ఒకటి పక్కన పన్నెండు
సున్నాలు అంటే ఇంగ్లీష్ లో ‘ట్రిలియన్’ అంటారు.
సంఖ్యలని లెక్కపెట్టడానికి
మిలియన్, బిలియన్, ట్రిలియన్
ఇలా లెక్కించే విధానం పాశ్చాత్య దేశాల్లో
అమల్లో వుంది. నాలుగు ట్రిలియన్లు అంటే నాలుగు పక్కన పన్నెండు సున్నాలు పెట్టాలి. పాతిక సున్నాలు అంటే
ఎనిమిది ట్రిలియన్లకంటే ఎక్కువ. ఈలెక్క దేనికంటే ఇలా వచ్చిన ఈ సంఖ్య ప్రపంచ దేశాలలోని జనాలు పరస్పరం పంపుకున్న ‘ఎస్
ఎం ఎస్’ లకు సమానం కాబట్టి.
ఇదొక
లెక్కమాత్రమే. అసలు లెక్క ఇంకాస్త ఎక్కువే కానీ ‘సున్నాల’ గందరగోళం
ఎక్కువై అసలు ‘విషయం’ గుండు
సున్నా అవుతుందేమోనని ఇవ్వడం లేదు.
పల్లెటూళ్ళకు కూడా పాకిన ఈ ‘ఎస్ ఎం ఎస్’ ల
కధాకమామిషూ ఏమిటో ఓసారి చూద్దాం.
ఈ
శతాబ్దంలో అత్యంత వేగంగా నేలనాలుగు చెరగులనూ చుట్టబెట్టిన ఏకైక ఆధునిక పరికరం ఏమిటంటే
సెల్ ఫోన్ అని ఇట్టే చెప్పెయ్యొచ్చు. ఓ ఇరవయ్యేళ్ళ క్రితంవరకూ ఎవరికీ తెలియని
ఈ ‘బుల్లి పరికరం’ ఈనాడు ‘హస్తభూషణం’ గా
తయారయి కూర్చుంది. ‘ఇంటికి ఒక్క ఫోనే’ అబ్బురమనుకునే
దేశంలో – ఇంట్లోవున్న
నలుగురూ ‘నాలుగు ఫోన్లు – ఎనిమిది రింగులుగా ‘ కాలక్షేపం చేసే కాలం
వచ్చేసింది. కుటుంబ సభ్యుల నడుమ మాటా మంచీ తగ్గిపోయి – ముక్కూ మొహం తెలియని
వారితో మాటా మంతీ పెరిగిపోయింది.
ఇంకో లెక్క
ప్రకారం రెండేళ్ళ క్రితం మన దేశంలోని
మొబైల్ ఫోన్ ల సంఖ్య అమెరికాలో వాడే సెల్
ఫోన్లకంటే రెండు రెట్లు ఎక్కువ
(ట).
మొబైల్
ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడానికే కాదు, సందేశాలు
కూడా పంపుకోవడానికి కూడా వీలు
వుండడంతో వీటి గిరాకీ మరింత పెరిగిపోయింది. ఈ ఫోన్లు రంగప్రవేశం చేసిన తొలినాళ్ళలో
ఈ సౌకర్యం వుండేది కాదు. మొదట జర్మనీ, ఫ్రాన్స్
దేశాలు ఈ దిక్కుగా ఆలోచించాయి.
ఆ దేశాల ఫోన్ కంపెనీలు చేసిన కృషి ఫలితంగా –
1992 డిసెంబర్
మూడో తేదీన మొట్ట మొదటి ‘ఎస్
ఎం ఎస్ ‘ ఇంగ్లండ్
లోని నీల్ పాప్ వర్త్ అనే ఒక వ్యక్తి నుంచి వొడా
ఫోన్ ద్వారా వెళ్ళింది.
అప్పటినుంచి ఈ చిట్టి
పొట్టి సందేశాల ‘సాంకేతిక పిట్ట’ ప్రయాణం
ఎదురులేకుండా సాగిపోయింది.
అన్నిరకాల మొబైల్ ఫోన్ పరికరాలకు పనికివచ్చే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి
రావడంతో – ‘ఎస్ ఎం ఎస్’ ల
విశ్వవిహారం మొదలయింది. ఇంగ్లండ్ లో 2006 డిసెంబర్ లో
క్రిస్మస్ పండుగ సందర్భంగా – ఒకే
ఒక్కరోజున - యిరవై కోట్ల పైచిలుకు ‘ఎస్ ఎం ఎస్’లు - పండుగ శుభాకాంక్షలు
తెలుపుతూ - ‘ఫోన్లు
మారాయి.’
ఈ
లెక్కన ఈ లెక్కలు ఇప్పటికి ఎంతగా పెరిగాయన్నది లెక్కలు కట్టాల్సివుంది.
కానీ
ఇలాటి లెక్కలు తీసేవాళ్ళు చెప్పిన ఒక లెక్క ప్రకారం –
2006 నాటికే
ఈ ‘ఎస్ ఎం
ఎస్’ ల వ్యాపారం ప్రపంచ
వ్యాప్తంగా ఎనభై బిలియన్ డాలర్లు దాటిపోయింది.
అమెరికాలాంటి
దేశాల్లో వినియోగదారుల నుంచి ఒక్కొక్క ‘ఎస్.ఎం.ఎస్.’ కు
పదకొండు సెంట్లు వసూలు
చేస్తున్నారు. మరి ఈ ‘వసూలు రాజాల’ కు
ఇందుకయ్యే ఖర్చు ‘చిల్లి సెంటు’ కూడా
వుండదు. దీన్ని నిలువు దోపిడీ అనాలా లేక అదనపు సదుపాయం కల్పిస్తున్నందుకు
వసూలు చేస్తున్న ‘అదనపు’ చార్జీ
అనాలా! బియ్యం మిల్లు యజమానులకు ‘తవుడు’ అప్పనంగా
మిగిలినట్టే, ఈ కంపెనీలకు ఇదొక
అదనపు ఆదాయం.
ఇందులో ‘ఇంత’ వుంది
కాబట్టే – ఈ ‘ఎస్
ఎం ఎస్ ‘ ల
పేరుతొ ఇన్నిన్ని స్కీములు, ఇన్నిన్నిగేములు.
పేలాలు
పంచి పప్పులు దంచుకునేందుకు ఇంకెన్నో టక్కు టమారాలు.
‘పట్టుకుంటే పట్టు చీరె’ నుంచి ‘ఆటాడుకుందాం
రా’ వరకు అన్నే ‘ఎస్
ఎం ఎస్’ గేములే.
ప్రతి
టీవీ చానల్ లో ప్రతి అంశం మీదా ‘ప్రజాభిప్రాయసేకరణలే. ‘ఎస్
ఎం ఎస్’ లు పంపాలని
కోరని చానల్ తెలుగునాట కలికానికి కూడా కానరావడం లేదు.
పైగా
ఈ ‘ఎస్.ఎం.ఎస్.’ ల
కు వసూలు చేసే ఛార్జీ ఒకటికి నాలుగు రెట్లు ఎక్కువ. కానీ తియ్య
నీటికి చేపలు ఎగబడే చందంగా – ఎవరికివారు
పోటీలు పడి తమ ‘మొక్కుబళ్ళు’ చెల్లించుకుంటున్నారు.
ఎవరి బాగుకోసం ఇదంతా. ఎవర్ని బాగుచేయడం కోసం ఇదంతా.
బహుళ
జాతి కంపెనీల మీద నిలువెత్తున ఎగిరిపడే వాళ్ళు కూడా – చాపకింద నీరులా వ్యాపిస్తూ, సామాన్యుల
నడ్డి విరుస్తున్న ఈ ‘ఎస్ ఎం ఎస్’ – వ్యాపార
ధోరణులపై ఎందుకు చూపు సారించడం లేదో
ఆలోచించాల్సిన విషయం.
టీవీ
ఛానళ్ళు సయితం ఈ సంస్కృతిని ఎందుకు పెంచి పోషిస్తూ వున్నాయో, ఇందులోని వ్యాపార ‘మర్మం’ ఏమిటో
వెల్లడి చేస్తే బాగుంటుంది.కానీ ఇది జరిగే పనేనా!
‘తప్పులెన్నువారు తమ తప్పులు ఒప్పుకుంటారా!’
Courtesy Image Owner
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి