26, ఫిబ్రవరి 2014, బుధవారం

VALID UPTO 2099

సీ.జీ.హెచ్.ఎస్.
కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న యాభై లక్షలమంది ఉద్యోగులకు, ముప్పై లక్షలమంది రిటైర్డ్ సిబ్బందికీ సురపరిచితమైన పదం. సిబ్బంది అనారోగ్యాలకు గురైనప్పుడు ఆదుకునేందుకు ఉద్దేశించిన సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్,(C.G.H.S.)  
1975 నుంచి 2005 వరకు నేను ఆకాశవాణి, దూరదర్శన్ లలోనే ఉద్యోగం చేసాను. మధ్యలో ఓ అయిదేళ్ళు మాస్కో రేడియోలో పనిచేయడం కోసం మాస్కోలో వున్నాను. ఆ సమయంలో ఓ సారి సెలవుమీద మాస్కోనుంచి హైదరాబాదు వచ్చినప్పుడు అనుకోకుండా మా ఆవిడను ఆస్పత్రిలో చేర్చాల్సివచ్చింది. అప్పుడే కొత్తగా మొదలయిన జూబిలీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో డాక్టర్ వెంకట్రామరెడ్డి గారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఆ రోజుల్లో మొత్తం అంతా కలిపి ముప్పై వేలు అయివుంటాయి. నేను మాస్కోలో పనిచేస్తున్నందువల్ల సీజీహెచ్ఎస్ కిందికి రానని తేల్చారు. మాస్కోలో ఆపరేషన్ చేసివుంటే మొత్తం అణాపైసలతో (రూబుళ్ళు,కోపెక్కులతో) సహా మాస్కో రేడియో భరించేది. కావున మాకు సంబంధం లేదని వాళ్లు తేల్చారు. సరే విదేశాల్లో ఉద్యోగం కనుక ఆసుపత్రి ఖర్చు సొంతంగా పెట్టుకున్నా పెద్ద భారం కాలేదు. ఆ తరువాత ఆమెకే  మళ్ళీ 2009 లో మరో ఆపరేషన్. ఈసారి స్టార్ ఆసుపత్రిలో డాక్టర్ గోపీచంద్,  గుండెలో వాల్వ్ మార్చి కొత్తది వేసారు. అప్పటికి నేను కేంద్ర ప్రభుత్వంలో మాజీని. 2005 లో దూరదర్శన్ లో పదవీ విరమణ చేసినప్పుడు సీజీహెచ్ఎస్ కార్డు రెన్యూ చేయించుకోమని వాళ్ళూ  చెప్పలేదు, నేనూ చేయించుకోలేదు. ఆ విధంగా మూడు దశాబ్దాల పైచిలుకు సర్వీసులో సీజీహేచ్ఎస్ సేవలను వాడుకోగల అవకాశం నాకు దొరకలేదు. ఈ మధ్య డీడీ లో నా సీనియర్ సహోద్యోగి కృష్ణారావు గారు సీజీహేచ్ఎస్ కార్డు అవసరాన్ని గురించి వెంటబడి చెబితే బేగంపేట  పాత ఎయిర్ పోర్ట్ పక్కన వున్న సీజీహేచ్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాను. ప్రభుత్వ కార్యాలయాల్లో పని పడ్డప్పుడు కానీ అవి యెలా పనిచేస్తాయన్న విషయం బోధ పడదు. కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా పని పూర్తిచేశారు. పది రోజుల్లో వచ్చి కార్డు పట్టుకుపొమ్మన్నారు. వాళ్లు చెప్పిన తేదీకి, ఇచ్చిన సమయానికి వెడితే, ఫోటో కార్డులు తయారు చేయడానికి వొప్పుకున్న ఓ చెన్నై కంపెనీ మధ్యలోనే కాడి కిందపారేసిన కారణంగా 'కార్డు బదులు ఫోటోలు అతికించిన కాగితం ఇస్తాం తీసుకెళ్ళి లామినేట్ చేసుకొని వాడుకోండ'ని సలహా ఇచ్చారు. ఆరోజు రావాల్సిన సిబ్బంది రాలేదో, లేక అక్కడ అదే రివాజో తెలియదు కాని, ఫైలు చేతికిచ్చి పలానా రూములో పలానా అధికారి సంతకం పెట్టించుకురమ్మన్నారు. ఆయన దగ్గరకు వెడితే 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు వుందే' అంటూనే సంతకం పెట్టి మళ్ళీ ఫైలు నా చేతికి ఇచ్చారు. మొత్తానికి ఆ కార్యాలయంలో ఫైళ్ళ కదలికలో నేను కూడా పాలు పంచుకుని ఇచ్చిన  కాగితం పట్టుకుని, నేను సయితం సర్కారు ఆఫీసుల్లో పనులు చేసుకుని రాగలనన్న  గర్వంతో బయట పడ్డాను.


(Valid upto 2099)

కొసమెరుపు: ఇందులో ఏముంది అందరిలా మీదీ ఓ అనుభవం అంటారేమో. కానీ వుంది. బయటకు వచ్చిన తరువాత ఆ కాగితాన్ని తేరిపార చూస్తే 'VALID UPTO : 01-01-2099' అంటే ఇప్పటికే 68 ఏళ్ళు నిండిన నేను  మరో 85  ఏళ్ళు ఈ కార్డు వాడుకోవచ్చు అని. ఆరోగ్య  సేవల పధకం కదా! దీర్ఘాయుష్మాన్ భవ! అని దీవిస్తూ ఇచ్చివుంటారని సరిపెట్టుకున్నాను. 

1 కామెంట్‌:

Saahitya Abhimaani చెప్పారు...

గుమాస్తాలకి బుర్రలు ఉండవు. ఇక్కడ గుమాస్తా అంటే ఏ పదవిలో ఉన్నా సరే(అప్పటికి ఆ సంస్థ మొత్తానికి అధికారి అయ్యి ఉన్నా సరే!), అతి కింది తరగతి బుర్రతో ఉన్న అందరు అధికారులనూ ఉద్దేసించి అంటున్నాను. ఇనీషియల్స్(పొట్టి సంతకాలు)లెక్కేసుకుని గుడ్డి సంతకాలు పెట్టె అధికార్లు(!) ఉన్నంతకాలం ఇలాంటి చిత్రాలు ఏ బ్యూరోక్రసీలోనైనా జరుగుతాయి. నేను ఈ మధ్యనే నా హాం రేడియో లైసెన్సు రెన్యూయల్‌కు దగ్గర పడితే, ప్రస్తుతం లైఫ్ టైం (మామూలుగా ఐతే ఐదేళ్ళకొకసారి) అంటే చేయించాను. రెన్యూ అయ్యి తిరిగి వచ్చేప్పటికి, వాళ్ళు జులై 2, 2065 వరకూ రెన్యూ చేశారు. వాళ్ళు నన్ను 107 ఏళ్ళు బతికి ఉండమని దీవిస్తున్నారని అనుకోవాలో లేక వారికున్న అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని అనుకోవాలో తెలియక చివరికి వాళ్ళ అసమర్ధత అని తేల్చుకున్నాను. లైఫ్ టైం రెన్యూయల్ కి "ఎప్పటిదాకా రెన్యూయల్" అన్న తేదీ నింపాల్సిన పని లేదన్న చిన్న కామన్ సెన్స్ ఇవ్వాళ అన్‌కామన్‌సెన్స్ అయ్యిపోయింది. అక్కడ లైఫ్ టైం రెన్యూయల్ అని ఒక చిన్న రబ్బరు స్టాంప్ వెయ్యటమో లేదా లామినేట్ చెయ్యబడిన కార్డులాంటిదో, ప్రత్యేకంగా ఇచ్చేస్తే సరిపోతుంది. ఆపైన ఎవరికైనా లైఫ్ టైం కార్డులు ఇచ్చినా కూడా ఐదేళ్ళకొకసారైనా వాళ్ళకు కనిపించి సంతకం పెట్టించుకోవటమో మరేదో ప్రక్రియ లేకపోతే ఈ గుమాస్తాలకే ప్రమాదం, వాళ్ళ పుస్తకాలన్నీ కూడా 90-100 ఏళ్ళు పైబడిన జీవులతో నిండిపొయ్యే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు ఈ గుమాస్తాలు ఏమి చేస్తారో చూడలన్న ఉబలాటం ఉందికానీ, నూకలుండద్దూ అప్పటిదాకా. వాళ్ళ ఆఫీసుకు వెళితే ఈ విషయంలో రెండు వాల్యూముల ఫైళ్ళు ఇద్దరు ముగ్గురు గుమాస్తాలు కలిసి కష్టపడి, ఈ పనిచేసినందుకు తమకు ప్రమోషన్ ఎందుకు ఇవ్వలేదా అని నివ్వెరపోతూ,ఒక సంవత్సరం పాటు కృషి చేసి, చివరకు ఇలాంటి తేదీ వెయ్యాలన్న నోట్ ఆర్డర్లు సంపాయించిన విషయం ఉన్నా ఆశ్చర్యపోను.

అవినీతి అంతం అంటూ రాజకీయ నాయకుల వెంట పడ్డారు కాని, అసమర్ధత అంతానికి ఎవ్వరూ ఉద్యమించటం లేదు. కారణం అది సెల్ఫ్ సర్వింగ్ కాదు కదా. ఎవరి అసమర్ధత వారి గర్వకారణంగా ఉండి అది ఆభరణంగా తగిలించుకు తిరుగుతున్నారు, ముఖ్యంగా బ్యూరోక్రసీలో ఉన్న చిన్న పెద్ద ఉద్యోగులందరూనూ.