(Published
in SAKSHI telugu daily today, 02-09-17,on the occasion of death anniversary of
Dr.Y.S.Rajasekhara Reddy)
సుదీర్ఘ
రాజకీయ జీవితం గడిపిన వై.ఎస్. రాజశేఖర రెడ్డికి, తనకు తానుగా ప్రజలందరికీ మేలు
చేసే అవకాశం పూర్తిగా లభించింది ముఖ్యమంత్రి అయిన తరువాతనే. రాజకీయ ప్రవేశం చేసిన
తొలి నాళ్లలో నిర్వహించిన మంత్రి పదవులు మినహా ఆయన ఎక్కువ కాలం సచివాలయానికి,
ఆఫీసు ఫైళ్ళకు దూరంగా, పార్లమెంటు సభ్యుడిగానో లేదా ప్రతిపక్ష నాయకుడిగానో
వుండిపోయారు. అలాగే వైద్య విద్య
పూర్తిచేసుకున్న తొలినాళ్లలో చేసిన డాక్టరు ప్రాక్టీసు తప్పిస్తే తదనంతర కాలంలో
ఆయన ఆ పనిచేసిన దాఖలాలు లేవు. ఒక రాజకీయ
నాయకుడిగా, ఒక వైద్యుడిగా తను అనుకున్న విధంగా చేస్తూ పోవడానికి వెసులుబాటు లభించింది
ముఖ్యమంత్రి అయినప్పుడే. ఈ అరుదయిన అవకాశాన్ని
(గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవ్వరూ ఒకే విడతలో నిరవధికంగా అయిదేళ్ళ
పదవీ కాలం పూర్తిచేసుకోలేదు) వైఎస్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రజలకు
పనికొచ్చే అనేక మంచి పనులు చేసిందీ ఆ సమయంలోనే. వై.ఎస్. చనిపోయిన ఇన్నేళ్ళ తరువాత
కూడా ఆయన వల్ల మేళ్ళు పొందిన వాళ్ళు
మాత్రం వాటిని ఇంకా జ్ఞాపకం చేసుకుంటూనే వున్నారు. వీళ్లేమీ బడాబడా కాంట్రాక్టర్లు
కాదు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అంతకంటేకాదు.
వారందరూ సామాన్యులు. ఇంకా చెప్పాలంటే అతి సామాన్యులు.
ఇందుకు
సంబంధించి కొన్ని ఉదాహరణలను - కన్నవి,
విన్నవి, ఉదహరించడమే ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం.
ప్రింటింగు
ప్రెస్సుల్లో అనవసరమైన కాగితాలు రద్దీగా పేరుకు పోతుంటాయి. కొంతమంది వాటిని గోనెసంచుల్లో
కూరుకుని వేరే చోట అమ్ముకుని పొట్టపోసుకుంటూ వుంటారు. అలా జీవనం సాగించే ప్రకాష్
అనే వ్యక్తికి గుండె జబ్బు అని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. ఆ మాటతో అతడికి
గుండె జారిపోయింది. కాలూ చేయీ ఆడలేదు. ఆ ప్రెస్సు యజమాని , ఈ విషయాన్ని జర్నలిష్టు
సంఘం నాయకుడు అమర్ చెవిన వేసి ఏదైనా సాయం జరిగేలా చూడమన్నాడు. రోగి గురించి
పూర్తిగా తెలిసివున్న అమర్ వెంటనే వైఎస్ ని కలిసి విషయం చెప్పారు. ప్రకాష్ కుటుంబ
సభ్యులు ఇచ్చిన అర్జీని అయన చేతికి
ఇచ్చారు. తక్షణ సాయం అందించమని వై.ఎస్. తన పేషీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే
సంబంధిత ఉత్తర్వులు వచ్చేలోగా ఆ రోగి మరణించిన సంగతి సీఎం కు తెలిసింది. సహాయ నిధి
వ్యవహారాలు చూసే అధికారిని పిలిచి, వెంటనే ఆ రోగి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున
రెండు లక్షల ఆర్ధిక సాయం అందించి రావాలని కోరారు.
వై
ఎస్ ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకే ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాళీ అయ్యే పరిస్తితి
ఏర్పడింది. గతంలో అంజయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కూడా ఇదేవిధమైన పరిస్తితి
తలెత్తిందని అధికారులు చెప్పేవారు. దీనికి కారణం వారిద్దరి చేతికీ ఎముక లేకపోవడం.
అడగని వారిదే పాపం అన్నట్టు ఎవరు అర్జీ పెట్టుకున్నా వెంటనే ముందు వెనుకలు
చూడకుండా డబ్బు మంజూరు చేసేవాళ్ళు. ఒకసారి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య శాసన
సభ్యుడు, వారికి సంబంధించిన వారికి వైద్యం
చేయించేందుకు ఆర్ధిక సాయం కోరుతూ ఒక అర్జీ ముఖ్యమంత్రి వై.ఎస్. చేతికి ఇచ్చారు.
అదంతా చదివి వై ఎస్ ఆయనతో ఇలా అన్నారు.” నేను డాక్టరుగా చెబుతున్నా విను. ఈ
జబ్బుకి నువ్వడిగిన యాభయ్ వేలు ఏమాత్రం
సరిపోవు.రెండు లక్షలు లేనిదే వైద్యం జరగదు. అంచేత అంత డబ్బు ఇస్తాను, వైద్యం
చేయించు’
ఆ
ఎమ్మెల్యేకు ఆశ్చర్యంతో మాట పెగల్లేదు. బయటకు వచ్చి పేషీ అధికారులతో అన్నాడు
“చూశారా, సి ఎం అంటే ఇలా వుండాలి, మా పార్టీ అధికారంలో వున్నప్పుడు ఎవరు వెళ్లి
అడిగినా, అడిగిన దానిలో సగం కత్తిరించి శాంక్షన్ చేసే వాళ్ళు. దాంతో ఖర్చు
రెట్టింపు చూపించి అడగాల్సి వచ్చేది”
వై
ఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక
ఇంగ్లీష్ పత్రిక విలేకరి తన కుమార్తె పెండ్లికి పిలవడానికి భార్యను వెంటబెట్టుకుని క్యాంప్ ఆఫీసుకు వెళ్ళారు. వైఎస్ లోపలకు
వస్తూనే వీరిని చూసి కూర్చోబెట్టమని సిబ్బందికి చెప్పి లోపలకు వెళ్ళారు. సిబ్బంది
వారిని ప్రవేశ ద్వారం వద్ద కుర్చీల్లో కూర్చోబెట్టారు. సీఎమ్ కాసేపటి తరువాత వచ్చి
బయట కూర్చుని వున్న భార్యాభర్తలను చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గబగబా విలేకరి భార్య దగ్గరికి వెళ్లి,
‘మీరు మాఇంటి ఆడపడుచు వంటి వారు, మీకు సరిగా మర్యాద జరగలేదు, మన్నించమని’ ఒకటికి
రెండుసార్లు అనడంతో ఆవిడ విస్తుపోయారు. వెంటబెట్టుకుని లోపలకు తీసుకుని వెళ్లి తన
వద్ద కూర్చోబెట్టుకున్నారు. ‘మీకు ఎంతమంది
పిల్లలు, ఎందరి పెళ్ళిళ్ళు అయ్యాయి’ అంటూ ఆప్యాయంగా వివరాలు కనుక్కున్నారు.
ఇన్నేళ్ళ తరువాత కూడా తెలంగాణా ప్రాంతానికి చెందిన ఆ విలేకరి ఈ సంగతి గుర్తుచేసుకుంటూ వుంటారు.
పొతే,
ఇది వై.ఎస్. వ్యవహార శైలితో ముడిపడివున్న మరో విషయం. అయితే ఇది చెప్పింది, కాదు
రాసింది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
మోహన్ కందా, తన జీవితానుభావాలతో కూర్చిన ‘మోహన
మకరందం’ అనే పుస్తకంలో ఈ సంగతులు ప్రస్తావించారు.
“అప్పుడు
చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వై.ఎస్. రాజశేఖర
రెడ్డి ప్రతిపక్ష నేత.
“2003 లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు
ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. కానీ అప్పటి ఎలక్షన్ కమీషనర్ లింగ్డో
దానికి ఒప్పుకోలేదు. ఓటర్ల జాబితాలో సవరణల ప్రక్రియ పూర్తయిన తరువాతనే
ఎన్నికలుజరగాలని ఆయన నిర్ణయించారు. దాంతో
కొన్ని నెలల పాటు రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం నడవాల్సిన పరిస్తితి ఏర్పడింది.
ముఖ్యమంత్రి కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానే వ్యవహరించాల్సివుంటుంది. రాజకీయ పరమైన
నిర్ణయాలు లేకుండా అధికారులే ప్రభుత్వాన్ని నడపాలి. ఆ సమయంలో ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి
మోహన్ కందా పై పరిపాలనా భారం
పడింది. అన్నాళ్ళు ఈ భారం మోయడం కష్టం అని భావించిన కందా, లింగ్డోతో తనకున్న
వ్యక్తిగతస్నేహాన్ని పురస్కరించుకుని, ఆ చనువుతో ‘కాస్త ముందుగా ఎన్నికలు
పెట్టవచ్చు కదా’ అని కోరారు. కానీ లింగ్డో మహాశయులు ఒక పట్టాన కొరుకుడు పడే రకం
కాదు, ‘పేకాట పేకాటే, బావగారు బావగారే’ అనే తరహాలో ఓటర్ల జాబితా సవరణ
పూర్తయ్యేవరకు ఎన్నికల ప్రసక్తి తీసుకురావద్దని తెగేసి చెప్పేశారు.
“ఈలోగా
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు తన శైలిలో
ప్రభుత్వం పని తీరుపై రోజువారీ నివేదికలు మీడియాలో ఇస్తుండేవారు. ఆపద్ధర్మ
ముఖ్యమంత్రికి అలా ప్రజల డబ్బు ఖర్చు చేసే హక్కు లేదంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ యాగీ
మొదలు పెట్టింది. చీఫ్ సెక్రెటరీగా మోహన్ కందా బాబుకు సాయం చేస్తున్నాడు అని
వాళ్ళు అనుమానించడం మొదలెట్టారు. అంతలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు
నగారా మోగించింది. లోకసభ రద్దయింది. అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు జమిలిగా జరపాలని
చంద్రబాబు కేబినేట్ తీర్మానించింది. కేబినేట్ నిర్ణయానికి అనుగుణంగా ప్రధాన
కార్యదర్శి మోహన్ కందా కేంద్రానికి లేఖ రాయడం జరిగి పోయింది. ఈ ఆలోచన సహజంగానే
ప్రతిపక్షానికి రుచించలేదు. రెండు ఎన్నికలు కలిపి
నిర్వహించాలని కోరుతూ సీ. ఎస్.
కేంద్రానికి ఉత్తరం రాయడాన్ని వై.ఎస్. తప్పు పడుతూ పత్రికా ప్రకటన చేసారు. ‘ఇవన్నీ
రాజకీయ నిర్ణయాలు, ఐ.ఏ.ఎస్. అధికారికి ఏం సంబంధం’ అనేది అయన వాదన.
“ఎన్నికలు
జరిగాయి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వాలు మారినప్పుడు
ప్రధాన కార్య దర్సులు, పోలీసు డైరెక్టర్ జనరల్ వంటి కీలక పోస్టుల్లో వున్నవాళ్ళు
మారడం కూడా రివాజుగా మారింది. కందా వెళ్లి, వై.ఎస్. ని కలిసి ప్రధాన కార్యదర్శి
బాధ్యతల నుంచి తప్పించమని కోరారు. ప్రతిపక్ష నేతగా కందా చేసిన పనులు ఆయనకు నచ్చని
మాట నిజమే. అయితే ఒక విషయం అర్ధం చేసుకున్నారు. ఒక అధికారిగా ఆయన తన బాధ్యత
నిర్వర్తించారు తప్పితే రాజకీయ పరమైన దురుద్దేశాలు ఆయనకు లేవన్న విషయాన్ని కూడా
వై.ఎస్. గ్రహించారు. కనకనే ఆయనతో అన్నారు. ” సీ.ఎస్. పదవిలో కొనసాగాలని మిమ్మల్ని
కోరాలని నేను నిర్ణయించుకున్నాను.”
“వైఎస్
ఇంకో మాట కూడా అన్నారు మోహన్ కందాతో ఇంగ్లీష్ లో.
‘నాతో
వ్యవహారం చాలా సులువని మీరు త్వరలోనే గ్రహిస్తారు’ అన్నది దాని భావం.
“చంద్రబాబు
ప్రభుత్వంలో, వై.ఎస్. సర్కారులో కూడా సి.ఎస్. బాధ్యతలు నిర్వహించిన మోహన్ కందా
పదవీ విరమణ అనంతరం రాసుకున్న ఆ పుస్తకంలో
ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహార శైలి గురించి తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం
చేసారు.
“
ఏదైనా ఆయన దృష్టికి తేకపోతే, ’ఇది నాకు ఎందుకు చెప్పలేదు’ అనేవారు బాబు.
“అదే
వై యస్సార్ అయితే, ‘ఇది నాకెందుకు చెబుతున్నారు’ అని అడిగేవారు”
వై.ఎస్.
గురించిన ఇలాటి విశేషాలు ఎన్నో వున్నాయని ఆయన్ని ఎరిగినవారు చెబుతుంటారు. (29-08-2017)
Below Photo: Author with Dr.Y.S.Rajasekhara Reddy, when he was the Chief Minister of combined state of Andhra Pradesh.
3 కామెంట్‌లు:
All India radio level nundi inkaa yedagaledu paapam....
ఇంత ధర్మదాతని పావురాల గుట్ట బలితీసుకుంది
@Rama and @అజ్ఞాత:ప్రజలు రాజహంసలు - భండారు శ్రీనివాసరావు
“విన్నంతలో కన్నంతలో వైఎస్సార్” అనే నా వ్యాసం ఈరోజు సాక్షి పత్రిక ప్రచురించింది. దాంతో ఉదయం నుంచి నా మొబైల్ మోగుతూనే వుంది. ఎంతమంది నాతొ మాట్లాడారో లెక్కలేదు. రాజశేఖరరెడ్డి గారి ‘రాజకీయం’ గురించీ, ఆయన పాలనలో జరిగిన కొన్ని వివాదాంశాలు గురించి మెజారిటీ జర్నలిష్టులకు మించిన విభిన్న అభిప్రాయాలు నాకూ లేవు. కాకపొతే ఒక ముఖ్యమంత్రిగా ఆయనలో అభివ్యక్తి చెందిన ఒక మానవీయ కోణం ఇంతమందిని ఇన్నేళ్ళ తరువాతకూడా ప్రభావితం చేయగలిగిన స్థితిలో వుందని మాత్రం నేననుకోలేదు. అందుకే ఇంత ఆశ్చర్యం.
పొతే ఇవన్నీ నన్ను పొగుడుతూనో లేదా నేను రాసింది బాగున్నదనో చెప్పడానికి జరిగిన ప్రయత్నాలు కావు. వై.ఎస్. గురించి విభిన్న వర్గాల ప్రజలు ఇప్పటికీ కృతజ్ఞతాపూర్వకమైన కొన్ని అనుభవాలను పదిలంగా గుండెల్లో అణచిపెట్టుకుని వున్నారు. ఆ అనుభూతులను వ్యక్తీకరించుకోవడానికి బహుశా నా రచన వారికి ఉపయోగపడి ఉండవచ్చు.
భద్రాచలంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు వీరబాబు. గణేష్ నిమజ్జనం డ్యూటీ కోసం ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాడు. సెప్టెంబరు రెండు ఆయన పుట్టిన రోజు. వై.ఎస్. చనిపోయిన రోజు నుంచి ఆయన తన పుట్టిన రోజు జరుపుకోవడం మానేశాడు. ఆయనకే కాదు వాళ్ళ ఇంట్లో అందరికీ వై.ఎస్.ఆరే దేవుడు.
‘వై.ఎస్. వల్ల మీకు జరిగిన మేలు ఏమిటి’ అన్నది నా ప్రశ్న.
“నిజం చెప్పాలంటే నాకు సొంతానికి జరిగింది ఏమీ లేదు. అప్పటికి నేనింకా ఉద్యోగ ప్రయత్నాల్లో వున్నాను. మా సొంతూరు ఖమ్మంజిల్లా ముదిగొండ మండలంలోని గోకినేపల్లి. మా నాన్నకు కొంత పొలం వుంది. దానికోసం సహకార బ్యాంకు నుంచి ఐదువేల రూపాయలు పంట రుణం తీసుకున్నారు. సకాలంలోనే ఆ అప్పు తీర్చేశారు కూడా. తరువాత వై.ఎస్. రుణ మాఫీ ప్రకటించారు. రుణం తీర్చిన వారికి కూడా ఈ పధకం వర్తింప చేయడంతో మా కుటుంబానికి అనుకోకుండా ఐదువేలు లభించింది. దానితో, మా నాన్నగారు, ఆయనతో పాటు ఇంటిల్లిపాదీ వై.ఎస్. కు వీరాభిమానులు అయిపోయారు. ఆ అయిదువేలతో ఇంటిముందు చిన్న రేకుల పందిరి వేసుకున్నాము. వాటికి వై.ఎస్.ఆర్. రేకులు అని పేరుపెట్టుకుని పిలుచుకుంటున్నాము.” చెప్పాడు వీరబాబు ఉద్వేగంగా.
“ఒక్క అయిదు వేలకే ఇంతగా ఇదయిపోవాలా” నా నుంచి మరో ప్రశ్న. ఆయన వద్ద జవాబు సిద్ధంగా వుంది.
“లేదు. కాకపొతే అప్పటినుంచి ఆయన్ని నిశితంగా గమనించడం మొదలయింది. 108. 104, ఆరోగ్య శ్రీ, పక్కా ఇళ్ళు, చదువులకు కట్టిన ఫీజులు వెనక్కి ఇవ్వడం ఇలా మా వూళ్ళో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విధంగా సాయం అందింది. చిత్రం! వేటికీ ఆయన తన పేరు పెట్టుకోలేదు. అవన్నీ చూసిన తర్వాత, పర్వాలేదు, ఈయన పాలనలో బాగుపడతాం అనే భరోసా వచ్చింది”
ఇక నేను ఏమీ అడగలేదు. తరువాత కూడా చాల విషయాలు చెప్పుకొచ్చాడు. అన్నీ విన్నాను.
ఒక్క వీరబాబే కాదు, అనేకమంది అనేక ప్రదేశాలు, ప్రాంతాల నుంచి ఫోన్లు చేశారు. వరస ఫోన్లు కావడంతో కొన్ని పేర్లు గుర్తు పెట్టుకోవడం కష్టం అయింది. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క అనుభవం. వాటిని వ్యక్తీకరించడానికి నా వ్యాసం ఒక ప్రాతిపదిక అయింది. అంతే!
ఈ విధంగా రోజు గడిచింది. అప్పుడు అనిపించింది.
మామూలు ప్రజలు మనం అనుకునేంత మామూలోళ్ళు కాదు. మంచిని, మంచిగా స్వీకరిస్తారు. చెడు చెడుగా గుర్తిస్తారు. ఆ విద్య వారికే సొంతం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి