31-12-2005
నేను కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైర్ అయిన తేదీ ఇది.
అవీ ఇవీ అన్నీ కలిపి కొంత సొమ్ము రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కింద నా బ్యాంకు ఖాతాలో అదే రోజున జమచేసారు. అదే రిటైర్మెంట్ మర్నాడు జనవరి ఒకటిన అయివుంటే ఈ మొత్తం, నా పెన్షన్ రెండూ రెట్టింపు అయ్యేవేమో. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను కనీవినీ ఎరుగని విధంగా అప్పటి పే కమిషన్ పెంచిన సిఫారసులు 2006 జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి. పన్నెండు గంటల తేడాతో అంత గొప్ప శాశ్వత ఆర్థిక ప్రయోజనాన్ని నేను కోల్పోయాను.
దీనికి ఎవరినీ తప్పుపట్ట లేము. ప్రాప్తం అంటారు. గోదావరిలో ఎన్ని నీళ్ళు వున్నా, బిందె తీసుకువెళ్ళిన వాడికి బిందెడు నీళ్ళు, గిన్నె తీసుకువెళ్ళిన వాడికి గిన్నెడు నీళ్ళు. ఎంత ప్రాప్తం వుంటే అంతే.
ఉద్యోగం చేసినన్నాళ్ళు ప్రతినెలా ఇంటి ఖర్చుల కోసం ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఎంతో కొంత తీసుకునేవాడిని. అవన్నీ లెక్కకట్టి నీకు ఇవ్వాల్సింది ఇంతే అని లెక్క తేల్చారు. చివరి పదేళ్లు స్టేట్ గవర్నమెంట్ క్వార్టర్ లో వున్నా కనుక ఆ పదేళ్ల అద్దె బకాయిలు, మంచి నీళ్ళ సరఫరా బకాయిలు ఒకే మారు మినహాయించారు. అలాగే ఉద్యోగ పర్వంలో కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ అధికారిని అనే గర్వంతో తెలిసీ తెలియకుండా ఇతరులకు పూచీకత్తు సంతకాలు పెట్టి ఇప్పించిన అప్పు బకాయిలు ఇవన్నీ పోను రెండు లక్షలు తేల్చారు . నాకయితే అంత పెద్ద మొత్తం కళ్ళ చూడడం జీవితంలో అదే మొదటిసారి. రిటైర్ అవడంలో ఇంత ఆనందం వున్నదా అని తొలిసారి అనిపించింది కూడా అప్పుడే.
ఇంటికి రాగానే ముందు మా ఆవిడకు చెప్పాను. రేపు రెడీగా వుండు బయటకు పోదాం అని. మర్నాడు ఆటోలో పంజాగుట్ట సర్కిల్ లోని ఓ నగల దుకాణానికి తీసుకువెళ్లాను. వెళ్లి చాలా గొప్పగా, పదిహేను నిమిషాలు టైం ఇస్తున్నాను. లక్ష రూపాయలు ఖరీదు చేసే ఏ నగ అయినా కొనుక్కో అన్నాను.
ఆమె పది నిమిషాల్లో పదివేలు ఖరీదు చేసే ఒక ఉంగరం కొని నా చేతికి తొడిగింది.
నీకు ఏమీ అక్కరలేదా అన్నాను.
" మీకొక ఉంగరం కొనాలి అనేది నా చిరకాల కోరిక. ఒకసారి కొంటే మీరు రైల్లో పారేసుకున్నారు. అందుకే ఈ ఉంగరం. మీ చేతికి వుంటే నాకు వున్నట్టే."
బుర్ర తిరగడం అంటే ఏమిటో నాకు అప్పుడు అనుభవంలోకి వచ్చింది.
మా ఆవిడ అమ్మగారి తాలూకు బంగారం అంతా ఇన్నేళ్ల కాపురంలో నేను హారతి కర్పూరం చేసాను. అయినా అదేమీ పట్టించుకోకుండా నాకు ఉంగరం కొన్నది.
బుర్ర తిరక్క ఏమవుతుంది.
ఇప్పటికీ ఆ ఉంగరం వుంది. నా వేలుకి లేదు. మనసులో వుంది.
ఆమె పోయినప్పటినుంచి దాన్ని వేలుకి పెట్టుకోవాలి అంటే మనస్సు చివుక్కుమంటుంది.
అలా కాకపోతే నేను మనిషినే కాదు.
తోకటపా :
నాకు ముగ్గురు మనుమరాళ్ళు. ఎవరో ఒకరి వేలికి ఆ బామ్మ ఉంగరం సరిపోయేదాకా నేను వుండాలని మరో కోరిక.
ఇప్పుడే 79 లో పడ్డాను.
మరీ అంత అత్యాశా!