14, నవంబర్ 2024, గురువారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి ( 4 ) - భండారు శ్రీనివాసరావు

 మా నాన్నగారు రాఘవరావు (రాఘవయ్య గారు అనేవారు) వూరికి కరణం. పేరుకు బోలెడు ఆస్తి. వూరిచుట్టూ ఎటు చూసినా ఎంతదూరం వెళ్ళినా మా పొలాలే. ఐదో అక్కయ్య అన్నపూర్ణ అక్కయ్యను పక్కవూరు పెనుగంచిప్రోలు  పెద కరణం గారి అబ్బాయి కొమరగిరి  వెంకట అప్పారావుకుకు  ఇచ్చి పెళ్లి  చేశారు. ఈ సంగతి  ఇప్పుడెందుకంటే,  కొత్త అల్లుడు పొరుగూరు నుంచి  గుర్రం మీద అత్తగారింటికి మా ఊరు  వచ్చినప్పుడు ఆ గుర్రాన్ని మేతకు వొదిలేవారు. ఇక  అది తిరిగి మేసినంత మేరా మా పొలాలే. కానీ ఏం లాభం? వందల ఎకరాల భూమి మీద వచ్చే అయివేజు (ఆదాయం)  మాత్రం అంతంత మాత్రమే. కరణీకం మీద వచ్చే జీతం రాళ్ళు నాలుగే, ఇంటి ఖర్చుకు ఆధారం. వర్షాలు లేక పంటలు పండక రైతులు సర్కారుకు శిస్తుకట్టలేక ఇళ్ళూ పొలాలు వొదులుకుని వూళ్ళు వొదిలి వెళ్ళే రోజులవి.

అలాటి రోజుల్లో నా బాల్యం గడిచింది. అలాటి పల్లెటూరిలో నా  చిన్నతనం నడిచింది.

మా నాన్నకు  ఏడుగురు ఆడపిల్లలు.  నలుగురు మగపిల్లలం.

ఇంతమందికే కాదు, ఇంకా ఇంతమంది, ఇంట్లో  విస్తళ్ళు వేసే సమయానికి భోజనాలకు సిద్ధంగా వుండేవారు. పూటకూళ్ళ ఇల్లు లేని వూరు. ఎవరొచ్చినా చేయి కడిగేది వూరి కరణంగారింట్లోనే.

మా అమ్మా నాన్న, బామ్మ, ఆమె తల్లి గారు, పెనిమిటి వొదిలిపెట్టిన ఒక మేనత్త, ఇద్దరు జీతగాళ్ళు, వచ్చిపోయేవాళ్ళు ఇంతమందికి మా అమ్మే వండి వార్చేది. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పొద్దుపోయేవరకు నడుం వాల్చే వీలు వుండేది కాదు. దీనికి తోడు నిప్పులు కడిగే ఆచారం మా బామ్మది. వూరి పొలిమేరలో చెరువుకట్ట దగ్గర వున్న మంచినీళ్ళ బావినుంచి తడి చీరెకట్టుకుని బిందెలతో నీళ్ళు పట్టుకురావడంతో మా అమ్మ రోజువారీ  డ్యూటీ మొదలయ్యేది.   

మా ఇల్లు పెద్ద భవంతి ఏమీ కాదు. ఈ ఇల్లు కట్టడానికి ముందు ఉన్న ఇల్లు మాత్రం చాలా పెద్ది.  మండువా లోగిలి అని చెబుతారు. మా తాతగారి కాలంలో ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురయింది. ఆ సంఘటనలో కాలిపోగా మిగిలిన కలపతో కొత్త ఇల్లు కట్టారని చెబుతారు. వసారాలో వేసిన పైకప్పులో కాలిన నల్లటి మచ్చలు కానవచ్చేవి. ముందు వసారా. పక్కన దక్షిణాన ఒక పడక గది, మధ్యలో పెద్ద హాలు, దానికి ఆనుకుని ఒక పెద్ద గది, వెనుకవైపు మళ్ళీ ఓ వసారా, పక్కన వంటిల్లు.  

అక్కడక్కడా గోడల్లోనే చిన్న చిన్న గూళ్ళు, వంటింట్లో రెండు ఇటుకల పొయ్యిలు, గోడకు రెండు చెక్క బీరువాలు, ఒకటి మడి బీరువా, ఆవకాయ కారాల జాడీలు పెట్టుకోవడానికి, రెండో బీరువాలో పెరుగు కుండలు, కాఫీ పొడి  పంచదార మొదలయినవి దాచుకునే సీసాలు. వాటితో పాటే పిల్లలకోసం తయారు చేసిన కారప్పూస, గవ్వలు, మణుగు బూరెలు వంటి చిరుతిళ్ళు. ఈ రెండు బీరువాలు తాకడానికి కూడా పిల్లలకు హక్కు వుండేది కాదు. మడి బీరువా మరీ అపురూపం. దానికి తాళం కూడా వుండేది కాదు, అందులోనే చిల్లర డబ్బులు దాచి పెట్టేవారు. పొరబాటున కూడా ఇంట్లో ఎవ్వరూ మైల బట్టలతో వాటిని తాకే సాహసం చేసే వాళ్ళు కాదు.

మా అమ్మగారు పొగచూరిన వంటింట్లో, కట్టెల పొయ్యి ముందు కూర్చుని,  ఒంటిచేత్తో  పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంటకాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి. ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్ళు మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగా వేసి, పాలకుండని వాటిపై ఉంచిపైన ఒక రాతిపలకని దాలిగుంటకు మూతలా కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై  అరచేతి మందాన మీగడ కట్టేది.  మర్నాడు మా అమ్మ  కుండలోని  గడ్డ పెరుగుని ఒక గుంజకు కట్టిన కవ్వంతో చిలికేది. మజ్జిగపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసి, పక్కన నిలబడి ఆశగా చూసే చిన్నపిల్లలకి చిన్న చిన్న వెన్నముద్దలుపెట్టేది. ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి ఆటల్లోకి జారుకునేవాళ్ళం. మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానేఅంట్లగిన్నెలు సర్దేసివంటిల్లు ఆవుపేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టేవారు. రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈ పనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. శ్రమతెలియకుండా పాటలు పాడుతుండేవాళ్ళు. విలువ కట్టలేని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.

 వంటింటి వసారాలోనుంచి పెరట్లోకి గుమ్మం వుండేది. దానికింద వలయాకారంగా మెట్లు. కింద తులసి కోట. ఒక వైపు బాదం చెట్టు. అక్కడ అంతా  నల్ల చీమలు. ఎర్రగా పండిన బాదం పండ్లు కొరుక్కు తింటే భలే బాగుండేవి. ఇక బాదం పప్పు రుచే వేరు. దానికి పక్కనే  పున్నాగ చెట్టు. నేలరాలిన పూలు భలే మంచి వాసన వేసేవి. మా అక్కయ్యలు వాటిని సుతారంగా మడిచి మాలలు కట్టుకునే వాళ్ళు. మేము వాటితో బూరలు చేసి వూదేవాళ్ళం. దగ్గరలో ములగ చెట్టు. కొమ్మల నుంచి ములక్కాడలు వేలాడుతూ కనిపించేవి. అక్కడే రెండు బొప్పాయి చెట్లు కవల పిల్లల్లా ఉండేవి.

రెండో వైపు కొంచెం దూరంలో గిలక బావి. ఆ బావి చుట్టూ చప్టా. పక్కనే రెండు పెద్ద గాబులు (నీటి తొట్టెలు). ఒకటి స్నానాలకి, రెండోది బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి. స్నానాల గాబు పక్కనే వేడి నీళ్ళ కాగు. అక్కడే చెంబుతో వేడి నీళ్ళు,  గాబు లోని చల్ల నీళ్ళు సరిపాట్లు చేసుకుంటూ పిల్లలు స్నానాలు చేసేవాళ్ళు. మగవాళ్లు తుండు గుడ్డలు కట్టుకుని  బావిదగ్గర నిలబడి, పనివాళ్ళు నీళ్ళు తోడి ఇస్తుంటే నలుగు పిండితో వొళ్ళు రుద్దుకుంటూ స్నానాలు చేసేవాళ్ళు. నాకు బాగా బుద్ధి తెలిసే వరకు  ‘సబ్బు’ గృహ ప్రవేశం చేయలేదు.  బావి దగ్గర నుంచి వెనుక పెరట్లోకి చిన్న చిన్న కాలువలు ఉండేవి. నాలుగయిదు అరటి చెట్లు ఉండేవి. అరటి గెల ఒక దిక్కుకు కాస్తే ఇంటికి అరిష్టమని ఆ గెల వేసిన  చెట్టుని కొట్టేసేవారు.  ఇంట్లోకి అవసరం అయ్యే కాయగూరల్ని, ఆకు కూరల్ని అక్కడే పండించే వాళ్ళు. చుట్టూ కంచెగా వున్న  ముళ్ళ కంపకు కాకరపాదులు పాకించే వాళ్ళు, తేలిగ్గా ఓ పట్టాన కాయలు తెంపుకు పోవడానికి వీల్లేకుండా. అక్కడే మాకు పెద్ద పెద్ద బూడిద గుమ్మడి కాయలు, మంచి గుమ్మడి కాయలు కనబడేవి. అంత  పెద్దవి అక్కడికి ఎలా వచ్చాయో అని ఆశ్చర్యపడేవాళ్ళం. నాకు పొట్ల పందిరి ఇష్టం. పందిరి మీద అల్లుకున్న తీగె నుంచి పొట్ల కాయలు పాముల్లా వేలాడుతుండేవి. పొట్లకు పొరుగు గిట్టదు అనేది మా బామ్మ. పొరుగున మరో కూరగాయల పాదు వుండకూడదట.

బచ్చల పాదులు అంటే కూడా పిల్లలకు ఇష్టం. ఎందుకంటే వాటికి నల్లరంగుతో చిన్నచిన్న పళ్ళు (విత్తనాలు) కాసేవి. వాటిని చిదిమితే చేతులు ఎర్రపడేవి. నెత్తురు కారుతున్నట్టు ఏడుస్తూ పెద్దవాళ్ళని భయపెట్టే వాళ్ళం. బెండకాయలు, దొండకాయలు దొడ్లోనే కాసేవి. దొండపాదు మొండిది అనేవాళ్ళు. ఒకసారి వేస్తే చచ్చినా చావదట. ఇందులో యెంత  నిజం వుందో తెలవదు. ఆ పెరడు మధ్యలో రాణీ గారి మాదిరిగా కరివేపాకు చెట్టు వుండేది. నిజంగా చెట్టే. చాలా పెద్దగా, ఎత్తుగా  వుండేది. ఊరి మొత్తానికి అదొక్కటే కరివేపాకు చెట్టు కావడం వల్లనేమో ఊరందరి దృష్టి దానిమీదనే. మా బామ్మగారిది నలుగురికీ పంచి పెట్టే ఉదార స్వభావమే కాని, మడి పట్టింపు జాస్తి. మైల గుడ్డలతో కరివేపాకు చెట్టును ముట్టుకోనిచ్చేది కాదు. దాంతో ఎవరూ చూడకుండా ఎవరెవరో దొంగతనంగా కరివేపాకు రెబ్బలు తెంపుకు పోయేవాళ్ళు.  

బావి పక్కనే కంచెను ఆనుకుని విశాలమైన ఖాళీ స్థలం వుండేది. వెనుక వైపు దక్షిణం కొసన బండ్లు వెళ్ళడానికి రాళ్ళు పరచిన ఏటవాలు దారి వుండేది. అక్కడే జుట్టు విరబోసుకున్న రాక్షసి లాగా పెద్ద చింత చెట్టు. పగలల్లా ఆ చెట్టు కిందనే ఆడుకునే వాళ్ళం కాని పొద్దుగూకేసరికి చిన్న పిల్లలం ఎవరం ఆ ఛాయలకు పోయేవాళ్ళం కాదు. చింత చెట్టుకు ఓ పక్కన ఎరువుల గుంత వుండేది. గొడ్ల సావిట్లో పోగుచేసుకు వచ్చిన చెత్తనూ, పేడను అందులో వేసేవాళ్ళు. సాలు చివర్లో వాటిని జల్లబండ్లకు ఎత్తి పంట పొలాలకు ఎరువుగా వేసేవాళ్ళు. కనీసం యాభయ్, అరవై  బండ్ల ఎరువు పోగు పడేది.

(పెంకుటిల్లు కావడం, పాతపడి, తరచుగా రిపేర్లు చేయాల్సిరావడం, అంత పెద్ద ఇంట్లో మా మూడో వదిన గారు అరుణ వదిన  ఒంటరిగా ఉండాల్సిరావడం ఇత్యాది కారణాలతో పిల్లలు రఘు, రమేష్, సాయి పూనుకుని పాతఇల్లు పడగొట్టి పొందికగా, ఆధునికంగా వుండే ఒక డాబా ఇంటిని ఈ మధ్యనే కట్టించారు. తాతల కాలంలో కట్టిన ఇల్లు ఇప్పుడు మా జ్ఞాపకాలకే పరిమితం)

(కింది ఫోటోలు: తాతలు కట్టించిన పాత పెంకుటిల్లు, ఆ ఇంటి ముందు మా రెండో వదిన గారు విమలాదేవి, మా ఆవిడ నిర్మలాదేవి,  పిల్లలు కట్టించిన కొత్త డాబా ఇల్లు)






(ఇంకా వుంది)

13, నవంబర్ 2024, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి (3 ) - భండారు శ్రీనివాసరావు

 నిన్నటి నా పోస్టుపై స్పందిస్తూ మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు, ఎనభయ్,  తొంభయ్ ఏళ్ళ చరిత్ర కలిగిన మా ఇంటిలో దాదాపు నూరు పురుళ్లు జరిగాయని, ఆ ఇంటితో, ఆ వూరితో, ఆ గాలితో మరచిపోలేని బంధం వున్నదని రాసారు.  ఒక్క ఇంట్లో ఇన్నిన్ని పురుళ్లు ఏమిటని కొందరు ఫోన్లు చేసి అడిగారు.  

ఆ ఇంటి పందిరి గుంజను ముట్టుకుంటే చాలు పిల్లలు పుడతారు అని మా ఇంటిని గురించి చెప్పుకునే వాళ్ళు.  ఈ ఇంట్లో ఎన్ని పురుళ్లు అయ్యాయో లెక్కలేదు. మా అమ్మా, మా పెద్దక్కయ్య రాధ ఇద్దరూ ఒకేసారి కడుపుతో ఉన్నారు. కొద్ది రోజుల తేడాతో పక్క పక్క గదుల్లో ప్రసవించారు. మా అమ్మ కడుపున మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారు, మా అక్కయ్య కడుపున 108 అంబులెన్స్ పధకం సృష్టికర్త డాక్టర్ ఏపీ  రంగారావు గారు జన్మించారు. అమ్ముమ్మ గారి ఊరిలో తన పుట్టుక గురించి, తన చిన్నతనం రోజుల గురించి ఆయన ఇలా రాసుకున్నారు.

నేను మా తలిదండ్రులకు రెండో సంతానాన్ని. నేను అమ్ముమ్మ గారి ఇంటిలో  పుట్టినప్పుడు నా బొడ్డు కోసిన మంత్రసాని పుట్టుగుడ్డిది. విచిత్రమేమిటంటే మా అమ్మ పుట్టినప్పుడు కూడా ఈ మంత్రసానే పురుడుపోసిందట. మా కుటుంబంలో చాలామంది  ఈ మంత్రసాని ఆధ్వర్యంలోనే సుఖంగా ప్రసవించి క్షేమంగా వున్నారు.  ఆమె పురుడు పోసిన పిల్లలెవ్వరూ  ప్రసవ సమయంలో చనిపోలేదు. అది ఆవిడ  చేతిచలవ అని చెప్పుకునేవారు. ఆ రోజుల్లో ప్రసవాలన్నీ ఇళ్ళల్లోనే జరిగిపోయేవి. మొట్టమొదటిసారి ఆసుపత్రిలో పురుడు పోసుకున్నది మా అమ్ముమ్మ గారు, అదీ మా మా పెద్ద మేనమామ (పర్వతాలరావు) పుట్టినప్పుడు. అయిదుగురు ఆడపిల్లల తరవాత కానుపు  కావడంతో మా అమ్ముమ్మను అప్పుడు ఖమ్మంలోని క్రిస్టియన్ మిషన్ ఆసుపత్రిలో చేర్పించి పురుడు పోయించారు.

“నేను పుట్టిన తరవాత నాకు కానీ, మా అమ్మకు కానీ ప్రసవానంతర జాగ్రత్తలు ఏమీ తీసుకోలేదు. మా ఇద్దరికీ ధనుర్వాతం (టెటనస్) రాకుండా ఏ విధమయిన ఇంజెక్షన్లు ఇవ్వలేదు. అలాటివి వున్నట్టు ఆ రోజుల్లో ఎవరికీ తెలిసివుండదు.  పురుడు  రావడానికి కొన్ని నెలలముందు  మా అమ్మ పుట్టింటికి వెళ్ళింది.  కేవలం పుట్టింటివారి ఆప్యాయతా, పూర్తి విశ్రాంతి మినహా ఆమె తీసుకున్న  మందులు ఏమీ లేవు.  నేను పుట్టగానే మంత్రసాని కొడవలితో  బొడ్డు కోసి నన్ను ఒక తట్టలో పడుకోబెట్టింది. కోసిన బొడ్డు ముక్కను గోతిలో పాతిపెట్టారు. నాకు స్నానం చేయించి తల్లి పాలు పట్టించారు. మైల బట్టలు మంత్రసాని పట్టుకెళ్ళింది. అవి ఆమెకే చెందుతాయి. పురుడు పోసినందుకుగాను కొంత ధాన్యం కొలిచి ఇచ్చేవాళ్ళు.  

“ప్రసవం అయిన తరవాత ఆ గదిలోకి పన్నెండు రోజులపాటు ఎవ్వరూ రావడానికి వీలులేదు. ఎవరూ తాకడానికి వీలులేదు. పుట్టిన తిధి నక్షత్రాలనుబట్టి జాతకం రాయించారు. ‘రాధమ్మ సుఖంగా ప్రసవించింది. తల్లీ పిల్లవాడు కులాసా’ అని చుట్టపక్కాలందరికీ ఇంటి పురోహితుడితో కబురు పంపించారు.

“మూడోరోజున బాలింతరాలయిన మా అమ్మకు వావిలాకులు కలిపిన  వేడినీటితో స్నానం చేయించారు. మరో తొమ్మిది రోజులు ఇలాగే గడిచిన తరవాత, పన్నెండో రోజున   ఆమెకు పురిటి స్నానం చేయించారు. పసుపు, పెసరపిండి, శనగపిండి కలిపి వొంటికి నలుగుపెట్టి చేయించే స్నానం ఇది.  ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి పుణ్యావచనం, పూజ అయిన తరవాత, బియ్యం, బెల్లంతో తయారుచేసిన పులగం మా అమ్మకు తినడానికి పెట్టారు. అప్పటినుంచి పురిటి మైల వొదిలిపోయినట్టే. ఇల్లంతా స్వేచ్చగా అందరితో కలసి తిరగొచ్చు. పసిపిల్లాడినయిన నాకు కూడా ప్రతి రోజూ  పెద్దవాళ్లో, పనిమనుషులో కాళ్ళమీద పడుకోబెట్టుకుని స్నానం చేయించేవారు. ఒక గుడ్డ పరచి  నిద్రపుచ్చేవారు. దాన్ని పాడుచేసినా ఆ గుడ్డనే, ఉతికి ఆరవేసి మళ్ళీ  వాడేవారు. పన్నెండో రోజున  నామకరణం చేసి ఉయ్యాలలో వేసారు. నాకు తొమ్మిది నెలల వయస్సు రాగానే  ఒక మంచి రోజు చూసి యిరవై కిలోమీటర్ల దూరంలో వున్న తిరుమలగిరి గుట్టమీది వెంకటేశ్వర స్వామి గుడిలో  అన్నప్రాసన చేసారు. బెల్లం కలిపి వొండిన అన్నం పాయసం.  ( అంటే అది నేను తిన్న మొట్టమొదటి ఘన పదార్ధం అన్నమాట.) అలాగే నా మొట్టమొదటి  కేశఖండన (తల వెంట్రుకలు) కూడా ఏడాది నిండినప్పుడు జరిగింది. చిన్నతనంలో మా పినతల్లులు (మా అమ్మ చెల్లెళ్ళు ) ముగ్గురు నా ఆలనా పాలనా చూసేవారు. అప్పటికి వారికింకా పెళ్ళిళ్ళు కాలేదు. దూలానికి వేలాడదీసిన గుడ్డ ఉయ్యాలలో నన్ను పడుకోబెట్టి నిద్రపుచ్చేవారు. మా తరంలో నేనే తొలిచూరు పిల్లవాడినని చాలా గారాబంగా చూసేవారు. యిరవై నాలుగ్గంటలూ ఎవరో ఒకరు కంటికి రెప్పలా కనిపెట్టుకుని వుండేవారు.

బోర్లపడితే బూరెలు వండాలి, పారాడితే పాలకాయలు పంచాలి అని ఏదో  పేరుతొ ప్రతినెలా నేను పుట్టిన తరువాత పండగలు, పేరంటాలు  చేసేవారు. మా అమ్మ నన్ను ప్రసవించిన తొమ్మిదో రోజున మా అమ్ముమ్మగారు, మా అమ్మ అమ్మగారు వెంకట్రావమ్మగారు  కూడా అదే ఇంట్లో మరో గదిలో మగపిల్లవాడిని (భండారు రామచంద్రరావు) కన్నది. నాకు బొడ్డుకోసిన మంత్రసానే మా అమ్ముమ్మకు కూడా పురుడు పోసింది. ఒకే ఇంట్లో రోజుల తేడాతో పుట్టిన మేమిద్దరం ఆడుతూ పాడుతూ  పెరిగాం. 

“చిన్నప్పటి ఓ జ్ఞాపకం నా మనసు తెరపై ముద్రపడిపోయింది.

1948 నాటి మాట.  మా అమ్మ తండ్రి రాఘవయ్య గారిని  కంభంపాడు తాతయ్య అనే వాళ్ళం. ఎవరూ లేవకముందే తెల్లారగట్టనే లేచి కాఫీ తయారుచేసుకుని తాగడం ఆయన అలవాటు.  బెజవాడనుంచి పచ్చి కాఫీ గింజలు కొనుక్కొని వచ్చి వాటినివేయించి కాఫీ చేసుకుని తాగేవాడు. కాఫీ గింజలను పొడి చేసే ఒక చిన్న మిషను ఒకటి అయన పట్నం (మద్రాసు) పోయినప్పుడు కొనుక్కువచ్చాడు. నన్ను నిద్రలేపి, వొళ్ళో వేసుకుని పొయ్యి రాజేసేవాడు. నీళ్ళు పడేసి అవి కాగుతుండగానే, బొడ్లోనుంచి బీడీ కట్ట తీసి ఒకటి వెలిగించేవాడు.

“వేయించిన గింజల కమ్మటి వాసన, కాఫీ పొడి మిషన్ చేసే అదో రకం చప్పుడు, సుళ్ళు తిరిగే బీడీపొగ, ఎదురుగా పొయ్యిలో కణకణమని కట్టెల మంటలు, ఇవన్నీకళ్ళకు కట్టినట్టు గుర్తుండిపోయాయి.

“ఇన్నేళ్ళ తరవాత ఇప్పటికీ ఇలాటి చిన్న చిన్న సంగతులు కొన్ని బాగా జ్ఞాపకం వున్నాయి.             

“అలాటిదే మరో జ్ఞాపకం, గుడ్డ ఉయ్యాలలు గురించి. ఈ కాలం వారికి ఏమాత్రం తెలియని ఉయ్యాలలు ఇవి. ఒక పాతచీరెను  

దూలానికి వేలాడగట్టి ఉయ్యాల మాదిరిగా తయారుచేసేవారు. అందులో పిల్లలని పడుకోబెట్టి ఎవరో ఒకరు ఊపుతూ నిద్రపుచ్చేవారు. బయటనుంచి చూసేవారికి లోపల పిల్లాడికి గాలి ఆడుతుందా అని అనుమానం కలిగించేలా వుండేవి ఈ గుడ్డ ఉయ్యాలలు.

 “మరో చేదు జ్ఞాపకం నెలనెలా పిల్లలకు వంటాముదం పట్టించడం. పిల్లల్ని కాళ్ల మీదవేసుకుని, బలవంతంగా నోరు తెరిచి ఉగ్గిన్నెతో ఆముదం తాగించేవాళ్ళు. ఇలా చేస్తే మలబద్దకం రాదని నమ్మకం”

ఇవీ నా మేనల్లుడు ( పేరుకు మేనమామను అయినా  వయసులో ఆయనే పెద్ద)  డాక్టర్ రంగారావు తన ముద్రిత గ్రంథంలో రాసుకున్న జ్ఞాపకాలు.  

అమ్ముమ్మ గారి ఇంట్లో పుట్టడం, అమ్ముమ్మ గారి ఊర్లో పెరగడం అనేవి కొత్తేమీ కాదు.  పెళ్ళయిన తర్వాత మా పెద్ద అక్కయ్యలు ఇద్దరూ చాలా కాలం పుట్టింట్లో వుండి పోవడానికి ఒక బలమైన, ఉత్కృష్టమైన కారణం వుంది. భారత స్వాతంత్ర ఉద్యమం బలంగా సాగుతున్న రోజులు. దేశ దాస్య విమోచనం కోసం  సత్యాగ్రహాలు చేస్తున్న మా బావగార్లు అయితరాజు రాం రావు, కొలిపాక రామచంద్ర రావు గార్లను నాటి బ్రిటిష్ ప్రభుత్వం పద్నాలుగు నెలలు జైల్లో పెట్టింది. అప్పటికే గర్భిణి అయిన మా పెద్దక్క రాధను, రెండో అక్క శారదను మా నాన్న తన దగ్గర ఉంచుకోవడానికి మా ఊరు తీసుకు వచ్చారు. అప్పటి సంగతులు శారదక్కయ్య చెప్పేది. ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే:

“పట్టుమని పన్నెండేళ్ళు అయినా నిండకుండానే నా పెళ్లి అయింది. మా పెద్దమ్మాయి శాంత పుట్టిన ఏడాదికే మా వారు (కొలిపాక రామచంద్రరావు గారు) జైలుకు వెళ్ళారు. మా పెద్ద బావ అయితరాజు రాం రావు గారు మావారితో పాటే జైలుకు వెళ్ళడంతో, నన్నూ మా పెద్దక్క రాధనూ మా నాన్న మా వూరు కంభంపాడు తీసుకు వెళ్ళారు. మా బావగారు, మా వారు జైల్లో వున్న పద్నాలుగు నెలలు మేమిద్దరం మా పుట్టింట్లోనే ఉండిపోయాము. ఆ రోజుల్లో ఇలా గ్యాసు పొయ్యిలు లేవుకదా! మా అమ్మ శనగకట్టె మంట పెట్టి మా అందరికీ వండి పెట్టేది.

“మానాన్న ఊళ్ళోని దుకాణదారుతో చెప్పాడు  ‘మా పిల్లలు ఏదీ లేక ఇక్కడికి రాలేదు. అల్లుళ్ళు దేశం కోసం జైలుకు వెళ్ళారు. వాళ్లకి అవసరమైనవి ఏవి అడిగినా కాదనకుండా ఇవ్వు”

“మా అమ్మకు పుట్టింటి వాళ్ళు ఒక గేదెను అరణంగా ఇచ్చారట. దాన్ని గురించిన కబుర్లు గమ్మత్తుగా చెప్పేది. తాను కోడలిగా ఏనాడు గడప దాటి వెళ్లకపోయినా, తన పేరు మాత్రం ఆ గేదె పుణ్యమా అని నలుగురికీ తెలిసిందట. అది వూళ్ళో అందరిండ్లలో జొరబడి నానా బీభత్సం చేసేదట. ‘వెంకట్రావమ్మ గారి గేదె ఇలా చేసింది, అలా చేసింది’అని వూళ్ళో జనం చెప్పుకునే వారట.

“ఆ రోజుల్లో ఏ కబుర్లు వెంటనే తెలిసేవి కాదు. మా వాళ్ళు జైలు నుంచి విడుదల అయినట్టు ముందు ఎవరు కబురు తెస్తే వాళ్ళ కాళ్ళకు దణ్ణం పెట్టుకోవాలని నేనూ మా పెద్దక్కా అనుకునేవాళ్ళం.

చివరికి శంభాయి ఆ శుభవార్త మోసుకువచ్చాడు.

“మేమిద్దరం ముందు అనుకున్నట్టే, మా ఇంట్లో పనివాడు అయిన శంభాయికి పాదాభివందనం చేశాము”

పెద్ద చదువులు లేకపోయినా చిన్నప్పటి సంగతులను అంత గుర్తుకు తెచ్చుకున్న మా శారదక్కయ్యకు అన్ని డిగ్రీలు వున్నట్టే లెక్క.

నిన్ననే ఆమె జయంతి.

ఆమె గురించిన జ్ఞాపకమే మరోటి.

డెబ్బయ్ ఏళ్ళ కిందటి మాటే.

స్టెయిన్ లెస్ స్టీల్ కంచాలు, గ్లాసులు అప్పుడప్పుడే మార్కెట్లోకి వస్తున్న రోజులు అనుకుంటాను. మా ఇంట్లో అప్పటికి అవి గృహ ప్రవేశం చేయలేదు. పెద్దవాళ్లకు వెండి పళ్ళేలు, చిన్న వాళ్లకు  రాతెండి కంచాలు, ఇత్తడి గ్లాసులు. మా రెండో అక్కయ్య శారదక్కయ్య ఓసారి పండక్కి వస్తూ రెండు స్టీలు భోజనం పళ్ళేలు తెచ్చి నాకు ఒకటీ, మూడో అన్నయ్య వెంకటేశ్వరరావుకూ ఒకటీ ఇచ్చింది. అప్పట్లో వాటి ఖరీదు రెండూ కలిపి పదిహేను రూపాయలు. అంటే కరణీకం చేస్తున్నప్పుడు మా నాన్నగారి మూడు నెలల జీతం అన్నమాట. ఇహ అప్పుడు చూడాలి మా మోహంలో సంతోషం. ఏనుగు ఎలా వుంటుందో తెలవదు కానీ అదెక్కినంత ఆనందం.

మా అక్కయ్య ఇచ్చిన ఆ కంచం మీద నాకు మోహం ఎంతగా పెరిగిపోయిందంటే అది నాకే సొంతం అనుకునేవాడిని. ఆ తర్వాత ముప్పయ్ ఏళ్ళకు పైగా అది నాతోనే వుంది. 1987లో మాస్కో వెళ్ళేటప్పుడు ఆ కంచంతో నా రుణానుబంధం తెగిపోయింది.

తిరిగొచ్చిన తర్వాత లోకమే మారిపోయింది. డిన్నర్ ప్లేట్లు, డిన్నర్ సెట్లు వచ్చిపడిన తర్వాత, చాలా కొద్ది మంది ఇళ్ళల్లో తప్ప, ఇప్పుడు ఈ విడికంచాల గోల లేదు.

కింది ఫోటోలు:

మా ఊరి ఇంట్లోని పక్క పక్క గదుల్లో రోజుల తేడాతో జన్మించిన డాక్టర్ ఏపీ రంగారావు (108, 104 పధకాల రూపశిల్పి, మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు ( స్టేట్ బ్యాంక్ రిటైర్డ్  చీఫ్ జనరల్ మేనేజర్)

(డాక్టర్ రంగారావు)
(రామచంద్రరావు)




ఇంకా వుంది

12, నవంబర్ 2024, మంగళవారం

పిడకల వేట – భండారు శ్రీనివాసరావు

 నా మానాన నేను పాత పాటలు వింటూ, పాత సినిమాలు చూస్తూ ఏదో ఉబుసుపోక రాతలు రాసుకుంటూ వుంటే ఫోన్ మోగుతుంది. హెచ్ పీ గ్యాసా అంటుంది అవతల గొంతు. మొదట్లో తెలియక అమాయకంగా అవునండీ మాది హెచ్ పీ గ్యాసే అంటాను. మా సిలిండర్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది ఆ గొంతు. గొంతులో పచ్చి వెలక్కాయ పడి, అప్పుడు వెలుగుతుంది లైటు. అబ్బే ఇది గ్యాస్ ఏజెన్సీ కాదండీ పర్సనల్ నెంబరు అని పెట్టేస్తే, మళ్ళీ ఫోన్ మోగుతుంది. మళ్ళీ అదే గొంతు. అలా పెట్టేస్తారేమిటి, గూగుల్ సెర్చ్ లో ఇదే నెంబరు వుంది. కాదంటారేమిటి అని డుబాయిస్తుంది. ఇలా  రోజుకు ఒకసారి కాదు, అనేకసార్లు. ఆరు నెలల నుంచి ఇదే తంతు. గొంతు మాత్రం మారుతుంటుంది. ఒక్కోసారి చికాకు వచ్చి ఫోన్ చేసిన వాళ్ళ మీద చీకాకు పడతాను. తర్వాత జాలి కూడా పడతాను. గ్యాస్ కోసం వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. రాంగ్ నెంబర్ కావచ్చు. అవసరంలో వుండి ఫోన్ చేస్తున్నారు.  పోనీలే అనుకుంటే పోనుకదా! నాకొచ్చిన ఇబ్బంది ఏముంది. రాంగ్ నెంబర్ అని మర్యాదగా చెబితే వచ్చిన నష్టం ఏముంది. ఇలా కాసేపు పశ్చాత్తాపపర్వం  నడుస్తుంది.  ఇంతలోనే మరో ఫోన్. హెచ్ పీ గ్యాసా! నాలోని బుద్దుడు మాయమైపోతాడు. మళ్ళీ సీను రిపీట్.

ఈరోజు మళ్ళీ అలా ఇప్పటికి మూడో ఫోను. ఇక వేరే దారి లేక కౌన్సెలింగ్ మొదలు పెట్టాను.

‘చూడండి. నేను మీలాగే హెచ్ పీ గ్యాస్ కన్స్యూమర్ ని. ఏజెన్సీ నడపడం లేదు. ఈ మధ్య గ్యాస్ బుకింగ్ విధానం సులభతరం చేశారు. 96660 23456 నెంబరుకు ఫోన్ చేయండి. ఒకటి నొక్కితే...’

నా మాట పూర్తికాకమునుపే అవతల గొంతు నా గొంతుకు అడ్డం పడింది.

‘ఇవన్నీ మాకూ తెలుసు. ఇలా చేయాలి అంటే ముందు మా ఫోన్, కన్స్యూమర్ నెంబరు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ కనెక్షన్ మా పేరుతొ లేదు. గూగుల్ సెర్చ్ లో నెంబరు చూసి చేసేది ఇందుకే

నాకు కళ్ళు తెరిపిళ్ళు పడాలి. కానీ పిడికిళ్ళు బిగుసుకున్నాయి ఆ జవాబుతో. కోపంతో కట్ చేశాను.

నాలోని తథాగతుడు మేలుకుని హితవు చెప్పడంతో మళ్ళీ కంప్యూటర్ లో తల దూర్చాను.

ఈసారి ఎక్కువ వ్యవధానం లేకుండానే ఫోన్ మోగింది. ‘హెచ్ పీ గ్యాసా!’

నేనూ ఈ సారి రూటు మార్చి నిదానంగా చెప్పాను. కాదండీ అన్నాను వినయంగా. ఒక విషయం చెప్పండి అని అడిగాను మరింత వినమ్రంగా. ఈ నెంబరు గూగుల్ సెర్చ్ లో దొరికింది అంటున్నారు. ఏమీ అనుకోకపోతే ఆ స్క్రీన్ షాట్ నా ఈ నెంబరుకు పంపిస్తారా శ్రమ అనుకోకుండా

ఇంత మన్ననగా కోరేసరికి అతడు సరే అన్నాడు. సరేతో సరిపుచ్చకుండా పంపాడు.

అది చూసి ఆశ్చర్యపోవడం నా వంతయింది. ఒక్క అంకె తేడా లేకుండా అది,  పాతికేళ్ళుగా నా పేరు మీద బిల్లులు కడుతూ నేను  వాడుతున్న  నా నెంబరే!

ఏమిసేతురా లింగా!

12-11-2024  

కింద అతడు పంపిన స్క్రీన్ షాట్   


    

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి ( 2) - భండారు శ్రీనివాసరావు

 

“ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండది తప్పుగా దలచెనో విచ్చేయునో ఈశ్వరుం
డనుకూలింప దలంచునో దలచడో ఆర్యా మహాదేవియున్
నను బాలింప నెరుంగునో నెరుగదో నా భాగ్యమెట్లున్నదో”

 

రుక్మిణీ కళ్యాణంలో  పద్యం శ్రావ్యంగా వినబడుతోంది. పాడుతున్న అమ్మాయికి పన్నెండేళ్ళు వుంటాయేమో. వింటున్న వాళ్లు మాత్రం ఆరు పదులు దాటిన  వాళ్ళే. పుస్తకం అవసరం లేకుండా కంఠతా వచ్చిన పద్యాన్ని రుక్మిణీదేవే స్వయంగా ఆవహించి పాడుతున్నదా అన్నట్టుగా ఆలపిస్తున్నది మా అయిదో అక్కయ్య అన్నపూర్ణక్కయ్య. మధ్యలో మంచంలో దిండుకు ఆనుకుని కూర్చుని  చేతిలో తావళంతో మా బామ్మ రుక్మిణమ్మ, కొంత దూరంలో మరో మంచంలో మా  బామ్మ అమ్మ చెల్లాయమ్మ అమ్ముమ్మ. ముక్కాలిపీట పై కాలు మీద కాలువేసుకుని తన్మయంగా వింటున్న మరోశ్రోత మా లలితమ్ముమ్మ. వొంటింట్లో పనిచేసుకుంటూనే ఓ చెవి ఇటు వేసి వింటున్నది మా అమ్మ వెంకట్రావమ్మ.  ఈ దృశ్యం ఆ ఇంట్లో పరిపాటే.

ఎప్పుడో ఎనభయ్ ఏళ్ళ క్రితం కట్టిన ఆ పెంకుటిల్లే నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇల్లు. చిన్నప్పటి ఈ సంగతులు గురించి మా అక్కయ్యలు, అన్నయ్యలు  చెప్పగా వినీవినీ  అవన్నీ నా మనసులో ముద్రపడి పోయాయి. అరవై డెబ్బై  ఏళ్ళ కిందటి ముచ్చట్లు, ఏళ్ళు గడిచినా మనసులో అలా పచ్చగా వుండిపోయాయి.

నేను ఖమ్మం ఎస్ ఆర్ అండ్ బీ జీ ఎన్ ఆర్ కాలేజీలో పీయూసీ చదివాను. అప్పుడు ఆ జిల్లాకు పౌరసంబంధాల అధికారిగా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారింట్లో ఉండేవాడిని. జిల్లా పౌర గ్రంథాలయం నుంచి పుస్తకాలు తెచ్చేవాడు. ఒక రోజు ఏనుగుల వీరాస్వామి గారు రాసిన కాశీ యాత్ర పుస్తకం తెచ్చి ఇచ్చారు. అది చదువుతుంటే ఎప్పుడో దశాబ్దాల కిందటి ఊళ్లు, ప్రదేశాలు, మనుషులు, వారి నడవడికలు, ఆయా ప్రాంతాలలోని సాంప్రదాయాలు, ఆహార విహారాలు అన్నీ  కళ్ళకు కట్టినట్టు ఉండేవి.   ఏదైనా రాస్తే, అలా రాయాలి అనేది మా అన్నగారి కవి హృదయం. పైకి చెప్పకపోయినా ఆ విషయం నా మనసులో నాటుకు పోయింది.

మాది కృష్ణా జిల్లా, (ఇప్పుడు ఈ జిల్లాకు ఇంటి పేరు వచ్చింది, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా) నందిగామ తాలూకా, కంభంపాడు గ్రామం.   ఇప్పుడు ఇది కూడా మారి వత్సవాయి మండలం కిందికి వచ్చింది.  అప్పట్లో చాలా వెనకపడ్డ ప్రాంతం. అయినా అన్నీ ఉండేవి. స్వావలంబన లాంటి మాటలు, వాటి అర్ధాలు అప్పట్లో తెలవ్వు. కానీ అన్నీ అమర్చినట్టు ఉండేవి ఆ కొసగొట్టు పల్లెటూళ్ళో.

మా ఇంటికి దగ్గరలో అంటే నడిచిపోయే దూరంలో చెరువుగట్టు కింద మా మాగాణి పొలాల పక్కన ఓ మెరక మీద మంచి నీళ్ళ బావి. పైగా గిలకల బావి. నాలుగు వైపులా ఇనుప  గిలకలు ఉండేవి. ఊరి మొత్తానికి అదొక్కటే మంచి నీటి వనరు. మా ఇంట్లో బావిలో నీళ్ళు ఉప్పు  కషాయం. స్నానాలకుఇతర అవసరాలకు ఆ నూతి నీళ్ళే వాడేవాళ్ళం. మా అమ్మగారు వెంకట్రావమ్మమా చిన్న మేనత్త చిదంబరం తడి మడి చీరెలతో వెళ్లి మంచినీటి బావి నుంచి బిందెలలో నీళ్ళు తెచ్చేవాళ్ళు.

అప్పుడప్పుడూ వాళ్ళతో నేనూ వెళ్ళేవాడిని. దోవలో వీరబ్రహ్మం ఇల్లు. ఆయన ఉలీబాడిసె పట్టుకుని ఎడ్లు లాగే బండ్లు తయారు చేసేవాడు. నేను అక్కడే ఒక మొద్దు మీద కూర్చుని చూస్తూ వుండేవాడిని. బండి చక్రాలువాటికి ఆకులు అలా కొలతలకు తగ్గట్టుగా ఎలా చెక్కేవాడో ఆశ్చర్యం అనిపించేది. ఆయన ఏమీ చదువుకున్నవాడు కాదు. కానీ బండి ఇరుసు ఏ కొలతలతో చెక్కితే బండి బ్యాలెన్సుగా నడుస్తుందో ఆ విధంగా తయారుచేసేవాడు.

ఆ పక్క వీధిలో కమ్మరి కొలిమి. ఆయనకూ చదువు రాదు. కానీ ఇనుమును కొలిమిలో ఎర్రగా కాల్చి రకరకాల సామాగ్రి తయారు చేసేవాడు.

ఒక వీధిలో వస్త్రాల హనుమంతరావు అని నా దోస్తు ఇల్లు వుండేది. ఆడామగా బట్టలు నేసేవాళ్ళు. ఇంటి బయట చేతికి రంగులు పూసుకుని దారాలకు రంగులు అద్దేవాళ్ళు. ఇంట్లో మగ్గం మీద చీరెలు ధోవతులు నేసేవాళ్ళు.

చిన్నిరాములు కొట్లో మిఠాయి ఉండలులౌజు ముక్కలు కూడా అమ్మేవాళ్లు. ఇళ్ళల్లో లాంతర్లుచిమ్నీ(బుడ్డి) దీపాలకు వాడే కిరసనాయిలు అక్కడే కొనేవాళ్ళం. కిరోసిన్ డబ్బా పైన ఒక మూలలో వున్న రంధ్రంలో, గొట్టం లాంటి సాధనం వుంచి  పైకీ కిందికీ ఒక తీగతో లాగుతూ వుంటే డబ్బాలో కిరోసిన్ సీసాల్లో పడేది.

ఆ పక్కనే కుండలు చేసేవారు. కుండలు చేసే విధానం చూస్తుంటే కళ్ళు తిరిగిపోయేవి. ఒక చక్రం మీద మట్టి ముద్ద వుంచి ఆ చక్రాన్ని వేగంగా ఒకసారి తిప్పేవాళ్ళు. తడి చేతి వేళ్ళతో ఆ మట్టి ముద్దను సుతారంగా తాకుతూ,  చిత్రవిచిత్రంగా కుండలు తయారు చేసేవాళ్ళు. ఆ ముద్ద నుంచి కుండల ఆకారాలు వస్తుంటే ఏదో మాయాజాలంగా అనిపించేది.

సత్యమూర్తి అని నా చిన్ననాటి నేస్తం. ఆయన అన్నయ్య నాగలింగాచారి  బంగారు నగలు చేసేవాడు. బడికి వెళ్ళే దోవలోనే  వాళ్ళ ఇల్లు. బుగ్గలు బూరెలు అయ్యేలా గొట్టంతో ఊదుతూ ఎర్రటి కొలిమిలో బంగారం కరిగించి వస్తువులు తయారు చేసేవాడు.

సాయంత్రం అయ్యేసరికి మా ఇంటికి దగ్గరలో ఉన్న వాడనుంచి బ్యాండు మేళం వినపడేది. ఆ తర్వాత తెలిసింది వాళ్లకు గిరాకీ లేని రోజుల్లో అలా తీరి కూర్చుని సినిమా పాటలు ప్రాక్టీసు చేస్తుంటారని. అలాగే సన్నాయి మేళం వాయించేవాళ్లు. మా ఇంటికి చుట్టపక్కాలు ఎవరైనా వస్తే వాళ్ళు పెట్రోమాక్స్ లైట్ తెచ్చి పెట్టేవాళ్ళు. ఆ లైటు వెలిగిస్తుంటే పిల్లలం అందరం కళ్ళప్పగించి చూస్తుండే వాళ్ళం. పొడుగాటి వత్తి తగలబడిపోకుండా చిన్న ఆకారంలోకి మారిపోయి తెల్లటి వెలుగులు విరజిమ్మడం నిజంగా ఆశ్చర్యంగా వుండేది. ఆ వత్తి ఎర్రపడి కాంతి తగ్గినప్పుడల్లా గాలి కొట్ట్టేవారు.

మా ఊరు పంచాంగాలకు ప్రసిద్ధి. వాటిని రాసే సిద్ధాంతులు ముగ్గురు వుండేవాళ్ళు. ఒకే ఊరు నుంచి మూడు పంచాంగాలు రావడం గొప్పగా చెప్పుకునే వారు. గొలుసుకట్టు రాతలోతెలుగు అంకెలతో రాసిన పంచాంగాలను ఆ సిద్ధాంతులు తెనాలి తీసుకువెళ్లి అక్కడ అచ్చు వత్తించేవారు. ఉగాది రావడానికి ముందుగానే చుట్టుపక్కల గ్రామాలకు కాలినడకన వెళ్లి అక్కడి మోతుబరులకు పంచాంగాలు ఇచ్చి ఆశీర్వదించేవాళ్లు. సంభావన రూపంలో వచ్చిన ప్రతిఫలం ఎంత ఇస్తే అంత తీసుకుని తిరిగివచ్చేవారు.

మంచి నీళ్ళ బావికి వెళ్ళే దోవలో ముస్లింల కోసం పీర్ల సావిడి వుండేది. పీర్లను ఊళ్ళో ఊరేగించిన తర్వాత మళ్ళీ ఈ సావిడిలో భద్రపరిచేవాళ్ళు.

షెడ్యూల్ కులాలకోసం ఉసిగెవాగు అవతల ఒక కాలనీ వుండేది. అక్కడ ఒక మిషనరీ స్కూలు వుండేది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన  జంధ్యాల హరి నారాయణ  కృష్ణాజిల్లా కలెక్టరుగా వున్నప్పుడు మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు అక్కడ కొత్త కాలనీ నిర్మాణం కోసం సుమారు ఇరవై ఎకరాలు భూమి ఇచ్చారు. చక్కటి విశాలమైన కాలనీ ఏర్పడింది. జిల్లా మొత్తంలో అదే పెద్ద కాలనీ అని చెప్పుకునేవారు.

ఊళ్ళో మరో బడి వుండేది. అందులోనే మా చదువు. స్కూలు మొత్తానికి కలిపి ఇద్దరే టీచర్లుఅప్పయ్య మాస్టారుభద్రయ్య పంతులు గారు. బ్లాకు బోర్డులు లేవు. చుట్టూ ఫ్రేం ఉన్న బొందు పలకసుద్ద బలపంఅవి పెట్టుకునే గుడ్డ సంచీ వుంటే వాడు అందరి దృష్టిలో స్పెషల్.

అప్పయ్య మాస్టారి తండ్రి శివరాజు నాగభూషణం గారు తెలవారకముందే లేచి స్నానసంధ్యాదులు ముగించుకుని ఇంటి బయట నిలబడి ఉచ్చైస్వరంతో కృష్ణ శతకంలోని పద్యాలు ఆలపించేవారు.

“హరియను రెండక్షరములు

హరియించును పాతకముల నంబుజనాభా

హరి నీ నామమహత్యము

హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా|

అంటూ కంచుకంఠంతో వూరంతటికీ వినబడేటట్టు ఎలుగెత్తి చదివేవారు.

 ఊరంతటికీ అదే కోడికూత.

పంచాయతీ రేడియోలో  సాయంత్రం అయ్యే సరికి తెలుగు వార్తలు వినేవాళ్ళం. బెజవాడనుంచి అంధ్రపత్రిక దినపత్రిక రెండో రోజు సాయంత్రానికి పోస్టులో మా ఊరికి వచ్చేది. అప్పయ్య మాస్టారు పత్రికలో వచ్చిన వార్తలను బిగ్గరగా చదివి వినిపించేవారు. ఆయనే మా ఊరికి రేడియో న్యూస్ రీడర్. తర్వాత అందరూ అరుగుల మీద కూర్చుని తీరిగ్గా ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు.

మా ఇంటికి వెనుక రెండు దేవాలయాలు ఒకే ప్రాకారంలో ఉండేవి. ఒకటి శివుడి గుడి. వాసిరెడ్డి జమీందారు ఆ ప్రాంతంలో కట్టించిన అనేక శివాలయాల్లో ఇదొకటి. మరొకటి ఆంజనేయుడి గుడి. పక్కనే కోనేరు వుండేది. కాలక్రమంలో అది పూడిపోయింది. ఆ గుళ్ళకు మేమే వంశ పారంపర్య ధర్మకర్తలం. వాటికి మాన్యాల రూపంలో నలభయ్ ఎకరాల దాకా భూమి వుండేదికానీ వాటి మీద వచ్చే అయివేజు స్వల్పం. వూళ్ళో వాళ్ళే పూనుకుని పండుగ దినాల్లో ఉత్సవాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ దేవాలయంలో ధూప దీప నైవేద్యాలు చాలా ఏళ్ళుగా కనిపెట్టి చూస్తున్న పూజారి కుటుంబానికే ఆ భూమిపై సర్వహక్కులు అప్పగించాము. మారిన పరిస్తితుల్లో ఇప్పుడు రాబడి పర్వాలేదు. 

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారి చిన తిరుణాలకుఅది జరిగినన్ని రోజులూ మా వూరినుంచి రంగు కాగితాలతో అలంకరించిన ప్రబ్భండ్లు (ప్రభలు) మేళతాళాలతో ఇంటికొకటి బయలుదేరేవి.

ఆ రోజుల్లో మా ఊర్లో రెండు రకాల సేద్యపు నీటి వనరులు ఉండేవి. ఒకటి చెరువురెండోది మునేటి కాలువ. ఈ రెండూ నేను పుట్టకముందు నుంచి వున్నాయి. నా ఎరుకలో కొత్తగా వచ్చింది సాగర్ ఎడమకాలువ తాలూకు బ్రాంచ్ కెనాల్.

ఇప్పుడు ఇవన్నీ ఏవీ లేవు అని చెప్పను కానీ అప్పటి మాదిరిగా లేవు. కొన్ని అసలే లేవుజ్ఞాపకాలు తప్ప.

వీరబ్రహ్మం లేడుఎడ్ల బళ్ళు తయారుచేసే వాళ్ళు లేరు. ఆ బండ్లు  లేవు. ఎడ్లూ లేవు. ఇంటికి రెండు చొప్పున మోటారు సైకిళ్ళుపదో పాతికో ఏసీ కార్లు. నాటి మగ్గాలు లేవుబట్టలు నేసేవాళ్ళు లేరు. చిన్ని రాములు కొట్టు లేదు. షట్టర్లు కలిగిన దుకాణాలు వచ్చాయి. కుండల తయారీ లేదు. స్టీలు సామానుఫ్రిజ్ లు గృహప్రవేశం చేసాయి.

లాంతర్లు లేవుఅందరి ఇళ్ళల్లో విద్యుత్ దీపాలే. కాలక్షేపానికి బ్యాండ్ మేళాలు లేవుప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీలే.

పంచాయతి రేడియో లేదు. అరుగుల మీద ముచ్చట్లు లేవు. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్. ఎవరి గోల వారిదే!

స్వయంసమృద్ధి కాకపోయినా స్వయంపోషకంగా వుండే మా ఊరు, ఇప్పుడు అన్ని ఊళ్లలో ఒక ఊరు. అంతే!

పాస్ పోర్టులో నేటివ్ ప్లేస్ కాలం పూర్తి చేయడానికి మాత్రం పనికి వస్తోంది.

 

కింది ఫొటో:

పదుల సంఖ్యలో పురుళ్లూ, పుణ్యావచనాలకు నిలయం అయిన ఒకనాటి మా ఇల్లు,



 

(ఇంకా వుంది)