(Published in SURYA telugu daily on 09-11-2019, Saturday)
రేడియో స్టేషన్ మొత్తంలో డైరెక్ట్ టెలిఫోన్ వుండేది డైరెక్టర్ తరవాత మా న్యూస్ రూంలోనే. మిగిలిన వాళ్ళను కాంటాక్ట్ చేయాలంటే ఎక్స్ టెన్షన్ నంబర్ డయల్ చేయాల్సి వచ్చేది. అందువల్ల ఎవరెవరి ఫోన్లో మాకు వస్తుండేవి.
ఒకరోజు ఆర్టీసీ ఆఫీసునుంచి ఫోన్. చైర్మన్ లైన్లోకి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. ఆయనతో వున్న పరిచయంతో - ఇంకా ఎవరెవరు వస్తున్నారని మాటవరసకు అడిగాను. “ఎవరూ లేరు, మీరూ మీతో పాటు మీ దగ్గర రైతుల ప్రోగ్రాములు అవీ చూస్తూవుంటారే అదే – నిర్మలా వసంత్, విజయకుమార్ – వాళ్ళల్లో ఎవరినయినా ఒక్కసారి ఫోను దగ్గరికి పిలిస్తే వాళ్ళకు కూడా చెబుతాను.” అన్నారాయన. అప్పుడు లైట్ వెలిగింది. ఆయన ఫోను చేసింది వాళ్ళకోసం. భోజనానికి పిలుద్దామని అనుకుంది కూడా వాళ్లనే. ముందు ఫోన్ రిసీవ్ చేసుకున్నాను కనుక, విలేకరిగా తెలిసినవాడిని కనుక - మర్యాదకోసం నన్ను కూడా పిలిచివుంటారు.
ఆయన ఎవరో కాదు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఇందిరాగాంధీ హయాంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎం. సత్యనారాయణరావు గారు.
ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే - రేడియోలో పనిచేసే కళాకారులు ఎవరో బయటకు తెలియకపోయినా , వారి స్వరాలే వారిని నలుగురికీ సుపరిచితుల్ని చేస్తాయని చెప్పడానికి. ఆ తరవాత కాలంలో సత్యనారాయణరావుగారిని నేను కలిసిన ప్రతి సందర్భంలోనూ, వాళ్ళిద్దరినీ మెచ్చుకుంటూ మాట్లాడేవారు. ఎప్పుడో డిల్లీలో వున్నప్పుడు మినహా తప్పకుండా వారి కార్యక్రమాన్ని వింటూవుంటానని చెప్పేవారు. రేడియో పెడితే చాలు, పాలూ పేడా తప్ప ఇంకేముంటాయి అని హేళనగా మాట్లాడుకునే రోజుల్లో – ఇలాటి వారుచెప్పే మాటలే
ఆ కళాకారులకు నూతన జవసత్వాలను ఇచ్చేవని అనుకుంటాను.
ప్రతిరోజూ మధ్యాహ్నం హైదరాబాదు కేంద్రం నుంచి వెలువడే ప్రాంతీయవార్తలు ముగియగానే వ్యవసాయదారుల కార్యక్రమం మొదలయ్యేది. రైతులకు సంబంధించిన అనేక అంశాలను వారికి పరిచితమయిన యాసలో వారిద్దరూ వివరించే తీరు జనరంజకంగా వుండేది. ఏదో సర్కారు ఉద్యోగమేకదా అనుకుంటే వారలా ఆ కార్యక్రమానికి అంతగా కష్టపడి జీవం పోయాల్సిన అవసరం వుండేదికాదు. సత్యనారాయణరావుగారి వంటి వారే కాదు, వారి కార్యక్రమం అంటే చెవికోసుకుని వినేవారెందరో వుండేవారు.
అలాగే కార్మికుల కార్యక్రమం. ఆ కార్యక్రమం రూపొందించే తీరుకు ముగ్ధులై, కార్మికులు కాని వారు కూడా శ్రద్ధగా వినేవాళ్ళు. బాలల పత్రిక ‘చందమామ’ ను చదవడానికి పిల్లల కంటే పెద్దవాళ్ళే ఎక్కువ మక్కువపడినట్టుగా. అందులో రాంబాబుగా డి. వెంకట్రామయ్య గారు, చిన్నక్కగా శ్రీమతి వి.రతన్ ప్రసాద్ గారు, ఏకాంబరంగా వట్టెం సత్యనారాయణ గారు ఆ రోజుల్లో స్టార్ డం సంపాదించుకున్న రేడియో కళాకారులు. స్కూళ్ళు, కాలేజీల్లో జరిగే వార్షికోత్సవాలకు వీరిని ముఖ్య అతిధులుగా పిలిచి సన్మానించేవారు. వెంకట్రామయ్యగారు తరువాతి కాలంలో న్యూస్ రీడర్ గా మారారు. రిటైర్ అయ్యేంతవరకూ అదే ఉద్యోగం.
ఈ రేడియో కళాకారులవి గొర్రె తోక జీతాలు. ఎదుగూ బొదుగూ లేదు. ప్రమోషన్లు లేవు. ఎక్కడ చేరారో అక్కడే రిటైర్ అయ్యేవాళ్ళు. అయినా మనసుపెట్టి పనిచేసేవారు. వారికిది వృత్తి కాదు. ప్రవృత్తి. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టులుగా పనిచేసిన వారిలో ప్రముఖ సంగీత విద్వాంసులు, వాయిద్య కళాకారులు, కవులూ, రచయితలూ వుండేవారు. స్టేషన్ డైరెక్టర్లు కూడా వీరికి ఎంతో మర్యాద ఇచ్చేవారు. నేను చేరకముందు – శ్రీయుతులు దేవులపల్లి కృష్ణశాస్త్రి, స్తానం నరసింహారావు, మునిమాణిక్యం నరసింహారావు, గోపీచంద్, బుచ్చిబాబు, నాయని సుబ్బారావు, న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య), బాలాంత్రపు రజనీకాంతరావు, గొల్లపూడి మారుతీరావు, రావూరి భరద్వాజ, శంకరమంచి సత్యం, నండూరి విఠల్ వంటి దిగ్గజాలు హైదరాబాద్ రేడియో కేంద్రంలో పనిచేశారు. వీరుకాక, భాస్కరభట్ల కృష్ణారావు, శారదా శ్రీనివాసన్, రతన్ ప్రసాద్ (చిన్నక్క), తిరుమలశెట్టి శ్రీరాములు, వింజమూరి సీతాదేవి, మాడపాటి సత్యవతి, జ్యోత్స్నా ఇలియాస్, ఇందిరా బెనర్జీ ఒకరా ఇద్దరా ఇందరు తమ స్వరాలతో హైదరాబాద్ రేడియో కేంద్రానికి అజరామర కీర్తిని సముపార్జించి పెట్టారు. నాకు తెలిసి వీళ్ళల్లో ఎవ్వరూ కూడా నెలకు అయిదారువందలకు మించి జీతాలు తీసుకున్నవారులేరు. ఇందిరాగాంధీ ప్రధాని కావడానికి పూర్వం సమాచార ప్రసార శాఖల మంత్రిగా వున్నప్పుడు రేడియోలో పనిచేసే స్టాఫ్ ఆర్టిస్టుల స్తితిగతులు అర్ధంచేసుకుని, వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ( పే స్కేల్స్) జీత భత్యాలు లభించేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ప్రమోషన్లు ఇతర సౌకర్యాలు కూడా వర్తింపచేశారు.
ఆకాశవాణి నిలయ కళాకారుల ప్రసక్తి వచ్చింది కాబట్టి, వారిలో కొందరు తమ వృత్తిధర్మం పట్ల ఎంతటి నిబద్ధతతో ఉంటారో తెలియచెప్పే ఒక ఉదంతాన్ని రేడియోలో నా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు మాటల సందర్భంలో వివరించారు.
మహాలయ పక్షాలను పురస్కరించుకుని పితృదేవతలకు తర్పణాలు వదలడానికి ఆయన ఇటీవల సతీసమేతంగా కాశీ వెళ్ళారు. గంగానది ఉధృతంగా వొడ్డును వొరుసుకుని పారుతోంది. ఒక్క కేదారేశ్వర ఘాట్ లోనే వారికి వెసులుబాటు దొరికింది. అక్కడ విధులను సక్రమంగా పూర్తిచేసుకుని ఘాట్ సమీపంలోని ఒక గుడి దగ్గరకు వెళ్ళారు. ఆ ప్రాభాత వేళలో వినవచ్చిన వయోలిన్ వాయిద్య సంగీతం ఆయన్ని ఆకర్షించింది. పరికించి చూస్తే ఒక అరుగులాంటి గద్దెపై కూర్చుని ఎవరో వయోలిన్ వాయిస్తున్నారు. ఒక్క కట్టు పంచె తప్ప ఆయన శరీరంపై ఎలాంటి ఆచ్చాదనా లేదు. స్వతహాగా సంగీత ప్రియుడయిన కృష్ణారావు గారు త్యాగరాజ స్వామివారు ఓ కృతిలో ఆలపించినట్టు ‘నాదలోలుడై బ్రహ్మానందాన్ని’ అనుభవించిన అనుభూతిని పొందారు. ‘నాద తనుమనిశం శంకరం నమామి’ అనే త్యాగరాయ కృతిని చిత్తరంజన్ రాగంలో వయొలిన్ పై అద్భుతంగా పలికిస్తున్న ఆ కళాకారుడికి పాదాభివందనం చేద్దామని వెళ్ళారు. చిరుకానుకగా తన చేతికి వచ్చిన కొంత మొత్తాన్ని ఇవ్వబోగా ఆయన మృదువుగా తిరస్కరించి అవసరంలో ఉన్నవారికి ఎవరికైనా ఇవ్వండి అని చెప్పారు. మాటల మధ్యలో ఆయన పేరు తెలియగానే ఆశ్చర్యపోవడం కృష్ణారావు గారి వంతయింది. ఎందుకంటే గంగాతీరంలో ఒంటరిగా కూర్చుని వయొలిన్ వాయిస్తూ తన్మయత్వంలో ఓలలాడుతున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో నిలయకళాకారులు శ్రీ మంగళంపల్లి సూర్యదీప్తి. కృష్ణారావుగారు వార్తావిభాగంలో న్యూస్ ఎడిటర్ గా అప్పుడు పనిచేసేరోజుల్లో వారితో పరిచయం కూడా వుండేది. అఖిల భారత స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శ్రీ సూర్య దీప్తి, బెంగుళూరులో పదవీవిరమణ అనంతరం తుచ్చమైన లౌకిక సుఖాలను పరిత్యజించి, కాశీ వెళ్లి అక్కడే ఒంటరిగా భాగీరధీ తీరంలో వయోలిన్ పై కృతులు పలికిస్తూ సంగీత పారవశ్యంలో తన శేష జీవితాన్ని గడుపుతున్నారు.
(ఇంకా వుంది)

2 కామెంట్లు:
// "స్కూళ్ళు, కాలేజీల్లో జరిగే వార్షికోత్సవాలకు వీరిని ముఖ్య అతిధులుగా పిలిచి సన్మానించేవారు." //
అవునండీ. నేను విజయవాడలో డిగ్రీ చదువు చదువుతున్న రోజుల్లో అక్కడ ఆల్ ఇండియా రేడియోలో ఆమంచర్ల గోపాలరావు గారు పని చేస్తుండేవారు. ఒక సంవత్సరం మా కాలేజ్ వార్షికోత్సవానికి వారిని ఆహ్వానించారు. కాలేజ్ కార్ లో AIR Station కు వెళ్ళి (పున్నమ్మ తోట) వారిని కాలేజ్ కు తీసుకురమ్మని మా ప్రిన్సిపాల్ గారు నన్ను పంపిస్తే అలాగే వెళ్ళి తీసుకొచ్చాను.
(మరో సంవత్సరం విశ్వనాథ సత్యనారాయణ గారిని తీసుకురావడానికి కూడా నేనే వెళ్ళాను.)
"ప్రసార ప్రముఖులు" అని ఒక వ్యాసం వికీలో కనిపించింది. ఆసక్తికరంగా ఉంది. ఈ క్రింది లింక్ లో చదవచ్చు. మీ పేరు కూడా ఉంది.
"ప్రసార ప్రముఖులు"
కామెంట్‌ను పోస్ట్ చేయండి