21, జనవరి 2016, గురువారం

పాకీజా


డెబ్బయ్యవ దశకంలో నేను బెజవాడ ఆంధ్ర జ్యోతిలో పనిచేసేటప్పుడు నండూరి రామమోహనరావు గారు, పురాణం సుబ్రమణ్య శర్మ గారు, దిన వార పత్రికలకి నాచేత  సినిమా  రివ్యూలు  రాయించేవారు. ఇంట్లో పాత కాగితాలు తిరగేస్తుంటే దాదాపు శిధిలావస్థకు చేరిన ఓ పాత ఆంద్ర జ్యోతి వారపత్రిక ( ఇప్పుడు పేరు ‘నవ్య’ గా మారింది) లోని ఓ పేజీ దొరికింది. 



చూస్తే అది హిందీ సినిమా ‘పాకీజా’ గురించి నేను రాసిన రివ్యూ.  చదవడానికి వీలైన భాగం ఇలా వుంది.
“ఈచిత్రంలో నటించిన మీనాకుమారి, సంగీతం అందించిన గులాం మహమ్మద్  ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. కాని వారి  ప్రతిభకు తార్కాణంగా ఈ చిత్రం నిలచిపోతుంది.
నవాబుల ఆనందం కోసం నాట్యం చేసే నాట్యకత్తెల గుండె గదుల్లో అణగారిన కోర్కెలకు, తీరని వాంఛలకు, ఆత్మార్పణ చేసుకునే వారి ‘కొవ్వొత్తి’ జీవితాలకు అద్దం  పట్టే  విధంగా ఈ చిత్రంలో ప్రదర్శించిన ఫోటోగ్రఫి ‘వెలకట్టలేని విలువను ఈ చిత్రానికి సమకూర్చిపెట్టింది.
“గులాబ్ మహల్ భవన సౌందర్యం భారీ సెట్టింగుల రూపంలో ఈ సినిమా స్కోప్ చిత్రంలో చక్కగా అమిరింది.
“అశోక్ కుమార్, రాజ్ కుమార్, మీనాకుమారి వంటి ప్రముఖ తారాగణం నటించిన ఈ చిత్రానికి నౌషాద్ శ్రవణపేయమయిన నేపధ్య సంగీతం అందించారు.
నిర్మాణ. దర్సకత్వ బాధ్యలతో పాటు కమల్ ఆమ్రోహి సంభాషణలు కూడా సమకూర్చారు. జస్ జీత్ డిస్ట్రిబ్యూటర్స్ (సికిందరాబాదు) ద్వారా ఆంధ్రాలో ఈ చిత్రం విడుదల అయింది. -భండారు
తోకటపా: సినిమా పాటల పుస్తకంలో వుండే ‘కధ’ మాదిరిగా చిత్రాల రివ్యూ వుండేది. వుండాలి కూడా. అందుకే నండూరి రామమోహనరావు గారు ఈ సినిమా ప్రీవ్యూ లను  ‘ఫ్రీవ్యూలు’ అనేవారు. అంటే ఉచితంగా చూసేవి అని అర్ధం. రివ్యూలు కూడా అందుకు తగ్గట్టే వుండాలన్నది ఆయన కవి హృదయం.       


కామెంట్‌లు లేవు: