29, జూన్ 2024, శనివారం

‘ఇదేమి సినిమా?‘

 


‘అదేమరి! మీ వయసు వాళ్ళు చూసే సినిమా కాదది.’

‘అవును. ఏమిటో ఆ యుద్ధాలు. ఎవరు ఎవరితో కొట్టుకుంటున్నారో, ఎందుకు కొట్టుకుంటున్నారో అర్ధం కాలేదు. అదృష్టం ఏమిటంటే థియేటర్లో రుధిరం పారలేదు, అధునాతన మారణాయుధాల పుణ్యమా అని. ఆ యుద్ధాలు చూసిన తర్వాత సినిమాలో ఒక పాత్రకే కాదు, ఎవ్వరికీ చావు లేదేమో అనిపించింది.

‘ఇంకా

‘ ఒక్కో టిక్కెట్టు నాలుగు వందలు. యాభయ్ ఏళ్ళ క్రితం నా మొదటి ఉద్యోగంలో మొదటి జీతం రెండువందల యాభయ్. మరి మండదా! ఆరువందల కోట్ల సినిమా అంటున్నారు. వారి డబ్బు బూడిదలో పోసినా, వారికి పన్నీరే దక్కుతోంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అలా వున్నాయిట భారీ స్థాయిలో  కలెక్షన్లు ఇంటా బయటా కూడా.  హైదరాబాదులో ఏ థియేటర్ లో కూడా మరో సినిమా లేదు, ఇది తప్ప, ఒకే దేశం ఒకే సినిమా లాగా. తీసిన వాళ్ళు సరే,  కానీ నా నాలుగు వందలు బూడిద పాలే కదా!’

‘తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళే సినిమాకి ఆ మాత్రం డబ్బు ఖర్చు చేస్తే తప్పేమిటి’

‘’పోరాటాలు, యుద్ధాలు హాలీవుడ్ స్థాయిని మించిన మాట నిజమే. కానీ కధ సంగతి ఏమిటి? రివ్యూలు చదివి, చూసిన వాళ్ళు  కూడా ఏమీ అర్ధం కాలేదు అనేవాళ్ళు బోలెడుమంది.  అలాంటి కళ్ళు చెదిరే సన్నివేశాలు చూడడానికి ఇంగ్లీష్ సినిమాలు ఎలాగు వున్నాయి. అవతార్ లు, స్టార్ వార్స్ చూడలేదా! పైగా ఇందులో లేని యాక్టర్ లేడు అన్నట్టు బిల్డప్. అమితాబ్, ప్రభాస్, బ్రహ్మానందం ఇలా కొందర్ని తప్పిస్తే మేకప్ ముసుగులో ఎవర్నీ గుర్తు పట్టేట్టు లేరు. ఎవరో అంటుంటే వినబడింది, సినిమా మొదట్లో కనబడిన ఒక  పాత్రలో  నటించిన మనిషి రాజేంద్రప్రసాద్ లాగా అనిపించాడు అని. చివరికి, చివర్లో కనపడ్డ కమల్ హసన్ కూడా అంతే. జగన్నాధ రథచక్రాలు అనే డైలాగ్ ని బట్టి కొందరు గుర్తు పట్టారు. ఏదైనా అంటే ఈ చిత్రంలో పాత్రలు కనిపిస్తాయి, నటులు కనిపించరు అని. ఈ మాత్రం దానికి అంత స్టార్ కాస్ట్ ఎందుకు, ప్రొడక్షన్ కాస్ట్ పెరగడానికి తప్పిస్తే    

‘అదే చెప్పేది, ఆ డబ్బు ఎవరికి పోయింది. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్లు మనవే కదా! ప్రపంచ స్థాయి సినిమా తీసిన వారిని అభినందించాలి కానీ, ఇలా సన్నాయి నొక్కులు నొక్కితే ఎలా?

‘నేను చెప్పేది అదే. కోట్లాది డబ్బులు కోట్లాది డబ్బులు గుమ్మరించి ఇలా తీసే  అర్ధం పర్ధం లేని సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడితే, మరి కొందరు బడా నిర్మాతలు ఇదే దారి పట్టి, తెలుగు సినిమా ఖర్చును హాలీవుడ్ స్థాయికి పెంచుతారు. సినిమా స్థాయి సంగతి మరచిపోతారు. నిజమే! పెద్ద సినిమా ఒకటి బాగా ఆడితే పరిశ్రమను నమ్ముకుని బతుకు బండి లాగించే వేలాది కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటాయి. కానీ అందుకోసం లక్షలాదిమంది ప్రేక్షకులు చెల్లించుకునే మూల్యం మాటలేమిటి? ఇంతంత మొత్తాల్లో  డబ్బులు వాళ్ళూ, వీళ్ళూ తగలేయడం సమంజసమేనా!’

‘ఇక మీకు చెప్పడం నా తరం కాదు. మీ మనుమల్ని అడగండి, సినిమా ఎలావుందని, వాళ్ళు చెబుతారు మీకు సరైన సమాధానం.’  

(29-6-2024)  

 

26, జూన్ 2024, బుధవారం

అయస్కాంతం గా మారిన రాజకీయం - భండారు శ్రీనివాసరావు



రాజకీయం శక్తివంతమైన అయస్కాంతం వంటిది. అమిత జనాదరణ కలిగిన సినీరంగ ప్రముఖులూ, కోట్లకు పడగెత్తిన వ్యాపార, వాణిజ్య శ్రేష్ఠులు, తమ కత్తికి ఎదురేలేదని భ్రమించే సంఘ వ్యతిరేకశక్తులూ, ఉద్యోగంలో వున్నన్ని రోజులూ అధికార చక్రం తిప్పిన ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు ఇలా అందరూ కట్టగట్టుకుని తీయ నీటికి ఎగబడే చేపల మాదిరిగా రాజకీయ అరంగ్రేట్రం కోసం తహతహలాడేది అందుకే.

‘మాకు ప్రజల్లో అత్యంత ఆదరణ వుంది. కన్నెత్తి చూస్తే చాలు, పన్నెత్తి పలకరిస్తే చాలనుకుని మాకోసం జనాలు గంటలు గంటలు పడిగాపులు కాస్తుంటారు. ఎంతో శ్రమపడి, మరెంతో ఖర్చుపెట్టి  అవుట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఆఖరి నిమిషంలో మా ఆశల మీద నీళ్ళు చల్లడానికి ఒక్క కానిస్టేబుల్ చాలు. అంత చిన్న ఉద్యోగి అధికారం ముందు మా యావత్తు ప్రజాకర్షణ బూడిదలో పోసిన పన్నీరే. అదే ఓ చోటా మోటా రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే చాలు కస్టడీలో ఉన్న మనిషికూడా బయటకు వస్తాడు. ఇక ఈ సంపాదన, ఈ సంపద, ఈ ఆకర్షణ ఏం చేసుకోను. అందుకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను’ – ఓ ప్రముఖ సినీ నటుడి మన్ కీ బాత్.

‘ముఖ్యమంత్రి గదిలోకి అయినా తలుపు తోసుకుని పోయేవాళ్ళు వుంటారు. అదే మా సంగతి చూడండి. ఇంచుమించుగా ముప్పయి అయిదేళ్ళు అనేక హోదాల్లో పనిచేసాము. ఏ ఒక్క రోజయినా మా అనుమతి లేకుండా చీమ కూడా మా ఛాంబర్ లోకి అడుగుపెట్టలేదు. ఒక్క సంతకం చేస్తే చాలు కోట్ల రూపాయల లాభాలు తెచ్చే ఫైళ్ళు క్లియర్ అవుతాయి. కానీ ఏం లాభం. పైనుంచి ఫోన్ వస్తే చాలు మేము కిక్కురుమనకుండా సంతకం చేసి పంపేయాల్సిందే. కాదు కూడదని మొండికేసి పై వాడు చెప్పిన పని చేయం అనుకోండి. అంతరాత్మ చెప్పిన విధంగానే, రూలు ప్రకారమే చేశాం అనుకోండి. సాయంత్రానికల్లా ఆ అంతరాత్మని వెంటబెట్టుకుని ఓ చెత్త పోస్టులోకి వెళ్ళమంటారు. ఇంత సర్వీసు చేసి అలాంటి పోస్టులు చేసేబదులు, అంతరాత్మ పీక నొక్కేసి అక్కడే వుంటే పోలా! కొన్నాళ్ళు బీరాలకు పోయినా కాలం గడుస్తున్నకొద్దీ సర్దుకుపోవడమే మేలనే పరిస్తితికి చేరుకుంటాము. కానీ ఎక్కడో బాధ. ఇంతచదువు చదివాము. ఇంత గొప్ప శిక్షణ పొందాము. చివరికి ఎవరో ఒక అంగుష్ఠమాత్రుడు చెప్పినట్టు చేయాల్సివస్తోంది. అంటే ఏమిటి? మనం అనుకున్న అధికారం మా ఉద్యోగాల్లోలేదు. అసలయిన అధికారం రాజకీయంలో వుంది. కాబట్టి రిటైర్ అయిన తర్వాత అందులోనే దూరితే పోలా!’ – ఒక సీనియర్ అధికారి అంతరంగ మధనం.

‘దేశ విదేశాల్లో వ్యాపారాలు వున్నాయి. నెలకు కోటి రూపాయలు కాంపెన్సేషన్ తీసుకునే సీయీఓలు డజను మంది తన చేతికింద పనిచేస్తున్నారు. క్రమం తప్పకుండా పనులు చక్కబెట్టుకునేందుకు సొంత విమానాలు వున్నాయి. రాజప్రసాదాలను తలదన్నే భవంతులు ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాల్లో వున్నాయి. తనని కలవాలంటే నెల ముందు అపాయింటు తీసుకోవాలి. మరి ఇంత ఐశ్వర్యం వుండి కూడా ప్రభుత్వాలతో పనిపడినప్పుడు, అది ఎందుకూ కొరకాకుండా పోతోంది. కోట్ల లాభం కళ్ళచూడడానికి అవకాశం ఉన్న ఫైలును ఓ చిన్ని గుమాస్తా మోకాలు అడ్డు వేసి అపగలుగుతున్నాడు. అతడి  ఏడాది సంపాదన మొత్తం కలిపినా తను తాగే సిగార్ల ఖర్చుకు సరిరాదు.అదే ఓ ఎమ్మెల్యే ఫోను చేస్తే అదే ఫైలు పరుగులు కాదు ఎగిరి గంతులు వేసుకుంటూ చేరాల్సిన చోటికి, చేరాల్సిన టైముకు చేరుతుంది. లాభం లేదు, ఎంత ఖర్చయినా సరే ఈసారి ఒక రాజ్యసభ సభ్యత్వం సంపాదించి తీరాలి. లేకపోతే ఇంత సంపాదనా శుద్ధ దండగ’ – ఓ పారిశ్రామికవేత్త మనోవేదన 

‘తనను చూస్తే పసిపిల్లలు నిద్రపోరు. తన మాట వినబడితే బడా వ్యాపారాలు చేసేవాళ్ళు కిమ్మనరు. తన చేతుల్లో లక్షలు మారుతున్నా పన్ను కట్టే పనే లేదు. తన మోచేతి నీళ్ళు తాగుతూ డజన్ల కొద్దీ గూండాలు పొట్టపోసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తను వెళ్ళగానే మాట్లాడి అడిగిన పని చేసి పంపిస్తారు. కానీ ఓ పోలీసువాడు వచ్చి ఇంటితలుపు తడితే బిక్కుబిక్కుమనాల్సివస్తోంది. అదే రాజకీయ నాయకుడు ఎవరైనా కబురు చేస్తే చాలు, ఠానాలో అందరూ సరే సార్ అంటారు. ఎన్నాళ్ళీ ముష్టి బతుకు. ఎవరి చేతికిందో పనిచేసి వాళ్ళని నాయకులుగా చేసేబదులు నేనే ఒక నాయకుడిని అయితే....’ – ఓ వీధి రౌడీ అంతరంగం.

ఇదిగో ఇలా వివిధ రంగాల వాళ్ళు రాజకీయాలవైపు పరుగులు తీస్తూ వుండడం వల్లనే ఈ పరిస్తితులు దాపురించాయి.

ఆప్తవాక్యం:  నిజానికి రాజకీయులు జనాలు అనుకున్నంత స్వార్ధ పరులేమీ కాదు. సమాజం ద్వారా సకల సంపదలు సంపాదించుకున్న వాళ్ళు వాటిని పరిరక్షించుకోవడం కోసం లేదా వాటిని మరింత పెంచుకోవడం కోసం  ప్రజాసేవ పేరుతొ రాజకీయాల్లోకి చేరుతూ వుండడం వల్లనే ఆ రంగం సహజంగానే కలుషితం అవుతూ వచ్చింది. సేవ చేయడానికి రాజకీయాలు, పదవులు అక్కరలేదు. ఒక మనిషిగా మీరున్న పరిధిలోనే మీకు చేతనైన సేవ చేయవచ్చు.
చాలా మంది అలా చేసి చూపిస్తున్నారు కూడా.

24, జూన్ 2024, సోమవారం

ఆధునిక సీతాపహరణం

 

డోర్ బెల్ మోగుతుంది. ఇంట్లో ఒంటరిగా వున్న ఆడమనిషి వెళ్లి తలుపు తీస్తుంది.
‘అమ్మా! ఆకలి. ఏదైనా వుంటే పెట్టండి, మీ పేరు చెప్పుకుని తింటాను’
‘అయితే లోపలకు రా అన్నం పెడతాను’
‘లేదు, మీరే బయటకు రండి’
‘అయితే ఓకే!’
‘హ!హ! నా చేతికి చిక్కావ్. నేనెవర్నో తెలుసా? లంకాధిపతి రావణుడిని’
‘హ!హ! నేను సీతని కాను, వాళ్ళింట్లో పనిమనిషిని’
‘హ!హ! పనిమనిషివా? మరీ మంచిది. సీతను పట్టుకెడితే మండోదరికి కోపం వస్తుంది. పనిమనిషిని తెచ్చానని చెబితే ఎంతో సంతోషిస్తుంది. పాత పనిమనిషి మానేసినప్పటి నుంచి బాగా ఇబ్బందిగా వుంది’
‘హ!హ! నేను సీతను అయితే నా కోసం రాముడు ఒక్కడే వెతుక్కుంటూ నీ వెంట పడతాడు. నన్ను ఎత్తుకెళ్ళావని తెలిసిందంటే హోల్ మొత్తం అపార్ట్ మెంటులోని జనాలందరు వెతకడానికి బయలుదేరతారు, జాగ్రత్త!’
‘అలానా! అయితే వస్తా!’
(నువ్వు హ! హ!! అంటే నేనూ హ! హ!! అంటా)

పేరులోనే వుంది


 
పూర్వం కమ్యూనిస్టుల ఏలుబడిలో సోవియట్ యూనియన్ వర్ధిల్లిన కాలంలో రేడియో మాస్కోలో దాదాపు ఎనభైకి పైగా ప్రపంచభాషల్లో వార్తాప్రసారాలు జరిగేవి. నేను తెలుగు విభాగం బాధ్యుడిగా ఉండేవాడిని. అప్పుడు సోవియట్ అధినేత మిహాయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్.
ఇన్ని ప్రపంచ  భాషలకు సంబంధించిన వార్తలను ముందు ఇంగ్లీష్ భాషలో తయారు చేసి వాటి  ప్రతులను అన్ని విభాగాలకు పంపేవారు. వాటిని ఆయా భాషల నిపుణులు తమ భాషలలోకి అనువదించి ప్రసారం చేసేవాళ్ళు. నాకు సహాయకుడిగా గీర్మన్ అనే రష్యన్ ఉండేవాడు.
‘మీరు అసలు ప్రతి ఇస్తున్నారు సరే. మీ వార్తల్ని మీరు అనుకున్నట్టు యధాతధంగా అనువదిస్తున్నామా లేదా అనే సంగతి మీకెలా తెలుస్తుంది’ అని అడిగాను. దానికి ఆయన చెప్పిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది.
‘ప్రతి వార్తలో దాదాపు మా నాయకుడి పేరు అనేకసార్లు  వస్తుంది. మీరు ఎన్నిసార్లు  ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ అంటారో దాన్ని మా వాళ్ళు విని, మా దగ్గర వున్న ఒరిజినల్ బులెటిన్లో ఆ పేరు ఎన్ని సార్లు వచ్చిందో సరిచూసుకుని అప్పుడు మీరు  సరిగా అనువాదం చేస్తున్నారో లేదో  కనుక్కుంటారు’ అని కర్ణుడి జన్మ రహస్యం నా చెవిన వేశాడు. 
అంటే ఇక ఎటువంటి పరిస్తితిలోనూ సర్వనామాలు పనికిరావు అనేది బోధపడింది. 
అందుకా, ‘ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ప్రకటించారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ఇంకా ఇలా అన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ పేర్కొన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ఉద్ఘాటించారు’ అంటూ ఒకే పేరాలో నాచేత అష్టోత్తరం చదివిస్తున్నారు అనే వాస్తవం ఎరుకలోకి వచ్చింది.
సరే! ఆ శకం ముగిసింది.

ఇలాంటిదే మరో విశేషం నా కంట పడింది.
ఆఫ్రికా దేశం అయిన ఉగాండాను ఇదీ అమీన్ అనే నియంత పాలించేవాడు. రేడియో కంపాలాలో ప్రతి రోజు అయన గురించిన వార్తలే ప్రముఖంగా ప్రసారం అయ్యేవి. ఆయనకు రేడియోలో తన పూర్తి పేరు చెప్పాలని మక్కువ. నియంత తలచుకుంటే కానిదేముంది. కాకపోతే ఒక ఇబ్బంది ఎదురయింది. పూర్తి పేరు అయితే పరవాలేదు కానీ తనకున్న బిరుదులు, మెడల్స్ కూడా జోడించి చెప్పాలని ఆదేశం. నియంత పాలించే ఆ దేశంలో ఆయన ఆదేశం శిరోధార్యమాయే. దాంతో  ఒకటికి పదిసార్లు రేడియోలో ఆయన పేరు వచ్చేది. ఒకటికి పదిసార్లు జనం దాన్ని వినాల్సివచ్చేది. ఎలా అంటే ఇలా:
“His Excellency the President of the Republic of Uganda, General al Haji Idi Amin Dada, VC, DSO, MC……”         
ఏమి సేతురా లింగా.....

23, జూన్ 2024, ఆదివారం

క్వాలిటీ టైం



నెహ్రూ ప్రధమ ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో అనేక అంశాల మీద మేధావుల నుండి సలహాలు, సూచనలు తీసుకోవడం కోసం ఒక పద్దతి పాటించేవారని ఆయన దగ్గర పనిచేసిన మత్తయ్ రాసుకున్నారు. (నెహ్రూ వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఇంకా చాలా రాశారు అనుకోండి. అవి ఇక్కడ అప్రస్తుతం)
దేశవ్యాప్తంగా నెహ్రూకు సలహాలు ఇవ్వగలిగిన స్థాయి కలిగినవారిని ఎంపిక చేసుకుని ప్రధాని కార్యక్రమాలకు అనువుగా వుండే రోజుల్లో, ఒక్కొక్కరినీ విడివిడిగా ఢిల్లీకి ఆహ్వానించేవారు. బ్రేక్ ఫాస్ట్ బల్ల మీద భేటీ జరిగేది. ఒక అంశం అని కాకుండా కబుర్లు చెప్పుకునేరీతిలో సంభాషణ సాగేది. బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసేలోగా ఏదో ఒక అంశంపై నెహ్రూకు అవసరమైన సమాధానం లేదా సమాచారం ఆ వ్యక్తి నుంచి అందేది. అవగాహన కలిగేది. ఇతరులు ఎవరూ వుండరు కాబట్టి , ఎలాంటి అంతరాయాలు లేకుండా వారిరువురూ నిష్కర్షగా చర్చించుకునే వీలుండేది. దాపరికాలు లేకుండా మాట్లాడుకునే అవకాశంవుండేది.
దీన్ని ఇప్పటి ఆధునిక కార్పొరేట్ పరిభాషలో క్వాలిటీ టైం అంటారుట

22, జూన్ 2024, శనివారం

ఉత్సుకత కోల్పోతున్న వార్తలు


ఎనభయ్యవ దశకం చివర్లో మేము మాస్కోలో వున్నప్పుడు మాకు ఏ కొరతా వుండేది కాదు,  ఒక్క తెలుగు పేపర్ రాదే అన్న లోటు తప్ప. అందుకే ఇండియా నుంచి మా వాళ్ళు ఏదయినా సరుకులు అంటే చింతపండు, బెల్లం  లాటివి పంపేటప్పుడు వాటిని న్యూస్ పేపర్ లలో చుట్టి పంపాలని కోరేవాళ్ళం. ఆ విధంగానయినా ఆ  పాత పేపర్లలోని  పాత  వార్తలనయినా  తాజాగా  చదువుకోవచ్చన్నది మా తాపత్రయం. ఆ రోజుల్లో  మాస్కోలో విదేశీ పత్రికలు  దొరికేవి కావు. విదేశీ రేడియోలు వినబడేవి కావు. విదేశీ టీవీ ఛానళ్ళు కనబడేవి కావు. అందుకని ఇండియా వార్తలకోసం ముఖ్యంగా తెలుగు వార్తలకోసం మొహం వాచినట్టుగా వుండేది. నేను పని చేసేది మాస్కో రేడియోలో కాబట్టి కొంత పరవాలేదు. కాస్త  ఆలస్యంగానన్నా యేవో కొన్ని వార్తలయినా చెవిన పడుతుండేవి. కానీ వాటిని శ్రోతల చెవిన వేయాలంటే వెయ్యి అడ్డంకులు. ఒక రోజు ఎం జీ రామచంద్రన్ మరణించిన వార్త వచ్చింది. కానీ వెంటనే ప్రసారానికి నోచుకోలేదు. ఎందుకంటె ఆ మదరాసీ రాజకీయ నాయకుడు ఢిల్లీ లోని ఫెడరల్ ప్రభుత్వానికి అనుకూలమో కాదో నిర్ధారణ చేసుకునేవరకు ఆ చావు వార్తను చావనివ్వకుండా బతికించే వుంచారు.
పోతే, సమాచారానికి సంబంధించినంతవరకు  మాస్కోలో వున్న మిగిలిన ఇండియన్ల పరిస్తితి మరీ ఘోరం. అర్ధం కాని రష్యన్ టెలివిజన్, చదవడానికి భాష తెలియని  రష్యన్ పత్రికలూ తప్ప, కనీసం ఒక్క  ఇంగ్లీష్ పత్రిక  కూడా కనబడేది కాదు.  అయితే ఈ విషయంపై  మాస్కోలోని హిందుస్తానీ  సమాజ్ చేసిన  అభ్యర్ధన మేరకు ఇండియన్ ఎంబసీ వారు ఢిల్లీ నుంచి కొన్ని ఇంగ్లీష్ దినపత్రికలు తెప్పించేవారు.  పదిరోజులకోమారు ఎయిర్ ఇండియా విమానంలో వచ్చే డిప్లొమాటిక్ బాగ్ లో ఈ పత్రికలు భారత రాయబార కార్యాలయానికి చేరేవి. మాస్కో రేడియో నుంచి మూడు మెట్రో రైల్వే స్టేషన్ల  అవతల ఇండియన్ ఎంబసీ వుండేది. రేడియోలో పనిచేసే భారతీయులం వంతులు వేసుకుని  ఎంబసీ కి వెళ్లి పత్రికలు పట్టుకొచ్చేవాళ్ళం. ఈ బాధ్యతను ఒకటికి రెండు సార్లు నేనే భుజానికి ఎత్తుకునేవాడిని. దీంట్లో నా స్వార్ధం కూడా కొంత వుంది. ఇంటికి తిరిగి వస్తూ ఎంచక్కా మెట్రోలోనే కొన్నిపేపర్లు చదువుకోవచ్చు. అంతేకాదు, డిప్లొమాటిక్ బాగ్ లోనే మాస్కోలోని ఇండియన్లకు ఉత్తరాలు కూడా  వచ్చేవి. అదెలాగంటే, హైదరాబాద్ లో కానీ మరో చోట వున్న వారు కానీ మాస్కోలో వున్న తమ వాళ్లకు  జాబు రాయాలనుకుంటే ఎయిర్ మెయిల్ అవసరం లేదు. కవరుపై   పేరురాసి కేరాఫ్ ఇండియన్ ఎంబసీ, మాస్కో -  విదేశీ వ్యవహారాల శాఖ, న్యూ ఢిల్లీ అని రాసి ఢిల్లీ కి పోస్ట్ చేస్తే – అది డిప్లొమాటిక్ బాగ్ ద్వారా మాస్కో చేరేది. కాకపొతే ఆ ఉత్తరాలను ఎంబసీ కి వెళ్లి ఎవరికి వారే తెచ్చుకోవాలి. ఉత్తరాలతో పాటు అలా తెచ్చుకున్న పత్రికలనే –రేడియో మాస్కో బిల్డింగ్ లో వున్న భారతీయులం  అందరం అపురూపంగా చదువుకునేవాళ్ళం.
ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే – దూరంగా వున్నప్పుడు  సొంత వూరి సమాచారం కోసం మనిషి ఎంతగా వెంపర్లాడి పోతాడో చెప్పడానికి.
అయితే, ఇప్పుడు విదేశాల్లో వుంటున్న భారతీయులకు కానీ, ప్రత్యేకించి తెలుగు వారికి కానీ ఇలాటి ఇబ్బందులు వున్నట్టు లేదు. ఉపగ్రహాల ద్వారా సమాచార  వినిమయం పెరిగిన తరువాత విషయాలు తెలిసిరావడానికి అమలాపురంలోవున్నా ఒకటే అమెరికాలో వున్నా వొకటే. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ ల పుణ్యమా అని ఎలాటి కబురయినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతోంది.
ముప్పయి నలభయ్ ఏళ్ళ క్రితం మన దగ్గర కూడా  పరిస్తితి వేరుగా వుండేది. ఆ రోజుల్లో ఏదయినా వార్త ముందు తెలిసినప్పుడు దాన్ని నలుగురితో పంచుకోవాలన్న ఆత్రుత వుండేది. విషయం తెలుసుకున్న వారు కూడా తెలిపినవారిపట్ల కృతజ్ఞతతో వుండేవారు. ప్రత్యేకించి వార్తా పత్రికల్లో, రేడియోలో పనిచేసే వారిపట్ల ఒక ప్రత్యేక గౌరవభావం సమాజంలో వుండడానికి కూడా ఇది ఒక కారణం. కొన్ని విషయాలు జర్నలిష్టులు ఫోను చేసి చెప్పేవరకు అధికారులకు, మంత్రులకు కూడా ముందుగా తెలిసేవి కావు. రేడియోలో వార్తలు రోజూ నియమబద్ధంగా నియమిత సమయాల్లో మాత్రమే ప్రసారం అయ్యేవి. పత్రికలు చదవాలంటే మరునాటి దాకా ఆగాలి. అందుకే మాకు ముందుగా తెలిసిన వార్తలను తెలిసినవారితో పంచుకోవడం ఒక ఉత్సాహంగా వుండేది. ఉదాహరణకు సంజయ్ గాంధీ దుర్మరణం, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల దారుణ హత్య, అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చివేత మొదలైనవి.
రాజీవ్ గాంధీ హత్య గురించి హైదరాబాదులో కంటే మాస్కోలో వున్న మాకే ముందు తెలిసింది. అలాగే, మానుంచి వార్తలు తెలుసుకోవాలనే వాళ్ళల్లో కూడా  ఓ ఆత్రుత  కనబడేది. కానీ,   ఇప్పుడో!. మిన్ను విరిగి మీద పడ్డంత సంచలన సమాచారం తెలుపుదామని ఎవరికయినా ఫోను చేసారనుకోండి. ‘ఓస్ ఇదా! మాకెప్పుడో తెలుసు. టీవీ స్క్రోలింగుల్లో ఆల్రెడీ చూసేశాము’ అనేస్తారు. అందుకే,  వార్త అనే దానిలో ఒకప్పుడు దాగున్న ఉత్సుకత ఇప్పుడు కలికానికి కూడా లేకుండా పోతోంది.

21, జూన్ 2024, శుక్రవారం

పృచ్ఛకుడిగా ప్రధాన మంత్రి



హైదరాబాద్ లో జరిగిన శ్రీ నాగఫణిశర్మ మహా శతావధానంలో ఒక పృచ్ఛకుడిగా నాటి ప్రధానమంత్రి శ్రీ పీ.వీ. నరసింహారావు అడిగీ అడగని ప్రశ్న:

శ్రీ పీవీ: 
“ఎటు చూసినా ప్రశ్నలే. నిద్రావస్థలో కూడా ప్రశ్నలే కనపడుతున్న నాకు, ఇన్ని ప్రశ్నల నుంచి ఏ ఒక్క ప్రశ్ననో వేరు చేసి అడగడం అంటే గడ్డివాములో పడిన సూదిని వెతకడమే. అందుకని, కవికి తన భావనను అనుసరించి ఈ క్షణంలో తన మనః స్తితికి తట్టిన విధంగా అన్నింటికన్నా పెద్ద ప్రశ్న ఏది స్పురిస్తుందో దానికి జవాబు చెప్పాలని కోరుతున్నాను”

శ్రీనాగఫణి శర్మ :

”సకల భారతమును శాసింపగల రేడు 
ప్రశ్న వేయకుండ ప్రశ్న వేసె
ప్రశ్న ఏది నాకు ప్రశ్నా సమూహాన
ప్రశ్న మిగిలె నాకు ప్రశ్నగాను”

సంగీతం మధుర సంగీతం



ఊరికే నస పెట్టడం తప్ప నాకు  సంగీతం గురించి కానీ, సరిగమ పదనిసలు గురించి కానీ బొత్తిగా తెలియదు. ‘జర్నలిస్ట్ అనేవాడు, తెలియదు అనకూడదు, తెలుసుకుని మరీ నలుగురికి తెలియచేయాలి’ అనేవారు మా గురువుగారు తుర్లపాటి కుటుంబ రావు గారు.
ఈరోజు అంతర్జాతీయ సంగీత దినోత్సవం కదా! కొన్ని ఆ కబుర్లు.
  
'సంగీతము చేత బేరసారములుడిగెన్'
చిన్నప్పుడు సంగీతం నేర్చుకొందామనుకొనే వారందరికీ కాషన్ గా ఈ సామెత చెప్పేవారు. అయితే కొంతమంది పెళ్ళిచూపుల్లో అదనపు అర్హత కోసం చిన్నప్పుడు ఆడపిల్లలకి ఇళ్ళల్లో నాలుగయిదేళ్లపాటు సంగీతం చెప్పించేవారు. దొంగరాముడు సినిమాలో వీరభద్రయ్య {రేలంగి} తన కూతురుకి ఇలాగే పెళ్లి సంగీతం చెప్పిస్తాడు. పెళ్లి చూపుల్లో 'జార చోరా భజన చేసితిరా' అని 'దారిని తెలుసుకొంటి' అనే త్యాగరాజ కీర్తనలో ఓ చరణాన్ని పెళ్లి కూతురు చేత పాడిస్తారు దర్శకుడు కేవీ రెడ్డి గారు.
అదలా వుంచితే,
తెలుగునాట ద్వారం వెంకటస్వామి నాయుడు, చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్లే, దాలిపర్తి పిచ్చిహరి, హరి నాగభూషణం, తూమాడ సంగమేశ్వర శాస్త్రి, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, మహావాది వెంకటప్పయ్య వంటి పాత తరానికి చెందిన సంగీత విద్వాంసులు ప్రసిద్ధి చెందారు. పోతే, సుసర్ల దక్షిణా మూర్తి గారు త్యాగరాజు శిష్య పరంపరలోని వారు. ఈ మహా విద్వాంసుల శిష్యకోటిలో తెలుగు వారికి అఖండ ఖ్యాతి తెచ్చిపెట్టిన వారు మంగళంపల్లి బాలమురళి కృష్ణ, శ్రీపాద పినాకపాణి, నేదునూరి కృష్ణ మూర్తి, వోలేటి వెంకటేశ్వర్లు, షేక్ చిన్న మౌలా, ఈమని శంకర శాస్త్రి . ఇంకా ఎందరో విద్వాంసులు కర్నాటక సంగీతంలో అగ్రశ్రేణిలో నిలిచారు. ఈ విషయంలో మనం ఎంత గొప్పవాళ్ళ మైనా తమిళులు కర్నాటక సంగీతం వాళ్లదేనని అనుకొంటారు. కొంత వాస్తవం కూడా. కర్నాటక సంగీతానికి తమిళనాట ఉన్నంత ఆదరణ మన ప్రాంతంలో లేదు. మద్రాసులో కచేరి చేసి అక్కడి వాళ్ళ చేత ‘సెహభాష్’ అనిపించుకొంటేనే ఇక్కడ కూడా గౌరవం. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అన్న సూత్రం ఇక్కడ పని చెయ్యదు. సంగీతంలో మాత్రం రచ్చ గెలిస్తేనే ఇంట్లో గౌరవిస్తాం. ఉదాహరణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు.
ఫిడేలు నాయుడు గారి నుంచి ఈతరం మాండొలిన్ శ్రీనివాస్ దాకా కూడా ఇదే వరస, ఇదే బాణీ. 
మార్గశిర మాసం వచ్చిందంటే చెన్నై వాసులకు ఓ పండగ. డిసెంబర్ పదిహేనో తారీకు నుంచి జనవరి ఒకటో తారీకు దాక చెన్నైలో సంగీతం తప్పితే ఏమీ వుండదు. నగరంలో నలుమూలలా కనీసం ఓ పది పదిహేను ప్రాంతాల్లో ప్రతి రోజూ హీనపక్షం అయిదారు సంగీత కచేరీలయినా జరుగుతూ వుంటాయి. ఎక్కడ చూసినా హడావుడే. ఎక్కడెక్కడినుంచో కర్నాటక సంగీత అభిమానులు చెన్నై చేరుకుంటారు. ప్రొద్దుట తొమ్మిది నుంచి రాత్రి పది దాకా కచ్చేరీలు వినడమే వారి పని. చెవుల తుప్పు వొదిలిపోతుంది. మరో ఏడాదికి సరిపడా ఆనందాన్ని మనస్సులో నింపుకుని సంగీతాభిమానులు తిరుగుమొగం పడతారు.
ఇక చెన్నైలో మ్యూజిక్ అకాడమీది ఓ ప్రత్యేకత. ఎనిమిది  దశాబ్దాలకు పైగా  విరాజిల్లుతోంది. నిజానికి పాశ్చాత్య ధోరణులు అన్ని రంగాలను ముప్పేటలా ముసురుకుంటున్న ఈ రోజుల్లో ఇది ఎంతో గొప్ప విషయం అనే చెప్పుకోవాలి.
అకాడమీలో కచేరి చెయ్యడం అంటే ఆర్టిస్టులకు అంతకంటే గొప్ప గౌరవం ఇంకోటి వుండదు. అలాగే సంగీత అభిమానులకు అకాడమీలో కచేరి వినడం కంటే గొప్ప అనుభవం వుండదు. జీవితంలో వొక్కసారైనా అకాడమీలో కచ్చేరి వినాలన్నది వారి నరనరాల్లో జీర్ణించుకుపోయే కోరిక. మంచి సంగీతం వినాలనుకునే వారికి మ్యూజిక్ అకాడమీ హాలు ఒక వరప్రసాదం లాటిది. ఎందుకంటె అక్కడి ఏర్పాట్లు అలాటివి. ఎక్కడ కూర్చున్నా కూడా చక్కగా, శ్రావ్యంగా వినిపించే సౌండ్ సిస్టం. మన రవీంద్ర భారతి అధికారులు ఓ సారి వెళ్లి చూడాలి. ఆ సీటింగ్ ఆరెంజిమెంటు, సౌండ్ సిస్టం దేనికదే ప్రత్యేకం. వాళ్ళను పొగడడం, మన వాళ్ళను కించబరచడం అని కాదు. మనకు కూడా ఇక్కడ అటువంటి చక్కటి అనుభూతి కలగాలని మాత్రమే.
(విషయ సేకరణలో తోడ్పడిన ఆర్వీవీ కృష్ణారావు గారికి కృతజ్ఞతలు)

6, జూన్ 2024, గురువారం

అనగనగా ఒకమ్మాయి అనే ఓ సొంత పిట్ట కధ – భండారు శ్రీనివాసరావు

 

భగవంతుడు అనే వాడికి ప్రతిరోజూ వంగి వంగి నమస్కారం పెట్టక్కర లేదు. ఆరోజు ముగిసే సమయానినికి దేవుడా ఓ దండం అంటూ కృతజ్ఞత చెబితే చాలు.

ఆయన నాకు అన్నీ ఇచ్చాడు. కొన్ని తీసుకున్నాడు. అంతే కానీ నా జీవితంతో చెడుగుడు  మాత్రం ఆడలేదు. తోడూ నీడా అయినా భార్యను తీసుకు వెళ్ళాడు. మంచి కొడుకులను, కోడళ్ళను ప్రసాదించాడు. నువ్వు చేసిన చెత్త పనులకు ఇది చాలులే అని హెచ్చరిస్తూ నా భార్యను నాకు దూరం చేశాడు. చివరికి అయిదు పదులు నిండని నా రెండో కొడుకుని నాకు కాకుండా చేశాడు. కానీ వాడిని పెళ్లి చేసుకున్న నా కోడలు ఏమి నేరం చేసిందో తెలియదు. వాడి రెండేళ్ల కూతుర్ని, అయిదో వివాహ వార్షికోత్సవానికి నోచుకోని నా రెండో కోడల్ని వదిలేసి  వాడు హాయిగా ఈ లోకం నుంచి నిష్క్రమించాడు.  నేను  నిర్భాగ్యుడిని అయినానే కానీ, ఒంటరిని కాలేదు. ఉమ్మడి కుటుంబం అంతా కంటికి రెప్పలా నా వెంటే వుంది.

అల్లుడు పోయిన తర్వాత, కన్నవాళ్ళు  కన్నకూతుర్ని పుట్టింటికి తీసుకుపోవడం అతి సహజం. అదే జరిగింది.

మళ్ళీ ఒంటరితనం ముసురుకుంది. రాత్రల్లా ఎందుకీ జీవితం, పొతే పోలా అనిపించడం, తెల్లారి నలుగురిలో పడగానే బతకాలని అనిపించడం, దీనికి మించి ఒంటరితనానికి నిర్వచనం ఏముంది.

ఈ సోదికి కారణం వుంది. రేపు అంటే శుక్రవారం నా మనుమరాలిని చూడడానికి కటక్ వెడుతున్నాను. నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను.

ఇది పెద్ద విషయం ఏమీ కాదు.

ఈ మధ్య సుస్తీ పడ్డప్పుడు డాక్టర్లు ENSURE  అనే బలవర్ధక పానీయాన్ని ప్రతిరోజూ రెండుమార్లు తాగమన్నారు. ఫలితం బాగానే వుంది. కటక్ ప్రయాణానికి సాయంత్రం  బట్టలు సర్దుకుంటూ వున్నప్పుడు అమెజాన్ నుంచి కాబోలు ఈ ENSURE పాకెట్ నాకు బట్వాడా అయింది. దాన్ని కటక్ లో ఉన్న మా కోడలు ఆర్డర్ చేసింది. రాగానే ఏమాత్రం ఇబ్బంది ఎదురు కాకూడదని ఈ ఏర్పాటు. కళ్ళు చెమర్చాయి.

ఇళ్ళూ వాకిళ్ళూ లేవనే బెంగ నాకెందుకు?

(06-06- 2024)