(Published in SURYA Telugu Daily on 03-11-2019, SUNDAY)
ఇప్పుడు శిధిలావస్థలో వున్న (కూలగొట్టారేమో తెలియదు, సచివాలయానికి వెళ్లక ఏండ్లూ పూండ్లు గడిచిపోయాయి) ఓ పాత భవనం మొదటి అంతస్తులో సీఎం పేషీ వుండేది. ఆ భవనాన్ని నిజాం బకింగ్ హాం ప్యాలెస్ నమూనాలో నిర్మించారని చెబుతారు. మొదటి అంతస్తు చేరుకోవడానికి వున్న చెక్క మెట్ల వరుస కూడా రాజభవనాన్ని గుర్తుకు తెచ్చే విధంగా వుండేది. దాని రెయిలింగుకు వాడిన కలప ఎంతో ఖరీదయినది. 'మహోగని' అనే అరుదయిన వృక్షజాతికి చెందిన ఆ కలప బంగారం కంటే విలువయినదని చెబుతారు. ఫలక్ నామా ప్రాసాదంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, అతి పొడవైన భోజనాల బల్ల కూడా ఆ కలపతో తయారైనదే. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆయనకూ సచివాలయ ఉద్యోగులకూ నడుమ ఏదో పేచీ వచ్చి అందరూ ఆయన కార్యాలయంపై విరుచుకు పడ్డారు. ఆ సందర్భంలో మెట్లకు అమర్చిన రెయిలింగు దెబ్బతిన్నది. సచివాలయంలో పనిచేసే ఓ పాతకాలపు వడ్రంగి అది చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయ్యో అది బంగారం కంటే ఖరీదు, వీళ్ళెవ్వరికీ తెలిసినట్టు లేదు' అని వాపోయాడు.
ప్రస్తుత తెలంగాణా ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించే పట్టుదలతో వుంది కాబట్టి ఆ పాత గుర్తులను ఫోటోలలో లేదా వీడియోలలో నిక్షిప్తం చేస్తే భావి తరాలకు ఉపయుక్తంగా వుంటుంది.
సరే విషయానికి వస్తే,
నాలుగు దశాబ్దాలకు పూర్వం ఇప్పుడు ఉన్న సచివాలయం ఫ్లై ఓవర్ లేదు. ప్రధాన ద్వారం కూడా హుస్సేన్ సాగర్ వైపున కాకుండా మెయిన్ రోడ్డు మీద వుండేది. ఇనుప చువ్వలతో కూడిన పెద్ద గేటు. ఆ గేటు దగ్గర ఇప్పట్లోలా మందీ మార్బలం వుండేది కాదు. ఒకళ్ళో ఇద్దరో సచివాలయం సిబ్బంది కాపలాగా వుండేవాళ్ళు. సచివాలయం బీట్ చూసే విలేకరులం అందరం ప్రతి రోజూ అక్కడ కలిసేవాళ్ళం. ఎంట్రీ పాసు వున్నా కూడా లోపలకు వెళ్ళడానికి మొదట్లో బెరుగ్గా వుండేది. ఆదిరాజు వెంకటేశ్వర రావు గారు సీనియర్ జర్నలిస్టు. ఆయన పనిచేసే ఆంధ్రజ్యోతి ఆఫీసు సచివాలయం ఎదురుగానే వుండేది. ఆయన ఫుల్ సూటు ధరించి ఒక చేతిలో బ్రీఫ్ కేసు, మరో చేతి వేళ్ళనడుమ వెలుగుతున్న సిగరెట్టుతో దర్జాగా వస్తుంటే అల్లంత దూరం నుంచే కాపలాదారు గుర్తుపట్టి, సెల్యూట్ చేసి గేటు తెరిచేవాడు. విలేకరి జీవితం అలవాటు అయిన పిదప ఈ వైభోగం నాకూ పట్టింది అనుకోండి. విజిటింగ్ కార్డు అవసరం లేని విలేకరిగా అందరూ గుర్తుపట్టే పరిస్తితి వచ్చింది. చిత్రం ఏమిటంటే రేడియో స్టేషన్ దగ్గర కాపలా వాళ్ళు మాత్రం ప్రతిసారీ మీరు ఎవరి కోసం వచ్చారు అని అడిగేవారు. ఎందుకంటే నేను అక్కడ గడిపేది కాసేపే.
సచివాలయంలో రోజువారీ విలేకరుల సమావేశాలు ముగిసిన తర్వాత నడుచుకుంటూ రేడియోకి వెళ్ళేవాడిని. ఓ రోజు అలా వెడుతూ గోపీ హోటల్ (ఆ రోజుల్లో చాలా ఫేమస్. కామత్ హోటల్ ఎదురుగా ఓ పాత భవనంలో వుండేది) దాకా వచ్చాను. ఇంతలో సైరన్ మోగించుకుంటూ ఓ పోలీసు వాహనం వెళ్ళింది. కాసేపటికి మరో వాహనం నా పక్కగానే వెళ్లి కొంత ముందుకు పోయి ఆగింది. అందులో నుంచి ముఖ్యమంత్రి భద్రతాధికారి బాలాజీ దిగి నా వైపుగా వచ్చాడు. సిఎం గారు కారులో వున్నారు అని చెప్పి ఎక్కించాడు. అది సరాసరి రేడియో స్టేషన్ ఆవరణలోకి వెళ్ళింది. ఈలోగా ముందు వెళ్ళిపోయిన పైలట్ కారు వెనక్కి వచ్చింది. నన్ను దింపేసిన తర్వాత సీఎం కాన్వాయ్ తిరిగి వెళ్ళిపోయింది. చెప్పాపెట్టకుండా ముఖ్యమంత్రి రేడియో స్టేషన్ కి రావడం చూసి అందరూ నివ్వెర పోయారు.
నడిచి వెడుతున్న నాకు ఆఫీసుదాకా అడగకుండా లిఫ్ట్ ఇచ్చిన ఆ ముఖ్యమంత్రి ఎవరంటే ఆరణాల కూలీగా ప్రసిద్ధి చెందిన టి. అంజయ్య గారు.
ఆయన భోళాతనం, అమాయకత్వం రాజకీయ నాయకులకు వేళాకోళంగా అనిపించేవేమో కానీ సామాన్య జనం మాత్రం బాగా ఇష్టపడేవారు. మనసులో ఏదీ దాచుకునేవారు కాదు. మాటల్లో, చేతల్లో తానొక ముఖ్యమంత్రిని అనే అతిశయం, ఆర్భాటం కానవచ్చేది కాదు.
ఒకరోజు మెదక్ జిల్లా పర్యటనకోసం సచివాలయం నుంచి ముఖ్యమంత్రి బయలుదేరారు. నేనూ ఆయన కారులోనే వున్నాను. అప్పటికి ఖైరతాబాదు ఫ్లై ఓవర్ లేదు. కాన్వాయ్ రాజభవన్ రోడ్డులోకి ప్రవేస్తుండగా అంజయ్య గారు ఇక్కడెక్కడో మదన్ ఇల్లు ఉండాలే అన్నారు. మదన్ అంటే మదన్ మోహన్. అంజయ్య మంత్రివర్గంలో ముఖ్యుడు. ఆయన ఇంటికి పోదాం అని చెప్పడంతో కారును అటు తిప్పారు. ముఖ్యమంత్రి హఠాత్తుగా చెప్పాపెట్టకుండా రావడంతో అక్కడ సిబ్బంది కంగారుపడి మంత్రికి చెప్పారు. మదన్ మోహన్ గారు లోపల నుంచి హడావిడిగా బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి తాపీగా ‘మదన్! బాత్ర్రూం ఎక్కడ?’ అని అడిగి కాలకృత్యం తీర్చుకుని వచ్చారు. తర్వాత మదన్ మోహన్ గారి శ్రీమతి తాయారు చేసిచ్చిన చాయ్ తాగి మళ్ళీ బయలుదేరారు. అలా వుండేది అంజయ్య గారి వ్యవహార శైలి. ఎలాంటి భేషజాలు లేని మనిషి.
అంజయ్య గారిని మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వెంటనే అంజయ్య గారు ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేసారు. మర్నాడు – కొత్త నాయకుడి ఎన్నిక. అప్పటికి ఇంకా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రే. నేనూ జ్వాలా కలసి ముఖ్యమంత్రి అధికార నివాసం ‘జయప్రజాభవన్’ ( గ్రీన్ లాండ్స్) కు వెళ్లేసరికి పొద్దు బాగా పోయింది. అంతా బోసిపోయి వుంది. నాయక జనం జాడ లేదు. మేడ మీద అంజయ్య గారు తన షరా మామూలు వస్త్ర ధారణతో అంటే - గళ్ళ లుంగీ, ముతక బనీనుతో కనిపించారు. ఏమి మాట్లాడాలో తోచలేదు. కాసేపువుండి వచ్చేస్తుంటే వెనక్కి పిలిచారు. ఒక పిల్లవాడిని చూపించి ‘చూడు శ్రీనివాస్ – ఇతడికి దూరదర్శన్ లో ఏదో కాజువల్ ఉద్యోగం కావాలట. ఎవరికయినా చెప్పి చేయిస్తావా ?’ అని అడుగుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను పని చేసేది రేడియోలో అని ఆయనకు బాగా తెలుసు. అయినా తనని నమ్ముకుని వచ్చిన ఆ పిల్లవాడిని చిన్నబుచ్చడం ఇష్టం లేక నన్ను అడిగి వుంటారు.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అంజయ్య ఇలా అన్నారు.
“మేడం (ఇందిరాగాంధీ) దయవల్ల నేను ఈ పదవిలోకి వచ్చాను. ఆవిడ ఆదేశాలకు కట్టుబడి దాన్ని వదులుకుంటున్నాను. కానీ ఎందుకు వచ్చానో, ఎందుకు వెళ్లిపోతున్నానో నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు”
కానీ తెలుగు ప్రజలకు ఒకటి బాగా అర్ధం అయింది. అమాయకుడు అయిన అంజయ్యని కాంగ్రెస్ అధిష్టానం ఘోరంగా అవమానించింది. అందుకే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా పార్టీ పెట్టిన ఎన్టీ రామారావును గెలిపించి, కాంగ్రెస్ ను అంతకంటే ఘోరంగా ఓడించారు.
ఆ తర్వాత చాలా కాలానికి అంజయ్య గారు అస్వస్థతకు గురై దేల్హిలోని రామమనోహర్ లోహియా ఆసుపత్రిలో కన్ను మూశారు. ఆ వార్త వెంటనే హైదరాబాదుకు తెలిసింది. అప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న శ్రీ పీవీ నరసింహారావు అంజయ్య భౌతిక కాయాన్ని విమానంలో హైదరాబాదు తీసుకు వస్తున్నట్టు జాతీయ వార్తా ఛానళ్ళు సమాచారం ఇచ్చాయి. బెజవాడ నుంచి వెలువడే కొన్ని ప్రధాన పత్రికల్లో కూడా అంజయ్య మరణ వార్త ‘లేట్ న్యూస్’ రూపంలో సంక్షిప్తంగా ప్రచురించారు.
