1, డిసెంబర్ 2024, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (23) - భండారు శ్రీనివాసరావు

 

మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి వారు. మా ఊరు కంభంపాడుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో తిరుమలగిరి గుట్ట అనే స్వామివారి పుణ్య క్షేత్రం వుంది. మా కుటుంబంలో పుట్టిన పిల్లల పుట్టు వెంట్రుకలు, అన్నప్రాసన మొదలైనవి   ఆ గుట్ట మీద స్వామివారి సన్నిధిలో జరపడం ఆనవాయితీ. మా ఊరు నుంచి నాలుగయిదు బండ్లలో బయలుదేరేవాళ్ళం. అందులో పైన ఎండ తగలకుండా గుడిసె వున్న రెండు బండ్లు పెద్దవాళ్లకు, ఆడవాళ్ళకు, పసిపిల్లలకు. రెండు బండ్లలో ఇంటి పురోహితులు, వంట బ్రాహ్మణులు, పెద్దపిల్లలు. ఇంకో బండిలో గుండిగెలు మొదలైన వంట పాత్రలు, బియ్యం తదితర వంట సామాగ్రి, కట్టెలు, పనివాళ్లు. వాళ్ళు వంతులు వేసుకుని బండ్ల వెంట కాపలాగా రాత్రంతా  నడిచేవాళ్ళు. దొంగల భయం వల్ల కాదు. బండి బాట ఎగుడుదిగుడుగా వున్న చోట బండి పక్కకు ఒరిగి పోకుండా వాళ్ళు దన్నుగా వుండేవాళ్ళు.   రాత్రి అన్నాలు తిని అర్ధరాత్రి తర్వాత  ఎప్పుడో సామాన్లు సర్దుకుని బయలుదేరితే, తెలతెలవారుతుండగా తిరుమలగిరి చేరుకునేవాళ్ళం.

గుట్టమీద దేవుడు. గుట్టకింద అన్నీ ఊడలు దిగిన మర్రి చెట్లు. భక్తులు వంట చేసుకోవడానికి మూడు రాళ్ళతో ఏర్పాటు చేసుకున్న  పొయ్యిలు అనేకం  ఆ చెట్ల కింద కానవస్తాయి. దాదాపు అడవి మాదిరిగా అన్నీ చెట్లు, ప్రధానంగా ఈత, తాటి చెట్లు. ఎక్కడ చూసినా గుబురుగా మిన్నాగులు తిరిగే మొగలి  పొదలు. కిందనే  స్నానాలు చేసి మెట్ల మీదుగా గుడి చేరుకోవాలి. దైవ దర్శనం చేసుకునే దాకా ఎవరూ ఏమీ తినకూడదు. పైగా పైకి వెళ్ళిన వాళ్ళు చీకటి పడేలోగా కిందికి వెళ్లి తీరాలని హెచ్చరికలు. పూజారులు కూడా చీకటి పడితే కొండపైన వుండేవాళ్ళు కాదు. రాత్రి వేళల్లో  ఒక మహా సర్పం ఆ గుట్టను చుట్టుకుని కాపలా కాస్తుందని చెప్పుకునే వారు.

మా కుటుంబం, పురోహితులు గుట్ట పైకి వెళ్లి కార్యక్రమం పూర్తి చేసుకుని వచ్చేలోగా కింద వంటలు తయారయ్యేవి. ప్రతి మెట్టు మీద అందుకు విరాళం ఇచ్చిన దాతల పేర్లు వుంటాయి. మెట్ల దారిలో కొంత దూరం పైకి వెడుతున్నప్పుడు కుడిపక్క రాతి కొండ మధ్యలో  కోనేరు.  అందులోని నీటిని అటూ ఇటూ చేతితో తొలిపి కాళ్ళు కడుక్కుని నెత్తిన నీళ్ళు చల్లుకునే వాళ్ళం. ఎందుకంటే ఆ కోనేటి నీళ్ళు  పచ్చగా పాచిపట్టి వుండేవి. దీనికో ఐతిహ్యం చెప్పేవాళ్ళు. ఆ గుట్టమీద నుంచి చూస్తే సుదూరంలో చాలా ఎత్తైన కొంగర మల్లయ్య గుట్ట కనిపిస్తుంది. దాని మీద చిన్న సైజులో కనబడే కొంగర మల్లయ్య (మహాశివుడు) గుడి. ఒకసారి తిరుమలగిరి వెంకటేశ్వర స్వామికి, కొంగర మల్లయ్య శివుడికి ఏదో పేచీ వచ్చి ఒకరినొకరు శపించుకున్నారట. నువ్వు ఉన్న  గుట్ట భక్తులకు అందనంత ఎత్తుకు  పెరిగిపోయి నీకు నిత్య ధూప నైవేద్యాలు లేకుండా పోతాయి అని తిరుమలగిరి స్వామి శపిస్తే, దానికి ప్రతిగా నీ కోనేరు సతతం పాచిపట్టి, భక్తుల పవిత్ర స్నానాలకు, నీ అభిషేకాలకు పనికి రాకుండా పోతుందని మల్లయ్య తిరుగు శాపం ఇచ్చాడు. దాంతో ఇక్కడి కోనేరు పాచిపట్టిన నీటితో పచ్చగా వుంటుంది.  అలాగే,  హైదరాబాదు, విజయవాడ జాతీయ రహదారిలో చిల్లకల్లు దాటిన తర్వాత కుడి వైపు కొంగర మల్లయ్య గుట్ట,  దానిపై  గుడి చాలా ఎత్తులో వుంటుంది. అంత ఎత్తులో వుండడం వల్ల ఆ గుడిలో నిత్య పూజలు, పునస్కారాలు వుండవు. చిన్నతనంలో బెజవాడ బస్సులో  పోతూ  ఈ కొండ కనిపించినప్పుడల్లా నాకు మా పెద్దలు చెప్పిన ఈ కధ గుర్తుకు వచ్చేది. ఇందులో నిజానిజాలు ఎంత అన్నది చెప్పేవాళ్ళు నాకు తారసపడలేదు.

కొన్ని దశాబ్దాల తరువాత ఈ కొండపైకి నిటారుగా చిన్న మెట్ల వరుస నిర్మించారు. ఆ కొండ పైన టవర్ నిర్మించడానికి కేంద్ర టెలికాం శాఖ ఈ మెట్ల దారి నిర్మించింది. పైన గుడితో పాటు, టెలికాం టవర్ ని కూడా కిందనుంచి చూడవచ్చు. అయితే ధూపదీపవైవేద్యాలు జరుగుతున్నాయా లేదా అనే విషయంలో నాకు నిర్దిష్టమైన సమాచారం లేదు. తిరుమలగిరిలో పాచి కోనేరు మాత్రం ఇప్పటికీ అలాగే వుంది.

వెంకటేశ్వరస్వామి మా ఇలవేలుపు అని చెప్పాకదా! మా కుటుంబంలో పిల్లల అన్నప్రాసనలు, పుట్టు వెంట్రుకలు అన్నీ తిరుమలగిరి స్వామి సన్నిధిలోనే జరిపేవారు. అదొక సాంప్రదాయంగా మారింది. 

మా రెండో అన్నగారు రామచంద్రరావు గారి పెద్ద పిల్లవాడు జవహర్ లాల్, మూడో కుమారుడు లాల్ బహదూర్ ల వివాహాలు తిరుమలగిరిలోనే జరిగాయి. పెద్ద కోడలు రేణు మా రెండో అక్కయ్య కుమార్తె. అలాగే లాల్ బహదూర్ పెళ్లాడింది మా మేనల్లుడు కొమరగిరి రామచంద్రం ఏకైక కుమార్తె దీప. ఒకే కుటుంబానికి చెందిన రెండు కుటుంబాలు కలిసి చేసిన పెళ్ళిళ్ళు కాబట్టి ఆడపిల్లవాళ్ళు, మగపిల్లవాళ్లు అనే తేడా లేకుండా హాయిగా అందరం ఒక తీర్ధయాత్రకు వెళ్లి వచ్చినట్టు, మరో విధంగా చెప్పాలి అంటే ఓ పిక్నిక్ కు వెళ్లినట్టు, అతి నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్ళిళ్ళలోని మాధుర్యాన్ని ఆడుతూ పాడుతూ ఆస్వాదించాము. బయటవారు అంటూ ఎవరూ లేరు, బెజవాడ నుంచి వచ్చిన మండ్రాజుపల్లి అయ్యగారి వంటమనుషులు తప్ప. వధూవరుల దగ్గరి స్నేహితులు కూడా ఎవరూ లేరు. కాకపోతే, ఖమ్మంలో వధువు బాల్య స్నేహితురాలు తిరుమల అనే అమ్మాయి, కధాచిత్ గా పెళ్ళికి ముందు రోజు సాయంత్రం మా బావగారి ఇంటికి రేణుని చూడడానికి వెడితే ఇంటికి తాళం వేసి వుంది.  అందరూ రేణు పెళ్ళికి తిరుమలగిరి వెళ్ళారు అని ఎవరో చెబితే, నేను లేకుండా రేణు పెళ్ళా అంటూ  మొగుడ్ని అప్పటికప్పుడు పట్టుబట్టి ఒప్పించి పిలవని పేరంటం అని భేషజాలకు పోకుండా నైట్ బస్సులో అర్ధరాత్రి ప్రయాణం చేసి చిల్లకల్లులో దిగి కాలినడకన ముహూర్తం టైముకి  తిరుమలగిరి చేరుకుంది. వాళ్ళని చూసి  పెళ్లి కూతురే కాదు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయి స్నేహానికి ఇచ్చిన విలువను అంతా మెచ్చుకున్నారు.

ఇక ఒక ఇంటి వేడుకలా జరిగిన పెళ్లి ఏర్పాట్లను వధువు సోదరులు, స్వయంగా కళా హృదయం కలిగిన మా మేనల్లుళ్లు రాంబాబు, లచ్చుబాబు (ఫేస్ బు క్ లో పేరు   కొలనరావు) భుజాలకు ఎత్తుకున్నారు. ప్రతి విషయంలో నవ్యత్వం కనిపించాలని పడ్డ తాపత్రయం అంతా ఇంతా కాదు. తండ్రి లేని లోటు ఎక్కడా కనపడకూడదని, మేనరికం పెళ్ళే కదా అని, అందులోను  పిల్లవాడి తండ్రి పేచీలు పెట్టని మన మేనమామే కదా అని  తేలికగా తీసుకోకుండా వున్నంతలో ఏలోటు లేకుండా పెళ్లి జరిపించారు. మా బావగారు లేనందువల్ల మా పెద్ద మేనల్లుడు, నా బాల్య స్నేహితుడు రాజన్న (కొలిపాక రాజేంద్రప్రసాద్) గీత  దంపతులు, 1995 ఫిబ్రవరి అయిదో తేదీన జరిగిన ఆ పెళ్ళిలో  కన్నెధార పోశారు. హైదరాబాదులో వున్న బంధువులం అందరం ఒక బస్సులో బయలుదేరి పెళ్ళికి వెళ్ళాం. ఎదురుబదురుగా రెండు సత్రాలు. ఒక దానిలో ఆడపెళ్లి వాళ్ళు, రెండో దానిలో మగపెళ్లి వాళ్ళు. అవి పేరుకు మాత్రమే.  కానీ ఒకే కుటుంబం కావడం వల్ల ఎవరు ఎక్కడ అనే తేడా కానరాలేదు. పెళ్లి కొడుకు పేరు జవహర్ కనుక నెహ్రూకు ఇష్టం అయిన ఎర్ర గులాబీలతోనే, స్వామివారి గుడికి వెళ్ళే దారిలో ముఖ ద్వారానికి ఎదురుగా వున్న కళ్యాణ మంటపాన్ని అలంకరించారు. వధువు పూలజడపై వధూవరుల పేర్లు వచ్చేట్టు పూలను అల్లారు. పెళ్లి పీటల మీదకు వధువును మేనమామలు తీసుకువచ్చే బుట్టను విచ్చుకున్న తామరపువ్వులాగా తయారు చేశారు. వధువు అరచేతుల్లో వుండే కొబ్బరి బొండాంను ముత్యాలతో అలంకరించి దానిపై వధూవరుల పేర్లు రాసారు. అలాగే వారి నడుమ పట్టుకునే అడ్డు తెరపై  లచ్చుబాబు,  బాపూ లిపితో ‘వంగి వంగి చూడమాకు మేనబావా!’ అని రాశాడు. ఈవెంట్ మేనేజ్ మెంట్లు వచ్చిన ఈ రోజుల్లో ఇలాంటివి కొత్త కాకపోవచ్చు కానీ పాతిక ముప్పయ్ ఏళ్ళ క్రితం చూసేవారికి కొత్తగానే వుండేవి.

పెళ్లి ముహూర్తానికి ముందు వధువు తాలూకు వాళ్ళు, వారి వెనుకనే మేము మెట్లదారిలో బయలు దేరాము కానీ మధ్యలో అందరం కలగలిసిపోయాం. పెళ్లిని ఎంత సింపుల్ గా చేయవచ్చో, నాలుగు కాలాలపాటు గుర్తుండిపోయే విధంగా ఎలా చేయవచ్చో ఈ పెళ్ళికి వెళ్ళిన వాళ్లకు తెలిసివచ్చేలా ఈ పెళ్లి జరిగింది.

మళ్ళీ మూడేళ్ల తరువాత 1998లో రెండో అన్నయ్య రామచంద్రరావు గారి మూడో కుమారుడు లాల్ బహదూర్ వివాహం కూడా ఇంతే సింపుల్ గా తిరుమలగిరిలోనే జరిగింది. (మా అన్నయ్యకు నలుగురు కుమారులు. జవహర్ లాల్, సుభాష్ చంద్ర బోస్, లాల్ బహదూర్, రాజేంద్ర ప్రసాద్) వధువు మా  ఐదో అక్కయ్య అన్నపూర్ణక్కయ్య మనుమరాలు, మా మేనల్లుడు కొమరగిరి రామచంద్ర మూర్తి , కరుణ దంపతుల కుమార్తె దీప. ఈ పెళ్ళిలో కూడా ఆడ, మగ పెళ్లివాళ్ళు  అనే తేడా లేదు. అందరూ అమ్మమ్మ సంతానమే. బయటివాళ్ళు, స్నేహితులు లేరు. అరుపులు, విరుపులు లేవు,  అలకలు లేవు. ఆడంబరాలు లేవు. ఇచ్చిపుచ్చుకోవడాలు అసలు ఇంటావంటా లేవు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే సింపుల్ దాన్ ది వర్డ్ సింపుల్.

మా మేనల్లుడు శ్రీరామచంద్రమూర్తి విశాఖ గ్రామీణ బ్యాంకులో సీనియర్ అధికారిగా పనిచేసి వీ ఆర్ ఎస్. తీసుకున్నాడు. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు ఆ బ్యాంక్ చైర్మన్ గా పనిచేశారు. వాళ్ళ ఇళ్లు శ్రీకాకుళంలో పక్కపక్కనే ఉండేవి. రామచంద్రం కుమార్తె దీప అప్పటికి చాలా చిన్న పిల్ల. మూడు చక్రాల సైకిల్ వేసుకుని మా అన్నయ్య గారి ఇంటికి వెడుతుండేది. ఆ ఆమ్మాయిని చూసి మా వదిన గారు, రావే అమ్మా! ఎప్పటికైనా మా ఇంటికి రావాల్సిన దానివే కదా! అనేదిట. ఆ మాటే నిజమైంది. తరువాత మా అన్నగారు అమెరికాలో స్టేట్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్  గా పనిచేసి, ఇండియా తిరిగి వచ్చిన తరువాత మద్రాసులో ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న రోజుల్లో దీపను తన ఇంటి కోడలుగా చేసుకుంటాను అని కబురు చేశారు. సంబంధం  నిశ్చయం చేసుకునే ముందు కూడా  అన్నగారు, వదిన గారు పిల్లని చూస్తామని మాటమాత్రంగా కూడా  అనకపోవడం తమకు ఎంతో ఆశ్చర్యం కలిగించిందని  దీప తల్లి కరుణ గుర్తు చేసుకుంది. మా అమ్మ నాన్నల వివాహ సమయంలో కూడా అప్పటి పెద్దవాళ్లు  కుటుంబ సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చిన సంగతి నాకు గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు చూడడం తప్పిస్తే, మళ్ళీ పెళ్లిలోనే వాళ్ళు  దీపను చూడడం. పెళ్లికూతురిగా పెళ్లి పీటల మీద తనను మొదటిసారి చూసినప్పుడు అత్తయ్య, తన జడ చూసి ఎంత బాగుందో అనడం తనకు గుర్తుండిపోయిందని దీప చెబుతూ వుంటుంది. అప్పుడు తను వున్న పరిస్థితుల్లో అమ్మాయికి పది రోజుల్లో పెళ్లి చేయడం తనకు చేతకాని వ్యవహారం అయినా, త్యాగయ్యకు (త్యాగరాజ స్వామి) కూతురు వివాహం చేయడంలో దైవసహాయం లభించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు అనే త్యాగరాయ కృతిని గురించి  రామచంద్రం నాతో చెబుతుండే వాడు.

ఈ పెళ్ళిళ్ళు జరిగి పాతిక ముప్పయ్యేళ్లు దాటింది. రేణు, జవహర్ దంపతులు, దీప, లాల్ దంపతులు ఇరు కుటుంబాల నడుమ మాట రాకుండా,  హాయిగా పిల్లాపాపలతో కాపురాలు చేస్తున్నారు. పిల్లలు విదేశాల్లో సెటిల్ అవుతున్నారు. వీటన్నిటికీ  దైవసన్నిధిలో పెళ్ళిళ్ళు జరగడం ఒక కారణం కావచ్చు, కానీ ఆ మనుషుల మంచితనమే వారికి శ్రీరామరక్షలా కలిసివచ్చిందనేది నా అభిప్రాయం.

 

కింది ఫోటోలు:


తిరుమలగిరి గుట్ట వద్ద రేణు, జవహర్  పెళ్ళి


తిరుమలగిరి గుట్ట వద్ద దీపలాల్ పెళ్లి 


ఒకప్పుడు తిరుమలగిరి మెట్లు ఎక్కుతూ మా ఆవిడ నిర్మల, మా వదిన గారు విమల





(ఇంకావుంది)

1 కామెంట్‌:

  1. అయ్యబాబోయ్, తిరుమలగిరి గుడి పరిసరాల గురించి చదువుతుంటేనే భయంగా ఉంది కదండి. నా బాల్య సంస్కారాలు నందిగామ దగ్గరే ఉన్న వేదాద్రి నరసింహ స్వామి గుడిలో జరిగాయ (మా తండ్రిగారు అప్పట్లో అంటే 1950ల్లో నందిగామ తహసీల్దార్ గా పని చేస్తుండడం కారణం అయ్యుండచ్చు). మరి అప్పట్లో వేదాద్రి పరిసరాలు కూడా అలాగే ఉండేవేమో తెలియదు - నాకు గుర్తు లేదు.

    ఏమయినప్పటికీ మీరు అందిస్తున్న అలనాటి జీవనవిధానం విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి