ఫోటో ఏముంది? తీసినవాళ్ళ పనితనాన్ని బట్టి దాని గొప్పతనం.
ఈ ఫొటో తీసింది ఆషామాషీ ఫోటోగ్రాఫర్ కాదు. ఆకాశవాణిలో తన స్వరంతో, ఫేస్ బుక్ లో తన కలంతో ఆకట్టుకుంటున్న ప్రముఖ రేడియో న్యూస్ రీడర్ తురగా ఉషారమణి.
ఎనిమిదేళ్ళ క్రితం నేను నా పుట్టిల్లు రేడియో స్టేషన్ కు వెళ్ళినప్పుడు తన మొబైల్ తో క్లిక్ అనిపించింది. బాగా తీసావమ్మా అంటే జీవితాంతం గుర్తు పెట్టుకునే ఓ సర్టిఫికెట్, నాకు మరో గుర్తుగా ఇచ్చింది. పోలికలో ఉత్ప్రేక్ష అనిపిస్తే మన్నించండి. శ్రీ శ్రీకి చలం యోగ్యతాపత్రం లాగా భావిస్తా. అదే ఇది.
"సందర్భం వచ్చింది కాబట్టి:
నాకు శ్రీనివాస రావు గారు నేను చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి తెలుసు. తెలియడమే కాకుండా నేను ఆయనని తరచూ చూస్తూ వచ్చాను. కనీసం వారానికి ఒక సారి అన్నంత తరచుగా. ఆయన 35 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అది అందరికీ కనిపిస్తున్నదే.
ఆయన చాలా ఫొటోజెనిక్. ఫొటోజెనిక్ అంటే కెమెరాకి సరిపడే లుక్స్ అనే కాదు. పోర్ట్రయిట్ ఫొటోస్ తీయడం ఎక్కువగా ఇష్టపడే నాకు ఆయనలో రెండు మూడు విలక్షణమైన అంశాలు కనిపిస్తాయి. ఒకటి, స్పాంటేనిటీ. అంటే చటుక్కున ముఖంలోకి నవ్వు వచ్చేస్తుంది. కళ్ళల్లో కూడా ఆ నవ్వు reflect అవుతుంది. రెండు comfort. అంటే ఏ ఒక్క క్షణంలోనూ, పరధ్యానంగా ఉన్నా, అలెర్ట్ గా ఉన్నా ఆయన అంతే relaxed గా ఉంటారు. మనసులో ఆలోచనల్లో అలజడి లేదన్న విషయం ఆయన face లో ప్రతిఫలిస్తుంది. మూడోది involvement. శ్రీనివాస రావు గారు జనాలతో ఉన్నప్పుడు తన సొంత గోల కాక అవతలి వాళ్ళ మీద దృష్టిపెట్టి, వాళ్ళ మాటలు ఆసక్తితో వింటూ, participate చేస్తుంటారు. దానితో అసలు ఈ కెమెరా గొడవ ఆయనకీ పట్టదు. These are the traits which make him a great subject for portraits any time and in any light. ఫోటో తీసే వాళ్ళు కూడా 'ఆహా, భలే తీసానే' అనుకునేట్లు. :)
నా observations. కాదంటే చెప్పండి."
అని సవాలు విసురుతోంది పైగా.
ఎంతయినా నా గురుపత్ని తురగా జానకీరాణి గారి అమ్మాయి కదా!
థాంక్స్ ఉషా!
తోకటపా:
చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల్లో రామప్ప గుడికి ఎక్స్ కర్షన్ కు తీసుకు వెళ్ళారు. ఆ రోజుల్లో కెమెరా అంటే ఎంతో అపురూపం. ఒక్క ఫొటో దిగితే చాలు జీవితం ధన్యం అనుకునే కాలం.
కొందరు ఫారెన్ టూరిస్టులు అక్కడ ఫోటోలు దిగుతున్నారు. అందులో ఒక దాంట్లో నేను పడ్డాను అని నా నమ్మకం. ఆ ఫొటో చూసుకునే అవకాశం ఈ జన్మకు వుండదు అని తెలిసికూడా, జన్మకు సరిపడా మురిసిపోయాను.
చిన్నతనపు అజ్ఞానంలో కూడా ఎంతో మధురిమ వుంటుంది.