రాజకీయం శక్తివంతమైన అయస్కాంతం వంటిది. అమిత జనాదరణ కలిగిన సినీరంగ ప్రముఖులూ, కోట్లకు పడగెత్తిన వ్యాపార, వాణిజ్య శ్రేష్ఠులు, తమ కత్తికి ఎదురేలేదని భ్రమించే సంఘ వ్యతిరేకశక్తులూ, ఉద్యోగంలో వున్నన్ని రోజులూ అధికార చక్రం తిప్పిన ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు ఇలా అందరూ కట్టగట్టుకుని తీయ నీటికి ఎగబడే చేపల మాదిరిగా రాజకీయ అరంగ్రేట్రం కోసం తహతహలాడేది అందుకే.
‘మాకు ప్రజల్లో అత్యంత ఆదరణ వుంది. కన్నెత్తి చూస్తే చాలు, పన్నెత్తి పలకరిస్తే చాలనుకుని మాకోసం జనాలు గంటలు గంటలు పడిగాపులు కాస్తుంటారు. ఎంతో శ్రమపడి, మరెంతో ఖర్చుపెట్టి అవుట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఆఖరి నిమిషంలో మా ఆశల మీద నీళ్ళు చల్లడానికి ఒక్క కానిస్టేబుల్ చాలు. అంత చిన్న ఉద్యోగి అధికారం ముందు మా యావత్తు ప్రజాకర్షణ బూడిదలో పోసిన పన్నీరే. అదే ఓ చోటా మోటా రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే చాలు కస్టడీలో ఉన్న మనిషికూడా బయటకు వస్తాడు. ఇక ఈ సంపాదన, ఈ సంపద, ఈ ఆకర్షణ ఏం చేసుకోను. అందుకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను’ – ఓ ప్రముఖ సినీ నటుడి మన్ కీ బాత్.
‘ముఖ్యమంత్రి గదిలోకి అయినా తలుపు తోసుకుని పోయేవాళ్ళు వుంటారు. అదే మా సంగతి చూడండి. ఇంచుమించుగా ముప్పయి అయిదేళ్ళు అనేక హోదాల్లో పనిచేసాము. ఏ ఒక్క రోజయినా మా అనుమతి లేకుండా చీమ కూడా మా ఛాంబర్ లోకి అడుగుపెట్టలేదు. ఒక్క సంతకం చేస్తే చాలు కోట్ల రూపాయల లాభాలు తెచ్చే ఫైళ్ళు క్లియర్ అవుతాయి. కానీ ఏం లాభం. పైనుంచి ఫోన్ వస్తే చాలు మేము కిక్కురుమనకుండా సంతకం చేసి పంపేయాల్సిందే. కాదు కూడదని మొండికేసి పై వాడు చెప్పిన పని చేయం అనుకోండి. అంతరాత్మ చెప్పిన విధంగానే, రూలు ప్రకారమే చేశాం అనుకోండి. సాయంత్రానికల్లా ఆ అంతరాత్మని వెంటబెట్టుకుని ఓ చెత్త పోస్టులోకి వెళ్ళమంటారు. ఇంత సర్వీసు చేసి అలాంటి పోస్టులు చేసేబదులు, అంతరాత్మ పీక నొక్కేసి అక్కడే వుంటే పోలా! కొన్నాళ్ళు బీరాలకు పోయినా కాలం గడుస్తున్నకొద్దీ సర్దుకుపోవడమే మేలనే పరిస్తితికి చేరుకుంటాము. కానీ ఎక్కడో బాధ. ఇంతచదువు చదివాము. ఇంత గొప్ప శిక్షణ పొందాము. చివరికి ఎవరో ఒక అంగుష్ఠమాత్రుడు చెప్పినట్టు చేయాల్సివస్తోంది. అంటే ఏమిటి? మనం అనుకున్న అధికారం మా ఉద్యోగాల్లోలేదు. అసలయిన అధికారం రాజకీయంలో వుంది. కాబట్టి రిటైర్ అయిన తర్వాత అందులోనే దూరితే పోలా!’ – ఒక సీనియర్ అధికారి అంతరంగ మధనం.
‘దేశ విదేశాల్లో వ్యాపారాలు వున్నాయి. నెలకు కోటి రూపాయలు కాంపెన్సేషన్ తీసుకునే సీయీఓలు డజను మంది తన చేతికింద పనిచేస్తున్నారు. క్రమం తప్పకుండా పనులు చక్కబెట్టుకునేందుకు సొంత విమానాలు వున్నాయి. రాజప్రసాదాలను తలదన్నే భవంతులు ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాల్లో వున్నాయి. తనని కలవాలంటే నెల ముందు అపాయింటు తీసుకోవాలి. మరి ఇంత ఐశ్వర్యం వుండి కూడా ప్రభుత్వాలతో పనిపడినప్పుడు, అది ఎందుకూ కొరకాకుండా పోతోంది. కోట్ల లాభం కళ్ళచూడడానికి అవకాశం ఉన్న ఫైలును ఓ చిన్ని గుమాస్తా మోకాలు అడ్డు వేసి అపగలుగుతున్నాడు. అతడి ఏడాది సంపాదన మొత్తం కలిపినా తను తాగే సిగార్ల ఖర్చుకు సరిరాదు.అదే ఓ ఎమ్మెల్యే ఫోను చేస్తే అదే ఫైలు పరుగులు కాదు ఎగిరి గంతులు వేసుకుంటూ చేరాల్సిన చోటికి, చేరాల్సిన టైముకు చేరుతుంది. లాభం లేదు, ఎంత ఖర్చయినా సరే ఈసారి ఒక రాజ్యసభ సభ్యత్వం సంపాదించి తీరాలి. లేకపోతే ఇంత సంపాదనా శుద్ధ దండగ’ – ఓ పారిశ్రామికవేత్త మనోవేదన
‘తనను చూస్తే పసిపిల్లలు నిద్రపోరు. తన మాట వినబడితే బడా వ్యాపారాలు చేసేవాళ్ళు కిమ్మనరు. తన చేతుల్లో లక్షలు మారుతున్నా పన్ను కట్టే పనే లేదు. తన మోచేతి నీళ్ళు తాగుతూ డజన్ల కొద్దీ గూండాలు పొట్టపోసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తను వెళ్ళగానే మాట్లాడి అడిగిన పని చేసి పంపిస్తారు. కానీ ఓ పోలీసువాడు వచ్చి ఇంటితలుపు తడితే బిక్కుబిక్కుమనాల్సివస్తోంది. అదే రాజకీయ నాయకుడు ఎవరైనా కబురు చేస్తే చాలు, ఠానాలో అందరూ సరే సార్ అంటారు. ఎన్నాళ్ళీ ముష్టి బతుకు. ఎవరి చేతికిందో పనిచేసి వాళ్ళని నాయకులుగా చేసేబదులు నేనే ఒక నాయకుడిని అయితే....’ – ఓ వీధి రౌడీ అంతరంగం.
ఇదిగో ఇలా వివిధ రంగాల వాళ్ళు రాజకీయాలవైపు పరుగులు తీస్తూ వుండడం వల్లనే ఈ పరిస్తితులు దాపురించాయి.
ఆప్తవాక్యం: నిజానికి రాజకీయులు జనాలు అనుకున్నంత స్వార్ధ పరులేమీ కాదు. సమాజం ద్వారా సకల సంపదలు సంపాదించుకున్న వాళ్ళు వాటిని పరిరక్షించుకోవడం కోసం లేదా వాటిని మరింత పెంచుకోవడం కోసం ప్రజాసేవ పేరుతొ రాజకీయాల్లోకి చేరుతూ వుండడం వల్లనే ఆ రంగం సహజంగానే కలుషితం అవుతూ వచ్చింది. సేవ చేయడానికి రాజకీయాలు, పదవులు అక్కరలేదు. ఒక మనిషిగా మీరున్న పరిధిలోనే మీకు చేతనైన సేవ చేయవచ్చు.
చాలా మంది అలా చేసి చూపిస్తున్నారు కూడా.
1 కామెంట్:
JP and JD both failed miserably in politics. Politics is altogether a different cup of tea.
కామెంట్‌ను పోస్ట్ చేయండి