5, ఆగస్టు 2015, బుధవారం

బ్రేకింగ్ న్యూస్!


గమనిక: "వంశీ వంశీ పోస్ట్ చేసిన ఆంగ్లగల్పిక ఆధారంగా"


రిపోర్టర్: "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్. మీరు ఏ పండుని ఇష్టపడతారు?"
నరేంద్ర మోడీ : "ఆపిల్ పండు"
రిపోర్టర్: ఇప్పుడే అందిన వార్త! "ఆపిల్ పండు మినహా ప్రధాని మోడీగారికి మామిడిపళ్ళు ఇష్టం లేదు. అరటి పండును  అస్సలు ఇష్టపడరు. మోడీ అభిప్రాయం గురించి వివిధ పార్టీల నాయకులను కదిలించినప్పుడు వారు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం :
మనీష్ తివారి: "ఆపిల్ పండు మోడీ గారు ఇష్టపడడంలో విచిత్రం లేదు. ఆపిల్ పండు రంగు ఎరుపు. ఆయనకి  ఎర్రటి రక్తపుటేర్లు పారించడం కూడా ఇష్టమే"
అహమ్మద్ పటేల్ : "ఆశ్చర్యం ఏముంది. పచ్చటి పండు ఇష్టం లేదు అంటే అర్ధం ఏమిటి? ఆయనకు ముస్లిం లు అంటే పడదు. అందుకే ఎర్రటి ఆపిల్ ఇష్టం అంటున్నారు"
ఆర్నాబ్ గోస్వామి: "మోడీ గారికి ఆపిల్ పండు ఇష్టం అయితే కావచ్చు. కానీ మిగిలిన పండ్లకంటే ఆయనకు ఆపిల్ యెందుకు ఇష్టమో జాతికి సమాధానం చెప్పుకోవాల్సిన నైతిక బాధ్యత ఆయన భుజస్కంధాలపై వుంది. ఈ విషయంలో ఆయన తన బాధ్యత నుంచి ఎంతమాత్రం తప్పించుకోలేరు"
సోనియా గాంధి : 'ఓ పక్క తాను పేద ప్రజల పక్షపాతినని చెప్పుకుంటూ, మరో పక్క అత్యంత ఖరీదైన ఆపిల్ పండ్లని యెలా కొనగలుగుతున్నారో, ఆ డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయో మోడీజీ బయట పెట్టాలి"
ఏచూరి: "ఆపిల్ ఇష్టం అని అంటున్నారంటే మోడీ ఖచ్చితంగా ఆపిల్ వంటి బహుళ జాతి సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు అనుకూలం. పేద ప్రజలకు పచ్చి వ్యతిరేకం"
కేజ్రీవాల్: "సాధారణంగా మామూలు మనుషులు మామిడి పండ్లను ఇష్టపడతారు. సాంప్రదాయ విరుద్ధంగా ఆపిల్ పండు ఇష్టపడే మోడీ, ఆమ్ ఆద్మీకి పూర్తిగా వ్యతిరేకం అని వేరే చెప్పాలా?"
సగటు పౌరుడు: "ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి"

NOTE: Courtesy Image Owner


19 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

ఒక పోప్ గారు అమెరికా యాత్రకు వెడుతున్నారు. అప్పుడాయనకు ఒక సన్నిహితుడు తగిన జాగ్రత్తలు తీసుకోమనీ అక్కడ జర్నలిష్టులు రకరకాలప్రశ్నలు వేస్తారనీ ఆలోచించి ఆచితూచి సమాధానాలు ఇవ్వటం క్షేమం అనీ హితోపదేశం చేసాడు.

సరే పోప్ గారు అమెరికాలో విమానం దిగనే దిగారు. ఎయిర్ పోర్ట్ లోనే జర్మలిష్టులు పలకరించారు. పోప్ గారు పాపం జాగ్రత్తగానే సమాధానాలను చెబుతున్నారు.

ఇంతలో ఒక జర్నలిష్టు, "పోప్ గారూ, మీరు అమెరికాలో నైట్ క్లబ్బులనూ దర్శిస్తారా" అని అడిగాడు.
పోప్ గారు సాలోచనగా అతడిని చూసి "నైట్ క్లబ్బులా? నాకు తెలియదే. అవెక్కడుంటాయీ. " అన్నారు.
జర్నలిష్టు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.

మర్నాడు పత్రికల్లో వచ్చిన ఒక ప్రథానవార్త "పోప్ గారు అమెరికా వస్తూనే నైట్ క్లబ్బులు ఎక్కడుంటాయి? " అని అడిగారు అని!

ఎందుకు ఈ కథను ఉటంకించానంటే, సెలబ్రిటీలు ఏం చెప్పినా / ఏం చెప్పకపోయినా అది వార్తల్లో రకరకాలుగా వస్తుంది అని!

అజ్ఞాత చెప్పారు...


భండారు గారు,
మీ బ్లాగులో ఉగ్రవాదులకు మతం లేదు అనే టపాలో ఎంతో చర్చ జరిగితే మీరు మ్యూట్ స్పెక్టేటర్ గా ఉండటం లో అర్థామేమిటి? ఈ చర్చ పై మీ అభిప్రాయమేమిటి? ఎక్కడ చెప్పకుండా దాటేయటం లో అర్థమేమిటి? లేకపోతే నాలుగు నెలల తరువాత మళ్ళీ ఈ వ్యాసాం లో పేర్లు మార్చి ఇంకొక పేపర్ కి వ్యాసం రాద్దామనుకొంట్టున్నారా?

http://bhandarusrinivasarao.blogspot.in/2015/07/blog-post_45.html

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

అజ్ఞాత గారికి - నేను ప్రాధమికంగా జర్నలిష్టును. నా అభిప్రాయాలు నాకు నచ్చిన పద్దతిలో రాసుకుంటూ పోవడమే నాకు తెలిసిన విషయం. నా వ్యాసాలపై అంతా ఏకీభవించాలి అనే ఉద్దేశ్యంతో రాసినప్పుడే చిక్కంతా. నా అభిప్రాయాలు నాకున్నట్టే ఎవరి అభిప్రాయాలు వారివి. పత్రికల్లో వచ్చే వ్యాసాలపై ఇంత స్థాయిలో చర్చకు అవకాసం వుండదు. అంచేత రాసుకుంటూ పోవడమే జర్నలిష్టులకు తెలిసిన విద్య. ఈ బ్లాగులోకం లో అలా కాదు. ఎప్పటికప్పుడే తప్పొప్పుల విశ్లేషణ క్షణాల మీద జరిగిపోతూ వుంటుంది. నేను రాసిన దాంట్లో ఎవరయినా పొరబాట్లు, స్ఖాలిత్యాలు ఎత్తి చూపినప్పుడు నేను వెంటనే స్పందిస్తాను. ఎలాటి భేషజాలు లేకుండా సరిదిద్దుకుంటాను. అంతే కాని చర్చల్లో తలదూర్చను. ఎవరు ఏమనుకున్నా సరే, మ్యూట్ స్పెక్ టేటర్ అనుకున్నా సరే. ఇదే నా పాలసీ. మరో పత్రిక్కి రాయడానికి నా దగ్గర ఇంకా చాలా విషయాలు వున్నాయి. నేను మొదట పత్రికా రంగంలో చేరింది 1970 లో. ఇప్పటికి ఎన్నో తరాల జర్నలిష్టులను దగ్గర నుంచి చూసాను. నలభయ్ అయిదేళ్ళ పత్రికా రంగ అనుభవం తరువాత కొత్తగా నేర్చుకోవాల్సిన పాఠాలు వుంటాయని అనుకోను. నేనెప్పుడూ నా పేరును చిరునామాను, మెయిల్ ఐ డీ ని, ఫోను నెంబరును దాచుకోవడానికి ప్రయత్నించలేదు. నా నిజాయితీకి ఒకరి సర్టిఫికేట్లు అవసరం లేదు. మరీ ముఖ్యంగా రెండు రోజుల్లో డెబ్బయ్యవ పడిలో పడుతున్న వయస్సులో.

అజ్ఞాత చెప్పారు...


Thanks for your reply.

శ్యామలీయం చెప్పారు...

> నా నిజాయితీకి ఒకరి సర్టిఫికేట్లు అవసరం లేదు
భండారువారూ, ఈ బ్లాగుప్రపంచంలో ప్రతివారూ మేథావులవలే ప్రవర్తించటానికి యత్నిస్తుంటారు. తెలియని విషయాలపైనా తీర్పులు చెప్పేస్తుంటారు. జర్నలిష్టయ్యేది మరొకరయ్యేది తమ బ్లాగులో వ్రాసుకొన్న అభిప్రాయాలపై ఎవరితోనైనా సరే నిరంతరాయంగా చర్చకు సిధ్ధంగా ఉండవలసినదే అన్నది అటువంటి మేథావుల అభిప్రాయం కావచ్చును. దాని దానిని పట్టించుకోవలసిన అవసరం మీకు లేదు. మీ అభిప్రాయాలతో ఏకీభవించమనో చర్చించమనో మీరు ఎవరినీ కోరటం లేదు వత్తిడి చేయటం లేదు. మీ అభిప్రాయాలు మీరు రికార్డు చేసుకుంతున్నారు ఒక logలో. అది నలుగురూ చదివుకుందుకూ అవకాశం ఇస్తున్నారు. వీలూ ఓపికా ఉన్నవారు వాటిని చదువుకో వచ్చును. ఇంకా అసక్తి ఉన్నవారు తమ అభిప్రాయాలను కూడా మీ దృష్టికి తేవచ్చును. అంతే. నిరంతరచర్చలకు యుధ్ధాలకు మీరు సిధ్ధంగా ఉండాలని ఆశిస్తే ఎవరైనా అది వారి అమాయకత్వం. మీరు అవసరం అనుకున్న కొన్ని వ్యాఖ్యలను ప్రచురించవచ్చును. జవాబు అవసరం అనుకున్న వాటికి కొన్నింటికి జవాబు ఇవ్వవచ్చును. దాని అర్థం మీ అభిప్రాయాలను మీరు బహిరంగ చర్చకు పెట్టారని కాదు. మీరేమీ ఇబ్బంది పడకండి.

అజ్ఞాత చెప్పారు...

శ్యామలీయం గారు, మీరు పానకం లో పుడకలా దూరి, మీ అభిప్రాయాన్ని అడగక పోయినా చెప్తున్నారు.భండారుగారు కట్టే విరగకుండా పాము చావకుండా రాసే వ్యాసాలు ఒకప్పుడుఫేమస్ ఎమో గాని ఇప్పుడు కాదు. ఆయన సిన్సియారిటి పై అనుమానాలు ఎమి లేవు గాని, తెలుగు మీడీయాలో తెలకలపల్లి రవి మొదలైన జర్నలిస్ట్లు 70 ఏళ్ల వయసొచ్చినా, తలకి నల్ల రంగు వేసుకొని,యువకుల వలే భావిస్తూ అవ్వకాలం నాటి భావాలను అటు టివి discussion లో, ఇటు ప్రింట్ మీడీయాలో గుప్పించటం, 2015 లో ఎంత వరకు న్యాయం?

శ్యామలీయం చెప్పారు...

అయ్యా అజ్ఞాతగారూ,

మీకు సామెతలు కొన్నో మరెన్నో తెలిస్తే సంతోషం. అదలా ఉంచండి. మీరు మాత్రం ఎవరడిగారని మీ వ్యాఖ్య ఉంచారూ? ఎవరినీ అయ్యా ఒక కామెంటు మీ నుండి అని అడగరు కదా? 70ఏళ్ళవారు అభిప్రాయాలు చెప్పటం మీకు నచ్చకపోతే అవి చదవకండి. వారికి తమతమ అభిప్రాయాలు చెప్పటానికి మీ అనుమతి అక్కరలేదు అన్నది ముందు అర్థం చేసుకుంటే మీ ఇబ్బంది తొలగుతుంది. ఎవరి బ్లాగు వారి అబిమతం మేరకు వ్రాసుకుంటారు. మీ యితర అభిప్రాయాలు అప్రస్తుతం అనిపించి వాటిపై నేను స్పందించటం లేదు. మీకు ఓపిక ఉంటే నా వ్యాఖ్యను మరొకసారి తీరికగ అవసరమైతే కాస్త విషయపరిజ్ఞానం ఉన్నవారి సహాయంతో చదువు కోవలసినదిగా విజ్ఞప్తి.

అజ్ఞాత చెప్పారు...


శ్యామలీయం గారు,
మీ విషయ పరిజ్ణాం పై అవగాహన ఉంది. రచ్చ బండలో మీ చర్చలు చదువుతూనే ఉంటాను. ఆయన బ్లాగు రాసుకొంటే ఇటువైపు తొంగి చూసేవాడిని కాదు. కాని వీరు ఉదయం టివి లో చర్చలు, పేపర్లలో రాస్తూంటారు. వాటిని బ్లాగులో వలే పది, ఇరవైమంది కాదు, లక్షల మంది ఫాలో అవుతారు. ఆయన బ్లాగులో చిక్కాడు గనుక మా అభిప్రాయాలు చెప్పాం. అందులో తప్పేమి లేదు. ఇంత చర్చ జరిగినా ఒక్క మాట రాయలేదు. కనుక అసలు చర్చను ఆయన చదివాడా లేదా అని తెలుసుకోవటానికి ప్రశ్నించటం జరిగింది. మారిపోతున్న ప్రపంచాన్ని గమనించకుండా, పాత తరహాలో రాస్తూంటె చిన్న విసుగు తప్పించి,వ్యక్తిగతంగా ఆయన పై ఎటువంటి కోపం లేదు.

శ్యామలీయం చెప్పారు...


అజ్ఞాత గారూ, నేను మిమ్మల్ని ఉద్దేశించి చేసిన పై వ్యాఖ్య కొంచెం ఘాటుగా అనిపించి ఇబ్బంది పెడితే క్షంతవ్యుడిని. మిమ్మల్ని కాని మరొకరిని కాని నొప్పించటం నా అభిమతం కాదు. మీ అభిప్రాయాలు మీరు చెప్పే హక్కు మీకు తప్పకుండా ఉంది. కాదనలేము. కాని మీరు కొన్ని పొరపాట్లు చేసారని నా అభిప్రాయం. మీరు భండారు వారి అభిప్రాయలపై మీ స్పందనకు మాత్రం పరిమితం కావచ్చును కాని వారినీ వారివంటి పెద్దతరం జర్నలిష్టులనీ ఉద్దేశించి వ్యక్తిగతంగా వ్యాఖ్యానించటం అవసరం కాకపోవటమే కాదు అభ్యంతరకరంగా నాకు అనిపించింది. మీరు ఆ తరువాత నన్ను ఉద్దేశించీ వ్యక్తిగతవ్యాఖ్య చేసారు. మనం విషయాలపై అభిప్రాయాలు పంచుకుంటూ మాట్లాడుకుంటుంటే తెలుగుబ్లాగులకు గౌరవనీయత పెరుగుతుంది. వ్యక్తిగత విమర్శలకు పూనుకోవటం వలన విషయాలు పక్కదారి పట్టటమూ, బ్లాగుపాఠకులకు మనమూ మన బ్లాగర్లూ పలుచన కావటమూ తప్పించి ప్రయోజనం ఉండదు. ఈ విషయంలో మీరు ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను. ముందే నేను మనవి చేసినట్లు మనకి నచ్చని అభిప్రాయాలు ప్రకటించినందుకు బ్లాగర్ను అక్షేపించటం ఉచితం కాదని నా అభిప్రాయం. అయ్యా నా అభిప్రాయం వేరు - దానికి కారణాలు ఫలానా అని చెప్పటం చాలు. ముఖ్యమైన విషయం బ్లాగరు మనతో తన టపాను గురించి చర్చించి తీరవలసిన తప్పనిసరి బాధ్యత ఏమీ లేదు. అందుకోసం ఒత్తిడి చేయటం ఉచితం కూడా కాదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం వేరుగా ఉంటే మన్నించండి. ఇకపోతే రచ్చబండవారి ఎజండా వేరనిపించింది. అక్కడ చర్చలలో పాల్గొనటం పట్ల నాకు ఆసక్తి లేదు. నాకు ఈ అవగాహన రాక ముందు కొన్ని చర్చలలో పాల్గొన్న మాట వాస్తవం కావచ్చును. మీరు నిరవధికవాదనాలోలత్వంతో లేకపోతే పారిపోతున్నారన్నట్లుగా రచ్చబండవారు ఒకటి రెండు సార్లు నాపై వ్యాఖ్యానించటం మీరు గమనించే ఉందవచ్చును. కాని నాకు జీవిక కోసం వేరే వృత్తి ఉన్నది. 24 గంటలు వారికి జవాబులు వ్రాస్తూ కూర్చోలేను. అదీ కాక ఆ రచ్చబండవారు స్వయంప్రకటితబ్రహ్మజ్ఞానులు కాబట్టి వారితో వాదించటం వృధా అన్నది నా అభిప్రాయం. దయచేసి ఈ విషయాలను ఇంక చర్చించవద్దు. అర్థం చేసుకోగలరు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీకు జన్మదిన శుభాకాంక్షలు భండారు శ్రీనివాసరావు గారూ.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహా రావు గారికి ధన్యవాదాలు. ఆగస్టు ఏడో తేదీ గుర్తుంచుకున్నందుకు - భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

అజ్ఞాత అనే పేరుతొ ఒక చదువరి రాసిన ఉత్తరం ఈ భాగోతం మొత్తం తవ్వడానికి ప్రేరణ. వారి మెయిల్ ఐ.డీ. తెలిస్తే మిగిలిన పాఠకులకు పునశ్చరణ ఇబ్బంది వుండేది కాదు. అంచేత తప్పటం లేదు. జుట్టుకు రంగు వేసుకున్నంత మాత్రాన పెరిగే వయసు మరుగున పడిపోతుందని అనుకోవడం లేదు. మనిషి ఆలోచనలకు రంగు వేయాల్సిన అవసరం లేకపోతే అదే పదివేలు. 'పెద్దల బుద్దులు సంచలింపవే' అని బ్ భారతంలో అన్నట్టు వయస్సు వల్ల కొంత చాదస్తం రావచ్చు కానీ, ఇప్పటితరం వాళ్లు తమ తరువాతి తరం తమ గురించి కూడా అలానే అనుకుంటుంది అనే స్పృహతో వుండాలి. జుట్టుకు రంగువేసుకోవడం, ప్రతి ఉదయం టీవీ చర్చల్లో పాల్గోవడం వంటి నా గురించిన విషయాలు తెలిసిన 'అజ్ఞాత' గారు మరికొన్ని విషయాలు తెలుసుకుంటారనే ఈ రెండేళ్ళ కిందటి పాత పోస్ట్ మళ్ళీ పెడుతున్నాను. నన్ను గురించి నేను రాసుకోవడం కాకుండా వేరే వ్యక్తులు రాసిన అంశాలు ఇవి. స్వోత్కర్ష అనుకోవడానికి అవకాశం లేదు. ఈ మాటలు కూడా ఆయన చెప్పినవి కావు. స్వయంగా రాసినవి. ఓ ప్రసిద్ధ పత్రికలో అచ్చయినవి.
నా గురించి శ్రీ డి.వెంకట్రామయ్య గారు
(ఎవరీ వెంకట్రామయ్య గారు అంటే ఏం చెప్పాలి? ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఆకాశవాణి అనౌన్సర్ గా, న్యూస్ రీడర్ గా పనిచేశారు. సుప్రసిద్ధ కధా రచయిత)
నా గురించి నేను నలుగురికీ చెప్పుకోవడం ఓ సంగతి. నలుగురూ నా గురించి ఏం చెప్పుకుంటున్నారో అన్నది మరో సంగతి. ఆ చెప్పేవాళ్ళు పెద్దవాళ్లయితే ఇక ఆ విషయం చెప్పుకోవడానికి అడ్డం ఏముంటుంది. కేవలం ఈ వొకే ఒక్క కారణంతో, ఆకాశవాణి న్యూస్ రీడర్ శ్రీ డి. వెంకట్రామయ్య గారు ‘రచన’ మాస పత్రిక తాజా సంచికలో (ఆకాశవాణిలో నా అనుభవాలు – శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచన’ అక్టోబర్, 2013 సంచిక) రాసిన తన రేడియో అనుభవాల్లో భాగంగా నా గురించి చేసిన కొన్ని ప్రస్తావనలను పోస్ట్ చేస్తున్నాను. నిజానికి వీటిని నేను చక్కని ప్రశంసాపత్రాలుగా భావిస్తాను.- భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

వెంకట్రామయ్యగారి ఉవాచ -వెంకట్రామయ్య గారి ఉవాచ:
“ నాకిప్పటికీ బాగా గుర్తుంది. సందర్భం ఏమిటో జ్ఞాపకం లేదు. ఒకనాటి సాయంత్రం డ్యూటీ ముగించుకుని నేనూ భండారు శ్రీనివాసరావు గారు (ఇకనుంచి ఈ గౌరవ వాచకం తీసివేసి రాస్తాను- శ్రీనివాసరావు) న్యూస్ రూమ్ నుంచి బయటకు నడుస్తుండగా ఆయనో మాట అన్నారు.
“మీరు కుండలు బద్దలు కొట్టండి. కాని కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొడతానంటే యెలా “ అని. అంతకుముందు ఆఫీసులో ఏదో జరిగింది. ...ఎవరితోనో నేను ఘర్షణకు దిగడమో, తీవ్రస్థాయిలో వాదించడమో జరిగింది. అలాటి సందర్భాలలో అవసరానికి మించి ఆవేశపడడం, అవతలి వ్యక్తి ఎవరయినా సరే, ఏమాత్రం సంకోచించకుండా వున్న మాట మొహాన అనేయడంవంటి నా సహజ స్వభావం గురించి , శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్య ఇది. ‘కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొట్టడం’ అన్న ఆయన చమత్కారానికి నేనూ నవ్వుకున్నాను. ఆ చమత్కారపు మాటల వెనక నా బోటివారు ఆలోచించవలసిన, చేతనయితే అనుసరించవలసిన మంచి సలహా వున్నట్టు నాకనిపించింది.
“ అప్పుడే కాదు, అంతకి ముందు ఆ తరువాతా కూడా ఎన్నో సందర్భాలలో, తన చమత్కారాలు, చతురోక్తులు జోడించి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ నాకెన్నో సలహాలు అందించేవారాయన. కాని నేను వింటేగా. రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు నా మొండితనం నాదే. ఎన్నిమార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆయన నన్నెంత మాత్రం మార్చలేకపోయారు, ముఖ్యంగా ఆఫీసు విషయాల్లో. శ్రీనివాసరావులాటి మిత్రుల సుదీర్ఘ సహవాసంవల్ల ఆఫీసునుంచి బయటకు వచ్చిన తరువాతైనా కాస్త నవ్వడం నేర్చుకున్నాను. నలుగురిలో మసలడం నేర్చుకున్నాను. నాలుగు మాటలు నేర్చుకున్నాను. అయినా ఆఫేసులో కూర్చున్నంతసేపు నా పని నాదే, నా పద్ధతులు నావే. నా నియమాలు నావే. సక్రమం, సమజసం అనుకున్న మార్గాన్ని ఏమాత్రం విడవలేదు”
“ఆకాశవాణి న్యూస్ రూమ్ లో పనిచేసే పద్ధతిలో భండారు శ్రీనివాసరావుకీ నాకూ పరస్పరవిరుద్ధమైన అభిప్రాయాలు వుండేవి. కాస్త పట్టూ విడుపూ వుండాలనేవారాయన. పట్టుండాలి కాని విడుపెందుకు అనే వాడ్ని నేను. (ఆయన పౌరసంబంధాలమనిషి. అనేకమందితో మంచి సంబంధాలు వుంటేనే వార్తలు సేకరించడం సులువు అనేది ఆయన పాలసీ. కానీ వార్తల ఎంపిక విషయంలో నా ధోరణి నాదే) నన్ను ఆయనా మార్చలేకపోయారు. ఆయన్ని నేనూ ప్రభావితుడ్ని చేయలేకపోయాను. చివరి దాకా అంతే!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

వెంకట్రామయ్య గారి ఉవాచ - “విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆఫీసు విషయాల్లో ఏమాత్రం ఏకాభిప్రాయం లేని నేనూ శ్రీనివాసరావు, ఆఫీసు ఆవరణ దాటి బయటకు రాగానే ఒక్కటై పోయేవాళ్ళం. ఎన్నో ఏళ్ళపాటు ఎన్నో సాయంత్రాలు ..ఎన్నెన్నో రాత్రులు...గంటలకొద్దీ కబుర్లు..సినిమాలు...షికార్లు...అంతేనా అంతకుమించిన అన్ని కాలక్షేపాలు... చతుర్ముఖ పారాయణాలు... దూమపానాలు.... మధుపానాలు... ఏదో ఒక బార్...లేదా ప్రెస్ క్లబ్...అన్నింటికీ మించి చిక్కడపల్లిలో శ్రీనివాసరావు ఇల్లు. ఇవే మా ‘అడ్డాలు’.
“ఆయనా నేనూ దగ్గర దగ్గర ఇళ్ళల్లో వుండేవాళ్ళం. ఆయన అక్కడ వున్నంత కాలం దాదాపు కొన్నేళ్లపాటు నేనూ, వనం జ్వాలా నరసింహారావు వంటి మరికొందరం మిత్రులం కనీసం వారానికి రెండు మూడు రోజులయినా వారింటికి చేరేవాళ్ళం. గంటలకొద్దీ గడిపేవాళ్ళం. ఆరోజుల్లో ఆయన ఇల్లు ఓ ధర్మసత్రంలా వుండేది. అసలే ఆయన బంధు వర్గమే పెద్దది. దానికి తోడు స్నేహితులు. అందరూ బంధువులే....అందరూ స్నేహితులే... ఎప్పుడు ఏ వేళ చూసినా ఎవరో ఒకరు వచ్చిపోతుండేవారు. ఎప్పుడు ఎవరు వచ్చినా వచ్చిన వాళ్ళందరికీ అతిధి మర్యాదలు చేసి, ఆదరించి అన్నం పెట్టి కాని పంపేవారు కాదు ఆయన శ్రీమతి నిర్మలాదేవి. ఆరోజుల్లో ఆవిడను చూసినప్పుడల్లా ‘వండనలయదు వేవురు వచ్చిరేని...అన్నపూర్ణకు నుద్దియౌ అతని గృహిణి...’ అని మనుచరిత్రలో ప్రవరాఖ్యుడి భార్య గురించి చదువుకున్న పద్యం గుర్తుకు వచ్చేది.”
“సుమారు పాతికేళ్ళక్రితం సకుటుంబంగా సోవియట్ రష్యా వెళ్ళి నాలుగున్నర సంవత్సరాలపాటు అక్కడ వుండి రేడియో మాస్కోలో తెలుగు వార్తలు చదివొచ్చారు భండారు శ్రీనివాసరావు. అప్పుడాయన కాకుండా నేను మాస్కో వెళ్ళవలసింది. రేడియో మాస్కోలో తెలుగు వార్తలు చదవడం కోసం ఆకాశవాణి న్యూస్ రీడర్లను ఒకరి తరువాత ఒకరిని తీసుకువెళ్ళి రెండేళ్లో మూడేళ్లో అక్కడ వుంచుకునేవారప్పట్లో. నాకంటే సీనియర్లయిన తిరుమలశెట్టి శ్రీరాములుగారు, కందుకూరి సూర్యనారాయణగారు ఏడిద గోపాలరావుగారు (గోపాల్రావుగారు రేడియో సర్వీసులో నాకంటే జూనియర్ కాని న్యూస్ రీడర్ గా కాస్త సీనియర్) లాంటి వాళ్ళంతా రష్యా వెళ్ళివచ్చాక నా వంతు వచ్చింది. వ్యక్తిగతమైన కొన్ని ఇబ్బందులవల్ల నేను వెళ్ళలేకపోగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని, తాను న్యూస్ రీడర్ కాకపోయినా ఆకాశవాణి, రేడియో మాస్కో అధికారుల ఆమోదంతో రష్యా వెళ్లివచ్చారు శ్రీనివాసరావు. వెళ్ళడమేనా, తనకంటే ముందు వెళ్ళిన వాళ్ళకంటే రెండేళ్లు ఎక్కువగానే అక్కడవుండి మాస్కో మహానగరంలో తన జెండా ఎగరేసి మరీ వచ్చారు శ్రీనివాసరావు. రేడియో మాస్కోలో తెలుగులో వార్తలు చదివిన చివరి వ్యక్తి శ్రీనివాసరావే. ఆ తరువాత ఆ రేడియోలో తెలుగు వార్తల ప్రసారాన్ని నిలిపివేశారు.
“శ్రీనివాసరావు మాస్కోలో వున్నంతకాలమూ అక్కడా ఆయన ఇల్లు ధర్మసత్రంగానే వుండేదట. అక్కడ వుండి చదువుకునే తెలుగు విద్యార్ధులు, ఒంటరి ఉద్యోగులు, యాత్రీకులూ అందరికీ అన్నివేళలా తలుపులు బార్లా తెరిచి స్వాగతం పలికేవారు భండారు దంపతులు. తన సరసోక్తులతో, మధురసాలతో శ్రీనివాసరావు ఆతిధ్యం ఇస్తే, తెలుగు తిండికి మొహం వాచిపోయి వున్న వాళ్ళందరికీ కమ్మటి భోజనం వండి వార్చేవారు నిర్మల గారు. తానూ, తన భార్యాబిడ్డలూ ఆ నాలుగేళ్ళూ మాస్కోలో గడిపిన జీవిత విశేషాలతో ‘మార్పు చూసిన కళ్ళు’ అన్న పేరుతొ ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఒక చిరు గ్రంధాన్ని కూడా గత సంవత్సరాంతంలో రచించారు భండారు శ్రీనివాసరావు “

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

వెంకట్రామయ్యగారి ఉవాచ - “కలిసి తిరగడం, కులాసా కాలక్షేపాలు చేయడం లో మాత్రమే కాదు నాకు అన్నివిధాల ఆప్తమిత్రుడుగానే వుంటూ వచ్చారు భండారు శ్రీనివాసరావు. ‘A friend in need …’ అన్న ఆంగ్ల సూక్తి మాదిరిగా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం చేయడానికి ఆయన సర్వదా సిద్ధం. హైదరాబాదులో న్యూస్ రీడర్ గా వున్న నన్ను ఢిల్లీ అధికారులు ఎవరికో సాయం చేయాలనుకుని నన్ను అన్యాయంగా ఢిల్లీ బదిలీ చేశారు. ఇలా రెండు సార్లు జరిగింది. రెండోసారి బదిలీ ఉత్తర్వులు రద్దు చేయించడంలో ప్రధాన పాత్ర శ్రీనివాసరావుదే.
అప్పట్లో కేంద్ర సమాచార శాఖ ఉప మంత్రిగా మన రాష్ట్రానికి చెందిన మల్లికార్జున్ వుండేవారు. కాంగ్రెస్ ఎం ఎల్ ఏ డీ కే సమరసింహారెడ్డి మాట సాయంతో నేనూ శ్రీనివాసరావు కలిసి ఢిల్లీ వెళ్ళి వారం రోజులు అక్కడ వున్నాం. మల్లికార్జున్ నీ ఇతర అధికారులను కలిసి శాయంగల విన్నపాలు చేసాము. నెలలు గడిచిపోయాయి కాని పని కాలేదు. అలాటి తరుణంలో శ్రీనివాసరావు మల్లికార్జున్ గారిని కలిసి నా సమస్య మళ్ళీ చెప్పారు. చివరిసారి వెళ్ళినప్పుడు మంత్రితో చివాట్లు కూడా తిన్నారు. ‘ఎందుకిలా మాటిమాటికీ వచ్చి డిస్టర్బ్ చేస్తావ్.. నువ్వేమైనా అయన ఏజెంటువా ....’అన్న ధోరణిలో ఆగ్రహం వెలిబుచ్చారట. (ఇక్కడ వో విషయం వివరించాలి. అసలు జరిగినదేమంటే మంత్రిగారికి నా మీద కోపం వచ్చిన మాట నిజం. ఇలా విసిగించావంటే సస్పెండ్ చేస్తా అన్న మాట కూడా వాడారు. అయితే అప్పుడు నేను చెప్పిన జవాబు ఆయన్ని కదిలించింది. నన్ను సస్పెండ్ చేస్తే చేయండి. వెంకట్రామయ్య గారికి మాత్రం న్యాయం చేయండి అనేశాను. అంతకుముందు విలేకరిగా పరిచయం బాగా వున్నవాడినే కావడంతో ఆయన కూడా ఏమీ అనలేకపోయారు. మొత్తం మీద కధ సుఖాంతం అయింది. వెంకట్రామయ్య గారి బదిలీ రద్దయింది.- శ్రీనివాసరావు)

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

వెంకట్రామయ్య గారి ఉవాచ - “నా ఉద్యోగం న్యూస్ రీడర్ అయినప్పటికీ ఓసారి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు గారు (ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ వద్ద ప్రెస్ సెక్రెటరీగా వున్న మల్లాది కృష్ణానంద్ అన్నగారు) నన్ను పిలిచి ‘ మాస్టారూ ఎన్నాళ్ళని ఇక్కడ కూర్చుని న్యూస్ బులెటిన్లతో కుస్తీ పడతారు. మధ్యమధ్య రిపోర్టింగ్ కు వెళ్ళి వస్తుండండి. రేపు ఉదయం అసెంబ్లీకి వెళ్ళండి’ అన్నారు. అవి శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నరోజులు. నేను ఉదయం వెళ్ళే సరికే అసెంబ్లీలో ‘QUESTION HOUR’ నడుస్తోంది. అప్పట్నించి భోజన విరామానికి సభ వాయిదా పడేవరకు మూడు నాలుగు గంటలపాటు అక్కడే కూర్చున్నాను. ఛాతీలో కాస్త నొప్పిగా వున్నట్టు అనిపించింది కాని పట్టించుకోలేదు. ఆఫీసుకు వచ్చి రిపోర్ట్ రాస్తుండగా నొప్పి మరికాస్త పెరిగింది. ఛాతీ ఎడమ వైపు నుంచి భుజానికి ఏదో సర్రున పాకినట్టనిపించింది. వొళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా వుంది. ఇక నా వల్ల కాదని అర్ధమై పోయింది. ‘వొంట్లో బాగాలేదు. ఇంటికి పోతున్నాన’ని రామారావు గారికి చెప్పేసి వెళ్ళిపోయాను. అవేళలో అంత త్వరగా వచ్చిన నన్ను చూసి మా ఆవిడ ఆశ్చర్యపోయింది. ‘ఏమిటిలా వచ్చారు. ఏమైంది మీకు వొంట్లో ఎలావుంది’ అని కంగారు పడడం మొదలు పెట్టింది. విషయం చెబితే డాక్టరు దగ్గరకు వెడదామని హడావిడి చేస్తుందని పొడి పొడిగా నాలుగుముక్కలు చెప్పి ‘ఏమీ వద్ద’ని కసరి అలాగే పండుకున్నాను.
“ఎన్నడూ లేనిది ఆవిధంగా పని మధ్యలో వొదిలేసి వెళ్ళిపోయానని తెలిసి శ్రీనివాసరావు, జ్వాలా నరసింహారావూ (వీరిద్దరినీ జంట కవులనేవారు. నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడూ కలిసేవుండేవారు) ఆ సాయంత్రం మా ఇంటికి విషయం కనుక్కుందామని వచ్చారు. నేను చెప్పేది వినిపించుకోకుండా డాక్టర్ మనోహరరావు (శ్రీనివాసరావు మేనల్లుడు) దగ్గరకు తీసుకువెళ్ళారు. తరువాత డాక్టర్ గారిని కూడా వెంటబెట్టుకుని గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్ళి అందులో చేర్పించారు. ‘ANGINA PECTORIS’ అనే హృదయ సంబంధమైన రుగ్మత వల్ల నాకలా అయిందని నిర్ధారించిన వైద్యులు రెండు రోజులపాటు ఐ సీ యూ లోనే వుంచి ఆ తరువాత ఇంటికి పంపారు. మరునాడు కాబోలు జ్వాలా నరసింహారావూ. శ్రీనివాసరావు సతీ సమేతంగా మా ఇంటికి వచ్చారు.
మాటల మధ్య మా ఆవిడ శ్రీనివాసరావుతో – ‘ ఆరోజు మీరు దేవుడల్లే వచ్చి ఆసుపత్రిలో చేర్పించార’ని ఏదో చెప్పబోతుంటే ఆయన తన మామూలు తరహాలోనే ‘ఈ ఇంట్లో దేవుడు అనే మాట వినడం విచిత్రంగా వుంది’ అన్నారు చిరునవ్వుతో.
నా నాస్తికత్వం మీద ఆయన విసిరిన వ్యంగ బాణం అది.
ఇలా అన్ని సందర్భాలలో నవ్వుతూ నవ్విస్తూ వుండే ఈ మనిషి ఎప్పుడయినా కంట నీరు పెట్టుకుంటాడా అనిపించేది. అదీ చూశాను. నేను రిటైర్ అయినప్పుడు జరిగిన వీడ్కోలు సభలో నా గురించి మాట్లాడబోయి, మాటలు పెగలక కంట తడిపెట్టారు.”

అజ్ఞాత చెప్పారు...

భండారు గారు, జుట్టుకు నల్ల రంగు వేసుకొని, టివి చర్చ ల లో పాల్గొంట్టున్నరన్న అజ్ణాతను నేనే. నేనొక సామాన్య ప్రేక్షకుడిని. మీడీయా రంగానికి చెందునవాడిని కాను. మీమీద కోపం,కసి,ద్వేషం ఎమిలేదు. ఇంత క్రితం చెప్పినట్లు గా కొంత విసుగు ఉంది.

మీరేమో చర్చలలో చట్టాన్ని దృష్ట్టిలో ఉంచుకొని లాజికల్ గా మాట్లాడుతారు. కాని బయటి ప్రపంచంలో 99% పనులు చట్టాన్ని అతిక్రమించి చేస్తూంటారు. మరీ ముఖ్యంగా గత 15 ఏళ్ళుగా ఇది ఎక్కువైపోయింది. రౌడిల ముందు చట్టాన్ని అతిక్రమిస్తే పడే శిక్షలను మాట్లాడితే వాడు రౌడి ఇజం ఆపుతాడా? సమాజం మొత్తం అగ్రెసివ్ గా మారిపోయిన నేటి కాలంలో మీరు చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడే విధానం పాత తరహాలో ఉంట్టోంది.

అజ్ఞాత చెప్పారు...

చివరిగా నా వ్యాఖ్యలు మిమ్మల్ని బాధిస్తే క్షంతవ్యుడను.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత - ఇందులో క్షమాపణల ప్రసక్తి లేదు. నేను ముందే చెప్పినట్టు ఎవరి అభిప్రాయాలు వారివి. కానీ నాకు అర్ధం కానిది ఒక్కటే. ఇంతగా కొత్తదనం కోరుకునే మీరు, పేరు దాచుకుని అజ్ఞాత గా వ్యవహరించాల్సిన అవసరం ఏమిటి. పలానా అభిప్రాయం రాసింది పలానా వారు అని తెలిసినప్పుడు నేరుగా వారికే రాసి సందేహ నివృత్తి చేసుకోవడమో లేక పొరబాట్లు వుంటే సరిదిద్దుకోవడమో చేసుకునే వీలుంటుంది కదా! అందుకే నేను నా సెల్ నెంబరు, నా మయిల్ ఐడీ విధిగా పేర్కొనాలని న వ్యాసాలు ప్రచురించే పత్రికలకు షరతు పెడుతుంటాను, పారితోషికం విషయంలో పట్టింపులకు పోకుండా.౦భన్దారు శ్రీనివాసరావు (Mail:bhandarusr@gmail.com, Cell: 9849130595)