ఇంటి నిండుగా పిల్లలు వుంటే సందడే సందడి. ఆటలే, ఆటలు. అదే ఆడపిల్లలు వుంటే ఆ తరహా వేరు. వారి ఆటలు వేరు. వారికోసం చేసే వేడుకలు వేరు. అయితే మగపిల్లలు వయసులో చిన్నవారయితే, అన్ని రకాల వేడుకల్లో కూడా వాళ్లకి ఎంట్రీ పాసు వుండేది. ఆ చేసే వేడుకలు ఎందుకు చేస్తున్నారో తెలియకపోయినా వాటిని చూసే అవకాశం మాకుండేది. మంచి నీళ్ళ పంపు దగ్గర పేచీలు పెట్టుకుని కీచులాడుకునే ఆవనంలోని ఆడవాళ్ళందరూ ఈ వేడుకల్లో మాత్రం పడుగూ పేకా మాదిరిగా కలిసిపోయేవారు. ఒకరికొకరు చేదోడువాదోడుగా వుండేవాళ్ళు.
శ్రావణ
మాసం వచ్చిందంటే ఆడవాళ్ళ సంగతేమో కానీ పిల్లలకు ఆ నెల మొత్తం పెద్ద పండగ. శ్రావణ గౌరీ పూజలు, పునస్కారాలు మా అక్కయ్య నిష్టగా
చేసేది. శుక్రవారంనాడు మంగళగౌరీ వ్రతం కోసం తెల్లవారుఝామునే లేచి స్నానం చేసి, మడి బట్టలు కట్టుకుని, ఒంటి చేత్తో నవకాయ పిండి వంటలు సిద్ధం చేసి
పూజకు కూర్చునేది. పూజ చేసుకుని ఇంట్లో భోజనాలు పూర్తయ్యాయో లేదో, మళ్ళీ చీరె మార్చుకుని శుక్రవారం
పేరంటాలకు సిద్ధం అయ్యేది. అలాగే తాను పిలిచిన ముత్తయిదువులు ఇంటికి వస్తే వాయనాలు
ఇవ్వడానికి అన్నీ సిద్ధంగా పెట్టుకునేది. పేరంటాల విషయంలో ఆడవాళ్ళ టైం మేనేజిమెంట్
అపూర్వం,
అనితరసాధ్యం.
సందర్భాన్ని బట్టి, మా అక్కయ్య మంగళ
హారతులతో పాటు వేరే వేరే పాటలు కూడా పాడుతుండేది. అర్ధం కాకపోయినా వింటుండేవాళ్ళం.
మా అక్కయ్యకు బహుశా ఎనభై ఏళ్లప్పుడు
కాబోలు వాళ్ళ అమ్మాయి దగ్గరికి హైదరాబాదు వచ్చింది. చుట్టూ చేరిన నలుగురు బలవంత పెడితే ఒక పాట పాడింది. ఆడపిల్లలు పెద్దమనుషులు
అయినప్పుడు పాడే సవర్త పాట. అమ్మాయిలు ఉన్న ప్రతి ఇంట్లో ఎప్పుడో ఒకసారి పాడుకోవాల్సిన
పాట. అంత పెద్ద వయస్సులో గుర్తుపెట్టుకుని ఆమె పాడిన ఈ
పాటలో ఏదయినా పొరబాట్లు కనిపిస్తే/వినిపిస్తే, దాని వింటూ తిరిగిరాసుకోవడంలో జరిగిన ఆ తప్పు అక్షరాలా నాదే కాని ఆమెది కాదు, నేను
ఏకసంత (గంట) గ్రాహిని. విన్నది ఓ గంట లోపల కాగితం మీద పెట్టక పొతే,
విన్నది మొత్తం బల్క్ ఎరేజ్ అయిపోతుంది.
ఆరోజు సరసక్కయ్య
పాడిన సవర్త పాట :
‘సువ్వియనుచు
పాడరమ్మా
‘సుందరాంగిని
చూడరమ్మా
‘నవ్వే
మాట కాదె కొమ్మా
‘నాతి
సవర్తలాడెనమ్మా
‘బువ్వదినుట
నేరదమ్మా
‘పూబోణి
ఎరుగదమ్మా
‘తల్లి
చూచి చెప్పగానే
‘తలనువంచి
నవ్వేనమ్మా
‘విప్రవరుల పిలవరమ్మా
‘విప్పి
పంచాంగం చూడగానే
‘యుక్తమైన
నక్షత్రమమ్మా
‘సువ్వియనుచు
పాడరమ్మా
‘సుందరాంగిని
చూడరమ్మా’
2013 లో కొద్ది రోజుల తేడాతో
ఇద్దరు అక్కయ్యలు కన్ను మూయడం మొత్తం మా కుటుంబాన్ని దిగ్భ్రాంతికి
గురిచేసింది. హైదరాబాదులో ఆరో అక్కయ్య ప్రేమక్కయ్య (74) చనిపోయిన వార్త తెలియగానే మా మూడో అక్కయ్య సరస్వతి
హుటాహుటిన కారులో తన వయస్సును కూడా (84) లెక్కపెట్టకుండా ఆమెను
చూడడానికి బెజవాడ నుంచి హైదరాబాదు వచ్చింది. తన కళ్ళముందే చిన్నవాళ్ళు దాటిపోతున్నారని
గొల్లుమంది.
ఏమయిందో యేమో మూడో రోజున ఆయాసంగా వుందంటే
ఆస్పత్రిలో చేర్పించారు. అటునుంచి అటే ఐ.సీ.యూ, తరువాత వెంటిలేటర్. మర్నాడు ఉదయం
కల్లా అంతా అయిపోయింది. ప్రేమక్కయ్య పన్నెండో రోజుకు వచ్చిన బంధుగణం అంతా
సరసక్కయ్య అంతిమ ఘడియలను చూడాల్సివచ్చింది. ఎవరితో చేయించుకోకుండా పెద్ద ప్రాణం
దాటిపోయింది. పెనిమిటి తుర్లపాటి హనుమంతరావు గారు చనిపోయిన నాటి నుంచి రెండేళ్లుగా ఆమె ప్రాణం ఆయన కోసమే కొట్టుకుంది.
ఆ రెండేళ్లు ఆయన మాట తప్పిస్తే, ఆయన
జ్ఞాపకాలు తప్పిస్తే మరో ముచ్చట ఆమె
నోటినుంచి వినలేదు. దాదాపు డెబ్బయ్
ఏళ్ళ దాంపత్య అనుబంధం. అందుకే ఆయనలేని లోకంలో ఎక్కువ కాలం
మనలేకపోయింది. రోగం రొష్టు అంటూ పిల్లల్ని బాద పెట్టకుండా, తాను బాధ
పడకుండా మా బావగారిని వెతుక్కుంటూ పైలోకాలకు వెళ్ళి పోయింది. ధన్యజీవి.
కింది ఫోటో:
(ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి