12, డిసెంబర్ 2019, గురువారం

రేడియో రోజులు - 39- భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily  on 12-12-2019, Thursday)

ఈ రేడియో డైరెక్టర్ కి రేడియో ఉద్యోగం అంటే పడదట ......
వేమూరి విశ్వనాధ శాస్త్రి అంటే వాళ్ళ కుటుంబంలో తెలుసు. వీ.వీ. శాస్త్రి అంటే రేడియోలో పనిచేసేవారికి తెలవకుండా పోదు. ప్రోగ్రాం సైడులో అతి చిన్న కింది మెట్టు అంటే  డ్యూటీ ఆఫీసర్ (ట్రాన్స్ మిషన్ ఎక్జిక్యూటివ్) నుంచి అదే స్టేషన్ కు డైరెక్టర్ గా ఎదిగిన అనుభవశాలి. హైదరాబాదులోనే కాదు భోపాల్ వంటి చోట్ల కూడా పనిచేసారు. రేడియోని స్కాచివడబోశారు. చిత్రం ఏమిటంటే ఆయన అరవయ్యవ దశాబ్దంలో రేడియోలో చేరినప్పుడు, ఇష్టం లేని పెళ్ళికి తల వంచి తాళి కట్టించుకున్న వధువులా, విధి లేక చేరానని చెబుతారు. ఎవరన్నా ఏదన్నా అనబోతే,  తన వాదనకు మద్దతుగా బీబీసీ   సీనియర్ అధికారి  లయొనెల్  ఫీల్డెన్ (Lionel Fielden) రాసిన బెంట్ ఆఫ్ మైండ్పుస్తకాన్ని ఉదహరిస్తారు. ఇంకో చిత్రం ఏమిటంటే ఆయనకు రేడియో ఉద్యోగం పడదు కానీ రేడియో అంటే ప్రాణం, అందులో  ముఖ్యంగా రేడియో వార్తలు ఆయనకు మరీ మరీ ఇష్టం. సుమారు నలభయ్ ఏళ్ళ సుదీర్ఘ రేడియో ప్రస్థానంలో  రేడియో గురించిన  మధురమైన ఎన్నో  జ్ఞాపకాలు ఆయన మదిలో పదిలంగా వున్నాయి. 


(శ్రీ  వీ.వీ. శాస్త్రి)
  
చిన్నప్పుడు ఆయన ఇంట్లో రేడియో వుండేది కాదు. రేపల్లెలోని శంకర్ విలాస్ కాఫీ హోటల్లోని  రేడియో ఒకటే దిక్కు. అక్కడికి వెళ్లి వార్తలు వినాలంటే కాఫీ టిఫిన్లకు చిల్లర డబ్బులు కావాలి. అందుకని నాన్నగారి లాల్చీ జేబులో నుంచి చిల్లర కొట్టేసే చిల్లరమల్లర దొంగతనాలకు కూడా వెనుతీయలేదు. ఇంతా చేసి ఆలిండియా రేడియో వార్తల్లో వచ్చే జాతీయ అంతర్జాతీయ సమాచారం పట్ల ఆయనకు  ఆసక్తి వుండేది కాదు. జోలిపాల్యం మంగమ్మ వంటి న్యూస్ రీడర్లు వార్తలు చదివే విధానం అంటే చెవి కోసుకునేవారట. ఇంటికి వెళ్ళిన తరువాత కూడా రేడియో న్యూస్ రీడర్ల మాదిరిగానే వార్తలను  అనుకరిస్తూ బిగ్గరగా చదవడం శాస్త్రిగారి హాబీ.
ఎమ్మే పాసయిన తరువాత రేడియోలో ట్రాన్స్మిషన్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఆయనతో పాటు ఇరవై రెండు మంది సెలక్ట్ అయితే ఈయన కడమాఖరిలో ఇరవై రెండోవారు. ఢిల్లీలోఇంటర్వ్యూ . ఆ కమిటీకి  ఆనాటి  రేడియో డీజీ శ్రీ నారాయణ్  మీనన్ చైర్మన్.  ఆయనకు ఎందుకో శాస్త్రి గారిపట్ల వాత్సల్యం కలిగింది. సంగీత, నృత్యాలు గురించి అడిగిన  ఏ ప్రశ్నకూ ఆయన సరయిన సమాధానం ఇవ్వలేకపోయారు. చివరికి ఆ అధికారే కల్పించుకుని ‘ఢిల్లీ నీకు కొత్తా, ఏమేం  చూసావు ఇక్కడ’ అంటూ చనువుగా అడిగారు. ఢిల్లీలో తాను  చూసిన హుమాయున్ సమాధి గురించి చెప్పారు. అనేక విషయాలు గురించి ఈ కుర్రవాడికి అవగాహన  లేకపోయినా తెలిసిన విషయాలు గురించి పరిపూర్ణ పరిజ్ఞానం వుందని ఆయన అభిప్రాయపడ్డట్టు శాస్త్రిగారికి తోచింది. సరయిన జవాబులు చెప్పలేకపోయినా చెప్పిన పద్దతి నచ్చిందేమో తెలియదు.  శాస్త్రిగారి బెంట్ ఆఫ్ మైండ్  రేడియో పట్ల లేకపోయినా,  శాస్త్రి గారిని మాత్రం ఆ ఉద్యోగానికి  సెలక్ట్ చేసారు. దీన్నే డిస్టినీ అంటారు శాస్త్రి.
అప్పుడు శాస్త్రిగారికంటే మంచి మార్కులతో ముందు వరసలో  ఎంపిక అయినవారిలో ధిగ్గనాధీరులు వున్నారు. శ్రీయుతులు  గొల్లపూడి మారుతీరావు, శంకరమంచి సత్యం మొదలయిన వాళ్ళు వారు. అందరికీ హైదరాబాదులో పోస్టింగు ఇచ్చారు.
ఇక ఆ రోజుల్లో హైదరాబాదు రేడియో స్టేషన్ కవిపండిత బృందంతో వెలిగిపోతూ వుండేది. శ్రీయుతులు దేవులపల్లి కృష్ణ శాస్త్రి, గోపీచంద్, బుచ్చిబాబు, మునిమాణిక్యం నరసింహారావు, స్థానం నరసింహారావు, రేడియో అన్నయ్య న్యాపతి రాఘవరావు, రేడియో అక్కయ్య కామేశ్వరి, మంచాల జగన్నాధరావు, మల్లాది నరసింహ శాస్త్రి మొదలయిన వారితో రేడియో ప్రాంగణం విరాజిల్లుతూ వుండేది.
ఆలిండియా రేడియోకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ విషయాన్ని గురించి శాస్త్రి గారు చెప్పేది వినసొంపుగా వుంది.   
1935 లో బెంట్  ఆఫ్ మైండ్ రచయిత లయొనెల్  ఫీల్డెన్ ఇండియాకు వచ్చారు. ఇండియన్ స్టేట్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీసెస్ (ISBS) అని కొత్తగా ప్రారంభించిన సంస్థకు ఆయన మొదటి కంట్రోలర్.
ఎందుకో ఆయనకు ఆ పేరు నచ్చలేదు. ఏదైనా చక్కటి పేరు కోసం అయన తపన పడ్డాడు. ఒకరోజు వైస్రాయ్ గౌరవార్ధం ఇచ్చిన విందులో Lord Linlithgow ని కలుసుకుని ఈ మాట చెప్పారు. ఆయన కూడా కాస్త ఆలోచించి ఆలిండియా..అని ఆగిపోయారు. మళ్ళీ ఆయనే బ్రాడ్ కాస్టింగ్ బదులు రేడియో అంటే ఎలా ఉంటుందని అడిగారు. ఆ రెంటినీ కలిపితే  ఆలిండియా రేడియో. ఆ పేరు లయొనెల్  ఫీల్డెన్ గారికి తెగ నచ్చింది. అదే స్థిరపడి పోయింది (ట). దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఆలిండియా రేడియో భారతీయ భాషల్లో ఆకాశవాణిగా మారిపోయింది (తమిళాన్ని మినహాయిస్తే).
సాయంత్రాలు తీరిగ్గా  కూర్చుంటే ఇలాటి కబుర్లు విశ్వనాధ శాస్త్రి గారు అలవోకగా బోలెడు చెబుతారు.
(ఇంకా వుంది)


కామెంట్‌లు లేవు: