13, డిసెంబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (247) : భండారు శ్రీనివాసరావు

 

నేనో సీతయ్యని!
ఈ శీర్షిక మొదలు పెట్టి దాదాపు పదమూడు మాసాలు గడిచాయి. ఇది 247వ ఎపిసోడు.
మొదటి నుంచీ ఇప్పటివరకూ సాగిన నా ఈ చరిత్రలో, ఎవరైనా గమనించి వుంటే, పలుసార్లు ప్రస్తావనకు వచ్చిన పేర్లు మూడే మూడు.
ఒకరు మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు, రెండో అన్నయ్య రామచంద్రరావు గారు, మూడో వ్యక్తి నా చిన్ననాటి, పెద్దనాటి, ఈనాటి స్నేహితుడు, మేనకోడలు విజయలక్ష్మి భర్త వనం జ్వాలా నరసింహారావు. పూర్తి పేరు ఇంత పొడుగుది అయినా, నేను ఆప్యాయంగా పిలుచుకునే జ్వాలా అనే చాలా సార్లు పేర్కొంటూ వచ్చాను.
అనేక రోజులుగా ఒక విషయాన్ని గురించి విపులంగా రాయాలని అనుకుంటూ వస్తున్నాను. వీలు దొరకలేదు అని అబద్ధం చెప్పను, కానీ నేనే వీలు చేసుకోలేదు. ఇది నిజం. విషయం ఏమిటంటే పోస్టు రిటైర్మెంటు జీవితం.
2005 డిసెంబరు ముప్పై ఒకటిన నేను దూరదర్శన్ నుంచి రిటైర్ అయ్యాను. కానీ, అదే రోజు ఓ ఏడాది సర్వీసు పొడిగించారు. కానీ దాన్ని నేను పూర్తిగా వినియోగించుకోలేదు. మధ్యలోనే బయటకు వచ్చి సత్యం రామలింగరాజు గారు ప్రారంభించిన 104 సర్వీసు గ్రామీణ ఆరోగ్య సేవల స్వచ్చంద సంస్థలో మీడియా అడ్వైజర్ గా కొన్నాళ్ళు పనిచేశాను. అలాగే రోజువారీ టీవీ చర్చలు.
ఇలా జీవితం సాగిపోయింది. రిటైర్ అయ్యాను అనే ఫీల్ లేకుండా పోయింది.
2019 లో మా ఆవిడ నిర్మల ఆకస్మిక మరణంతో నా జీవితం మరో మలుపు తిరిగింది. ఇతర వ్యాపకాలు తగ్గిపోయాయి. అసలైన రిటైర్ మెంట్ జీవితం మొదలయింది. కానీ రిటైర్ మెంట్ జీవితం ఎలా గడపాలి అనే విషయంలో సరైన అవగాహన లేక మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. ఒకరకంగా చెప్పాలి అంటే రోజులు దొర్లిస్తున్నాను. సరే! ఇది నా గొడవ. అలా ఉంచుదాం.
ఇప్పుడు మరో వ్యక్తిని గురించి చెబుతాను. ఆయనే నేను ముందు పేర్కొన్న వనం జ్వాలా నరసింహారావు. నా బాల్య మిత్రుడు. చిన్నప్పుడు స్కూల్లో సహాధ్యాయి. పెద్దయిన తర్వాత నా మేనకోడలు విజయలక్ష్మి భర్త. తదనంతర కాలంలో స్వయంకృషితో ఎదిగి ఎంతో పైకి వచ్చాడు. కిందపడ్డాడు. మళ్ళీ ఉవ్వెత్తున తాటిప్రమాణంలో పైకి లేచాడు.
చేయని ఉద్యోగం లేదు. బిహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో లైబ్రేరియన్ గా మొదలు పెట్టి తెలంగాణా ముఖ్యమంత్రి ప్రధాన సంబంధాల అధికారి పదవి వరకు అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలో చేయని ఉద్యోగం లేదు. మారని ఇల్లు లేదు. అయితే, ఈ ఒక్క విషయంలో మాత్రం నాకూ ఆయనకు పోలిక. మరీ ఆయనలా అన్ని కాకపోయినా నేను సైతం హైదరాబాదు ఉద్యోగపర్వంలో అనేక అద్దె ఇళ్ళు మారాను.
మూడు దశాబ్దాల పై చిలుకు కాలంలో, హైదరాబాదులో నేను చేసింది ఒకే ఒక ఉద్యోగం, ఒకే ఒక సంస్థ, ఆలిండియా రేడియోలో. కాకపొతే ఉద్యోగ పర్వం చరమాంకంలో కొద్ది కాలం దూరదర్సన్ లో కూడా ఇష్టం లేని కాపురం ఒక ఏడాది చేసి అక్కడే రిటైర్ అయ్యాను.
జ్వాలా అలా కాదు. అనేక ఉద్యోగాలు. అనేక తరహా ఉద్యోగాలు. కొన్ని సర్కారు కొలువులు. మరి కొన్ని అటూ ఇటూ కానివి. అందుకే రిటైర్ మెంటు అనేది ఆయనకు లేకుండా పోయింది. ఉద్యోగానికి ఉద్యోగానికి మధ్య ఖాళీ. ఖాళీకి ఖాళీకి నడుమ కొలువు. ఇలా సాగిపోయింది ఆయన జీవితం. ఖాళీ సమయాన్ని కూడా ఖాళీగా వుంచలేదు ఏనాడు. రాజకీయాల నుంచి రామాయణ, మహాభారతాల వరకూ గ్రంధాలు రచిస్తూ పోయాడు. రాయడమే కాదు వాటిని పుస్తకాలుగా వెలుగులోకి తెచ్చాడు. వేటినీ అమ్మకానికి పెట్టలేదు. ఆసక్తి కలిగిన వారికి ఉచితంగా ఇచ్చాడు.
చివరికి జ్వాలా కూడా రిటైర్ అయ్యాడు. కానీ ఒప్పుకోడు. ఆయనే కాదు, నేను కూడా ఆయన రిటైర్ అయ్యాడు అంటే ఒప్పుకోను. నో రిటైర్మెంట్ అనేది ఆయన పాలసీ.
నాకూ ఆయన వయసులో ఒకటి రెండేళ్లే చిన్న. పోస్టు రిటైర్మెంట్ విషయంలో మాత్రం చాలా తేడాలు.
ఒకప్పుడు ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. కానీ నా భార్య మరణానంతరం నా లోకం మారిపోయింది. ఏకాంతం నా లోకం అయింది. ఇంతవరకు నా జోలికి రాని కొన్ని ఆరోగ్య సమస్యలు. మరికొన్ని హార్దిక ఇబ్బందులు. రెండో కుమారుడి మరణం వంటి తట్టుకోలేని సంఘటనలు. జీవితం పట్ల నా దృక్పథం మారిపోయింది.
ఒంటరితనం. ఒంటరిగా జీవించడం. ఏదీ పట్టించుకోకపోవడం. నిర్లిప్తత. నిర్వేదం.
విల్లాల్లో జీవితం కాకపోయినా, చెప్పుకోదగిన ఆర్ధిక ఇబ్బందులు లేవు. వయసురీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎలాగు తప్పవు.
(ఇవన్నీ మా పెద్దకోడలు భావన నాకు జీవన భగవద్గీత బోధించే వరకే)
ఈ నేపధ్యంలో జ్వాలా జీవితం నాకు ఓ దిక్సూచిలా కనిపించింది. ఒప్పుకోడు కానీ ఆయనది రిటైర్మెంట్ జీవితమే. ఆ మధ్య ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్లాను. గతంలో మాకిది రోజువారీ వ్యవహారమే. కానీ ఈ మధ్య నేను ఇల్లు వదిలి బయటకు పోలేదు. నిజం చెప్పాలి అంటే, నా గది వదిలి ఇంట్లోనే అడుగు బయట పెట్టలేదు. బెడ్ రూమ్ టు బాత్ రూమ్. తిండీ తిప్పలు అన్నీ నా గదిలోనే. అంతగా ఒంటరితనం నన్ను ఆవరించింది.
ఆయన ఇల్లు ఎప్పటిలా బంధుమిత్రులతో కళ కళ లాడుతోంది. ఒకానొక కాలంలో, అంటే మా ఆవిడ జీవించి వున్న కాలంలో అందరూ మా గురించి, మా ఇంటి గురించి ఇలాగే చెప్పుకునేవారు.
స్నేహితులని, సన్నిహితులని, బంధువులని, మిత్రులని అప్పుడప్పుడు కలుస్తూ, పాత ముచ్చట్లు, కొత్త సంగతులు కలబోసుకోవడం ద్వారా రిటైర్ మెంటుని హాయిగా, ఆనందంగా, ఉల్లాసంగా గడపవచ్చనేది జ్వాలా థియరీ. మధ్య మధ్య కలుస్తుంటేనే చుట్టరికాలు అయినా స్నేహితాలయినా చిరకాలం నిలబడతాయని ఆయన నమ్ముతాడు. అందుకే చిన్ననాటి స్నేహితుల నుంచి ఉద్యోగ పర్వంలో పరిచయం అయిన ప్రతి ఒక్క అధికారి, సిబ్బందితో ఇప్పటికీ టచ్ లో ఉంటాడు. మధ్య మధ్య ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు, ఏ పనీ లేకపోయినా. హ్యూమన్ రిలేషన్స్ ప్రాధాన్యతని ప్రాక్టికల్ గా నిరూపిస్తున్న జ్వాలాని చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది అనిపించింది.
నా దగ్గర కూడా అంతకు మించిన ఫోన్ లిస్టు వుంది. కానీ ఏ రోజూ ఎవరితో మాట్లాడను. అనవసరంగా వారిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేది నాకు నేను చెప్పుకునే సమర్ధన.
ఇంత పెద్ద వయసులో ఈ అనుకరణలు సాధ్యమా! కాదని నాకు తెలుసు.
ఎందుకంటే నా గురించి నాకు బాగా తెలుసు.
నేనో సీతయ్యని.
(ఎవరి మాటా వినను)

కింది చిత్రం:
జ్వాలా, నేను



(ఇంకావుంది)

12, డిసెంబర్ 2025, శుక్రవారం

ఎన్నాళ్లగానో చదవాలని అనుకుంటున్న పుస్తకం

పాత్రికేయ  మిత్రుడు, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్. వినయ్ కుమార్ రాసిన ఆత్మ కధ- పేపర్ బాయ్ టు ఎడిటర్ - ఇన్నాళ్లకు ఇంటికి చేరింది. ఆనందంతో కూడిన కృతజ్ఞతలు.

మా అపార్ట్ మెంట్ లిఫ్ట్ సమస్య వల్ల వాచ్ మన్ కాస్త ఆలస్యంగా తెచ్చి ఇచ్చాడు.
🙏🙏🙏
భండారు శ్రీనివాస రావు

240 పేజీలు వెల : Rs. 125/- కాపీల కోసం : S. Vinay Kumar, Hyderabad. Mobile : 99897 18911



10, డిసెంబర్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (246) : భండారు శ్రీనివాసరావు


నందిక నా కళ్ళు తెరిపిళ్ళు పడేలా చేసింది.
ఇప్పుడు తెల్లవారుఝమున మూడు గంటలు దాటింది.
నా వయసు ఎనభయ్ సంవత్సరాలు. ఆరేళ్ల క్రితం నా భార్య నిర్మల మరణించింది. నిరుడు మొదట్లోనే నా రెండో కుమారుడు సంతోష్ కన్ను మూశాడు.
అమెరికాలో ఉంటున్న నా పెద్దవాడు సందీప్, కోడలు భావన, చిన్న వయసులోనే జీవన సహచరుడిని పోగొట్టుకున్న చిన్నకోడలు నిషా నాకు బాసటగా నిలబడ్డారు. మా అన్నయ్య రామచంద్ర రావు గారు, ఆయన పిల్లలు సరే సరి. నా పాలిటి 108.
మల్టీ నేషనల్ సంస్థలో చిన్న కోడలుకి ఉద్యోగ బాధ్యతలు. చిన్నారి జీవిక ఆలనా పాలనా చూడడానికి మా ఆవిడ లేదు. అంచేత తప్పనిసరి పరిస్థితిలో పుట్టింట్లో, కటక్ లో వుండాల్సిన పరిస్థితి. అక్కడ జీవికకు అమ్మమ్మ, తాతతో పాటు కోడలి అన్నవదినలు, వారి పిల్లలు వుంటారు. ఒక కుటుంబ వాతావరణంలో పెరుగుతుంది. నిజానికి అంతకంటే గొప్పగానే పెరుగుతోంది. అది దాని అదృష్టం.
పగలు స్కూలు, సాయంత్రం డాన్సు స్కూలు, ఉదయం ట్యూషన్, డ్రాయింగు క్లాసు. ఇలా ఉదయం నుంచీ సాయంత్రం దాకా, వాళ్ళ అమ్మ ఓవర్ సీస్ కాల్స్ పూర్తయ్యేవరకు బిజీ, బిజీ.
ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒంటరిగా వుండడమే మంచిదని నాకూ అనిపించింది. మొబైల్స్ యుగంలో దూరాభారాల సమస్య లేదు కదా! ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో కాల్ చేసి చూస్తూ మాట్లాడ వచ్చు.
అలా సర్దుకుపోయాను.
ఒకరకంగా హైదరాబాదులో వానప్రస్తాశ్రమం.
ఒక్కడిని. వంట చేసిపెట్టడానికి వలలి. ఇంటి పనులు చేసిపెట్టడానికి ఒక హెల్పర్. బయట తిరగాలి అంటే కారు. ఎనభయ్ ఏళ్ళ మనిషికి ఇంతకంటే ఏం కావాలి?
ఏ సమస్య లేకుండా పిల్లలు చూసుకుంటున్నారు. వాళ్లకి నేను సమస్య కాకుండా చూసుకోవడం ఒక్కటే నేను చేయగలిగింది.
దాంతో నాకు నేనుగా కొన్ని నియంత్రణలు పెట్టుకున్నాను.
ముందు నేను చేయాల్సింది నా ఆరోగ్యం చూసుకోవడం. ఇదివరకు ప్రతిదీ ఒక సమస్యే. ఎప్పుడయితే నా పెద్దకోడలు భావన చెప్పినట్టు, అది సమస్య కాదు ఇబ్బంది అని అనుకోవడం మొదలు పెట్టానో అన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయాయి.
నాకు నేనుగా ఒక ప్రపంచం నిర్మించుకున్నాను, ఇందులో రాత్రీ పగలు తేడా లేదు. రాత్రుళ్లు నిద్ర పట్టదు. పట్టకపోతే ఏమవుతుంది? రేపు పగలు నిద్రపోతాను. రేపు అనేది వుంది అనే నమ్మకం కుదరడంతో నిద్రపట్టక పొతే ఎల్లా అనే దిగులు, భయం పోయాయి. దిగులు పోవడంతో ఆరోగ్యం నా ప్రమేయం లేకుండానే కుదుట పడింది.
అదివరకు ప్రతినెలా వైద్య పరీక్షలు చేయించుకునే వాడిని. ఆరు నెలలుగా డయాగ్నాస్టిక్ సెంటర్ గడప తొక్కలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు.
ఒకరకంగా ఇది మొండితనమే. ఏదన్నా ముంచుకు వస్తే! ఏమవుతుంది? ఇంతకంటే ఏమవుతుంది?
కట్టుకున్న భార్య, కన్న కొడుకు కళ్ళ ముందే పోయారు. వారిని కాపాడగలిగానా?
మిత్రుడు, మేనకోడలు మొగుడు జ్వాలా 'బయటకు వస్తుండు' అని చెప్పి చెప్పి విసుగు పుట్టి ఊరుకున్నాడు. ఆదివారం కలిసిన మిత్రుడు, తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి కూడా అదే మాట. వారానికి ఒకరోజు జీరోకు సెలవు ఇచ్చి బయటకు వస్తుండు అని. కానీ ఒకళ్ళ మాట వినేరకం అయితే నేను, నేను ఎందుకు అవుతాను.
ఇప్పుడు ఒకటే నా ధ్యేయం. మొదలు పెట్టిన జీరో కధను పూర్తి చేయడం. వీలయితే దాన్ని మా పిల్లలు చదువుకునేలా ఆంగ్లంలో అనువాదం చేయడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో అదేమంత పెద్ద విషయం కాదు.
తెల్లవారుఝామున ఎప్పుడో నిద్ర పట్టినా ఆరుగంటలకు మెలకువ వస్తుంది. కాలకృత్యాలు తీర్చుకునేసరికి, పాలబ్బాయి ప్యాకెట్ వేస్తాడు. వాటిని కాగబెడతాను. ఒక్కోసారి పొంగిపోతాయి. అవసరం అన్నీ నేర్పిస్తుంది. సన్నటి సెగన కాగబెడతాను. గతంలో ఫిల్టర్ కాఫీ తాగేవాడిని. అదో పెద్ద హైరాణా. ఫిల్టర్ లో పొడివేసి, వేడి నీళ్ళు పోసి అది దిగిన దాకా వెయిట్ చేయడం నా వల్ల కాదు.
మరి ఇంతమంది పనివాళ్లు దేనికి అంటారా! వంట చేసే ఆవిడ పదిహేను ఏళ్ళ నుంచి పని చేస్తోంది. ఆమెకు గంపెడు సంసారం. పొద్దున్నేరావాలి, ఈ పనులు చేయాలి అంటే. గతంలో వచ్చేది. ఒక్క మనిషికి కాఫీ కలపడం కోసం ఎందుకు, వద్దని నేనే చెప్పాను. కొన్నాళ్ళు కాఫీ ప్రహసనంతో కుస్తీ పట్టిన తర్వాత ఈ గోలకంటే కాఫీ మానేస్తే పోలా అనిపించి ఆ అలవాటుకు స్వస్తి చెప్పాను.
ఒక గ్లాసు పాలలో ఎన్స్యూర్ కలుపుకుని, డ్రాయింగ్ రూములో కూర్చుని లెగ్ మసాజర్ లో కాళ్ళు పెట్టుకుని, పాలు తాగుతూ, అలెక్సాలో వెంకటేశ్వర సుప్రభాతం పెడతాను. మిగిలిన పాలు తోడు పెడతాను. నిజానికి ఈ పనులన్నీ చాలా రోజులు మా వలలి చేసేది. అప్పటిదాకా మంచం మీద నిద్రపట్టక దొర్లుతూ వుండేవాడిని. ఈ పనులు నా భుజానికి ఎత్తుకున్న తర్వాత రోజులో ఎంతో సమయం కలిసివస్తోంది. నాకూ కొంత కాలక్షేపం.
పొతే, ఇక నందిక సంగతి. ఈ అమ్మాయి మా చిన్నకోడలు నిషా అన్నయ్య కుమార్తె. చార్టర్డ్ అక్కౌంటెన్సీ ఇంటర్ మీడియెట్ గ్రూపు రెండు పరీక్షలు ఒకే అటెంప్ట్ లో మంచి రాంక్ తో పూర్తి చేసింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో ఆర్టికిల్ షిప్ ఆఫర్ వచ్చింది. ఆ కంపెనీ హైదరాబాదులో వుంది. చేరడానికి ఇక్కడకు వచ్చింది. అదీ ఇండిగోలో. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు అన్నీ ఒకేమారు నేల వాలినట్టు ఇండిగో విమానాలన్నీ గాలిలో ఎగరడం మానేసి భూమి మీదనే పడి వుంటున్నాయి, కొన్నిరోజులుగా. ఆ అమ్మాయి సోమవారం నాడు జాయిన్ కావాలి. ఎలారా అని మధన పడుతుంటే ఆదివారం నాడు మాత్రం మధ్యాన్నం ఫ్లయిట్ సరయిన సమయానికి భువనేశ్వర్ లో బయలుదేరి సరయిన సమయానికి హైదరాబాదు చేరింది. లక్కీ గర్ల్.
ఇంట్లో దీపం వెలిగించేవాళ్లు లేరు అనుకునే బాధ లేకుండా ఇంటి దీపంలా నందిక వచ్చింది.
సోమవారం ఆఫీసుకు వెళ్ళింది, వచ్చింది. కొత్త ఆఫీసులో పని, ఇతర క్షేమ సమాచారాలు కనుక్కుని మళ్ళీ నా డెన్ లోకి వచ్చాను. ఏదో చెత్తా చెదారం రాసుకుంటూ వుండి పోయాను. నేను సాధారణంగా నా గది వదిలి మా ఇంట్లోనే కాలు బయట పెట్టను, ఉదయం పూట ఓ అరగంట తప్ప. తలుపు తీసి పెడతాను. వంటమనిషి, పనిమనిషి వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకుని వెడతారు. మూడు కిలోలు బియ్యం కొంటే నెల దాటినా మళ్ళీ కొనే అవసరం పడదు. నేను కంచంలో వదిలేసే అన్నం చూసి, పని మనిషి బాధ పడుతుంది. ఇంతకంటే తక్కువ వండడం కష్టం అని వలలి వాదన. ఈ వయసులో ఎంత తక్కువ తింటే అంత మంచిది అనేది నా థియరీ. మా అన్నయ్య, లేదా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఫుల్ మీల్స్ ఎలాగూ తప్పదు.
సోమవారం సాయంత్రం వంటింట్లో చప్పుడు అవుతుంటే వెళ్లి చూశాను. నందిక వంటింటి సామాగ్రి సర్దుతూ కనిపించింది. ఎందుకమ్మా ఈ చాకిరీ అన్నాను. తీరా చూస్తే ఆరు నెలల కింద కొనిపెట్టి పోయిన సరుకులు. తెలివికల అమ్మాయి కనుక స్కాన్ చేసి పనికిరాని సరుకులన్నీ పెద్ద గోతాములో పెట్టింది. గిన్నెలు, స్టీల్ డబ్బాలు అన్నీ సదిరిపెట్టింది.
ఎలా అయినా ఆడపిల్లలు ఆడపిల్లలే. నిషా పోలికే ఈ అమ్మాయికి వచ్చింది. పోలిక సంగతేమో కానీ మా ఇంటికి మళ్ళీ వెలుగు వచ్చింది.





(08-12-2025)
(ఇంకావుంది)

8, డిసెంబర్ 2025, సోమవారం

అడిగి తెచ్చుకున్న పుస్తకం – భండారు శ్రీనివాసరావు

 

“చదవాలని అనిపించిన ప్రతి పుస్తకం కొనతగ్గదే!”

ఈ కొటేషన్ నాది కాదు.

నిన్న ఆదివారం ఉదయం ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్లాను. వెళ్ళే సరికి వేదిక మీదికి అతిధులను ఆవిష్కరించే క్రతువు కొనసాగుతోంది.  బయట పుస్తకాన్ని అమ్మే ఏర్పాటు ఏమైనా చేశారా, కొనుక్కుని వెడదామని ఒకపరి పరికించి చూసి,  అలాంటిదేమీ లేదని నిర్ధారించుకుని లోపలకు వెళ్లాను.

మిత్రుడు, పాత్రికేయుడు, బహురూపి, సౌమ్యుడు ములుగు రాజేశ్వరరావు రాసిన ( నేను – బహువచనం, అధినాయక జయహే” గేయ సంపుటి) రెండు పుస్తకాలను  ఒకే వేదిక మీద,  ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ  మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ మోహన్ కందా ఆవిష్కరించారు. తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కె. శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథి. వేదిక మీద జర్బలిస్తులే కాదు, వివిధ రంగాలకు చెందిన ఘనాపాటీలు వున్నారు.

అందరూ తమ ప్రసంగాలలో,  రాజేశ్వరరావు గురించి నేను పైన పేర్కొన్న విశేషణాలనే ప్రముఖంగా  ప్రస్తావించారు. అది సహజం.  పాతిక ముప్పయ్ ఏళ్ళకు పైగా ఆయనతో పరిచయం వున్న మాబోంట్ల అభిప్రాయం అదే. అయితే ఈ పుస్తకంలో అంటే తన ఆత్మ కధలో ఆయన రాసుకున్న రాజేశ్వరరావు వేరే. అయన లోపలి మనిషి గురించి మాలో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. తెలిసిన తర్వాత, ఇంటి పేరు ములుగు,  కానీ రాజీపడని రాజేశ్వరరావు అని పేరు పెట్టుకుని వుంటే బాగుండేది అనిపించింది.

పుస్తకానికి వేసిన ముఖచిత్రంలో ఆయన ఈ రెండో వ్యక్తిత్వం స్ఫుటంగా కనిపిస్తుంది. ఒక నిచ్చెన, దాని మూడో మెట్టు మీదనే కాటు వేయడానికి సిద్ధంగా వున్న పాము. దాని నుంచి తప్పించుకుని కిందికి జారడం.  మళ్ళీ ఎక్కే ప్రయత్నం మాత్రం మానలేదు.  చివరికి నిచ్చెన చివరి మెట్టు ఎక్కాడా అంటే అదీ లేదు. ముప్పయి ఏళ్ళ క్రితం ఎక్కడ ఉన్నాడో అక్కడే వున్నాడు. నిఖార్సయిన జర్నలిస్టులు చాలా మంది పరిస్థితి ఇదే. దీనికి ప్రధాన కారణం వాళ్ళ ఎడమ కాలు గట్టిది. నచ్చకపోతే, ఎంతో నచ్చి సంపాదించుకున్న  ఆ ఉద్యోగాన్ని ఎడమకాలితో తన్ని బయటకు వస్తారు. రాజేశ్వర రావు అదే బాపతు కనుక ఎన్నో పత్రికల్లో పనిచేసినా ఎక్కడా కుదురుకున్నది లేదు. అలాగని రాజీ పడి జీవితాన్ని సరిదిద్దుకున్నదీ లేదు.

నేను ఈ పుస్తకాన్ని సమీక్షించడం లేదు. ఎందుకంటే ఎవరికి వారు చదువుకుంటే ఇందులోని థ్రిల్ అర్థమవుతుంది.

ఇది చదివిన తర్వాత ధన్యవాదాలు చెప్పాల్సిన వ్యక్తి ఒకరున్నారు. అతడి పేరు కూడా నాకు తెలియదు.

అతడు రాజేశ్వర రావు పెద్ద కుమారుడు.

“నాన్నా! నువ్వు జర్నలిష్టువి. ఎన్నో రాస్తుంటావు. మరి నీ ఆటో బయాగ్రఫీ రాయొచ్చు కదా!”

“నేనేంటో మీకు తెలుసు కదా! మళ్ళీ అదెందుకు”

“ మాకు తెలిసిన నాన్న గురించి కాదు. తెలియని నాన్న గురించి”

ఈ షాక్ నుంచి పుట్టిందే ఈ పుస్తకం.

“నేను”

దీనికి ఓ ట్యాగ్ లైన్ “ బహువచనం”

అంటే నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది వున్నారని కవి హృదయం కావచ్చు.

“అఖండ విజయాలు, ఘోర వైఫల్యాలు” ఏదీ దాచుకోలేదు. ముళ్ళ బాట మీద పూలు చల్లుకుంటూ నడవడానికి వెనుకాడ లేదు.

కాపీ రైట్ హక్కులు రచయితవి. సమీక్ష పేరుతొ మొత్తం రాస్తే బాగుండదు. కనుక ఇంతటితో స్వస్తి.

అందరూ, ముఖ్యంగా జర్నలిజంలో చేరాలని ఆసక్తి వున్నవారందరూ చదవాల్సిన పుస్తకం. వెల: రు. 180/- (ముచ్చటగా ముద్రించిన తీరుకు ఇవ్వొచ్చు ఈ ఖరీదు) ఆన్ లైన్ లో దొరికే చిరునామా: Active Citizens Club, Flat 3-B, Sai Savitri Apartments, SBI Officers Colony, Bagh Amberpet, Hyderabad- 500013

తోక టపా:

ఉబెర్లో పడి ఇంటికి చేరి ఆత్రంగా పుస్తకం తెరిచి చూస్తే,  మొదటి పుటలోనే కర్రు కాల్చి పెట్టిన వాత.

“చదవాలని అనిపించిన ప్రతి పుస్తకం కొనతగ్గదే”

దటీజ్ రాజేశ్వర రావ్ !

(08-12-2025)




(08-12-2025)

2, డిసెంబర్ 2025, మంగళవారం

పెనం నుంచి పొయ్యి లోకి – భండారు శ్రీనివాసరావు

 

కొండ నాలుక్కి మందేస్తే వున్న నాలుక ఊడింది అనే నానుడి చందాన అయిందేమిటి అనిపించింది కొంతసేపటి క్రితం.
మా వీధి రోడ్డు మరమ్మతుల గురించి పోస్టు పెడితే మొత్తం మీద యంత్రాంగం చురుగ్గా కదులుతోందనే భావన కలిగింది, జరుగుతున్న పనులు చూసి. ఆ సంతోషంలోనే సంబంధిత అధికారులను, నాయకులను అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ మరో పోస్టు పెట్టాను.
ఈ రోజు కిందికి వెళ్లి చూస్తే పనివాళ్లు నిర్విరామంగా పనిచేస్తూ కాన వచ్చారు. వారి పిల్లలు అక్కడే ఆడుకుంటూ కనిపించారు. నాకూ వాళ్ళతో కాసేపు ముచ్చట్లు చెప్పాలని అనిపించింది. ఇద్దరూ కవల పిల్లలు లాగా వున్నారు. వాళ్ళ ఫోటో తీసి వాళ్లకు చూపిస్తే , అదోలా చూసారు కొంత ఆశ్చర్యంతో, శ్రీశ్రీ రాసిన ‘మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసాన హరివిల్లు విరిస్తే’ గేయాన్ని గుర్తుకు తెస్తూ.
ఈ లోగా నా ఆనందం ఆవిరయింది. మా పక్క వాటాలో వుండే రవిగారు వచ్చి, రోడ్డు మరమ్మతుల కారణంగా మంచి నీళ్ళ పైపు లైన్ దెబ్బతిని, నీళ్ళు లీక్ అవుతున్నాయని చావు కబురు చల్లగా చెప్పారు.
రోడ్డు వేసేది ఒక డిపార్ట్ మెంటు. వాటర్ పైప్ లైన్ల పర్యవేక్షణ మరో శాఖది. సంబంధిత అధికారులు ఎట్టకేలకు ఫోన్ లో అందుబాటు లోకి వచ్చారు. రోడ్డు కింద మూడు అడుగుల లోపున పైప్ లైన్లు వుంటాయని, మేము అరడుగు లోపలకి కూడా తవ్వలేదని, కాబట్టి ఈ లీకేజీతో మాకు సంబంధం లేదని ఒకరు తేల్చేశారు.
ఈ రోజు నీళ్ళు చాలా తక్కువ ప్రెషర్ తో రావడం వల్ల, పైపు దెబ్బతిన్నదేమో అనే అనుమానం కలిగిందని రవి గారి కధనం. ఈ విషయం చెప్పడానికి రవి గారు లా కాలేజీ దగ్గర వున్న వాటర్ వర్క్స్ ఆఫీసుకు వెళ్ళారు. సంబంధిత ఉన్నతాధికారి లేరు, రేపు వస్తారని వాకబు చేస్తే తెలిసింది. ఆయన నెంబరు నాకిచ్చి రవి గారు ఆయన పనిమీద వెళ్ళిపోయారు.
ఆ అధికారికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. తెలియని నెంబరు నుంచి కాల్ వస్తే ఆన్సర్ చేయడానికి నా లాగా ఆయన ఖాళీగా వుండే ఉద్యోగం చేయడం లేదు కదా! రెండు మూడు సార్లు చేసి ఊరుకున్నాను.
చిత్రంగా ఆయన నుంచి ఫోన్ వచ్చింది. ధన్యవాదాలు చెప్పి, విషయం వివరించాను. రేపు వాటర్ డే కాదు అని కూడా చెప్పాను. రేపు ఉదయం ఫస్ట్ అవర్ లో మా వాళ్ళు వస్తారు. సమస్య ఏమిటో తెలుసుకుని సరి చేస్తారు అని ఒక చల్లని మాట చెప్పారు.
లోగడే చెప్పాను కదా! పై వాళ్ళు సమస్య వింటే సామాన్యుడు సగం సమస్య తీరినట్టుగా సంతోషిస్తాడు. ప్రస్తుతం నేను అదే సంతోషంలో వున్నాను.
అన్నింటికీ మించి అక్కడ ఆడుకుంటున్న పసి పిల్లల నవ్వులే నాకు మరింత సంతోషాన్ని ఇచ్చాయి.
మన సమస్యలు సరే! ఎప్పుడూ వుండేవే. ఫోన్ చేస్తే కనీసం ఎవరో ఒకరు వింటున్నారు. కానీ ఈ పసిపాపల భవిష్యత్తు సంగతేమిటి? వారి సమస్యలు అనంతం.
వినేవాళ్ళు, చూసేవాళ్ళు, తీర్చేవాళ్ళు వున్నారా!
వుంటే అంతకంటే కావాల్సింది ఏమిటి?






02-12-2025