పురుషులలో పుణ్య పురుషుల మాదిరిగా
గురువులలో ఈ విభజన వుండదు. గురువులందరూ శిష్యులందరికీ దైవసమానులే.
శిష్యులకు వున్న ఒక సౌలభ్యం గురువులకు వుండదు. క్లాసులో యాభయ్ అరవై
మంది విద్యార్ధులు వున్నా పాఠం చెప్పే మాస్టారు ఒక్కరే. వారందరికీ గురువు గారి
రూపం వారి వారి మనస్సులో ముద్రపడిపోతుంది. మేస్టారి పరిస్తితి అలా కాదు, ప్రతి ఏటా
కొత్త విద్యార్ధులు వస్తుంటారు. పాత వారు తమతమ జీవితాల్లోకి నిష్క్రమిస్తుంటారు.
అందర్నీ చప్పున గుర్తుకు తెచ్చుకోవడం అలవికి మించిన పని.
నిన్న సాయంత్రం హైదరాబాదు గాంధీనగర్ (బాలాజీ
టాకీసు, ఇప్పుడు లేదు) దగ్గర ఒక కాలనీలో నివసిస్తున్న ఖమ్మం ఎస్ ఆర్ అండ్ బీ జీ ఎం ఆర్ ప్రభుత్వ
కళాశాలలో సుదీర్ఘ కాలం ఇంగ్లీష్ పాఠాలు బోధించిన కే.ఎల్. నరసింహారావు గారిని
కలుసుకోవడం జరిగింది. ఇటువంటి సమాగమాలు ఏర్పాటు చేయడంలో దిట్ట జ్వాలా నరసింహారావు.
ఆయన అనుకోవడమే తడవు, ఆ కాలేజీలో చదివిన నలుగురం (అందరూ ఒక బ్యాచ్ కాదు) రావులపాటి
సీతారామారావు గారు (ఆంధ్రప్రదేశ్ పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్), భండారు
రామచంద్ర రావు గారు ( స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ జనరల్ మేనేజర్), సరే
దండలో దారం, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య పౌర సంబంధాల అధికారి వనం జ్వాలా
నరసింహారావు, భండారు శ్రీనివాసరావు అనబడే నేనూ ( ఈ ‘బడు’ ధాతువు ‘నార్ల’ స్కూలులో
నిషిద్ధం, అయినా అనబడు అనక తప్పడం లేదు) ఇత్యాది ఖమ్మం కాలేజీ మాజీలం (విద్యార్ధులం)
కెవైఎల్ గారింటికి వెళ్ళాము. ఆయన కిప్పుడు అక్షరాలా తొంభై రెండేళ్ళు. ఈ
సంక్రాంతికి తొంభై తప్పుకుని తొంభయ్ మూడులో అడ్గు పెడతారు.
మేము వెళ్ళే సరికి ఆయన ముందు గదిలో
కూర్చుని వున్నారు. మనిషి బాగా సన్నబడ్డారు. జుట్టు పలచ బడింది. కానీ భగవంతుడు ఆయన
కిచ్చిన వరం, ‘సుస్వరం’ అంతే పదిలంగా వుంది. అందరం పాద నమస్కారాలు చేసాము, భక్తితో,
గౌరవంతో, తన్మయంతో.
మమ్మల్ని చూసి కేవైఎల్ ఎంతో
సంతోషపడ్డారు. అరవై ఏళ్ళనాటి పాత విషయాలు గుర్తు చేసుకున్నారు. కాలేజీ
విద్యార్ధులతో ఆయన వేయించిన రవీంద్రనాధ
ఠాగూర్ ఇంగ్లీష్ నాటిక ‘శాక్రిఫైజ్’
గురించీ, కాలేజీకి వచ్చి ఆ నాటిక చూసిన అలనాటి గవర్నర్ భీమసేన్ సచార్ గురించీ
ఎన్నో విషయాలు మాట్లాడారు. వారి పిల్లలు సహదేవ్, కోడలు శోభ, ఇంకో కుమారుడు అశ్విన్ ఆయన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆయన్ని శాస్వితంగా
ఒదిలి పరలోకాలకు వెళ్ళిన భార్య దమయంతి దేవిని ఫోటోలో చూసుకుంటూ, కంటి ఎదురుగా
తిరుగాడుతున్న కన్న పిల్లల్ని చూసుకుంటూ,
మంచి పుస్తకాలు చదువుకుంటూ హాయిగా, తృప్తిగా కాలక్షేపం చేస్తున్నట్టు చెప్పారు.
కొమరగిరి యోగానంద లక్ష్మీ నరసింహారావు గారికి మొత్తం తొమ్మిది మంది సంతానం. ప్రముఖ
సాంస్కృతిక సంస్థ ‘సంస్కార భారతి’కి అధ్యక్షులుగా పనిచేసారు.
కేవైఎల్ తానూ రాసిన ఎన్నో పుస్తకాలను పేరు పేరునా సంతకం చేసి మరీ
మాకు కొత్త సంవత్సరం కానుకగా ఇచ్చారు.
కొత్త ఏడాది ఇలా గురుదర్శనంతో మొదలు
కావడం మాకు సంతోషంగా వుంది.
2 కామెంట్‌లు:
mee guru bhakti talachukuni santosham gaa vundi. appudu meeku khammam lo english lecturer viswam garu gurtunnara
@sri - nenu khammam kalejelo chadivindi PUC okka yedaade. taruvata bejavada vellipoyanu
కామెంట్‌ను పోస్ట్ చేయండి