ఆడపిల్లలకు సంబంధించి ఘోరమైన వార్తలు
వినబడుతున్న నేపధ్యంలో ఏడేళ్ళ నాటి మరో ఘోర దురంతం గుర్తుకు వస్తోంది.
2012 డిసెంబరు 16 వ తేదీ రాత్రి భారత రాజధాని ఢిల్లీలో జరిగిన పాశవిక కాండ మానవత్వానికే మాయని మచ్చగా మిగిలింది. ఆ సంఘటనలో మానాన్నీ, ప్రాణాన్నీ పోగొట్టుకున్న ఆ యువతికి ఏమి న్యాయం జరిగిందో తెలియదు కానీ దేశంలోని ఆడపడుచులందరికీ ఊరట కలిగించే ఒక శాసనం ఊపిరి పోసుకుంది. నాకు తెలిసి స్వతంత్ర భారతంలో ప్రజల ఒత్తిడి ఫలితంగా ఒక చట్టం రూపొందిన సందర్భం కూడా అదే. ఆ చట్టమే ‘నిర్భయ’.
ఆరుగురు కామాంధుల చేతికి చిక్కిన ఒక
యువతి ఎటువంటి దుర్భర, దుస్సహ, శారీరక, మానసిక వేదనలకు గురైందన్న విషయం
లోకానికి తెలిసివచ్చిన పదమూడు రోజుల తరువాత ఆ అనామిక (ఆ యువతి తల్లి ఆశాదేవి, చనిపోయిన తన కుమార్తె పేరు ‘జ్యోతి సింగ్’ అని మొదటిసారి బహిర్గత పరిచారు.
ఇటువంటి ఘోరాలకు బలి అయిన ఆడవారి పేర్లను బయట పెట్టరాదని మీడియా ఆ రోజుల్లో తనకు
తానే ఒక లక్ష్మణ రేఖ గీసుకుంది) సింగపూరులో చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటన పట్ల సభ్య సమాజం స్పందించిన తీరు
జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిని
ఆకర్షించింది. ఐక్యరాజ్యసమితిని సైతం కదిలించింది. ఫలితంగా నాటి కేంద్ర ప్రభుత్వం
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జే. ఎస్. వర్మ నేత్ర్యత్వంలో త్రిసభ్య
విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. తన పరిశీలనకు వచ్చిన ఎనభయ్ వేలకు పైగా సలహాలు, సూచనలను పరిశీలించి నెల రోజుల లోపునే ఈ సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మహిళల పట్ల లైంగిక పరమైన నేరాలు పెరిగిపోవడానికి మూల కారణం ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థల వైఫల్యంగా వారు అభిప్రాయపడ్డారు. కమిటీ నివేదికలో సుమారు తొంభయ్ శాతం సిఫారసులను గుదిగుచ్చి రూపొందించిన ఆర్దినెన్సుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం, తదుపరి అది శాసనంగా చట్టసభల ఆమోదం పొందడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆర్డినెన్స్ బిల్లు రూపం ధరించి, 2013 మార్చి 19 తేదీన లోకసభ ఆమోదం పొందేనాటికే అందులో పొందుపరచిన అనేక అంశాలు పలు మార్పులకు గురయ్యాయి. నిర్భయ చట్టంతో ఇటువంటి హేయమైన
సంఘటనలు పునరావృతం కావని ఆశించడం వృధా అని ఆ తరువాత మూడేళ్ళ కాలంలో చోటుచేసుకుంటున్న అదే విధమైన పలు
సంఘటనలు నిరూపించాయి. ఒక్క ఢిల్లీ కేసులో మినహా మరే సందర్భంలో కూడా కఠిన శిక్షలు
పడిన దాఖలా లేదు. అలా అని ఈ శాసనం వల్ల ఎలాటి ఉపయోగం లేదని కాదు. లైంగిక
అత్యాచారాలకు పాల్పడే దుర్మార్గులు చట్టాలను లెక్కపెట్టే స్థితిలో వుండకపోవచ్చు
కానీ, అత్యాచార బాధితులకు మాత్రం ఈ చట్టం కొంత
ఊరట కలిగిస్తోంది. తమ మీద లైంగిక దాడులకు పాల్పడిన వారికి శిక్ష పడుతుందన్న భరోసా
ఆ అబలలకు ఒకింత ఉపశమనాన్ని ఇస్తోంది. అన్నింటికీ మించి
ప్రజల ఆకాంక్షల మేరకు ఒక శాసనం రూపొందడం అనేది ప్రజాస్వామ్యం సాధించిన ఒక విజయం. అంతే కాకుండా, లైంగిక అత్యాచార బాధితులు సమాజం దృష్టిలో మరిన్ని అవహేళనలకు
గురికాకుండా అటువంటి వారిని అసలు పేర్లతో కాకుండా ‘నిర్భయ’ గా పిలవాలనే ఒక సంప్రదాయం
అమల్లోకి వచ్చింది.
మూడేళ్ళ తర్వాత ఢిల్లీ ‘నిర్భయ’ కేసులో ఆరుగురు ముద్దాయిల్లో
నలుగురికి (ఒక ముద్దాయి విచారణ జరుగుతూ వున్న సమయంలోనే జైల్లో ఉరివేసుకుని చనిపోయాడు) ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. చివరకు సుప్రీం
కోర్టు దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది.
మరో సంగతి ఇక్కడ ప్రస్తావించాలి. ఈ కేసు
విచారణా కాలంలో జైల్లో ఒక విదేశీ వార్తా సంస్థకు ముద్దాయిల్లో ఒకరు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఆ యువతి బలాత్కారానికి సహకరించి
వుంటే ఇంతటి విషమ పరిస్తితి ఆమెకు ఎదురయ్యేది కాదని’ అతడు చెప్పిన తీరు కరడు గట్టిన
నేర ప్రవృత్తికి నిలువెత్తు సాక్ష్యం.
ఆరో ముద్దాయి ‘మైనర్’ (అల్ప వయస్కుడు) అన్న కారణంతో
అతడ్ని మూడేళ్ళు జువెనైల్ హోం లో ఉంచారు. మైనారిటీ తీరగానే అతడ్ని విడుదల చేసారు. నేరం
జరిగిన నాటికి మైనర్ అనే ఒకే ఒక కారణంతో నేరశిక్షాస్మృతి ప్రకారం అతడికి మిగిలిన
నేరస్తులతో పాటు శిక్ష వేయకుండా మూడేళ్ళ జువెనైల్ హో౦ నిర్బంధంతో సరిపుచ్చాల్సి
వచ్చింది.
‘అల్పవయస్కుడి’
విడుదలను
అడ్డుకుంటూ సుబ్రమణ్య స్వామి కోర్టుకు ఎక్కారు, కానీ న్యాయస్థానం ఆ అభ్యర్ధనను
తిరస్కరించింది.
పిన్న వయస్కుడు అనే కారణంతో శిక్ష
తప్పించుకుని దర్జాగా సమాజంలోకి తిరిగి అడుగుపెట్టిన అతగాడు చేసిన నేరం చిన్నదేమీ కాదు. ఆనాటి
సామూహిక
మానభంగ పర్వంలో అతడూ ఒక భాగస్వామి. పైపెచ్చు, నిస్సహాయ స్తితిలో వున్న ఆ అభాగ్యురాలిని ఒక ఇనుప చువ్వతో అతి
క్రూరంగా, అత్యంత రాక్షసంగా హింసించిన పాపం అతడి
ఖాతాలో వుంది. అయినా, ‘అల్పవయస్కుడు’ అనే కారణంతో చేసిన నేరానికి శిక్ష
పడకుండా బయటపడగలిగాడు.
కోర్టు నిర్ణయం జ్యోతిసింగ్
తలితండ్రులను నిరాశ పరచింది. ‘నేరం జయించిందని, తామే పరాజితులమని’ ఆమె తల్లి ఆశాదేవి ఆవేదన
వెలిబుచ్చారు. ఆమె బాధ సమంజసం అనిపించేలా
వుంది. చట్టం ప్రకారం అలాంటి బాల హంతకులకు జువనైల్ హోం నుంచి బయటపడగానే
కొత్త జీవితం ప్రసాదించే పేరుతొ ఆర్ధిక సాయం చేస్తారు. అతడి పాత పేరును మార్చి
కొత్త పేరు తగిలిస్తారు. అప్పటినుంచి అతడు సమాజంలో నూతన నామధేయంతో చెలామణీ
అవుతాడు. ఇదంతా వినడానికి బాగానే వుంది. పేర్లు మార్చినట్టు నేరస్తులను పూర్తిగా
సంస్కరించగలిగితే అంతకంటే కోరుకునేది ఏమీ వుండదు. మనిషి వేష భాషలను మార్చినంత
సులభంగా అతడి మనస్త్వత్వాన్ని మార్చడం అంత తేలికా అన్నదే ప్రశ్న. జైలు ఇంటర్వ్యూలో ఒక ముద్దాయి చెప్పిన
అభిప్రాయమే దీనికి సరయిన సమాధానం. ధర్మం ప్రకారం ఆ ‘అల్ప వయస్కుడు’ కూడా మిగిలిన వారితో పాటు
శిక్షార్హుడే. కానీ చట్టం చెప్పే న్యాయం వేరుగా వుంటుంది.
కోర్టుల్లో న్యాయం చట్టాన్ని బట్టి వుంటుంది. చట్టం
మారితే దానికి తగ్గట్టుగా న్యాయం, దానికి తగ్గట్టుగా శిక్షలు మారిపోతూ వుంటాయి. ధర్మం అనేది
మారుతున్న కాలంతో ప్రమేయం లేకుండా స్థిరంగా మార్పు లేకుండా వుంటుంది.
అల్ప వయస్కులు నేర పూరిత మనస్త్వత్వం
కలిగివుండరన్న అభిప్రాయం ఒకప్పుడు సరికావచ్చు. కానీ వారి మనస్సులను కలుషితం చేసే
అనేక అవకాశాలు చిన్న వయస్సునుంచే ప్రస్తుతం అందుబాటులో ఉంటున్నాయి. గుప్పెట
మూసివుంచాల్సిన అనేక సెక్స్ పరమైన సంగతులు, వారి గుప్పెట్లో ఉంటున్న సెల్
ఫోన్ల పుణ్యమా అని చిన్నతనం నుంచే వారికి కరతలామలకం. ఈ వెసులుబాట్లతో వారు
పెడమార్గం పడుతున్నారన్న వాస్తవాలను మరిచిపోరాదు. అల్పవయస్కులు అయినంత మాత్రాన
వారు ఇటువంటి హీనమైన లైంగిక కార్యకలాపాలకు పనికిరారు అని నిర్ధారణకు రావడానికి
వీల్లేదు అనడానికి ఈ కేసులో శిక్ష తప్పించుకున్న ఈ బాల నేరస్తుడే సాక్షి.
తక్కువ వయస్సు కారణంగా శిక్షలు
తప్పించుకునే పరిస్తితి ముందు ముందు కూడా కొనసాగితే అందువల్ల మరికొన్ని విషమ
పరిణామాలు కూడా చోటుచేసుకునే ప్రమాదం పొంచి వుంటుంది. పిల్లల్ని చేరదీసి, చిన్నతనం నుంచే ఉగ్రవాద శిక్షణ
ఇచ్చే విదేశీ సంస్థలు, తప్పుడు సర్టిఫికేట్లతో వయస్సు
తక్కువగా చూపించి, వారిచేత ఉగ్రవాద చర్యలు జరిపించే అవకాశాన్ని కూడా
కొట్టివేయలేము. అటువంటి వారు ఒకవేళ పట్టు పడినా, ఈ చట్టాన్ని ఆసరాగా తీసుకుని, అనతి కాలంలోనే బయటపడి తమ
కార్యకలాపాలను తిరిగి కొనసాగించే వీలుంటుంది.
వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే, ప్రస్తుతం
వున్న చట్టాలను తగువిధంగా సవరించుకోవాల్సిన అవసరాన్ని ‘ఈ అల్పవయస్కుడి’ విడుదల
వ్యవహారం గుర్తు చేస్తోంది.
1 కామెంట్:
ఈ కామ పిశాచులను పిచ్చికుక్కల బోనులో బంధించి కరిపించాలి. ఒక్కొక్క అంగాన్ని ఖండించి బాధిత అబలలకు , చెల్లెలకు, అమ్మాయిలకు రక్త తర్పణం వదలాలి.
ఈ నరరూప రాక్షసులను ఎన్ కౌంటర్ చేసే దమ్మున్న పోలీస్ ఆఫీసర్లు కావాలి.
ఈ పిషాచుల తరఫున వాదించే లాయర్లకు, మానవ హక్కుల ముందలకు సజీవ దహనం చేయాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి