా లోనికి రాగానే ఆ విఘ్ననాయకుడికి    చేతులు జోడించి నమస్కరించిన తర్వాతనే  తన విధులు మొదలు పెట్టడం గమనించాము. రిసెప్షన్ లో వున్న వ్యక్తికి మనం వచ్చిన పని లేదా అప్పాయింట్ మెంట్ గురించి చెప్పగానే ఒక సహాయకురాలు వచ్చి మనల్ని మొదటి అంతస్తుకి తీసుకువెళ్లి అక్కడి రిసెప్షన్ హాలులో కూర్చోబెడతారు. ఈలోగా మరో సహాయకురాలు వేడి వేడి కాఫీ, తేనీటి పానీయాలతో మర్యాదలు చేస్తారు. మనం వచ్చింది కంటి పరీక్షలకా, లేక పెళ్లి రిసెప్షన్ కా అని ఆశ్చర్యపోయేలోగా మరో సహాయకురాలు వివరాలు కనుక్కుని సంబంధిత విభాగానికి తీసుకు వెడతారు. అయితే ఇవన్నీ రిజిస్ట్రేషన్ చార్జీ వగైరాలు చెల్లించిన తరువాతనే అనుకోండి. ఇక్కడ నాకు విశేషంగా అనిపించింది ఏమిటంటే ఈ పనులన్నీ ఆడపిల్లలు చేస్తున్నారు. ఎయిర్ ఇండియా హోస్టెస్ ల మాదిరిగా వారి కట్టూ బొట్టూ, మాటా మన్ననా ఒకే తీరున కుదుమట్టంగా వుంది. వారి పేర్లు కూడా ఆసుపత్రివారే పెట్టారేమో అన్నట్టుగా ఒకే రకంగా వున్నాయి. నాకు గుర్తున్నంత వరకు, వారిలో కొందరి పేర్లు: సంతోషిణి, సంగీత, శ్రీలత, అనిత, కవిత, నిఖిత, నవనీత. (మరునాడు  చెకప్/ రివ్యు కోసం పోయినప్పుడు  వారు వస్త్రధారణలో భాగంగా పెట్టుకున్న చిన్ని నేమ్ ప్లేట్ల మీది ఈ పేర్లు చూశాను. ఇవి  చదవగలిగాను. అంటే ఆపరేషన్ సక్సెస్ అయినట్టే కదా!)

కనుపాపలు పెద్దవి కావడానికి కంటిలో చుక్కలు వేసే కార్యక్రమంతో ఓ గంట కాలక్షేపం అవుతుంది. ఆ తరువాత వరుసగా అనేక విభాగాలు తిప్పుతారు. కంటి వైద్యంలో ఇన్ని అధునాతన పరికరాలు రంగప్రవేశం చేసాయనే సంగతి ఈ టూరు వల్ల మనకు    బోధపడుతుంది. ఒక్కొక్క పరికరం లక్షల ఖరీదు చేస్తుంది అని వాటిని చూడగానే తెలిసిపోతుంది. పరవాలేదు, మనం మంచి ఆసుపత్రికే వచ్చాము అనే ఎరుక కూడా కలుగుతుంది.

అసలు ఆపరేషన్ చేసే డాక్టర్ శ్రీ లక్ష్మి గారిని కలిసే లోగా ఈ పరీక్షల తతంగం పూర్తయి,  ఫలితాలు అన్నీ డిజిటల్ రూపంలో   అక్కడికి చేరిపోతాయి. వాటిని ఆకళింపు చేసుకున్న డాక్టరు గారు, పలానా రోజు, పలానా టైముకు రండి అంటారు. సరే అని పలానా రోజున పలానా టైముకు వెడతాము. పలానా రోజునే చేస్తారు కానీ, పలానా టైముకే జరగాలని లేదు. మరేదైనా జరూరు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ముందు నిర్ణయించిన షెడ్యూలు మారే అవకాశం వుంది. నాకు అర్ధం అయింది ఏమిటంటే  ఈ కేటరాక్ట్ ఆపరేషన్ అనేది ఇటువంటి పెద్ద ఆసుపత్రులలో అతి సులువుగా చేసే అతి చిన్న సర్జరీ. అంచేత, వారి  ప్రాధాన్యతాక్రమంలో ఇది చిట్ట చివరిది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత నాకూ అలానే అనిపించింది. 


(డాక్టర్ శ్రీలక్ష్మి)

           

తోకటపా:

హైదరాబాదు బేగంపేట గ్రీన్ లాండ్స్ ప్రాంతంలో ఉన్న ఈ విన్ విజన్ కంటి ఆసుపత్రిని 2015 నవంబరులో శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామివారు ప్రారంభించారు. మొదలు పెట్టడమే కార్పొరేట్ హంగులతో, అధునాతన చికిత్సా పరికరాలతో ఆవిర్భవించిన ఈ కంటి ఆసుపత్రి ఇప్పుడు మరిన్ని హంగులను సమకూర్చుకుంది. అంచేత అక్కడి వైద్యం నాణ్యతకు తగ్గట్టుగానే బిల్లులు చురుక్కుమనిపిస్తాయి. అయితే మంచి బీమా కంపెనీ నుంచి ఆరోగ్య పాలసీ వున్నవారు దర్జాగా అందులోకి అడుగు పెట్టి అంతకంటే దర్జాగా చికిత్స పూర్తిచేసుకుని బయట పడవచ్చు. రోబోటిక్ సర్జరీ వంటి అధునాతన విధానాలతో కూడా కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. కాకపొతే డాక్టర్ శ్రీ లక్ష్మి గారి హస్తవాసి పట్ల నాకు గురి. అందుకే ఆమె చేతితో చేసే శస్త్రచికిత్సను ఎంచుకున్నాను.

అసలు తోక, అసలు టపా:

నాకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య భీమా కార్డు (CGHS) ఉన్నప్పటికీ చాలా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ భీమా అంటే అదోరకమైన చిన్నచూపు అనే అపోహ వుంది. అంచేత మా చిన్నకోడలు, నిషా  తాను పనిచేసే పెద్ద కార్పొరేట్ కంపెనీ హెల్త్  ఇన్సురెన్స్  కార్డు మీద ఈ ఆపరేషన్ చేయించింది. దాంతో Cashless treatment with no questions asked.

దరిమిలా కలిగిన సందేహం.

మరి, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భీమా పట్ల  ఈ ‘చూపుల్లో’ తేడాను ఏ కంటిడాక్టరు  సరిచేయాలి చెప్మా!

16-04-2024