5, డిసెంబర్ 2024, గురువారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (27) - భండారు శ్రీనివాసరావు

 

 

విజయవాడలో నా జీవితం మూడు రకాలుగా సాగింది. మరీ చిన్నతనంలో కొన్నేళ్ళు, ఒక వయసు వచ్చాక కొన్నాళ్ళు, ఉద్యోగపర్వంలో మరి కొన్నేళ్ళు ఇలా అన్నమాట. మధ్యలో కొంత విరామాలు. నాకెందుకో చిన్నతనం నాటి బెజవాడ మీదనే మక్కువ ఎక్కువ. అంతకు ముందు నేను చూడని, చూస్తాను అని అనుకోని బస్తీ జీవితాన్ని అది ప్రసాదించింది. రెండో దశలో అదో పట్టణం. అంతే! మూడో దశనాటికి పూర్తిగా మారిపోలేదు కానీ, ఊరు చాలా మారిపోయింది. ఇక ఇప్పుడా, నేను చూసిన, తచ్చాడిన, తిరిగిన, పెరిగిన ప్రదేశాలను నేనే గుర్తుపట్టలేను. ఒక నగరం రూపు సంతరించుకుంది.  నాటి కళాకాంతిలో కాంతి మిగిలింది. కళ కనుమరుగు అయింది.

బెజవాడలో రాజగోపాలచారి వీధిలో, మరీ  బావగారి ఇంటి ఎదురుగా కాదు కానీ ఐ మూలగా రోడ్డు (అప్పటికి రోడ్డు లేదు, అంచేత వీధి అందాము) దాని అవతల కామేశ్వర్ అండ్ కో అని స్టేషనరీ షాపు వుండేది. కిందా మీదా వారిదే కాని, మొదటి అంతస్తులో దుకాణం. అదొక దుకాణంలా వుండేది కాదు, బ్యాంకు కౌంటర్ మాదిరిగా వుండేది. ఆ కౌంటర్ కు రెండు వైపులా రెండు సింహపు బొమ్మలు.  పలకా బలపం పెన్సిల్, రబ్బర్, నోట్ బుక్ ఏది కావాలన్నా మెట్లెక్కి అక్కడికే పోయేవాళ్ళం. యజమాని కామేశ్వర శాస్త్రి గారి కొడుకు శివ (చిన్నా) మాకు స్నేహితుడు. పెద్దవాళ్లకు తెలియకుండా వెళ్లి సెకండ్ షో సినిమాలు చూసేంతగా వుండేది మా స్నేహం. వాళ్ళ మేడకు పక్కన మిత్రా ఏజెన్సీ షో రూమ్, దానికి పక్కనే లాయర్ చక్రవర్తి గారి కారు షెడ్డు, దానికి ఆనుకునే చక్రవర్తి గారి నివాసం వైట్ హౌస్, ఆ పక్కన చమ్రియా ఫిలిం డిస్త్రిబ్యూటర్స్ ఆఫీసు ఇలా వరుసగా ఉండేవి. వీటన్నిటిలోనే కాదు, బెజవాడ మొత్తంలో అందమైన మేడ చక్రవర్తి గారిది. నిజంగా శ్వేత సౌధం.  దానికి ఎదురు వీధిలో పదడుగులు వేస్తె, ఎడమపక్కన ఏదో కోఆపరేటివ్ బ్యాంక్ (లక్ష్మి విలాస్ బ్యాంక్ అనుకుంటా) మరో నాలుగడుగులు వేస్తె, బీసెంట్ రోడ్డు. ఒక మూలలో దుర్గా కేప్ (ఇక్కడ ఇడ్లీలు , కొబ్బరి చట్నీ ఫేమస్, ఆ మాటకు వస్తే విజయవాడలో ప్రతి హోటల్లో టిఫిన్ బాగుండేది.  బీసెంటు రోడ్డులో నాడార్స్ కాఫీ పౌడర్ దుకాణం. చుట్టూ పచారీ సామాన్లు వున్న పెద్దపెద్ద స్టీలు డబ్బాల మధ్య ఒక లావు పాటి మనిషి కూర్చుని, కస్టమర్లు అడిగిన సరుకులు  కాటాలో తూకం వేసి పాత పేపర్లలో చుట్టి ఇస్తుండే వాడు. మరో లావు పాటి మనిషి వెనుక గల్లాపెట్టె ముందు చిన్న స్టూలు మీద కూర్చుని డబ్బులు తీసుకుంటూవుండేవాడు. ఇద్దరూ షాపు యజమానులే. లావుపాటి శరీరాలు, వొంటి ఛాయను బట్టి చూస్తే అన్నదమ్ములు అనిపిస్తుంది.   మరో పక్క పెద్ద పెద్ద గాజు సీసాల్లో రకరకాల న్యూట్రిన్ కంపెనీ  చాకొలెట్లు, తగరం రేపర్ చుట్టిన కొబ్బరి లౌజు వంటి చాకొలెట్లు వుండేవి. ఇక నాడార్స్ కాఫీ పౌడర్ ఘుమఘుమలు బయటకే ముక్కుపుటాలను తాకేవి. ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధి. కాఫీ పొడుం, పంచదార పౌన్ల లెక్కన అమ్మేవాళ్లు. అప్పటికి కిలోల లెక్క రాలేదు. బెల్లం  వీసెల లెక్కన,, నూనెలు అవీ శేర్ల లెక్కన కొలిచేవాళ్ళు.

అదే రోడ్డులో ఒక పక్క మోడరన్ కేప్ వుండేది. అందులో బల్లలు, కుర్చీలు మరెక్కడా కనపడేవి కావు. అంత నాజూకుగా అదో రకం కలపతో  చేసిన కుర్చీలు. బహుశా మద్రాసో, బెంగుళూరో ప్రభావం అనుకుంటా. శుచీశుభ్రత గురించి చెప్పాలి అంటే  ఆ హోటల్ తర్వాతే. సర్వర్లు కూడా చెమటలు కక్కకుండా మంచి యూనిఫారాలతో వుండేవాళ్ళు. సాంబారు బక్కెట్లతో తెచ్చి సర్వ్ చేసేవాళ్ళు, అదీ విసుక్కోకుండా. భోజనాలకు నెలసరి టిక్కెట్లు అమ్మేవాళ్లు. రెండు పూటలకు కలిపి ముప్పయి రూపాయలు. మా బావగారు కొన్ని టిక్కెట్ల పుస్తకాలు కొని, బీద విద్యార్ద్జులకు ఇచ్చేవాళ్ళు. ఇది కాక  మరికొందరికి ఇంట్లోనే వారాలు. వారంలో ప్రతిరోజూ ఒక్కరికి ఒక  వారం. అంటే ఆ రోజు  భోజనం చేస్తే మళ్ళీ వారం రోజుల తర్వాత అదే రోజున  భోజనానికి వచ్చేవాళ్ళు. మిగిలిన రోజులు మరికొందరు వదాన్యుల సాయంతో వారాలు చేసుకుంటూ చదువుకునేవారు. వీళ్ళని వారాలబ్బాయి అనేవాళ్ళు. ఈ పేరుతొ ఒక సినిమా కూడా వచ్చింది. హైదరాబాదులో నా ఉద్యోగ విరమణ తర్వాత నేనూ వారాలు చేసుకునే వాడిని.  ప్రతిరోజూ ఒక టీవీ చర్చకు వెళ్ళేవాడిని. సోమవారం ఒక టీవీకి వెడితే, మళ్ళీ సోమవారమే అక్కడికి వెళ్ళేది. వాళ్లకు కూడా ఇది నచ్చినట్టు వుంది. ప్రతిరోజూ ఈరోజు వస్తారా, వీలవుతుందా   అని అడిగే పని లేకుండా, నెల మొత్తం నా షెడ్యూలు ముందే ఖరారు చేసుకునే వెసులుబాటు లభించింది. నా తరహా గమనించిన ఒక టీవీ అమ్మడు నాకు వారాలబ్బాయి అని పేరు పెట్టింది కూడా.

ఇలా ఏ టు జెడ్ టీవీల్లో వారాలు చేసుకుంటున్న బంగారు కాలంలో, స్వర్ణయుగం అని ఎందుకు అంటున్నానంటే, ఆ రోజుల్లో టీవీ చర్చలు, వాటిల్లో  పాల్గొనే విశ్లేషకులకు సంబంధించి ఆహ్లాదకరంగా జరిగేవి. రాజకీయ పార్టీల ప్రతినిధులు పొట్టు పొట్టయినా మా జోలికి వచ్చేవాళ్ళు కాదు. అలాంటి కాలం మళ్ళీ వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే విశ్లేషకుల రూపంలో కొందరు, ఆయా పార్టీల అధికార ప్రతినిధులను మించి మాట్లాడుతున్నారు. నేను సరైన సమయంలోనే కాడి కింద పారేశాను అనుకుంటున్నాను. సరే అలాంటి కాలంలో, ఒక టీవీ చర్చల విరామ సమయంలో టీడీపీ ప్రతినిధి (ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి, ఏపీ లో ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్) లంక దినకర్ గారు మోడరన్ కేప్ గురించిన ఓ ముచ్చట చెప్పారు.

మోడరన్ కేఫ్ కంటే ముందు అక్కడ నేతాజీ హోటల్ ఉండేదని, దాన్ని తమ తాతగారు లంక వెంకటేశ్వర రావు స్థాపించారని చెప్పారు. దినకర్ తెలిపిన వివరాల ప్రకారం వెంకటేశ్వరరావు గారు వీరవల్లి గ్రామంలో బడి పంతులుగా పనిచేసారు. తర్వాత బెజవాడ వచ్చి నేతాజీ హోటల్ పెట్టారు. బెజవాడలో అప్పటివరకు ట్యూబ్ లైట్లు లేవు. మొదటి ట్యూబు లైట్ ఆ హోటల్లోనే వెలిగిందని, అలాగే హోటల్లో రేడియో సెట్టు పెట్టి కార్యక్రమాలు వినిపించడం కూడా నేతాజీ హోటల్ తోనే మొదలయిందట. నేతాజీ హోటల్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండవని భావించిన వెంకటేశ్వరరావు గారు, చౌక ధరలకు కాఫీ టిఫిన్లు అందించే ఉద్దేశ్యంతో ఏలూరు రోడ్డులో జనతా హోటల్ పేరుతొ మరో హోటల్ కూడా నడిపారట. నిజంగా ఇవి నాకు తెలియని విషయాలే.  

మోడరన్ కేప్ హోటల్లోనే ఒక ఏసీ రూమ్. దాని తలుపు ఎంత మందంగా వుండేది అంటే ఒక పట్టాన తెరుచుకునేది కాదు. లోపలకు వెళ్ళగానే చక్కటి సువాసనతో కూడిన చల్లటి  గాలి ఒంటిని చుట్టుముట్టేది. ఒక్క క్షణం స్వర్గంలో వున్నట్టు అనిపించేది. ఒక్క క్షణమే. మా వాళ్ళు ఎవరో అక్కడ వున్నట్టు వెళ్లి, మళ్ళీ  మరుక్షణం బయటకు వచ్చేవాళ్ళం. ఎందుకంటే అక్కడ పదార్ధాలు ఖరీదు. ఆ రోజుల్లో బెజవాడ మొత్తంలో  ఏసీ రూమ్ వున్న హోటళ్ళు రెండే. మరోటి గాంధీ నగర్లో వెల్కం హోటల్ కు అనుబంధంగా ఉన్న ఎస్కిమో. తరువాత ఎప్పుడో, మమతా, మనోరమా,   నటరాజ్ హోటళ్ళు వచ్చాయి.  

ఇక లాయర్ చక్రవర్తి గారి నివాసం వైట్ హౌస్ విషయానికి వస్తే, అదొక అద్భుతమైన కట్టడం. దసరా రోజుల్లో చక్రవర్తి గారి భార్య, ఇంట్లో  బొమ్మల కొలువు పెట్టి పేరంటానికి మా అక్కయ్యను పిలిచేవారు. పిల్లల కోడిలా మిమ్మల్ని వెంటబెట్టుకుని వెళ్ళేది. ఆ విధంగా ఆ ఇంటి వైభోగం కళ్ళారా చూసే అవకాశం మాకు దొరికేది.   ఇంటి ముందు లాన్. రెండు తెల్లటి పప్పీలు (కుక్క పిల్లలు, అచ్చం బొమ్మల్లాగే వుండేవి. కుక్కల్లో అలాంటివి వుంటాయని, అంత అందమైన కుక్కలు ఉంటాయని  పల్లెటూరు నుంచి వచ్చిన నాకు మొదటిసారి తెలిసింది) పెద్ద మేడ. కిందా పైనా అనేక గదులు. ఒక పెద్ద హాలు. గోడలు, ఇంటి పైకప్పు తెల్లటి తెలుపు.

హాలు మధ్యలో సోఫాల నడుమ  మధ్యలో బొమ్మల కొలువు. సినిమా సెట్టింగులా వుండేది. దేవుళ్ల బొమ్మలు సరే. ఇవికాక కృష్ణా బ్యారేజి, కిందికి నీళ్ళు పారే ఏర్పాటు. అన్నన్ని బొమ్మలు మిగిలిన రోజుల్లో ఏమి చేసుకుంటారో. తలా ఒకటి ఇస్తే పోలా అనిపించేది.

ఇప్పుడా అందమైన భవంతి వున్నట్టు లేదు రాజగోపాలాచారి వీధిలో ఒకప్పుడు మొత్తం పట్టణానికి తలమానికంగా వున్న చక్రవర్తి గారి వైట్ హౌస్ స్థానంలో ఇప్పుడు ఏదో మాల్ వచ్చిందని వింటున్నాను.

జంధ్యాల శంకర్ గారు విజయవాడ మేయర్ గా వున్నప్పుడు ఒక ఆలోచన చేశారు. బెజవాడ అంటే ఇదీ అని, భావి తరాలకు గుర్తు చేసే కట్టడాలు, భవనాలు, నిర్మాణాల ఫోటోలు తీసి భద్రపరచాలని. ఆ దిశగా ఆయన కృషి చేశారు కూడా. అవి కంప్యూటర్ రోజులు కావు కదా శాశ్వతంగా పదిలపరచడానికి. ఆ ఫోటోల పరిస్థితి ఏమిటన్నది  ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు.    

కింది ఫోటోలు:


బీసెంటు రోడ్డులో మోడరన్ కేప్


నాడార్స్ కాఫీ అండ్ జనరల్ స్టోర్స్
 (గూగుల్ సౌజన్యం)






(ఇంకా వుంది)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

నాడారు వారి నెక్స్ట్ తరమే హెచ్సీయెల్‌ నాడారు విషయం రాయటం మరిచిపోయినట్టున్నారు