పెడదారి పడుతున్న యువత అనే అంశంపై ‘టీనేజ్
టెర్రర్’ అనే పేరుతొ రాజ్ న్యూస్ టీవీ ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసింది.
అందులో కొన్ని ముఖ్యమైన అంశాలను పాఠకుల దృష్టికి తీసుకురావలని అనిపించింది.
(రాజ్ న్యూస్ వారికి కృతజ్ఞతలు)
“ఎదిగే వయసులోనే సమిధలవుతున్నారు..
నిద్ర లేచినప్పటి నుంచి ఊహల్లో ఊరేగుతూ ఊసుల్లోనే బతుకుతున్నారు.. చదువు .. కెరీర్
పక్కనపెట్టి.. లవ్, అట్రాక్షన్ మోజులో లైఫ్‌ని స్మాష్
చేసుకుంటున్నారు.. ప్రైవసీ పేరుతో తప్పటడుగులేస్తున్నారు.. వేక్‌అప్ టైం నుంచి
గుడ్‌నైట్ వరకూ .. నెట్‌ఇంట్లోనే కుర్రకారు నాట్యం చేస్తున్నారు.. విద్యార్ధులను
చాటింగ్ వ్యసనం తినేస్తోంది. మద్యం, డ్రగ్స్ లాగే
మెదడు ఈ వ్యసనానికి అలవాటు పడటం .. పెను ప్రమాదాలను తెచ్చిపెడుతోంది. ఆఖరికి
నవమాసాలు మోసి , కనీ, పెంచిన తల్లిదండ్రులకు .. గర్భశోకం మిగుల్చుతోంది.
లైఫ్‌ని ఎంజాయ్ చేసినంత వరకే అయితే
పరవాలేదు.. అది వక్రమార్గం పడితేనే కష్టం. వయసుకు మించి స్నేహాలు.. చదువుకు మించి
పనులు.. పబ్‌ల చుట్టూ తిరుగుతూ .. నేటి యువత కాలేజీ జీవితాన్ని
కరిగించేస్తున్నారు. స్నేహం పేరుతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఆడ, మగ మాట్లాడుకోవడం తప్పు కాదు.. ఈ పవిత్ర స్నేహాన్ని అపవిత్రం చేసే
దిశగా వారి నడక నడత ఉంటే మాత్రం వాటికి ఫుల్ స్టాప్ పెట్టడం అత్యవసరం. ఇప్పుడు
చాలా మంది పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు చిన్న వారే. కానీ వయసుకు తగినట్లుగా
పిల్లల ప్రవర్తన తీరును అంచనా వేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈవిషయంలో తల్లిదండ్రులు
తప్పటడుగు వేస్తున్నారు.
తల్లిదండ్రులకు పిల్లలపై ప్రేమ
ఉంటుంది. పిల్లలకు తల్లిదండ్రులపై ప్రేమ ఉంటుంది. స్నేహితుల మధ్య ప్రేమ, దేశంపై ప్రేమ.... ఇలా ప్రేమలు ఎన్నో రకాలు. వీటన్నింటి కంటే
విభిన్నమైనది లవర్స్ మధ్య ప్రేమ. ఇది మాత్రం సగటున రెండేళ్ళు ఉంటుందని మానసిక
శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బాల్యంలో తల్లిదండ్రులు పెద్దలతో కలిసి మెలిసి ఉండే
తీరు .. పిల్లల్లో ఆడ, మగకు సంబంధించిన భావనలు కలిగిస్తుందట.
పెరిగేటప్పుడు చుట్టుపక్కల వాళ్లతో, అదే వయసు వారితో
వ్యవహరించే తీరు .. తన భవిష్యత్తు భాగస్వామి ఎలా ఉండాలనే అంశానికి జీవంపోసి..
దాన్నొక నిర్ణయంగా తీర్చిదిద్దుతుంది.
టెరషెంకో అనే మనస్తత్వవేత్త టీనేజర్స్
నాలుగు దశలను అధిగమించాల్సి ఉంటుందని చెబుతాడు. మొదటిది గ్యాంగ్ స్టేజ్. ఈదశలో
ఆడపిల్లలు, ఆడపిల్లలతోనూ, మగపిల్లలు మగపిల్లలతోనూ .. జట్లుగా ఏర్పడ తారు. జట్లు జట్లుగా
తిరుగుతారు. తరువాతది ఫ్రెండ్‌షిప్ స్టేజ్. ఈ దశలో జట్టు కట్టి తిరగడం మానేసి
కేవలం ఒకరితో మాత్రమే స్నేహంగా ఉంటారు. మిగిలిన అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఈదశలో
అబ్బాయి , అమ్మాయికి స్నేహం ఒకరితో మాత్రమే
ఉంటుంది. తమ కష్టసుఖాలు చెప్పుకోవడం, ఆదర్శలక్షణాలు
ఇందులో ఉంటాయి. అయితే ఈ స్నేహం సేమ్ జెండర్స్ మధ్య మాత్రమే ఉంటుంది.
మూడవది అట్రాక్షన్ స్టేజ్. ఈ దశలో
ఆపోజిట్ సెక్స్ వైపు మనసు లాగుతూ ఉంటుంది. మోహపూరితంగా ప్రవర్తిస్తారు. అంటే
ఆడపిల్లలు మగపిల్లలతోనూ, మగపిల్లలు ఆడపిల్లలతోనూ స్నేహం
చేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు. ఇక లాస్ట్‌ది.. లవ్ స్టేజ్. తనకు నచ్చిన ఎవరో ఒక
ఆపోజిట్ సెక్స్‌ను ఎన్నుకుంటారు. వాళ్లతో ప్రేమలో పడడం ఈదశ ప్రత్యేకత. అయితే
ఇందులో మళ్లీ రెండు దశ లుంటాయి. ప్రారంభదశలో ఆదర్శపూర్వకమైన రొమాంటిక్ ప్రేమ
ఉంటుంది. ఆతర్వాత అసలు సిసలైన ప్రేమ ఉంటుంది. పైన చెప్పుకున్న దశలన్నీ కూడా
పరిపక్వ వ్యక్తిత్వానికి అవసరమైన పురోగమన లక్ష్యాలు.
టీనేజర్స్‌లో ప్రేమ, ద్వేషం అనే రెండు రకాల ఉద్వేగాలు ఉంటాయి. అయితే ఈరెండు సెంటిమెంట్లూ
ప్రేమిస్తున్న వ్యక్తివైపు కేంద్రీకరించబడ్డ రెండు విరుద్ధ భావోద్వేగాలు. ప్రేమలో
ప్రేమిస్తున్న వ్యక్తికి దగ్గర కావాలన్న ఆకర్షణ, ఆ తాలూకు తపన ఉంటే, ద్వేషంలో దూరం కావాలన్న వికర్షణ ..
పూర్వకమైన వాంఛ ఉంటుంది. ప్రేమ, ద్వేషం రెండూ టీనేజ్‌లో తీవ్రస్థాయిలో
ఉంటాయి.
ఈమధ్య ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ
టీసీఎస్.. ‘టీనేజ్ ట్రెండ్స్’పై జరిపిన సర్వేలో సగటున 47 శాతం మంది కుర్రాళ్లు ‘స్మార్ట్’గా కాలక్షేపం చేస్తున్నట్లు తేలింది.
30 శాతం మంది ఫేస్‌బుక్ ద్వారా దాదాపు 50 నుంచి 100 మందితో స్నేహం చేస్తున్నారు.
69 శాతం మంది గేమింగ్ యాప్‌లనే ఇష్టపడుతున్నారు. మరో 31 శాతం మంది వినోదం,
సినిమాలు, వీడియో డౌన్‌లోడింగ్‌లతో సరదాగా గడిపేస్తున్నట్లు సర్వేలో తేలింది.
హైదరాబాద్ నగరంలో 77 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 900 మంది టీనేజ్ విద్యార్థుల పై ఈ సర్వే
నిర్వహించగా .. ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
టీనేజర్స్ సోషల్‌మీడియా, గేమింగ్‌యాప్స్‌తో గంటలతరబడి గడపడం వల్ల.. ఏకాగ్రత కోల్పోయి చదువులో
వెనకబడే ప్రమాదం ఉంది. అపరిచితులతో స్నేహం కొన్నిసార్లు చెడు సహవాసాలకు, అలవాట్లకు దారితీస్తుంది. ఆన్‌లైన్ స్నేహాలు ఆఫ్‌లైన్ స్నేహాలుగా
మారే అవకాశం ఉంటుంది. వీటి వినియోగం వ్యసనం కాకుండా ఉంటే మంచిదంటున్నారు నిపుణులు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని
వినియోగించుకోవడం ఈరోజుల్లో సర్వసాధారణమే. కానీ సామాజిక మాధ్యమాల ద్వారా
అపరిచితులతో స్నేహం చేయడం, వారితో వివిధ రకాల ఫోటోలను షేర్ చేసుకోవడం
వంటి పరిణామాలు .. టీనేజ్ యువతపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు,
సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు
కుర్రకారు సోషల్‌మీడియా అకౌంట్లు హ్యాక్ అయి సైబర్‌క్రైమ్‌లు జరిగే ప్రమాదం పొంచి
ఉందని స్పష్టంచేస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు .. విద్యార్థుల నెట్
ట్రెండ్స్‌ను ఒక కంట కనిపెట్టాలని సూచిస్తున్నారు.
పిల్లలు టెక్నాలజీని ఎలా వాడుతున్నారో
తెలుసుకోవడం కోసం 1,200 మంది టీనేజర్లు, తల్లిదండ్రులపై
కామన్ సెన్స్ మీడియా కూడా ఓ సర్వే చేపట్టింది. సర్వేలో ఎన్నో అంశాలు వెలుగులోకి
వచ్చాయి.
56 శాతం మంది తల్లిదండ్రులు, 51 శాతం టీనేజీలు డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ డివైజ్‌ను
చూస్తున్నట్టు ఒప్పుకున్నారు. 85 శాతం మంది తల్లిదండ్రులు మొబైల్ డివైజ్‌ల వల్ల తమ
పిల్లలతో ఉన్న అనుబంధాలకు ఎలాంటి ముప్పు లేదంటుంటే.. 66 శాతం తల్లిదండ్రులు వారి
టీనేజి పిల్లలు చాలా ఎక్కువ సమయాన్ని మొబైల్ డివైజ్ లపైనే గడుపుతున్నారని
బాధపడ్డారు.
66 శాతం మంది తల్లిదండ్రులు డిన్నర్
సమయంలో మొబైల్ డివైజ్‌లను అనుమతిచడం లేదని చెప్పగా.. 89 శాతం మంది టీనేజీ పిల్లలు
కూడా ఇదే భావనను వ్యక్తంచేశారు. 59 శాతం మంది తల్లిదండ్రులు వారి పిల్లలు మొబైల్
ఫోన్లకు, టాబ్లెట్స్‌కు ఎక్కువగా
బానిసలవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తం చేయగా.. 50 శాతం మంది టీనేజీ పిల్లలు
మొబైల్ ఫోన్లపై ఎక్కువ సమయాన్ని గడుపుతున్నట్టు చెప్పారు. 27 శాతం మంది
తల్లిదండ్రులు వారే ఎక్కువగా మొబైల్ డివైజ్ లకు బానిసలైన్నట్టు ఒప్పుకున్నారు. ఇక
28 శాతం మంది టీనేజీ పిల్లలు వారి తల్లిదండ్రులు మొబైల్ ఎక్కువగా వాడుతారని
తెలిపారు.
పూర్తిగా తెలిసిన వాళ్ళకీ చెప్పొచ్చు..
అసలు తెలియని వాళ్ళకూ చెప్పొచ్చు.. కానీ కాస్త తెలిసి.. ఇంకాస్త తెలియని టీనేజర్స్‌కు
మాత్రం ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో తల్లిదండ్రులకు అసలు అర్ధం కావడం లేదు.
దండించేంత చిన్నారులు కాదు.. వదిలేస్తే ప్రపంచాన్ని అర్ధం చేసుకునే వయసూ కాదు..
మరి వాళ్ళ జీవన రేఖను సుఖంగా .. సంతోషంగా .. ఉన్నతంగా ఎలా మలచాలి.. ఏవిధంగా
తల్లిదండ్రులు వారికి గైడెన్స్ ఇవ్వాలి. సాదారణంగా .. పెరుగుతున్న పిల్లలను చూసి
తల్లి తండ్రులు ఆందోళన పడుతూ ఉంటారు. పిల్లలు ఎదుర్కోనే చాలా ప్రభావాలు,
సమస్యలు .. అనేక అంశాల గురించి వారికి
జాగ్రత్తగా చెప్పాలి. అయితే ఎక్కడ నుండి మొదలు పెట్టాలి.. ఎలా మొదలుపెట్టాలి..
వారిని ఎలా దారిలో పెట్టాలో .. తెలియడం మాత్రం చాలా ఇంపార్టెన్ట్..
ప్రేమ , ద్వేషము , ఆవేశము , ఆలోచన , పట్టుదల , నిర్లిప్తత , అనురాగము , అసూయ , సృజనాత్మకత , స్తబ్దత ... ఇలా ఎన్నో వైరుద్యాల కలబోత టీనేజ్ . చందమామతో ఆడుకోవాలని
, అరుదైన సాహసము చేసి ప్రపంచాన్నంతా ఔరా
అనిపించాలనే ఉత్సాహము ఒక ప్రక్క , చిమ్మ చీకట్లో తలదాచుకొని వెక్కివెక్కి
ఏడవాలనే నైరాశ్యము మరో పక్క కనిపిస్తుంది. చదువులో ఇంటర్మీడియట్ ఎటు వంటిదో ...
వయసులో ఈ టీనేజ్ అటువంటిది . ఏదైనా చేసేయగలమనుకుంటూ సాధ్యాసాధ్యాలను సరిగ్గా అంచనా
వేసుకోలేక , తల్లిదండ్రుల నుండి పూర్తి స్వేచ్చ
కోరుకుంటూ .... కాదంటే కార్చిచ్చు సృస్టిస్తూ ప్రవర్తిస్తుంటారు . ప్రపంచీకరణ
నేపధ్యములో ఏర్పడిన పోటీవాతావరణము, అందుబాటులోకి వచ్చిన సాంకేతిక
సౌకర్యాలు ... ఎంత మేలుచేస్తున్నాయో పిల్లలకు అంతే కీడు సృస్టిస్తున్నాయి.
భవిష్యత్తుకు ఓ కీలక మజిలీగా నిలుస్తున్న ఈ " టీనేజ్ " లో కుటుంబమంతా
అప్రమత్త్తముగా ఉంటే పిల్లలు ఉత్తమంగా ఎదిగేందుకు అవకాశము ఉంటుంది.
ఎన్నో ఇళ్లల్లో చూస్తూ ఉంటాం..
తల్లిదండ్రులు తమ పిల్లలను పద్దతి పేరుతో చాలా స్ట్రిక్ట్‌గా పెంచుతుంటారు.
అలాంటి చోట తమ ఇష్టా ఇష్టాలను సైతం తల్లిదండ్రులతో పంచుకునే వీలే ఉండదు.ఆ విధమైన
అట్మాస్ఫియర్‌లో పిల్లల ఎదుగుదల .. పెరుగుదల అనేది భయభక్తులతో ఉంటుంది. అందుకే మరీ
ఎక్కువగా మీ టినేజర్‌ని కంట్రోల్ చేయకూడదు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే
ఫ్రీడం ఇవ్వాలి. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల తప్పు నిర్ణయాలు తీసుకునే
అవకాశం కూడా ఉంది.
తల్లిదండ్రులు తమ పిల్లలతో చాలా వరకు
ఓపెన్ గా ఉండటం ఎంతో అవసరం. వాళ్ల అవసరాలకు అనుగుణంగా.. సరైన సలహాలు ఇవ్వాలి.
స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటివల్ల కలిగే హాని గురించి వివరించాలి. వాటివల్ల
జీవితాలు ఎలా నాశనం అవుతాయో కేస్ స్టడీస్ చూపించాలి. మంచికీ చెడుకు ఓ సన్నని గీతే
ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలి. అయితే ఏదైనా
వారికి విసుగు కలిగించేలా చెప్పకూడాదు. తల్లిదండ్రులు క్లాస్ పీకుతున్నారేమో అనే
భావన అసలు అనిపించకూడదు. ఎప్పుడూ సరదాగా.. మాట్లాడుతూనే .. మీరు చెప్పాల్సిన
విషయాలను వారికి అర్ధం అయ్యేలా తెలియజేయాలి.
పిల్లల కొత్త స్నేహాల విషయంలో
తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా అని ప్రతీ కొత్త స్నేహం వాళ్ళకు చెడు
చేస్తుందన్న భయాన్ని వాళ్ళ ముందు వ్యక్తం చేయకూడదు. కొత్త స్నేహాలు వంద శాతం
మంచిది కాదని భావించకండి. కొత్తవాళ్లతో పరిచయం అలవాటు అవ్వాలి. అలా కాకుండా.. తన
ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. దీనివల్ల వాళ్లు ఎలాంటి వాళ్లో మీకే
తెలుస్తుంది. వాళ్ళ ప్రవర్తనను బట్టి మీరు అంచనా వేసే శక్తి వస్తుంది. సో అప్పుడు
మీకూ భయం ఉండదు.
ఫ్యామిలీ ట్రిప్స్, సినిమాలు కలిసి చూడటం, డిన్నర్ ప్లాన్
చేయడం వంటివి తరచుగా ప్రణాళికలో చేర్చుకోండి. ఫ్యామిలీతో.. వాళ్లకు బంధం
బలపడటానికి ఇలాంటి సరదాలు ఎంతో సహాయపడతాయి.”
NOTE: Courtesy Raj News
3 కామెంట్‌లు:
ఆ కార్యక్రమాన్ని అక్షరీకరించి చాలా శ్రమ తీసుకున్నారు. మీ సమయం వృధా .... ఏం చెప్పినా దృశ్య మాధ్యమం ద్వారా చెప్పాలి. ఇంత పెద్ద వ్యాసాలు నాకే నచ్చడం లేదు. పిల్లలు చదువుతారా ?
ఇది చిన్నవ్యాసమే. ఏ.జీ.గార్డెనర్ వ్రాసిన On Being Called Thompson వ్యాసం కనీసం 50 పేజీలైనా ఉంటుంది. అన్నిటికీ పరుగైన నేటి లోకంలో మూడుపేజీ ల్లోపైనా ...
పెద్దలు కుర్రో కుర్రు. పిల్లలు తుర్రో తుఱ్ఱు
కామెంట్‌ను పోస్ట్ చేయండి