30, నవంబర్ 2019, శనివారం

రేడియో రోజులు - 29 - భండారు శ్రీనివాసరావు


(Published  in SURYA daily on 30-11-2019, Saturday)

'జ్ఞానపీఠ్' అవార్డ్ గ్రహీత రావూరి భరద్వాజ అసలు పేరు

నేను రేడియోలో చేరిన రోజుల్లో తెల్లని ధోవతి, లాల్చీ  ధరించి, చేతిలో కొన్ని కాగితాలతో ఒక పెద్దాయన రేడియో ఆవరణలో కనిపించేవారు. వెంకట్రామయ్య గారు కాబోలు ఓసారి ఆయన్ని నాకు పరిచయం చేశారు. ఆయనే  రావూరి భరద్వాజ.
నా చిన్నతనంలోనే ఆయన రాసిన 'పాకుడురాళ్ళు' నవల సీరియల్ గా వచ్చేది. ఆ నవల ఆకర్షణకు గురయిన అనేక వేలాదిమందిలో నేనొకడిని. సాక్షాత్తు ఆ నవలా రచయిత పనిచేస్తున్న రేడియోలోనే నేనూ పనిచేస్తున్నాను అనే ఎరుక నాకు చాలా ఆనందాన్ని కలిగించేది. తర్వాత నేను ఎక్కడ కనబడినా ‘ఏమయ్యా శ్రీనివాసూ! ఎలా వున్నావు’ అని ఆప్యాయంగా పలకరించేవారు.
నేను చదువుకునే రోజుల్లో చదివిన ఈ పాకుడు రాళ్ళు నవలకే తదనంతర కాలంలో 'జ్ఞానపీఠ్' అవార్డ్ లభించింది. ఈ అవార్డు  ఆయన స్థాయికి చిన్నదని చెప్పను కాని ఆలస్యంగా వచ్చిందని మాత్రం చెప్పగలను. ఎంత ఆలస్యం జరిగిందంటే అది స్వీకరించిన కొద్దిరోజుల్లోనే ఆయన మరణించడమే అందుకు తార్కాణం.
భరద్వాజ గారు రేడియో మీడియంను ఆపోశన పట్టారేమో అనిపిస్తుంది. స్పోకెన్ వర్డ్ కార్యక్రమానికి ఆయన ఆధ్వర్యం వహించేవారు. రేడియోలో మాట్లాడినట్టు వుండాలి కానీ, కాగితం చూసి చదివినట్టు వుండకూడదు అనేవారు. స్క్రిప్ట్ రాసుకుని స్టుడియోలోకి వెళ్ళి చదివినా ఏదో కబుర్లు చెబుతున్నట్టు వుండేది. స్క్రిప్ట్ ఆ విధంగా తయారు చేసుకోవడం కూడా ఒక కళ. ప్రముఖుల ప్రసంగాలను రికార్డు చేసేటప్పుడు కూడా వారి రాత ప్రతిని తేలిగ్గా చదవడానికి వీలుగా సవరించేవారు.
రావూరి భరద్వాజ గారు  ఇంత పొడవు గడ్డం  పెంచనప్పుడే కాదు అసలు గడ్డం ఏదీ లేనప్పుడు కూడా నాకు తెలుసు. నేను రేడియోలో పనిచేస్తున్నప్పుడు,  విలక్షణ వ్యక్తిత్వం కలిగిన ఈ మహా రచయితతో సన్నిహిత పరిచయం వుండేది.  
భార్య చనిపోయిన తర్వాత అనుకుంటాను ఆమెను గుర్తు చేసుకుంటూ  కాంతం కధలు రాశారు. ఆ వియోగభారంతోనే కాబోలు రావూరి భరద్వాజ గారు గడ్డం మీసాలు పెంచడం మొదలుపెట్టారంటారు.
జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయిన రావూరు భరద్వాజ, పూర్వాశ్రమంలో రావూరు శరభాచారి.
ఆయన గురించిన  మరో చిన్న జ్ఞాపకం:
మొగ్గ తొడిగిన ఎర్ర గులాబి అనే పేరుతొ తెలుగులో భరద్వాజ అనువదించిన ఈ పుస్తకం వెనుక చిన్నకధ చెప్పుకోవడం నాకు తెలుసు. రాజకీయ నాయకుల్లో నెహ్రూ ఒక్కరినే అమితంగా అభిమానించే సుప్రసిద్ధ జర్నలిస్టు కేఏ అబ్బాస్, నెహ్రూ అనంతరం ఆయన బిడ్డ ఇందిర ప్రధాని కాగానే 'Return of the RED ROSE' అనే పేరుతొ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని 'మొగ్గ తొడిగిన ఎర్రగులాబి' పేరుతొ శ్రీ రావూరి భరద్వాజ తెనిగించారు.
ఒకసారి  శ్రీమతి గాంధి హైదరాబాదు వచ్చినప్పుడు, అప్పుడు రేడియోలో పనిచేస్తున్న భరద్వాజగారే స్వయంగా తాను అనువదించిన ఈ పుస్తకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీకి బహుకరించారు. ఆవిడ అంతకుముందు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా వున్నప్పుడు రేడియోలో (అప్పటికి దూరదర్శన్ లేదు) పనిచేస్తున్న స్టాఫ్ ఆర్టిస్టుల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలతో సరిసమానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న భరద్వాజ గారు ఆమె చేసిన ఈ మేలుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ పుస్తకాన్ని ఆమెకు అందచేసారు.
తన మేలైన జ్ఞాపకాలను మనకు వొదిలేసి రావూరి భరద్వాజగారు 2013 లో  హైదరాబాదులో స్వల్ప అస్వస్థత అనంతరం  కన్నుమూశారు. 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

తెలుగు భాష లో బహుశ: ఆఖరి మహాకవి శివారెడ్డి - ప్రజాకవి గోరేటి వెంకన్న గార్లకు జ్ఞానపీఠ్ పురస్కారం ఇవ్వాలి.