27, ఫిబ్రవరి 2014, గురువారం

పాతికేళ్ళక్రితం మాస్కో - 2

ఇంగువ తెచ్చిన తంటా
  
అక్టోబర్ - 31, 1987 - అంటే శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి రోజున - ఢిల్లీ నుంచి సోవియట్ ఎయిర్ లైనర్ ' ఏరోఫ్లోట్' లో కుటుంబంతో కలసి మాస్కో బయలుదేరాను. కొన్ని మాసాలుగా ఎదురుచూసిన క్షణం దగ్గర పడుతుంటే విమానం విండో నుంచి కిందకు చూసే ప్రయత్నం చేసాము. కళ్ళు చికిలించుకుని చూసినా దట్టంగా అలుముకున్న పొగమంచులో ఏమీ కనబడలేదు. మరికొద్దిసేపటిలోనే మా విమానం మాస్కో పొలిమేరల్లోని ' షెర్మేతోవా' అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. విద్యుత్ దీపాల కాంతిలో ధగ ధగలాడుతూ, పలుదేశాల ప్రయాణీకులతో ఎయిర్ పోర్ట్ కళకళలాడుతోంది. మాస్కోలో వెజిటేరియన్లకు ఏమీ దొరకవు, ఉప్పూ ,పాలూ తప్ప అన్న హెచ్చరికలతో బయలుదేరిన మేము- లగేజి కలెక్ట్ చేసుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము. హైదరాబాద్ నుంచి సూటుకేసులనిండా పట్టుకొచ్చిన వంట సంభారాలతో కస్టమ్స్ అధికారులనుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు కానీ మా ఆవిడ తెచ్చిన ఇంగువ డబ్బా కొంత తంటా తెచ్చిపెట్టింది. ఇంగువని ఇంగ్లీష్ లో ఏమంటారో ఆ క్షణాన గుర్తురాలేదు. అది తినే వస్తువనీ, వంటల్లో వాడుకుంటామనీ ఎన్నోవిధాలుగా చెప్పిచూసాను. ఇంగ్లీష్ భాష ఇసుమంతకూడా అర్ధం కాని ఆ అధికారుల ముందు నా ప్రయత్నం వృధా ప్రయాస అయింది. పైపెచ్చు ఘాటయిన ఇంగువ వాసన వారి అనుమానాలను మరింత పెంచింది. చివరకు ఇంగువ ముక్క నోటిలో వేసుకుని నమిలి చూపించి ప్రమాదకరమూ, మాదక పదార్ధమూ కాదని రుజువు చేసుకున్న తరవాతనే అక్కడనుంచి బయట పడగలిగాము.

ఇల్లా? హోటలా?

బయటపడ్దామని అన్నానే కానీ బయటపడడం అంత సులభమయిన విషయం కాదని మాకు వెనువెంటనే తెలిసివచ్చింది. 
మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మాస్కో రేడియో తరపున 'సెర్గీ' అనే ఉద్యోగి ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. అతడి చేతిలో మా పేర్లు ఇంగ్లీష్ లో రాసివున్న ప్లకార్డు చూసి ఒకరినొకరం గుర్తు పట్టాము. హైదరాబాద్ చిక్కడపల్లిలో కొన్న స్వెట్టర్లతో ప్రస్తుతానికి పని లాగిద్దామని దిగబడిన మమ్మల్ని చూసేసరికి అంత చలిలోనూ అతడికి చెమటలు పట్టినట్టున్నాయి. రష్యన్లో అతడు చెబుతున్నదేదో మాకు అర్ధం కావడం లేదన్న విషయాన్ని అతడే అర్ధం చేసుకుని మమ్మల్ని తీసుకువెళ్ళడానికి తెచ్చిన వాహనాన్ని ఎయిర్ పోర్ట్ లాంజ్ ఎగ్జిట్ గేటు వరకు తీసుకునివచ్చాడు. కారులో లగేజి ఎక్కించిన తరవాత - కారు డోరు తెరిచే వుంచి - ఒకే అంగలో వెళ్లి కారెక్కమని సైగలతో చూపించాడు. మేమంతా ఒక్క ఉదుటున వెళ్లి కారెక్కాము. అప్పుడు అర్ధమయింది మాకు - మా గురించి అతడు పడిన ఆదుర్దా. ఎగ్జిట్ గేటు నుంచి కారెక్కడానికి మాకు పది సెకన్లు కూడా పట్టివుండదు. కానీ ఆ కాసేపటిలోనే చేతి వేళ్ళన్నీ చలితో కొంకర్లు తిరిగిపోయాయి. మాస్కో చలి పులి విసిరే పంజా దెబ్బ మాకు మొదటిరోజునే అనుభవంలోకి వచ్చింది. అదృష్టవశాత్తూ కారులో హీటరు ఉండడంవల్ల బిగుసుకుపోయిన అవయవాలన్నీ మళ్ళీ స్వాధీనంలోకి వచ్చాయి. 
మంచు కురిసే వేళలో 
మా లెక్క ప్రకారం అది పగటి వేళ అయివుండాలి. కానీ, వీధి దీపాలన్నీ దివిటీలమాదిరిగా వెలుగుతున్నాయి . వాహనాలను హెడ్ లైట్లు  వేసుకుని నడుపుతున్నారు . అదేపనిగా మంచు కురుస్తూ ఉండడంవల్ల - పగలో రాత్రో తెలియని అయోమయావస్థలో ఉండగానే మా కారు పలు అంతస్తుల భవనం ఒకదానిముందు ఆగింది. 


(మా పిల్లలు సందీప్, సంతోష్)

ఎయిర్ పోర్ట్ అనుభవం ఇంకా  గుర్తు ఉండడంతో ఈసారి అందరం ఎక్కువ ఇబ్బంది పడకుండానే లోపలకు ప్రవేసించాము. మమ్మల్నీ, మా సామానునీ తొమ్మిదో అంతస్తులో వున్న ఒక అపార్ట్ మెంట్ కు చేర్చి - సెలవు తీసుకున్నాడు సెర్గీ మహాశయుడు.  లోపలకు వెళ్లి చూస్తె కళ్ళు తిరిగేలావుంది. రెండు పడక గదులు, ఒక డ్రాయింగు రూము, వంటగది, సామాను గది, మంచాలు, పరుపులు,దిండ్లు, దుప్పట్లు, కలర్ టీవీ (అప్పట్లో మనదేశంలో అదో లగ్జరీ), నాలుగు బర్నర్ల స్టవ్, గ్యాస్, బాత్ టబ్, షవర్ ఒకటేమిటి సమస్తం అమర్చి పెట్టి వున్నాయి. ఒక క్షణం ఇది ఇల్లా లేక హోటలా అన్న అనుమానం కలిగింది.ఆ పూటకి వంట జోలికి పోకుండా ఇండియా నుంచి తెచ్చుకున్న తినుబండారాలతోనే సరిపెట్టుకున్నాము. 
 సోఫాల్లో సర్దుకు కూర్చుని టీవీ ఆన్ చేస్తే సోవియట్ కమ్యూనిస్ట్ అధినాయకుడు మిహాయిల్ గోర్బచేవ్ అనర్ఘలంగా ప్రసంగిస్తూ కానవచ్చారు. భాష అర్ధం కాకపోయినా వింటూనే నిద్రలోకి జారిపోయాము. 
 'రష్యన్ మహిళ నోట తెలుగు మాట' వినడానికి కొంత వ్యవధానం)


4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

బాగుంది . ఇంటరెస్టింగ్ గా ఉంది తరువాయి పోస్ట్ లు కోసం ఎదురు చూస్తున్నాం .

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత - ధన్యవాదాలు. కాకపొతే, సోవియట్ వ్యవస్థ పతనం గురించి 'మార్పుచూసిన కళ్ళు' అనే పేరుతొ నాలుగేళ్ల క్రితం నేను వీటిని రాశాను. కొంతమంది కోరడం వల్ల మళ్ళీ ఈవిధంగా తాజాగా పోస్ట్ చేస్తున్నాను. అందుకే మొదటి భాగంలోనే- లోగడ వీటి ఐ చదవని వాళ్ళకోసం 'అని పేర్కొనడం జరిగింది. - భండారు శ్రీనివాసరావు

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

బాగున్నాయండీ మీ మాస్కో జ్ఞాపకాలు. సోవియెట్ యూనియన్ గురించి తెలుసుకోవటానికి ఉపయోగిస్తాయి. అవునండీ ఇలా ఫారిన్ డెప్యుటేషన్ మీద వెడుతున్నవారికి బయల్దేరే ముందే ఆ దేశపు భాష మన దేశంలోనే నేర్పించి పంపిస్తారని నేను అనుకునేవాడిని. కాదా, అక్కడికి వెళ్ళిన తర్వాతే నేర్పుతారా?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ విన్నకోట నరసింహారావు - యేమో. నా విషయంలో ఇలాగే జరిగింది