సూటిగా.........సుతిమెత్తగా..............
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 28-01-2016, THURSDAY)
‘సహిష్ణుత’ మన దేశ సంస్కృతిలో భాగమని
చెబుతారు. సహన శీలత శతాబ్దాల తరబడి దండలో దారంలాగా ఉంటూ వచ్చిందని విదేశీయులు
సయితం కితాబులు ఇచ్చారు. ఈ మాటలు పదేపదే చెప్పడం వల్లనో, అదేపనిగా వింటూ వుండడం
వల్లనో దేన్నయినా సహించడం, భరించడం భారతీయుల రక్తంలో కలిసిపోయింది. అయితే ఈ ‘సహిష్ణుత’కు
కూడా ఒక హద్దు వుందని, కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన ఈ దేశపు సహనశీలతకు కూడా తూట్లు పడుతున్నాయని ఇటీవలి పరిణామాలను
గమనించినప్పుడు అనిపిస్తోంది. అందుకే, ‘ఇవ్వాళ దేశానికి బాగా అవసరమైన దేమిటి?’ అంటే, ‘కాసింత సహనం’ అని వాకృచ్చాడొక పెద్దమనిషి.
సహన సంస్కృతికి పుట్టిల్లు అని
చెప్పుకునే మన దేశానికి ప్రస్తుతం దాపురించిన దుస్తితి ఇది.
హైదరాబాదు మహానగర పురపాలిక సంస్థకు
జరుగుతున్న ఎన్నికల ప్రచార యుద్ధంలో పేలుతున్న మాటల తూటాల నేపధ్యంలో ఈ విషయం
ప్రస్తావించుకోవాల్సి వస్తోంది.
ప్రచార పర్వంలో పాల్గొంటున్న రాజకీయ
పార్టీల నేతలు, తాము నగర అభివృద్ధికి ఏం చేయబోతున్నామో చెబితే ఎవరికీ అభ్యంతరంవుండదు. అల్లాగే గతంలో ఏం చేశారో ఆ ‘ప్రవర’ వల్లె వేసినా అక్షేపించాల్సింది
ఏమీ వుండదు. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నా ‘ఏదోలే! ఎన్నికల వేళ కదా!
పోనీలే’ అని విని వూరుకోవచ్చు. ఎదుటి పక్షం వాళ్ళపై దారుణమైన ఆరోపణలు చేసినా అంతకంటే వాళ్ళు చేసేది
ఏముందని, చెప్పేది ఏముందని సరిపెట్టుకోవచ్చు. కానీ, ప్రజల ఆహారపు అలవాట్లను
ప్రచారాస్త్రంగా చేసుకున్నప్పుడు మాత్రం ఎదురు బాణాలు వేయకతప్పదు. ఈ విషయంలో మిన్నకుండిపోవడం అంటే ఆ తప్పులో మనమూ భాగస్వాములం అయినట్టే.
మాటకు వున్న ‘పవర్’ ఏమిటో నేటి తరం రాజకీయ నాయకులకు బాగా తెలుసు. మాటను ఎలా తిప్పి ఒదిలితే అది
మీడియా దృష్టిని ఆకట్టుకుంటుందో వారికి వెన్నతో పెట్టిన విద్య. ఎలాటి మాటలు
రువ్వితే అవి సంచలనాన్ని సృష్టిస్తాయో వారికి కరతలామలకం. ఆ సంచలనాలు కలిగించే పెను
ముప్పులతో వారికి నిమిత్తం లేదు. అవి ప్రజల్లో ప్రేరేపించే భయసందేహాలతో వారికి
సంబంధం లేదు. వారి వార్త మీడియాలో పేలాలి. పేలుడు ఫలితాలు వారికి అక్కరలేని విషయం.
‘జిహ్వాగ్రే మిత్ర బాంధవావః జిహ్వాగ్రే బంధన ప్రాప్తి: జిహ్వాగ్రే
మరణం ధృవం’ అన్నారు. జిహ్వ అంటే నాలుక. ఇక్కడ నాలుక అంటే మాట. మాట వల్లనే స్నేహాలు, బాంధవ్యాలు. మాటను బట్టే మరణం కూడా. మాటకు వున్న అసలు శక్తి
ఇది. సంచలనాలు సృష్టించడం కాదు. ‘వెలది, జూదంబు, పానంబు, వేట,పలుకు ప్రల్లదనం’
అంటూ ‘చేయకూడని’ కార్యాల జాబితాలో కూడా
‘చెడు పలుకు’ను చేర్చింది అందుకే.
తినే తిండికీ, మతానికీ ముడిపెట్టి
మాట్లాడడం యెంత తప్పో ప్రజల్ని పలానాదే తినండి, పలానాది తినకూడదు అనడం అంతే తప్పు.
అసలా మాటకు వస్తే, ఆహారం అనేది మతం పుట్టకముందే వుంది. నాగరీక సమాజం ఆవిష్కృతం
కాకమునుపే, మనుషులు అడవుల్లో జంతువుల్లా జీవిస్తున్న పాత రాతి యుగంలో కూడా మనుషులు
తమకు నచ్చిందే తిని తమకు నచ్చినట్టే జీవించారు.
నాగరీకం ముదిరిన నేటి రోజుల్లో కూడా మనుషులు తమకు నచ్చిందే తింటున్నారు. అందుకే
అన్నారు జిహ్వకో రుచి అని.
శాకాహారం తినే వాళ్ళు కూడా అన్ని రకాల
కాయగూరలు తినరు. ఒకరు కాకర కాయ తింటారు. కొందరికి సొరకాయ సయించదు. మరి కొందరికి
నషాళానికి అంటే కారం నాలుక్కి తగిలితే కాని ముద్ద గొంతు దిగదు.
అలాగే మాంసాహారుల్లో కూడా అనేక
రుచిపచులు. గుడ్డు తినేవాళ్ళు అందరూ
కోడిమాంసం తింటారనుకోను. ఎనభయ్యవ దశకం చివర్లో నేను నా కుటుంబంతో కలిసి
అయిదేళ్ళు మాస్కోలో వున్నాను. అక్కడివాళ్ళకి, మాంసాహారులు కాకుండా శాకాహారులు అనే ఒక తెగ
మనుషుల్లో వుందని తెలియదల్లె వుంది. ఆ రోజుల్లో ఇండో సోవియట్ సాంస్కృతిక సంఘం
ఇస్కస్ ఆధ్వర్యంలో అనేక మంది తెలుగువాళ్ళు ఏటా మాస్కో వస్తుండేవాళ్ళు. నాకు
తెలిసిన జర్నలిష్టులు కూడా వారిలో వుండేవారు. వాళ్ళు మాంసాహారులే అయినా, అక్కడి
మాంసపు వంటకాలు నచ్చేవి కావు. అధికార విందుల్లో ఏదో మర్యాదకు భోజనం
అయిందనిపించుకుని సాయంత్రం కల్లా మా ఇంటికి వచ్చి మా ఆవిడ ఒండిపెట్టిన కాయగూరల
భోజనం ఆప్యాయంగా ఆరగించి, ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళు. కాబట్టి చెప్పేదేమిటంటే ఒకళ్ళ
ఆహారపు అలవాట్లను ఎద్దేవా చేయడం కానీ, తమ అలవాట్లే గొప్పవి అని డప్పు కొట్టుకోవడం
కానీ నాగరికం అనిపించుకోదని. సభ్య సమాజంలో జీవించేవారు ఇలాటి ‘ ప్రల్లధనపు’ పలుకులకు స్వస్తి చెప్పాలని
మాత్రమె.
మామూలుగా అయితే ఇటువంటి వ్యాఖ్యలకు అంత
ప్రాధాన్యం ఇవ్వనక్కరలేదు. అయితే, జంట నగరాల్లో ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఎంతో
ప్త్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి. ఒకరకంగా వారి ప్రచార ఆర్భాటంతో,
ప్రదర్శనలతో, ఊరేగింపులతో, సభలు, సమావేశాలతో నగరం అట్టుడికిపోతోంది. ఈ సమయంలో
ప్రజల ఆహారపు అలవాట్లను గురించిన వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు ప్రజల్లో లేనిపోని
అనుమానాలను, చీలికలను కలిగించే ప్రమాదం వుంది.
బాధ్యతారహితమైన రాజకీయ సంస్కృతికి అద్దం పట్టే ఈ రకమైన ప్రచారానికి ఆదిలోనే
అడ్డుకట్ట వేయాలి. మొదట ఈ రకమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా, దానికి ప్రతి విమర్శలు
చేయడం వల్ల పరిస్తితి చేయిదాటిపోతే, అందుకు ఇరువురిదీ సమాన బాధ్యతే అవుతుంది. కానీ రాజకీయపు వేడిలో, అవసరాల అక్కరలో
ఎవరికీ ఏమీ తెలియడం లేదు. ఎన్నికల సంఘమే కల్పించుకుని ఇరు పక్షాలను పరిస్తితి
ముదరకమునుపే కట్టడి చేయడం అవసరం.
ఎన్నికల్లో గెలుపు అవకాశాలను మెరుగు
పరచుకోవడం కోసం రాజకీయ నాయకులు తాత్కాలికంగా ఇలాటి రెచ్చగొట్టే ప్రకటనలు చేసేసి ఆ
తరువాత మరిచిపోవచ్చు. కానీ వీటి తాలూకు ప్రభావం ప్రజల మనస్సులో పది కాలాలపాటు
పేరుకుపోయే ప్రమాదం వుంటుంది. కానీ ఈ హెచ్చరికలు రాజకీయ నాయకుల చెవికెక్కవు.
వారికి వారి రాజకీయ ప్రయోజనాలే
ప్రధానం.
అన్ని మతాలలో జంతువుల్ని ప్రేమించే
స్వభావం వుంది. కొన్నిజంతువుల్ని పవిత్రంగా భావించి ఆరాధించే ఆచారం వుంది. పరమత సహనం
గురించి ప్రబోధించేవాళ్ళు పర మతస్తుల ఆచార వ్యవహారాలను కూడా గౌరవించి
తీరాలి. అన్ని మతాలూ ప్రజలు ఎలా జీవించాలి, వారి జీవన విధానాలు ఎలా వుండాలి అని
బోధిస్తాయి. వాటిని తు.చ. తప్పకుండా పాటించేవాళ్ళు, ఇతర మతాలవాళ్లకు కూడా అలాటి
వెసులుబాటు ఇవ్వాలి. తమ మతం, తమ ఆచారాలు ఎలా ప్రధానమో, ఇతరులకీ అలాగే అనే సహిష్ణుత
అలవరచుకోవాలి. అన్నింటికీ ముందు రాజకీయాలు మతాల ముసుగు వేసుకోకుండా చూడాలి. మతాల
పేరుతొ హాయిగా జీవిస్తున్న ప్రజల నడుమ చిచ్చు పెట్టకుండా చూడాలి. మతాన్ని
రాజకీయంతో ముడిపెట్టి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులకు ఇటువంటి మాటలు
రుచించకపోవచ్చు. కానీ, విశాల జాతి హితం ముందు ఇవి అత్యల్ప స్వల్ప విషయాలు.
ఉపశృతి: వెనకో మునీశ్వరుడికి కాలజ్ఞానం
వుండేది. జరగబోయేది ముందుగానే తెలుసుకోగలిగిన శక్తి ఆయనకు వుండేది. ఇక మరణం తప్పదు
అనుకున్నప్పుడు ఆయనకు ఓ తీరని మనోవేదన పట్టుకుంది. ఈ జన్మలో తాను సర్వసంగ
పరిత్యాగి అయిన ముని. వచ్చే జన్మలో అదే ఆశ్రమంలో ఒక ఎలుకగా పుట్టబోతున్నట్టు ముందుగా
తెలియడం వల్లనే ఆ ఆవేదన. శిష్యుడిని పిలిచి చెబుతాడు. తాను చనిపోయి అదే చోట ఎలుకగా పుట్టబోతున్నానని.
ఇంతటి ఔన్నత్యం కలిగిన బతుకు బతికి కలుగులో ఎలుకలా బతకడం తనకు ఇష్టం లేదని, ఎలుక
రూపంలో వున్న తనను వెంటనే చంపేసి ఆ జన్మకు పరిసమాప్తి కలిగించాల్సిందని.
తనను గుర్తు పట్టడానికి తన నుదుటిపై ఒక తెల్లటి మచ్చ ఉంటుందని చెప్పి తనువు
చాలిస్తాడు. ఆ శిష్యుడు ఎలుక రూపంలో వున్న
గురువును గుర్తుపట్టి, ఆయన ఆదేశం మేరకు ఆ ఎలుకను చంపబోతే గురువు వద్దని
వారించి ఇలా అంటాడు.
‘మనిషిగా వున్నప్పుడు అదే ఉత్కృష్ట
జన్మ అనుకుని, ఎలుకను చిన్నచూపు చూసి ఎద్దేవా చేశాను. అయితే, ఇప్పుడు ఎలుకగా జన్మించిన తరువాత అది ఎంతటి
గొప్ప జన్మో నాకు అర్ధం అయింది’
ఇందులోని నీతి ఏమిటంటే ఎవరినీ
చిన్నచూపు చూడరాదు. చిన్న చూపుకు గురైన వారు ప్రతీకారేచ్చకు పూనుకోరాదు. ఒకరిని
ఒకరు మన్నించుకోవడం ద్వారా మాత్రమే తామూ మనుషులమే అని అనిపించుకోగలుగుతారు. (27-01-2016)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి