ఈ మధ్య అంటే 2024 ఆగస్టు సెప్టెంబరు నెలల్లో అమెరికా వెళ్ళినప్పుడు మా మూడో అన్నయ్య
కుమారుడు సత్యసాయి ఉంటున్న ఊరికి వెళ్లి వాడింట్లో కొన్ని రోజులు వున్నాను. వాడికి
ఇద్దరు కుమారులు, శైలేష్, శైలేంద్ర. శైలేష్ ఈ ఏడాదే యూనివర్సిటీలో చేరాడు. వాడికి కారు
డ్రైవింగ్ లైసెన్స్ వుంది. సెలవులు కావడం మూలాన వాడే నన్ను అనేక ప్రాంతాలకు
తిప్పేవాడు. వాడు అడిగింది ఒక్కటే. కంభంపాడు సంగతులు ఏమిటి తాతయ్యా? నాకు నాన్న, మీరు,
పెద్ద తాతయ్యలు మినహా ఎవరూ తెలియదు. అసలు మన కుటుంబం గురించి నాకేమీ తెలియదు, చెప్పమని అదే
పనిగా అడిగేవాడు. అది ఒక్క గంటలో, ఒక్క రోజులో చెప్పే విషయాలు కావు. నేను హైదరాబాదు పోయిన తర్వాత నా
బ్లాగులో రాస్తాను, కానీ నువ్వు తెలుగు చదవగలవా? అని అడిగాను. నేను నెట్లో తెలుగు
పేపర్లు చదువుతాను, ఇబ్బంది ఏమీ లేదు అని వాడు జవాబు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం
వేసింది. బహుశా వాడి మాటలే ఈ రచనకు ప్రేరణ
కావచ్చు.
మా చిన తాతగారు
భండారు లక్ష్మీనారాయణ గారు దాచివుంచిన 1878 వ సంవత్సరం నాటి కోర్టు తీర్పు ప్రతిలో
వారి తండ్రి రామయ్య, పినతండ్రి లక్ష్మయ్య గార్ల పేర్లను ‘రామయ్య కులకర్ణి, లక్ష్మయ్య
కులకర్ణి’ అని ఉదహరించారు. భండారు వంశీకులు మహారాష్ట్ర నుంచి వచ్చారా అనే
అనుమానానికి దీనివలన కొంత ఆస్కారం చేకూరుతోంది. ‘కులకర్ణి’ అనేది ఆరోజుల్లో
గ్రామాధికారి పదవి. అయినా, అది మహారాష్ట్ర నుంచి వచ్చిందే. దేశముఖ్, దేశపాండేల
మాదిరిగా గ్రామాల్లో శిస్తు వసూలుచేసి పెట్టే అధికారం వారికి వుండేది. ముఖ్యంగా
తెలంగాణా ప్రాంతంలో చాలా ఊళ్ళల్లో కులకర్ణి వ్యవస్థ దాఖలాలు కనిపిస్తాయి.
మా ముత్తాత గారి
నాన్నగారు అప్పయ్య గారికి చాలాకాలం సంతానం కలగక పోవడంతో శ్రీశైలం వెళ్లి అక్కడ
మల్లిఖార్జున దేవాలయ ప్రాంగణంలో వున్న సంతానవృక్షానికి ప్రదక్షిణాలు చేసి వచ్చారట.
తరువాత ఆయనకు ఒక కుమారుడు కలిగాడు. ఆయనకు శ్రీ పర్వతం (శ్రీ శైలం) పేరిట
పర్వతాలయ్య అని పేరు పెట్టుకున్నారు. ఈయన కంభంపాడు గ్రామ కరిణీకం చేస్తూ వచ్చారు.
ఆయనకూ, గ్రామంలోని కొందరు రైతు పెద్దలకు ఒకసారి కచేరిసావిడిలో
కొంత వాగ్వాదం జరిగిందట. ఆ రోజుల్లో ఊరి పెత్తందారులు బొడ్లో పేష్ కప్ (ఒకరకం
చిన్న చాకు) పెట్టుకుని, తలపాగాలు చుట్టుకుని తిరిగేవారట. వాళ్ళు వచ్చినప్పుడు పర్వతాలయ్యగారు
ఈకకలంతో ఏదో రాసుకుంటున్నారు. ఏదో మాటామాటా వచ్చి, ‘మా కత్తి గొప్పా, నీ కలం
గొప్పా’అని అడిగారుట. ఆయన ‘నా కలమే గొప్ప’ అనడంతో మాటకు మాట పెరిగింది. సరసం విరసం అయింది. వాళ్ళు ఇళ్ళకు వెళ్లి, ముందు
జాగ్రత్తగా వరిగడ్డి, కుండల్లో
చద్దన్నాలు బండ్లలో పెట్టించుకున్నారు. ఆ పళానవెళ్లి, అర్ధరాత్రి
పర్వతాలయ్య గారిని లేపి, దొడ్లో చింతచెట్టు కిందకి తీసుకుని వెళ్లి, కత్తితో పొడిచి హత్య చేసారు. ముఖ్యంగా కుడి చేతిపైనా, నాలికపైనా
పొడిచారట. కొనవూపిరితో వుండగా ఎవరయినా వచ్చినా, తమ పేర్లు చెప్పకుండా ఉండడానికి అలా చేశారుట. తరువాత బండ్లు కట్టుకుని
నైజాంలోకి పారిపోయారుట. ఆయన భార్య (పేరు వెంకమ్మగారని గుర్తు) ఏడుస్తుంటే
పర్వతాలయ్యగారు ఆ నెత్తురుతోనే,
‘నా’, ‘కా’ అనే అక్షరాలు
రాసారుట. ‘నా’ అంటే నారాయణ అనీ,
‘కా’ అంటే కామయ్య అనీ అందరికీ అర్ధం అయింది.
కాని, పోలీసులు వచ్చి అడిగితే పర్వతాలయ్యగారి భార్య ఎవరి పేరు చెప్పలేదట.
(బహుశా చెబితే వాళ్ళు పగబట్టి పిల్లలకు హాని తలబెడతారన్న భయంతో కావచ్చు) ‘ఎవరి పాపాన వాళ్ళే పోతారు. నాకేం తెలియదు. చీకటి. ఎవరూ
కనబడలేదు’ అన్నదట. అప్పుడామెకు ఇద్దరు కొడుకులు. రామయ్య, లక్ష్మయ్య.
రామయ్యకు పన్నెండేళ్ళు.
అయినా, ‘మీ తండ్రి కరణీకం ఇస్తా చేస్తావా?’ అని తాసీల్దారు
అడిగితే, ‘చేస్తాన’ని దస్త్రం తీసుకున్నాడట. ఆరోజుల్లో కరణీకం
ఉద్యోగానికి మేజరయి ఉండాలన్న నియమం లేదన్నమాట. రామయ్య గారి హయాంలో కుటుంబం
ఆస్తి బాగా పెరిగింది. వూళ్ళో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన పోయేసరికి మూడువందల
ఎకరాల పొలం వుండేది.
ఆ రోజుల్లో పుట్టిధాన్యం (పది బస్తాలు) రూపాయకో, రెండుకో అమ్ముడయ్యేది. పంటలన్నీ
వర్షాధారం. ధరలు లేవు. దానితో చాలామంది రైతులు శిస్తు కట్టలేక పొలాలు వొదిలేసి
వెళ్లిపోయారట. అప్పటి నిబంధనల ప్రకారం ఆ శిస్తు తాను చెల్లించి ఆ పొలాలను రామయ్య గారు
తీసుకున్నారట. ఆయనకు కరణీకం చేసినందుకు లభించే జీతం నెలకు మూడో నాలుగో రూపాయలు.
అవేం చేయాలో తెలిసేది కాదు. ఇంటికి అవసరమైనవి వస్తువులు అన్నీ ధాన్యం ఇచ్చి కొనుక్కునేవారు. దాంతో జీతం రూకలను
గూట్లో గిరవాటు వేసేవారట. అలా గూట్లో పడివున్న రూపాయలు, శిస్తు కట్టలేని రైతుల పొలాలు కొనుక్కోవడానికి అక్కరకు వచ్చాయట. (అలా
ఉత్త పుణ్యానికి వచ్చిన ఆస్తి కాబట్టే రెండు తరాలు గడిచేటప్పటికి హారతి కర్పూరంలా
హరించి పోయిందని మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు అంటుండేవారు)
“రామయ్య గారు
చాలామందికి ఆశ్రయం కల్పించారు.
ఒకసారి ఆయన వాకిట్లో అరుగు మీద కూర్చుని మొహం
కడుక్కుంటూ వుంటే ఒక రైతు
వచ్చాడట. ‘ఎక్కడికి’ అని అడిగితే ‘ఎక్కడ పని దొరికితే అక్కడికి’ అని అన్నాడట.
‘నీకెంత పొలం కావాలో తీసుకో ఇప్పిస్తా. ఇక్కడే వుండిపో ‘ అన్నాడట రామయ్య గారు. ఆ
రైతు ఎవ్వరో కాదు ప్రస్తుతం మా వూరి మోతుబరుల్లో ఒకరయిన బండి సత్యనారాయణ పూర్వీకుడు.
బండి సత్యనారాయణ గారు, మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు మా వూరి వారిలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్లు.
మా అన్నయ్య ఉద్యోగాల పేరుతొ అనేక ఊళ్లు తిరిగితే, బండి సత్యం బియ్యే మాత్రం వ్యవసాయం చేసుకుంటూ ఊళ్లోనే ఉండిపోయాడు.
“అలాగే
వేమిరెడ్డివారికి, ‘మీరెంత అడవి
కొట్టుకుంటే అంత పొలం ఇస్తానని’ చెబితే వాళ్ళు అడవి నరికి పొలం చేసుకుంటూ
కంభంపాడులోనే వుండిపోయారు.
“ఇంగువ వారి
పూర్వీకులకు ఆశ్రయం కల్పించింది కూడా ఆయనే. ఈరోజుల్లో ఇండ్ల స్థలాలు, పొలాలు
ఇప్పించడం అనేది మంత్రులు కూడా చేయలేని పని. మంత్రివర్గం చేయగలిగే ఈ పనులను ఆ
రోజుల్లో గ్రామకరణాలు చేయగలిగేవారు. అదీ నోటి మాటతో.
ఇంగువ
వెంకటప్పయ్య గారు మా ఇంటి పురోహితులు. ఏ కార్యం అయినా వారి చేతుల మీదుగా
జరగాల్సిందే. ఆయన తర్వాత వారి కుమారుడు వెంకయ్య గారు కూడా తండ్రి మాదిరిగానే. కానీ వారితో ఎప్పుడూ పోట్లాటే. చివరికి మా
పెద్దన్నయ్య వారికి పోట్లాడే పురోహితుడు
అని పేరు పెట్టారు.
‘‘ఇదం
బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి’ అన్నారు. అంటే ఒక బ్రాహ్మణుడు శాపం
ద్వారా కానీ, శరం ద్వారా కానీ యుద్ధం చేయగలుగుతాడు.
అయితే, మా ఇంటి
పురోహితులైన ఇంగువ వెంకయ్య గారు యుద్ధాలు చేసేవారు కాదు, శాపాలు పెట్టేవారూ
అంతకంటే కాదు. కేవలం సంభావనల దగ్గర
పోట్లాటకు దిగేవారు. అదీ వారు అడిగినంత సంభావన ఇవ్వకపోవడం వల్ల కాదు, మనం ఇచ్చే
సంభావన వారికి నచ్చకపోవడం వల్ల.
ఇందులో విశేషం
ఏముంది?
చాలా సందర్భాలలో
విన్నదే కదా అనుకోవచ్చు. కానీ ఈ పురోహితులవారి తరహానే వేరు. అందుకే ఆయన గురించి
రాయాలని అనిపించింది.
మా ఇంట్లో శుభాశుభ
కార్యక్రమాలన్నింటికీ ఆయనే బ్రహ్మ. మా అక్కయ్యల పెళ్ళిళ్ళు, మా పెద్దన్నయ్య
పెళ్లి, ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు, మా రెండో అన్నయ్య పెళ్లి, ఆయన నలుగురి
పిల్లల పెళ్ళిళ్ళు, మా మూడో అన్నయ్య పెళ్లి ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు ఆయనే
దగ్గరుండి శాస్త్రోక్తంగా జరిపించారు. నా పెళ్లి నేనే చేసుకున్నా కాబట్టి ఆయన
గారికి ఛాన్స్ దొరకలేదు. మా ఇంట్లో ఇన్ని పెళ్ళిళ్ళు చేయిస్తూ ఆయన తన పెళ్లి మాట
మరచిపోయారేమో, అలాగే చివరి వరకు ఘోటక బ్రహ్మచారిగానే వుండిపోయారు. మా పెద్దన్నయ్య ఈడువాడు.
మనిషి మంచివాడే
కానీ ఈయనతో రెండు సమస్యలు. అది వ్రతం కానీ, వడుగు కానీ, ఆబ్దీకం కానీ
మొత్తం క్రతువు శాస్త్ర ప్రకారం జరిపించాల్సిందే. తూతూ మంత్రం వ్యవహారం కాదు.
పూర్తిగా అంతా పద్దతి ప్రకారం చేయాల్సిందే. గంటలు గంటలు సాగే ఈ తంతు చూస్తూ బీపీలు, సుగర్లు
వున్నవాళ్ళకు కళ్ళు తిరిగిపోయేవి. ‘అయ్యా వెంకయ్య గారూ, అందరూ
పెద్దవాళ్లు, భోజనానికి ఆగలేరు,
కాస్త త్వరగా లాగించండి’ అని మొత్తుకున్నా ఆయన
వినిపించుకునే రకం కాదు.
మా రెండో
అన్నయ్య రామచంద్రరావు గారి కొడుకు పెళ్ళి హైదరాబాదులో జరిగితే ఆయనే వచ్చి
చేయించారు. వడుగు ముందు ఇంట్లో చేసుకుని తర్వాత కళ్యాణ మంటపానికి వెళ్ళాలి.
వెంకయ్య గారు తెల్లవారుఝామునే వడుగు కార్యక్రమం మొదలెట్టారు. బారెడు పొద్దెక్కినా
వడుగు తంతు సాగుతూనే వుంది. అవతల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. కానీ వడుగు ఓ
పట్టాన తెమిలేలా లేదు. సాధారణంగా సంయమనం కోల్పోని మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు
ఇక ఉండబట్టలేక ‘వెంకయ్యగారు మీరు ఇక్కడ వడుగు చేస్తూనే వుండండి, ఈలోపల మేము
వెళ్లి ఆ పెళ్లి పని ముగించుకుని వస్తాం’ అనేసారు.
ఇక సంభావన
దగ్గరికి వచ్చేసరికి వస్తుంది అసలు తంటా. ఇక్ష్వాకుల కాలం నాటి రేట్ల ప్రకారం పదో
పరకో చాలనే తత్వం ఆయనది. (ఈ కధాకాలం ముప్పయ్యేళ్ళ నాటిది) తమ తమ విభవానికి
తగ్గట్టు ఎవరైనా వేయి నూట పదహార్లు ఇవ్వబోయినా ఆయన తీసుకోరు. తను తీసుకునే నూట
పదహారు రూపాయలు లెక్కకట్టి తీసుకుని మిగిలిన డబ్బు గృహస్తుకు ఇచ్చేసి వెడతారు.
కాదుకూడదు అంటే వస్తుంది తంటా. చూసేవారికి ఆయన అడిగినంత వీళ్ళు ఇవ్వడం లేదేమో, అందుకే పొట్టు
పొట్టవుతున్నారు అని అపోహ పడే ప్రమాదం కూడా వుంది.
‘వెంకయ్య గారికి
సంభావన ఇచ్చే వేళయింది. అందరూ లేచి అడ్డంగా నిలబడండి, ఆయనగారు సంభావన
తీసుకోకుండా వెళ్ళిపోతారేమో” అని మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు గారు అంటుండేవారు
హాస్యోక్తిగా.
మా రెండో
అన్నయ్య కుమారుడి పెళ్ళిలో సంభావన కింద మా అన్నగారు ఐదువేల నూట పదహార్లు
ఇద్దామనుకుని కూడా వెంకయ్య గారితో తంటా ఎందుకని వేయి నూటపదహార్లు తాంబూలంలో పెట్టి
ఇచ్చారు. ఆయన అది చూసి నాకు నూట పదహార్లు చాలు అని మిగిలిన డబ్బు తిరిగి
ఇవ్వబోయారు. ‘మా తృప్తి కొద్దీ ఇస్తున్నాం. కాదనకండి’ అని మా అన్నయ్య ఆయనకు
నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తే వెంకయ్య గారు ఇలా అన్నారు. ‘లడ్డూలు రుచిగా
వున్నాయని ఐదో ఆరో తినం కదా! సంభావన కూడా అంతే. నేనెంత తీసుకోవాలో అంతే
తీసుకుంటాను’ ఇదీ ఆయన వరస.
గోదానాల వల్ల
లభించిన ఆవులతో వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ వుండేది మా చిన్నప్పుడు. వాటిని
మేపే శక్తిలేని వెంకయ్య గారి ఇంట ఆ కళకళలు ఎన్నాళ్ళు వుంటాయి. వాటిని అమ్మేయడానికి
శాస్త్రం ఒప్పుకోదు. వాటిని పుష్టిగా మేపడానికి ఆదాయం సరిపోదు. అయినా సరే వెంకయ్య
గారు తను నమ్మిన సిద్దాంతానికే జీవితాంతం కట్టుబడే వున్నారు. తన సంపాదనలో కొంత
ఆవుల మేతకు ఖర్చు చేసేవారు. నోట్ల రూపంలో వచ్చే సంభావనలు మినహాయిస్తే నాణాలుగా
వచ్చిన వాటిని ఖర్చుచేయడం వారి ఇంటా వంటా లేదు. చిల్లర డబ్బుల రూపంలో వచ్చిన
సంభావనలు అన్నీ ఓ రేకు డబ్బాలో పడేసేవారు. వేయి రూపాయలుకు సరిపడా చిల్లర పైసలు ఆయన
దగ్గర దొరుకుతాయని వూళ్ళో చెప్పుకునే వారు.
కింది ఫోటోలు:
(ఇంకా వుంది)
మీ “పోట్లాడే పురోహితుడు” వెంకయ్య గారి ఫొటో కూడా పెడితే బాగుండేదిగా 🙂 ?
రిప్లయితొలగించండిమరాఠీ మూలాలున్నాయని అనుమానం కలగక మానదు. మమ్మల్ని కూడా (విన్నకోట వారిని) దేశపాండేలు అనేవారని మా తండ్రిగారు చెబుతుండేవారు.
రిప్లయితొలగించండిఊరి ప్రజల అవసరార్థం కొంతమంది సర్వీస్ ప్రొవైడర్లని (కులవృత్తులు చేసుకునేవారిని) కొంత పొలం ఇచ్చి ఆ ఊళ్ళోనే స్ధిర పడేట్లు చేసారట మా పూర్వీకులు. అదో దివాణంలా నడిచేదట.
అవునండీ, పైనుంచి నాలుగో పేరాలో //“ఉత్త పుణ్యానికి వచ్చిన ఆస్తి …… “// అంటారేమిటి? మీ తాతయ్య గారు తన జీతంలో నుంచి దాచుకుని పోగేసిన డబ్బుతో కొనుక్కున్నారు కదా, ఉత్తి పుణ్యానికి రావడం ఏముంది దాంట్లో ?
విన్నకోట నరసింహా రావు గారికి పెద్దన్నయ్య కుమారుడి పెళ్లి చేయిస్తున్న పోట్లాడే పురోహితుడు ఫోటో దొరికింది
రిప్లయితొలగించండి🙂
తొలగించండి🙏
ఇంగువ వెంకయ్య గారి గురించి మీరు రాసిన బ్లాగ్లోనో ఇంకెక్కడో కూడా చదివినట్టు గుర్తు. బ్రాహ్మల్ని చంపే వాళ్ళున్నారా ఆకాలంలో, అన్యాయం కదా, ఏంటోగా అనిపించింది అది చదివితే, మాటలకే చంపేసుకుంటారా?
రిప్లయితొలగించండి