30, జులై 2024, మంగళవారం

మా అమ్మ కధ - భండారు శ్రీనివాసరావు

మా అమ్మ కధ - భండారు శ్రీనివాసరావు

“ మా అమ్మగారి పేరు వెంకట్రామమ్మ. ఆమె కృష్ణా జిల్లా గండ్రాయిలో 1907 నవంబర్ ఒకటో తేదీన జన్మించింది. తండ్రి కొండపల్లి శ్రీనివాసరావు. తల్లి వెంకటమ్మ. పుట్టింటి వారిది శ్రీవత్స గోత్రం. చిన్న తనంలోనే తల్లీ తండ్రీ గతించారు. బాల్యం చాలా ఇబ్బందులతో గడిచిందని చెబుతారు. ఆమె పెద్దన్న గారు కొండపల్లి రామచంద్ర రావు కష్టపడి చదువుకుని ప్లీడరుగా బెజవాడలో ప్రాక్టీసు పెట్టి పేరుమోసిన న్యాయవాదిగా కీర్తి గడించారు. ఆయన నివాసం వున్న రోడ్డుకు ఆయన పేరే పెట్టారు. రెండో అన్న కృష్ణారావు గారు గండ్రాయి కరణీకం చేస్తుండేవారు.
“ మా నాన్న గారు భండారు రాఘవ రావు గారు. ఆయన కంభంపాడు కరణం. పర్వతాలయ్య గారి పెద్ద కుమారుడు. ఆయనకు వివాహం చేయడానికి మా తాతగార్లు ముగ్గురూ గుమ్మడిదుర్రో మరే వూరో గుర్తులేదు – వెళ్లి పిల్లను చూసి సంబంధం అనుకూలంగానే వుందనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చారుట. అదేసమయానికి, అప్పటికింకా ప్రాక్టీసు మొదలుపెట్టని మా పెద్ద మేనమామ రామచంద్రరావు గారు మా వూరు వచ్చి ఇంటి అరుగు మీద కూర్చుని మా తాతల రాకకోసం ఎదురు చూస్తున్నారు. మా నాన్న గారికి, ఆయన చెల్లెల్ని అంటే మా అమ్మగారిని ఇవ్వాలని వచ్చిన సంగతి అర్ధం చేసుకున్న మా తాతగార్లు అప్పుడేం చేయాలన్న మీమాంసలో పడ్డారు. వారు వెళ్లి వచ్చిన సంబంధం వాళ్లు చాలా కలిగిన వాళ్లు. పదెకరాల తోట, సొమ్ములు పెడతాం అని చెప్పారట. ఇటు చూస్తే మా మేనమామ వాళ్ళది వేలు విడిచిన మేనరికం. బాగా లేమిలో వున్న కుటుంబం. ‘యేది ఏమయినా రామచంద్రం వచ్చి కూర్చుని పిల్లను ఇస్తానంటున్నాడు. కనుక మేనరికం కాదని బయటకు పోవడం ఉచితం కాద’ని తీర్మానించుకున్న మా తాతగార్లు రామచంద్రరావును లోపలకు పిలిచి సంబంధం ఖాయం చేసారుట. అలా అయింది మా నాన్న గారితో మా అమ్మగారి పెళ్లి. ఈ నాటిలా కాసులకు కాకుండా బంధుత్వాలకు ప్రాధాన్యం ఇచ్చే రోజులవి.
“అలా కంభంపాడులో మా ఇంటి గడప తొక్కిన మా అమ్మ, దాదాపు అరవై ఏళ్ళపాటు ఆ ఇంటితో అనుబంధం పెంచుకుంది. మొత్తం పన్నెండు కాన్పులు. ఒక పిల్లవాడు (ఏడో కాన్పు) పురిటిలో పోగా, ఏడుగురు ఆడపిల్లలూ, నలుగురు మగపిల్లలు కలిగారామెకు.
“కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, ముని మనుమలు, ముని మనుమరాళ్లనే కాకుండా ముని ముని మనుమరాళ్లను కూడా కళ్ళారా చూసుకోగలిగిన పూర్ణ జీవితం గడిపింది.
“1993 జులై 30 నాడు – ఆ రోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం – శుద్ద త్రయోదశి, అంతా వరలక్ష్మీ వ్రతం నోచుకున్నారు. ముత్తయిదువలు రావడం, ఫలహారాలు చేయడం, వాయనాలు తీసుకుని వెళ్లడం అంతా అయిపోయింది. ఇల్లంతా సందడి ఓ పక్క. మరో వైపు మరణ శయ్యపై అమ్మ. ఆ రోజు ఉదయం నుండి అమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ వుంది. ఏ క్షణానికి యేమో అన్నట్టుగా వుండడంతో, అందరికీ కబురు వెళ్ళింది. చివరకు ఆ రాత్రి ఎనిమిది గంటల ఇరవై అయిదు నిమిషాలకు, ఇచ్చిన ‘కీ’ అయిపోతే గడియారం దానంతట అదే ఆగిపోయినట్టు అమ్మ ప్రశాంతంగా తుది శ్వాస విడిచింది. మమ్మల్ని అందర్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సంవత్సరం క్రితం కనకాభిషేకం చేసుకున్న ఒక సుదీర్ఘ జీవితం ముగిసిపోయింది. మర్నాడు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరిగిన అంత్య క్రియలకు అశేష సంఖ్యలో బంధు మిత్రులు తరలి వచ్చారు.
“మూడో రోజు ఉదయం, అస్తి నిమజ్జనం గురించిన ప్రస్తావన వచ్చింది. చిన్న అల్లుడు, భారతి అక్కయ్య మొగుడు తుర్లపాటి పాండురంగారావు గారు ‘కాశీ వెళ్లి గంగలో కలిపితే బాగుంటుంద’ని సూచించారు. దానిపై చర్చ సాగి సాగి అసలు మొత్తం కర్మ కాండ కాశీలోనే చేస్తే బాగుంటుందన్న సలహాను అంతా సమర్ధించారు. ఆ విధంగా కాశీ ప్రయాణం దైవికంగా నిర్ణయం అయిపోయింది. అమ్మ అపర కర్మలు యావత్తు సమీప బంధు జన సమక్షంలో కాశీలో జరగడం ఓ విశేషం ”
( 1987 లో నేను మాస్కో వెళ్లేముందు మా అమ్మగారు జీవించి వున్నప్పుడు కొందరు కుటుంబ సభ్యులతో తీసిన ఫోటో )

అమెరికాలో మొదటి రోజు



రెండో కుమారుడు సంతోష్ మాసికంతో మొదలయింది.
నాకు తోడుగా వచ్చిన మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారి కుమారుడు లాల్ బహదూర్, కోడలు, మేనకోడలు దీపతో కలిసి ఆదివారం ఉదయం వాషింగ్టన్ డి సి విమానాశ్రయం చేరుకున్నాను. మొత్తం ప్రయాణంలో వాళ్ళు కంటికి రెప్పలా చూసుకున్నారు. చిన్న లగేజ్ కూడా నన్ను ముట్టుకోనివ్వ లేదు. అదృష్టం నా మొబైల్ ను మాత్రం నా చేత్తో పట్టుకోనిచ్చారు.
ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని బయటకు వస్తుండగానే బిలబిలమంటూ మా రెండో అన్నయ్య, మూడో అన్నయ్య పిల్లలు లోపలకు వచ్చారు. నన్ను సియాటిల్ కు తీసుకు వెళ్ళడానికి మా వాడు సందీప్ రేపు వస్తున్నాడు. లగేజ్ తో బయటకు రాగానే నాలుగు మత్తేభాలు వంటి పెద్ద వాహనాలు సిద్ధంగా పెట్టారు. వెళ్ళింది ముగ్గురం. రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది పది మంది. ఈ వాహనాల్లో ఒకటి డ్రైవర్ లేని కారు. మా రెండో అన్నయ్య కొడుకు సత్య సాయి ముచ్చటపడి రెండేళ్ళ క్రితం కొనుక్కున్నాడు. డ్రైవర్ సీట్లో మనిషి వుంటాడు కానీ డ్రైవ్ చేయడు. అంతా ఆటోమేటిక్. కారుకు అమర్చిన సూక్ష్మమైన కెమేరాలు దారిలో వచ్చే పోయే వాహనాలను చూసుకుంటాయి. స్పీడ్ లిమిట్స్ వున్న ఇండికేటర్లు కనిపించినప్పుడు అదే వేగాన్ని వాటికి అనుగుణంగా సరిచేసుకుంటుంది. అంచేత ట్రాఫిక్ పోలీసుల ఓవర్ స్పీడ్ చలానాల ( ఇక్కడ టిక్కెట్స్ అంటారు) బెడద ఉండదు. అలాగే నిర్దేశించిన జాగాలో అదే తనను ముందుకు వెనక్కు జరిగి తనను తాను జాగ్రత్తగా పార్కు చేసుకుంటుంది. దీనివల్ల కారుకు సొట్టలు పడవు. అంతా బాగానే వుంది కానీ రయ్యి రయ్యిమని దూసుకు పోతున్న వాహనాల నడుమ మనం ప్రయాణిస్తున్న కారుకు డ్రైవర్ లేడు అనే భావన ( భయం అందామా) వెంటాడుతూనే ఉంటుంది). 
రెండు రాష్ట్రాలు దాటి మూడో రాష్ట్రం మేరీ ల్యాండ్ లో ప్రవేశించి మా మేనల్లుడు రామచంద్రం కుమారుడు కాశ్యప్, వాహిని దంపతుల ఇంటికి చేరాం. ముందూ వెనకా పెరళ్లు. వెనక దట్టమైన అడవి. నింగిని తాకుతున్నట్టు పొడవైన వృక్షాలు. అప్పుడప్పుడు జింకలు, కుందేళ్ళు కనిపిస్తాయి. వృక్ష, వన్య సంపదలను కాపాడు కుంటున్న తీరు ప్రశంసనీయం. ఇలాంటి విషయాలు అన్నీ గతంలో పదేళ్ళ క్రితం నా బ్లాగులో రాశాను. 
బ్రేక్ ఫాస్ట్ సమయంలో నా రెండో కుమారుడు సంతోష్ ఏడో మాసికం ప్రస్తావన వచ్చింది. ఆ వూళ్లోనే మా దగ్గరి బంధువు, నాకు స్కూల్లో క్లాస్ మేట్ వనం వరదా రావు కుమార్తె స్వప్న, అల్లుడు సుగుణాకర రావు దంపతులు చాలా కాలంగా వుంటున్నారు. అక్కడ మన వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఆయనే దిక్కు. ఫోన్ చేసి, తిథి చెబితే ఆయన పంచాంగం చూసి ఆదివారం మధ్యాహ్నం నుంచి మరునాడు సోమవారం  ఉదయం ఎనిమిదిన్నర వరకు వుందని అంచేత ఈ రోజే పూర్తి చేయడం మంచిదని సలహా చెప్పారు. అదే వూళ్ళో వివిధ గుళ్ళలో పనిచేస్తున్న ఇద్దరు ముగ్గురు పూజారులను సంప్రదించి చివరకు సాయిబాబా గుడి పూజారిని పట్టుకున్నారు. వెంటనే నాలుగు కార్లలో బయలుదేరి దారి మధ్యలో ఒక ఇండియన్ స్టోర్ లో పూజారి గారు చెప్పిన సంభారాల జాబితా ప్రకారం కొనుక్కుని వెళ్లాం. పేరుకు బాబా గుడి కానీ సమస్త దేవతలు అక్కడ కొలువు తీరి ఉన్నారు. పూజారి గారు నెమ్మదస్తులు. ప్రశాంతచిత్తులు. సావధానంగా కార్యక్రమం ఎలాంటి హడావిడీ చేయకుండా చక్కగా పూర్తి చేసారు. దేశం కాని దేశంలో, వచ్చిన మొదటి రోజునే పని పూర్తి అయ్యేలా చూడడం ఆ పై వాడి పనే అనుకున్నాను.
కాశ్యప్ ఇంట్లోనే లంచ్ పూర్తి చేసి సాయం కాలం దాకా కాలక్షేపం చేసి డ్రైవర్ లేని కార్లో దగ్గరా దూరం కాని మా సాయి ఇంటికి చేరుకుని డిన్నర్ చేసి కాసేపు కబుర్లు చెప్పుకుని నిద్రకు ఉపక్రమించాము. 
జెట్ లాగ్ బెడద లేని నిశాచరుడుని కనుక అంతా సక్రమంగా జరిగిందని హైదరా బాదులోని మా కోడలు, మా అన్నయ్యకు తెలియచెప్పే పనిలో పడ్డాను.
ఇప్పుడు సమయం  తెల్లవారు ఝామున జస్ట్ నాలుగున్నర.
గత అయిదేళ్లుగా నాకిది అలవాటే.

కింది ఫోటో:
గుడిలో పూజారి గారి ఆశీర్వ చనాలు తీసుకుంటూ.





https://photos.google.com/share/AF1QipMVC654XuBufk7Q22AMfe4h9Z0HL6DY-9u5d3irzPpwEIhuUKi0wOZPVYqKVehjBw?pli=1&key=Ti1paVV4NXVTbnk1bDQxdnZyd2t6ZlI1MmZJR3BB

దుబాయ్ సెక్యూరిటీ బొమ్మ నువ్వు నువ్వుకాదు పో అంది



విదేశీ ప్రయాణాలు కొత్త కాదు కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పేరుతో చేస్తున్న కొత్త కొత్త సెక్యూరిటీ ప్రయోగాలు ప్రతి ప్రయాణంలో కొత్త గానే వుంటున్నాయి.
మేము ప్రయాణిస్తున్న ఎమిరేట్స్ విమానం అరగంట ఆలస్యంగా హైదరాబాదులో బయలుదేరి దుబాయ్ విమానాశ్రయానికి సకాలంలో కాకపోయినా కనెక్టింగ్ ఫ్లయిట్ తప్పిపోయేంత ఆలస్యం మాత్రం చేయలేదు. 
దుబాయ్ లో సెక్యూరిటీ చెక్ విధానాన్ని అత్యంత ఆధునికం చేయాలని అనిపించడమే తడవు, డబ్బుకు కొరత లేని ఆ దేశపు రాజులు రెండు బొమ్మల్ని తెచ్చి అక్కడ పెట్టారు. ఆ బొమ్మలు సజీవ చిత్రాల మాదిరిగా కళ్ళు కదిలిస్తూ ఎదురుగా నిలబడ్డ మనిషిని ఆపాదమస్తకం పరీక్షించి, అసలు అని తను అనుకుంటే లోపలకు దయచేయమని చేయి చూపిస్తుంది. లేకపోతే బయటకు దయచేయమని వాళ్ల భాషలో వురిమి చెబుతుంది. నా వెంట వచ్చిన( లేదా వాళ్ల వెంట నేను అంటే బాగుంటుంది) మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారి మూడో కుమారుడు లాల్ బహదూర్, కోడలు, మేనకోడలు కూడా అయిన దీప ఇద్దరూ నాకు చెరో పక్క నిలబడి నాకు ఏ మాత్రం అలసట రాకుండా, ఎలాగంటే నా మొబైల్ ను మాత్రం నన్ను మోసుకోనిచ్చారు.
ప్రయాణం ఇలా సజావుగా సాగుతున్న నేపథ్యంలో ఈ దుబాయ్ బొమ్మ వాళ్ళిద్దరికీ పచ్చ జెండా ఊపి నా దగ్గరకు వచ్చి నో, నియత్, నువ్వు నువ్వు కాదు పొమ్మని ఎడమ చేతితో కసిరి పొమ్మంది. అక్కడున్న సెక్యూరిటీ నన్ను వెంటనే బయటకు పొమ్మనకుండా కాళ్ళు ఎక్కడ పెట్టాలి, కళ్ళు కెమెరా లోకి ఎలా చూడాలి అనే విషయాలు బోధ పరిచి మళ్ళీ అక్కడ నిలబెట్టాడు. ఆ బొమ్మ కళ్ళు విప్పార్చి మరీ. నన్ను చూసింది. కనురెప్పలు రెపరెప లాడించింది. బొమ్మ కాస్త మెత్త బడ్డట్టు ఆనిపించింది. కాసేపు అలా చూసి మళ్ళీ కళ్ళు ఉరిమి చూసి నువ్వు నువ్వు కాదు మరొకరివి అని  వాళ్ల భాషలో అరిచి చెప్పింది. 
అప్పుడు లైట్ వెలిగింది. పాస్ పోర్ట్ ఫొటోలో, అమెరికా వీసా ఫొటోలో నాకు మీసం వుంది. ఈ బొమ్మ కానీ ఆ తేడా కనిపెట్టి అలా తేడాగా బిహేవ్ చేస్తోందన్న సందేహం కలిగి ఆ సెక్యూరిటీ అధికారికి మీసాలతో వున్న నా పాత ఐడెంటిటీ కార్డులలోని ఫోటోలు, మీసాలు లేని తాజా ఫేస్ బుక్ ఫోటోలు చూపించి, ఆ బొమ్మ కాదు అంటున్న ఆ నేను ఈ నేనే అని వచ్చీరాని అన్ని భాషల్లో చెప్పేసరికి అతడు కరుణాంత, రంగుడై, ప్రశాంత చిత్తుడై నాకు మాన్యువల్ గా సెక్యూరిటీ చెక్ చేసి మొత్తానికి కథకు శుభం కార్డు వేశాడు. కొన్ని నెలలు నన్ను చూడకుండా వున్న నా రెండేళ్ళ మనుమరాలు జీవిక మొన్నీ మధ్య కటక్ నుంచి వచ్చినప్పుడు హైదారాబాద్ ఎయిర్ పోర్టులో తాతా అంటూ వాళ్ళమ్మ చంకలో నుంచి నా మీదకు ఎగిరి దూకింది. ఈ మాత్రం గ్రహింపు అంత డబ్బు పోసి కొన్న ఆ బొమ్మకు లేకపోవడం విచిత్రమే.

27, జులై 2024, శనివారం

గుర్తుకొస్తున్నాయి - భండారు శ్రీనివాసరావు


నిన్న మధ్యాన్నం భాస్కర శర్మ గారికి నాకిచ్చిన మాట జ్ఞాపకం వచ్చినట్టుంది.
' మీరు సారును కలవాలి అనుకుంటే రెండున్నరకల్లా సెక్రటేరియట్ కి రాగలరా?' 
రాగలరా అనడంలోనే ఆయన సంశయం అర్థం అయింది. వాహన సౌకర్యం లేదు. ఉబెర్ లో వెళ్ళినా గేటు దగ్గర అటకాయింపులు తప్పవు. అప్పటికి భోజనం సరే, స్నానాదికాలు కూడా పూర్తి కాలేదు. 
దేవుడు నాలాంటి వాళ్ల కోసమే కదా వుంది. ఆయనే దోవ చూపించాడు. మా మూడో అక్కయ్య అల్లుడు మా ఇంటికి రావడం ఆయన కార్లో అనుకున్న సమయానికి ఓ అరగంట ఆలస్యంగా వెళ్ళడం జరిగింది.  అయిదారు లిఫ్టులు వున్నా వచ్చే జనం పోయే జనంతో కిటకిట లాడుతున్నాయి. రెండో అంతస్తు తొమ్మిదో నెంబరు గది అన్నారు. మెట్ల మీద వెళ్ళాము. శర్మగారు వచ్చి తీసుకు వెళ్ళడం వల్ల సెక్యూరిటీ బెడద తప్పింది. మమ్మల్ని నేరుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి గారి ఛాంబర్ లోకి తీసుకువెళ్ళారు. ఆయన యాంటీ రూములో మరో మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడుతున్నారు. బయటకు వస్తూనే భట్టి గారు తనదైన మందహాసంతో పలకరించి తన సీటు వద్దకు తీసుకు వెళ్ళారు. కాఫీ మర్యాదలు, ఆదరింపు మాటలు యధావిధిగా పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో మా వాడు చనిపోయినప్పడు వద్దామనుకున్నా రు కానీ అదే సమయంలో వారి సోదరుడు చనిపోవడం వల్ల స్వగ్రామం వెళ్లాల్సి వచ్చింది. 
పేషీ అఫిషియల్ ఫోటోగ్రాఫర్ తో ఫోటోలు తీయించారు. 
ఆ పేషీలో పనిచేస్తున్న సత్యనారాయణ గారు, శేషుబాబు గారు సాదరంగా పేరుతో పలకరిస్తుంటే నా మతిమరపుకి చచ్చేంత సిగ్గు వేసింది 
రాకరాక వచ్చాను కదా మరో మిత్రుడిని కలిసిపోతే సరిపోతుందని అనిపించి ఫోన్ చేసాను. ఆయన గొంతు తగ్గించి , సీ ఎం గారితో వున్నాను, ఆరో అంతస్తులో నా ఆఫీసులో కూర్చోండి నేను వస్తాను అన్నారు.
సరే అని ఆరో ఫ్లోర్ కు వెళ్ళాము. సెక్యూరిటీ బాగానే వుంది సీ ఎం బ్లాకు కదా. వెళ్లి కూర్చున్న కాసేపటికి చిరు నవ్వు చిందిస్తూ సీ ఎం సీ పీ ఆర్వో అయోధ్య రెడ్డి గారు వచ్చారు. పూర్వాశ్రమంలో జర్నలిస్టుగా వున్నప్పుడు పాత అంటే మరీ పాత సచివాలయంలో కలిసి వార్తలకోసం తిరిగేవాళ్ళం. ముందు నవ్వు కనపడి తర్వాత మొహం కనపడడం ఆయన ప్రత్యేకత. 
మళ్ళీ పాత కబుర్లు. నలభయ్ ఏళ్ల గతానికి జారిపోయాను. ఆయన పేషీ లోనే మరో మిత్రుడు, సీ ఎంపీఆర్వో గా పనిచేస్తున్న జాకబ్ గారు కనిపించి ఆప్యాయంగా పలకరించారు.
లిఫ్ట్ దిగి వస్తుంటే ఒకనాడు జూనియర్లుగా  పరిచయం అయి ఈనాడు చాలా సీనియర్లు అయిన   ఐఏఎస్ అధికారులు ఇద్దరు కనపడ్డారు. వారు మధ్యలో దిగిపోయారు. కిందికి దిగుతుంటే లిఫ్ట్ బాయ్ పలకరించాడు. మీరు రేడియో శ్రీనివాస్ గారు కదా! అని అడుగుతుంటే కళ్ళు చెమర్చాయి. రిటైర్ అయి దాదాపు ఇరవై ఏళ్ళు. అయినా జనానికి గుర్తు వున్నాను అంటే అది నిజంగా వాళ్ళ గొప్పతనం, మంచితనం.
లిఫ్ట్ బయటకు రాగానే హిందుస్థాన్ టైమ్స్ అప్పరసు శ్రీనివాసరావు గారు, మరో మిత్రుడు సుధాకర్ (ఒకప్పుడు ఆంధ్ర జ్యోతి) కనిపించారు. శ్రీనివాస రావు, వారి అన్నగారు ఆంధ్ర జ్యోతి ఢిల్లీ కృష్ణా రావు గారు చిరకాల మిత్రులు. శ్రీనివాస రావు ఐ ఏ ఎస్ అధికారుల ద్వారా చాలా సమాచారాలు సేకరించేవారు. ఆయనతో పాటు నేను తిరిగేవాడిని. 
బహుశా నా జీవితంలో నడవాల్సిన నడక మొత్తం ఆ రోజుల్లో సచివాలయంలో నడిచి వుంటాను. కొన్ని చోట్ల లిఫ్టులు వుండేవి కాదు. నాలుగయిదు అంతస్తులు ఎక్కి దిగే వాళ్ళం. అలుపు అనిపించేది కాదు. వయసు అలాంటిది.
ఇంట్లో ఒంటరిగా వున్న వాళ్ళని దేవుడు ఇలా ఒక్కోసారి బయట తిరిగి వంట్లో సత్తువ పెరిగేలా చూస్తాడు. 
అసలీ వయసులో దీన్ని మించిన టానిక్ లేదు.
 ఇక వచ్చే రెండు మాసాలు అమెరికాలో. ఈ రాత్రే ప్రయాణం. సెప్టెంబర్ 22 న తిరిగి రాక.
 (27-7-2024)

24, జులై 2024, బుధవారం

పేరెంట్స్ డే



(ఈ పదాన్ని తెనిగించడం నాకు మంచిగా అనిపించలేదు. పైగా అనువదిస్తే దరిద్రమైన అర్ధం వస్తుంది.అందుకే అలానే ఉంచేశాను)  

“చూస్తుండండి. ఏనాటికో ఓనాడు మనవాడు మనం గర్వపడేలా గొప్పవాడు అవుతాడు” అంటుంది తల్లి.
“నాకూ వాడు ప్రయోజకుడు కావాలనే వుంది. కానీ వాడి తరహా చూస్తుంటే నమ్మకం కుదరడంలేదు” అది తండ్రి అభిప్రాయం.
వీరి అంచనాలు నిజం కావచ్చు, కాకపోవచ్చు. 
కానీ.. ఆ తల్లిది ఆకాంక్షతో కూడిన అతివిశ్వాసం, ఆ తండ్రిది అపనమ్మకంతో కూడిన అభిలాష . ఇద్దరిదీ ఒకటే కోరిక, తమ పిల్లలు  ప్రయోజకులు కావాలనే. తేడా అల్లా భావవ్యక్తీకరణలో. కల్మషం, కల్తీలేని ప్రేమ కన్నవారిది.
పిల్లలు పిల్లలుగా వున్నప్పుడు అనేకమంది తలితండ్రులది ఇదే పరిస్తితి. పిల్లలందరు పెద్దవాళ్ళు అవుతారు. కొద్దిమందే నిజంగా గొప్పవాళ్ళు కాగలుగుతారు. జీవితంలో బాగా ఎదిగొచ్చిన అనేకమంది సినీ నటులు, ఇతర రంగాల ప్రముఖులు పత్రికలకి ఇచ్చే ఇంటర్వ్యూలలో ఒక మాట చెబుతుంటారు, ‘తలితండ్రులు కష్టపడితే ఇలా  పైకి వచ్చాం, కానీ మా ఎదుగుదలను మా  కన్నవాళ్ళు కళ్ళారా చూడలేకపోయారనే  బాధ మాత్రం మిగిలింది” అని. 
తలితండ్రుల ప్రేమకు గుర్తింపుగా వారి పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఒక దినాన్ని కేటాయించారు.

“ తలితండ్రులను ఆదరించండి, ప్రేమించండి” అనేది ఈ ఏడాది పేరెంట్స్ డే నినాదం.

మన మేలుకోరే శ్రేయోభిలాషులు చాలామంది వుంటారు. కానీ మనం ఈ భూమి మీదకు రాకముందునుంచి  మనల్ని మనసారా ప్రేమించింది, మనం బాగుండాలని కోరుకున్నది  మన తలితండ్రులు మాత్రమే.

లోకం చుడుతున్న వీరుడు రాజేష్ వేమూరి


రాజేష్ వేమూరి అనే పేరు వినగానే నాకు అల్లసాని పెద్దన విరచిత స్వారోచిత మనుసంభవం అనే మనుచరిత్ర  కావ్యంలోని ప్రవరుడు, మహాకవి ధూర్జటి రచించిన శ్రీ కాళహస్తీశ్వర శతకం గుర్తుకు వస్తాయి.
ప్రవరాఖ్యుడి గురించి ఖమ్మం కాలేజీలో మా తెలుగు లెక్చరర్ ఆదినారాయణ గారు చెప్పేవారు.
అరుణాస్పదపురం అనే  ఓ మారుమూల కుగ్రామంలో కాపురం చేసుకుంటూ, తలితండ్రులను పోషించుకుంటూ త్రికాల సంధ్యాదులు సక్రమంగా క్రమంతప్పకుండా  నిర్వర్తించుకుంటూ కాలం గడిపే ఓ శోత్రియ శ్రేష్టుడు ప్రవరుడు.  అతడికి తన ఇల్లే కైలాసం. ఊరు దాటి ఎరుగడు. కానీ లోకం చూడాలనే కోరిక. పొలిమేర దాటలేని ఆశక్తత. అంచేత ఊరిలోకి ఏ కొత్త వ్యక్తి వచ్చినా ఇంటికి పిలిచి ఆతిధ్యం ఇచ్చేవాడు. అతిథి మర్యాదల అనంతరం తాను చూడాలని అనుకుని చూడలేని ప్రదేశాల విశేషాలు వారినుంచి వింటూ తృప్తి పడేవాడు. ఈ క్రమంలో యువకుడు అయిన ఓ యువ సిద్ధుడు తటస్థ పడడం, పరాయి ప్రదేశాలను గురించి అతడు చెప్పిన సంగతులు వింటూ, ఇంత చిన్న వయస్సులో అన్ని ప్రాంతాలు ఎలా తిరిగాడని అబ్బుర పడడం,  సరే ఈ కధ ఇంతవరకే చెప్పుకుందాం. తర్వాత కధ తెలియని వాళ్ళు వుండరు. 
ఇదెందుకు చెప్పాను అంటే, ఈ కావ్యంలోని ప్రవరుడి వంటి వారు అనేకమంది ఈ నాటికీ వుంటారు. దేశాలు చుట్టి రావాలని వారికి  వుంటుంది, కానీ అందుకు అనేక అవరోధాలు. అంచేత రాజేష్ వంటి వారు దేశాలు చుట్టి రాసే పుస్తకాలు చదివి,  సంతోషించడం. ఇంత చిన్న వయస్సులో ఇన్ని దేశాలు ఎలా తిరిగారని ఆశ్చర్యపడడం.
మనుచరిత్రలోని  సిద్ధుడి వద్ద, అనుకున్నదే తడవుగా  లోకాలు చుట్టి రావడానికి పాదలేపనం అనే దివ్యమైన పసరు  వుంది.  మరి రాజేష్ దగ్గర ఏముంది. తిరగాలనే ఆకాంక్ష వుంది. దాన్ని నెరవేర్చుకునే పట్టుదల వుంది. పట్టుదలకు తగ్గట్టు సహకరించే భార్య భార్గవి వున్నారు. పోదాం పద డాడీ అంటూ  సంచి సర్దుకుని, నేనూ రెడీ అనే   చిన్నారి హన్ష్ ప్రోద్బలం వుంది. అన్నింటికీ మించి రకరకాల దేశాలు చూడాలి, అక్కడి ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ జీవన విధానాలు తెలుసుకోవాలి అనే బలమైన కోరిక వుంది. విశాలమైన హృదయం వుంది. ఏతావాతా జరిగింది ఏమిటి అంటే ఇరవై రెండు దేశాల వీసా స్టాంపులు వాళ్ళ పాసుపోర్టుల్లో భద్రంగా వున్నాయి. కాణీ ఖర్చులేకుండా మనల్ని కూడా ఆ పుస్తకాల ద్వారా ఆ దేశాలు  తిప్పారు. ఈ పుణ్యం ఎక్కడికి పోతుంది చెప్పండి. ముందు ముందు మరిన్ని దేశాలు తిరుగుతారు. మరిన్ని పుస్తకాలు రాస్తారు. మనమూ  వాటిని చదువుతూ వారితో పాటు ఆయా దేశాలు ఉత్తపుణ్యానికి చదువుతాము. ఉభయతారకం అన్నమాట.
ఇంతకీ దూర్జటి పద్యం గురించి ప్రస్తావించారు కానీ ఆ ప్రసక్తి రాలేదేమిటి అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నాను. ముగింపు కోసం అట్టే పెట్టాను.
శ్రీ కాళహస్తీశ్వర శతకంలో ఆఖరి నూరో పద్యం ఇది.
“దంతంబుల్పడనప్పుడే తనవునం దారూడి యున్నప్పుడే
 కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే 
విన్తల్మేన చరించనప్పుడే కురుల్వెల్ల గానప్పుడే చింతింపన్వలె
నీ పదాంబుజములన్ శ్రీ కాళ హస్తీశ్వరా!”
ప్రతిపదార్ధం అవసరం అనుకోను.  
తిరగగలిగిన వయసులో తిరగకుండా, ఇప్పుడు 78 ఏళ్ల వయసులో తిరగాలనే  కోరిక ఉన్నప్పటికీ   తిరగలేని అశక్తత కలిగిన మా వంటి వారి గురించే ఆ పద్యం రాసారని అనిపించింది. 
అయినా భక్త గోపన్న అన్నట్టు, తక్కువేమి మనకు, రాజేష్ పుస్తకం చేత వున్నవరకు.
కావున, కాబట్టి దేశాలు  తిరగలేని మా బోంట్ల తరపున వారికి  మనః పూర్వక ధన్యవాదాలు.

23, జులై 2024, మంగళవారం

మాస్కో అతిథి


నందగిరి ప్రసాద్.  నలభయ్ ఏళ్ల క్రితం నేను మాస్కోలో తిరుగాడిన ప్రదేశాలన్నీ, ప్రస్తుతం మాస్కోలో ఉద్యోగం చేస్తున్న ఈ ప్రసాద్ గారు అనే పెద్ద మనిషి గత మూడు మాసాలుగా నాకు వీడియోలో ప్రతి ఆదివారం నాడు తాను కలయ తిరుగుతూ నాకు ఫోన్లో చూపిస్తూ వస్తున్నారు.  నిజానికి వీరితో నాకు పూర్వ పరిచయం లేదు. ఎప్పుడో నా బ్లాగులో, నా ఒకప్పటి మాస్కో జీవితం గురించి చదివి, గట్టి పట్టుదలతో ప్రయత్నించి, నా ఫోన్ నెంబరు పట్టుకుని ఓ రోజు ఫోన్ చేసారు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఒకప్పుడు నేను అక్కడ వున్న అయిదేళ్ల కాలంలో చూసిన మాస్కోకు ఇప్పటి మాస్కోకు స్థూలంగా పెద్ద మార్పులు లేకపోయినా,  ప్రజల జీవన శైలి, వస్త్ర ధారణల్లో వచ్చిన మార్పులు స్పుటంగా కనిపించాయి. మళ్ళీ ఒకసారి మాస్కో వెళ్ళాలనే నా తీరని కోరికను ఆయన ఈ విధంగా తీరుస్తూ వస్తున్నారు.
 ప్రసాద్ గారు నాకు పరిచయం లేని మనిషి అయినా కూడా, వీడియోల్లో చూస్తూ వచ్చాను కనుక ముఖ పరిచయం లేని మనిషి అని చెప్పలేను.
నిన్న ఉదయం ఫోన్ చేసి, హైదరాబాద్ వచ్చాను, సాయంత్రం నాలుగు గంటలకు  మీ ఇంటికి వస్తున్నాను, లోకేషన్ షేర్ చేయమని చెప్పి, అన్నట్టే వచ్చేసారు. గత మూడు నెలలుగా ఫోన్లో మాట్లాడుతూ వున్నా మేమిద్దరం ఒకరినొకరం కలుసుకోవడం ఇదే మొదటిసారి. రెండు గంటలు కూర్చుని మళ్ళీ ఆరు గంటలకు బయలు దేరి వెళ్ళిపోయారు. తాను మరో మూడు నాలుగేళ్లు మాస్కోలో వుంటానని, తాను కూడా (పెళ్లి కాలేదు కనుక) ఒంటరిగానే ఉంటున్నానని, తప్పకుండా వచ్చి తనతో వుండమని మరీ మరీ చెప్పారు. మేము మాస్కోలో వున్నప్పుడు తాను బెజవాడలో స్కూల్లో చదువుతున్నానని, తనకు ఇప్పటి మాస్కో తెలుసుకానీ, నలభయ్ ఏళ్ల క్రితం ఎలా వుండేది అన్నది నా రచనల ద్వారా తెలుసుకున్నానని చెబుతూ, ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా కలవాలని అనుకున్నానని, అంచేత హైదరా బాద్ రాగానే మొదటి ఫోన్ మీకే చేసాను అని అన్నారు.
మొత్తం మీద నిన్న ఓ రెండు గంటలు ప్రసాద్ గారి మాటలతో కాలక్షేపం అయ్యింది.

అసలు అధికారం ఎక్కడ వుంది?



ఈ కింది సంభాషణలు చిత్తగించండి: 

“మీరు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి  అయివుండి, ఎందుకు రాజీనామా చేసి రాజకీయాల్లో చేరదామని అనుకుంటున్నారు?”
“రాజకీయాల్లో వుంటే మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందనే నమ్మకంతో రాజీనామా చేసి రాజకీయాల్లో చేరుతున్నాను”
“రాజకీయాల్లోకి వచ్చారు సరే! కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?”
“అలా అయితేనే మనం అనుకున్న విధంగా ప్రజాసేవ చేయవచ్చని నాకు గట్టిగా అనిపించింది”

“దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే మీరు పెద్ద పారిశ్రామికవేత్త. అనేక స్వచ్చంద సంస్థలకు కోట్ల రూపాయలు  భూరివిరాళాలుగా  ఇస్తుంటారు. మరి  రాజకీయ ప్రవేశం చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది”
“మనం కోరుకున్న విధంగా ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలను మించిన మార్గం లేదు కనుక”

“సినిమా రంగంలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు. మీకు మీరే సాటి అనే పేరుంది. ఒక్కసారి మిమ్మల్ని తాకితే చాలు, జన్మధన్యం  అనుకునే వీరాభిమానులు మీకు లక్షల్లో వున్నారు. ఏ సినిమా వేసినా కాసుల వర్షం కురుస్తుంది. మరి ఈ వయసులో రాజకీయ అరంగేట్రం చేసి,  ఎండనకా, వాననకా ప్రజాసేవ అంటూ ఈ తిరుగుళ్ళు ఏమిటి?”
“ఎంత సంపాదించినా, ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నా సమాజానికి తిరిగి ఎంతోకొంత ఇవ్వాలని ఈ మార్గం ఎంచుకున్నా. నా దృష్టిలో ప్రజాసేవ చేయాలంటే ఇదొక్కటే సరైన  మార్గం”   
 
“మీ నాన్నగారు రాజకీయ రంగంలో పేరెన్నిక కన్నవారు. మీరేమో విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు. గొప్ప కంపెనీకి సీ.ఈ.ఓ.గా వున్నారు.  వృత్తిపరంగా అనేక దేశాలు అలవోకగా చుట్టి వస్తుంటారు. ఆ జీవితం వదులుకుని ఇప్పుడు రాజకీయ ప్రవేశం ఎందుకు చేసినట్టు”
“నాన్నగారికి రాజకీయ వారసుడిగా కాదు, ఆయన ఆలోచనలకు, తలపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజాసేవకు ఇది ఉత్తమ మార్గంగా నాకు తోచింది”

“మీరు గొప్ప జర్నలిష్టు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు మీ మాట శిరోధార్యం. అలాంటిది మీరు కూడా రాజకీయ తీర్థం పుచ్చుకోవడం ఆశ్చర్యంగా వుంది”
“మనం ఎన్ని రాసినా, ఎన్ని హితోక్తులు చెప్పినా సమాజాన్ని మార్చాలి అంటే రాజకీయాలు తప్పిస్తే వేరే దోవ కనిపించలేదు. అందుకే ఈ మార్గం పట్టాను”  

ఇలాంటి సంభాషణలు తరచుగా వింటున్నప్పుడు సామాన్యుడికి కలిగే అభిప్రాయం ఒక్కటే!
చివరికి ప్రజాసేవ కూడా సోషలిజంలాగా అర్ధంపర్ధం లేకుండా వాడే పదంగా మారిపోయిందని. 
మరో అర్ధం కాని విషయం వుంది. ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళు ఎవరూ డబ్బులు లేని వాళ్ళు కాదు. మరిన్ని ఎక్కువ సొమ్ములు సంపాదించేందుకు రాజకీయాల్లో చేరుతున్నారా అంటే అదీ కాదు. మరి ఎందుకోసం ఈ యావ!  
ఎందుకంటే రాజకీయం శక్తివంతమైన అయస్కాంతం వంటిది. అమిత జనాదరణ కలిగిన సినీరంగ ప్రముఖులూ, కోట్లకు పడగెత్తిన వ్యాపార, వాణిజ్య శ్రేష్ఠులు, తమ కత్తికి ఎదురేలేదని భ్రమించే సంఘ వ్యతిరేకశక్తులూ, ఉద్యోగంలో వున్నన్ని రోజులూ అధికారచక్రం అలవోకగా  తిప్పిన ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు ఇలా అందరూ కట్టగట్టుకుని తీయనీటికి ఎగబడే చేపల చందంగా రాజకీయ కండువాలు కప్పుకోవడం కోసం తహతహలాడేది అందుకే.
ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం!

‘మాకు ప్రజల్లో అత్యంత ఆదరణ వుంది. కన్నెత్తి చూస్తే చాలు, పన్నెత్తి పలకరిస్తే చాలనుకుని మాకోసం జనాలు గంటలు గంటలు పడిగాపులు కాస్తుంటారు. కానీ  బయటకు తెలియని విషయం ఒకటుంది. ఎంతో శ్రమపడి, మరెంతో ఖర్చుపెట్టి  అవుట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఆఖరి నిమిషంలో మా ఆశల మీద నీళ్ళు చల్లడానికి ఒక్క బీట్ కానిస్టేబుల్ చాలు. అంత చిన్న ఉద్యోగి అధికారం ముందు మా యావత్తు ప్రజాకర్షణ బూడిదలో పోసిన పన్నీరే. అదే ఓ చోటా మోటా రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే చాలు, షూటింగ్ పర్మిషన్  ఒక్కటే కాదు, కస్టడీలో ఉన్న మనిషికూడా దర్జాగా బయటకు వస్తాడు. ఇక మా ఈ సంపాదన, ఈ సంపద, ఈ ఆకర్షణ ఏం చేసుకోవాలి? అందుకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను’ అనేది  ఓ ప్రముఖ సినీనటుడి మన్ కీ బాత్.

‘ముఖ్యమంత్రి గదిలోకి అయినా తలుపు తోసుకుని పోయేవాళ్ళు వుంటారు. అదే మా సంగతి చూడండి. ఇంచుమించుగా ముప్పయి అయిదేళ్ళు అనేక హోదాల్లో పనిచేసాము. ఏ ఒక్క రోజయినా మా అనుమతి లేకుండా చీమ కూడా మా ఛాంబర్ లోకి అడుగుపెట్టలేదు. ఒక్క సంతకం చేస్తే చాలు కోట్ల రూపాయల లాభాలు తెచ్చే ఫైళ్ళు మరుక్షణంలో క్లియర్ అవుతాయి. కానీ మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎంత గట్టి ఆఫీసర్లం అయినా సరే, పైనుంచి ఫోన్ వస్తే చాలు మేము కిక్కురుమనకుండా సంతకం చేసి పంపేయాల్సిందే. అయినా ఒక్కోసారి  మొండికేసి పై వాడు చెప్పిన పని చేయం. అంతరాత్మ చెప్పిన విధంగానే, రూలు ప్రకారమే చేస్తాం. సాయంత్రానికల్లా ఆ అంతరాత్మని వెంటబెట్టుకుని ఓ చెత్త పోస్టులోకి వెళ్ళమంటారు. ఇంత సర్వీసు చేసి అలాంటి పోస్టులు చేసే బదులు, అంతరాత్మ పీక నొక్కేసి అక్కడే వుంటే పోలా! కొన్నాళ్ళు బీరాలకు పోయినా, కాలం గడుస్తున్నకొద్దీ  తత్వం బోధపడి సర్దుకుపోవడమే మేలనే స్తితికి చేరుకుంటాము. కానీ ఎక్కడో మనసు మూలల్లో  బాధ. ఇంత చదువు చదివాము. ఇంత గొప్ప శిక్షణ పొందాము. చివరికి ఎవరో ఒక అంగుష్ఠమాత్రుడు చెప్పినట్టు చేయాల్సివస్తోంది. అంటే ఏమిటి? మేము అనుకున్న అధికారం మా ఉద్యోగాల్లోలేదు. అసలయిన అధికారం రాజకీయంలో వుంది. కాబట్టి రిటైర్ అయిన తర్వాత అందులోనే దూరితే పోలా!’ అనేది  ఒక సీనియర్ అధికారి అంతరంగ మధనం.

“ఏళ్ళ తరబడి కష్టపడి సువిశాల వ్యాపార, వాణిజ్య సామ్రాజ్యాన్ని నిర్మించాను. నెలకు లక్షలు లక్షలు జీతాలు తీసుకునే సిబ్బంది నా దగ్గర వేల మంది అనేక దేశాల్లో పనిచేస్తున్నారు. వాటిని చుట్టి రావడానికి సొంత విమానాలు వున్నాయి. బస చేయడానికి ఏడు నక్షత్రాల హోటళ్ళకు ఏమాత్రం  తీసిపోని సొంత అతిథి గృహాలు అన్ని నగరాల్లో  లెక్కకు మిక్కిలిగా వున్నాయి. కానీ ఏం లాభం. గవర్నమెంటులో  ఒక్క చిన్న ఫైలు కదిలించడానికి మా సీనియర్ అధికారులు సచివాలయం చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళు హోటల్లో ఇచ్చే టిప్పు పాటి చేయని నెల జీతాలు తీసుకునే ప్రభుత్వ గుమాస్తాల ముందు చేతులు కట్టుకుని నిలబడి గంటలు గంటలు వెయిట్ చేస్తుంటారు. ఓ చిన్నపాటి రాజకీయ నాయకుడు కల్పించుకుని పై వాళ్లకు ఓ మాట చెబితే ఆ ఫైలు  ఆఘమేఘాల మీద కదిలి, అన్ని సంతకాలతో ఆమోద ముద్ర వేసుకుని బయటకు వస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎదురయినప్పుడు అనిపిస్తుంది, ఎందుకీ పనికిరాని వైభోగాలు, సిరి సంపదలు అని. అసలైన అధికారం మా దగ్గర లేదని తేలిపోయింది. ఎక్కడ ఉన్నదో కూడా తెలిసిపోయింది. అందుకే రాజకీయ రంగప్రవేశానికి అడుగులు వేస్తోంది” ఒక వ్యాపారవేత్త అంతరంగం.

“ఒక చిన్న వీధి రౌడీ దగ్గర కుడి భుజంగా చాలా కాలం వున్నాను. అతడు చెప్పిన పనల్లా చేస్తూ పోయాను. చాలాసార్లు  పోలీసులకు దొరికిపోయి నానా అవస్థలు పడ్డాను. వాళ్ళు నన్ను  నన్ను నడి బజారులో తన్నుకుంటూ స్టేషన్ కు తీసుకు వెడుతుంటే మిన్నకుండిపోయాను. ఇక ఎన్నాళ్ళీ కష్టాలు అని ఓ శుభ ముహూర్తం చూసుకుని రాజకీయ నాయకుడి దగ్గర అనుచరుడి  అవతారం ఎత్తాను. కొంత పేరు వచ్చిన తర్వాత నన్ను అడిగేవాడే లేడు, అడ్డుకునే వాడే లేడు. నన్ను పట్టుకునే పోలీసు పుట్టలేదు, నన్ను పెట్టే జైలు కట్టలేదు అనే తరహాలో రొమ్ము విరుచుకుని తిరిగే అవకాశం నాకీ కొత్త వృత్తి ఇచ్చింది” అని ఓ మాజీ గ్యాంగ్ లీడర్ తన  గోడు వెళ్ళబోసుకుంటాడు. 
అంటే వీరందరినీ రాజకీయాల వైపు  బలంగా లాగుతోంది వ్యవస్థలో ఉన్న లోపం అనుకోవాలి. 
 
తోకటపా:
ఇలా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు పైకి చెప్పే ప్రజాసేవ అనేది ఒక పడికట్టు పదం మాత్రమే. అసలు కారణాలు మాత్రం  వేరే అనిపిస్తే తప్పేముంది! 
నిజానికి ప్రజాసేవే చేయాలి అనుకుంటే అంటే రాజకీయ పదవులు అవసరమా! 
ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకే వెళ్ళనక్కరలేదు. ఉన్నచోట వుండే భగవధ్యానం చేసుకోవచ్చు.

22, జులై 2024, సోమవారం

ఊణషాణ మాసికం – భండారు శ్రీనివాసరావు

 

ఆదివారం 21-7-24 నా రెండో కుమారుడు సంతోష్ చనిపోయి 171 వ రోజు.

ఊణషాణ మాసికం. 🙏

ఎప్పుడూ వినలేదు ఏమిటీ మాసికం అని అడిగారు మితృలు కొందరు మా రెండో కుమారుని ఊణషాణ మాసికం పెట్టిన సంగతి ఫేస్ బుక్ లో చదివి.

ప్రేత సంబంధ కర్మలు అయినా, యాగ సంబంధ క్రతువులు అయినా నమ్మకం ప్రధానం అనేది నా నమ్మకం. నా తల కొరివి పెట్టాల్సిన వాడికి నేనే అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి గత ఫిబ్రవరిలో నాకు ప్రాప్తించినప్పుడు నా మనసు నా మనసులో లేదు. ఏదో కలలో జరుగుతున్న విధంగా అన్నీ సశాస్త్రీయంగా జరిగిపోయాయి, నా అన్నగారు భండారు రామచంద్ర రావు గారు , మా  పెద్ద కుమారుడు  సందీప్  భండారు పర్యవేక్షణలో.

శ్రాద్ధ కర్మలకు నేతృత్వం  వహించిన వసిష్టుల వారు  శ్రీ సి.హెచ్. యు.ఎస్. ప్రసాద శర్మ గారు.  వాటిల్లో భాగంగా నా చేత అనేక దానాలు చేయించారు. మరణించిన మనిషి తాలూకు జీవి సంవత్సరం పాటు వేలాది మైళ్ళు ప్రయాణిస్తుందని, ఆ ప్రయాణంలో జీవుడు అనేక రకాల ఈతి బాధలకు గురవుతాడని, ఎర్రటి ఎండల్లో, వానల్లో, దుర్గమ మార్గాల్లో ఆ ప్రయాణం సాగుతుందని, ఉపశమనంగా ఉండడానికి గొడుగు, పాదరక్షలు, వంట దినుసులు, కాయగూరలు, వంట పాత్రలు, నీళ్ళ పాత్ర, చెంబు వగైరాలు దానాలుగా ఇప్పించారు.  ఈ సుదీర్ఘ ప్రయాణంలో, 45 వరోజున  ( త్రిపక్షం), 171 వ రోజున  జీవుడు మరింత శ్రమకు గురవుతాడు. అంచేత ఈ రోజుల్లో కూడా తప్పనిసరిగా మాసికాలు పెట్టాలి.

జీవించి వున్న వారికి ఒక మాసం మరణించినవారికి ఒక రోజుతో సమానం కనుక నెలకోసారి మాసికం పెట్టి పిండ ప్రదానం చేస్తే, వారికి ప్రతిరోజూ భోజనం పెట్టినట్టు అవుతుందని ఓ నమ్మకం. ఇలా పన్నెండు నెలలు గడిచిన తర్వాత ఏడాది చివర్లో పెట్టే హూణ మాసికం, సాంవత్సరీకం, ఆబ్దీకంతో ఈ కర్మ కాండ పూర్తవుతుంది. జీవుడి పాప పుణ్యాల ప్రాతిపదికన పునర్జన్మ, లేదా స్వర్గ, నరక లోక ప్రాప్తి నిర్ధారణ అవుతుంది.

ఈ విషయాలు అన్నీ శర్మగారు సవిస్తరంగా  నాకు అప్పుడే తెలిపారు.

కానీ అప్పుడు నా  గుండె, మనసు, శరీరం అన్నీ ఘనీభవించి వున్నాయి.

ముందే చెప్పినట్టు అంతా నమ్మకం.

చనిపోయింది స్వయంగా నా కుమారుడు. నా ఇహ లోక ప్రయాణం సజావుగా సాగడానికి వాడు బతికి వున్నప్పుడు ఎన్నో ఎన్నో చేశాడు.  పై లోక ప్రయాణంలో వాడికి  ఇబ్బందులు రావు అని చెబుతున్నప్పుడు నమ్మకంగా పాటించక తప్పదు. అదే చేశాను. చేస్తున్నాను.



(22-07-2024)      

 

21, జులై 2024, ఆదివారం

ఆదివారం ఆడవారికోసం



గోపాలానిది అటూ ఇటూ కాని వయసు. ప్రతిదీ అర్ధం చేసుకోవాలనిపిస్తుంది. ఏదీ సరిగా అర్ధం కాదు.
అమ్మ వొంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకోవడం చూశాడు కానీ ఎందుకో అర్ధం కాలేదు. అదే  అడిగాడు.
“ఇలా ఏడిస్తేకానీ నా గుండెల్లో భారం తగ్గదు” అంది భారంగా.
“అర్ధం కాలేదు. భారం అంటే?”
“నీకర్ధం కాదులే! ఇప్పుడే కాదు ఎప్పటికీ అర్ధం కాదు” కొడుకును దగ్గరికి తీసుకుంటూ   అంది తల్లి.
గోపాలం తండ్రి దగ్గరకు వెళ్లి అమ్మ ఏడుస్తున్న సంగతి చెప్పి కారణం అడిగాడు.
“మీ అమ్మే కాదు ఆడాళ్లందరూ కారణం లేకుండానే ఏడుస్తుంటారు” తేలిగ్గా తీసేశాడు తండ్రి.
కానీ ఆడవాళ్ళు ఎందుకు ఏడుస్తారు అన్న అనుమానం తీరలేదు చిన్న గోపాలానికి.
స్కూలుకు వెళ్ళినప్పుడు టీచరు వొంటరిగా వున్నప్పుడు చూసి తన అనుమానం బయట పెట్టాడు.
ఆ టీచరు బాగా చదువుకున్నది. లోకజ్ఞానం బాగా వున్నది.
ఆమె ఇలా చెప్పింది.
“బ్రహ్మ దేవుడు సృష్టి కార్యం నిర్వర్తిస్తూ ఒక స్త్రీ మూర్తిని తయారు చేశాడు. ఆ బొమ్మకు ప్రాణం పోసేముందు స్త్రీ జాతికి కొన్ని ప్రత్యేకతలు కల్పించాలనుకున్నాడు.
“సంసార భారాన్ని తేలిగ్గా మోయగల శక్తిని ఆమె చేతులకు ఇచ్చాడు. అదేసమయంలో కుటుంబ సభ్యులకు ఎలాటి  ఇబ్బంది లేకుండా  చూడగల మానసిక మృదుత్వాన్ని ప్రసాదించాడు.
“నవమాసాలు మోసి, ప్రాణాలనే  పణంగా పెట్టి మరో జీవిని ఈ లోకంలోకి తీసుకురాగల ఆత్మ స్తైర్యాన్ని అనుగ్రహించాడు.
“అంతేకాదు, అంత కష్టపడి కన్న, కన్న  పిల్లలే   పెరిగి పెద్దయిన తరువాత  వారి నుంచి ఎదురయ్యే దూషణ భూషణ  తిరస్కారాలను భరించగల హృదయ వైశల్యాన్ని వరంగా ఇచ్చాడు.
“కుటుంబంలో సమస్యలు ఎదురయినప్పుడు అందరూ పట్టనట్టు వొదిలేసి వెడుతున్నా అన్నీ తన నెత్తిన వేసుకుని సంసార నావను ఓ దరిచేర్చగల నిగ్రహాన్ని అనుగ్రహించాడు.
“ఇంట్లో ఏఒక్కరికి  వొంట్లో బాగా లేకపోయినా ఏమాత్రం విసుక్కోకుండా  రేయింబవళ్ళు  సేవ చేసే మంచి మనసును ఆమె పరం చేసాడు.
“పిల్లలు విసుక్కున్నా, మాటలతో చేతలతో మనసును గాయపరచినా వారిని  ప్రేమించి లాలించే హృదయాన్ని ఇచ్చాడు.
“కట్టుకున్నవాడు ఎన్ని తప్పులు చేసినా ఉదారంగా మన్నించి  మరచిపోగల మనసును ఇచ్చాడు.
“సంసారంలో ఎన్ని వొడిదుడుకులు ఎదురయినా ఎదుర్కుంటూ  భర్త వెంట నడవగల ధీమంతాన్ని ఆమె సొంతం చేశాడు.
“ఇన్ని ఇచ్చిన ఆ భగవంతుడు, ‘కన్నీరు’ ను కూడా  వరంగా  అనుగ్రహించాడు.
“కన్నీరు  ఆడవారి  సొంతం.  తమకు  అవసరమయినప్పుడల్లా కన్నీరు పెట్టుకుని  తమ మనసులోని భారాన్ని దింపుకుంటారు. కష్టాలతో, క్లేశాలతో   కల్మషమయిన మనసును శుభ్రం చేసుకోవడానికి వారికి ఉపయోగపడే నీరే ఈ కన్నీరు. కన్నీరు పెట్టుకోవడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం కానీ  హేతువులు చూపించాల్సిన అగత్యం కానీ ఆడవారికి  లేదు.
“చూడు గోపాలం. ప్రేమను నింపుకున్న ఆడవారి హృదయానికి ప్రధాన కవాటాలు వాళ్ల కళ్ళల్లోని ఈ కన్నీటి  చుక్కలే.”
టీచరు  చెప్పింది గోపాలానికి కొంత అర్ధం అయింది. కొంత కాలేదు.
కానీ,  ప్రపంచంలోని మగవాళ్లకు మాత్రం  ఎప్పటికీ అర్ధం కాదు. ఆ అవసరం కూడా వారికి లేదు.

19, జులై 2024, శుక్రవారం

తీరికలేని మనుషులు


 

ఆ మధ్య జ్వాలా ఫోన్ చేశాడు.
‘ ఎప్పుడూ మేము చేయడమేనా! నువ్వు ఫోన్ చేయవా?’
నిజమే! కాల్ లిస్టు తీసి చూస్తే అవుట్ గోయింగ్ ఒకటి రెండు కూడా లేవు. అన్నీ ఇన్ కమింగే.

ఒకరోజు సాయంత్రం మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారి కుమార్తె వేణి ఖమ్మం నుంచి ఫోన్ చేసింది.
"ఏమిటి విశేషం" అన్నాను మామూలుగా.
"అదే బాబాయ్ నేను చెబుదామని అనుకున్నది. విశేషం ఉంటేనే ఫోన్ చేయాలా! మామూలుగా  ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కుంటే చాలా బాగుంటుంది" అన్నది.
 అంతే కాదు చిన్నతనం నాటి ఒక వృత్తాంతం  చెప్పింది. మా అన్నయ్య ఉద్యోగ రీత్యా వైజాగ్ లో వున్నప్పుడు పోస్టాఫీసు నుంచి ఓ డజన్ కార్డులు కొనుక్కు వచ్చి వేణి చేతికి ఇచ్చి చెప్పాడుట. ‘అడ్రసు కూడా రాసి పెట్టాను. నువ్వు చేయాల్సింది అల్లా వారానికి ఒక కార్డు కంభంపాడులో ఉన్న బామ్మకు పోస్టు చేయి. పెద్ద విశేషాలు రాయక్కరలేదు. మేము క్షేమం, మీరు కులాసాగా వున్నారని భావిస్తాను అని రాయి చాలు. పల్లెటూళ్ళో ఉంటున్న ఆమెకు ఈ సమాచారం ఎంతో ఊరట ఇస్తుంది. మనమంతా తనకు మానసికంగా దగ్గరగా వున్నామనే భావన పెద్దవాళ్లకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఈ వయసులో వారికి కావాల్సింది ఇంతకంటే ఏమీ వుండదు అని.
‘నాన్న చెప్పింది నా మనసులో ముద్ర పడింది. అందుకే మీ వంటివారికి తరచుగా ఫోన్  చేసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను’ 
 "మంచి నిర్ణయం వేణీ" అన్నాను.
జ్వాలా చెప్పింది, వేణి చెప్పింది ఒకటే. 
నిజానికి ఇలాంటి మాటలు అన్నీ నేనే ఒకప్పుడు ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ వచ్చాను. 
‘మధ్య మధ్య కలుస్తూ వుంటేనే కుటుంబ బంధాలు, మధ్య మధ్య  మాట్లాడుకుంటూ వుంటేనే స్నేహ సంబంధాలు’ అంటూ గొప్పగా నీతులు చెప్పాను. కానీ నేను చేస్తున్నది ఏమిటి?
పక్కవారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి  అనుకోవాలా!
చేతిలో ఫోన్ అస్తమానం వుంటుంది. వెనుకటి మాదిరిగా గుండె గుభిల్లుమనే చార్జీల బాధ లేదు. మరి ఎందుకీ నిర్లిప్తత.
నాకూ చిన్నతనం గుర్తుకు వచ్చింది. సొంతంగా ఇంట్లో ఫోన్ లేకపోయినా మిత్రులతో, చుట్టాలతో మాట్లాడాలని తాపత్రయ పడేవాళ్ళం.  పుట్టిన రోజు సందర్భాల్లో  ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుకునే వాళ్ళం. ఇప్పుడూ చెబుతున్నాం. ఫేస్ బుక్ లోనూ, వాట్సప్ లోనూ  మొక్కుబడిగా షరా మామూలు గ్రీటింగ్ పెట్టి ఊరుకుంటున్నాం. అదీ ఫేస్ బుక్ వాడు గుర్తు చేస్తేనే సుమా. వాళ్ళు చూస్తారో తెలియదు. ఒక పని అయిపోయింది అనుకుంటాం. అలా కాకుండా ఆ ఒక్కరోజు ఫోన్ చేసి శుభకామనలు తెలియచేస్తే ఎంత బాగుంటుంది. 
అంత తీరికలేని పనులు ఏమీ లేవు కదా!
కానీ ఇంత చిన్న చిన్న పనులు ఎందుకు చేస్తాం!  
అసలు అంత తీరిక ఏదీ! 
Courtesy Cartoonist

18, జులై 2024, గురువారం

ఎలా గుర్తుంటాయో ఆ దేవుడికే తెలియాలి


‘‘ఈ శంఖంలో తీర్ధం కదా పోయాల్సింది, బియ్యం పోస్తున్నావేమిటి’
నా అజ్ఞానానంధకారంలో నుంచి సంధించిన ప్రశ్న.
 
‘ఇళ్ళల్లో పూజకు వాడే శంఖాల్లో బియ్యమే పోయాలిట. ఇంకోటి తెలుసా! పదిహేనేళ్ళ క్రితం కాబోలు  ఆర్వీవీ కృష్ణారావు గారితో మనం  తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన  ఈ శంఖాన్ని ఇస్కాన్ టెంపుల్ లో కొని మనకిచ్చారు’
‘.........’
‘ ఈ బుల్లి విగ్రహం చూశారా! విష్ణుమూర్తి పాదాల దగ్గర లక్ష్మీదేవి కూర్చున్న ఈ ప్రతిమను శేఖర రెడ్డి గారి భార్య, నా ఫ్రెండ్ అరుణ కొని నాకు ప్రెజెంట్ చేసింది’
‘.......’
‘ఈ చిన్న వెండి తులసి కోటను   విమలక్కయ్య ఇచ్చింది. ఎనిమిదేళ్ళు దాటింది. అయినా మెరుపు తగ్గలేదు. మన పూజా మందిరంలో ఉన్న వాటిల్లో చాలావరకు ఆమె ఇచ్చినవే. అదిగో ఆ కుంకుమ భరిణ. ఆ  దేవుడి పీట. మంచి మనసుతో ఇచ్చింది. అందుకే ఇన్నేళ్ళయినా  ఇలా మెరిసిపోతున్నాయి’
‘..........’
‘చనిపోయి ఏ స్వర్గంలో వున్నారో సరస్వతి వదిన గారు. ఈ సరస్వతీ దేవి విగ్రహం ఆమె ఇచ్చిందే. పాతికేళ్ళయి౦ దేమో! మనం   మాస్కో నుంచి వచ్చిన కొత్తల్లో చూడడానికి వచ్చినప్పుడు ఇచ్చారు’
‘...........’
‘ఈ చిన్ని వెండి మందిరం భారతి వదిన గారు ఇచ్చారు. మాస్కోనుంచి తిరిగొచ్చి మనం దుర్గానగర్ లో ముస్లిముల ఇంట్లో అద్దెకు వున్నప్పుడు అన్నగారికి గుండె ఆపరేషన్ మంచిగా  జరిగి సంతోషంగా ఇంటికి వెడుతూ వదిన గారు ప్రేమతో ఇచ్చిన కానుక ఇది’
‘.........’
‘మూడేళ్ళ నాడు బుజ్జివాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వెండి సామాన్లు తీసుకోవడానికి షాపుకు వెళ్ళినప్పుడు మనమూ వెంట వెళ్లాం గుర్తుందా! చిన్ని లక్ష్మీ దేవి, పక్కన రెండు చిన్న ఏనుగులు ఉన్న ప్రతిమ చూసి ముచ్చట పడితే మీరు అప్పటికప్పుడే కార్డు గీకి కొనేశారు. బహుశా ఇన్నేళ్ళ కాపురంలో మీరు కొన్న దేవుడి బొమ్మ ఇదొక్కటే!’
‘............’

అసలు నేను ఆ గదిలోకి అడుగు పెట్టింది ‘విగ్రహాలు కడుగుతూ, ఆ సందట్లో  టిఫిన్ తిని మాత్ర వేసుకోవడం మరిచిపోయావా అని అడగడానికి.
ఇంత పాత సంగతులు ఇలా విపులంగా చెబుతుంటే ఇక మతిమరపు గురించి ఏం అడగను. ఓ దణ్ణం (పులుకడిగిన దేవుళ్ళకు) పెట్టేసి చక్కా వచ్చాను.  
    
తోక టపా: ఇది జరిగింది 2019 జులై 18 వ తేదీన. 
ఆగష్టు 18 న తాను లేదు.
ఈ పూజలన్నీ ఏమై పోయాయో ఏమో మరి.
ఏ పూజలు, పునస్కారాలు తెలియని నేను మాత్రం ఇలాగే వున్నా మరి.

17, జులై 2024, బుధవారం

పంటి కింద రాయి లేని ఛానల్


రేడియోలో పాటలు వినే శ్రోతలకు చేపలు పట్టేవాడికి వుండేంత ఓపిక వుండాలని పూర్వం చెప్పుకునే వారు. వల వేసి చాలా సేపు నిరీక్షిస్తే ఓ మంచి చేప గాలానికి చిక్కినట్టు, వినగా వినగా ఓ మంచి పాట చెవిలో పడుతుంది.
అలాగే ఈ రాత్రి టీవీలో ఛానల్లు ఓపిగ్గా మారుస్తూ పోతుంటే,  ఈ HW తెలుగు గోల్డ్ ఛానల్ రిమోట్ చేతికి చిక్కింది. 
ఇందులో విశేషం ఏమిటంటే, ఓ మంచి సినిమా చూస్తున్నప్పుడు ఒక్కటంటే ఒక్క యాడ్ కూడా పంటి కింది రాయిలా అడ్డం రాదు. 
చాలా సేపటి నుంచి బాలచందర్ 'మరో చరిత్ర ' హాయిగా చూస్తున్నాను. 
ఈ వైభోగం ఎన్నాళ్ళో తెలియదు.

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో హల్వా వుంటుందా!

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో హల్వా వుంటుందా! – భండారు శ్రీనివాసరావు 

ఢిల్లీ నార్త్ బ్లాక్ అంటే కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కొలువై వుండే కార్యాలయం. బడ్జెట్ తయారీ కార్యక్రమం అంతా అక్కడే జరుగుతుంది. దాదాపు ఓ వారం, పది రోజులపాటు సంబంధిత సిబ్బంది ఆల్ మకాం,  అంటే తిండీ తిప్పలు, పడకా, విశ్రాంతి పూర్తిగా అక్కడే. బడ్జెట్ పూర్తి అయ్యేదాకా ఇళ్లకు పోకుండా రాత్రింబవళ్ళు  ఆ కార్యాలయంలోనే వుండిపోతారు. చివరి రోజున పనిచేసిన  మొత్తం సిబ్బందికీ  కేంద్ర ఆర్థికమంత్రి  స్వయంగా అక్కడే హల్వా చేసి అందరికీ పంచుతారు. దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న వేడుక ఇది. స్వయంగా అంటే మంత్రిగారే హల్వా చేస్తారని కాదు. కడాయిలో తయారైన హల్వాను పెద్ద గరిటతో అలా అలా  పైపైన ఒకసారి కలుపుతారని అర్ధం చేసుకోవాలి. కోవిడ్ కారణంగా రెండేళ్లు హల్వా తయారీకి స్వస్తి చెప్పారు. మిఠాయిలతోనే సరిపుచ్చారు.

బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాల పట్టిక అనేది సార్వత్రికంగా ఉన్న అభిప్రాయం. అసలీ పదానికి అర్ధం తోలు సంచీ. బడ్జెట్ ప్రతిని ఓ తోలు సంచీ (లెదర్ బ్యాగ్) లో పెట్టుకుని ఆర్ధిక మంత్రి సభకు వస్తారు. నాకు తెలిసి నార్త్ బ్లాకులోనే ఒక ముద్రణాయంత్రం వుండేది. ఇప్పుడు వుందో లేదో తెలియదు.  డిజిటల్ శకం మొదలయిన తర్వాత  లెదర్ బ్యాగు సైజు, స్వరూపం పూర్తిగా మారిపోయాయి. 
 చూడాలి ఈ ఏడాది బడ్జెట్ లో హల్వా (సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేవి) వడ్డిస్తారా! అంతకు మించింది ఏమైనా జనాలకు అందిస్తారా!

కింది ఫోటో:
ఈరోజు ఒక దినపత్రికలో వచ్చిన చిత్రం

దేవుళ్ళా మజాకా!



మధ్య తరగతి వాళ్ళు అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఒక పగటి కల కంటూ వుంటారు. ఏదో ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని.(చిన్నిల్లు, పెద్దిల్లు అనే పాడు అపార్థాలు చేసుకోవద్దు ప్లీజ్).
అలా నేనూ మా ఆవిడా, విడివిడిగా, కలివిడిగా కలలు కనే రోజుల్లో ఒకనాటి తన కలలో మేము కట్టుకోబోయే ఆ కొత్త ఇంటికి పూజ గది మాత్రం విడిగా వుండాలని కోరుకున్నది తను . 1975 నుంచి అనేక అద్దె ఇళ్ళు మారుస్తూ హైదరాబాదును ఏళ్ళ తరబడి చుట్టబెడుతున్న తరుణంలో పూజ గది వుండే అద్దె ఇల్లు దొరకడం అసాధ్యం. 
అంచేత చిక్కడపల్లి దాకా వెళ్లి ఇదిగో ఈ కింద ఫోటోలోని పూజ అల్మరా ఒకటి కొనుక్కొచ్చుకుంది.  అందులో దేవుళ్ల విగ్రహాలు, ఫోటోల సంచితాన్ని భద్రపరచుకుంది. నేనెప్పుడూ  లెక్కపెట్టలేదు కాని ముక్కోటి దేవతలు అందులో కొలువు తీరారు అనిపించేది. 
ఈరోజు జులై 17. అంచేతే కాబోలు ఓ జ్ఞాపకం మనసుని తట్టిలేపింది.
కొన్నేళ్ళ క్రితం అంటే 17-07-2019 నాడు పొద్దున్నే ఏదో ఓ ఛానల్ డిబేట్ కి వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి మా ఆవిడ పూజ అల్మరాలోని దేవుళ్ళు అందరూ కట్టగట్టుకుని మాయం అయిపోయారు. ఏమిటీ విష్ణు మాయ అనుకుని ఆశ్చర్య పోతూ ఉండగానే,  శుభ్రంగా తోమిన దేవుడి విగ్రహాలను మరింత మెరిసేలా తుడుస్తూ మా ఆవిడ ప్రత్యక్షం అయింది.
“ అమ్మయ్య! దేవుళ్ళు అందరూ  తలంట్లు పోసుకుని గూటికి చేరుతున్నారు “ అని ఓ జోకు జోకాను.
ఈ జోకు మా ఆవిడ విన్నదో లేదో కాని ఆమె చేతిలో ఉన్న దేవుళ్ళు విన్నారు, విని కోపగించుకున్నారు  అన్న సంగతి నెల తర్వాత తెలిసి వచ్చింది.
సరిగ్గా నెలలోపే ఆగస్టు 18న, ఇంట్లో  దేవుళ్ళు అందరూ అలాగే  వున్నారు. వాళ్లకు నిత్య పూజలు చేసే దేవతే లేకుండా వెళ్లి పోయింది.
దేవుళ్లా! మజాకా!

15, జులై 2024, సోమవారం

డాక్టర్ కె ఎల్ రావు రోడ్డు


(జులై,15,  డాక్టర్ కె.ఎల్.రావు జయంతి)

హిందూ పత్రిక డిప్యూటీ ఎడిటర్ కీర్తిశేషులు శ్రీ ఆర్. జే. రాజేంద్రప్రసాద్ గారు హైదరాబాదు రాకముందు నుంచి కూడా నాకు తెలుసు. నేను విజయవాడలో ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు ఆయన అక్కడే హిందూ పత్రికకు ROVING CORRESPONDENT గా వున్నారు. వార్తలకోసం చుట్టుపక్కల జిల్లాలు తిరుగుతుండేవారు. 
ఆ రోజుల్లో ఒకసారి మా వూరికి మా పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి అయిన డాక్టర్ కే.ఎల్. రావు టూరు ప్రోగ్రాము పెట్టుకున్నారు. ఆ సందర్భంలో రాజేంద్రప్రసాద్ గారు 'మీ ఊరు పోతున్నాను, మీరూ వస్తారా' అని అడిగారు. 'అది అంత సులభం కాదండీ, ప్రయాణంలో చాలా అవస్థలు పడాలి' అన్నాను. 'అవస్థలు పడితేనే కదా మనకి వార్తలు దొరుకుతాయ'ని ఆయన అన్నారు.
సరే అని ఇద్దరం బెజవాడ నుంచి రైల్లో బయలుదేరాము. ఉదయం నైజాం పాసింజరులో వెళ్లి రెండు గంటల తర్వాత మోటమర్రి (అంతకుముందు అల్లినగరం) స్టేషనులో దిగాము. వర్షాకాలం. దోవ అంతటా చిత్తడి చిత్తడిగా వుంది. నాలుగు మైళ్ళు నడిచి వెడితే మా వూరు కంభంపాడు. చెప్పులు చేతిలో పట్టుకుని నడక మొదలు పెట్టాము. బురద నేలల్లో మోకాళ్ళ దాకా కాళ్ళు కూరుకుపోతున్నాయి. పాపం పట్టణం నుంచి వచ్చి ఎన్ని అవస్థలు పడుతున్నారో అనిపించింది. కానీ ఆయన మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన మార్కు మందహాసంతో దారిపొడుగునా కబుర్లు చెబుతూనే వున్నారు. జొన్నచేలు దాటి, మా వూరు పొలిమేరల్లో వరిపొలాల గట్ల మీద నడుచుకుంటూ మొత్తం మీద మా వూరు చేరాము.
పల్లెటూరు కదా టిఫిన్ల మాట ఎత్తకుండా మా అమ్మగారు ఏకంగా భోజనాలకే లేపారు. మా బామ్మగారు ఎవర్రా వచ్చింది, తాసీల్ దారా అని అడుగుతోంది. భోజనాలు అయిన తర్వాత ప్రసాద్ గారు వూళ్ళో తిరిగి వద్దామన్నారు. వచ్చింది పేపరు మనిషి అని వూరి వాళ్ళకి తెలిసిపోయింది. ఆయనతో చెప్పుకుంటే పేపర్లో రాస్తారు, తమ కష్టాలు తీరిపోతాయని అందరూ ఆయన చుట్టూ మూగి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ప్రసాద్ గారు పరమ ప్రశాంతంగా వాళ్ళు చెప్పిన ప్రతిదీ ఓపిగ్గా విన్నారు. కే.ఎల్. రావు గారు మా వూరికి మధ్యాన్నం రెండు గంటల ప్రాంతంలో రావాలి. అందరం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం.
మూడయింది, నాలుగయింది, మంత్రిగారి జాడలేదు. చూస్తుండగానే చీకటి పడింది. అప్పటికి మా వూళ్ళో కరెంటు లేదు. కిరసనాయిలు దీపాలే. ఇంతలో జీపు హెడ్ లైట్ల కాంతి కనిపించింది. ఇంకేముంది వస్తున్నారని సంబర పడ్డాము. ఆ జీపు లైట్లు ఆకాశంలో చుట్టూ గిరగిర తిరిగే సర్కసు దీపం (బీమ్) మాదిరిగా కొంతసేపు కనిపించి ఆ తర్వాత కనపడకుండా పోయాయి. ఇంకో రెండు గంటలు చూసి వూరివాళ్ళు ఇళ్ళకు మళ్ళారు.
ఆ తర్వాత కాసేపటికి రెండు జీపుల్లో మంత్రిగారి కాన్వాయ్ మా ఇంటి దగ్గర ఆగింది. మా బాబాయి కొడుకు సత్యమూర్తి అన్నయ్య మా వూరు సర్పంచ్. కాస్త వసతిగా ఉంటుందని ఆయన కార్యకలాపాలు మా ఇంటి నుంచే నడిపేవారు.
అనుకున్నంత సేపు పట్టలేదు మంత్రిగారి పర్యటన. చల్లారిపోయిన పాలను మళ్ళీ వేడి చేసి పెట్టి ఇచ్చిన కాఫీలు తాగి నిష్క్రమించారు. వచ్చింది హిందూ కరస్పాండెంటు కాబట్టి ప్రసాద్ గారితో కాసేపు విడిగా మాట్లాడారు.
మర్నాడు బయలుదేరి మేమిద్దరం బెజవాడ వచ్చేసాము. 
ఆ తర్వాత మూడో రోజనుకుంటాను హిందూలో ఓ బాక్స్ ఐటం వార్త వచ్చింది. సరైన రోడ్లు లేక దారి తప్పిన కేంద్రమంత్రి అంటూ. కేంద్ర మంత్రి తనతో మాట్లాడిన విషయాలను క్లుప్తంగా ప్రస్తావించి, వూరి వాళ్ళు తనతో చెప్పుకున్న కష్టాలను వివరంగా రాసారు. 
ఆ వార్త వచ్చిన కొద్ది రోజులకే, కే.ఎల్. రావు గారు శ్రమదానం కార్యక్రమాన్ని ప్రకటించి మా వూరికి రోడ్డు, కరెంటు మంజూరు చేసారు. మా వూరికే కాదు చుట్టుపక్కల అనేక గ్రామాలను కలుపుతూ వత్సవాయి నుంచి చెవిటికల్లు వరకు మా వూరి మీదుగా రోడ్డు పడింది. కరెంటు వచ్చింది. శ్రమదానం అంటే ఏ వూరివాళ్ళు ఆ ఊరికి కావాల్సిన కరెంటు స్తంభాలు తమ బండ్ల మీద చేరవేయాలి. అలాగే రోడ్డు నిర్మాణంలో శ్రమదానం చేయాలి. 
కే.ఎల్. రావు గారిచ్చిన స్పూర్తితో దాదాపు నలభయ్ గ్రామాల ప్రజలు పార్టీలతో నిమిత్తం లేకుండా తమ ఊళ్లకు కరెంటు, రోడ్డు సాధించుకున్నారు.
అయితే దండలో దారం మాదిరిగా ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు రాసిన వార్త ప్రభావం ఈ అభివృద్ధిలో వుంది.
దానికి ప్రత్యక్ష సాక్షులలో నేనొకర్ని.
తోకటపా: ఆ రోడ్డుకు ఎవరూ పనికట్టుకుని పేరు పెట్టలేదు. ఆ నలభయ్ గ్రామాల ప్రజలే ఈనాటికీ దాన్ని కె.ఎల్.రావు రోడ్డు అని పిలుచుకుంటున్నారు.

14, జులై 2024, ఆదివారం

వచ్చిన దారి గుర్తుంది



" కిందటి ఎన్నికల్లో ఓడిన పార్టీ అభ్యర్థిగా గెలిచి అధికార పార్టీలోకి అవలీలగా జంప్ చేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓడిన పార్టీ అభ్యర్థిగా గెలిచి, అధికారంలోకి వచ్చిన మీపాత పార్టీలో వెంటనే చేరగలిగారు. ఎలా సాధ్యం? "

" ఎమ్మెల్యే. మహా అయితే మంత్రి. అంతకంటే సీ ఎం అయ్యేది లేదు, పీ ఏం అయ్యేది అంతకన్నా లేదు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే అదే పది వేలు. ఇక సాధ్యాసాధ్యాలు అంటావా!  వచ్చిన దారి గుర్తుంటే పోయే దారి అదే తెలుస్తుంది"

13, జులై 2024, శనివారం

అసెంబ్లీలో పనికొచ్చిన వినికిడి యంత్రం



చాలా కాలం నాటి ముచ్చట.
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పాలిస్తున్నప్పుడు మహేంద్ర నాథ్ అనే ఓ పెద్దమనిషి ఆర్ధిక మంత్రిగా వుండేవారు. నిజానికి ఆయన అప్పటికే రాజకీయాల్లో సీనియర్. జలగం వెంగళరావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వారికి వినికిడి సమస్య. చెవిలో చిన్న యంత్రం అమర్చుకుని బడ్జెట్ ప్రసంగ పాఠం నెమ్మదిగా చిన్న గొంతుకతో చదువుకుంటూ పోయేవారు. బడ్జెట్ పై చర్చలో ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తుంటే ఆయనగారు నెమ్మదిగా చెవిలోని వినికిడి యంత్రం తీసేసి, ఇక చెప్పేది ఏదో చెప్పుకోండి  అన్నట్టు  నిరాసక్తంగా తన సీటులో కూర్చుండిపోయేవారు.

8, జులై 2024, సోమవారం

రేపు మళ్ళీ పుడితే ఎంత బాగుణ్ణు

గత ఫిబ్రవరి నాలుగో తేదీ పోయిన రోజు.
జులై తొమ్మిది పుట్టిన రోజు.
మళ్ళీ రేపు పుడితే ఎంత బాగుంటుంది.
జరిగే పనేనా! 

కింది ఫోటో: 
పెళ్లి కుమారుడి దుస్తుల్లో మా రెండో వాడు సంతోష్.  ఇద్దర్నీ పోగొట్టుకుని నేను.

పోస్ట్ రిటైర్ మెంట్ జీవితం ఎలా గడపాలి? – భండారు శ్రీనివాసరావు

 చాలా రోజులుగా ఒక విషయాన్ని గురించి విపులంగా రాయాలని అనుకుంటూ వస్తున్నాను. వీలు దొరకలేదు అని అబద్ధం చెప్పను, కానీ నేనే వీలు చేసుకోలేదు. ఇది నిజం. విషయం ఏమిటంటే పోస్టు రిటైర్మెంటు జీవితం.

2005  డిసెంబరు  ముప్పై ఒకటిన  నేను  దూరదర్సన్  నుంచి  రిటైర్ అయ్యాను. కానీ, అదే రోజు ఓ ఏడాది సర్వీసు పొడిగించారు. కానీ దాన్ని నేను పూర్తిగా వినియోగించుకోలేదు. మధ్యలోనే బయటకు వచ్చి సత్యం రామలింగరాజు గారు ప్రారంభించిన 104 సర్వీసు గ్రామీణ ఆరోగ్య సేవల స్వచ్చంద సంస్థలో మీడియా అడ్వైజర్ గా కొన్నాళ్ళు పనిచేశాను. అలాగే రోజువారీ టీవీ చర్చలు. ఇలా జీవితం సాగిపోయింది. రిటైర్ అయ్యాను అనే ఫీల్ లేకుండా పోయింది. 2019 లో మా ఆవిడ నిర్మల ఆకస్మిక మరణంతో నా జీవితం మరో మలుపు తిరిగింది. ఇతర వ్యాపకాలు తగ్గిపోయాయి. అసలైన రిటైర్ మెంట్ జీవితం మొదలయింది. కానీ రిటైర్ మెంట్ జీవితం ఎలా గడపాలి అనే విషయంలో సరైన అవగాహన లేక మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. ఒకరకంగా చెప్పాలి అంటే రోజులు దొర్లిస్తున్నాను.  సరే! ఇది నా గొడవ. అలా ఉంచుదాం.

ఇప్పుడు మరో వ్యక్తిని గురించి చెప్పుకుందాం. ఆయన పేరు వనం జ్వాలా నరసింహారావు. నా బాల్య మిత్రుడు. చిన్నప్పుడు  స్కూల్లో సహాధ్యాయి. పెద్దయిన తర్వాత నా మేనకోడలు విజయలక్ష్మి భర్త. తదనంతర కాలంలో స్వయంకృషితో ఎదిగి ఎంతో పైకి వచ్చాడు. కిందపడ్డాడు. మళ్ళీ ఉవ్వెత్తున పైకి లేచాడు.

చేయని ఉద్యోగం లేదు. బిహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో మొదలు పెట్టి  తెలంగాణా ముఖ్యమంత్రి ప్రధాన సంబంధాల అధికారి పదవి వరకు అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలో  మారని ఇల్లు లేదు. అయితే,  ఈ ఒక్క విషయంలో మాత్రం  నాకూ ఆయనకు పోలిక. మరీ ఆయనలా  అన్ని కాకపోయినా నేను సైతం హైదరాబాదు ఉద్యోగపర్వంలో అనేక అద్దె ఇళ్ళు మారాను.

మూడు దశాబ్దాల పై చిలుకు కాలంలో,  హైదరాబాదులో నేను చేసింది ఒకే ఒక ఉద్యోగం, ఒకే ఒక సంస్థ ఆలిండియా రేడియోలో. కాకపొతే చరమాంకంలో కొద్ది కాలం దూరదర్సన్ లో కూడా ఇష్టం లేని కాపురం చేశాను. జ్వాలా అలా కాదు. అనేక ఉద్యోగాలు. అనేక తరహా ఉద్యోగాలు. కొన్ని సర్కారు కొలువులు. మరి కొన్ని అటూ ఇటూ కానివి.  అందుకే రిటైర్ మెంటు అనేది ఆయనకు లేకుండా పోయింది. ఉద్యోగానికి ఉద్యోగానికి మధ్య ఖాళీ. ఖాళీకి ఖాళీకి నడుమ కొలువు. ఇలా సాగిపోయింది ఆయన జీవితం.

చివరికి జ్వాలా కూడా రిటైర్ అయ్యాడు. కానీ ఒప్పుకోడు. నో రిటైర్మెంట్ అనేది ఆయన పాలసీ. నాకూ ఆయనకు మధ్య ఒకటి రెండేళ్లే తేడా. కానీ  రిటైర్మెంట్ విషయంలో చాలా తేడాలు. ఒకప్పుడు ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. కానీ నా భార్య మరణానంతరం నా లోకం మారిపోయింది. ఏకాంతం నా లోకం అయింది. ఇంతవరకు నా జోలికి రాని కొన్ని ఆరోగ్య సమస్యలు. మరికొన్ని హార్దిక ఇబ్బందులు. రెండో కుమారుడి మరణం వంటి తట్టుకోలేని సంఘటనలు. జీవితం పట్ల నా దృక్పథం మారిపోయింది. ఒంటరితనం. ఒంటరిగా  జీవించడం. ఏదీ పట్టించుకోకపోవడం. నిర్లిప్తత. నిర్వేదం.

విల్లాల్లో జీవితం కాకపోయినా, చెప్పుకోదగిన ఆర్ధిక ఇబ్బందులు  లేవు.  వయసురీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎలాగు తప్పవు.

ఈ నేపధ్యంలో జ్వాలా జీవితం నాకు ఓ దిక్సూచిలా కనిపించింది. ఒప్పుకోడు కానీ ఆయనది రిటైర్మెంట్ జీవితమే. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్లాను. గతంలో మాకిది రోజువారీ వ్యవహారమే. కానీ ఈ మధ్య నేను ఇల్లు వదిలి బయటకు  పోలేదు. నిజం చెప్పాలి అంటే ఇంట్లో నా గది వదిలి  అడుగు బయట పెట్టలేదు. బెడ్ రూమ్ టు బాత్ రూమ్. తిండీ తిప్పలు అన్నీ నా గదిలోనే. అంతగా ఒంటరితనం నన్ను ఆవరించింది.

ఆయన ఇల్లు ఎప్పటిలా కళ కళ లాడుతోంది. ఒకానొక కాలంలో, అంటే మా ఆవిడ జీవించి వున్న కాలంలో అందరూ మా గురించి, మా ఇంటి గురించి  ఇలాగే చెప్పుకునేవారు. ఒకప్పటి  నా రేడియో సహోద్యోగి, న్యూస్ డైరెక్టర్ శ్రీ ఆర్వీవీ కృష్ణారావు  అప్పటికే అక్కడ వున్నారు. గతంలో రోజూ కలిసే మేము, ఒకరినొకరం కలవక  చాలా కాలం అయింది. అలాగే ఎప్పుడో పరిచయం అయి చాలాకాలంగా కలవని మితృలు, శ్రేయోభిలాషులు వనం నర్సింగరావు గారు, వారి శ్రీమతి మాతాజీ, మా ఆవిడ ఆప్త మిత్రురాలు, బహిప్రాణం అయిన వనం గీత, భర్త వనం రంగారావు, మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు, వదిన విమలాదేవి ఇలా అనేకమందితో జ్వాలా గృహం కొలువు తీరింది.

స్నేహితులని, సన్నిహితులని, బంధువులని, మిత్రులని అప్పుడప్పుడు కలుస్తూ, పాత ముచ్చట్లు, కొత్త సంగతులు కలబోసుకోవడం ద్వారా రిటైర్ మెంటుని హాయిగా, ఆనందంగా, ఉల్లాసంగా గడపవచ్చనేది జ్వాలా థియరీ.  మధ్యమధ్య కలుస్తుంటేనే చుట్టరికాలు అయినా స్నేహితాలయినా చిరకాలం నిలబడతాయని ఆయన నమ్ముతాడు. అందుకే చిన్ననాటి స్నేహితుల నుంచి ఉద్యోగ పర్వంలో పరిచయం అయిన ప్రతి ఒక్క అధికారి, సిబ్బందితో ఇప్పటికీ టచ్ లో ఉంటాడు. మధ్యమధ్య ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు, ఏ పనీ లేకపోయినా.  హ్యూమన్ రిలేషన్స్ ప్రాధాన్యతని ప్రాక్టికల్ గా నిరూపిస్తున్న జ్వాలాని చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది అనిపించింది.

 నా దగ్గర కూడా అంతకు మించిన ఫోన్ లిస్టు వుంది. కానీ ఏరోజూ ఎవరితో మాట్లాడను. అనవసరంగా వారిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేది నాకు నేను చెప్పుకునే సమర్ధన.    

ఇంత పెద్ద వయసులో ఈ అనుకరణలు సాధ్యమా!  కాదని నాకు తెలుసు.

ఎందుకంటే నా గురించి నాకు బాగా తెలుసు. నేనో సీతయ్యని.

(07-07-2024)

కింది  చిత్రం   జ్వాలా ఇంట్లో తీసినది



 

 

     

 

       

 

5, జులై 2024, శుక్రవారం

సీనియర్ జర్నలిష్ట్ శ్రీ గారపాటి ఉపేంద్ర బాబు ఇక లేరు

 

 


ఈరోజు సాయంత్రం చిల్కూరు లోని బాలాజీ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుంటే సీనియర్ జర్నలిష్ట్ శ్రీ గారపాటి ఉపేంద్ర బాబు గారు ఇకలేరంటూ మితృలు శ్రీ పారుపల్లి శ్రీధర్ మెసేజ్ పెట్టారు. ఆ వార్త తెలియగానే చాలా బాధ కలిగింది. ఉపేంద్రబాబు గారితో నా పరిచయం సుదీర్ఘమైనది ఏమీ కాదు. కేవలం నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే. కానీ అది వంద సంవత్సరాలు గుర్తుంచుకోవాల్సిన పరిచయం.

వెనక్కి వెడితే.

 పందొమ్మిది వందల  డెబ్బయి ఒకటి, ఆగష్టు నెల, ఇరవయ్యవ తేది. విజయవాడలబ్బీపేటలోని ' ఆంధ్రజ్యోతికార్యాలయం.

అందులో అడుగు పెట్టి, కింద ఛాంబర్ లో కూర్చుని పనిచేసుకుంటున్న  ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని కలుసుకున్నాను.

ఆయన ఎగాదిగా నావైపు  చూసినా పరిచయం కనుక్కుని, 'మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా! పైకి పో. ఉపేంద్ర వుంటాడు. నేను పంపానని చెప్పుఅన్నారు ఫోన్ మీద చేయి వేస్తూ.

అదే నా తొట్టతొలి ఉద్యోగ నియామకపు ఉత్తర్వు.

ఉపేంద్రగారిని కలిసాను. కూర్చోమని సైగ చేసారు. పీ.టీ.ఐ.యు.ఎన్.ఐ. వార్తల్ని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. ఆ విధంగా మొదలయింది నా జర్నలిస్టు జీవితం. ఆ విధంగా  ఉపేంద్రబాబు జర్నలిజంలో నా మొదటి గురువు. జర్నలిజంలో చమత్కారం ఏమిటంటే గురువులతో స్నేహం చేయవచ్చు.  ఆ క్రమంలో నేనే కాదు, ఆయనతో పనిచేసేవాళ్ళం అందరం ఆయనకు స్నేహపాత్రులం కాగలిగాం. నేను మరికొంత దగ్గరగా. అప్పటివరకు  శరత్ నవలలు చదివి  బాబు అనే పేరుపై మక్కువ పెంచుకున్నాను. (శరత్ బాబు  ‘భారతి’  నవలలో కథానాయకుడి పేరు అపూర్వబాబు)

ఆఫీసులోని మొదటి అంతస్తులో  గుర్రపునాడా ఆకారంలో ఒక పొడవాటి  బల్ల వుండేది. సబ్ ఎడిటర్లు అందరూ, అందరూ అంటే ఎందరో  అనుకునేరు, ఆరుగురు అంటే ఆరుగురు వుండేవారు. మళ్ళీ అందులో ఒక న్యూస్ ఎడిటర్, వీరభద్రరావు గారు నడి మధ్యలో. ఆయనకు అటూ ఇటూ సబ్ ఎడిటర్లం అందరం పరివేష్టితులమై పనిచేసుకుంటూ వుండేవాళ్ళం.

 

ఆ రోజుల్లో జర్నలిష్టుల జీతాలు మరీ నాసిరకంగా ఉండేవి. ఈ రోజుల్లో మరీ బాగా వున్నాయని కాదు. జీతాలకి, జీవితాలకి పొంతన లేని రోజులు అవి. నెలలో మొదటి వారానికే డబ్బు అవసరాలు వచ్చి పడేవి. ప్యూన్ నాగేశ్వరరావుతో ఒకరికొకరం  చీటీలు పంపుకునే వాళ్ళం. “ఒక పాతిక సర్దుతారా, ఇరవైన అడ్వాన్స్ తీసుకోగానే ఇచ్చేస్తాను” అనే అభ్యర్ధనలు వాటిల్లో ఉండేవి. అంతమాత్రం డబ్బు ఎవరి దగ్గరా ఉండదని తెలుసు. అయినా అడక్కతప్పని అవసరాలు.

అందరిదీ ఒకే అవసరం కనుక ఒకరంటే మరొకరికి జాలి. అందుకని, ‘లేదు’ అనకుండా మరో చీటీ మీద “ఓ యాభయ్ సర్దుతారా” అని రాసి, దాన్ని సీనియర్ సబ్ ఎడిటర్ ఉపేంద్ర బాబుకు పంపేవాళ్ళం. ఆయన ఆ చీటీలోనే యాభయ్ రూపాయలు వుంచి తిరిగి పంపేవారు. అందులో సగం వుంచేసుకుని మిగిలిన పాతిక ముందు అడిగిన వాడికి సర్దుబాటు చేసేవాళ్ళం. ఈ చేబదులు చక్రభ్రమణం ప్రతినెలా సాగేది. ఇదిగో! ఈ ‘లేని’ తనమే మా స్నేహాన్నిమరింత  గట్టిగా నిలిపి వుంచేది. అందరం అదే బాపతు కనుక ఇక అసూయలకు ఆస్కారమే వుండేది కాదు. అలా అందరికీ ఉపేంద్రబాబు అనే పెద్దమనిషి, ఏటీఎంలు లేని ఆ రోజుల్లోనే ఏటీఎం మాదిరిగా, పెద్దమనసుతో  అప్పటికప్పుడు డబ్బు సర్దుబాటు చేసేవారు.  అదీ ఆయనతో మొదటి పరిచయం.

లబ్బీపేటలో మా ఇద్దరి ఇళ్ళు కూడా దగ్గరదగ్గరలో ఉండేవి. మా ఇంట్లో వంట గ్యాస్ అయిపోతే సిలిండరు వెంటనే తెప్పించుకోగల పరపతి ఉద్యోగం ధర్మమా అని వుండేది. కానీ సిలిండర్ ధర ఇరవై మూడు రూపాయలు ఎవరివ్వాలి? ఎవరిస్తారు ఒక్క ఉపేంద్ర బాబు గారు తప్ప. ఆ రోజుల్లో కాల్ గ్యాస్ కనెక్షన్ తేలిగ్గానే దొరికేది. సిలిండర్లు కూడా. కానీ  డబ్బులో.  దానికి ఉపేంద్ర బాబే గతి. అంచేత నిశ్చింతగా వుండేవాళ్ళం. అడగగానే చేబదులు ఇచ్చేవారు. గ్యాస్ కోసం ఎందుకు చింత? ఉపేంద్ర ఉండగా మీ చెంత అని పాడుకునే వాళ్ళం. ఇంటా బయటా కూడా మంచి మనిషి అనిపించుకోవడం మాకష్టం. కానీ ఉపేంద్రబాబు ఆ విషయంలో గొప్ప మినహాయింపు.

జ్యోతిలో నేను ఆయనతో కలిసి పనిచేసింది కేవలం నాలుగున్నర సంవత్సరాలే. తోటి ఉద్యోగులను సాటి మనుషుల మాదిరిగా చూసే మంచితనం ఆయనది. మరికొన్ని సంవత్సరాలు కలిసి పనిచేసి వుంటే మరికొంత మంచితనం నా సొంతం అయ్యేదేమో.

నిన్న రాత్రి 86వ ఏట మరణించిన ఉపేంద్ర బాబు గారికి నా అశ్రునివాళి!

తోకటపా:

మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహా రావు గారి వర్ధంతి సందర్భంలో, ఆంధ్రజ్యోతిలో నా వ్యాసం ఒకటి ప్రచురితం అయింది. అది చదివి శ్రీ ఉపేంద్ర నాకు ఒక మెసేజ్ పెట్టారు. అదే ఇది.  

“ఓసారి బెజవాడ నుంచి శాతవాహనలో హైదరాబాదు వస్తున్నాను. ఖమ్మంలో ఇద్దరు స్వతంత్ర సమరయోధులు రైలెక్కారు. హైదరాబాదు చేరిందాకా వాళ్ళిద్దరూ పీవీ ముచ్చట్లతోనే గడిపారు. పీవీ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకున్నారు. కలం, కాగితాలు తెచ్చుకుని వుంటే బాగుండేదే అని బాధ పడ్డాను” – ఉపేంద్ర బాబు, సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ.





(శ్రీ గారపాటి ఉపేంద్ర బాబు)


(05-07-2024)