వెనిస్ నగరం లాంటిది బెజవాడ. ఊరు మధ్యగా మూడు కాలువలు ప్రవహిస్తూ వుంటాయి. బందరు కాలువ, రైస్ కాలువ, ఏలూరు కాలువ. ఈ మూడు కాలువలకు ఆది పురుషుడు సర్ ఆర్థర్ కాటన్. కృష్ణా బరాజ్ కు ముందు వందేళ్ళ చరిత్ర కలిగిన ఆనకట్టను నిర్మించింది ఈయనే. ఆ కాలంలో భయంకరమైన కరవు కాటకాలతో కృష్ణా ప్రాంతం కకావికలమైంది. ఆకలితో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ పరిస్థితులను గమనించిన కాటన్ దొర కృష్ణా ఆనకట్టకు రూపకల్పన చేశారు. వందేళ్ళకు పైగా పంట పొలాలకు నీరందించని ఆ ఆనకట్టకు ఆకస్మికంగా వచ్చిన పెను వరద కారణంగా గండి పడింది. తాత్కాలికంగా గండి పూడ్చినప్పటికీ తదనంతరం ఆనకట్ట స్థానంలో కృష్ణా బరాజ్ ను నిర్మించారు. ఈ బరాజ్ నుంచే ఈ మూడు కాలువలకు నీరు వదులుతారు.
మరో అతి పెద్ద కాలువ
బకింగ్ హాం కాలువ. ఇది బెజవాడ నుంచి మద్రాసు వరకు వుండేదని చెప్పేవారు. ఆ కాలువలో
పడవల మీద ప్రయాణాలు చేసేవారు. సరకుల రవాణా
జరిగేది. ప్రస్తుతం అది చాలా చోట్ల పూడికలతో పనికి రాకుండా వుందని
వింటున్నాము. ఇది కాక మరో మూడు కాలువలు కృష్ణా బ్యారేజ్ నుంచి సేద్యపు నీటిని
కృష్ణా జిల్లాతో పాటు, పూర్వపు ఉభయ
గోదావరి జిల్లాల్లోని అనేక పంట పొలాలకు అందిస్తున్నాయి. గోదావరి డెల్టా పాడి
పంటలతో తులతూగడానికి కాటన్ దొరవారి అమృత హస్తం వుందని ఆ ప్రాంతం వారు ఇప్పటికీ
ఆయన్ని దేవుడిలా కొలుస్తుంటారు. మరి కృష్ణా జిల్లా వాసులు ఆయన్ని స్మరిస్తున్నట్టు
కనబడదు.
వాడుకలో
రైస్ కాలువ అని పిలుస్తారు, కానీ అసలు పేరు రైవిస్ కాలువ. బ్రిటిష్ వారి హయాములో సర్ ఆర్థర్ కాటన్
ఆధ్వర్యంలో నిర్మించిన కృష్ణా ఆనకట్ట నిర్మాణ సమయంలో పనిచేసిన బ్రిటిష్ ఇంజినీర్
కెప్టెన్ జోసెఫ్ గోరె రైవిస్ (Captain Joseph Gore Ryves) పేరు ఈ కాలువకు పెట్టారు. నగరం మధ్యనుండి పోయే ఈ
కాలువపై అనేక చోట్ల వంతెనలు నిర్మించారు. గవర్నర్ పేటను
గాంధీనగర్ ను విడదీసే రైవిస్ కాలువపై ఒక వంతెన వుంది. దానిపై నుంచి చూస్తే, కృష్ణనీరు, వేగంగా
సుళ్ళు తిరుగుతూ కళ్ళు తిరిగేలా జలజలా
ప్రవహిస్తూ వుంటుంది. మా ఈడుకంటే చిన్న పిల్లలు కొందరు అమాంతం ఆ వంతెన మీద నుంచి
కిందికి దూకి, మళ్ళీ ఈదుకుంటూ బయటకు వచ్చి మళ్ళీ మళ్ళీ కాలువలోకి
దూకుతూ ఈతలు కొడుతూ వుండేవారు. ఈ దృశ్యాలు మాకు భయంగాను, వింతగాను అనిపించేవి. కానీ వాళ్లకు అదో ఆట. బ్రిటిష్ వారి హయాములో నిర్మించిన ఈ కాలువలు
కాలక్రమంలో నిర్లక్ష్యానికి గురై దుర్గంధ కాసారాలుగా తయారయ్యాయి. మా చిన్నతనంలోనే
ఈ కాలువ వడ్లను బహిరంగ బహిర్భూములుగా ఉపయోగించేవారు. ఆ వంతెనల మీదుగా నడిచి వెళ్ళే వాళ్ళు, ముక్కులు, కళ్ళు మూసుకోవాల్సి వచ్చేది. అప్పటికి
ఇళ్ళల్లో మరుగు దొడ్ల సంస్కృతి అలవడలేదు. కొందరి ఇళ్ళల్లో వున్నా కూడా వాటిని మనుషులే
శుభ్రం చేయాల్సిన దుస్థితి. బతుకు బండి లాగడం కోసం కొందరు అలాంటి పనులు చేయాల్సి
రావడం నిజంగా దురదృష్టకరమైన పరిస్థితి. వరాహాలు విచ్చలవిడిగా వీధుల్లో సంచరించేవి.
బెజవాడ పందులకు ప్రసిద్ధి అని చెప్పుకునే వాళ్ళు.
రైస్ కాలవ వంతెనకు దగ్గరలో అన్నదాన సమాజం అనే ఒక
స్వచ్ఛంద సంస్థ వుండేది. ఈ సమాజానికి
సంబంధించిన కార్యకర్తలు కొందరు, రోజూ భుజాన ఒక జోలిలాంటిది తగిలించుకుని ఇంటింటికీ
తిరిగేవారు. అప్పుడు చిన్నపిల్లలుగా వున్న మేము, వాళ్ళు
ఎప్పుడు వస్తారా అని ఎదురుచూసేవాళ్ళం. రాగానే మా చిన్ని చిన్ని గుప్పిళ్ళతో బియ్యం
తీసుకువెళ్ళి వాళ్ళ జోలెలో వేసేవాళ్ళం. 'గుప్పెడు
బియ్యం వెయ్యండి. ఆకలితో వున్నవాళ్ళకు పట్టెడు అన్నం పెట్టండి' అనేది అన్నదాన
సమాజం వారి నినాదం. అలా సేకరించిన బియ్యంతో అనాధ పిల్లలకు, నా అన్నవాళ్లు లేని వృద్ధులకు అన్నం వొండిపెట్టేవారు.
ఆ అన్నం తిన్న వాళ్ళు తప్ప, అన్నదాన సమాజం వారిని తలచుకునే ఇతరులు ఉంటారంటే నమ్మడం
కష్టమే. ఎందుకంటే చేసే పని మంచిదన్న ఒక్క ధ్యాస తప్ప,, చేసే పనికి ప్రచారం చేసుకోవాలన్న యావ లేనివాళ్ళు కదా
ఆ సమాజం వాళ్ళు.
ఇప్పుడది లేదని చెప్పడానికి అక్కడికి
వెళ్లి చూడనక్కరలేదు. ప్రభుత్వాల దయాధర్మం వల్ల ఎదిగే సంస్థలు అయితే నాలుగు కాలాలు
వర్దిల్లేవి, , ఏ మంచి పనీ చేయకుండా, ఏదో చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ.
కానీ అన్నదాన సమాజం ఆ బాపతు కాదు కదా!
ఆ స్పూర్తితోనే మేము చాలా చిన్నతనంలోనే
బాపు బాల సమాజం నడిపాం. ఆ పేరు మా పెద్దన్నయ్య పెట్టాడు. బెజవాడలో చెప్పుకోదగ్గ
పనులేవీ చేయలేదు. నిజానికి ఆ వయసులో ఏం చెయ్యాలో కూడా తెలియదు. ఒకసారి ఒక చిన్న
పిచ్చుక ఎగరలేక ఇంటి వరండాలో పడి వుండడం చూసి, జాలిపడి దాన్ని తీసుకుని వచ్చి మా బావగారి ప్లీడరు
పుస్తకాల మధ్యలో ఉంచాము, అక్కడైతే భద్రంగా ఉంటుందని. అది తినడం కోసం కొన్ని
బియ్యపు గింజలు దాని ముందు ఉంచాము. మరునాడు చూస్తే బియ్యపు గింజలు అలాగే వున్నాయి.
పిచ్చుకపై చీమలు పాకుతున్నాయి. గుమస్తా శ్రీరాములు గారు చెప్పేవరకు అది
చనిపోయిందని తెలియదు. అసలు చావంటే ఏమిటో తెలియని
మాకు, ఆయన గారు విడమరచి చెప్పిన దాకా మాకూ విషయం అర్ధం
కాలేదు. అయ్యో దాన్ని అనవసరంగా ఇంట్లోకి తెచ్చి దాని ప్రాణాలు తీశామే అని చాలా
రోజులు బాధ పడ్డాము.
బావగారి ఇంటికి దగ్గరలో దివ్యజ్ఞాన
సమాజం వుండేది. బాపూ బాల సమాజ్ లాగా అదో సమాజం అనుకున్నాము. కానీ ఒకసారి ఆ సమాజానికి గవర్నర్ శ్రీ నగేష్ వచ్చారు. ఒక అంబాసిడర్
కారు, వెంట
ఇద్దరు పోలీసులు. అంతే! పరివారం. కాకపొతే దివ్యజ్ఞాన సమాజం వారు, స్థానిక పెద్దలు ఆయన పట్ల ప్రదర్శించిన గౌరవ మర్యాదలు
చూసి గవర్నర్ అంటే చాలా పెద్ద అధికారి అయివుండాలని అనిపించింది. అప్పటివరకు మా స్కూలు
హెడ్ మాస్టారుగారే మా దృష్టిలో పెద్దఅధికారి. ఆయన వస్తే క్లాసు క్లాసంతా లేచి
నిలుచుండేది.
కింది ఫోటో: (గూగుల్ సౌజన్యం)
దుర్గంధ కాసారం రైస్ కాలువ, దానిపై వంతెన.
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి