(Published in SURYA daily on 14-11-2019, Thursday)
రెండున్నర అణాల కోసం నానా హైరానా
రాష్ట్ర ప్రభుత్వాల సంగతి తెలియదు కానీ
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడడానికి అనేక
నిబంధనలు వుంటాయి. అయితే దుర్వినియోగం అసలు ఏమాత్రం జరగదు అని చెప్పడానికి కూడా
వీలు లేదు. నిబంధనలను అతిక్రమించేవారికి భారీ జరిమానాలు వుంటాయి. కానీ నిబంధనలకు
విరుగుళ్ళు కనిపెట్టి ప్రభుత్వ బొక్కసానికి చిల్లులు పెట్టే ఘనులు కూడా వుంటారు. ఖచ్చితమైన
ఆడిటింగ్ వుంటుంది. ఖర్చుపెట్టే ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సివుంటుంది. లెక్క
అంటే మరేమీలేదు, ప్రతి ఖర్చుకూ ఒక రసీదు సమర్పించాలి. వాటి చాటు మాటున
గుట్టుముట్లు ఏమిటన్నది జవాబు లేని ప్రశ్న.
ఒక సంగతి చెప్పుకునేవారు. ఎంత నిజమో
తెలియదు. కలకత్తా ఆలిండియా రేడియో డైరెక్టర్ ఒక కార్యక్రమ రూపకల్పనలో రెండున్నర
అణాలు (ఆనాటి ద్రవ్యమానం ప్రకారం రూపాయికి పదహారణాలు) నిబందనలను ఖాతరు చేయకుండా
ఖర్చు చేశాడని ఆరోపణ.
రేడియో స్టేషన్ వాళ్ళు జంతు
ప్రదర్శనశాలలో పిల్లల కోసం ఒక కార్యక్రమాన్ని రికార్డు చేశారు. వివిధ రకాల జంతువులు, పక్షుల అరుపులు ఎలా వుంటాయనే విషయంపై చిన్నపిల్లలకు అవగాహన కల్పించడం దీని ఉద్దేశ్యం.
ఇక్కడే అనుకోని అవాంతరం ఎదురయింది.
పిల్లల్ని జూలో ఉన్న పులి బోను దగ్గరికి తీసుకువెళ్ళారు. ఎంత
ప్రయత్నించినా బోనులోని పులి మూగనోము
పట్టింది. పులి గాండ్రించే విధానం రికార్డు చేయడం ఆ కార్యక్రమంలో ముఖ్యమైన అంకం.
జూ కాపలాదారు ఒక తరుణోపాయం చెప్పాడు.
ఒక చికెన్ ముక్క పడేస్తే అది మనం చెప్పిన మాట వింటుంది అన్నాడు. రేడియో అధికారులు
రెండున్నర అణాలు అతడి చేతిలో పెట్టి మాంసం తెప్పించి పులి నోటికి అందించారు.
చిత్రంగా అతగాడు చెప్పినట్టే ఆ పులి గట్టిగా ఘా౦డ్రి౦చింది. ఆ విధంగా మొత్తం మీద ఆ రికార్డింగు కార్యక్రమం జయప్రదంగా
పూర్తిచేసుకుని వెళ్ళారు.
ఆ తర్వాత పెద్ద చిక్కొచ్చి పడింది.
ఆడిట్ వాళ్ళు పులికోసం మాంసం కొనడం నిబంధనలకు విరుద్ధం అని కొర్రీ వేసారు. ఇలా
ప్రజాధనాన్ని ఖర్చు చేసే అధికారం స్టేషన్ డైరెక్టర్ కి లేదు పొమ్మన్నారు. వెంటనే ఆ
రెండున్నర అణాలు ప్రభుత్వ ఖజానాకు జమ చేయకపొతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రేడియో రికార్డింగుల నిమిత్తం కళాకారులను ఆహ్వానించినప్పుడు వారికి కాఫీ
గట్రా ఇచ్చి మర్యాదలు చేసేందుకు కొంత
సొమ్ము ఖర్చు చేసే అవకాశం వుందని రేడియో కేంద్రం వారు బదులు చెప్పారు.
ఆడిట్ వాళ్ళు తక్కువ తినలేదు.
కళాకారులతో రికార్డింగు చేసేటప్పుడు వారితో కాంట్రాక్ట్ మీద సంతకం చేయించాలనే
నిబంధనని వాళ్ళు బయటకు తీసారు. పులితో సంతకం చేయించుకున్నట్టు కాంట్రాక్ట్
వుండాలి. ఠాట్! అది లేకుండా బిల్లును ఆమోదించేది లేదని మంకుపట్టు పట్టారు.
రేడియో స్టేషన్ కు వచ్చే పెద్దవాళ్ళకు
మర్యాదలు చేసేందుకు స్టేషన్ డైరెక్టర్ గా తనకు అధికారాలు వున్నాయని, ఆ పులి రాయల్
బెంగాల్ టైగర్ కాబట్టి ఆ మర్యాదలకు, గౌరవాలకు ఆ పులికి కూడా అర్హత వున్నదని పాయింటు లేవదీసి మరో లేఖ రాసారు.
ఆ పులి రాయల్ బంగాల్ టైగర్ అంటూ జంతు ప్రదర్శనశాల వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ను
దానికి జత పరిచారు. తన అరుపు రికార్డింగు చేసుకోవడానికి పులి ఎటువంటి రుసుము
అడగనందున కాంట్రాక్ట్ వుండి తీరాలనే నిబంధన ఇక్కడ వర్తించదని, అందుకే తనకున్న విచక్షణాధికారాతో దాన్ని మినహాయించానని
డైరెక్టర్ తన చర్యని సమర్ధించుకున్నారు.
ఆ వివరణతో సంతుష్టి పడిన ఆడిట్
అధికారులు తదుపరి చర్యలను విరమించుకున్నారు.
రెండున్నర అణాల కోసం ఇంత తతంగం,
లేఖాయణం నడిచింది. పులిరాజు ఆహారానికి ఖర్చు పెట్టిన దానికంటే పోస్టల్ చార్జీలు
ఎక్కువై వుంటాయి.
ఇందులో ఒక నీతితో కూడిన హెచ్చరిక
దాగుంది. అదేమిటంటే ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం కుదరదు, ప్రతి
విషయాన్ని కూలంకషంగా పరిశీలించి గమనించే కనిపించని కన్ను ఒకటుందని చెప్పడం. అయితే
ముందే చెప్పినట్టు ప్రతి నిబంధనకు ఓ విరుగుడు కనిపెట్టడం అనేది ఈనాటి తరానికి వెన్నతో
పెట్టిన విద్య.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు
అని వూరికే అనలేదు.
(ఇంకా వుంది)
2 కామెంట్లు:
రెండున్నర అణాలకోసం నడిచిన ఈలేఖాయణం కోసం ఎన్ని రూపాయల ప్రజాధనం ఖర్చు ఐనదో కదా! దీన్నే Penney wise pound foolish అంటారు.
ఇలాంటి పిచ్చి వ్యవహారాలతో నే ప్రభుత్వ శాఖలు చెక్కలోకి పోతాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి