2, సెప్టెంబర్ 2017, శనివారం

ప్రజలు రాజహంసలు - భండారు శ్రీనివాసరావు


“విన్నంతలో కన్నంతలో వైఎస్సార్” అనే నా వ్యాసం ఈరోజు సాక్షి పత్రిక ప్రచురించింది. దాంతో ఉదయం నుంచి నా మొబైల్ మోగుతూనే వుంది. ఎంతమంది నాతొ మాట్లాడారో లెక్కలేదు. రాజశేఖరరెడ్డి గారి ‘రాజకీయం’ గురించీ, ఆయన పాలనలో జరిగిన కొన్ని వివాదాంశాలు గురించి మెజారిటీ జర్నలిష్టులకు మించిన విభిన్న అభిప్రాయాలు నాకూ లేవు. కాకపొతే ఒక ముఖ్యమంత్రిగా ఆయనలో అభివ్యక్తి చెందిన ఒక మానవీయ కోణం ఇంతమందిని ఇన్నేళ్ళ తరువాతకూడా ప్రభావితం చేయగలిగిన స్థితిలో వుందని మాత్రం  నేననుకోలేదు. అందుకే ఇంత ఆశ్చర్యం.
పొతే ఇవన్నీ నన్ను పొగుడుతూనో లేదా నేను రాసింది బాగున్నదనో చెప్పడానికి జరిగిన ప్రయత్నాలు కావు. వై.ఎస్. గురించి విభిన్న వర్గాల ప్రజలు  ఇప్పటికీ కృతజ్ఞతాపూర్వకమైన కొన్ని అనుభవాలను పదిలంగా గుండెల్లో   అణచిపెట్టుకుని వున్నారు. ఆ అనుభూతులను వ్యక్తీకరించుకోవడానికి బహుశా నా రచన వారికి   ఉపయోగపడి ఉండవచ్చు.
భద్రాచలంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు వీరబాబు. గణేష్ నిమజ్జనం డ్యూటీ కోసం ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాడు. సెప్టెంబరు రెండు ఆయన పుట్టిన రోజు. వై.ఎస్. చనిపోయిన రోజు నుంచి ఆయన తన పుట్టిన రోజు జరుపుకోవడం మానేశాడు. ఆయనకే కాదు వాళ్ళ ఇంట్లో అందరికీ వై.ఎస్.ఆరే దేవుడు.
‘వై.ఎస్. వల్ల మీకు జరిగిన మేలు ఏమిటి’ అన్నది నా ప్రశ్న.
“నిజం చెప్పాలంటే నాకు సొంతానికి జరిగింది ఏమీ లేదు. అప్పటికి నేనింకా ఉద్యోగ ప్రయత్నాల్లో  వున్నాను. మా సొంతూరు ఖమ్మంజిల్లా ముదిగొండ మండలంలోని గోకినేపల్లి. మా నాన్నకు కొంత పొలం వుంది. దానికోసం సహకార బ్యాంకు నుంచి ఐదువేల రూపాయలు పంట రుణం తీసుకున్నారు. సకాలంలోనే ఆ అప్పు తీర్చేశారు కూడా. తరువాత వై.ఎస్. రుణ మాఫీ ప్రకటించారు. రుణం తీర్చిన వారికి కూడా ఈ పధకం వర్తింప చేయడంతో మా  కుటుంబానికి  అనుకోకుండా ఐదువేలు లభించింది. దానితో, మా  నాన్నగారు, ఆయనతో పాటు ఇంటిల్లిపాదీ వై.ఎస్. కు వీరాభిమానులు  అయిపోయారు. ఆ అయిదువేలతో ఇంటిముందు చిన్న రేకుల పందిరి వేసుకున్నాము. వాటికి  వై.ఎస్.ఆర్. రేకులు అని పేరుపెట్టుకుని పిలుచుకుంటున్నాము.” చెప్పాడు వీరబాబు ఉద్వేగంగా.
“ఒక్క అయిడువేలకే ఇంతగా ఇదయిపోవాలా” నా నుంచి మరో ప్రశ్న. ఆయన వద్ద జవాబు సిద్ధంగా వుంది.
“లేదు. కాకపొతే అప్పటినుంచి ఆయన్ని నిశితంగా గమనించడం మొదలయింది. 108. 104, ఆరోగ్య శ్రీ, పక్కా ఇళ్ళు,  చదువులకు కట్టిన ఫీజులు వెనక్కి ఇవ్వడం ఇలా  మా వూళ్ళో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విధంగా సాయం అందింది. చిత్రం!   వేటికీ ఆయన తన పేరు పెట్టుకోలేదు. అవన్నీ చూసిన తర్వాత, పర్వాలేదు, ఈయన పాలనలో బాగుపడతాం అనే భరోసా వచ్చింది”
ఇక నేను ఏమీ అడగలేదు. తరువాత కూడా చాల విషయాలు చెప్పుకొచ్చాడు. అన్నీ విన్నాను.
ఒక్క వీరబాబే కాదు, అనేకమంది  అనేక ప్రదేశాలు, ప్రాంతాల నుంచి ఫోన్లు చేశారు. వరస ఫోన్లు కావడంతో కొన్ని పేర్లు గుర్తు పెట్టుకోవడం కష్టం అయింది. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క అనుభవం. వాటిని వ్యక్తీకరించడానికి నా వ్యాసం ఒక ప్రాతిపదిక అయింది. అంతే!       
ఈ విధంగా రోజు గడిచింది. అప్పుడు అనిపించింది.
మామూలు ప్రజలు మనం అనుకునేంత మామూలోళ్ళు కాదు. మంచిని, మంచిగా స్వీకరిస్తారు. చెడు చెడుగా గుర్తిస్తారు. ఆ విద్య వారికే సొంతం.
తోకటపా: అలా అని అందరూ  మెచ్చుకోళ్ళతో నన్ను  ముంచేయలేదు. ఈ వ్యాసాన్ని నా బ్లాగులో పోస్ట్ చేస్తే ‘అజ్ఞాత’ పేరుతొ ఒక చదువరి  ఇలా కామెంటు పెట్టాడు.
“ఏదో అనుకున్నా కానీ, మీరు రేడియో విలేకరి స్థాయి దాటి ఇంకా ఎదగలేదు”
రేడియోలో అందరూ ‘భజన చేసే విధం’ తెలిసిన వాళ్ళే పనిచేస్తారని ఆ ‘ముసుగు మనిషి’ భావం కావచ్చు.
పరవాలేదు. రాసినది నాది అని చెప్పుకునే ధైర్యం వుంది కాబట్టి నేను నా పేరు దాచుకోలేదు. ఈ విషయంలో అయినా  నేను ఆ ‘అజ్ఞాత’ కంటే ఎదిగిన మనిషిననే అని అనుకుంటున్నాను.   
 

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

తెలంగాణ ప్రజలు ఆయనను ఇంకా గుర్తు పెట్టుకొని ఉన్నారా?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత:తెలియదు. అతను నాతొ ఫోనులో చెప్పిన మాట రాశాను.

voleti చెప్పారు...

ప్రజలకి బిస్కత్తులు, నాయకులకి పంచభక్ష్య పరమాన్నాలు... కోట్లు దిగమింగిన వైనం కోర్టుల సాచ్చికంగా కనబడుతున్నా భజయించే నైజం, మన దౌర్బల్యం.. sorry sir..

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@voleti: అది మీ అభిప్రాయం. నాకు నచ్చకపోయినా గౌరవిస్తాను. ఇది ఒక నాయకుడి వర్ధంతికి సంబంధించి రాసింది. అయన ఇతర వ్యవహారాలకు సంబంధించి రాయాల్సి వస్తే అది వేరే విధంగా వుంటుంది. పెళ్ళికి వెళ్లి తద్దినం మంత్రాలు చదవడం మంచిదికాదు. భజనలు భజంత్రీలు తెలిసిన వాడిని అయితే నా పరిస్తితి ఇలా వుండేది కాదు. అది నేను కోరుకోను కూడా. ఇలా రాయాల్సి వచ్చినందుకు నేను కూడా సారీ.