పందొమ్మిదివందల
డెబ్బయి ఒకటి -ఆగష్టు నెల- ఇరయయ్యవ తేది.
విజయవాడ, లబ్బీపేటలోని 'ఆంధ్రజ్యోతి' కార్యాలయం.
అందులో అడుగు
పెట్టి - ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారిని కలుసుకున్నాను.
ఆయన ఎగాదిగా
చూసి, నా పరిచయం కనుక్కుని-
'మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా!
పైకి పో. ఉపేంద్ర వుంటాడు. నేను పంపానని చెప్పు' అన్నారు ఫోన్ మీద చేయి వేస్తూ.
అదే నా తొట్ట
తొలి ఉద్యోగ నియామకపు ఉత్తర్వు.
ఉపేంద్ర గారిని
కలిసాను. కూర్చోమని సైగ చేసారు. గుర్రపు నాడా ఆకారంలో వున్న బల్ల చివర్లో
కూర్చున్నాను. పీ టీ ఐ , యు ఎన్ ఐ వార్తల్ని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. ఆ విధంగా
మొదలయింది నా జర్నలిస్టు జీవితం.
ఉదయం ఎనిమిది
గంటలకల్లా అన్నంతిని ఆంధ్రజ్యోతికి వెళ్ళేవాడిని. అన్నయ్య పర్వతాలరావుగారు ఇమ్మన్న
రూపాయి నోటు వొదినె సరోజినీదేవి నా చేతిలో పెట్టేది. రాను పోను సిటీ బస్సుకు నలభై
పైసలు. మధ్యాహ్నం ఆఫీసుకు ఎదురుగా వున్న టీ స్టాల్లో ముప్పయి పైసలు పెట్టి
ఒక సమోసా తిని టీ తాగేవాడిని. రోజుకు ముప్పయి పైసలు మిగిలేవి. వేరే ఖర్చులు లేవు.
అలా నెలకు సుమారు పది రూపాయలు ఆదా. అదే నా మొట్టమొదటి నెలసరి ఆదాయం.
అలా మూడు నెలలు
గడిచాయి. జీతం విషయం నేను అడగను లేదు - వాళ్ళు చెప్పను లేదు. ఒక రోజు అటెండర్
నాగేశ్వరరావు నాదగ్గరకు వచ్చి ఎక్కవుంటెంటుని కలవమని చెప్పాడు. వెడితే- ఓ
ఓచర్ మీద సంతకం చేయించుకుని పది - పది రూపాయల నోట్లు - వంద నా చేతిలో పెట్టారు.
అదే నా తొలి వేతనం.
ఉద్యోగం తప్ప
వేరే ధ్యాస లేని రోజులవి. రాసిన ప్రతిదీ మర్నాడు పేపర్లో రాకున్నా ప్రూఫ్ లో
అచ్చయిన నా వార్తల్ని నేనే చదువుకుని మురిసిపోయేవాడిని. నేను చేరిన
కొత్తల్లోనే నార్ల గారు హైదరాబాద్ వెళ్ళిపోవడం - నండూరి రామమోహనరావు గారు బాద్యతలు
స్వీకరించడం జరిగిపోయాయి. ఎందుకో ఏమోగానీ, దిన,వార పత్రికలకు సంబంధిoచిన అన్ని
అంశాలలో నాకు తర్ఫీదు ఇచ్చారు. ప్రతిరోజూ ఎడిట్ పేజీలో కార్టూన్ తో కూడిన నాలుగు
వాక్యాల గేయాన్ని 'వాక్టూనులు ' అనే శీర్షికతో రాసేవాడిని. సినిమా సమీక్షలు, పుస్తక సమీక్షలు, ఆదివారాల్లో పిల్లలకోసం ప్రత్యేక కధలు , బంగ్లాదేశ్ అవతరణకు దోహదం చేసిన
పందొమ్మిదివందల డెబ్బయి ఒకటి,
ఇండో-పాక్ యుద్ధంలో భారత సైన్యాల కదలికలను
సూచించే మ్యాపులు - ఇలా అన్నింట్లో నేనున్నానంటూ వేలు పెట్టేవాడిని. శ్రీయుతులు
ఉపేంద్ర, ఐ.వెంకటరావు, కే.రామకృష్ణ, వీరభద్రరావు, ఎల్వీ రమణ ( ఆ మధ్య కాలం చేశారు), సత్యనారాయణ, ఆంజనేయులు, చంద్రశేఖర ఆజాద్ (ఇటీవలే చనిపోయారు) వంటి సహోద్యోగుల నడుమ నా ఆంధ్ర
జ్యోతి ఉద్యోగ పర్వం నాలుగున్నర సంవత్సరాలపాటు ఇట్టే గడిచిపోయింది.
అన్నట్టు
చెప్పడం మరిచాను. మొదట్లోనే నార్లగారు నాకో బ్రహ్మొపదేశం చేశారు. జర్నలిస్టు అనే
వాడు ఎప్పుడూ, జేబులో రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకోవాలనే వారు. చాలా కాలంపాటు
దాని పాటించాను కూడా. తర్వాతి రోజుల్లో రేడియోలో ఏదో వార్త విషయంలో పేచీ వచ్చి, రాజీనామా ఇచ్చేసి ఇంటికి వచ్చేశాను. అంతే! నెలరోజులపాటు మళ్ళీ ఆఫీసు
మొహం చూడలేదు. చివరికి ఎవరో పూనుకుని రాజీ చేయడం, ఉద్యోగంలో తిరిగి చేరడం జరిగిపోయాయి.
అదో అధ్యాయం.
లబ్బీపేట
ఆంధ్రజ్యోతి ఆఫీసులో పనిచేసుకుంటూ, సబ్ ఎడిటర్లం ఒకరికొకరం ప్యూన్ నాగేశ్వరరావుతో
చీటీలు పంపుకునే వాళ్ళం. “ఒక పాతిక సర్దుతారా, ఇరవైన అడ్వాన్స్ తీసుకోగానే
ఇచ్చేస్తాను” అనే అభ్యర్ధనలు వాటిల్లో ఉండేవి. అంతమాత్రం డబ్బు ఎవరి దగ్గరా ఉండదని
తెలుసు. అయినా అడక్క తప్పని అవసరాలు.
అందరిదీ ఒకే
అవసరం కనుక ఒకరంటే మరొకరికి జాలి. అందుకని, ‘లేదు’ అనకుండా మరో చీటీ మీద “ఓ యాభయ్
సర్దుతారా” అని రాసి దాన్ని సీనియర్ సబ్ ఎడిటర్ ఉపేంద్రబాబుకు పంపేవాళ్ళం. ఆయన ఆ
చీటీలోనే యాభయ్ రూపాయలు వుంచి తిరిగి పంపేవాడు. అందులో సగం వుంచేసుకుని మిగిలిన
పాతిక ముందు అడిగిన వాడికి సర్దుబాటు చేసేవాళ్ళం. ఈ చేబదులు చక్రభ్రమణం ప్రతినెలా
సాగేది. ఇదిగో! ఈ ‘లేని’ తనమే మా స్నేహాన్ని గట్టిగా నిలిపి ఉంచింది. అందరం ఇదే
బాపతు కనుక ఇక అసూయలకు ఆస్కారమే వుండేది కాదు.
మిత్రుడు
నందిరాజు రాధాకృష్ణ చాలా మంచి పాత ఫోటోలను ఎంపిక చేసి మరీ పోస్ట్ చేస్తుంటాడు.
ఆయన్ని చూసి ఆ వాతలు యేవో నేనూ పెట్టుకుందామని ఈ రోజు ఓ పూటల్లా వెతికి పాత
కాగితాల్లో నుంచి పాత జ్ఞాపకాలను తవ్వి తీస్తుంటే - డెబ్బయ్యవ దశకంలో బెజవాడ 'ఆంద్రజ్యోతి'లో
పనిచేసేటప్పుడు రిపోర్టర్ గా కవర్ చేసిన ఓ సందర్భం తటస్థపడింది. నిజానికి నేను
పేపర్లో రాసిన వార్త క్లిప్పింగు కాదు. ఆ ఫంక్షన్ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు
నేను హడావిడిగా రాసుకున్న నోట్స్ అది. అందులో కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి
పేరు కనిపించడంతో ఒకింత ఉత్సుకతతో తీసిచూసాను. ఎన్టీయార్ సినీ నటుడిగా వున్నప్పుడు, రాజకీయ ప్రవేశం
చేయకముందు బెజవాడలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కార్యక్రమం అది. సభకు హాజరయిన వారి
జాబితా చూస్తే ఖచ్చితంగా అది ఫిలిం
డిస్త్రి బ్యూషన్ కంపెనీ ప్రారంభోత్సవం అయివుండాలి. అధ్యక్షత వహించిన నాటి మంత్రి
మూర్తిరాజు గారు, ఎన్టీయార్ ఉపన్యాసాలు మాత్రం దొరికాయి. రామారావుగారు చేసిన
ప్రసంగాన్ని నేనిలా చిత్తు ప్రతిలో (ఒక రకం షార్ట్ హ్యాండ్ అన్నమాట)
రాసుకున్నాను.
ఆయనిలా
మాట్లాడారు:
"సినిమా
ప్రదర్శనలో ముఖ్యమైన శాఖ డిస్ట్రి బ్యూషన్. సినిమా అనేది కళాత్మక వ్యాపారం.
వ్యాపారాత్మకమైన కళ కూడా........
"ఒక కొత్త
సంస్థ వస్తున్నదంటే పరిశ్రమకు బలం పెరుగుతున్నదన్న మాట. చిత్రాలు ఈనాడు దెబ్బ
తింటున్నాయంటే ప్రజలకు కావాల్సింది మనం
ఇవ్వలేకపోతున్నామని అర్ధం......
"ప్రేక్షకులకు, నిర్మాతలకు
మధ్య వంతెన లాంటి వాళ్ళు పంపిణీదారులు. ఇదొక ఫ్యామిలీ బిజినెస్ కాదు. ఇదొక
ఉత్తేజకరమైన మీడియం.........
"పరిజ్ఞానంలో కానివ్వండి, వ్యాపార దక్షతలో కానివ్వండి, వయస్సులో
కానివ్వండి ఇక్కడ వున్న అందరికంటే నేను చిన్నవాడ్ని. అందుకే ఈ సంస్థను పరమేశ్వరుడు
అనుగ్రహించాలని వేడుకుంటున్నాను......
"విజయవాడ
కార్యక్రమం అంటే ఒక రకంగా నా కుటుంబ కార్యక్రమం లాంటిది.....
"నేషనల్
డిఫెన్స్ ఫండ్ కలెక్షన్ సమయంలో వెస్ట్ గోదావరి జిల్లాలో కార్యక్రమం అంతా మూర్తి
రాజుగారు నిర్వహించారు. మూర్తి రాజుగారికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ప్రభుత్వం
తనని తానే గౌరవించుకున్నది....."
మంత్రి మూర్తి
రాజుగారి ప్రసంగం సంక్షిప్తంగా:
"మీరు
దండలు వెయ్యకా తప్పదు, మేము మొయ్యకా తప్పదు. ఇప్పుడు దండలు వెయ్యడం కాదు. దండకొక వేయి
చొప్పున పోగుచేసి రామారావులాంటి కళాకారులను తయారు చేసే ఒక నటనా కళాశాలను
స్థాపించండి....
"నటులలో
పోటీ వుండడం మంచిదే. మాకే వూళ్ళో సంఘాలు లేవు. కానీ వీళ్ళకి మాత్రం ప్రతి వూళ్ళో
అభిమాన సంఘాలు వున్నాయి.........
"....ఎక్కువ
డబ్బు సంపాదించండి. కాదనను. కానీ సంపాదించిన దానిలో కొంతయినా సమాజానికి
ఉపయోగించండి. సినిమా పరిశ్రమ వారికి నేనిచ్చే సలహా ఇదే"
అలా సాగిపోయింది
మూర్తి రాజు గారి ప్రసంగం.
ఇలా రోజులు సాగిపోతుండగా ఒక రోజు మద్రాసులో వుంటున్న నా కాబోయే ఆవిడ నుంచి టెలిగ్రాం వచ్చింది.
“స్టార్ట్
ఇమ్మీడియేట్లీ. నిర్మల’
కింది ఫోటో : శ్రీ నార్ల వెంకటేశ్వర రావు గారు
(ఇంకా వుంది)
2 కామెంట్‌లు:
అబ్బ! ఆఖర్లో టెలిగ్రామ్ ట్విస్టు తో సస్పెన్సు పెట్టేరు! తరువాయి ఎపిసోడ్ కొరకు కళ్ళల్లో వత్తులేసుకుని వేచివున్నాము :)
నార్ల వారి సమగ్ర సాహిత్యం
https://archive.org/search?query=creator%3A%22%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2+%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81+%28Narla+Venkateswarao%29%22&sort=-addeddate
కామెంట్‌ను పోస్ట్ చేయండి