24, మార్చి 2014, సోమవారం

ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు గారి వ్యవహారశైలి

నేను 1975 లో పుట్టి 1985 లో చనిపోయాను. 
అంటే ప్రభలు విరజిమ్మిన విలేకరిగా నా జీవితం అంతలో ముగిసిందన్నది నా కవి హృదయం. విలేకరిగా ఒక వెలుగు వెలిగింది నిజానికి ఆ పదేళ్లే..
రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో. జనం నమ్మినా నమ్మకున్నా, ఆదరించినా ఏవగించుకున్నా వార్తలకోసం రేడియో వినక తప్పని పరిస్తితి. పత్రికలపై సెన్సార్ షిప్ వుండేది. ప్రతి రోజూ వార్తల కంపోజింగ్, పేజీ మేకింగ్ పూర్తయిన తరవాత సమాచారశాఖ అధికారికి చూపించి ఏవార్త వుంచాలో, దేనిని తీసివేయాలో అనుమతి తీసుకోవాల్సిన పరిస్తితి. సెన్సార్ అయిన వార్తల స్తానంలో అప్పటికప్పుడు కొత్తవార్తలను పెట్టే వీలుండదు కాబట్టి ఆ ఖాళీని అలాగే వుంచేసి పత్రికలను ప్రింట్ చేసేవారు. సెన్సార్ పట్ల పత్రికల అసమ్మతిని పాఠకులకు పరోక్షంగా తెలియపరచడానికి కొంతవరకు  'ఆ ఖాళీ పేజీలుఉపయోగపడ్డాయి. ప్రభుత్వం కావాలని కొన్ని వార్తలు ప్రచురణ కాకుండా అడ్డుకుంటోదన్న అభిప్రాయం ఆ ఖాళీలను చూసినప్పుడు ప్రజలకు సహజంగా కలిగేది. రాజకీయంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కొన్ని పత్రికలు కావాలని కొన్ని పేజీలను ఖాళీగా వుంచేసి ప్రజల్లో దురభిప్రాయం పెంపొందింప చేస్తున్నాయన్న అనుమానం రాగానే, అలా ఖాళీలతో పత్రికలు ప్రచురించరాదని సర్కార్ హుకుం జారీ చేసింది. ఈ నేపధ్యంలో నాకు హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం వచ్చింది. 1975 నవంబర్ 14 తేదీన అందులో చేరాను.


(జలగం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక సభలో మాట్లాడుతున్న వై ఎస్ ఆర్)  
అప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు. సమర్దుడయిన పాలకుడిగా పేరు. ఎమర్జెన్సీ ఆయనకు కలసివచ్చింది. రాజకీయంగా ఎదురు లేకపోవడం, లేనిపోని విమర్శలకు ఆస్కారం వుండకపోవడం, ప్రభుత్వ అధికారులు, సిబ్బందీ భయభక్తులతో నడుములు వంచి బుద్ధిగా పనిచేయడం - ఇవన్నీ ముఖ్యమంత్రిగా ఆయనకు కలసివచ్చిన అంశాలు.
వెంగళరావు గారు ఖమ్మంజిల్లా పరిషత్ అద్యక్షుడిగా వున్నప్పటినుంచే అధికారులతో మంచిగా వుంటూ పనులను త్వరత్వరగా పూర్తి చేయించడం నాకు తెలుసు. ముఖ్యమంత్రి అయిన తరవాత ఆయన ఇదే విధానాన్ని కొనసాగించారు. త్వరితగతిన పూర్తయ్యే చిన్న, మధ్య తరహా సేద్యపు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. శంకుస్థాపన చేసిన చేతులతోనే ఆయన ఆయా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడం కళ్ళారా చూసాను. గ్రామాల్లో చెరువులకు మరమ్మతులు సకాలంలో చేయిస్తే రైతులకు అవసరమయిన తరుణంలో సాగు నీటి కొరత లేకుండా చేయవచ్చని ఆయన చెబుతుండేవారు. చెప్పిందే చేసి చూపెడుతూవుండేవారు. ఆయన కేంద్రమంత్రిగా, పీసీసీ ప్రెసిడెంటుగావున్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఓసారి జరిపిన పర్యటనలో నన్ను ఆయన తన కారులోనే వెంటబెట్టుకుని తీసుకు వెళ్లారు. నా మేనల్లుడు కౌటూరి దుర్గాప్రసాద్ ఆ రోజుల్లో ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఖమ్మం జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి పనుల్లో ప్రతి ఇటుక మీదా తన పేరే రాసివుంటుందని వెంగళరావు గారు సగర్వంగా చెప్పుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు.
వెంగళరావుగారి వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. పంజాగుట్ట - ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి బయలుదేరారంటే చాలు - గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా రోజూ ఒకే సమయానికి బయలుదేరడం, తిరిగి ఇంటికి చేరడం వెంగళరావు గారికే చెల్లింది. తదనంతర కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమే కానీ కానీ నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఈ నియమాన్ని ఎన్నడూ వొదులుకోలేదు. హైదరాబాద్ పొలిమేరల్లోవున్న ఫాం హౌస్ కు వెళ్లడం, తిరిగి రావడం అంతా కూడా అయిదు నిమిషాలు అటూ ఇటూ తేడా లేకుండా ప్రతి రోజూ ఒక నియమిత సమయంలో జరిగేలా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. వెంగళరావుగారు చనిపోయినప్పుడు ఆయన దహన సంస్కారాలు ఆ తోటలోనే జరిపారు.
రేడియో విలేకరిగా వెంగళరావుగారి పద్దతులు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటె, ఆయన విలేకరుల సమావేశాలను చాలా క్లుప్తంగా ముగించేవారు. రేడియో వార్తలకు తప్ప ఆ రోజుల్లో మరెవరికీ టైం కు సంబంధించిన డెడ్ లైన్లువుండేవి కావు. చెప్పాల్సింది చెప్పేసి, లేచి నిలబడి - మంచిది వెళ్ళిరండిఅనేవారు. విలేకరులతో మాట్లాడే ఆ కొద్దిసమయంలో కూడా రొటీన్ ఫైల్స్ పై సంతకాలు పెడుతూనే వుండేవారు. అలాగని ఆయనకు విలేకరులతో సత్సంబంధాలు లేవని కాదు. జ్యోతి వెంకట్రావు గారు, హిందూ రాజేంద్రప్రసాద్ గారు వంటి వారితో తానే స్వయంగా ఫోనుచేసి మాట్లాడడంనాకు తెలుసు.
వెంగళరావు గారితో నాకో చిన్న పర్సనల్ టచ్ వుంది.
బెజవాడ నుంచి హైదరాబాద్ వచ్చానన్న మాటే కానీ ఇక్కడి ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే రెంట్ కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుని ఆ కాపీ ముఖ్యమంత్రికి ఇచ్చాను. గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి పలానా ఇంటిని స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి ఎగురుకుంటూ వెళ్ళాము.. అప్పుడు మేము అద్దెకు వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద ఇల్లు. కిరాయి మాత్రం అందులో నాలుగోవంతు కూడా లేదు. ఆహా ఏమి అదృష్టంఅనుకునే లోపల భోరున ఏడుపులు వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తె అధికారులు తొందరపెడుతున్నారు. అటు చూస్తె వాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని అధికారులతో చెప్పాము. ముఖ్యమంత్రి పేషీ తో వ్యవహారం కుదరదంటే కుదరదన్నారు.  చివరికి ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.

గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావుగారు అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ఇల్లు వసతిగా వుంది కదా!అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి వూరుకుండేవాడిని. (09-09-2010)

కామెంట్‌లు లేవు: