21, ఆగస్టు 2015, శుక్రవారం

చంద్రబాబుతో అభిమాని



ఈ ఫోటోలో కనిపిస్తున్న  వ్యక్తి ఎవరన్నది చిన్న పిల్లవాడు కూడా చెబుతాడు ‘ఈ మాత్రం తెలియదా ఆయన చంద్రబాబునాయుడు నాయుడు’ అని. ఇక రెండో ఆయన పేరు భక్తి భూషణ్ శ్రీవాస్తవ. పేరును బట్టే చెప్పేయొచ్చు ఆయనగారిది ఈ ఊరూ కాదు, మన భాషా కాదని. చాలా ఏళ్ళక్రితం శ్రీవాస్తవ గారు హైదరాబాదు వచ్చారు. అలా బయట నుంచి వచ్చేవాళ్ళు సాధారణంగా చార్మినార్ దగ్గరో, గోల్కొండ కోట దగ్గరో ఫోటోలు దిగాలని కోరుకుంటారు. కానీ శ్రీ వాస్తవ గారికి ఒక్కటే కోరిక. అది చంద్రబాబుతో ఒక ఫోటో దిగాలని. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు రెండో పర్యాయం కూడా ఎన్నికల్లో ఓడిపోయి, అధికారానికి మళ్ళీ దూరం అయి ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగుతున్నారు. నేను అప్పటికి ‘మాజీ’ ని కాలేదు కాబట్టి మాజీ ముఖ్యమంత్రిని కలిపించడం ఆయనతో ఫోటో తీయించడం నాకంత కష్టం కాలేదు. శ్రీవాస్తవ గారు ఎంతో ఇష్టపడి తీయించుకున్న ఆ ఫోటోని తనవెంట తన వూరికి తీసుకువెళ్ళారు. ఇంతవరకు షరా మామూలు కధే. ఇది జరిగి కూడా అయిదారేళ్ళు అవుతుందేమో. గత వారం నేను శ్రీవాస్తవ గారి వూరు రాంచీ వెళ్లాను. చిత్రంగా ఆయన డ్రాయింగు రూములో ఈ ఫోటో కనిపించింది. బాబు గారిపై ఆయన అభిమానం అధికారాన్ని బట్టి, అవసరాన్ని బట్టి పెంచుకుంది కాదు కాబట్టి ఆయన ఆ ఫోటోను అంత భద్రంగా దాచుకున్నారని అనిపించింది.
దేశ విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో బాబుగారి అభిమానులకి కొదవ లేదు. ఎన్నారైలకి ఓటు హక్కు ఇస్తే ఆంద్ర ప్రదేశ్ కి ఆయనే శాస్విత ముఖ్యమంత్రి అని ఆరోజుల్లో చెప్పుకునేవారు కూడా.

మరి ఆంద్ర ప్రదేశ్ లో కూడా ఈ మాదిరి అభిమానులు ఆయనకు అలా వున్నారా అంటే లేరని చెప్పలేము కానీ వున్నారని కూడా గట్టిగా అనలేని పరిస్తితి. దీన్ని మార్చుకోవడం ఆయన ఒక్కరి చేతుల్లోనే వుంది.       

1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

"పేరును బట్టే చెప్పేయొచ్చు ఆయనగారిది ఈ ఊరూ కాదు"

మీరు పొరబడుతున్నారు. శ్రీవాస్తవ అనే ఇంటి పేరు కలవారు హైదరాబాదులో వేలాది మంది ఉన్నారు.