29, నవంబర్ 2024, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (20 ) - భండారు శ్రీనివాసరావు

 

 

కంభంపాడు  గ్రామం కృష్ణాజిల్లాలోది. (లోగడ ఇది నందిగామ తాలూకాలో వుండేది. తాలూకాల రద్దు, మండల వ్యవస్థ ఆవిర్భావం తరువాత మా గ్రామం వత్సవాయి మండలంలో చేరింది. ఇటీవలనే జిల్లాకు ఇంటిపేరు కూడా చేరింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా). ఈ గ్రామ చరిత్ర తెలుసుకోవడానికి ఆధారాలు లేవు.  స్తంభము ప్రోలు’ అన్నది కంభంపాడు  అన్న పేరుకు మూలం కావచ్చు. లేదా ‘స్థంభం పహాడ్’ కాలక్రమంలో కంభంపాడు కావచ్చు. కానీ ఈ గ్రామానికి సమీపంలో స్థంభం కానీపహాడ్ కానీ లేవు. ఇక్కడ లోగడ ఏదయినా ‘జయస్థంభం’ లాంటిది వుంటేస్థంభంప్రోలు లేక కంభంపాడు అనే పేరు వచ్చి ఉండవచ్చు.  ఆ రోజుల్లో ఇలాటి జయస్తంభాలను చాలాచోట్ల నెలకొల్పి వుంటారు. కనుక కంభంపాడు అన్న పేరుతొ చాలా గ్రామాలు కనిపిస్తాయి. మధిర దగ్గర ఒకటితిరువూరు దగ్గర ఒకటిఅమరావతి దగ్గర వైకుంఠ పురం దగ్గర మరోటి వున్నాయి.

 గ్రామంలో వున్న శ్రీ రాజలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టించారు. అదే ప్రాంగణంలో ఆంజనేయ స్వామి గుడి కూడా వుంది.  వీటికి మా కుటుంబం వారు ధర్మకర్తలు.   కొత్తూరు (కొత్త వూరు)లో ఆంజనేయ స్వామి ఆలయాన్ని అక్కడి రైతులు నిర్మించారు. తరువాత ఆ వూరు ఖాళీ అయినా, దానికి రహదారి సౌకర్యం కల్పించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి, నిత్య పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ఇవికాక, మా వూరిలో ముత్యాలమ్మ గుడి వుంది. ఒకసారి ముత్యాలమ్మ గ్రామ దేవత, పర్వతాలయ్య గారి కలలోకి వచ్చి ‘బందిపోట్లు వూరి పైకి రాబోతున్నారని’ హెచ్చరించిందట. వెంటనే అంతా గ్రామం వొదిలి తప్పుకున్నారట. బందిపోట్లకు ఏమీ చిక్కలేదు. అందుకని కోపించి వారు ముత్యాలమ్మ దేవతను గడ్డపారతో పొడిచి పగులగొట్టారని అంటారు. వెంకటస్వామి అనే అతను ముత్యాలమ్మకు చిన్న గుడి కట్టించాడు. వూరికి తూర్పున పొలిమేర మీద జమ్మి చెట్టు కింద ఎండ పల్లెమ్మ అనే ఓ అమ్మవారి విగ్రహం కూడా వుంది. వూరి బయట మా తాతయ్య గారు సుబ్బారావు గారు నిర్మించిన ఆశ్రమంలో ముక్తినాధ స్వామి ఆలయం వుంది. అది ఉన్న ప్రాంతంలోనే శ్యాం ప్రసాద్ బ్రహ్మచారి అనే కాశీ స్వాముల వారి ఆశ్రమం వుండేది. ఆయన  ఒక వేద పాఠశాలను సైతం నిర్వహించేవారు.

మా వూరి కాపురస్తులు చావా ప్రసాద్ గారనే పెద్ద మనిషి సొంత డబ్బు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి కోదండ రామాలయాన్ని నిర్మించారు. చేకూరి రామారావు గారనే మరో పెద్దమనిషి ఈ గుడి నిర్మాణం కోసం అవసరమైన, విలువైన  స్థలాన్ని  ఇచ్చారు. మా కళ్ళ ముందు కట్టిన కొత్త గుడి ఇది. పూజాదికాలు నిర్వహించే అయ్యగారికి నివాసం ఉండడానికి ఇంటితోపాటు, తన తదనంతరం కూడా నిత్య ధూప నైవేద్యాలు సజావుగా  జరగడానికి వీలుగా ఎనిమిది ఎకరాల భూమిని ఇచ్చిన వదాన్యులు ఆయన. ఈ మధ్యనే కన్నుమూసారు.  రామాలయానికి చేరువలోనే షిర్డీ సాయి బాబా గుడిని, మా ఊరు వచ్చి ష్టిరపడ్డ ఆర్.ఎం.పి. గుండు పుల్లయ్య గారు నిర్మించగా,  వడ్డెరగూడెంలో  నాగేంద్రస్వామి (పుట్ట) గుడిని గ్రామస్తులు పునర్నిర్మించారు.

దేవాలయాలకు సంబంధించి మా చిన్నప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకునేవారు. ఆ పాత రోజుల్లో అనేక మూఢ నమ్మకాలు ఉండేవి. అంటువ్యాధులు ప్రబలి ప్రాణాలు పోతున్నప్పుడు, ఊరికి ఏదో అరిష్టం పట్టుకుందని భావించేవారు. గుడిలో గండదీపం వెలిగించి దానిని ఎవరూ చూడకుండా పొరుగూరి గుడిలో పెట్టి వస్తే అరిష్టం తొలగిపోతుందని నమ్మేవారు. ఆ పొరుగూరి వారు కూడా ఆ దీపాన్ని రహస్యంగా తీసుకెళ్ళి మరో ఊరి గుడిలో పెట్టి వచ్చేవారట. ఈ విషయంలో ఊళ్ళ మధ్య తగాదాలు, కొట్లాటలు  జరిగేవని  కూడా విన్నాను.

వూళ్ళో మా ఇల్లు చాలా పెద్దది. ముందూ వెనకా బోలెడంత ఖాళీ జాగా.సెలవులు రాగానే మా అక్కయ్యల పిల్లలు అందరూ మా ఊరికి వచ్చేవారు. ఆరుబయట  ఆడుకునేవాళ్ళం. రకరకాల ఆటలు. దాగుడుమూతలు  మేము ఎక్కువగా ఆడుకున్న ఆట. దొంగాపోలీసు మాదిరి. చేతులతో పంటలు వేసుకుని దొంగని నిర్ణయించేవాళ్ళం. వాడు ఒక్కడే మిగిలిన వారిని ఎక్కడ దాక్కున్నా వెతికి  పట్టుకోవాలి.

అందరం రోజూ రెండుపూటలా స్నానాలు చేసేవాళ్ళం. బావి దగ్గరనిలబడితే పనివాళ్ళు చేదతో తోడి  పోసేవాళ్ళు. కాలకృత్యాల కోసం అందరూ ఇంటికి కొద్ది దూరంలోవున్న తుమ్మల బీడుకు చెంబులు తీసుకునివెళ్ళేవాళ్ళు. మరీ పెద్దవాళ్ల కోసం పెరట్లో ఒక దడి కట్టి వుండేది.

ఇంట్లో పదిమంది పిల్లలం కాక మరో పదిహేనుమంది దాకా పెద్దవాళ్ళు వుండేవాళ్ళు. అంత పెద్ద కుటుంబాన్ని నెట్టుకురావడం అలవిమాలిన పని. ప్రతిపూటా కూరా నారా అంటే కుదరని పని. అందుకే, పిల్లలందరికీ పొద్దున్నే చద్దన్నం పెట్టేవాళ్ళు. అదో మధుర జ్ఞాపకం. అదే మా బ్రేక్ ఫాస్ట్. రాత్రిళ్ళు తినగా  మిగిలిన అన్నంలో ఆవకాయ కలిపి, పిల్లలందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని, ఒకరి తరవాత మరొకరికి వొంతులవారీగా ముద్దలు తినిపించేవాళ్ళు. పిల్లలకు విడిగా అన్నం పళ్ళాలు వుండేవి కాదు. పెరుగన్నంతో పిల్లల కడుపునిండి పోయేది.

పెద్దవాళ్లకయితే జాంబెడు (పెద్ద గ్లాసు) కాఫీ లేదా చెంబెడు తేట మజ్జిగ.

ఇల్లు యెంత పెద్దదయినా మూడంటే మూడే లాంతర్లు వుండేవి. పొద్దుగుంకడానికి ముందుగానే లాంతరు  అద్దాలను ముగ్గు పెట్టి శుభ్రంగా తుడిచికిరసనాయిలు పోసి సిద్ధంగా వుంచేవారు. పూర్తిగా చీకటి పడకముందే పిల్లలకు అన్నాలు పెట్టేసేవాళ్ళు. అన్నం, గరిటెజారుడు పప్పు, తోటలో కాసిన ఏదో ఒక కూర, పప్పుచారు, ఆవకాయ, నెయ్యీ, పెరుగు ఇదీ  భోజనం.

తరవాత అంతా ఆరుబయట మంచాలు వేసుకుని పండుకునేవాళ్ళం. వెల్లకిలా పడుకుని ఆకాశంలో మిలమిల మెరిసే  నక్షత్రాలు చూస్తూ వుంటే ఆ ఆనందం అంతా  ఇంతా  కాదు. వెన్నెట్లో ఎన్నోరకాల ఆటలు. వెన్నెల కుప్పలు అనే ఆట బాగుండేది. ఒక జట్టు  చేతిలో మట్టి తీసుకుని ఇంటి ఆవరణలోని రకరకాల చోట్ల మట్టిని  చిన్న చిన్న కుప్పలుగా పోసేది. రెండో జట్టు అవి ఎక్కడున్నాయో కనుక్కుని వాటిని చెరిపేసేది. ఎవరివి మిగిలితే వాళ్ళు గెలిచినట్టు.

ఒక్కొక్క మంచంలో ఇద్దరిద్దరం పడుకునేవాళ్ళం. నులక మంచాలు కొన్ని, నవారు మంచాలు మరికొన్ని. నవారు మంచాలు పెద్దవాళ్ళకు వేసేవాళ్ళు. మంచం పట్టెడ వొదులు కాకుండా సాయంత్రం కాగానే వాటిని బిగించి కట్టేవాళ్ళు. 

 ఆ రోజుల్లో మా ఊరికి కరెంటు లేదు. రోడ్డు లేదు. మంచినీటి పంపులు లేవు. ఎవరి కాళ్ళకూ చెప్పులు కూడా వుండేవి కాదు.  అల్యూమినియం కంచాల్లో అన్నాలు. పెద్దవాళ్ళకు విస్తరాకులతోనో, బాదం ఆకులతోనో కుట్టిన  విస్తళ్లలో వడ్డించే వాళ్ళు. మా బామ్మ గారికి, నాన్న గారికి, అమ్మగారికి మధ్యలో బంగారం పువ్వు తాటించిన వెండి కంచాలు ఉండేవి. భోజనాలు కాగానే వాటిని శుభ్రంగా కడిగి లల్లూరాం కంపెనీ వారి  ఇనప్పెట్టెలో దాచిపెట్టేవారు. అందులోనే వివిధ సైజుల్లో వెండి గ్లాసులు, గిన్నెలు ఉండేవి. అల్లుళ్లు వచ్చినప్పుడు వాటిని బయటకు తీసేవారు. అది తెరవాలి అంటే మూడు తాళం చేతులు కావాలి. ఆ తాళాల గుత్తి మా బామ్మ దగ్గర వుండేది.

ఉప్పుడు పిండికీ, తప్పాల చెక్కకూ,  ‘పేటెంట్’ ఇవ్వాల్సివస్తేఅది మా అమ్మకే ఇవ్వాలి. తప్పాలచెక్క అంటే బియ్యపు పిండితో చేసే వంటకం. బియ్యపుపిండిలో నానేసిన సెనగపప్పు, ఉప్పూ కారం జీలకర్ర కలిపి ముద్దగాచేసేవాళ్ళు.  ఇత్తడి గిన్నెను పొయ్యిపై వేడిచేసి, దానిలోపల ఈ ముద్దను  తందూరీ రోటీ మాదిరిగా పలచగా అంటించి మూతపెట్టేవాళ్ళు. కాసేపయిన తరవాత, గిన్నెని దించి లోపల ఎర్రగా కాలిన తప్పాలచెక్కను చేత్తో బయటకు తీసి దానికి వెన్నరాసి పెట్టేవాళ్ళు. ఆహా ఏమి రుచి! అన్ని లొట్టలు వేసుకుంటూ తినేవాళ్ళం. కానీ అది తయారుచేసేటప్పుడు అమ్మ కాల్చుకున్న చేతుల సంగతి ఎవరికీ గుర్తుండేది కాదు.

 

  

 

కింది ఫోటోలు:

ఊరిలో కొత్తగా కట్టిన కోదండ రామాలయం 






 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి