25, డిసెంబర్ 2024, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (47) - భండారు శ్రీనివాసరావు

 


 

బెజవాడ ఎస్సారార్ కాలేజి అంటే మొట్టమొదటగా గుర్తు వచ్చేది కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు. ఆయన ఆ కాలేజీలో పనిచేసినప్పుడు నేను అక్కడ చదవక పోయినా ఆ కాలేజిని గుర్తు చేసుకున్నప్పుడల్లా నాకు గుర్తు వచ్చేది ఆయనే.

 

 “దేవుడు మనిషికి రెండు చెవులు ఇచ్చింది ఎక్కువ వినడానికిఒక్క నోరే ఇచ్చింది తక్కువ మాట్లాడడానికి” అని వాక్రుచ్చాడు ఓ మితభాషి.

నిజమే! వినడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆ చెప్పేవాడు ఓ విజ్ఞాన ఖని అయితే మన పంట పండినట్టే.

రెండేళ్ల క్రితం కాబోలు, ఒక రోజు ఉదయం వచ్చిన అనేకానేక ఫోన్లలో కోమాండోరి (ఇంటిపేరు విని రాసింది కనుక తప్పయితే క్షంతవ్యుడను) శేషాచారి గారిది ఒకటి.  మాటల నడుమ తెలిసింది వారి వయసు తొంభయ్ అని. కొద్దిగా వణుకు వున్నామాట స్పుటంగా వుంది. ఉస్మానియాలో తెలుగు లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యారుట. చైతన్యపురిలో నివాసం.

ఆ రోజు నేను ఒక తెలుగు దినపత్రికలో రాసిన వ్యాసం గురించి శేషాచారి గారు  ప్రస్తావించారు. నా పట్ల  వారి ప్రశంసలు ఇక్కడ అప్రస్తుతం.

ప్రతిరోజూ అనేక పత్రికలు చదివే అలవాటు వారికి వుందట. అలా నా వ్యాసం కూడా చదివారు. అందులో నా  నెంబరు వుండడం చేత ఫోన్ చేశారు.

మాటల మధ్యలో శేషాచార్యుల వారు అనేక అంశాలు ప్రస్తావించారు. తొమ్మిది పదుల వయసులో ఆయన ధారణ శక్తి అద్భుతం అనిపించింది. ‘మాధవుడు ఏక పదమా! సమాసమా!’ అని నన్ను ప్రశ్నిస్తూ వారే జవాబు చెప్పారు. లేని పక్షంలో నా అజ్ఞానం స్ఫుటంగా వెల్లడయ్యేది.

మాధవుడు అంటే శ్రీమన్నారాయణుడు. వినగానే ఏకపదం అనిపిస్తుంది. ఉత్పత్తి అర్ధం తీసుకుంటే మా అంటే అమ్మ. అమ్మ అంటే అమ్మవారుజగజ్జనని. అంటే శ్రీ మహావిష్ణువు సతీమణి. ధవుడు అంటే భర్త. అమ్మవారి భర్త శ్రీమన్నారాయణుడు అంటారు శేషాచార్యుల వారు.

మధ్యలో ఏదో అనుమానం కలిగి అడిగారుమీరు ఫ్రీగా వున్నారా! అని.

‘పరవాలేదునేను 24 X 7 ఫ్రీ మనిషిని. పైగా మీ మాటలు వింటుంటే రాసుకోవడానికి నాకు ముడి సరుకు దొరుకుతుంది. కాబట్టి ఇందులో నా స్వార్ధం కూడా వుందిచెప్పండి’ అన్నాను వారితో. ఆయన సంభాషణ మళ్ళీ మొదలు పెట్టారు.

‘ఒకసారి అంటే ఇప్పుడు కాదులెండి, చాలా దశాబ్దాలు గడిచిపోయాయి. హైదరాబాదు సారస్వత పరిషత్ లో జరిగిన ఓ సభకు ప్రముఖ కవి జాషువా గారుకవిసామ్రాట్ విశ్వనాధ గారు వచ్చారు. నేనూ వెళ్లాను.

‘జాషువా గారు సాత్వికులు. విశ్వనాధ వారి సంగతి లోక విదితం. ప్రధమ కోపం అంటారు.

‘జాషువాగారు నాలుగు పద్యాలు చదివారు. తర్వాత ఆయన ఇలా అన్నారునా పద్యాలకు అర్ధం అడక్కండికానీ రాయడానికి కారణాలు అడగండి చెబుతాను అంటూ జాషువాగారు తన గబ్బిలం పుస్తకం గురించి చెబుతుంటే సభలో అందరూ ఆయన కవితాభినివేశానికి మ్రాన్పడి పోయారు. అంతసేపూ వేదిక మీద ఉన్న విశ్వనాధవారు తనకు వేసిన గులాబీ  పూలదండను చేతితో నలుపుతున్నట్టు అనిపించి, ఆయన సంగతి తెలిసిన వారు  కొంత భయపడ్డారు కూడా.

ఇంతలో జాషువాగారి ప్రసంగం ముగిసింది. సభికుల హర్షధ్వానాల నడుమ విశ్వనాధ లేచి నిలబడ్డారు. అప్పటివరకు పూలదండ నుంచి తెంచిన గులాబీ రేకులను దోసిట్లోకి తీసుకుని జాషువా శిరస్సుపై అభిషేకిస్తున్నట్టు వెదజల్లారు.

రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ జాషువాను పుంభావసరస్వతి అని కీర్తించారు.

శేషాచార్యుల వారు ఈ వృత్తాంతం చెబుతూ కొద్ది సేపు మౌనంగా వుండి గతకాలపు జ్ఞాపకాలను తలచుకున్నారు.

తర్వాత నేనే చొరవ తీసుకుని వారి వివరాలు అడిగి తీసుకున్నాను. లోగడ అంటే నేను రేడియోలో చేరక పూర్వమే శేషాచార్యులవారు ఆకాశవాణిలో సంస్కృత కార్యక్రమాల్లో పాల్గొన్నారట. అధర్వణ వేదాన్ని విశదీకరిస్తూ అనేక ప్రసంగాలు చేశారట.

ఇటువంటి విలువకట్టలేని నిక్షేపాలు ఆకాశవాణి వద్ద అనేకం ఉండేవి. ఉండేవి అని ఎందుకు అంటున్నాను అంటే తదనంతర కాలంలో  వాటి విలువ తెలియని వాళ్ళు వాటిని పదిలంగా భద్రపరచి వుంటారనే నమ్మకం లేదు కనుక.

ఇప్పుడు కొంత స్వకీయం.

సుమారు యాభయ్ ఏళ్ళ క్రితం ఇద్దరు కాలేజి కుర్రాళ్ళకు వక్తృత్వవ్యాసరచన పోటీల్లో నెగ్గినందుకు గాను  నూట యాభయ్ రూపాయలు పారితోషికంగా వచ్చాయి. అంత డబ్బుతో ఏం కొనుక్కోవాలి అనేది పెద్ద సమస్యగా మారింది. చివరికి వారిలో ఒకడన్నాడుపుస్తకాలు కొనుక్కుందాం అని. పుస్తకాలు అంటే క్లాసు పుస్తకాలు కాదుపెద్ద రచయితలు రాసిన గొప్ప పుస్తకాలు.

విశ్వనాధవారి వేయి పడగలయితే అన్నాడు ఇద్దరిలో ఒకడు. ఈ డబ్బుకు రెండు పుస్తకాలు వస్తాయంటావా అన్నాడు ఆ ఇద్దరిలో మరొకడు. ఈ ఇద్దరిలో నేనొకడిని.

ఇద్దరం కలిసి బెజవాడ మాచవరంలో ఉంటున్న కవిసామ్రాట్ ఇంటికి వెళ్ళాము. ఇంటికి ముందు విశాలమైన ఆవరణ. వరండాలో ఓ కుర్చీలో పై పంచ లేకుండా దోవతీలో ఒకాయనఆయనకు దగ్గరగా  తెల్లటి వస్త్రాల్లో మరొకాయన కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరిలో విశ్వనాధ ఎవరై వుంటారు?

తెల్ల ఉడుపుల పెద్దమనిషి మా ఇద్దరినీ గుర్తు పట్టాడు. పట్టి, పై ఆచ్ఛాదన లేని వ్యక్తికి పరిచయం చేశారు.

‘ఇదిగో ఈ పొడుగబ్బాయి, సన్నగా వున్నాడే వీడు, ప్లీడరు తుర్లపాటి హనుమంతరావు పంతులు గారి పెద్దబ్బాయి సాంబశివరావు. ఇంట్లో శాయిబాబు అంటారు. ఇక ఈ రెండోవాడు శ్రీనివాసరావు. మా అక్కయ్య కోడలి తమ్ముడు. హనుమంతరావు పంతులుగారికి స్వయానా బావమరది’

అప్పుడు ఇద్దరిలో సన్నవాడికి లైటు వెలిగింది. ఓహో వీరు పేరాల భరత శర్మ గారువిశ్వనాధవారి శిష్యులు అని రెండోవాడినయిన నా  చెవిలో ఊదాడు.

ఏం పని మీద వచ్చారు అని అడగకుండానే చెప్పాము, పోటీల్లో బహుమతి కింద ఇద్దరికీ కలిపి నూట యాభయ్ వచ్చాయనిఆ డబ్బుతో మీ వేయి పడగలు పుస్తకం కొనుక్కుందామనే  కోరిక కలిగిందని.

‘నా పుస్తకాలు మీకు అర్ధం అవుతాయా’ అనేది విశ్వనాధ వారి మొదటి ప్రశ్న.

‘ఏమోనండీ అర్ధం కాకపోవచ్చు. కానీ అర్ధం చేసుకోవడానికే చదవాలని అనుకుంటున్నాం’ మా జవాబు.

విశ్వనాధవారి మోహంలో కనీకనపడని నవ్వు.

‘అదిగో ఆ మూల వున్నాయి. పోయి చెరొకటి తెచ్చుకోండి’ అన్నారు.

పోయి చూస్తే విశ్వనాధ వారు రాసిన పుస్తకాలు  ప్యాకెట్లుగా కట్టి వున్నాయి.

ఆయన చెప్పినట్టే చేసి చెప్పాము.

‘ఇందులో చాలా పుస్తకాలు ఉన్నట్టున్నాయి. మా దగ్గర నూట యాభయ్ మాత్రమే వున్నాయి’ అన్నాడు సాంబశివరావు అనే నా సహాధ్యాయి. నాకు   మేనల్లుడు కూడా.

అప్పుడు విశ్వనాధవారు పెద్దగా నవ్వారు.

‘అర్ధం చేసుకుంటాం అన్నారు కదా! పోయి చదవండి. చదివేవారికి పుస్తకం చేరాలి. మిగిలిన పుస్తకాల డబ్బు మీ ఇద్దరికీ నా గిఫ్ట్’ అనేశారు.

మహదానందంతో రెక్కలు కట్టుకుని ఇంటికి వచ్చి ప్యాకెట్ విప్పితే :

‘వేయి పడగలుకిన్నెరసాని పాటలు, దిండు కింద పోకచెక్క, స్వర్గానికి నిచ్చెనలుచెలియలి కట్టఏకవీరతెఱచిరాజుమాబాబువిష్ణుశర్మ ఇంగ్లీషు చదువుచిట్లీచిట్లని గాజులు....’

కవిసామ్రాట్ అయ్యే. ఎంత పెద్ద చేయి అయివుండాలి మరి.

సందర్భం వచ్చింది కాబట్టి ఆ మహానుభావుడి గురించి మరి కొన్ని విషయాలు.

ఒకానొక కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ పోస్టుకు ప్రకటన వెలువడినప్పుడు, కరీంనగరు కళాశాలలో పనిచేస్తున్న మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు దరఖాస్తు చేసుకొన్నారు. ఇంటర్వ్యూ రోజున  హాజరైన అభ్యర్థి విశ్వనాథ వారికి, విశ్వవిద్యాలయం  తెలుగు శాఖాధిపతి  ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు.

అది ఇలా సాగింది.  

‘నీ పేరు?

(నన్నే గుర్తించ లేదాపైగా ఏక వచన ప్రయోగమా ?" అని కోపం వచ్చినా తమాయించుకొని చెప్పారు.)

తన పేరు విశ్వనాథ సత్యనారాయణ అని.

 ఏమేం కావ్యాలు వ్రాసావు?’ రెండో ప్రశ్న బాణంలా వచ్చింది.

పేరు చెప్పాక కూడా అటువంటి ప్రశ్న వేసేసరికి పట్ట లేని కోపంతో)  “నేనేం కావ్యాలు వ్రాసానో కూడా తెలియకుండానే ఇక్కడ ’తెలుగు శాఖాధిపతి’ ఎలా అయ్యావురానీలాంటి వాడు ఉన్నంతకాలం  విశ్వవిద్యాలయం మెట్లపై అడుగిడను” ( అంటూ కోపంగా వెళ్ళిపోయారు.)

తరువాత విశ్వనాథ వారు  విశ్వవిద్యాలయంలోను ’ప్రొఫెసర్’ మెట్టెక్కలేక పోవడం  దురదృష్టం

చాలా ఏళ్ళ తరువాత  విషయం విశ్వనాథ వారు  స్వయంగా వ్రాసుకొన్నారు.

విశ్వనాధవారు రాసిన రామాయణ కల్పవృక్షం అనే గ్రంధం అనేక విశిష్టతల సమాహారం. రాసింది వాల్మీకి రామాయణం ఆధారంగానే అయినావిశ్వనాధవారు అనేక సందర్భాలలో తనదయిన కల్పనా చాతుర్యాన్ని ప్రదర్శించి చూపారు. ఇందుకు ఉదాహరణ రామాయణ కల్పవృక్షంలోని ‘అహల్యా శాప విమోచన ఘట్టం.

సాధారణంగా రామాయణాలు చదివేవారికి భర్త గౌతముడి శాపంతో అహల్య శిలగా మారిపోవడం, చాలా కాలం గడిచిన తరువాత రామ పాదస్పర్శతో శాపము తీరి తిరిగి అహల్య రూపం ధరించడం తెలిసిన విషయమే. ఈ దృశ్యానికి  విశ్వనాధవారు తన కవి దృష్టితో ఒక చక్కని రూపం కల్పించారు.

భర్త శాపంతో ధూలిదూసరితమైన  అదృశ్య రూపంలో అహల్య రాముని రాకకోసం ఎదురు చూస్తుంటుంది.

“వాయు భక్షా! నిరాహారా! తప్యంతీ భస్మశాయినీ!” (బాల కాండ, 48 సర్గ, 30,31 శ్లోకాలుశ్రీభాష్యం అప్పలాచార్యులు, శ్రీ మద్రామాయణము, తత్వ దీపిక) అంటూ గౌతముడు, ‘  ఆశ్రమంలోనే  వుండిపోయి, నిన్ను ఎవ్వరు చూడకుండానీవు ఎవ్వరిని చూడకుండా, రామపాద స్పర్శ తగిలే వరకు కంటికి కనబడని ధూళి రూపంలో  తపస్సు చేసుకోమని’ అహల్యకు  ఆనతి ఇచ్చి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అహల్యను శిలగా మారిపొమ్మని శాపం ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు అనేది కూడా అప్పలాచార్యుల వారి భాష్యం.

రామాయణం బాలకాండలో యాగరక్షణ కోసం తన వెంట తెచ్చుకున్న దశరధ తనయులు రామలక్ష్మణులతో, వచ్చిన కార్యం జయప్రదంగా పూర్తిచేసుకుని, ఆ అన్నదమ్ములను వెంటనిడుకుని విశ్వామిత్ర మహర్షి మిధిలానగరం దిశగా వెడుతూ, మార్గమధ్యంలో గౌతమముని ఆశ్రమం పరిసరాలకు చేరుకుంటాడు. గౌతముడు హిమాలయాలకు వెళ్ళిపోవడంఅహల్య భర్తశాపానికి గురవడం వంటి కారణాలతో ఆ ఆశ్రమం ఎండిపోయిన తరుల్లతలతోమోడువారిన వృక్షాలతో కళాకాంతులు కోల్పోయివుంటుంది. ఈ నేపధ్యాన్ని విశ్వనాధవారు తన చాతుర్యానికి ఆలంబనగా చేసుకుని కావ్యరచన చేశారు. ప్రకృతిని స్త్రీతో పోల్చడం ఎరిగిన సంగతే. దాన్నే ఆయన ఇక్కడ చక్కగా వాడుకున్నట్టు అనిపిస్తుంది.

రాముడు గౌతముడి ఆశ్రమం సమీపిస్తుండగానే, ఆయన మేను తాకి ప్రసరించిన మలయమారుతం కారణంగా ధూళి రూపంలో వున్న అహల్యకు ముందు ఘ్రాణే౦ద్రియం (నాసిక) మేల్కొంటుంది. అదే సమయంలో గౌతమ ఆశ్రమంలో వడిలిపోయివున్న పుష్పలతలు వికసించి తమ స్వభావసిద్ధమైన  సువాసనలను విరజిమ్మడం మొదలుపెడతాయి. ఆ తరువాత తనను సమీపిస్తున్న శ్రీరాముడి అడుగుల చప్పుడుతో అహల్య శరీరంలోని శ్రవణే౦ద్రియాలు (చెవులు) మేల్కొంటాయి.  అందుకు మరో సూచనగా అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న గౌతమాశ్రమం నుంచి  పక్షుల కిలకిలారావాలు వినవస్తాయి. రాముడు మరికొంచెం దాపులోకి రాగానే అహల్య శరీరంలో చక్షువులు (నేత్రాలు) మేల్కొని ఆమె కళ్ళకు శ్రీరాముడి ఆకృతి కనబడుతుంది. అ పిదప రాముడి  పవిత్రపాదం సోకి ఆమెలోని స్పర్శే౦ద్రియం మేల్కొనగానే, అహల్యకు శాపవిమోచనం కలిగి పూర్వ రూపం వస్తుంది.

అదే సమయానికి హిమాలయాల నుంచి గౌతముడు అక్కడికి చేరుకుంటాడు. ఈ ఘట్టం పూర్తి కాగానే అహల్యా గౌతముల పునస్సమాగమం జరుగుతుంది. తదుపరి మిధిలలో జరగబోయే సీతారాముల కళ్యాణానికి  ఇదో సూచనగా  భావించవచ్చు.

విశ్వనాధవారు ఇంద్రియాలు మేల్కొనే వరుసను వర్ణించిన రీతికి మరో అన్వయం కూడా చెబుతారు.

మనిషి సుషుప్తావస్థ నుంచి జాగృతావస్థకు వచ్చే క్రమంలో కూడా  శరీరంలోని ఒక్కొక్క ఇంద్రియం క్రమక్రమంగా మేల్కొంటుందని అంటారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కాని  విశ్వనాధవారు మాత్రం అహల్యా శాప విమోచన ఘట్టానికి ఒక కొత్త రూపం ఇవ్వడంలో కృతకృత్యులు అయ్యారు. 

సరే! ఇక చదువు సంగతికివస్తే అది షరా మామూలే.

బీ కాం లో మర్కెంటైన్ లా అని ఒక సబ్జెక్ట్ వుండేది. నాకు కొరుకుడు పడని సబ్జెక్ట్. ఇంతవరకు నా చదువు ఏ ఏడూ  తప్పకుండా పాసయిన దాఖలా లేదు. కనీసం డిగ్రీలో అయినా ఆ అపకీర్తి అంటకుండా పాసవుదామనే నా కోర్కెకు  మర్కెంటైన్ లా గండి కొట్టింది.

కింది ఫోటోలు : 


గుర్రం జాషువా


 విశ్వనాధ సత్యనారాయణ










(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: