ఆదివారం 21-7-24 నా రెండో కుమారుడు సంతోష్ చనిపోయి 171 వ రోజు.
ఊణషాణ మాసికం.
ఎప్పుడూ వినలేదు ఏమిటీ మాసికం అని అడిగారు మితృలు కొందరు మా రెండో కుమారుని ఊణషాణ మాసికం పెట్టిన సంగతి ఫేస్ బుక్ లో చదివి.
ప్రేత సంబంధ కర్మలు అయినా, యాగ సంబంధ క్రతువులు అయినా నమ్మకం ప్రధానం అనేది నా నమ్మకం. నా తల కొరివి పెట్టాల్సిన వాడికి నేనే అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి గత ఫిబ్రవరిలో నాకు ప్రాప్తించినప్పుడు నా మనసు నా మనసులో లేదు. ఏదో కలలో జరుగుతున్న విధంగా అన్నీ సశాస్త్రీయంగా జరిగిపోయాయి, నా అన్నగారు భండారు రామచంద్ర రావు గారు , మా పెద్ద కుమారుడు సందీప్ భండారు పర్యవేక్షణలో.
శ్రాద్ధ కర్మలకు నేతృత్వం వహించిన వసిష్టుల వారు శ్రీ సి.హెచ్. యు.ఎస్. ప్రసాద శర్మ గారు. వాటిల్లో భాగంగా నా చేత అనేక దానాలు చేయించారు. మరణించిన మనిషి తాలూకు జీవి సంవత్సరం పాటు వేలాది మైళ్ళు ప్రయాణిస్తుందని, ఆ ప్రయాణంలో జీవుడు అనేక రకాల ఈతి బాధలకు గురవుతాడని, ఎర్రటి ఎండల్లో, వానల్లో, దుర్గమ మార్గాల్లో ఆ ప్రయాణం సాగుతుందని, ఉపశమనంగా ఉండడానికి గొడుగు, పాదరక్షలు, వంట దినుసులు, కాయగూరలు, వంట పాత్రలు, నీళ్ళ పాత్ర, చెంబు వగైరాలు దానాలుగా ఇప్పించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో, 45 వరోజున ( త్రిపక్షం), 171 వ రోజున జీవుడు మరింత శ్రమకు గురవుతాడు. అంచేత ఈ రోజుల్లో కూడా తప్పనిసరిగా మాసికాలు పెట్టాలి.
జీవించి వున్న వారికి ఒక మాసం మరణించినవారికి ఒక రోజుతో సమానం కనుక నెలకోసారి మాసికం పెట్టి పిండ ప్రదానం చేస్తే, వారికి ప్రతిరోజూ భోజనం పెట్టినట్టు అవుతుందని ఓ నమ్మకం. ఇలా పన్నెండు నెలలు గడిచిన తర్వాత ఏడాది చివర్లో పెట్టే హూణ మాసికం, సాంవత్సరీకం, ఆబ్దీకంతో ఈ కర్మ కాండ పూర్తవుతుంది. జీవుడి పాప పుణ్యాల ప్రాతిపదికన పునర్జన్మ, లేదా స్వర్గ, నరక లోక ప్రాప్తి నిర్ధారణ అవుతుంది.
ఈ విషయాలు అన్నీ శర్మగారు సవిస్తరంగా నాకు అప్పుడే తెలిపారు.
కానీ అప్పుడు నా గుండె, మనసు, శరీరం అన్నీ ఘనీభవించి వున్నాయి.
ముందే చెప్పినట్టు అంతా నమ్మకం.
చనిపోయింది స్వయంగా నా కుమారుడు. నా ఇహ లోక ప్రయాణం సజావుగా సాగడానికి వాడు బతికి వున్నప్పుడు ఎన్నో ఎన్నో చేశాడు. పై లోక ప్రయాణంలో వాడికి ఇబ్బందులు రావు అని చెబుతున్నప్పుడు నమ్మకంగా పాటించక తప్పదు. అదే చేశాను. చేస్తున్నాను.
(22-07-2024)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి