26, నవంబర్ 2019, మంగళవారం

రేడియో రోజులు – 24 - భండారు శ్రీనివాసరావు




(Published in SURYA daily on 24-11-2019, SUNDAY)

ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు

స్క్రిప్ట్ ఒకటే. చదివేది అదే మైకు ముందు. మరి రేడియో వార్తలు చదివే వాళ్ళలో ప్రత్యేకత ఏమిటి?
ఢిల్లీ నుంచి గతంలో తెలుగు వార్తలు చదివిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో బాణీ.
నిజమే.ఎవరు చదివినా అవే వార్తలు. కానీ చదవడంలో ఓ విరుపు. చదువుతూ చదువుతూ ఎక్కడో ఓ మెలిక. వార్తకు తగ్గట్టు స్వరంలో హెచ్చుతగ్గులు. వీటిని బట్టే ఆ రోజుల్లో శ్రోతలు వార్తలు మొదలయిన తర్వాత కూడా చదివే వ్యక్తిఎవరన్నది సులువుగా గుర్తు పట్టేవాళ్ళు.
అద్దంకి మన్నార్ వార్తలు చదువుతుంటే  జెట్ విమానంలా ఉరుకులు పరుగులు పెట్టినట్టు సాగిపోయేవి. దుగ్గిరాల పూర్ణయ్య గారు కంచు కంఠంతో నింపాదిగా చదివేవారు. కందుకూరి సూర్య నారాయణ గారు ప్రతి వాక్యాన్ని తనదైన శైలిలో ముగించేవారు. మావిళ్ళపల్లి  రాజ్యలక్ష్మి గారిది మరో తరహా. నిండుగా సాగిపోతున్న గంగా ప్రవాహం మాదిరిగా వుండేది. జోళిపాల్యం మంగమ్మ గారు వార్తలు చదువుతుంటే మరి కాసేపు అలా అలా వినాలి అనిపించేలా వుండేది. ఏడిద గోపాల రావు గారు వార్తల్ని చదువుతుంటే ముచ్చట్లు చెబుతున్నట్టు ముచ్చటగా ఉండేవి.  చొప్పదంటు లాంటి వార్తలకు కూడా ఆ మహానుభావులు జీవం పోసేవారు. అందుకే శ్రోతలను అంతగా ఆకట్టుకోగలిగారు.
ఢిల్లీలో ఆకాశవాణికి  చాలా పెద్ద వార్తా విభాగం వుంది. అనేక జాతీయ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో సైతం ఢిల్లీ నుంచి వార్తలు ప్రసారం చేస్తుంటారు. ప్రసార భారతి ఏర్పాటు అయిన తరువాత ఆయా దేశీయ భాషల్లో బులెటిన్లు రూపొందించే విభాగాలను ఆయా ప్రాంతాలకు తరలించారు. ఆ క్రమంలోనే ఢిల్లీ నుంచి తెలుగు వార్తా విభాగాన్ని యావత్తూ, సిబ్బందితో సహా హైదరాబాదుకు మార్చారు. ఢిల్లీలోని ఆకాశవాణి జనరల్ న్యూస్ రూమ్ లో ఇంగ్లీషులో జాతీయ వార్తలతో కూర్పు చేసిన  బులెటిన్ కాపీని హైదరాబాదుకు పంపితే ఆ వార్తల్ని  న్యూస్ రీడర్లు తెలుగులోకి తర్జూమా చేసుకుని చదువుతున్నారు. కాకపొతే  ప్రాధాన్యతను బట్టి కొన్ని స్థానిక వార్తలను కూడా ఆ బులెటిన్ లో చేరుస్తారు.
న్యూ ఢిల్లీ నుంచి – కపిల కాశీపతి, కలపటపు రామగోపాలరావు, వారణాసి సుబ్రహ్మణ్యం, కొంగర జగ్గయ్య, పన్యాల రంగనాధరావు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, దుగ్గిరాల పూర్ణయ్య, జె.మంగమ్మ, తిరుమలశెట్టి శ్రీరాములు,  మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, సూర్యదేవర ప్రసన్నకుమార్, రాజశ్రీ, బుచ్చిరెడ్డి (అతి స్వల్ప కాలం)
ప్రముఖ రచయిత శ్రీపతి (అసలు పేరు పుల్లట్ల చలపతిరావు) కూడా దాదాపు దశాబ్దంపాటు ఢిల్లీలో కాజువల్ న్యూస్ రీడర్ గా పనిచేశారు.

పెద్దవిశేషమేమిటంటే మహాకవి శ్రీ శ్రీ  సయితం  కొద్దికాలం ఢిల్లీ ఆకాశవాణి తెలుగు విభాగంలో పనిచేశారు. ఆయన కూడా తెలుగులో వార్తలు చదివినట్టు  అనౌన్స్సర్ల సంఘం ఇటీవల  వాచస్పతి పేరుతొ ప్రచురించిన ప్రత్యెక సంచికలో పేర్కొన్నారు.
నిర్వహణ కారణాల రీత్యా న్యూఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే తెలుగు వార్తలను కూడా హైదరాబాద్ కేంద్రానికి బదిలీ చేయడం వల్ల అక్కడి న్యూస్ రీడర్లు కూడా ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వార్తలు చదువుతున్నారు.
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వార్తలు చదువుతున్నది- యండ్రపాటి మాధవీ లత, సమ్మెట నాగమల్లేశ్వర రావు, గద్దె దుర్గారావు, తురగా ఉషారమణి
రేడియో అక్కయ్యగా ప్రసిద్దురాలయిన తురగా జానకీ రాణి, సుప్రసిద్ధ హాస్య రచయిత తురగ కృష్ణ మోహన రావు దంపతుల ముద్దుల బిడ్డే ఈ ఉషారమణి. 
(ఇంకా వుంది)

2 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

భండారు వారు, స్వర్గీయ కలపటపు రామగోపాలరావు గారు మా తోడల్లుడు గారు. ఆయన గురించి మీరు ప్రస్తావించటం సంతోషం కలిగించింది. అయన శ్రీమతి సీత గారూ మా శ్రీమతి శారదా స్వయానా అక్క చెల్లెళ్ళు. నా వివాహం నాటికే ఆయన పరమపదించారు. కాని అయన గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు వారు బహుముఖప్రజ్ఞాశాలి అని.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ శ్యామలీయం గారు: అంతటి గొప్ప వ్యక్తి మీ కుటుంబ సభ్యులు కావడం అదృష్టం.