8, డిసెంబర్ 2019, ఆదివారం

రేడియో రోజులు – 36 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 08-12-2019, SUNDAY)

రేడియోలో పనిచేయడం వల్ల ఉషశ్రీకి పేరు ప్రఖ్యాతులు లభించాయా లేక  ఉషశ్రీ ద్వారా రేడియోకి శ్రోతల ఆదరణ పెరిగిందా అని వాదులాడుకునే రోజులు నాకు తెలుసు. నేతికి గిన్నె ఆధారమా లేక గిన్నెకు నెయ్యి ఆధారమా అనే ఎడతెగని మీమాంసల జాబితాలో ఇది కూడా చేరిపోయి వుంటుంది.
అసలు రేడియో ఏమిటి ? ఈ ఉషశ్రీ ఎవరు? ఏమిటి ఆయన గొప్పతనం అని ప్రశ్నించే నవతరం వారికి అర్ధం కావడం కోసం ఒక ఉదాహరణ చెబుతాను.
దూరదర్శన్ ఒక్కటే ఆసేతుహిమాచలం రాజ్యమేలుతున్నకాలంలో, అప్పుడప్పుడే కలర్ టీవీలు మార్కెట్లలో కుడి కాలు మోపుతున్న  రోజుల్లో హిందీ చలనచిత్ర రంగాన్ని తన కనుసన్నల్లో శాసిస్తున్న రామానంద సాగర్ అనే చిత్ర ప్రముఖుడి కన్ను, బుడిబుడి నడకల బుల్లితెరపై పడింది. తాను మొదలు పెట్టిన ఆ ప్రయత్నం తన శేష జీవితాన్ని సార్ధకం చేయబోతున్నది అనే ఎరుక అప్పట్లో ఆయనకు కలిగిందో లేదో తెలియదు కానీ, యావత్ భారత దేశప్రజలు భాషతో నిమిత్తం లేకుండా ఆయన నిర్మించిన రామాయణ, భారతాలను వీక్షించడానికి ఇళ్ళల్లో టీవీలకు అతుక్కుపోయేవాళ్ళు. టీవీలు లేని వాళ్ళు పొద్దున్నే హడావిడిగా కాఫీలు, టిఫిన్లు పూర్తిచేసుకుని ఇరుగిల్లలో, పొరుగిళ్లలో రామాయణం చూడడానికి టైముకు ముందే చేరుకునేవాళ్ళు. వీధులన్నీ నిర్మానుష్యంగా బోసిపోయినట్టు, అప్రకటిత కర్ఫ్యూ విధించినట్టు ఉండేవి. ప్రతిఇల్లూ ఓ  రామాయణ లోగిలిగా మారిపోయేది. ఆ సమయంలో ఏదైనా జరూరు పని వుండి బయటకు వెళ్ళాల్సిన వాళ్ళకు  రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ళల్లో టీవీల నుంచి రామాయణం డైలాగులు వినబడుతుండేవి. వెనుకటి రోజుల్లో రేడియోలో ఆదివారం మధ్యాన్నం సంక్షిప్త శబ్ద చిత్రం విన్నట్టు దారిపొడుగునా పెద్దగా వినబడే రామాయణం శబ్దాలు వింటూ సాగిపోయేవారు, ఆ వారం రామాయణం చూడలేదనే బాధ లేకుండా.
అలనాడు, రేడియోలో ఉషశ్రీ రామాయణ, భారతాలు ప్రసారం అయ్యే రోజుల్లో కూడా దాదాపు ఇదే పరిస్తితి. ప్రసార సమయానికల్లా అందరూ పనిపాట్లు ముగించుకుని రేడియోల చుట్టూ మూగేవారు. పల్లెటూళ్ళలో సంగతి చెప్పక్కరలేదు. రామాయణ, భారత ప్రవచనాలు వింటున్నట్టుగా పరవశించి పోయేవారు.              
మరో ఉదాహరణ చెప్పుకుందాం.
వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం లాగా ఉషశ్రీ రామాయణం ఒక బ్రాండుగా మారిపోయింది. ప్రత్యేకంగా ఆ కార్యక్రమంకోసమే రేడియో వినే శ్రోతల సంఖ్య నానాటికీ పెరుగుతూ పోయింది. 1980లో జరిగిన కృష్ణా పుష్క‌రాల‌కు ఉష‌శ్రీ త‌న గంభీర గ‌ళంతో ప్ర‌త్య‌క్ష వ్యాఖ్యానం ఇచ్చారు. అది కూడా బాలాంత్రపు ర‌జ‌నీకాంత‌రావుగారి ప్రోద్బ‌లంతో. పుష్క‌రాల‌కు ప్ర‌త్య‌క్ష వ్యాఖ్యానం చెప్ప‌డం అదే మొద‌లు. పుష్క‌ర స్నానాలకు వెళ్ల‌లేనివారికి ఆ న‌దీసంరంభాన్ని క‌ళ్ల‌ముందుంచారు ఉష‌శ్రీ‌. ప్ర‌ముఖ క‌థా ర‌చ‌యిత శ్రీ‌ర‌మ‌ణ‌గారు ఈ పుష్క‌రాల విష‌యం వ‌చ్చిన‌ప్పుడు ఒక మాట చెప్పేవారు. విజ‌య‌వాడ న‌గ‌రానికి పుష్క‌ర స్నానం చేయ‌డానికంటే ఉష‌శ్రీ గారిని చూడ‌టానికి చాలామంది వ‌చ్చార‌న్నది ఆ మాటలోని భావం.
సహజంగానే ఇటువంటి పేరు ప్రఖ్యాతులు ఆఫీసులో పైవారికి కంటగింపుగా మారుతుంటాయి. ఒక రోజు రేడియోలో ఓ పెద్దాయన ఉషశ్రీ గారిని మర్యాదగానే అడిగారట, ‘ఏమిటండీ మీ భారతం ఇంకా ఎన్నాళ్ళు? ఎప్పుడు ముగుస్తుంది’ అని. ఉషశ్రీ గారికి అందులోని శ్లేష అర్ధం అయింది. ఈయన పండితుడాయే. అంత సుతిమెత్తగానే నెత్తిన మొట్టినట్టు, ‘అబ్బే! అప్పుడే ఎక్కడండీ! ఇంకా చాలా వుంది. ఇప్పుడేగా సైంధవుడు అడ్డం పడింది’ అన్నారుట.
మరి వీరి మాటల్లోని శ్లేష ఆయనకు అర్ధం అయిందో లేదో తెలియదు.
ఎందుకంటే అయన అధికారే కానీ, పండితుడు కాదుకదా!
ఉషశ్రీ  అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అగ్రహారంలో 1928 (ప్రభవ) సంవత్సరం మార్చి 16 (ఫాల్గుణ బహుళ త్రయోదశి) న జన్మించారు. తండ్రి పురాణపండ రామ్మూర్తి. ఆయుర్వేద వైద్యులు, తల్లి కాశీ అన్నపూర్ణ. జాతీయోద్యమ సమయంలో కాకినాడలో కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా పనిచేశారు. ఆ తరువాత పురాణపండ రామ్మూర్తి  గారు ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక వేదికల మీద రామాయణంమహాభారతం మహాభాగవతం ప్రవచనాలు చేశారు. బహుశా ఈ ప్రవచన ప్రతిభను తండ్రి నుంచే వారసత్వంగా ఉషశ్రీ గారు పుణికి పుచ్చుకుని వుంటారు. తదనంతర కాలంలో ఆకాశవాణిలో చేరినప్పుడు ఒక వ్యాఖ్యాతగా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఆర్జించడానికి ఈ ప్రతిభే ఉషశ్రీ గారికి ఉపయోగపడి వుంటుంది. వారం వారం రామాయణ మహా భారతాలను ఆకాశవాణి నుండి తన స్వరంతో ప్రవచించారు. 1973 లో రేడియోలో భారత ప్రవచనం ప్రారంభించారు. అప్పట్లోదూరదర్శన్ లేదు. ఉషశ్రీ పురాణ పఠన కార్యక్రమం వారానికి ఒకసారి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం అయ్యేది.  ఆ సమయానికల్లా శ్రోతలు గంట కొట్టినట్టు  రేడియోల ముందు మూగేవారు. ఆ అరగంటసేపు బయట ప్రపంచాన్ని మరచి ఆ పురాణ గాధలలో మునిగి తేలిపోయేవారు.
రేడియో వ్యాఖ్యాతగా,  సాహిత్య రచయితగా ప్రఖ్యాతి గాంచిన ఉషశ్రీ గారు తన రామాయణ భారత ప్రవచనాల ద్వారా తెలుగునాట అందరికీ సుపరిచితులయ్యారు. ఆప్పట్లో ఆయన గొంతుని, మాట సరళిని గుర్తు పట్టలేని తెలుగు శ్రోత లేరంటె అతిశయోక్తి కాబోదు.
‘బ‌య‌లు దేరింది ర‌థం..’ అంటూ త‌న ప్రవ‌చ‌నాన్ని ప్రారంభించేవారు ఉష‌శ్రీ‌. ప్రవ‌చ‌న రూపంలో హైంద‌వ ధ‌ర్మాన్నీ, విలువ‌ల‌నూ అంద‌రికీ చేర్చాల‌ని త‌పించారాయ‌న‌. ఇందుకోసం ఏనాడూ రాజీ ప‌డ‌లేదు. అవ‌స‌ర‌మైన చోట వారు వీరూ అని చూడ‌కుండా ప్ర‌ముఖుల‌ను సైతం మంద‌లించేవారు.  అందుకు ఎవ్వ‌రూ ఏనాడూ నొచ్చుకున్న  దాఖలా లేదు. అలా దారి వెంట వెళ్ళే వారు సైతం ఉష‌శ్రీ కంఠ‌స్వ‌రంలోని అద్వితీయ‌మైన స‌మ్మోహ‌న త‌త్వానికి ఆక‌ర్షితుల‌య్యేవారు. అప్ర‌య‌త్నంగా కాళ్ళు వారిని ఆ వేదిక‌కు చేర్చేవి. ముఖ్యంగా యువ‌త‌రం అంటే ఆయ‌న‌కు చాలా ఇష్టం. భావిభార‌త పౌరులుగా హిందూ ధ‌ర్మ బాధ్య‌త‌ను మోయాల్సినది వారేన‌ని ప్ర‌తి చోట చెప్పేవారు. ఓసారి భీమ‌వ‌రం క‌ళాశాల‌లో ఉష‌శ్రీ ప్ర‌సంగిస్తుండ‌గా విద్యార్థులు గోడ‌పై కూర్చుని గొడ‌వ చేశార‌ట‌. వెంట‌నే ఉష‌శ్రీ‌.. కోతుల్లా ఏమిటీ గోల అన్నార‌ట‌. వారికెంతో కోపం వ‌చ్చినానా యాగీ చేశారట. మీలాంటి వానర సైన్యంతోనే రాముడు రావ‌ణుడిని జ‌యించాడు, మీరు లేనిదే దేశ‌ప్ర‌గ‌తి సాధ్య‌ప‌డ‌దు అనగానే వారి కోపం చ‌ల్లారిపోయింద‌ట‌. అంత‌వ‌ర‌కూ గొడ‌వ చేసిన విద్యార్థులు మెత్త‌బ‌డి, ఉషశ్రీ  ప్ర‌సంగం మొత్తాన్ని ఆస‌క్తిగా విన్నార‌ట‌. పూర్త‌యిన త‌ర‌వాత విద్యార్థులు గుంపుగా ఉష‌శ్రీ‌గారి ద‌గ్గ‌ర‌కు గ‌బ‌గ‌బ వెడుతుండ‌డం గ‌మ‌నించిన నిర్వాహ‌కుల‌కు గుండె ద‌డ‌ద‌డ‌లాడింద‌ట‌. కానీ ద‌గ్గ‌ర‌కు వెళ్ళే స‌రికి జ‌రిగింది వేరు. అంద‌రి చేతుల్లో నోట్ పుస్తకాలు. ఉష‌శ్రీ ఆటోగ్రాఫ్ కోసం ఎగ‌బ‌డ‌డం చూసి అంతా నివ్వెర‌పోయార‌ట‌. అదీ ఉష‌శ్రీ‌. భార‌తంలో స‌హ‌దేవుణ్ణి మొట్ట‌మొద‌టి న‌క్స‌లైట్ అని ఉష‌శ్రీ విశ్లేషించిన‌ప్పుడు ప‌త్రిక‌లు ఆ అంశాన్ని మొద‌టి పేజీల్లో బాక్స్ ఐట‌మ్‌గా ప్ర‌చురించాయి. భార‌తాన్నీ, స‌హ‌దేవుణ్ణీ కించపరిచారని ఎవరూ వివాదాలు సృష్టించలేదు. ఉష‌శ్రీ‌ని త‌ప్పు ప‌ట్ట‌లేదు.
భువ‌న విజ‌యం. ఇదొక అద్భుతమైన  సాహిత్య ప్ర‌క్రియ‌. 16వ శ‌తాబ్దంలో కృష్ణదేవ‌రాయల‌ ఆస్థానంలో అష్ట దిగ్గ‌జాలు కొలువుదీరి నిర్వ‌హించిన‌ సాహిత్య గోష్టే భువ‌న విజ‌యం. ఆ త‌ర‌వాత అది కొంత‌కాలం క‌నుమ‌రుగైంది. అదే ప్ర‌క్రియ‌ను తిరిగి ఉష‌శ్రీ ప్రారంభించారు.  తొలిసారిగా ఉష‌శ్రీ స్వ‌స్థ‌లం ఆల‌మూరులో ఆధునిక భువ‌న విజ‌యాన్ని నిర్వ‌హించారు. ఉద్దండులైన విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ, జ‌మ్మ‌ల‌మ‌డ‌క మాధ‌వ‌రామ శ‌ర్మ‌, వెంప‌రాల సూర్య‌నారాయ‌ణ‌ వంటి వారు ఇందులో పాల్గొన్నారు. ఇది 1956కు పూర్వం ప్రారంభించి సుమారు నాలుగు ద‌శాబ్దాల పాటు వంద‌ల సంఖ్య‌లో భువ‌న విజ‌యాల‌ను ప్ర‌ద‌ర్శించారు. తెలుగు రాష్ట్రం న‌లుచెర‌గులాఈ ప్ర‌క్రియ‌ను ఆవిష్క‌రించారు. భువ‌న విజ‌య ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో ఉష‌శ్రీ తిమ్మ‌రుసు పాత్ర పోషించారు.
ధ‌ర్మ‌సందేహాలు కార్య‌క్ర‌మంతో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన పేరును సంపాదించుకున్న ఉష‌శ్రీ గారి గ‌ళంతో రామాయ‌ణ-భార‌త మ‌హేతిహాసాలు క్యాసెట్ల రూపంలో యావ‌దాంధ్రుల‌కూ చేరాల‌ని పారుప‌ల్లి శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తిగారు సంక‌ల్పించారు. ఆ ప్ర‌య‌త్న ఫ‌లిత‌మే ఉష‌శ్రీ భార‌తం, ఉషశ్రీ రామాయ‌ణం. ఈ రెండిటికీ ఆ సంస్థ చెల్లించింది చాలా త‌క్కువ మొత్తం. ఈ క్యాసెట్ల‌లో ప‌ద్యాల‌ను పారుప‌ల్లి శ్రీ‌రంగ‌నాథ్‌గారు పాడారు. ఆయ‌న శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తిగారి సోద‌రులే. తిరుమ‌ల‌-తిరుప‌తి దేవ‌స్థానం అన్న‌మాచార్య ప్రాజెక్టులో ప‌నిచేశారాయ‌న‌.
ఆకాశ‌వాణి విజ‌య‌వాడ కేంద్రం నుంచి వారం వారం ధ‌ర్మ‌సందేహాలు కార్య‌క్ర‌మం ద్వారా శ్రోత‌ల‌కు సుప‌రిచితులైన ఉష‌శ్రీ త‌న గంభీర గ‌ళంతో యావ‌దాంధ్ర దేశాన్ని నైమిశ‌త‌పోవ‌నంగా మార్చారు. ఆయ‌న విల‌క్ష‌ణ‌మైన గాత్ర‌మే ఆయ‌నను అంద‌రికీ చేరువ చేసింది.
జీవించి ఉన్న ప్ర‌ముఖులపై ప్ర‌త్యేక సంచిక‌ల‌ను తేవాల‌నేది ఉష‌శ్రీ సంక‌ల్పం. అందుకు మిత్రులు, పెద్ద‌లులతో పాటు ఆయన  తండ్రి గారి ప్రోత్సాహం కూడా ల‌భించింది. పురాణ‌పండ రామ‌మూర్తిగారి సంపాద‌క‌త్వంలో విశ్వ‌శ్రీ ప‌త్రిక స్థాపించారు ఉష‌శ్రీ‌. 1954 జ‌న‌వ‌రిలో విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారిపై ప్ర‌త్యేక సంచిక‌ను తీసుకొచ్చారు. ఉష‌శ్రీ వ‌య‌సు అప్ప‌టికి 28.
ఉషశ్రీ గారి సాహిత్య అభిలాష, సనాతన ధర్మంపై ఆయనకు ఉన్న మక్కువ అంతాఇంతా కాదు. వారి ఆశయాల కొనసాగింపు కోసం వారి కుటుంబసభ్యులు, డాక్ట‌ర్ గాయ‌త్రి, ప‌ద్మావ‌తి, డాక్ట‌ర్ వైజ‌యంతి, క‌ల్యాణ‌ల‌క్ష్మి కలిసి  ఉషశ్రీ మిషన్  పేరుతొ ఒక సంస్థను నిర్వహిస్తున్నారు. ఆయన గళం అజరామరం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషిని నాలుగు కాలాలపాటు పరిరక్షించడం ఈ ఉషశ్రీ మిషన్ ధ్యేయం.
(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: