30, నవంబర్ 2024, శనివారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (22) - భండారు శ్రీనివాసరావు

 

 

 

“కావాల్సిన కూరగాయలన్నీ  ఇంటి పెరట్లోనే పండేవి. కొష్టం నిండా ఆవులూ, బర్రెలూ వుండేవి. ఇంట్లోకి అవసరమయిన పాలు,పెరుగు,నెయ్యీ వాటి పాడితోనే సరిపోయేది. కొనుక్కోవాల్సిన పరిస్తితి వుండేది కాదు. అలాగే బియ్యం,పప్పులూ, ఇతర దినుసులు. వేరుసెనగ విత్తులను గానుగ ఆడించి నూనె తీసేవారు.                

 “ఆడవాళ్ళు ధరించే చీరెల నుంచి, మగవాళ్ళు కట్టుకునే దోవతులవరకూ వూళ్ళోని  నేతపనివారే నేసిపెట్టేవారు. ఏదయినా శుభాకార్యాలప్పుడే పట్నం వెళ్లి ఆలుగడ్డలు, టొమాటోలు వంటివి కొనుక్కుని వచ్చేవాళ్ళు. కాయలూ, పండ్లూ కూడా కొనుక్కోవాల్సిన అవసరం వుండేది కాదు. తోటల్లోనే కాసేవి. రుతువులనుబట్టి దొరికేవి. అరటి, జామ, మామిడి, సీమచింత, సపోటా, రేగిపళ్ళు  ఏవీ కొనాల్సిన పనివుండేది కాదు.  దెనుసు గడ్డలు (Sweet Potato) వేరే ఊళ్ళ నుంచి బండ్ల మీద తెచ్చి వీధుల్లో తిప్పుతూ అమ్మేవాళ్లు. ధాన్యం కొలిచి కొనుక్కునేవాళ్ళు. డబ్బుల అవసరం వుండేది కాదు. మా ఊర్లో సోడా దుకాణం వుండేది. అయితే అక్కడ తయారు చేయడం మాత్రమే. సోడా కాయల్లో నీరు నింపి ఓ మిషన్ లో వుంచి గిర్రున పైకి కిందికి తిప్పేవారు. దాంతో సోడాకాయల్లోకి గ్యాస్ వెళ్ళేది. వాటిని తోసుకుంటూ పోయే ఒక చిన్న బండిలో పెట్టి వూళ్ళో ఖామందుల భోజనాలు అయ్యే సరికి తీసుకువచ్చి అమ్మేవారు. అన్నం తిన్న తర్వాత సోడా తాగితే జీర్ణం అవుతుందని ఓ నమ్మకం. సోడాకాయ ఎదురు రొమ్ము మీద ఆనించుకుని ఒక రబ్బరు బిరడాతో గట్టిగా అదిమితే పెద్ద చప్పుడుతో లోపల వున్న గోళీ అడ్డు తొలగిపోయేది. నా చిన్ననాటి స్నేహితుడు వెంకటేశ్వర్లు ఆ సోడాలు అమ్మేవాడు. చదువుకోలేదు కానీ తెలివితేటలు ఎక్కువ. సోడాలతో పాటు నాటు కోడి గుడ్ల వ్యాపారం కూడా చేసేవాడు. సోడా కొట్టేటప్పుడు వివిధరకాలుగా శబ్దాలు వచ్చేలా చేసేవాడు. చిత్రంగా వుండేది ఆ ప్రక్రియ. ఒక్కోసారి కీచుమని చప్పుడు. మరోసారి ఏదో బాంబు పేలుతున్న ధ్వని.

సోడా అంటే బెజవాడ వాసులకు గుర్తొచ్చే ఒక పేరు పుష్పాల రంగయ్య. జైహింద్ టాకీసు వెనుక రోడ్డులో ఆయన పేరు మీదనే ఒక కూల్ డ్రింక్ షాపు వుండేది. మామూలు సోడాలే కాకుండా రకరకాల రంగుల సోడాలు, నిమ్మకాయ సోడాలు, ఐస్ సోడాలు  దొరికేవి. ఊరి పెద్దలు చాలామంది ఆ షాపు ముందు గుమికూడి నిలబడి, రంగయ్య గారూ మాకు ఆ సోడా కొట్టండి, ఈ సోడా కొట్టండి అని అడుగుతుండేవారు. పిల్లలకేమో రంగు సోడా తాగాలని మనసు. మా ఊళ్ళో మాదిరి కాదు కదా డబ్బులు ఎప్పటికప్పుడు  ఇవ్వకుండా నెలకోసారి ఇవ్వడానికి. ఆ దారంట స్కూలుకు వస్తూ పోతూ, ఎప్పుడైనా పెద్దవాడిని కాకపోతానా, దర్జాగా నిలబడి, రంగయ్య దుకాణంలో  రంగు సోడా తాగకపోతానా అనే చిన్నతనపు మనసు. ఆ రోజుల్లో నాకు మరో గట్టి కోరిక వుండేది. ఎప్పటికైనా సరే, బీసెంటు రోడ్డు మొగదలలో వున్న రవీంద్ర కూల్ డ్రింక్స్ అద్దాల షాపులో దర్జాగా కూర్చుని, గాజు కుప్పెలో ఇచ్చే తెల్లటి ఐస్ క్రీం ని వేరే వారితో పంచుకోకుండా నేను ఒక్కడ్నే, చుట్టూ వున్న అద్దాలలో నన్ను నేనే చూసుకుంటూ తినాలని. మా అక్కయ్య ఇంట్లో చదువుకుంటున్న రోజుల్లో, మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు,  బెజవాడ ఎప్పుడైనా వచ్చి, తిరిగి రైలు స్టేషన్ కు వెడుతున్నప్పుడు, నన్నూ, మా బావగారి అబ్బాయి సాయిబాబుని వెంటబెట్టుకుని వెళ్లి, మధ్యలో రవీంద్ర కూల్ డ్రింక్ షాపులో ఐస్ క్రీం తినిపించేవాడు. దాంతో పెద్దవాడిని కాకముందే నా చిన్ననాటి కోరిక తీరిపోయింది.

అప్పటికి నిద్రాణమైన మా పల్లెటూరిలో పండగలు, పబ్బాలతో చక్కటి కళ వచ్చేది.        

 చెప్పుకుంటే రకరకాల పండుగలు. కానీ ప్రతి పండగా పిల్లలకు పెద్ద  పండగే. అది ఆడవాళ్ళ వ్రతమయినా, మగవాళ్ళ వనభోజనాలయినా.

 వినాయక చవితి, మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీవ్రతం, కేదారేశ్వర వ్రతం, అట్లతద్దె, ఉండ్రాళ్ళ తద్దె, దసరాబతకమ్మ, దీపావళి, సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి  ఇలా పండగలే పండగలు. నోములే నోములు. నవకాయ పిండి వంటలతో పండగ భోజనాలన్నీ  అదిరిపోయేవి. ఆ పండగలన్నీ ఇప్పుడు లేవని కాదు. ఆనాడు  పిల్లల్లో పెద్దల్లో కానవచ్చే సంతోషం  సంబరాలు ఇప్పుడు మచ్చుకు కూడా కానరావడం లేదు. సంక్రాంతి, దసరా, దీపావళి పండగలు అంటే మరీ సంబర పడిపోయేవాళ్ళం. ఎందుకంటే ఈ పండగలకే పిల్లలకు కొత్త బట్టలు కుట్టించేవాళ్ళు. పెనుగంచిప్రోలు లోని బట్టల దుకాణం నుంచి అరువుమీద ఒకే రకం బట్ట కొని, ఊళ్ళోని దర్జీ పనివాడితో  అదే రంగు బట్టతో పిల్లలు అందరికీ ఒకే మోస్తరుగా చొక్కాలు, లుడిగీలు (నిక్కర్లు). మరీ చిన్నవాళ్ళం అయిన నాలాంటి వారికి అన్నయ్యలు వాడేసిన బట్టలు, పుస్తకాలు. పండగల్లో దీపావళి మరీ స్పెషల్. పిల్లలకి తలా ఒక ఐదో, పదో రూపాయలు ఇచ్చేవాళ్ళు. పదిరోజుల ముందే టపాకాయలు కొనుక్కుని వాటిని జల్లెడలో వుంచి పందిరిమీద ఎండడానికి పెట్టేవాళ్ళం. నాకు ప్రతి పది నిమిషాలకు అవి ఎండాయా లేదా చూడాలని ఆత్రం. ఈ టపాకాయల్లో బొమ్మ పిస్తోల్లు, వాటిలో పెట్టి పెట్టడానికి, పేల్చడానికి చిన్న చిన్న ఎర్రటి టేపులాంటి చుట్ట ఉంచిన చిన్న కాగితం  పెట్టె. అది సింహం బ్రాండ్ అయితే చాలా సంతోష పడేవాళ్ళం, బాగా పేలుతాయని. అలాగే లక్ష్మి బ్రాండ్ ఔట్లు, ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు. సీమటపా కాయలు. వాటిని కాల్చడానికి భయమైనా పెద్దవాళ్లు ఎవరైనా కాలుస్తుంటే గట్టిగా రెండు చెవులు మూసుకుని ఆనందించేవాళ్ళం. అలాగే రవ్వలురాలని, చిటపటలాడని సాదా కారప్పువ్వత్తులు అంటే ముచ్చట పడే వాళ్ళం. ఇక మతాబులు, చిచ్చుబుడ్లు ఇంట్లోనే, గంధం (పాస్పరస్) పొడి, సూరేకారం కలిపి తయారు చేసుకునే వాళ్ళం.  అలాగే ఇనుముతో తయారు చేసిన చిన్న సైజు రోలు రోకలి పల్లెటూళ్ళలో ప్రత్యేకమైన దీపావళి టపాసు. రోలు వంటి చిన్న ఇనుప రోటిలో కొంచెం మందు కూరి, దానిపై రోకలి లాంటి ఇనుప కడ్డీ వుంచి ఏదైనా గట్టి రాతిపై మోదితే పెద్ద శబ్దం వచ్చేది. అది కొట్టిన చోట పసుపు రంగుతో మచ్చ పడేది. వూళ్ళో దీపావళి మందులు కొనే స్తోమత లేని చాలామంది పిల్లలు ఈ రోలూ రోకలితోనే పండగ జరుపుకునే వాళ్ళు.  పగలంతా ఊరు ఊరంతా ఈ చప్పుళ్ళు వినవస్తూనే ఉండేవి. వెళ్ళు నలిగిపోతాయని మా వాళ్ళు వీటి జోలికి పోనిచ్చేవాళ్ళు కాదు. చాలా సార్లు దీపావళి పడగకి రెబ్బారం నుంచి మా రెండో బావగారు కొలిపాక రామచంద్ర రావు గారు, పండగకి మా ఊరు వస్తూ,  పెద్ద పెద్ద బుట్టల్లో టపాకాయలు వెంటబెట్టుకుని తెచ్చేవారు. ఆయన వస్తున్నారు అని తెలియగానే, పిల్లల కళ్ళల్లో దీపావళి కాంతులు మెరిసేవి.

ఇక ఆ రోజుల్లో  పుట్టిన రోజు పండగ  చేయడం అలవాటు లేని పని. పుట్టినరోజు ఎప్పుడో, పెళ్లిరోజు ఎప్పుడో పెద్దవాళ్లకు కూడా గుర్తుండేది కాదు. ఈ ఒక్క విషయంలో నాకు పెద్దవాళ్ల పోలిక వచ్చింది. మా ఆవిడ పుట్టిన రోజు, పిల్లల పుట్టిన రోజు ఇప్పటికీ గుర్తురావు, గూగుల్ గుర్తు చేస్తే తప్ప.  ఈ పండగలు  కాక, బంధు మిత్రులతో కలసిచేసే వనభోజనాలు, తిరునాళ్ళు, తీర్ధయాత్రలు. వ్రతాలు,పూజలు, పేరంటాలు, ఆ రోజుల్లో అలా ఇంటింటా, ఊరంతా  ఒకటే  సందడే సందడి.

కింది ఫోటోలు:  (గూగుల్ సౌజన్యం)

(గోళీ సోడా మిషన్)


(దీపావళి పిల్లల బొమ్మ పిస్తోలు)





 

(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి