నా మానాన నేను పాత పాటలు వింటూ, పాత సినిమాలు చూస్తూ ఏదో ఉబుసుపోక రాతలు రాసుకుంటూ వుంటే ఫోన్ మోగుతుంది. హెచ్ పీ గ్యాసా అంటుంది అవతల గొంతు. మొదట్లో తెలియక అమాయకంగా అవునండీ మాది హెచ్ పీ గ్యాసే అంటాను. మా సిలిండర్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది ఆ గొంతు. గొంతులో పచ్చి వెలక్కాయ పడి, అప్పుడు వెలుగుతుంది లైటు. అబ్బే ఇది గ్యాస్ ఏజెన్సీ కాదండీ పర్సనల్ నెంబరు అని పెట్టేస్తే, మళ్ళీ ఫోన్ మోగుతుంది. మళ్ళీ అదే గొంతు. అలా పెట్టేస్తారేమిటి, గూగుల్ సెర్చ్ లో ఇదే నెంబరు వుంది. కాదంటారేమిటి అని డుబాయిస్తుంది. ఇలా రోజుకు ఒకసారి కాదు, అనేకసార్లు. ఆరు నెలల నుంచి ఇదే తంతు. గొంతు మాత్రం మారుతుంటుంది. ఒక్కోసారి చికాకు వచ్చి ఫోన్ చేసిన వాళ్ళ మీద చీకాకు పడతాను. తర్వాత జాలి కూడా పడతాను. గ్యాస్ కోసం వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. రాంగ్ నెంబర్ కావచ్చు. అవసరంలో వుండి ఫోన్ చేస్తున్నారు. పోనీలే అనుకుంటే పోనుకదా! నాకొచ్చిన ఇబ్బంది ఏముంది. రాంగ్ నెంబర్ అని మర్యాదగా చెబితే వచ్చిన నష్టం ఏముంది. ఇలా కాసేపు పశ్చాత్తాపపర్వం నడుస్తుంది. ఇంతలోనే మరో ఫోన్. హెచ్ పీ గ్యాసా! నాలోని బుద్దుడు మాయమైపోతాడు. మళ్ళీ సీను రిపీట్.
ఈరోజు
మళ్ళీ అలా ఇప్పటికి మూడో ఫోను. ఇక వేరే దారి లేక కౌన్సెలింగ్ మొదలు పెట్టాను.
‘చూడండి.
నేను మీలాగే హెచ్ పీ గ్యాస్ కన్స్యూమర్ ని. ఏజెన్సీ నడపడం లేదు. ఈ మధ్య గ్యాస్
బుకింగ్ విధానం సులభతరం చేశారు. 96660 23456 నెంబరుకు ఫోన్ చేయండి. ఒకటి నొక్కితే...’
నా మాట పూర్తికాకమునుపే అవతల గొంతు నా గొంతుకు అడ్డం
పడింది.
‘ఇవన్నీ మాకూ తెలుసు. ఇలా చేయాలి అంటే ముందు మా ఫోన్,
కన్స్యూమర్ నెంబరు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ కనెక్షన్ మా పేరుతొ లేదు. గూగుల్
సెర్చ్ లో నెంబరు చూసి చేసేది ఇందుకే’
నాకు కళ్ళు తెరిపిళ్ళు పడాలి. కానీ పిడికిళ్ళు
బిగుసుకున్నాయి ఆ జవాబుతో. కోపంతో కట్ చేశాను.
నాలోని తథాగతుడు మేలుకుని హితవు చెప్పడంతో మళ్ళీ
కంప్యూటర్ లో తల దూర్చాను.
ఈసారి ఎక్కువ వ్యవధానం లేకుండానే ఫోన్ మోగింది. ‘హెచ్ పీ
గ్యాసా!’
నేనూ ఈ సారి రూటు మార్చి నిదానంగా చెప్పాను. కాదండీ
అన్నాను వినయంగా. ఒక విషయం చెప్పండి అని అడిగాను మరింత వినమ్రంగా. ఈ నెంబరు గూగుల్
సెర్చ్ లో దొరికింది అంటున్నారు. ఏమీ అనుకోకపోతే ఆ స్క్రీన్ షాట్ నా ఈ నెంబరుకు
పంపిస్తారా శ్రమ అనుకోకుండా’
ఇంత మన్ననగా కోరేసరికి అతడు సరే అన్నాడు. సరేతో
సరిపుచ్చకుండా పంపాడు.
అది చూసి ఆశ్చర్యపోవడం నా వంతయింది. ఒక్క అంకె తేడా
లేకుండా అది, పాతికేళ్ళుగా నా పేరు మీద
బిల్లులు కడుతూ నేను వాడుతున్న నా నెంబరే!
ఏమిసేతురా లింగా!
12-11-2024
కింద అతడు పంపిన స్క్రీన్ షాట్
2 కామెంట్లు:
ఆ మధ్య వినరా వారు మీ ఫోన్ నెంబర్ అడిగారండి;
ఇంత నాజూకుగా మీ ఫోన్‌నెంబర్ వారికి తెలియబరచడం ముదావహం.
జేజేలు మీకున్నూ వినరా వారికున్నూ :)
BTW,
మేము ట్రై చేసామండి గూగులు సెర్చ్ రావడం లే మీ నెంబరు :)
శుభోదయం.
“జిలేబి” గారు, పక్కవాళ్ళ మీద తోసెయ్యక పోతే మీకు తోచదా? భండారు వారి ఫోన్ నెంబర్ నాకెప్పటి నుంచో తెలుసు, నేను ఇక్కడ అడగడమేమిటి !
(పైన “వినరా” అని మీరన్నది నా గురించే అనుకుంటున్నాను.)
కామెంట్‌ను పోస్ట్ చేయండి