19, డిసెంబర్ 2019, గురువారం

రేడియో రోజులు - 46 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 20-12-2019, Friday)
ఆకాశవాణి భక్తిరంజని
ఒకానొక రోజుల్లో తెలుగునాట ప్రతి లోగిలి రేడియోలో వచ్చే భక్తి రంజని కార్యక్రమంతో మారుమోగుతుండేది.
తెల్లవారేసరికి ఆ రోజుల్లో ప్రతి యింట్లోనూ, బయట కాఫీ హోటళ్లలోనూ ఎక్కడ విన్నా  భక్తరంజని పాటలే.
తూము నరసింహదాసు, ప్రయాగ రంగదాసు (బాలమురళీ కృష్ణ మాతామహుడు), నరసదాసు, నారాయణతీర్థులు, రామదాసు, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, హనుమాన్ చాలీసా, సూర్యస్తుతి మొదలైనవి ఆ రోజుల్లో భక్తి రంజని ద్వారా  శ్రోతలకు సురపరిచితం.
ఈ విషయాలు చెప్పాలంటే మల్లాది సూరిబాబు గారే చెప్పాలి. ఆయన ఇలా అంటారు.
“ధనుర్మాసంలో డాక్టర్ మంగళంపల్లి, శ్రీరంగం గోపాలరత్నం పాడిన తిరుప్పావై, సప్తపది ఎంత ప్రసిద్ధి చెందినదో అందరికీ తెలుసు. ప్రభాతవేళ ఈ పాశురాలు చెవిని పడుతూంటే శ్రీరంగంలో స్వామి ఎదురుగా కూర్చున్న అనుభూతి కల్గుతుంది. ప్రతిరోజూ వోలేటి వెంకటేశ్వర్లు గానం చేసిన హనుమాన్ చాలీసా, పెమ్మరాజు సూర్యారావు, ఎం.వి.రమణమూర్తి పాడిన సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు సర్వం బ్రహ్మమయం, నహిరే నహి శంక, భజరే గోపాలంఎప్పుడు విన్నా మొదటిసారి విన్నట్లు అనిపించడం ఓ దివ్యమైన అనుభవం.
“వింజమూరి లక్ష్మి, వి.బి.కనకదుర్గ, పాకాల సావిత్రీదేవి, ఎన్‌సివి జగన్నాథాచార్యులు గానం చేసిన సుప్రభాతాలు, శ్రావ్యమైన లలిత గీతాలు, దేశభక్తిని ప్రచోదనం చేసే పాటలు, ఎన్‌సివి జగన్నాథాచార్యులు, కనకదుర్గ పాడిన శ్రీ సత్యనారాయణ స్వామి సుప్రభాతంరేడియోకే దివ్యాభరణాలై లక్షలాది శ్రోతలను అలరిస్తున్నాయి.
“మంగళంపల్లి బాలమురళీకృష్ణ విజయవాడ కేంద్రంలో లలిత సంగీత శాఖకు ప్రొడ్యూసర్‌గా ఉన్న రోజుల్లో మధురంగా పాడిన పిబరే రామరసం, స్థిరతా నహిరే, చేతః శ్రీరామంశ్రోతలు ఈ రోజుకీ ఎంతో ఆసక్తిగా వింటారు. అన్నమయ్య కీర్తనలు అప్పటికింకా వెలుగులోకి రాలేదు. భక్తిరంజని కోసం, బాలమురళీ పాడిన ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నదిఅన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుల వారు రాసిన కీర్తనతో విజయవాడ కేంద్రం నుంచి అన్నమాచార్య కీర్తనల ప్రచారం ప్రారంభమైందంటారు” శ్రీ  సూరిబాబు.
ఒకప్పుడు రేడియో అంటే సంగీతం. నిజంగా ఆకాశవాణిలో పోగుపడిన సంగీత సంపద అంతాఇంతా కాదు. ఆర్కైవ్స్ పేరిట కొంత భద్రపరచినా ఎంతో అమూల్యమైన  సంగీత నిధి రికార్డుల్లో లేకుండా పోయింది. కొందరు సంగీత కారుల స్వార్ధం, మరికొందరు అధికారుల అజ్ఞానం ఇందుకు కారణాలు. కళాకారులు కొన్ని టేపులు దారిమళ్ళించి తమ స్వార్ధాలకు వాడుకుంటే, సంగీతం అంటే తెలియని కొందరు అధికారులు ప్రసిద్ధ విద్వాంసులు కచ్చేరీ ఇచ్చిన  కొన్ని టేపులను చెరిపివేశారని చెప్పుకోవడం విన్నాను.
మల్లాది సూరిబబుగారికి రజనీ గురుసమానులు. రజనీని అంటే బాలాంత్రపు రజనీకాంతరావుగారిని   సంగీత సాహిత్య సవ్యసాచిగా అభివర్ణిస్తారాయన. నిజంగా సూరిబాబు గారి ప్రసంశలో ఇసుమంతయినా అతిశయోక్తి లేదు.
“రజని  రేడియో కోసమే పుట్టిన వ్యక్తి. రేడియో ప్రాభవానికి ముఖ్య కారకుడై యింతింతై, వటుడింతయై మఱియు తానింతై నభోవీధిపై నంతై, జాతీయ అంతర్జాతీయ పురస్కారాలందుకున్న వాగ్గేయకారుడు. జాతీయ స్థాయిలో రేడియో పురస్కారాలందుకున్న మొదటి వ్యక్తి ఆయనే. శ్రీ సూర్యనారాయణా మేలుకోఎం.వి.రమణమూర్తి, శ్రీరంగం గోపాలరత్నం పాడిన ఈ సూర్యస్తుతికి సంగీత మాధుర్యం నింపినది రజనీయే” అంటారు మల్లాది సూరిబాబు గారు.
 ఇక హైదరాబాదు రేడియో కేంద్రానికి వస్తే పాలగుమ్మి విశ్వనాధం గారు, మల్లిక్, చిత్తరంజన్ గార్లు, మంచాల జగన్నాధ రావు గారు భక్తిరంజని కార్యక్రమానికి తమ సంగీత విభవంతో కొత్త సొగసులు అద్దారు. ఇక దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు రేడియో కోసమే రచించిన అనేక గేయాలు ఈనాటికీ ఈ కార్యక్రమంలో శ్రోతలను అలరిస్తూనే వున్నాయి. 1957 లో దేవులపల్లి కృష్ణ శాస్త్రి  హైదరాబాదు రేడియోలో ప్రయోక్తగా చేరిన కృష్ణశాస్త్రి గారు, ఎనిమిదేళ్ళపాటు అందులో ఉద్యోగం చేశారు. రేడియోవాళ్ళు నాచేత రాయించకపోతే నేను రాసిన దాంట్లో చాలా భాగం  రాసివుండే వాణ్ణి కాదుఅని ఆయన చెప్పేవారు.
1960 లో రజని సంగీత సంవిదానంతో కృష్ణ శాస్త్రి రాసిన క్షీర సాగర మధనం’, ‘విప్రనారాయణ’, ‘మాళవికయక్ష గానాలను హైదరాబాదు కేంద్రం ప్రసారం చేసింది.
 భక్తిరంజనిలో ప్రసారమయ్యే కీర్తనలన్నీ సంప్రదాయ సంగీత పరిధిలో ఉంటూ శ్రోతల్లో సంగీతాభిరుచిని కలిగించడం ఈ కార్యక్రమం విశిష్టత.
మల్లాది గారు మరికొన్ని విశేషాలు చెప్పారు. క్రైస్తవ, ముస్లిం భక్తిగీతాలు కూడా ఈ భక్తిరంజని కార్యక్రమంలో చోటు చేసుకున్నాయి.  
విజయవాడలో సువార్త వాణిఅనే రికార్డింగ్ స్టూడియో వుండేది. 1971-76 ప్రాంతాల్లో రెవరెండ్ సాల్మన్ రాజు ఆ ప్రసార కేంద్రానికి డైరెక్టర్‌గా ఉంటూ ఎన్నో క్రైస్తవ భక్తిగీతాలు కంపోజ్ చేసి పాడిస్తూ వుండేవారు. ఆ పాటలు రేడియో కేంద్రానికిచ్చేవారు.
చంద్రకాంత కొట్నీస్, ఎ.పి.కోమల, జి.ఆనంద్, గోవిందాచార్యులు (శ్రీరంగం గోపాలరత్నం అన్నగారు) పాడిన కొనియాడ తరమా.. కోమల హృదయాఅనే క్రైస్తవ భక్తిగీతం బహుళ ప్రసిద్ధమైంది.
ఆదివారాల్లో ప్రసారమయ్యే క్రైస్తవ భక్తిగీతాలకూ, శుక్రవారాల్లోని నాత్-ఎ నబీ, నాతియా కలాం వంటి భక్తిరస ప్రధానమైన రచనలకు ఆకర్షణ ఇంతవరకూ తగ్గలేదు. ఇళ్లల్లో, పూజా మందిరాల్లో ప్రశాంతమైన చక్కని ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించటానికి కారణం ఆకాశవాణి భక్తిరంజనియే అంటే అతిశయోక్తి కాదంటారు సూరిబాబు. ఆదివారాల్లో విధిగా ప్రసారవౌతుండే ఆధాత్మ రామాయణ కీర్తనలుభక్తిరంజనికే తలమానికం. కాళహస్తి సంస్థానంలోని మునిపల్లె సుబ్రహ్మణ్య కవి ఈ ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలకో ప్రత్యేకతను అందించారు. శుద్ధ సంప్రదాయ సంగీత ధోరణితో ఉండే ఈ కీర్తనలు ఒకప్పుడు మన ఇళ్లల్లో మన అమ్మమ్మలు, బామ్మలు పాడుతూండేవారు.
సంప్రదాయ సంగీత సౌరభంతో నిండిన ఈ కీర్తనలు పాడిన శివశంకరశాస్త్రిని  విజయవాడ కేంద్రానికి పిలిచి రికార్డు చేసి, వాటికి నొటేషన్ తయారుచేసి నేదునూరి కృష్ణమూర్తి, ఎ.వి.ఎస్. కృష్ణారావు, నూకల చిన సత్యనారాయణ, ఎం.ఎస్.బాలసుబ్రహ్మణ్య శర్మ, ఎన్.సి.వి. జగన్నాథాచార్యులు, బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, శ్రీరంగం  గోపాలరత్నం, వి.బి.కనకదుర్గ, వింజమూరి లక్ష్మి మొదలైన సమర్థులైన విద్వాంసులతో నాలుగైదు రోజులపాటు బాగా రిహార్సల్స్ చేయించి, పాడించిన ఘనత వోలేటి వేంకటేశ్వర్లుకే దక్కుతుందంటారు మల్లాది సూరిబాబు గారు.
(సమాచార సేకరణలో ఉపయోగపడే వ్యాసాలు అందించిన మల్లాది సూరిబాబు గారికి కృతజ్ఞతలతో)
(ఇంకావుంది)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

అది ఒక స్వర్ణ యుగం. అప్పటి భక్తిరంజని గీతాలు సేకరించి శ్రోతలకు అందుబాటులో ఉంచాలి.