30, జనవరి 2016, శనివారం

పెద్దల పుస్తకాలు – దాగున్న వాస్తవాలు


సూటిగా... సుతిమెత్తగా........ 

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 31-01-2016, SUNDAY) 

పూర్వం సినిమాలు విడుదల చేసినప్పుడు వాటితో పాటు సినిమాలోని పాటలతో కూడిన చిన్న పుస్తకాన్ని  ప్రేక్షకులకు అమ్మేవారు. అవి కొనుక్కుని ఇంటికి వచ్చిన తరువాత వాటిని పాడుతూ పాటల్ని వల్లె వేయడం అదో సరదాగా వుండేది. పాటల పుస్తకాల  వెనుక అట్ట మీద,   చిత్ర నిర్మాత తదుపరి తీయబోయే చిత్రాల పేర్లు వుండేవి. చాలా కాలం క్రితం తెలుగు సినీ రంగంలో ఎదురు లేని మనిషిగా వెలిగిపోతున్న రోజుల్లో,  ఎన్టీ రామారావు తాను తీయబోయే ఒక చిత్రం పేరు  ముసలి మొగుడు పడుచు పెళ్ళాం అని  ఒక పాటల పుస్తకంపై ముద్రించారు. కానీ ఎందుకో ఏమిటో చిత్రాన్ని ఆయన నిర్మించనే లేదు.
నేనూ ఎప్పుడయినా ఆత్మ కధ అంటూ  రాయడం అంటూ జరిగితే దానికి నడిచి వచ్చిన దారి అని పేరు పెట్టాలని ఎంతగానో మనసు పడ్డ మాట నిజం. జీవిత చరిత్రలు రాసుకోగలిగిన స్తాయి జీవితమా! నాది అన్న మీమాంసతో అది కొరుకుడు పడలేదు. చివరికి మార్పు చూసిన కళ్ళు అనే పేరుతొ నా మాస్కో జీవితంలో ఎదురయిన కొన్ని అనుభవాలను గ్రంథస్తం  చేయగలిగాను. 
తెలుగు సాహిత్యంలో నాకు నచ్చిన ప్రక్రియల్లో ఆత్మకధలు లేదా జీవితచరిత్రలు ప్రధానమయినవి. వీటిని చదువుతుంటే మనకు చెందని కాలానికి చెందిన అనేక  విషయాలను అవగాహన చేసుకోగలుగుతాము. మనం ఈనాడు చూస్తున్న ప్రదేశాలు, ఆచారవ్యవహారాలు వాటికి పూర్వ రూపం ఎలావుండేదో తెలుసుకోవడానికి వీటిని చదవడం ఒక్కటే  సరయిన మార్గం. ఏనుగుల వీరాస్వామి గారు రాసిన నా కాశీ యాత్ర పుస్తకం చదువుతుంటే ఆనాటి హైదరాబాదు నగరం ఎలావుండేదన్నది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అప్పటి  ధరవరలు, వేషధారణలు, ఆహారవ్యవహారాలు అర్ధం చేసుకోవడానికి ఈరకమయిన  పుస్తకపఠనం ఉపయోగపడుతుంది.  

  
నాందీప్రస్తావనే ఇంత విస్తారం కావడానికి నన్ను ప్రేరేపించిన అంశం ఒకటుంది. మళ్ళీ ఒక జీవిత చరిత్ర గురించి పత్రికల్లో వచ్చింది. రాసిన వ్యక్తి సామాన్యుడు కాదు. దేశ రాజకీయాల్లో కాకలు తీరిన మనిషి. సుదీర్ఘకాలం కేంద్రంలో అనేక మంత్రి పదవులు నిర్వహించి ప్రస్తుతం దేశ ప్రధమ పౌరుడిగా రాష్ట్రపతి  స్థానంలో వున్న ప్రణబ్ కుమార్  ముఖర్జీ.
సరే! రాజకీయ నాయకులు రాసే జీవిత చరిత్రల మాదిరిగానే ప్రణబ్ ముఖర్జీ  రాసిన ‘కల్లోలిత కాలం’ అనే ఈ గ్రంధంలో కూడా జనాలకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విశేషాలు వున్నాయి. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీకి సంబంధించిన కొన్ని ప్రస్తావనలు ఈ కోవకు చెందుతాయి. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం  తాత్కాలికంగా అయినా  ప్రధాని పీఠం ఎక్కేందుకు తానూ ప్రయత్నించినట్టు ఆరోజుల్లో చెలరేగిన వదంతుల్లో నిజం లేదని ప్రణబ్  వివరణ ఇచ్చారు. అయితే ఈ పుకార్లు తనను, రాజీవ్ గాంధీ నుంచి ఎడం చేశాయని ఆయన పేర్కొన్నారు. ఆ నేపధ్యంలోనే తనకు కేంద్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికారని, అది తనను ఎంతో బాధ పెట్టిందనీ ఆయన రాసుకొచ్చారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించడం రాజీవ్ చేసిన తప్పు అని అంటూనే, అందులో తన తప్పు కూడా వుందని ఒప్పుకున్నారు. ‘నాలో పేరుకుపోయిన నిస్పృహ  నాలోని సహనాన్ని మించిపోయింది. అయినా సరే కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీ పెట్టడం పొరబాటే’ అన్నారయన.
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన మరో సంచలన వ్యాఖ్య చేసారు.
’కొన్ని వాస్తవాలు నాతోనే సమాధి అవుతాయి. అత్యంత గోప్యమైన అంశాలను ఇందులో నేను కావాలనే చేర్చలేదు. నా డైరీల్లో నిక్షిప్తమై వున్న ఆ రహస్యాలను నా తదనంతరం కూడా బయట పెట్టరాదు. ఆ డైరీలను డిజిటలిజ్ చేయాలని నా కుమార్తెకు సూచించాను. భవిష్యత్తులో పాలకులు అవసరమనుకుంటేవాటిని బయట పెడతారు’ అని చెబుతూ కొంత ఉత్సుకత పెంచారు.
స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య వల్ల తన ప్రాణాలకే  ముప్పు వుందని తెలిసికూడా ఇందిరాగాంధీ దేశ ప్రయోజనాలకోసం ఆ నిర్ణయం తీసుకున్నారని ఆయన కితాబు ఇచ్చారు.
అయోధ్యలో రామజన్మభూమి ఆలయ ద్వారాలు తెరవడం ప్రధానిగా రాజీవ్ చేసిన తప్పిదమని ఆయన  అభిప్రాయపడ్డారు.
‘కల్లోలిత కాలం’ గురించి ఆయన సాధ్యమైనంత వరకు నిజాయితీతోనే పుస్తకం రాసినట్టు ఇంతవరకు బహిర్గతమైన విషయాలు తెలుపుతున్నాయి.
సరే. దేశంలో ఒక ప్రసిద్ధ వ్యక్తి రాసిన పుస్తకం కనుక సహజంగానే  ఈ పుస్తకానికి రావాల్సిన ప్రాచుర్యం ఇప్పటికే  వచ్చింది.
సందర్భం వచ్చింది కనుక మరో పుస్తకం గురించి చెప్పుకోవాలి.
మూడు తరాలకు చెందిన ఒక పేద దళిత కుటుంబం సాగించిన జీవనయానంలోని ఒడిదుడుకులను, కష్టనష్టాలను  తేటతెల్లం చేస్తూ డాక్టర్ వై.వి.సత్యనారాయణ రాసిన మై ఫాదర్ బాలయ్య అనే జీవిత చరిత్రను హార్పర్ కాలిన్స్ ఇండియా వారు ప్రచురించారు. తెలంగాణా  ప్రాంతంలో తండ్రినిబాబు’ అని పిలుస్తారు కాబట్టి, ఆ పుస్తకాన్ని గురించి తెలుగులో పరిచయం చేసేటప్పుడు బాలయ్య బాబు’ అని పేరు పెట్టాను.
డాక్టర్ సత్యనారాయణ పుస్తకం రాయడంలో ఎలాటి  భేషజాలకు లోనుకాలేదన్న వాస్తవం మనకు  ఇట్టే బోధపడుతుంది. తన కుటుంబం అనుభవించిన కడగండ్లను కళ్ళకు కట్టినట్టు చూపడంలో ఆయన ఎంతమాత్రంపరనిందా సూత్రాన్ని’  ఉపయోగించుకోలేదు.
రెండు శతాబ్దాలకు విస్తరించిన మూడు తరాల కధ, కరీంనగర్ జిల్లా వంగపల్లి గ్రామం నుంచి డాక్టర్ సత్యనారాయణ ముత్తాత నరసయ్యతో మొదలవుతుంది. ఈనాటికీ అవశేషాలు మిగిలిన దళితుల తాడన పీడనలు, అవమానాలు, ఆక్రోశాలు చదువుతుంటేమనిషి జీవితం ఇంత పర పీడనమా’ అన్న ఆలోచన కలుగుతుంది. దీనిలో సానుకూల అంశం ఏమిటంటే మనిషి తలచుకుంటే కష్టాలొక లెక్కకాదన్న వాస్తవం. దేన్నీ లెక్కపెట్టని గుండె ధైర్యం, పైకి రావాలనే చెక్కుచెదరని  తపన వుండాలే కాని మనిషి సాధించలేనిది ఏమీ లేదన్న  నిజం డాక్టర్ సత్యనారాయణ  రాసిన పుస్తకం  చదివినవారికి బోధపడడం తధ్యం.
మనసుల్ని కదిలించే సంఘటనను డాక్టర్ సత్యనారాయణ ఉదహరించారు.
మాదిగ కుటుంబంలో జన్మించిన నరసయ్య లేగదూడ చర్మంతో చెప్పుల జతను తయారు చేసి నిజాం నవాబుకు బహుకరిస్తాడు. కాలిజోళ్ల పనితనం గమనించి  ముగ్ధుడైన నిజాం నవాబు అతడికి యాభై ఎకరాలు దానంగా ఇస్తాడు. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా వూళ్ళోని దొర, నరసయ్యకు నవాబు ఇచ్చిన యాభయ్ ఎకరాల్లో నలభై ఎనిమిది  ఎకరాలను బలవంతంగా స్వాధీనం చేసుకుంటాడు.
నరసయ్యకు ఒక కొడుకు. అతడి పేరూ  నరసయ్యే. జూనియర్ నరసయ్యకు పదునాలుగో ఏట అబ్బమ్మ అనే యువతితో   పెళ్లి చేస్తారు. అస్పృశ్యులయిన వాళ్ళిళ్లలొ జరిగే శుభకార్యాల్లో చోటుచేసుకునే  ప్రతి చిన్న విషయాన్ని రచయిత తనదయిన శైలిలో హృద్యంగా వర్ణించారు. వారికి పుట్టిన బిడ్డే రామసామి  అలియాస్ బాలయ్య.
కలరా వ్యాధి సోకి భార్య మరణించిన తరువాత ఆమె శవాన్ని భుజానికి ఎత్తుకుని  జూనియర్ నరసయ్య, కొడుకు బాలయ్యను వెంట  తీసుకుని, వూరుబయట వాగు చెంత గొయ్యి తవ్వి, భార్య శవాన్ని పూడ్చిపెట్టి,  వున్న వూరు విడిచిపెట్టి,  బాలయ్య మేనమామల పంచన చేరతాడు. వారి సాయంతో నిజాం రైల్వేలో చిన్న కొలువు సంపాదిస్తాడు. బంధువుల బలవంతం మీద మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. అయినా తల్లి లేని రామసామి అలియాస్  బాలయ్యను ప్రాణప్రదంగా  చూసుకుంటాడు. అలా పెరిగిన బాలయ్యకు  ధ్యేయం ఒక్కటే. చదువు. అది తనకు ఎలాగో అబ్బలేదు.  తనకు దక్కని చదువు తన సంతానానికయినా దక్కేలా చేయాలి. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురయినా అతడా లక్ష్యానికి దూరం జరగలేదు. పిల్లలు కూడా   అతడి కలను నిజం చేస్తూ  పెద్దవారవుతారు. స్కూళ్ళు, కాలేజీలు దాటి  విశ్వవిద్యాలయాలలో చేరి ప్రొఫెసర్ల స్తాయికి చేరుకుంటారు. వారిలో ఒకడే గ్రంధకర్త డాక్టర్ సత్యనారాయణ. కృషి వుంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు అన్న కవి వాక్యం నిజం చేసిన మట్టిలో మాణిక్యం.
అవకాశాలు వుండాలే కాని మనిషి పెరుగుదలకు ఆకాశమే హద్దు అని నిరూపించిన డాక్టర్ సత్యనారాయణకు, ఆయన తండ్రి బాలయ్య బాబుకు నమోవాకాలు చెప్పకుండా ఉండలేము.
ఈ పుస్తకం గురించిన మరిన్ని వివరాలు కోరుకునేవారు సీనియర్  పాత్రికేయులు మల్లేపల్లి  లక్ష్మయ్యను సంప్రదించవచ్చు.                              

ఉపశ్రుతి : మహాకవి ‘శ్రీ శ్రీ’  వాకృచ్చినట్టు ‘ఏ యుద్ధం ఎందుకు జరిగెనో, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో’ అది కాదు చరిత్ర అంటే. సామాన్యుడి జీవితం ఎప్పుడు ఎలా వుందో భవిష్యత్  తరాలకి తెలియచెప్పేది చరిత్ర. అలాటి చరిత్రలు, ‘జీవిత చరిత్రలు’గా మరిన్ని రావాలి. రావాలని ఆశిద్దాం! (30-01-2016)

రచయిత ఈ మెయిల్ : bhandarusr@gmail.com, మొబైల్:  98491 30595 

2 కామెంట్‌లు:

Rao S Lakkaraju చెప్పారు...

రెండు పుస్తకాల్లో ఏ పుస్తకం చదవాలని అనిపిస్తుంది ? రెండూ జరిగిన సంఘటలని గురించి వ్రాసినవే. కానీ రెండో దానిమీదే నా చూపు. ఒకరి అతి సాధారణ జీవన గమనాన్ని స్ప్రుసించటం లో ఉండే అనుభూతేమో.

Sridevi చెప్పారు...

తెలంగాణా ప్రాంతంలో తండ్రిని 'బాపు' అని పిలుస్తారు. 'బాబు' అని కాదు, అసలు ఆ పదం ఉపయోగించరు. బాపు ఉర్దూ నుంచి వచ్చిన పదం. పరిశీలించగలరు.