విజయవాడ ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ గా ఉన్న ఆర్వీవీ కృష్ణారావు గారు ఫోను చేసి విషయం అడిగారు. వార్త కరక్టే అని చెప్పాను. కానీ ఆయన చనిపోయింది ఢిల్లీలో. నిబంధనల ప్రకారం ఢిల్లీ విలేకరి ఆ వార్తను ధ్రువపరచాలి. అందుకోసం ప్రయత్నించారు కానీ ఆ సమయంలో ఢిల్లీలోఎవరూ దొరకలేదు. చనిపోయింది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. నిబంధనల పేరుతొ ఆరోజు న్యూస్ బ్రేక్ చేయక పొతే ప్రజలనుంచి పెద్ద నిరసన వచ్చే ప్రమాదం వుంది. దాంతో ఏమైతే ఏమైందని కృష్ణారావు అంజయ్య గారి మరణ వార్తను ఇతర వివరాలతో కలిపి ఉదయం ఆరూ నలభయ్ అయిదు నిమిషాలకు మొదలయ్యే ప్రాంతీయ వార్తల్లో ప్రముఖంగా ప్రసారం చేసారు.
ఆ వెనువెంటనే ప్రసారం అయిన ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ ముచ్చటే లేదు.
‘తెలుగు ప్రముఖుడు ఒకరు చనిపోతే ఆ వార్తకు ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ విషయం చెప్పరా’ అంటూ టీడీపీ పార్లమెంటు సభ్యుడు శ్రీ పుట్టపాగ రాధాకృష్ణ హడావిడి చేసారు.
అంజయ్య గారి భౌతిక కాయం హైదరాబాదు బర్కత్ పురాలోని ఆయన ఇంటికి చేరకముందే జనం కిక్కిరిసిపోయారు. బీదా బిక్కీ కుటుంబాల వాళ్ళు ఆడవాళ్ళతో సహా గుండెలు బాదుకుంటూ వీధుల్లోకి వచ్చారు.
అందుకే ఆయన చనిపోయినప్పుడు ఒక పత్రిక (ఆంధ్రప్రభ) పెట్టిన పతాక శీర్షికను జర్నలిస్టు మిత్రుడు పాశం యాదగిరి ఎప్పుడూ గుర్తు చేస్తుంటాడు.
“గరీబోళ్ళ బిడ్డ – నిను మరవదు ఈ గడ్డ”.
(ఆ శీర్షిక పెట్టింది ప్రస్తుతం సాక్షి దినపత్రిక ఎడిటర్ శ్రీ మురళి)
కింది ఫోటో: ముఖ్యమంత్రి అంజయ్య, ఆయనతో పాటు టేప్ రికార్దర్ తో నేను)
(ఇంకా వుంది)
5 కామెంట్లు:
శ్రీనివాసరావు గారు,
మీరు ఇక్కడ నెమరు వేసుకునే జ్ఞాపకాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. అప్పుడప్పుడు కొన్ని రిపీట్ అవుతున్నప్పటికీ ... ఫరవాలేదు, ఎప్పటికప్పుడే చదివించేలా ఉంటున్నాయి.
ఒక మాటడుగుతాను, ఏమనుకోకండి. విలేకరిగా మీ అనుభవాలను చెబుతుంటే చాలాసార్లు నాకొక సందేహం కలుగుతుంటుంది. ప్రతి ముఖ్యమంత్రికి, ప్రభుత్వంలోని ఉన్నతొద్యోగులకు మీరు అంత సన్నిహితులవడం ఎలా సాధ్యమయింది? ప్రతి రేడియో / దూరదర్శన్ విలేకరికి అది మామూలేనా? ముఖ్యమంత్రితో కలిసి వారి కారులోనే వెళ్ళడం, మిమ్మల్ని రోడ్డు మీద చూసి ముఖ్యమంత్రి గారు తన కారాపి మిమ్మల్ని కూర్చోబెట్టుకోవడం, ఫొటోలో పడేటంత దగ్గరగా వారి పక్కనే నిలబడుండటం, మీకు కాలు ఫ్రాక్చర్ అయితే మీ ఇంటికొచ్చి పరామర్శించడం, వగైరాలు ... అంత సన్నిహితులు ఎలా అవగలిగారు? మీ విజయరహస్యం ఏమిటి? మీలో ఉన్న ఆ స్పెషల్ క్వాలిటీస్ ఏమిటి?
సాధారణంగా మీ బ్లాగులో వ్యాఖ్యలకు మీరు మౌనం వహిస్తుంటారు అని తెలిసినదే అనుకోండి. కానీ నా ఈ సందేహాన్ని మాత్రం తీర్చమని మనవి. ఎందుకంటే మీ జవాబుని బట్టి "విలేకరినైనా కాకపోతిని, సి ఎం కారులో వెళ్ళగా" అని నా గురించి నేను వాపోవచ్చా లేదా అనేది తేల్చుకుందామని (వాపోయినా ఒక జీవితకాలం లేటనుకోండి, ఈసారికిలా పోనియ్యి అనుకోవడమే), హ్హ హ్హ హ్హ :)
నిజాయితీ+సిన్సియారిటి+ప్రతిభ+లౌక్యం - awesome combination
@విన్నకోట నరసింహారావు గారూ. (And also @ అజ్ఞాత) మీ అభిమానానికి ధన్యవాదాలు. నేను ప్రతి వ్యాఖ్యకి ప్రతిస్పందించని మాట నిజం. మీ ప్రశ్నకు కింద ఎవరో అజ్ఞాత చక్కటి సమాధానం ఇచ్చారు (నిజాయితీ+సిన్సియారిటి+ప్రతిభ+లౌక్యం - awesome combination). నిజాయితీ, సిన్సియారిటీ, ప్రతిభ, లౌక్యం వీటి సంగతి పక్కన బెడితే చివరిది లౌక్యం కరక్టేమో అనిపిస్తోంది. అజ్ఞాత గారికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
ఈ విషయాలు అన్నీ లోగడ నా బ్లాగులో వచ్చినవే. ఈ మధ్య నా వ్యక్తిగత జీవితంలో సంభవించిన ఒక పూడ్చుకోలేని నష్టంతో (నా భార్య మరణం) బాధ పడుతున్నప్పుడు మనసు మళ్ళించుకోవడానికి నేను ఎన్నుకున్న మార్గం ఇది. సూర్య పత్రిక సంపాదకులు కూడా ప్రోత్సహించారు. అందువల్ల ఈ పాత కధలు చాలావరకు పునర్దర్సనమిస్తున్నాయి.
ఇకపోతే మరో ప్రశ్న అడిగారు. పెద్దపెద్ద వారితో ఈ విధమైన సాంగత్యం, సాన్నిహిత్యం ఒక రేడియో విలేకరికి ఎలా సాధ్యమని?. ఈ రోజుల్లో అది అసాధ్యం. నా ఉద్యోగం చివరి దశలో నాకీ వైభోగంలేదు. వందలో ఒకడిని. మందలో అంటే బాగుంటుందేమో.
ఒక ఈనాడు, ఒక టీవీ నైన్ ఇప్పుడు ఎలాగో, ఇన్ని రకాల ప్రచార, ప్రసార మాధ్యమాలు లేని రోజుల్లో రేడియో దే అగ్రస్థానం. నేను వచ్చానా లేదా అన్నది చూసుకున్న తర్వాతే ముఖ్యమంత్రులు ప్రెస్ కాన్ఫరెన్సులు మొదలు పెట్టిన రోజులు వున్నాయి. అది నా గొప్పతనం. అది నూటికి నూరు శాతం రేడియోదే. నమస్కారాలు.
@విన్నకోట నరసింహారావు గారు: దయచేసి చివరి వాక్యంలో నా గొప్పతనం అని పడింది. ఎడిట్ చేయడం నాకు రాదు. నా గొప్పతనం కాదు అని చదువుకోండి.
జవాబిచ్చినందుకు Thanks శ్రీనివాసరావు గారూ. ఆ గొప్పతనం మీది కాదు అని చెప్పడం మీ వినమ్రత.
(సందర్భాన్ని బట్టి చివరి వాక్యం సరిగ్గానే అర్థమయింది లెండి, ఇబ్బందేమీ లేదు)
కామెంట్‌ను పోస్ట్ చేయండి